‘ఈ పిట్టలకి చలెయ్యదా? ఇంత తీవ్రమైన చలిలోను అవంత ఆనందంగా ఎలా కూయగలుగుతున్నాయో?’ అని అనుకున్నాడు. అదే సమయంలో సుఖవంతి వళ్ళు విరుచుకుంది. దాంతో ఆమె కప్పుకున్న రగ్గు ఓ పక్కకి జారిపోయింది. ఆమె వీపు భాగంపై అచ్ఛాదన పోయింది. ఆమెని లేపి రగ్గుని సరిగా కప్పుకుని పడుకోమని చెబుదా మనుకున్నాడు. కాని ఓ క్షణం పాటు ఆలోచించి మానుకున్నాడు. ఆమె నిద్ర చెడిపోతుంది. ఆయనే స్వయంగా లేచి వెళ్ళి ఆవిడకి నిద్రాభంగం కలగకుండా రగ్గుని సరిచేసాడు. ఆమె లేస్తే, ఇక తిరిగి పడుకోదు. అసలు ఆవిడ వంట్లో కులాసాగా ఉంటే ఇంత సేపు పడుకోదు. మాములుగా ఐతే పక్షుల కిలకిలలతోనేనిద్ర లేస్తుందామె. ‘తనంతట తను ఈ రోజు డాక్టరు దగ్గరికి వెడితే సరే, లేదంటే నేనే తీసుకువెడతాను’ అని అనుకున్నాడు బిషన్ సింగ్.
చిన్న చిన్న జలుబులు, దగ్గులను ఆవిడ రోగాలుగా భావించదు. ఎలా వచ్చాయో అలాగే పోతాయనుకుంటుంది. వాటికోసం డాక్టరుకి డబ్బులు ధారపోయడం దండగని ఆవిడ అభిప్రాయం. ఆయన తిరిగి వచ్చి తన స్థలంలో గోడకి వీపు ఆన్చి, రగ్గు కప్పుకుని కూర్చున్నాడు.
ఒంటరి వ్యక్తులను జ్ఞాపకాలు వదలవు. ఒంటరి వృద్ధులకైతే ఈ జ్ఞాపకాలే ఆసరా! వాటితోనే వారు తమ జీవితపు చరమాంకాన్ని గడిపేస్తారు. బిషన్ సింగ్ కూడా తన జ్ఞాపకాల కడలిలో మునిగి తేలుతూంటాడు. ఆయన జీవితంలో కొన్ని దుర్దినాలైతే, కొన్ని సంతోషకరమైన రోజులు.
సుఖవంతితో పెళ్ళయినప్పటికి ఆయన ఇంటి పరిస్థితి పెద్ద గొప్పగా లేదు. రెండు పూటలా భోజనానికి మాత్రం లోటు ఉండేది కాదు. ఆయనకి ఆస్తిపాస్తులేవీ లేవు. తన గ్రామంలోనే వంశపారంపర్యంగా చేస్తున్న చిన్నా చితకా వడ్రంగం పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునేవాడు. కానీ సుఖవంతి ఆయన జీవితంలోకి అడుగు పెట్టగానే ఆయన దశ తిరిగింది. ఆయన స్నేహితులు కొంతమంది కలసి పట్నంలో ఓ కొత్త కార్ఖాన తెరిచారు. బిషన్ సింగ్‌కి అందులో ఉద్యోగం దొరికింది. పొద్దున్నే సైకిల్‌పై పట్నం వెళ్ళడం, పొద్దు గుంకాక తిరిగి గ్రామానికి రావడం! నెలా నెలా స్ధిరమైన ఆదాయం లభించడంతో వాళ్ళ పరిస్ధితి మెరుగైంది. గుడిసె స్థానంలో పక్కా ఇల్లు కట్టుకున్నారు. ఇంట్లోకి కావల్సిన ఒక్కో వస్తువు మెల్లిగా అమరింది. తర్వాత కొంత కాలానికి తన ఊర్లోనే ఓ చిన్న స్థలాన్ని కొనుక్కున్నాడాయన. నాలుగు కొట్లని కూడా అమర్చుకుని, మూడింటిని అద్దెకిచ్చి ఒకటి తనుంచుకున్నాడు. ఇద్దరుండే కుటుంబానికి ఆ వచ్చే ఆదాయం సరిపోయేది. సుఖవంతి రాగానే బిషన్ సింగ్ పట్టిందల్లా బంగారమవుతోందని గ్రామస్తులు చెప్పుకునేవారు.
సుఖవంతి నిద్రలో మళ్ళీ వళ్ళు విరుచుకుంది. ఈ సారి ఆమె ముఖంపై నుంచి రగ్గు జారిపోయింది. బిషన్ సింగ్ ఆమె ముఖాన్నే చూస్తుండిపోయాడు. దేవుడు వాళ్ళకి అన్ని సుఖాలను ఇచ్చాడు, ఒక్క సంతానాన్ని తప్ప! ఎన్నో పరీక్షలు చేయించుక్నునారు. కానీ ఫలితం లేకపోయింది. గ్రామస్తులు బిషన్ సింగ్‌ని మరో వివాహం చేసుకోమని పోరేవాళ్ళు. కాళ్ళు చేతులు కదలలేని ముసలితనంలో పిల్లల ఆసరా తప్పనిసరని బిషన్ సింగ్‌ని ఒప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు. కాని బిషన్ సింగ్ వాళ్ళ మాటల్ని లెక్కజేయలేదు. తన భార్య సుఖంగా ఉంటే అంతే చాలని అనుకున్నాడు.
మళ్ళీ ఒక సారి వళ్ళు విరుచుకోగానే ఈ సారి సుఖవంతికి మెలకువ వచ్చేసింది. పరుపుమీద కూర్చుని తనకేసే చూస్తున్న భర్తని చూడగానే, లేచి కూర్చుందామె.
“ఏమైందండి? అలా ఉన్నారు. వంట్లో బాలేదా?”
“నా సంగతి సరే, నీకెలా ఉందో చెప్పు. రాత్రంతా నువ్వు నిద్రే పోలేదు. చాలా సేపు దగ్గావు. ఈ రోజు డాక్టరు దగ్గరికి వెళ్ళాల్సిందే.”
“నాకేమీ కాలేదు” అంటూ పాత పాటనే మళ్ళీ పాడిందామె. “మాములు దగ్గే. వాతావరణం వల్ల! వాతావరణం కాస్త మారితే అదే సర్దుకుంటుంది. కానీ మీకే ఒంట్లో బావున్నట్లు లేదు. తెగ వణుకుతున్నారు.”
“చలివల్ల! అంతే! ఈ సారి చలి రికార్డులు బద్దలు కొట్టేస్తోంది…” అంటూ రగ్గుని సరిగా కప్పుకున్నాడు బిషన్ సింగ్.
“కూర్చోడం ఎందుకు? కాసేపు పడుకోండి. టీ పెట్టి తీసుకొస్తాను.”
“అబ్బా, పడుకుని, పడుకుని విసుగేస్తోంది. కాస్త ఎండొస్తే బాగుండు. బయట కూర్చుంటాను. ఎండ పొడ చూసి ఎన్నాళ్ళైందో. ఈ రోజైనా వస్తుందో రాదో.”
“వద్దు. మంచం మీదే ఉండండి. బయట చాలా చలిగా ఉంది. ఎండొస్తే మీ పక్క పెరట్లో వేస్తాలెండి…” అంటూ మోకాళ్ళపై చేతులుంచి, ‘వాహెగురు, వాహెగురు’ అని స్మరిస్తూ వంటింట్లోకి నడిచింది సుఖవంతి.