పెంగలూరి వేంకటాద్రి వ్రాసిన భువనమోహినీవిలాసము అనే ద్విపద ప్రబంధములో షష్ఠ్యంతములు ఐదు ద్విపదలలో గలవు. అందులో చివరివి –
నూత్నైకకోటి భానుప్రభాదివ్య
రత్నకిరీటాభి రామశీర్షునకు
లాలిత జంబూఫల శ్యామలునకు
కేలిమై వేంకటగిరి నాయకునకు
– పెంగలూరి వేంకటాద్రి, భువనమోహినీవిలాసము
(సూర్యకోటి సమప్రభలతో కూడిన రత్నకిరీటము దాల్చిన మనోహరునికి, నేరేడుపండు రంగువానికి, శ్రీవేంకటేశ్వరునకు)
షష్ఠ్యంతాల అంత్య దశ
1915 ప్రాంతములో అడవి సాంబశివరావు, నందగిరి వేంకటప్పారావు వ్రాసిన జగన్నాథీయములో కథను ఆరంభించుటకు ముందు షష్ఠ్యంతములకు బదులు షష్ఠీ విభక్తితో కూడ అన్ని విభక్తులను ఉపయోగించి ఎనిమిది కంద పద్యములు (ఉదాహరణకావ్యములోవలె) గలవు. ఇది నిజముగాఒక కొత్త పంథాయే. పోతుకూరి కాశీపతి అవధానులు సారంగధరీయము అనే త్ర్యర్థి కావ్యమును (పార్వతీకళ్యాణము, తారాశశాంకము, సారంగధరుని కథ) 1933లో ప్రచురించారు. ఇందులో వీరు ఐదు కందపద్యములను షష్ఠ్యంతములుగా వ్రాసినారు. కాని గడచిన శతాబ్దములో మహాకవిగా ఖ్యాతి గడించిన శ్రీరామాయణకల్పవృక్ష రచయిత విశ్వనాథ సత్యనారాయణ షష్ఠ్యంతములను తన గ్రంథములో ఎందుకో వ్రాయలేదు.
ఈ వ్యాసాన్ని ముగించేముందు కొన్ని ప్రసిద్ధ కవుల షష్ఠ్యంతములను ఇచ్చి ముగిస్తాను-
వ్రజ గజగమనా లోలున,
కజగర వర జఠర వారణాభీలునకున్,
సుజనైక కృపాళునకున్,
గుజనవిఫాలునకు, మదనగోపాలునకున్
– కంకంటి పాపరాజు, ఉత్తరరామాయణము (పీఠిక, 51)
(వ్రజయువతులయం దాసక్తిగలవానికి, కొండచిలువ కడుపులో ఏనుగువంటివానికి, మంచివారిపై దయ జూపువానికి, దుష్టులను తునిమినవానికి, మదనగోపాలునికి)
అవిరళ వితరణా విద్యా
నవ రాధేయునకు, సజ్జన విధేయునకున్,
గవితాస్త్రీ లోలునకున్,
ఖవిటంక నటద్యశోబ్ధి కల్లోలునకున్
– అల్లసాని పెద్దన, మనుచరిత్ర (పీఠిక, 45)
(దానములో మరొక కర్ణునికి, బుధజనవిధేయునికి, కవితాకన్యకయం దాసక్తిగలవానికి, ఆకాశపుటంచులలో కీర్తి సముద్రపుటలలుగలవానికి)
మాచాంబా నందనునకు,
వాచాగోచర వివేక వైయాత్యునకున్,
వాచాల విబుధ గంగా
వీచీ గంభీర వాక్య విన్యాసునకున్
– శ్రీనాథుడు, హరవిలాసము (పీఠిక, 33)
(మాచాంబ కుమారునికి, గొప్ప వాగ్వివేకముగల వానికి, వాచాలుర గంగావీచికలకు గంభీరముగా ప్రత్యుత్తరము నొసగు రచనాశీలికి)
నవనీత మృదుల హృదయున,
కవనీతల భాగ్యదేవతాభ్యుదయునకున్,
భువనాదర భవనాదర
కవనాదర సత్కవిప్రకర సదయునకున్
– మండపాక పార్వతీశ్వరకవి, శ్రీకృష్ణాభ్యుదయము (షష్ఠ్యంతము 4)
(వెన్నవాంటి మెత్తని హృదయముగలవానికి, భూమియొక్క సంపదను అభివృద్ధి జేయువానికి, ఇంటా బయట మన్నన పొందినవానికి, కవిత్వమును ఆదరించి మంచి కవులకు దయ జూపువానికి)
మగటిమి కంబమున నిలిచి
జగజెట్టన కనకకసిపుఁ జంపి బుడుతనిన్
దగఁ జదలు కాపురుసు లె-
న్నగఁ బ్రోచిన వేల్పుగొండ నరసింగనికిన్
– నళ్ళంతిఘల్ చక్రవర్తుల లక్ష్మీనృసింహాచార్యులు, అచ్చతెనుగు కుబ్జాకృష్ణవిలాసము (1.56)
(గొప్ప శౌర్యముతో జగజ్జెట్టిగా స్తంభమున నిలిచి హిరణ్యకశిపుని చంపి కుత్సితులు నలుగగా చిన్నవాడైన ప్రహ్లాదుని బ్రోచిన నరసింహస్వామికి)
మర్దిత కాళియఫణికిఁ, గ-
పర్దభృదజ బింబితాచ్ఛ పదనఖ ఘృణికిన్,
దోర్దండ శార్ఙ్గకిణి, కఘ
కర్దమ దినమణికి, దనుజ కరివర సృణికిన్
– శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద (పీఠిక, 47)
(కాళియుడనే నాగాన్ని మర్దించినవానికి, శివునిచే, బ్రహ్మచే వందించబడినవానికి, భుజములపై శార్ఙ్గమును మోయుటచే కలిగిన ముద్ర గల వానికి, పాపపంకిలమును ఎండజేసే సూర్యునికి, రాక్షస గజములకు అంకుశమువంటి వానికి)
వేంకటగిరి నాయకునకుఁ,
బంకజభవజనకునకును, బరమాత్మునకున్,
శంకరవరమిత్రునకుఁ, గ-
లంకవిరహితునకు, మోక్షలక్ష్మీపతికిన్
– తరిగొండ వేంకమాంబ, శ్రీవేంకటాచలమాహాత్మ్యము (1.36)
(వేంకటాచలపతికి, బ్రహ్మ తండ్రికి, పరమాత్మునికి, శివుని మిత్రునికి, అకళంకునికి, మోక్షలక్ష్మి ఒడయనికి)