సంస్కృతములోని ఎనిమిది విభక్తులు ఆంగ్లములోని క్రింది విభక్తులతో సరిపోతాయి –
ప్రథమా విభక్తి – nominative case, ద్వితీయా విభక్తి – accusative case,
తృతీయా విభక్తి – instrumental case, conjunctive case, చతుర్థీ విభక్తి – dative case, పంచమీ విభక్తి – ablative case, షష్ఠీ విభక్తి – possessive case,
సప్తమీ విభక్తి – locative case, సంబోధనా ప్రథమా విభక్తి – denominative case.
షష్ఠియా లేక చతుర్థియా?
తెలుగులో కూడ ప్రథమాది విభక్తులు ఉన్నా, వాటి ఉపయోగములో కొద్దిగా తేడా ఉంది. ఉదాహరణకు తెలుగులో తృతీయావిభక్తి ప్రత్యయాలు చే, తో. సంస్కృతములో వీటికి ఒకే ప్రయోగము. కాని తెలుగులో చే ప్రత్యయానికి బదులు తో ప్రత్యయాన్ని ఉపయోగించలేము. చే ప్రత్యయము ప్రేరణార్థకము, తో ప్రత్యయము సహార్థకము. కొన్ని సమయములలో తృతీయావిభక్తి ప్రత్యయము చే, పంచమీవిభక్తి ప్రత్యయము వలన ఒక్కటే. ఈ విషయము ఎందుకు చెప్పుతున్నానంటే తెలుగు విభక్తుల అమరికలో ఒకే విధమైన తీరు, తర్కశాస్త్రబద్ధత లేదు.
తెలుగులో షష్ఠీవిభక్తి ఉపయోగము కొద్దిగా అసాధారణమైనది. మిగిలిన ద్రావిడ భాషలలో ఆంగ్లములోని dative case చతుర్థీ విభక్తి. కాని తెలుగులో చతుర్థీవిభక్తి ప్రత్యయాలు కొఱకు, కై, షష్ఠీవిభక్తి ప్రత్యయాలు కి, కు, లో, యొక్క. కేతన కి, కులను చతుర్థీ విభక్తిగా పరిగణిస్తాడు. ఈ విషయం క్రింది పద్యములో చక్కగా సందేహములేక విదితమవుతుంది –
కరి వచ్చెన్, గరి నెక్కెను,
గరిచేతం జచ్చెఁ , గరికిఁ గవణమువెట్టెన్,
గరి వలననుఁ, గరికుంభము,
కరియందు మదాంబుధార కడు బెడఁ గయ్యెన్
– కేతన, ఆంధ్రభాషాభూషణము (98)
(ఏనుగు వచ్చెను, ఏనుగును ఎక్కెను, ఏనుగుచేత చంపబడెను, ఏనుగుకు ఆహారమును ఇచ్చెను, ఏనుగువలన, ఏనుగు కుంభము, ఏనుగునందు మదపు దార చాల ఆశ్చర్యకరమును కలిగించునదై యుండెను.)
షష్ఠీ విభక్తి ప్రత్యయములైన కి, కులు ఆంగ్లములోని dative caseకు సమానము. ఇక పోతే యొక్కను మాత్రమే సంబందార్థములో వాడుట సబబు. కాని యొక్క ప్రత్యయాన్ని విగ్రహవాక్యాలలో తప్ప సామాన్యముగా మనము తెలుగులో వాడము. రాముని బాణము అంటే చాలు, రామునియొక్క బాణము అని అనరు. ఒక అనే పదము యొక్క ఐనదని చారిత్రకుల ఊహ. సంబందార్థరూపమైన షష్ఠీ విభక్తిని శేష షష్ఠి అంటారు. రామునికి కొడుకులు అన్నప్పుడు కి ప్రత్యయము యొక్క ప్రత్యయముతో సమానము, ఇక్కడ కి శేష షష్ఠిగా వాడబడినది. లో ప్రత్యయమును నిర్ధారణ షష్ఠి అంటారు. స్త్రీలలో సీత పతివ్రతారత్నము అన్నప్పుడు లో ప్రత్యయము నిర్ధారణ షష్ఠి. జాతి, గుణ, క్రియా, సంజ్ఙలను ఆధారముగ చేసికొని ఒక వర్గమును మరొకదానినుండి వేరు చేయడమే నిర్ధారణ షష్ఠి. కి, కు ప్రత్యయాలు సంప్రదానార్థక ప్రత్యయాలు. ఈ కి, కులు మారకుండ అన్ని ద్రావిడ భాషలలో ఒకే విధముగా నున్నవి – తమిళము – కు, క్కు, కన్నడము – కె, క్కె, గె, మలయాళము – క్కు, తుళు – కు, గు, తోడా – క్, గ్, కురుఖ్ – గె, బ్రాహుయి – కె. చతుర్థిలోని కై అనునది కు, ఐల సంధి అని భావన. దీనికి నిదర్శనముగా నన్నయ వాడిన కై (కు+ఐ), కునై (కున్ + ై) అనే ప్రత్యయాలను చూపుతారు –
అనఘ మా మామ శకుని నాకై కడంగి (నన్నయ, భా – సభా, 2.174) ఇందులో యతి అ అక్షరానికి కై యందలి ఐ అక్షరానికి చెల్లుతుంది.
శ్రీకైవల్యపదంబు జేరుటకునై (పోతన, భాగ, 1.1)
ఈ విషయాలు ఇంత వివరముగా ఎందుకు చెప్పాలంటే, షష్ఠీవిభక్తి యందలి కి, కుల పాత్ర సంప్రదానార్థముగా చతుర్థీవిభక్తిలోని కై వంటిదే. హిందీలో ద్వితీయా, చతుర్థీ విభక్తులకు కో అనే ప్రత్యయాన్నే వాడుతారు. తెలుగు మరియు ఇతర భాషలలో విభక్తులకు ప్రథమ, ద్వితీయ, ఇత్యాదులైన పేరులుంచడం వలన కలిగే సందిగ్ధాలను, సందేహాలను దూరం చేయాలంటే, విభక్తుల కారక నామములను (కర్త్రర్థక, కర్మార్థక, ఇత్యాదులు) ఉంచితే బాగుంటుందేమో.
ఓనమాలు – షష్ఠ్యంతాలు
సంస్కృతములో ఆయ అన్నది చతుర్థీవిభక్తి ప్రత్యయము. దీని అర్థము కి, కుల వలెనే. మనము అ,ఆలు నేర్చుకొనే వేళలో ఓనమాలు రాస్తాము కదా, అందులో ఓనమా అనేది ఓం నమశ్శివాయకు రూపాంతరము. ఓం నమశ్శివాయ, ఓం నమో నారాయణాయ వంటి బీజమంత్రాలు, సంధ్యావందన సమయములో చెప్పే కేశవాయనమః, ఇత్యాదులు, అష్టోత్తరనామశతములలో, సహస్రనామములలో ఉచ్చరించబడే దేవుని పేరులు (శ్రీకృష్ణాయనమః, ఇత్యాదులు) చతుర్థ్యంతములే. వీటి అర్థము శివునికి నమస్కారము, నారాయణునికి నమస్కారము, కేశవునికి నమస్కారము, శ్రీకృష్ణునికి నమస్కారము. కావున కి, కులు షష్ఠీ విభక్తి ప్రత్యయములైనా అవి చతుర్థీవిభక్తి స్థానములోనే ఉన్నాయి. కన్నడములో, తమిళములో ఇవి చతుర్థీవిభక్తి ప్రత్యయాలే.