తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2
చివరగా విదేశాల్లో నాటకాల గురించి కాస్త ప్రస్తావిస్తాను. ఎందుకంటే తెలుగు నేల విడిచిన ప్రతీ తెలుగు వాడికీ ఒక తెలుగు సంఘం ఉంటుంది. ప్రతీ తెలుగు సంఘమూ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాయి. అందులో నాటకం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. కాబట్టి విదేశాల్లో తెలుగు నాటకం గురించి కాస్తయినా చెప్పుకోవడం సమంజసం. నాకు అమెరికాతో పరిచయం ఉంది కాబట్టి అమెరికాలో నాటకాల గురించి కాస్త ప్రస్తావిస్తాను.
అమెరికాలో దాదాపు అన్ని ముఖ్య నగరాల్లోనూ ఒక తెలుగు సంఘం ఉంది. ఉగాది కనీ, దీపావళి సంబరాలనీ, సంక్రాంతి వేడుకలనీ, అవనీ ఇవనీ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందులో తప్పని సరిగా నాటకం ( పౌరాణికం, హాస్యం లేదా జానపదం ఏ దైనా కానివ్వండి ) వేస్తారు. కాకపోతే ఈ నాటకాలు టైం ఫిల్లర్లుగా వేస్తారు తప్ప, అంత సీరియస్ నెస్ కనబడదు. ఏదో మొక్కుబడికి లాగించేద్దామన్నట్లు గానే ఉంటాయి. వాళ్ళ పరిమితులూ, సమస్యలూ ఆ యా సంఘాలకి ఉన్నాయి కాదను. కానీ వేసే ఆ నాటకాల్లో స్టేజి ఎక్కేద్దామన్న తపనే కానీ నాటకం అంటే అర్థం చేసుకొని అవగాహనతో వేస్తున్నారని నేననుకోను. నా అభిప్రాయం తప్పని ఎవరైనా ఖండిచ వచ్చు.
అలాగే తానా, ఆటా ప్రతీ రెండేళ్ళకొక సారి ఉత్సవాల పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కానీ అక్కడా నాటకం అంటే సవతి తల్లి ప్రేమలాగే ఉంటాయి. కానీ అదేం చిత్రమో సినిమావాళ్ళు నాటకం వేస్తే మాత్రం జనం చూస్తారు. పైగా వాళ్ళకి రాత్రి పూట సమయం కేటాయిస్తారు. తానా, ఆటా వంటి సంస్థల్ని విమర్శించడం నా ధ్యేయం కాదు. వాళ్ళు నాటక రంగానికి చెందిన అనేకమంది కళాకారుల్ని రప్పించారు. కానీ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ చేత సీరియస్ గా నాటకం వేయించిన సందర్భాలు చాలా తక్కువున్నాయి. ఇక్కడా మంచి నటులూ, నాటకమంటే అభిమానమున్న వాళ్ళూ ఉన్నారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ! దాదాపు అన్ని సాంస్కృతిక సంఘాలూ గతంలో పేరికగన్న నాటకాలనే వేస్తారు లేదా కాస్త హాస్యం ఉంటే కొత్తవి వేస్తారు. ఉంటే పౌరాణిక నాటకాలు, లేదా హాస్య నాటికలు లేదా స్కిట్స్ తప్ప సీరియస్ విషయాల మీద నాటకాలు వేసినవి చాలా తక్కువ. అక్కడక్కడ ఒకటీ అరా వేసుండొచ్చు. ఇక్కడ దూరంగా ఉన్న మన సమస్యలపై సీరియస్ నాటకాలు అంతగా రాలేదని నా అభిప్రాయం. ఇంకో విషయం. ఈ సాంస్కృతిక సంఘాల కార్యక్రమాలలో నాటకానికి ఓ ఇరవై నిముషాల స్లాట్ ఇస్తారు. అందులోనే మహాభారతమైనా ,రామాయణమైనా సర్వాంగ సుందరంగా వేసేయాలి. కనీసం 45 నిమిషాలు లేకుండా నాటికలు వేయలేరన్న సంగతి ఎందుకు అర్థం కాదో నాకిప్పటికీ అర్థం కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆంధ్రా నుండి వచ్చి ఇక్కడ అనేక పద్య నాటకాలూ అవీ వేయడం జరుగుతోంది. దాని వల్ల మంచే జరుగుతోంది. ప్రవాసంలో ఉన్న తెలుగు వారు కూడా సొంతగడ్డ పై నాటకాన్ని బ్రతికించడానికి సహాయ పడాలి. అక్కడ మంచి ప్రదర్శనలు జరిగేలా ఆర్థిక సహాయం చేస్తే తప్పకుండా తెలుగు నాటక రంగం బాగు పడుతుందని నా ఆశ. ఆ నమ్మకం నిజమవుతుందో లేదో కాలమే సమాధానం చెబుతుంది.
ఉపసంహారం
ఈ వ్యాసం చదివాక నాటకం అంటే కాస్తయినా తెలుసుకో గలిగాము అన్న భావన ఒక్కరికి కలిగినా నేను రాసిన ఈ వ్యాసానికి ఫలితం దక్కినట్లే!
అంకితం
దాదాపు రెండేళ్ళ క్రితం నంది నాటకాలకి నేనొక పద్య నాటకం ( పంచమ ధర్మం ) రాసాను. ఆ నాటకం 2005 నంది నాటకోత్సవాల వడబోతలో ఎన్నికైన చివరి తొమ్మిది నాటకాలలో ఒకటి. ఆ నాటకం ద్వారా నాకు అనేక మంది తెలుగు నాటకరంగ కళాకారులు పరిచయం అయ్యారు. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం నాకు లభించింది. టాలెంటు ఉండి అవకాశాలు రాని ఎంతో మంది కళాకారుల్ని చూసాను. అలాగే ఆ పద్య నాటకం ధర్మమా అని నాకు ఎం.వి.రమణ మూర్తి గారితో పరిచయమయ్యింది. ఆయనే నే రాసిన పంచమ ధర్మం అనే నాటకానికి దర్శకత్వం వహించారు.
రచయితకీ, దర్శకుడికీ మధ్య అవగాహన ఉంటేనే నాటకం రక్తి కడుతుందని నమ్మే వ్యక్తుల్లో ఆయనొకరు. ఆయనే నోరి నరశింహ శాస్త్రి గారి ‘వాఘీరా’’ అనే నాటకం కూడా దర్శకత్వం వహించారు. నాటకం వేసేటప్పుడు ఎంత సీరియస్ మనిషో, బయట అంతకంటే పదిరెట్లు సౌమ్యుడు. హాస్యానికి కూడా అబద్ధం చెప్పలేదని ఆయన మిత్రులందరూ ముక్త కంఠంతో అంటారు. ఆయన పరిచయంలో నేను చాలా నేర్చుకున్నాను. ఆ మహా మనిషి 2008 ఫిబ్రవరి 20న పరమ పదించారు.
బ్రతికినన్నాళ్ళూ నాటకం మధ్యనే బ్రతికి, జీవిత చరమాంకానికి హఠాత్తుగా తెర దించేసుకొని అందరికీ కనుమరుగైన ఆ మహా వ్యక్తికి నా ఈ వ్యాసం అంకితం.
ఉపయుక్త గ్రంథాలు
- సమగ్రాంధ్ర సాహిత్యం - ఆరుద్ర
- ఆంధ్ర నాటక రంగ చరిత్ర - మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
- భారత నాటక చరిత్ర - సాహిత్య అకాడమీ
- Indian Literature – Sahitya Acadamy
- Indian Modern Drama – Sahitya Acadamy
- ధర్మవరం రామకృష్ణా చార్యులు - పోనంగి శ్రీ రామ అప్పారావు
- అలనాటి నాటకాలు - ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
Srinivas V అభిప్రాయం:
March 5, 2008 10:38 pm
అద్బుతమైన వ్యాసం. నాటకాల గురించి ఇంత విపులంగా నేనెప్పుడూ చదివినట్లు గుర్తులేదు.
నాటకాలు వేసే వాళ్ళు తప్పని సరిగా చదవాల్సిన వ్యాసం ఇది.
-శ్రీనివాస్ వి
P. N. Raja Rao అభిప్రాయం:
March 7, 2008 3:37 am
వ్యాసం చాలా బాగున్నది. చివర ఒక్క రిఫరెన్సుకూడా లేకపోవడం విచిత్రంగా ఉంది. తెలుగు నాటకరంగంపై చాలా పుస్తకాలు చూసిన గుర్తు.
మిక్కిలినేని గారు, అంతకన్నా ప్రాచీనులు కృత్తివెంటి వారు, ఆ తరువాత స్థానం వారి స్వీయకథ, ఇలా ఎన్నో పుస్తకాలు తెలుగులో నాటక ప్రక్రియ గురించి, సదరు చరిత్ర వివరంగా ఉన్నట్టు నాకు గుర్తు.
బ్రహ్మానందం గారికి అభినందనలు..
పి.యన్.ఆర్.
mOhana అభిప్రాయం:
March 7, 2008 11:49 am
మంచి వ్యాసము. సాయి గారికి అభినందనలు. మేము చిన్నప్పుడు
బడిలో చదువుకొంటున్న రోజుల్లో ప్రతి సంవత్సరము ఒక నాటకము,
ఒకటో రెండో నాటికలు వేసేవాళ్లము. మా బడి పక్క సౌందర్యమహలు
అనే నాటకప్రదర్శనశాల ఉండేది అప్పుడు. శ్రీ కృష్ణ లీలలు, కరుణామయి
అనే రెండు నాటకాలు జ్ఞాపకానికి వస్తుంది. తిరుపతిలో ఆ కాలంలో
నాటకాల పోటీలు ఉండేవి. మంచి నాటకాలు, నాటికలు
ప్రదర్శించే వాళ్లు. సురభి నాట్యమండలివారిని గురించి ఈ పుస్తకములో చదువవీలగును. తెలుగు సాంఘిక నాటకాల పరిణామము, వికాసము అనే పుస్తకం కూడా చదవతగినది.
పై పుస్తకాలను డవున్లోడ్ చేసికోవచ్చు.
ఆ కాలపు నాటకాలు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని గురించి నేను కన్నడములో ఒక మంచి సినిమా చూసియున్నాను. దాని పేరు రంగనాయకి. కన్నడములో గిరీశ్ కర్నాడ్ వంటివారు నాటకాల ద్వారా చిత్రరంగం ప్రవేశించారు. గుబ్బి వీరన్న కూడ నాటకాల పురోభివృద్ధిలో చాల ముఖ్య పాత్ర వహించారు. ఇక విజయ్ తెందుల్కర్ వంటి వారిని గురించి చెప్పనక్కరలేదు. చలం రాసిన కొన్ని కథలలో కూడ నాటక రంగం ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకొన్నది.
కావ్యేషు నాటకం రమ్యం అనే మాట మరువరాదు. - మోహన
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
March 7, 2008 12:31 pm
రాజా రావు గార్కి,
మీకు ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషించాను.
వ్యాస సూచికలు వ్యాసం మొదటి భాగంలో ఇచ్చాను. ఒక్కసారి చూడండి.
మీ సూచన ప్రకారం మరలా రెండో భాగంలోనూ పెట్టమని సంపాదకుల్ని అడిగాను.
-సాయి బ్రహ్మానందం
Sivakumar Tadikonda అభిప్రాయం:
March 25, 2008 6:29 pm
బ్రహ్మానందంగారు తెలుగు నాటకం గూర్చి, ఈ నాటక పరిస్థితి గూర్చి చాలా విశదంగా ఈ వ్యాసంలో చర్చించారు. ఇంకొక్క మూడు విషయాలు ఈ వ్యాసంలో చేరిస్తే దీనికి సంపూర్ణత చేకూరేదనిపించి ఈ వ్యాఖ్యను వ్రాస్తున్నాను.
దీనిలో మొదటిది, నటీనటులకు ముట్టే ప్రతిఫలం. అమెరికా నాటకరంగంలో నటీ నటులకేగాక ఆహార్యాన్ని సమకూర్చేవారందరికీ ప్రతిఫలం ముడుతుంది. Professional నటులు వారానికి నలభై గంటలు రిహార్సల్సుతో బిజీగా వుంటారు. వాళ్ళు ఒకేసారి రెండు నాటకాలల్లో కూడా నటించవచ్చు. వారికి ఈ నాటకాలే జీవనభృతిని కల్పిస్తాయి. ప్రస్తుతం న్యూయార్కులో Tennessee Williams వ్రాసిన Cat on a hot tin roof నాటక ప్రదర్శన జరుగుతోంది. దీనిలో, దాదాపు ఏడేళ్ళు Bill Cosbyతో TV లో నటించిన Phylicia Rashad, సినిమా నటుడు James Earl Jones నటిస్తున్నారు. ఈ నాటకం దాదాపు మూడు నెలలపాటు ప్రదర్శిస్తారు. Londonలో ఈమధ్య Equus నాటకంలో Daniel Radcliffe (Mr. Harry Potter) నటించాడు. ప్రతిఫలం లేనిదే పేరెన్నికగన్న నటులు రంగస్థలంమీదకు ఎందుకు వస్తారు?
మరి తెలుగు నాటకరంగంమీద నటీనటుల పరిస్థితేమిటి? ఒక్క నటీమణులకే కొంతైనా డబ్బు ముడుతుంది. నటులు, దర్శకులు, రచయితలు, ఆహార్యం సమకూర్చే వారు, అందరూ కూడా ఏదో పరిషత్తులో బహుమతిని పొందితే తప్ప వారి చేతి డబ్బు పెట్టుకునే rehearsalsకే కాక వేరే వూళ్ళో ప్రదర్శనకై టిక్కెట్టు కూడా పెట్టుకుని వెళ్ళాలి. అంటే, భుక్తికై వారందరికీ పగలంతా వేరే వుద్యోగం వుండాలన్న మాట. ఆంధ్రజ్యోతిలో రాళ్ళపల్లిగారు సినిమాల్లో వేషాలకై వెడితే వారి మేనేజరు వుద్యోగంలోనుంచీ తీసేస్తామని బెదిరించారని రాయగా చదివిన గుర్తు. తెలుగు నాటక రంగానికి చేయూత నందించాలనుకునే వారు ముందు నాటకరంగంతో ముడిపడ్డవాళ్ళకి నాటకరంగమే జీవనభృతిని ఎలా సమకూర్చగలదో ఆలోచించాలి.
రెండవ అంశం: ఆంధ్రాలో గానీ అమెరికాలో గానీ, తెలుగు నాటకానికి ప్రతిబంధకాలు మైకులు. పాతకాలంలో పద్యనాటకాలను ఆహార్యాన్ని చూడడానికీ, పేరెన్నికగన్న నటుడు పద్యం పాడడంలో చూపించే నేర్పరితాన్ని చెవులారా విని ఆనందించడానికీ ప్రజలు వెళ్ళేవాళ్ళు తప్ప, పాత్రల మధ్య movements ఎలా వున్నయ్యోననీ, నటులు మొహంలో ఎలాంటి భావాలు చూపిస్తున్నారనీ పరిశీలించడానికి కాదు. అందువల్ల కలిగే సౌకర్యం ఏవిటంటే, ఆ నటులు మైకుకు ఎదురుగా నుంచుని పద్యం పాడడం. అక్కడక్కడా గాలిలో మైకులను వేలాడదీసేవాళ్ళు. (ఒకసారి గుంటూర్లో మా హైస్కూలు మాస్టారు భీముడి వేషం వేసి విసురుగా గదని భుజానికి ఎత్తుకోబోతుంటే ఆ గద పైన వైరుకు చిక్కుకుంది!) ఈ కాలపు సాంఘిక నాటకాలకు పూర్తిగా మైకు ముందు నిలబడి డైలాగులు చెప్పడం బావుండదు. పోనీ clip-on microphones try చేద్దామా అంటే నాలుగు మించి స్టేజీ మీద ఒకేసారి వాడారా, interference problems వచ్చి గోల గోల అవుతుంది. నేను Washington, DC ప్రాంతంలో చూసిన ఏ నాటకంలోనూ మైకులు వాడలేదు. చూసిన auditoriums లో కెపాసిటీ, 50్ నించీ 2000్ (కెన్నెడీ సెంటర్) దాకా. 300్ కెపాసిటీ వున్న చోట, live musicతో, 14్ ఏళ్ళ పాప గొంతెత్తి పాడిన Seussical Musical లో కూడా! వేలమంది మధ్యలో నాటకం వెయ్యడం వేసేవాడికి అద్భుతంగా వుంటుంది సరైన auditorium వున్నప్పుడు. లేకపోతే, మైకుల, మైకులను కంట్రోల్ చేసేవాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పదు.
మూడవ, ముఖ్యమైన అంశం - ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులగూర్చి పరిషత్తులు పట్టించుకుంటున్నాయా? ఈ నాటి నాటకాలను చూసేది ఎవరు? ఆనాటి రాజుల దగ్గరినించీ ఈనాటి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా కళలను పోషించిన వారు ఎప్పుడూ కూడా డబ్బున్న వారే! వాళ్ళు ఈ పరిషత్తు నాటకాలు ఎన్ని చూస్తున్నారు? ఎంతమంది ఇంజనీరులు, డాక్టర్లు, లాయర్లు ఈ నాటకాలకు వస్తున్నారు? వారిమాట అటుంచి, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు సతీ సమేతంగా వీటికి వస్తున్నారు? వారందరి మాట అటుంచితే, ఈ నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసినవాళ్ళే ఎంతమంది సతీ సమేతంగా ఈ నాటకాలను చూస్తారు? జనాదరణకు కరువైన కళ పరిస్థితి ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాలా? అమెరికాలో బ్రాడ్వే నాటకాలకు టిక్కెట్లు $200్ దాకా కూడా వుంటాయి. అయినా కూడా Phantom of the Opera is the 2nd longest running opera in New York (just behind the all-time record holder Cats). అదీ, ప్రతీ రోజూ కనీసం ఒక షో వేస్తూ! ప్రస్తుతం తెలుగులో పరిషత్తు నాటకాలంటే కరుణ రసం అధికంగా వుండేవని బ్రహ్మానందం గారనడంలో ఏమాత్రం్ అబధ్ధం లేదు. అంటే, ఎవరైనా ఒక సాయంత్రం ఏడవాలనిపిస్తే పరిషత్తు నాటకాలకు వెళ్ళచ్చునన్నమాట.
అమెరికాలో, మరాఠీ నాటకాల విడియో కాసెట్లని అద్దెకు తెచ్చుకునల్లా చూస్తారు మహారాష్ట్ర నుండీ వచ్చిన వాళ్ళు. తెలుగు నాటకాన్ని ఉచితంగా స్టేజీ మీద చూపించినా చూసేవాళ్ళకు కొదువ. తెలుగు నాటక రంగాన్ని నేడు నడిపిస్తున్నవాళ్ళు అమెరికాను చూసి నేర్చుకోకపోతే పాయె. కనీసం మన ఇరుగు పొరుగు రాష్ట్ర సోదరులను చూసైనా నేర్చుకోవచ్చుగా?
rama bharadwaj అభిప్రాయం:
March 25, 2008 11:25 pm
సంపాదకులకు నమస్కారం.
తెలుగు నాటకం మీద నాకు తోచినవి రెండు మాటలు.
మనం ఎన్ని పోలికలు ఎవరితో తెచ్చుకున్నా ఏమి ప్రయోజనం? తెలుగులో నాటకరంగంలో క్రియేటివిటీ శూన్యం. ఎక్కడా ఒరిజినాలిటీ లేదు. అందుకని తెలుగు నాటకం చస్తోంది. దీనికి సృజనని గౌరవించే సంప్రదాయం తెలుగువాళ్ళకి చాలినంత లేకపోవటమే ముఖ్య కారణం. అందువల్లనే తెలివైన, సృజనాత్మకులైన రచయితలు నాటక రంగం వేపు ఏనాడు కూడా రాలేదు. నాటక రంగంలో వున్న అనేకమంది క్రియేటివిటీ మీడియోకర్ స్థాయిలోనే వుంటుందని తెలుగు నాటకపు ఇతివృత్తాలనీ, వాటిలోని సంభాషణలనీ చూసిన ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. నిష్ఠూరంగా ఉన్నా ఇది పరమ సత్యం.
అందువల్ల క్రియేటివ్ పెర్సన్స్ కాని రచయితల, దర్శకుల చేతిలో ఒక కళారూపం తయారైతే ఎలా వుండగలదో - సరిగ్గా అలాగే వుంది మన నాటకం ఇవాళ. ఇందులో ప్రేక్షకుల తప్పు ఏమిటి? బాగులేని నాటకాన్ని వాళ్ళు కష్టపడి, ఊరికే వేసినా, ఫ్రీగా చూపించినా కూడా ఎందుకని చూడాలి? మిగతా భారతీయ భాషలలో ఇలా లేదు నాటకం పరిస్థితి. కనకే మరాఠీ లొనూ, బెంగాలీ లొనూ ఇవాళ్టికీ నాటకానికి ఆదరణ ఉండటం.
చెప్పుకోవలసిన మంచి కవి, రచయిత ఒక్కరైనా ఇవాళ తెలుగు నాటక రంగం వైపు చూశారా? లేదే! ఎందుకని, అన్నదే ముఖ్యమైన ప్రశ్న. మనకి మంచి విమర్శ లేనందువలన, మొహమాటం సాహిత్య రంగం లోనూ, ఇతర రంగాల లోనూ రాజ్యం ఏలుతుండటం వలన- ఇలాంటి దుస్థితి వచ్చిపడింది. తెలుగు సినిమా, తెలుగు నాటకం, సృజన లేని వ్యక్తులతో నిండిపోయి ఉన్నాయి. అందువల్ల అసలు సమస్యని వదిలేసి మనం కారణాలని ఇంకెక్కడ చూసినా లాభం ఏమిటి? సమాధానం ఎలా దొరుకుతుంది?
దీనికి పరిష్కారం తెలివైన వాళ్ళు, సృజనలో్ మేటిగా వున్న వాళ్ళు, ఈ రంగాలలోకి రావాలి. అందుకు తగిన వాతావరరణం ఇవాళ ఈ రంగాలలో కనిపించడం లేదు. డబ్బు కొందరి చేతులలో చిక్కుకుని వుంది గనక ఇవన్నీ ఇంటర్‌లింక్‌డ్ ఇష్ష్యూస్. అందువలన తెలుగు వారు ముందు తమ భాషలో వున్న ఇవాళ్టి మేటి కవులనీ, రచయితలనీ, విమర్శకులనీ ఆదరించాలి. వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళకి సరైన ప్రోత్సాహం వుంటే, బహుశా వాళ్ళు తమ శక్తి యుక్తులని ఈ రంగాలల వైపు మళ్ళించడానికి ఆసక్తి చూపురేమో! ఏమో??
rama.
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
April 1, 2008 1:45 pm
రమ గారూ,
మీరు ప్రస్తావించిన ఈ క్రింది విషయాన్ని నేను అంగీకరించలేను.
“చెప్పుకోవలసిన మంచి కవి, రచయిత ఒక్కరైనా ఇవాళ తెలుగు నాటక రంగం వైపు చూశారా? ” అని అన్నారు.
రాసారు. విశ్వనాధ, ఆత్రేయ, శ్రీశ్రీ, దేవులపల్లి, ఆరుద్ర, ఎన్ ఆర్ నంది, గొల్లపూడి మారుతీ రావు, యండమూరి వీరేంద్రనాధ్, జంధ్యాల, సత్యానంద్, గణేష్ పాత్రో ఇలా పేరున్న ప్రతీ వాళ్ళూ నాటకాలు రాసారు. కాకపోతే ఒక నాటకం్ కాస్త ప్రశస్తి చెందగానే, వాళ్ళు మళ్ళా మరో నాటకం రాయలేదు.
ఇప్పటికీ రాయగల సత్తా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే అవకాశాలు లేవు. ఉన్నా, నాటకాల రిహార్స ల్స్ కి టీ తెచ్చే వాడు కూడా నాటకం ఎలా వుండాలో సలహా ఇస్తాడు. రచయిత కి స్వేచ్ఛ లేదు. అది లేని చోట ఏ రచయితా మనసుపెట్ట లేడు. నాలుగు సినిమా డి వీడీ లు ముందేసుకొని నాటకాలు రాసే రోజులివి. అందుకే రచయితలెవ్వరూ నాటకాల జోలికి పోవడం లేదని నా అభిప్రాయం.
చూచాయగా అన్నీ వ్యాసంలో నేను ప్రస్తావించాను. విసుగు పుడుతుందని విశదంగా రాయలేదంతే!
-సాయి బ్రహ్మానందం గొర్తి
Sai Brahmanandam Gorthi అభిప్రాయం:
April 15, 2008 11:23 am
ఏప్రిల్ 16 వ తేదీ “ఆంధ్ర నాటక దినోత్సవం“. ఇది కేవలం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తెచ్చుకున్న రోజులా అనిపిస్తుంది. కనీసం ఒక్క తెలుగు పత్రిక కూడా తెలుగు నాటక రంగం గురించి రాయవు. కనీసం నాటక రంగంలో జీవితాన్ని వెళ్ళబుచ్చే మహామహులైనా “”ఆంధ్ర నాటక దినోత్సవం” అనేది ఒకటుందనీ గ్రహించరు. దాని గురించి ప్రజలకి తెలిసేలా కనీసం ఒక్క నాటక ప్రదర్శన అయినా చేయరు. ఎవరిదైనా ప్రోద్బలం ఉంటే ప్రోత్సాహం అదే వస్తుంది. అది ఎక్కడనుండో రావాలనుకోవడం అవివేకం. అది నాటకరంగం నుండే రావాలి. ముందుగా దాన్ని నమ్ముకొని జీవనాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళే స్పందించాలి.
తెలుగు నాటక రంగలో ఓ ప్రముఖ వ్యక్తి నా ఈ వ్యాసం చదివి, తెలుగు నాటకం వెలిగిపోతోంది, మీరు రాసినట్లుగా లేదు అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో నిజం దివిటీలా కనిపించింది.
ఏదేమైనా తెలుగు నాటకానికి మంచి రోజులు వస్తాయన్నదే నా అశ ! చక్రం క్రింది భాగం పైకి రావడానికి కాస్త సమయం పడుతుంది.
- సాయి బ్రహ్మానందం గొర్తి
Sai Brahmanandam Gorthi అభిప్రాయం:
April 15, 2008 8:32 pm
నాలాంటి వ్యక్తి ఇంకొకరున్నారని ఇప్పుడే తెలుసుకున్నాను.
ఈ లింకు తట్టితే తెలుస్తుంది. కనీసం వ్యాసమైనా రాసారు. మిగతా పత్రికల్లో అదీ లేదు.
baabjeelu అభిప్రాయం:
July 23, 2008 8:39 am
సాయి బ్రహ్మానందం గారూ,
“తెరమరుగౌతున్న తెలుగు నాటకం” శీర్షికన మీరు సంస్కృత నాటకాల్ని స్పృశించి, పద్య నాటకాల్ని పరామర్శించి, ఆ తరవాత నాటకం ఎలా రాయాలి, ఎలా “డైరెక్ట్” చెయ్యలి, ఎలా నటించాలి, “మేకప్పు”, రంగాలంకరణ, నంది ఎవార్డులు ఇత్యాది అద్భుతంగా వివరించేరు.
ఈ వ్యాసంలో వుదహరించిన నాటకాలన్నీ “కాంటెంపరరీ” నాటకాలు కావు. బహుశా “నిజం” ఒక్కటే అనుకుంటాను.
గణేష్ పాత్రో “పావలా”, ధవళ కుర్రాడి “షిప్పొచ్చింది” ఇత్యాది అసలు ప్రస్తావించబడలేదు.
మధ్యలో వీధి నాటకాలొచ్చేయి: “టామీ టామీ టామీ” ఇత్యాది.
ఎ.ఆర్.కృష్ణ “కష్టం” మీ వ్యాసంలో కనబడలేదు.
రావి కొండల రావు గారు ఓ ఇరవైయ్యేళ్ళ కిందటే “తెలుగు సినిమాని కాపీ కొట్టి తెలుగు నాటక రంగం భ్రష్టు పట్టి పోతోంది” అని “ఆంధ్రజ్యోతి” లో బాధపడ్డారు.
ఇంత “సబ్జెక్ట్” వుండి ఇలాటి వ్యాసం?
మొత్తం పదకొండు పేజీలూ చదివిన తరవాత, ఆచార్య తిరుమల రామచంద్ర గారు ఈ మాట మొదటి సంచికలో రాసిన “తెలుగు వ్యాసం” మరొకసారి చదివితే గాని మనసు నిమ్మళించలేదు.
క్షమించాలి.
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
July 23, 2008 11:07 am
సమకాలీన నాటకాలన్నీ ప్రస్తావించే అవసరం ఉందా? అది వేరొక వ్యాసంలా తయారవుతుంది. సమకాలీన నాటకాల గురించి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు పుస్తకం రాసారు. నా ఈ వ్యాసం పరిధి, పరిమితి, ఉద్దేశ్యం వేరు. తెలుగు నాటకరంగంలో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం వల్ల కొత్తగా చెప్పేదేమీ ఉండదని అనిపించింది. అన్నీ అందరికీ నచ్చాలని లేదు కదండీ?
baabjeelu అభిప్రాయం:
July 23, 2008 5:02 pm
సాయి గారూ,
2008 లో రాసిన వ్యాసం ఇది. 1900 లలో రాసినట్టుంది.
నిజవే నాటకరంగం లో వచ్చిన నాటకాల లిస్టు ఇవ్వడం శుధ్ధ దండగ.
“ఈ మాట” లో ప్రోమినెంట్ రైటర్ల లో మీరు ముఖ్యులు.
“నా ఈ వ్యాసం పరిధి, పరిమితి ఉద్దేశ్యం వేరు” అని సెలవిచ్చేరు.
ఈ వ్యాసానికి పరిధి లేదు. పరిమితి అసలు లేదు. సదుద్దేశం వుంది. అందుకే పదకొండు పేజీలు చదివేను.
పదకొండు పేజీల “ఉద్గ్రంథం”. “పి.హెచ్.డి” సంపాదించగలదేమో.
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
July 23, 2008 10:14 pm
బాబ్జీలు గారూ,
మీకు ఈ వ్యాసం నచ్చితే సంతోషం. నచ్చ లేదని రాస్తే నేనేమీ అనుకోను. జిహ్వ కో రుచి అని సరిపెట్టుకుంటాను. రాసిన విషయంలో తప్పులు దొర్లాయా చెప్పండి, సరిదిద్దుకుంటాను.
ఈ వ్యాసం చదివాక నాటకం అంటే ఇదీ అన్న విషయం తెలియాలని కాస్త విస్తృతం గా రాసాను. ఇంకా చాలా విషయాలు చర్చించ వచ్చు. “ఈ మాట” లో ప్రోమినెంట్ రైటర్ల లో మీరు ముఖ్యులు అంటూ రాసారు. మీరు రాసిన కామెంటుకీ, ఈ వ్యాసానికీ, నా జవాబుకీ అది ఏ విధంగా వర్తిస్తుంది? నాకు అనిపించిన సమాధానం రాసాను.
చివరిగా, మీరు ఎద్దేవా చేసినట్లుగా నేను “పి.హెచ్.డి” కోసం ఈ వ్యాసం రాయలేదు. ఈ సారి నాటకాల మీద వ్యాసం రాయదల్చుకుంటే మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.