జ్యోతిషమూ - లోపలి సంగతులూ - 1
జ్యోతిషం - సంకేతాల శాస్త్రం
ఈ పైన చెప్పిన ముడిసరుకులోవన్నీ సంకేతాలుగా అర్ధం చేసుకోవాలి. ఒక్కో సంకేతానికీ ఒక్కో స్వభావం ఉంటుంది. అది ఈ ప్రపంచకంలో అనేక విషయాల్ని సూచిస్తుంది. ఆ సూచించే విషయాల్ని కారకత్వాలు అంటారు. జ్యోతిషంలో ప్రధానభాగం ఈ సంకేతాల్ని బాగా అవగాహన చేసుకోవడమే. ఒక ఉదాహరణ: సూర్యుడంటే రాజు, లేదా ఇంట్లో తండ్రి. చంద్రుడు తల్లి. గురుడు గురువుగారు. శుక్రుడు భార్య. ఇలాగ. ఈ కారకత్వాలు అనంతం. సూర్యుడు అధికారాన్ని సూచిస్తే, చంద్రుడు ఇల్లూ, ఇంట్లో జీవితాన్ని సూచిస్తాడు. బుధుడు చదువూ, తెలివీ, రాతకోతలూ వగైరా. శుక్రుడు సుఖాలు, కళలు. గురుడు మత విషయాలు, మంచితనము, పెద్దరికమూ, గుళ్ళూ గోపురాలు మొదలైనవి. శని శ్రమని, దురదృష్టాన్నీ, అనారోగ్యాన్నీ, దారిద్ర్యమూ, కష్టాలూ మొదలైనవాటిని సూచిస్తాడు. ఇక కుజుడు శతృవులూ, గొడవలూ, యుద్ధాలూ, దురుసుతనమూ మొదలైనవాటికి అధిపతి.
ఇహ రాశులు. రాశుల్లో మళ్ళీ చర, స్థిర, ద్విస్వభావ రాశులనీ, అగ్ని, భూ, వాయు, జల తత్త్వపు రాశులనీ వర్గీకరణలు ఉన్నాయి. ఈ వర్గీకరణలు ఆయా రాశి స్వభావాలని నిర్ణయిస్తాయి. ఒక్కో రాశీ సమాజంలోనూ, ప్రకృతిలోనూ ఒక్కో తరహా పరిస్థితిని సూచిస్తుంది. మేషం ప్రభుత్వ వ్యవహారాలూ, అధికారులతో వ్యవహారాలూ మొదలైనవి సూచిస్తే, వృషభం ఇల్లూ, పొలాలు, తోటలు మొదలైనవి సమకూర్చుకోవడం, విలాసాలు, కళాత్మకమైన వ్యవహారాలూ సూచిస్తుంది. ఇలా అన్ని రాశుల స్వభావాలూ తెలుసుకోవాలి.
ఒక్కో రాశి లక్షణానికీ ఒక్కో గ్రహం లక్షణానికీ దగ్గరి సంబంధం ఉంటుంది. అలాంటి సజాతి గ్రహాన్ని ఆ రాశికి అధిపతి అంటారు. అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాశుల్లో బాగా రాణిస్తాయిట. వాటిని ఆయా రాశుల్లో ఉచ్ఛ అంటారు. కొన్ని గ్రహాలకీ రాశులకీ విరుధ్ధ స్వభావాలు ఉంటాయి. అవి శతృరాశులు లేదా నీచరాశులు అవుతాయి.
భావాలు మన జీవితంలోని వివిధ భాగాల్ని సూచిస్తాయి. లగ్నము దేహాన్నీ, ఆరోగ్యాన్నీ, పెంపకాన్నీ, స్వభావాన్నీ సూచిస్తే, రెండో ఇల్లు ఆస్తిపాస్తులు, డబ్బు సంపాదించడం, కూడబెట్టడాన్ని సూచిస్తుంది. పదో ఇల్లు ఉద్యోగాన్ని, సమాజంలో స్థానమూ, పేరు ప్రతిష్ఠల్ని సూచిస్తే, ఏడో ఇల్లు పెళ్ళినీ, ఇల్లాలినీ, వ్యాపారంలో భాగస్వాముల్నీ సూచిస్తుంది.
ఇప్పుడు జ్యోతిష్కుడు చెయ్యాల్సింది ఏమిటంటే ఈ సంకేతాల్ని బాగా జీర్ణించుకుని ఏ గ్రహం ఏ రాశిలో, ఏ భావంలో ఉందో చూసి ఆయా సంకేతాల్ని సమన్వయించి ఫలితాలు చెప్పాలి. ఉదాహరణ: ఒక జాతకుడికి చక్రం వేశాము. అందులో జాతకుడు పుట్టిన సమయంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయి, ఏ ఏ భావాల్లో ఉన్నాయో తెలుస్తుంది. పదో ఇల్లు మేషం. ఇంకనేం. గవర్నమెంటు ఉద్యోగం ఖాయం. అందులో గురుడున్నాడండీ. అబ్బో, చాలా పైకి వస్తాడు. పేరు, పలుకుబడీ సంపాదిస్తాడు. గొప్ప గౌరవం. అయ్యో, ఆ గురువుని శని చూస్తున్నాడండీ. (ఒక గ్రహాన్ని మరొక గ్రహం చూడ్డం అంటే ఆయా గ్రహాల మధ్య ఎన్ని రాశుల దూరం ఉందో దాన్నిబట్టి వాటిమధ్య ఏర్పడే సంబంధం.) పైకి వస్తాడు కానీండి, ఎప్పుడూ కష్టాలే. ముఖ్యంగా కింద పనిచేసేవాళ్ళవల్ల చాలా ఇబ్బందులండీ. అదీ, జాతకం చెప్పడం అంటే.
జ్యోతిషం పని చేస్తుందా?
జ్యోతిషం ఎలా పని చేస్తుందో (లేదా జ్యోతిష్కులు ఎలా పని చేయిస్తారో) తెలుసుకున్నాం. జ్యోతిషంలో ఎవరైనా ఆశించేది ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగలగడం. 2 + 2 = 4 అన్నంత ఖచ్చితంగా జ్యోతిషం ద్వారా మనకి భవిష్యత్తు తెలిసి ఉంటే అసలీ ప్రపంచం ఇల్లా ఉండేది కాదు. ఒక్కసారి ఆలోచించి చూడండి. జ్యోతిషం ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తు తెలిస్తే చరిత్రలో అనేక తప్పిదాలు జరిగి ఉండేవి కావేమో? యుద్ధాలు, ప్రమాదాలు నివారించబడేవేమో? వార్తల చివర్లో వాతావరణాన్ని సూచించినట్టుగానే జ్యోతిషంతో సహాయంతో భవిష్యత్తుని సూచించేవారేమో?
చాలామంది జ్యోతిష్కులు భవిష్యత్తు నిజంగానే తెలుస్తుందని అంటారు. అయితే అలా భవిష్యత్తు చెప్పకూడదనో, పార్వతీ దేవి శాపం ఉంది కాబట్టి భవిష్యత్తుని ఖచ్చితంగా తెలుసుకోలేమనో కొందరు అంటారు. చాలా ప్రసిద్ధమైన అస్ట్రలాజికల్ మాగజైన్ మొదటిపేజీలో ఇల్లా రాసి ఉంటుంది.
ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ:
కోవక్తా తారతమ్యస్య తమేకం వేధసం వినా ||
గ్రహచారాన్ని బట్టి ఫలితాలు ఈ విధంగా ఉండవచ్చు అని పండితులు సూచిస్తారు. కానీ ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని ఎవరు చెప్పగలరు, ఆ బ్రహ్మదేముడు తప్ప అని ఆ శ్లోకానికి భావం. దీనిని చాలామంది మితవాద (మోడరేట్) జ్యోతిష్కుల అభిప్రాయంగా స్వీకరించవచ్చు. అంటే జ్యోతిషం ద్వారా సూచనగా భవిష్యత్తు తెలిసే అవకాశం ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితాలు చెప్పలేము అని.
కానీ జ్యోతిష్కుల్లో ఎక్కువమంది అతివాదులు (కొంచం ఆత్మ విశ్వాసం ఎక్కువగలవాళ్ళు) ఉంటారు. నా దృష్టిలో వీళ్ళ సంఖ్యే మితవాదులకన్నా అధికం. వీళ్ళప్రకారం భవిష్యత్తు ఖచ్చితంగా తెలుస్తుంది. తప్పంతా జ్యోతిషాన్ని నమ్మని లేదా పట్టించుకోని ప్రజలదీ, ప్రభుత్వాలదీ, సైంటిస్టులదే తప్ప జ్యోతిష్కులది కాదు. వీళ్ళ ప్రకారం జ్యోతిష్కులు అనేక ప్రమాదాల్ని ముందుగానే చెప్పారు. గాంధీగారు హత్య చెయ్యబడతారనీ, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లరు ఆత్మహత్య చేసుకుంటాడనీ, ఇందిరా గాంధీ హత్య చెయ్యబడుతుందనీ, డయానా ప్రమాదంలో మరణిస్తుందనీ, సెప్టెంబరు ౧౧ దాడి జరుగుతుందనీ, ఫలానావాడు ప్రధానమంత్రో దేశాధ్యక్షుడో అవుతాడనీ, ఫలానా ప్రభుత్వం ఫలానా తేదీన పడిపోతుందని ముందే చెప్పామనీ ఇలా ఈ జాబితాకి అంతు ఉండదు.
అతివాదులైనా మితవాదులైనా, జ్యోతిష్కులందరి ఏకాభిప్రాయం ఏమిటంటే, జ్యోతిషం పనిచేస్తుంది అని. నిజంగానే పని చేస్తుందా అని సందేహించేవాళ్ళకి వాళ్ళు పైన చెప్పిన ఉదాహరణల్లాంటివి కోకొల్లలుగా చెప్పడమేగాక, ఆఖరిగా ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారు. అదేమిటంటే ‘మా అనుభవం ప్రకారం జ్యోతిషం పని చేస్తుంది, కావాలంటే నువ్వే నాదగ్గరో లేక ఫలానా ఆయనదగ్గరో భవిష్యత్తు చెప్పించుకుని పరిశీలించుకో ‘ అని. సందేహవాదులు చాలామంది ప్రతిభావంతులైన జ్యోతిష్కులవద్దకు వెళ్ళి కొంతమటుకు సమాధాన పడడమో లేక జ్యోతిషం తప్పని నిర్ధారించుకోవడమో చేస్తారు. అయితే అది ఒక వ్యక్తిగత అనుభవంగానే మిగిలిపోతుంది తప్ప సార్వజనీనమైన సత్యమైపోదు. సార్వజనీనమైన సత్యంకోసం పరితపించేవాళ్ళ కోసం సైన్సు రంగప్రవేశం చేయాల్సివస్తుంది.
జ్యోతిషం మీద సైన్సు చేసిన కొన్ని పరిశోధనల్ని గురించి ముచ్చటించుకునే ముందు రెండు దృక్కోణాల్లో జ్యోతిషాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. మొదటిది, జ్యోతిషం అంతర్గత వైరుధ్యాల పుట్ట. ఆ వైరుధ్యాల గురించి తెలుసుకుంటే జ్యోతిషం నిజంగా పనిచెయ్యడం అసాధ్యం అనిపిస్తుంది. రెండు, చాలా మందియొక్క వ్యక్తిగతానుభవం దృష్ట్యా జ్యోతిషం కనీసం పాక్షికంగానైనా పని చేస్తుంది, లేదా పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి.
(ఇంకా ఉంది)
ఈ వ్యాసము రాయడంలోనే కాక జ్యోతిషాన్ని అధ్యయనం చెయ్యడానికి అర్ధం చేసుకోడానికి నాకు ఉపయోగపడిన కొన్ని పుస్తకాలు:
- జ్యోతిష ప్రకాశము (3 భాగాలు): శ్రీ సీహెచ్ ఎస్ ఎన్ రాజు
- A To Z Horoscope Maker & Delineator : Llewellyn George
- Astrology for All, How to Judge a Nativity, Art of Synthesis, Esoteric Astrology, Progressed Horoscope: all by Alan Leo
- Manual of Astrology: Sepharial
- Astrology for Beginners, How to Judge a Horoscope, A Catechism of Astrology, 300 Important Combinations, Notable Horoscopes: all by B.V.Raman
- Brihat Jataka of Varaha mihira
- Spiritual Astrology: Ekkirala Krishnamacharya
KRISHNA RAO JALLIPALLI అభిప్రాయం:
March 2, 2008 3:26 am
నమ్మడమునమ్మకపొవడం అనేది ఎవరి ఇష్టం వారిది. కాని కొంత మంది భయపెట్టీ తమ పబ్బం గడుపు కుంటారు. వారిని మాత్రం ఇరగ దీయాలి.
కొత్తపాళీ అభిప్రాయం:
March 3, 2008 9:00 am
జ్యోతిషం మీద నమ్మకమూ ఆసక్తీ నాకు ఏమంత లేకపోయినా దాని వెనకాల ఉన్న ముఖ్య సూత్రాలనూ, గణన పద్ధతులనూ మీరు వివరించిన తీరు బాగుంది. దానికి తోడు మీ సరళ వచనం హాయిగా చదివించింది.
పనిలో పనిగా ఈ మాట వాళ్ళు కూడా పాఠకుల జ్యోతిషం ప్రశ్నలకు మా జవాబులు అని శీర్షిక పెడతారేమో! :)
gultiReader అభిప్రాయం:
March 3, 2008 1:22 pm
ages ago i was in an engg school and my room mate was one satyanarayana (satyam). he used to say - for those who see the panchangam there are good days and bad days and for those who do not have panchangam all are good days.
i never forgot his words. in other words, this jyotisham is a some sort of wizadry people play on others to make $. having said that i do read my weekly predictions ;) without fail but when it comes to booking tickets, going to temples and entering new house, I do not really give a damn.
Regards
GR
నాగ మురళి అభిప్రాయం:
March 4, 2008 12:41 am
కొత్తపాళీ గారు, చాలా కృతఙ్ఞతలు. ఈ మాట వాళ్ళకి పాఠకుల సంఖ్య తక్కువేమీ లేదు కదా. కాబట్టి ఆ అవసరం ఉంటుందనుకోను.
rajasankar kasinadhuni అభిప్రాయం:
March 4, 2008 7:40 am
నాగమురళిగారూ,
జ్యోతిషంలోని మౌలికమైన అంశాలని ఈ విషయంలో ఏ మాత్రమూ ప్రవేశంలేని నాలాంటివారికి కూడా బాగా అర్థం అయ్యేటట్లు వివరించారు. పంచాంగంలోని అతిముఖ్యమైన అంగం - తిథి, దానిని ఎలా గణిస్తారు అనే విషయం గురించి వివరిస్తూ మీరు మరొక వ్యాసం వ్రాస్తే బావుంటుంది. ఇది అత్యాశగా మీకు అనిపించవచ్చు కానీ ఇలా అడగడానికి అవసరమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, ప్రపంచంలో (ప్రత్యేకించి అమెరికాలో) అనేక చోట్ల స్థిరపడ్డ నాలాంటివాళ్ళు కొంతమందికి వచ్చే సందేహం - భరత ఖండానికి గణింపబడ్డ చాంద్రమాన పంచాంగాన్ని మరొక time zone లో ఉన్నప్పుడు ఎలా అన్వయించుకోవాలని. ఈ విషయం గురించి నేను కొంత తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాల కారణంగా మరిన్ని సందేహాలు పుట్టుకొచ్చాయి. ఇక రెండవ కారణం కొంత అవగాహన పెంచుకుందామన్న కోరికే. మీ e-mail చిరునామా తెలిపినట్లైతే, నా సందేహాలు మీకు పంపుతాను.
ధన్యవాదాలతో,
రాజాశంకర్ కాశీనాథుని
Rohiniprasad అభిప్రాయం:
March 4, 2008 7:56 am
వ్యాసం పూర్తవలేదు కాని నాకు మొదటినుంచీ కొన్ని సందేహాలున్నాయి. గ్రహాలను భూమినుంచి వీక్షించినప్పుడు వాటి వెనకాల ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రరాశులు కనబడతాయి. చూస్తున్న కోణాన్నిబట్టి ఆ నేపథ్యం మారుతుంది. గ్రహాల ప్రభావం జరగబోయే సంఘటనలమీద ఉంటుందని అనుకున్నా కిటికీ చువ్వలకూ, కిటికీనుంచి కనబడే దూరపు కొండలకూ ముడిపెట్టినట్టు ఈ రాశుల ప్రమేయం ఏమిటో అర్థం కాదు.
నాగ మురళి అభిప్రాయం:
March 4, 2008 10:17 am
గిల్టీ రీడర్ గారు, జ్యోతిషం కేవలం డబ్బు సంపాదించడం కోసం ఆడే నాటకమని భావించడం సులభమేగానీ, అందరూ అలా మోసం చేసేవాళ్ళే ఉండరు. చాలామంది జ్యోతిష్కులు జ్యోతిషం నిజంగా సైన్సు అనీ, దాన్ని ఉపయోగించి తాము అందరికీ దారి చూపిస్తున్నామనీ గట్టిగా నమ్ముతారు. వాళ్ళకు అలాంటి నమ్మకం కలగడానికి కారణమేమిటో వివరించి, అది అసలు నిజంగా సైన్సు అయ్యే అవకాశం ఉందో లేదో చర్చించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
రాజాశంకర్ గారూ, తప్పకుండా మీ సందేహాలు తెలియజేయండి. వీలునిబట్టి నాకు తెలిసినంతవరకు సమాధానాలిస్తాను. కొంచం పెద్ద వ్యాసాలు రాయాల్సి వస్తే, నా బ్లాగు లో రాస్తాను. అయితే ఒక మనవి. నేను జ్యోతిష్కుణ్ణి కాను. జాతకాలు చెప్పేవాణ్ణీ కాను. జ్యోతిషం కొంత తెలిసినవాణ్ణి. అయినా అది ఖచ్చితంగా పనిచేస్తుందని నమ్మేవాణ్ణి కాను. నా మెయిల్ అయిడీ: vadavalli_nm@yahoo.com
రోహిణీ ప్రసాద్ గారూ, మీరు చెప్పిన పోలిక చాలా సమంజసమైనది. గ్రహాల్లాగానే ఆకాశంలో కనిపించే నక్షత్ర రాశులకి కూడా భూమి మీద, మనుషులమీద ప్రభావం ఉన్నదని జ్యోతిషం నమ్ముతుంది. దాని ప్రకారం - గ్రహాల ప్రభావం, రాశుల ప్రభావం సమ్మిళితంగా పని చేస్తాయి. అంటే కిటికీ ఊచలేగాక వెనకాల కనిపిస్తున్న చెట్లూ, కొండలూ కూడా మనమీద పనిచేస్తాయనుకోవాలి. భూమి నుంచి చూసినప్పుడు గ్రహాలు కూడా నక్షత్రాల్లాగే కనిపిస్తాయి. అవి ఒక్కో రాశి (నక్షత్ర మండలం) లో ఉన్నట్టు కనిపిస్తాయి. భూమి నుంచి చాలా చిన్నగా కనిపిస్తాయి కాబట్టి ఏ కోణం లోంచి చూసినా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఆ స్థితి మారినట్టు కనిపించదు. కానీ చూసే కోణాన్నిబట్టి మొత్తంగా గ్రహ-రాశి స్థితి మారుతుంది. అంటే ఒక రాశి ఇండియాలో మా ఇంటి నుంచి చూస్తే ఈ క్షణంలో నడినెత్తిమీద ఉండవచ్చు. అదే క్షణంలో లండన్ నుంచి చూస్తే అదే రాశి ఉదయిస్తూ కనపడవచ్చు. అది నడినెత్తిమీద ఉంటే ప్రభావం ఒకరకంగా ఉంటుందనీ, ఉదయిస్తుంటే మరో రకంగా ఉంటుందనీ జ్యోతిషం చెప్తుంది. (ఈ కోణాల్నే భావాలు అంటారు అని వివరించాను). అందుకే జాతకం వేసేటప్పుడు పుట్టిన ప్రదేశాన్నిబట్టి గ్రహాలూ రాశులూ ఏ ఏ భావాల్లో (కోణాల్లో) ఉన్నాయో లెక్కిస్తారు.
అయితే ఈ రాశి చక్రం ఎక్కడి నుంచి లెక్కపెట్టాలో, ఈ భావాలు ఎలా గణించాలో చాలా గందరగోళం ఉన్నది. ఒకదానికొకటి పొసగని సిధ్ధాంతాలు, సాంప్రదాయాలు జ్యోతిషంలో చాలా ఉన్నాయి. వాటి గురించి తరవాతి భాగంలో వివరిస్తాను. కేవలం సారాంశం బోధపడడానికి సరళంగా ఒక outline మాత్రమే ఇస్తున్నానని మనవి.
జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:
March 4, 2008 4:29 pm
ఈ వ్యాసంలో వ్యాసకర తన అభిప్రాయాలనూ, తన నమ్మకాలనూ వివరించారు. వీటి గురించి ఎంతో మంది హేతువాదులు చాలా కాలం కిందటే వ్యతిరేకంగా వాదించారు. ఆ విషయాల జోలికి పోకుండా, కేవలం వ్యాసకర్త హేతువాదుల మీద గుప్పించిన వ్యాఖ్యల మీదే నా అభిప్రాయం రాస్తున్నాను.
“హేతువాదుల విషయానికి వస్తే వాళ్ళలో చాలా మంది జ్యోతిషాన్ని ఎరిగిన వారు కారు. వాళ్ళ అజ్ఞానం జ్యోతిష్కులకి కొంత వరకూ ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది.” అని వ్యాసకర్త అన్నారు. ఇందులో ఏమన్నా అర్థం వుందా? జ్యోతిష్యాన్ని నమ్మని వాళ్ళకి జ్యోతిష్కులతో పనేమిటీ? నమ్మకం లేని విషయాల గురించి ఎవరన్నా పట్టించుకుంటారా? ఈ జ్యోతిష్కులు తాము నమ్మని మార్క్సు శ్రమ సిద్ధాంతం గురించి జ్ఞానం సంపాదిస్తారా ఎక్కడన్నా? ఈ జ్యోతిష్కుల అజ్ఞానం (శ్రమ సిద్ధాంతం విషయంలో) మార్క్సిస్టులకి అస్త్రంగా వుపయోగపడుతుందా, ఎక్కడన్నా? “భవిష్యత్తు ముందరే నిర్ణయమయి లేదూ, అది ప్రకృతి నియమాల మీదా, మానవ ప్రవర్తన మీదా ముఖ్యంగా ఆధారపడి వుంది” అని నమ్మే హేతువాదులు, కూర్చుని జ్యోతిష్య శాస్త్రంలో ఏం రాశారూ అని చదవరు. ఎటొచ్చీ వున్న జ్యోతిష శాస్త్రాన్ని సహేతుకంగా విమర్శించ వలసి వచ్చినపుడు మాత్రం, ఆ శాస్త్రాన్ని కూలంకషంగా పరిశీలించాల్సి వుంటుంది. లేనప్పుడు దాని జోలికి పోనే అవసరం లేదు. దేముడి వునికినే నమ్మని హేతువాదులు, భవిష్యత్తు తెలుసుకోవడం గురించి ఎందుకు నమ్ముతారూ? అలా నమ్మితే, వారు హేతువాదులు కారని అర్థం.
న్యూటన్ జ్యోతిష్యాన్ని నమ్ముతాడని వ్యాసకర్త శలవిచ్చారు. అయితే ఏమిటీ? సైన్సు తెలిసిన వాళ్ళందరూ, హేతువాదులవ్వాలని ఏమన్నా రూలుందా? నాస్తికుడయిన డాక్టరు దగ్గర ఆస్తికులయిన పేషంట్లు వైద్యం చేయించుకోరా? నాస్తికులయిన శాస్త్రవేత్తలు కనిపెట్టిన శాస్త్ర విషయాలను ఆస్తికులు వుపయోగించరా? భూమ్యాకర్షణ శక్త్రి గురించి కనిపెట్టడం అనేది మనిషిని హేతువాదిగా మారుస్తుంది అని అనుకుంటే, అది నిజంగా అమాయకత్వమే. హేతువాదం అనేది వుత్త ప్రాకృతిక విషయాలకి మాత్రమే సంబంధించినది కాదు. అది సాంఘీక విషయాలతో కూడా కలిసి వుంటుంది. హిందూ మతాన్ని నమ్మేవాళ్ళలో చాలా మంది ఖురాన్ గానీ, బైబిల్ గానీ చదివి వుండరు. (వీరిలో చాలా మంది భగవద్గీత గానీ, రామాయణం గానీ కూడా పూర్తిగా చదివి వుండరు లెండి. అయినా వీరికి వాటి మీద నమ్మకం వుంటుంది. జ్యోతిష శాస్త్రాన్ని చదవని వారికి కూడా జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం వున్నట్టు!) అయినా వారు తమ మతాన్నే నమ్ముతూ, ఇతర మతాల్ని నమ్మరు. అయితే, ఇతర మతస్తుల మీద మత యుద్ధానికి దిగక పోవడం వేరే విషయం. వారు తమ మతాన్ని నమ్ముకుంటూ, ఇతర మతాల్ని నమ్మరు (ఫాలో అవ్వరు). కాబట్టి, ఆ మత సంబంధిత శాస్త్రాల జోలికి కూడా పోరు. నమ్మకం లేని విషయాల్ని అనవసరంగా స్టడీ చెయ్యడం శుద్ధ దండగ. ఏదన్నా “అశాస్త్రీయమైనది” అని ఎవరన్నా అంటే, దానర్థం, నమ్మడం, నమ్మకపోవడం అనే వాటితో సంబంధం లేకుండా, ఒక విషయం తాలూకు ప్రభావం అందరి మీదా ఒకేలాగా వుండీ. శాస్త్రీయంగా రుజువు చెయ్యగలిగేటట్టు వుంటుంది అని అర్థం. “భవిష్యత్తు తెలుసుకోవడం అసంభవం” అని నమ్మే హేతువాదులు, ఆ అసంభవ విషయం మీద ఆధారపడి వున్న శాస్త్రాన్ని స్టడీ చెయ్యరు. మార్క్సు సిద్ధాంతం గురించి మిగిలిన వాళ్ళలో వున్న అజ్ఞానం, ఆ సిద్ధాంతాన్ని రుజువు చేసెయదు. దాని శక్త్రే దాన్ని రుజువు చేస్తుంది.
“సైన్సు నమ్మేవాళ్ళు దేవుణ్ణి నమ్మకూడదు” అని అనుకోవడం అర్థం లేని విషయం. నమ్మినా నమ్మకపోయినా సైన్సు అందరికీ ఒకేలాగా వుపయోగపడుతుంది. ఒకే విధంగా రుజువు అవుతుంది. దీనర్థం ప్రతీ విషయం సైన్సుకి అర్థం అయిపోయిందని కాదు. “ఆ సైన్సుని సృష్టించింది కూడా ఆ దేముడే” అని వాళ్ళు నమ్ముతారు మరి. దేముడూ, జ్యోతిష్యం, వగైరాలు నమ్మకాల మీద ఆధారపడి వున్న శాస్త్రాలు. అవి లేకపోతే ఆ శాస్త్రాల జోలికి వెళ్ళనవసరం లేదు. ఒక మనిషికి అన్నిశాస్త్రాలతోనూ పూర్తిగా పరిచయం వుండదు. ఒక మనిషికి ఒక శాస్త్రంతో వున్న జ్ఞానం ఆ శాస్త్ర వునికిని రుజువు చెయ్యదు. ఇది అర్థం లేని తర్కం. గతి తార్కిక భౌతిక వాదం, హేతువాదం, గట్రా గురించి సరిగా తెలియదు కాబట్టి, అవి కరెక్టే అని వాదించడం ఎంత అర్థమయిన విషయమో, వ్యాసకర్త రాసింది కూడా అంతే అర్థవంతమైన విషయం.
- ప్రసాద్
నాగ మురళి అభిప్రాయం:
March 4, 2008 10:57 pm
ప్రసాద్ గారూ, మీరు అన్నారు -
జ్యోతిష్కులు జ్యోతిషం శాస్త్రీయమైనది అంటారు. అది అవునో కాదో పరిశీలించడానికి జ్యోతిషం నేర్చుకుని పరిశోధించిన హేతువాదులు ఉన్నారు. వాళ్ళ పరిశీలనలు ఏమిటో తరువాతి భాగాల్లో చర్చిస్తాను.
నా వ్యాసం ఉద్దేశ్యం కూడా జ్యోతిషాన్ని కొద్దిగా పరిచయం చేస్తూ, అది “శాస్త్రీయమైనదా” కాదా అని చర్చించడమే. అంటే నమ్మకాలకి అతీతంగా పని చేస్తుందా లేదా అని పరిశీలించడమే. ఇదే ఉద్దేశ్యాన్ని ఈ మొదటి భాగం లోనే స్పష్టంగానే చెప్పడానికి ప్రయత్నించాను. అయినా కొంచం కన్ఫ్యూజ్ చేసినట్టుగా రాసి ఉంటే తప్పు నాదే.
P. N. Raja Rao అభిప్రాయం:
March 5, 2008 4:00 am
ఏది శాస్త్రీయం? ఏది అశాస్త్రీయం? అన్న చర్చ ఈ రోజుల్లో ఏమంత సులువైనది కాదు. ఇప్పుడు థీరెటికల్ ఫిజిక్సులోజరుతున్లో నవ్య నూతన పరిశోధనలు మనమందరమూ రేషనల్ అని భావించే మూసలో ఇమడ లేవు.
జ్యోతిషశాస్త్రం రాసుల లెక్కలు కట్టేవరకూ శాస్త్రమే! అది నక్షత్రశాస్త్రం. అయితే ఆ రాసులు మన భవిష్యత్తుని చెప్పగలవు అని predictive astrology చదివి చెప్పేటప్పుడే వస్తుంది చిక్కు, కాకుల లెక్కల్లా!
నేను ఎక్కడో చిన్నప్పుడు చదివాను; వీలు చూసుకొని రిఫరెన్సులు ఇస్తా. ఈజిప్ట్ నుంచి మనకి దిగుమతి అయ్యింది ఈ predictive astrology అని! అంతకుముందు, మన astrology నిజంగా astronomy.
సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ జ్యోతిష శాస్త్రంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఇది పునహ్ పునహ!
రచయితగారు రెండవ భాగంలో అన్ని రిఫరెన్సులూ ఇస్తారని భావిస్తూ,
పి.యన్.ఆర్.
నాగమురళి అభిప్రాయం:
March 5, 2008 5:05 am
రాజారావు గారు, మీ కామెంటుకి ధన్యవాదాలు. జ్యోతిషం ఈనాటి థీరెటికల్ ఫిజిక్సు అంత గహనమైనది అని నేను అనుకోవడం లేదు. జ్యోతిషాన్ని క్వాంటం ఫిజిక్సులాంటి వాటితో పోల్చలేము. జ్యోతిషం చెప్పే ప్రిడిక్షన్సుని చాలా సాధారణ వ్యక్తి కూడా వెరిఫై చెయ్యగలడు అని నా అభిప్రాయం.
నేను చెప్పేవాటిల్లో పెద్దగా కొత్తవిషయాలేమీ లేవు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే సంగతి ఏమిటంటే, ఇప్పటికే ఎంతో చర్చ జరిగినా, జ్యోతిషం అశాస్త్రీయమైనదని ఎంతోమంది ఎలుగెత్తి చాటినా, ఈ ఇంటర్నెట్ యుగంలో జ్యోతిషానికి ప్రజాదరణ విపరీతంగా పెరిగిపోవడం.
ఈ వ్యాసం చాలామటుకు నా స్వంత అనుభవాల, ఆలోచనల ప్రయాణం. నాకు తెలిసిన సమాచారమంతా ఇందులో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
P. N. Raja Rao అభిప్రాయం:
March 5, 2008 8:22 am
Dear Sri Nagamurali garu:
My doubt, if you want to call it a doubt in reference to “Scientific,” “Rational,” analyses is deeper than what you have surmised as my intent. What the rationalists have been propounding all along (the so-called dielectical materialists included in my summing up!) is questioned in its basics these days. As a matter of fact the neo-Marxists have considerably revised the hard-core marxists’ opinions on the text-book-marxist ideology.and dielectics. However, it is a different and unrelated issue. I have to raise it since one of the correspondents mentioned dielectics in passing! And, I know that it is beyond the scope of your article.
A good discussion on what is scientific and what is non-scientific that includes the new and old ideologies would be useful in a different article.
All I want to say is the ideas of modern science exemplified as ’scientific,’ and ‘rational’ have been questioned and the very bases of the theories are at quandry. So, simply saying that a particular system ( may be even a belief system too) is unscientific may give a good following in the ‘elite’ readership of eemaata but that does not make it profound.
Best wishes,
P.N.R
జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:
March 5, 2008 8:57 am
నాగమురళి గారూ,
నేను రాసిన వాక్యాలను కోట్ చేసేటప్పుడు, ఆ వాక్యాల్లోని అక్షర దోషాన్ని సరి చేసి, కోట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. నేను రాసిన అక్షర దోషం, నా కామెంటు పబ్లిష్ అయ్యాక గమనించాను. దాన్ని కరెక్టు చేసి, కోట్ చెయ్యడం మీ సహృదయతకి చిహ్నం.
ఇకపోతే, జ్యోతిషం శాస్త్రీయమైనదా, కాదా అన్న చర్చలోకి నేను ప్రవేశించడం లేదు.పి. యస్. ఆర్ గారన్నట్టు, ఈ చర్చలు చాలా కాలం క్రిందటే జరిగాయి. ఎటొచ్చీ, మీరు రాసిన వాక్యం, “జ్యోతిష్కులు జ్యోతిషం శాస్త్రీయమైనది అంటారు. అది అవునో కాదో పరిశీలించడానికి జ్యోతిషం నేర్చుకుని పరిశోధించిన హేతువాదులు ఉన్నారు. వాళ్ళ పరిశీలనలు ఏమిటో తరువాతి భాగాల్లో చర్చిస్తాను”, నాలో ఒక ఆలోచన రేకెత్తించింది. ఈ వాక్యంలో, “హేతువాదులు” అన్న పదం బదులు, “కొంతమంది మనుషులు” వుందనుకోండి. అప్పుడు అడగడానికి నాకు ఏమీ వుండేది కాదు. “హేతువాదులు” అన్న పదం వాడే సరికి, వారెటు వంటి “హేతువాదులు” అన్న ప్రశ్న వస్తోంది.
“హేతువాదులు” అనే పదం ‘నాస్తికులు” అనే పదానికి పర్యాయంగా వాడుతూ వచ్చాను నేను. చాలా మంది ఇలాగే వాడుతారు. దీని ప్రకారం, “హేతువాదులు” అంటే, వారు “దేముడి వునికిని” గానీ, “భవిష్యత్తు నిర్ణయమై వుందని” గానీ, “భవిష్యత్తుని గ్రహాల కదలికతో తెలుసుకోగలం” అని గానీ నమ్మరు. ఇటువంటి ప్రాధమిక నమ్మకాలు లేకుండా, వారు జ్యోతిష్య శాస్త్రాన్ని, అది శాస్త్రీయమైనదో, కాదో తెలుసుకోవడానికి, అధ్యయనం చేశారంటే, అర్థం లేని విషయంగా కనబడుతోంది. దీనర్థం వారు హేతువాదులు కారు అని. మీరు “హేతువాదులు” అనే పదం వేరే అర్థంతో వాడుతూ వుంటే, అది వేరే సంగతి. “నాస్తికులు” అనే అర్థంతో వాడుతుంటే మాత్రం, అది అర్థం లేని విషయం. “ఒక దైవ భక్తుడు, ఒక నాస్తిక గ్రంధాన్ని అధ్యయనం చేసి, దాన్ని అంగీకరించి, దైవ భక్తుడిగా మిగిలిపోయాడు” అని అంటే, ఏమన్నా అర్థం వుందా?
ఇక్కడ దేముడున్నాడా, లేడా అని గానీ, జ్యోతిషం నిజమా, కాదా అని గానీ నేను చర్చించడం లేదు. “హేతువాదులు”, లేదా “నాస్తికులు” అనే పదాల విషయంలో వున్న అపోహని తొలగించడానికీ, వారి కున్న నమ్మకాలను స్పష్టంగా చెప్పడానికీ మాత్రమే ప్రయత్నిస్తున్నాను.
ఇంకో విషయం. దేవుణ్ణి నమ్మే చాలా మంది ఆస్తికులు కూడా, “భవిష్యత్తు ముందరే నిర్ణయమై వుందని” గానీ, “భవిష్యత్తుని తెలుసుకోగలం” అని గానీ, “భవిష్యత్తు తెలుసుకుని దాన్ని మార్చగలం” అని గానీ నమ్మరు. అవి వారి నమ్మకాలు.
మీరు, “నాకు చాలా ఆశ్చర్యం కలిగించే సంగతి ఏమిటంటే, ఇప్పటికే ఎంతో చర్చ జరిగినా, జ్యోతిషం అశాస్త్రీయమైనదని ఎంతోమంది ఎలుగెత్తి చాటినా, ఈ ఇంటర్నెట్ యుగంలో జ్యోతిషానికి ప్రజాదరణ విపరీతంగా పెరిగిపోవడం” అని రాశారు. అంటే, సంఖ్యా బలం ఒక విషయ ప్రామాణికతని నిర్ణయిస్తుందా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని ఒకప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో నమ్మేవారు. అలా కాదని రుజువు చెయ్యడానికి ప్రయత్నించిన శాస్త్రుజ్ఞుల్ని రాళ్ళతో కొట్టి చంపిన సంషటనలూ వున్నాయి. “చాలా మంది” అనేది ఒక విషయాన్ని ఎంతమంది నమ్ముతున్నారూ, ఆచరిణిస్తున్నారూ, వగైరా చెబుతుందే గానీ, ఆ విషయం కరెక్టా, కాదా అని చెప్పదు. ఎక్కువ మంది రామ భక్తులకి, రాముడికి అక్క వుందని తెలియదు కాబట్టి, వారు రామ భక్తులు కారు అని అనగలరా ఎవరన్నా? సంఖ్యా బలం ఎప్పుడూ ఒక విషయ ప్రామాణికతని తేల్చదు. అది ఒక ఫాక్టుగా మాత్రమే వుంటుంది.
- ప్రసాద్
నాగ మురళి అభిప్రాయం:
March 5, 2008 3:24 pm
Rajarao garu, I am delighted to read your follow-up comment .I would also be interested to see an article that discusses in depth the old and new idealogies concerning scientific thought. Personally I believe that Karl Popper’s Scientific Philosophy is enough to rationalize many things we encounter in day to day life. But, as you said, more informed readers would certainly like more modern and in-depth discussions on the subject. I will keep this in mind while writing the next parts. Thanks once again.
ప్రసాద్ గారు, జ్యోతిషం మీద పరిశోధనలు జరిపిన సైంటిస్టులు కొంతమంది జ్యోతిషంలో నిష్ణాతులు. వాళ్ళు జ్యోతిషం మీద నమ్మకం లేకుండానే కోర్సులు చేసి జ్యోతిషాన్ని అధ్యయనం చేసినవాళ్ళు. అటువంటి వాళ్ళలో ఒకళ్ళని నేను వ్యక్తిగతంగా ఎరుగుదును. రాబోయే భాగంలో వాళ్ళెవరో, వాళ్ళు చేసిన పరిశోధనలేమిటో తెలియజేస్తాను. నాకు తెలిసినంతవరకు వాళ్ళు హేతువాదులు. నేను నాస్తికులన్న అర్ధంలో ఆ పదం వాడలేదు. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు గానీ, కేవలం ఇంటలెక్చువల్ క్యూరియాసిటీతో తాను అంతవరకూ నమ్మిన వాటికి పూర్తి విరుధ్ధమైన విషయాలగురించి తెలుసుకోడానికి ప్రయత్నించేవాళ్ళు ఉంటారు.
సంఖ్యాబలాన్ని బట్టి జ్యోతిషం ప్రామాణికమైనదని నేను అనడం లేదు. జ్యోతిషం యొక్క ప్రజాదరణ రెండు రకాలుగా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకటి, జ్యోతిషం పని చెయ్యదు అని శాస్త్రీయంగా నిరూపించబడి ఉంటే, ఎందుకు పని చెయ్యదో, ఆ నిరూపణలేమిటో జనసామాన్యానికి చేరలేదు అన్నమాట. రెండు, జ్యోతిషంలో నిజంగానే పస ఉంటే నా దృష్టిలో అది భూమి బద్దలయ్యేంత పెద్ద విషయం. భవిష్యత్తు ముందే నిర్ణయింపబడింది, అది తెలుసుకోవచ్చుట అంటే, నా దృష్టిలో అది చాలా పెద్ద సైంటిఫిక్ డిస్కవరీ అవ్వాలి. అందుచేత రెండు రకాలుగానూ అది నాకు ఆశ్చర్యకరమైన విషయమే.
surya అభిప్రాయం:
March 6, 2008 6:05 am
I find this statement of Malati Chandoor appropriate: “నాస్తికుడు నిరీశ్వరవాది”; “హేతువాదికి దేవుడితో పని లేదు”. Unfortunately the power (or lack of it) of astrology is still a puzzle - like God’s existence. The world follows whoever argues strongly - for or against them. We do not look at the world as it is, but as we are told to. For quite sometime I have been seeing one famous personality (astrologer) in many movie and social events. None of the events he ‘foresaw’ came true, except one or two stray incidents. I asked one of his followers, “why do people still throng to have him in their midst, knowing fully well that his predictions are as accurate as just anyone else’s?” To which he replied, “He has a photogenic face; moreover, although he consults his books before giving any advice, he always tells us to ‘go-ahead, everything will be fine’”!
I read several articles where terminally ill people, condemned by the world of medicine, become normal, with their deadly ailments simply disappearing!! Some call them miracles. Some attribute to a hidden power. Finally it’s the faith that does the magic. I request readers to ‘also read’ Paanuganti vaari Saakshi. Eemaata may also consider publishing some essays from Saakshi.
[This comment has been edited - editors]
అసమీక్ష్యసమీక్ష్యకారి అభిప్రాయం:
March 6, 2008 10:07 am
భవిష్యత్తు ముందుగానే నిర్ణయమై ఉందని (determinism) ఏ హేతువాదులు నమ్మరని, అలా నమ్మితే వారు హేతువాదులు కారని జె. యు. బి. వి. ప్రసాద్ గారు వాదించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పూర్తిగా హేతువు మీద ఆధార పడే వారు, ప్రపంచంలో అన్నీ విషయాలను కార్యకారణ సంబంధంగా (causal) హేతువు ద్వారా వివరించ గలమని నమ్మే వారు, అవే లెక్కల ప్రకారం భవిష్యత్తును కూడా కచ్చితంగా వివరించ గలమని నమ్మాలి. లేదంటే సైన్సు ద్వారా (హేతువు ద్వారా) వివరింప లేని స్వయంనిర్ణయాధికారాన్నయినా (free will) నమ్మాలి. విజ్ఞాన శాస్త్రాలు (మానసిక విజ్ఞాన శాస్త్రంతో సహా) చాలా వరకూ ప్రపంచం నిర్ణయాత్మకమన్న(deterministic) విశ్వాసం ఆధారంగానే పని చేస్తాయని మనం ఒప్పుకోక తప్పదు. కనీసం గత అయిదు వందల యేండ్లుగా శాస్త్రవేత్తలకు, తత్త్వవేత్తలకు కొరకరాని కొయ్యగా తయారైన The Dilemma of Determinism and Freewill ను అంత సులభంగా తీసిపారేయలేము.
భవిష్యత్తు ముందుగానే నిర్ణయమై ఉందా లేదా అన్నది metaphysical ప్రశ్న అయితే, భవిష్యత్తు ను మనం తెలుసుకోగలమా లేదా అన్నది epistemological ప్రశ్న అవుతుంది. Hard Determinism నమ్మిన చాలామంది శాస్త్రవేత్తలు కూడా బుద్ధిలో మనకున్న పరిమితుల వల్ల మనం భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేయలేమన్నారు. తన సిద్ధాంతాలను వివరిస్తూ, లాప్లాస్ భవిష్యత్తును కచ్చితంగా అంచనా వేయగలిగే బుద్ధజీవిని ఇలా వర్ణించాడు (ఈ జీవికి “లాప్లాస్ భూతం” అన్న ముద్దు పేరు కూడా ఉంది లెండి) :
అయితే రాజారావు గారు చెప్పినట్లు థీరెటికల్ ఫిజిక్సులోజరుతున్న నవ్య నూతన పరిశోధనలు విజ్ఞాన శాస్త్రాల పరిధిని నిర్ణయాత్మకమైన ప్రపంచపు ఎల్లలను దాటించే ప్రయత్నమనే చెప్పుకోవాలి.
“ఈజిప్ట్ నుంచి మనకి దిగుమతి అయ్యింది ఈ predictive astrology … అంతకుముందు, మన astrology నిజంగా astronomy.” అని రాజారావు గారు అన్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న 12 రాశుల విభజన ను మొదటిసారి వివరించిన “బృహత్ పరాశర” లోని హోరశాస్త్రము, ఈజిప్టు, బాబిలోనియన్ల నుండి గ్రీకుల ద్వారా మనకు సంక్రమించిందని ఒప్పుకున్నా అంతకు పూర్వం predictive astrology ఉండేది కాదని చెప్పలేం. అతి ప్రాచీనమైన బ్రాహ్మణాలలోనూ, వేదాంత సూత్రాలలోనూ గ్రహాల, నక్షత్రాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేసే ప్రయత్నాలు కనిపిస్తాయి [Cf: A History of Sanskrit Literature By A. Berriedale Keith page: 528]. భారతదేశంలో ఖగోళ శాస్త్రం (astronomy) తొలినాళ్ళలో astrology తో ముడవడకుండా అభివృద్ది చెందిందని చెప్పడానికి కొన్ని ఆధారాలు, రిఫెరెన్సులు ఇవ్వగలరా?
రవి అభిప్రాయం:
March 6, 2008 8:30 pm
నాగ మురళి గారూ,
నాకు జ్యోతిషం మీద అభిప్రాయాల్లేవు., చిన్నప్పుడు 12 యేళ్ళు సంస్కృతం వెలగబెట్టినా కూడా. ఐతే మీ అభిలాష, తపన చూసి నిజంగా ఆశ్చర్యపడ్డాను.
ఇక పోతే, రాజశేఖర్ గారి ప్రశ్నే నాదీనూ. తిథులు ఎలా గుణిస్తారు ? ఆ లాజిక్ యేమిటి, మీరు ఓ బ్లాగు తప్పక రాయాలి.
ఇలానే మంచి మంచి బ్లాగులు రాస్తుండండి. ఉబుసుపోక రాతలు రాయడానికి నా లాంటి బ్లాగర్లం ఎలానూ వున్నాము :-)
నాగ మురళి అభిప్రాయం:
March 6, 2008 9:41 pm
రవి గారూ, కృతఙ్ఞతలు. తప్పకుండా తిథులగురించి త్వరలో రాస్తాను.
జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:
March 7, 2008 8:46 am
అసమీక్షసమీక్ష్యకారి గారి అభిప్రాయం చదివాను. “భవిష్యత్తు ముందుగానే నిర్ణయమై వుందదని” నేనన్నానంటే, అది ఎటువంటి భవిష్యత్తు? అసమీక్షసమీక్ష్యగారు చెప్పినట్టు విశ్వం గురించా? వాతావరణ శాస్త్ర రీత్యా రెండ్రోజుల్లో తుఫాను వస్తుందని చెబితే, అది నిజమైతే, అలాంటి భవిష్యత్తు గురించా? లేదా సుబ్బారావుకి వచ్చే నెల్లో వుద్యోగం వస్తుందా, రాదా (శుక్రుడు పంచమ దశలో శని వేపు ప్రేమగా చూస్తున్నాడు కాబట్టి) లాంటి భవిష్యత్తా? అన్ని రకాల విషయాలనూ కలగా పులగంగా కలిపేశారు. వార ఫలాల్లో కనబడే భవిష్యత్తులాంటి విషయాల గురించి అంటున్నాను. గ్రహాల కదలికలూ, వాటి స్థానాలూ మానవ జీవితాన్ని సాంఘీకంగా నిర్దేశించే విషయాల గురించి మాట్టాడుతున్నాను. విశ్వం ఎలా వుందో, అది ఏ లెక్కల ప్రకారం ఏ విధంగా మారుతుందో లాంటి విషయాల గురించి మాట్టాడ్డం లేదు.
ప్రకృతికి సంబంధించిన విషయాలు ప్రకృతి శాస్త్రాలకి అనుగుణంగా ఎలా నడుస్తాయో, సమాజానికి సంబంధించిన విషయాలు కూడా సామాజిక శాస్త్రాలకి అనుగుణంగా వుంటాయి. ఈ రెండు రకాల విషయాలూ ఒకదాని మీదొకటి ప్రభావాన్ని చూపించుకుంటాయి. మానవ జీవన విధానం వల్ల జరిగే వాతావరణ కాలుష్యం ప్రకృతి శాస్త్ర విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి.
విషయాలు సరిగా అర్థం చేసుకోకపోతే, మోకాలికి, బోడి గుండుకీ ముడి పెట్టినట్టు వుంటుంది. ఈ అభిప్రాయ వేదికలో ఇంతకన్నా వివరంగా రాయడానికి కుదరదు. ఇప్పటికే ఇటువంటి విషయాల మీద చాలా పుస్తకాలు వున్నాయి.
– ప్రసాద్
Nagas అభిప్రాయం:
March 8, 2008 8:14 am
నాగ మురళి గారు,
ముందుగా మీకు మా ధన్యవాదములు.
మీ సమీక్ష చాలా బాగుంది.
నాగమురళి అభిప్రాయం:
March 10, 2008 8:46 am
తిథులగురించి నా బ్లాగులో ఒక వ్యాసం రాశాను. ఆసక్తి ఉన్నవాళ్ళు చూడవచ్చు. http://nagamurali.wordpress.com
Keshava Swamy అభిప్రాయం:
March 10, 2008 11:02 pm
నాగ మురళి గారికి కృతజ్ఞతలు. మీరు ప్రచురించిన ఈ బ్లాగు చాలా ఉపయుక్తంగా ఉంది. ఎన్నో ప్రాధమిక సందేహాలకు చాలా చక్కటి వివరణ ఇచ్చారు.
ఇక చాలా మంది హేతువాదులు అంటే నాస్తికులు అని అనుకుంటారు, అది ఎంతమాత్రము సమ్మతం కాదు. హేతువు అంటే కారణం, కారణం లేకుండా దేనినీ నంమ్మని వారిని హేతువాదులు అంటారు.
నావికులు సముద్రంలో ప్రయాణించేటప్పుడు గాలివాటం అనుకూలంగా ఉందా లేదా అని చూసుకుని ప్రయాణిస్తారు, అలాగే జ్యోతిష్యం కూడా, మనకు రాబోవు కాలం అనుకూలంగా ఉందా లేదా, దాన్ని బట్టి మన కార్యాచరణను నిర్దేశించుకునే వీలు కల్పిస్తుంది.
జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తు ఖచ్చితంగా తెలుసుకునే వీలుందా అనే ప్రశ్నకు సమాధానం చేప్పాలంటే, ముందుగా అండం తల్లి కడుపులో ఎప్పుడు ఫలదీకరించిందో తెలుకుంటే, ఆ సమయాన్ని బట్టి గణించిన జ్యోతిష్య ఫలితాలు 100% ఖచ్చితంగా ఉంటాయి, కాని అది అసాధ్యం కాబట్టి తల్లి బిడ్డను ప్రసవించిన సమయాన్ని బట్టి గణిస్తాము. అది కూడా చాలా మంది ఖచ్చితమైన సమయాన్ని తెలుపరు దాని వల్ల గణించడంలో తేడాలు ఉంటాయి.
తిరునగరి కేశవ స్వామి.
అక్కిరాజు భట్టిప్రోలు అభిప్రాయం:
March 12, 2008 12:38 am
వ్యాసం చాలా బాగుంది. ఇలాంటి విషయాల్ని మీరు చెప్పినట్టు “గోపి” లా రాయటం చాలా కష్టం. రెండు వైపులా నొప్పించకుండా విషయాన్ని చెప్పిన తీరు, నేర్పు, కూర్పు ఎంచదగినవి!
అభిప్రాయాల్లో జ్యోతిష్యం నించి, శాస్త్రీయంగా ఆలోచించడం దాటి ఆస్థిక, నాస్థికత్వాల దాకా చర్చలు సాగాయి. అది వ్యాసం పండిందంటానికి సూచన.
ప్రస్తుత వ్యాసానికీ, చర్చకీ ఇదెంత సంబంధమో తెలీదుగానీ, NPR లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ చూడండి/వినండి. ఈ వ్యాసం నచ్చిన వాళ్ళకి ఇది కూడా నచ్చుతుందని నా నమ్మకం:
Richard Dawkins: An Argument for Atheism.
అక్కిరాజు భట్టిప్రోలు
నాగమురళి అభిప్రాయం:
March 12, 2008 2:00 am
కేశవ స్వామి గారూ, ధన్యవాదాలు. నిషేక కాలంలో వేసే చక్రాన్ని ఆధాన చక్రం (Pre-Natal Horoscope) అంటారు. నాకు తెలిసినంతమటుకు ఆధాన చక్రాన్ని పుట్టబోయే బిడ్డ లింగనిర్ధారణకి వినియోగిస్తారు. అలాగే జన్మ సమయాన్ని బట్టి వేసే జాతకచక్రం నుంచి వెనక్కి లెక్కలు కట్టి ఆధాన చక్రాన్ని వేస్తారు. ఆ చక్రానికీ, జాతక చక్రానికీ బాంధవ్యం సరిపోతోందో లేదో చూసి దాన్ని బట్టి జాతకుడి జన్మ సమయాన్ని సరిచేసే సాంప్రదాయం ఒకటి ఉన్నది. అయితే నాకు తెలిసినంతవరకూ ఆధాన చక్రాన్నే జాతక చక్రంగా పరిగణించాలన్న నియమం గానీ, సాంప్రదాయం గానీ లేదు.
నాగమురళి అభిప్రాయం:
March 12, 2008 6:43 am
అక్కిరాజు గారూ, మీ ప్రోత్సాహానికి చాలా సంతోషం కలిగింది. కృతఙ్ఞతలు.
జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:
March 12, 2008 7:27 pm
కేశవస్వామి గారు “హేతువాదులు” గురించి నిర్వచనం బాగుంది. కానీ “హేతువాదులు” నాస్తికులు కాదనడం విడ్డూరమైన విషయం. “దేముడు” అనేది ఒక నమ్మకం. దానికి హేతువు లేదు. అంటే దానికి రుజువు లేదు. నమ్మకం ఆధారపడి, హేతువు లేని వాటిని హేతువాదులు అంటే, నాస్తికులు నమ్మరు. ఇక హేతువాదులు అనే పదానికి ఎవరికి వారు వారి కిష్టమైన అర్థం తీసుకుంటామంటే, కాదనేదెవరు. కానీ ఒక హేతువు అనేది కొందరికే హేతువుగా కనబడి (నమ్మకం మీద ఆధారపడిన హేతువు అన్నమాట), కొందరికి హేతువుగా కనబడక పోతే, అది ప్రశ్నించవలసిన హేతువు (అంటే నమ్మకం) అన్న మాట.
వ్యాసకర్త చక్కగా గోడకి ఒకవేపున వుండే రాశారు. “గోపి”లా రాయలేదు. అయితే అది అర్థం అయ్యేవారికే, రెండు వేపులా వున్నట్టు అర్థం అవుతోంది. ఆ మధ్య కధలే ఒక్కోరికి ఒక్కోలా అర్థం అవుతున్నాయనుకున్నాను. కవితలెప్పుడూ అలాగే అర్థం అవుతాయనుకోండీ. ఇప్పుడు వ్యాసాలు కూడా ఒక్కోరికి ఒక్కోలా అర్థం అవుతాయనిపిస్తోంది. ఇంకేం చెప్తాం. వ్యాసకర్త చక్కగా నమ్మకంతో గోడకి ఒకే వేపున వుండి, వివరంగా రాశారు. అది మనకి “ఒకరిని నొప్పించక, తానొవ్వక” అన్నట్టు కనబడితే, అది విడ్డూరమే.
రిచర్డ్ డాకిన్సు గట్టి నాస్తికుడు. జ్యోతిషంతో పాటూ, చాలా వాటిని విమర్శిస్తాడు. కిందటి వారం, ఆయన యూనివర్శిటీ ఆఫ్ బర్కిలీలో లెక్చరిస్తే, వెళ్ళాను. దాని గురించి వ్యాసం రాయాలనుంది, గానీ ఓపికే లేదు. ఈ వ్యాసం నచ్చిన వారికి, డాకిన్సు వ్యాసం నచ్చుతుందంటే అర్థమే లేదు. ఆ లెక్చరు విని వుండాలి, ఆయన ఆస్తికులని ఎంతగా విమర్శించారో తెలియడానికి. వారి నమ్మకాలని, జ్యోతిషంతో సహా, ఎంతగా విమర్శించారో, ఆయన మాటలు వింటే తెలుస్తుంది.
జ్యోతిషం మీద నమ్మకం వున్నవాళ్ళు, ఆ శాస్త్రం గురించి వ్యాసాలు రాస్తే, ఆ విషయం అర్థం అవుతుంది. నాస్తికులని చెప్పుకునే వారు, ఆ వ్యాసాల్ని మెచ్చేసుకుంటూ వుంటేనే విచిత్రంగా వుంటుంది.
- ప్రసాద్
K.S.Hareesh Kumar అభిప్రాయం:
March 20, 2008 9:17 pm
This article is very thought provoking. I hope the author, in his later parts, will explain the claims of “lunar effect”: the claim that many more number of people behave “lunatic” on a full-moon day. The folk wisdom is that since the moon affects the ocean’s tides, it must be so powerful to affect the human body as well (after all, the human body is 80 percent water). I believe that even if we live in a pre-determined world, we may never be able to predict the future accurately, as long as the questions of why and how this universe came into existence and what the purpose of this creation is, remain mysterious to us.
Hareesh
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
March 22, 2008 9:45 pm
వెన్నెల, వెర్రి
KS హరీష్ కుమార్ గారి అభిప్రాయం చదివితే చంద్రుడికో నూలు పోగని శ్రీశ్రీ సమర్పించిన దారంలాంటి తేలికైన దీర్ఘమైన కవిత “శరచ్చంద్రిక” గుర్తొచ్చింది.
“అందుచేత ఓ చందమామా!
అందమైన ఓ పూర్ణసోమా!
సముద్రం మీదా అరణ్యం మీదా
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!
…
చెప్పొచ్చిందేమిటంటే
చెప్పడనికేమీ లేదని!
అంతమందికీ అన్నీ తెలుసు
అదే మన అజ్ఞానం.
ఎవడో చెబితే వినే రోజులు
ఏనాడో వెళ్ళిపోయాయి
ఇంకా ఏదో చెప్పాలని
ఎందుకీ ఉబలాటం?
అసలు నిజం ఏమిటంటే
ఎవడికీ ఎమీ తెలియదు
ఇలా ఎందుకొచ్చామో
ఇక్కడెంత సేపుంటామో
ఇక్కడనుంచి వెళ్ళేదెక్కడికో
ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో
ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి.
చెబితేమాత్రం నమ్మకండి.”
నిరాశగా కాస్సేపు మాట్లాడి, మరో వైపు నుంచి చూస్తే వెలుగు కనబడుతుందంటూ:
“పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలూ
మహాకాశ వాతావరణంలోని
మర్మాలూ తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరకే
ఖరారుగా వస్తాంలే
అప్పుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావుకదూ నువ్వు?”
అని జోస్యం చెప్పి, మానవుడి progress report చదివాడు.
సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమ్మీద వచ్చే సముద్రాల ఆటుపోట్ల గురించి లోతుగా తెలియాలంటే కష్టమేకాని స్థూలంగా అర్థం చేసుకోవడం సులభమే. చంద్రునికి అభిముఖంగా ఉన్న భూమి ఉపరితలంపై ఒక బిందువు A, దానికి ఎదురుగా భూమ్మీద అవతలివైపు B, భూకేంద్రం C అనుకోండి. చంద్రుడు భూకేంద్రం C కన్నా A ని ఎక్కువ గానూ B ని తక్కువగానూ ఆకర్షిస్తాడు — దూరాల్లో ఉన్న తేడా బట్టి. అందుమూలంగా A, B రెండూ కూడా కేంద్రానికి దూరంగా వెళ్తాయి. కాని అవి భూమిలో భాగం కావడాన, భూమి సాగినట్లవుతుంది. దాని ప్రభావమే సముద్రాల్లో ఆటుపోట్లు.
భూగోళం చాలా పెద్దది కావడాన చంద్రుడికీ A, B, C లకీ మధ్య ఉన్న దూరాల్లో చెప్పుకోదగ్గ తేడా ఉంది - ఆ తేడానే ఆటుపోట్లకి కి కారణం. భూమితో పోలిస్తే మాఊరి చెరువు చాలా చిన్నది - దానిపై అన్ని బిందువులూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చెరువుపై చంద్రుడి ప్రభావం ఉండదు. అలాగే మన శరీరంలో ఎక్కువ వున్నది నీళ్ళే అయినా శరీరంలోని అన్నిభాగాలూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చంద్రుడి ప్రభావం మనపై ఉండదు. (ముఖం పాదాలకన్నా దగ్గర ఉంటుంది కాని, మనిషి పొడవు భూమితో చంద్రునితో పోలిస్తే అతి తక్కువగా ఉంటుంది కనుక ఆ తేడాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.)
సమీకరణాలంటే భయం లేని వాళ్ళు ఈ “The Physics Teacher” పేపరు - “Myths about Gravity and Tides” - చదివి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే వెన్నెల ప్రభావాన్ని సమీకరణాలతో అంచనా వెయ్యలేం. అందుకు కవిత్వమే సాక్ష్యం:
“వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
మనోహరమైన సంగీతం వినిపిస్తూ
ప్రయాణించు శశీ ప్రయాణించు.
…
ఇదిగో జాబిల్లీ నువ్వు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలిదాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే.”
కొడవళ్ళ హనుమంతరావు
sathibabu అభిప్రాయం:
April 6, 2008 8:40 am
వాడవల్లి నాగమురళీ కృష్ణ గారు,
మీ మొదటి టపా అద్భుతంగా ఉంది.
నేను మీ రెండవ టపా గురించి ఎదురు చూస్తున్నాను.
సత్తి బాబు.
ravindraBabu అభిప్రాయం:
August 26, 2008 7:49 pm
జ్యొతిష్యము గురించి డిస్కషను బాగుంది కాని జ్యొతిష్యము నమ్మాలి అనే వారికి ఒక్ ప్రశ్న ఒకే రొజు ఒకే time ఒకే place లొ పుటిన వాళు ఒకె రకమయిన జాతకమ్ ఉండదు యెందుకు.
నాగమురళి అభిప్రాయం:
August 27, 2008 12:04 pm
రవీంద్ర బాబు గారూ,
ఈ వ్యాసం రెండో భాగం కామెంట్లలో విష్ణుభొట్ల లక్ష్మన్న గారితో నేను చేసిన చర్చ చూడండి. అలాగే నాలుగో భాగం (సెప్టెంబరు 1 న వెలువడుతుంది)లో కూడా దీనిమీద కొంత చర్చ ఉంటుంది.
నమస్కారాలతో,
నాగమురళి.