ఈమాట » నాకు నచ్చిన పద్యం - పారిజాతాపహరణంలో సత్యభామ

Expand to right
Expand to left

నాకు నచ్చిన పద్యం - పారిజాతాపహరణంలో సత్యభామ

చం. అతుల మహానుభావ మని యవ్విరిఁ దానొక పెద్ద సేసి య
     చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద నిచ్చిన నిచ్చెఁగాక తా
     నతఁడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసినఁ జేసెఁగాక యా
     మతకరి వేలుపుం దపసి మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటన్

పై పద్యం నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం లోనిది. ఈయనకు ముక్కు తిమ్మన అనే మరో ముద్దుపేరు కూడా ఉంది. ముక్కును వర్ణిస్తూ ఆయన వ్రాసిన ఒక పద్యానికి వచ్చిన ప్రసిద్ధి వల్ల ఆయన్ను ముక్కు తిమ్మన అంటారని జనశ్రుతి. కానీ, ముక్కును వర్ణించిన ఆ ప్రసిద్ధ పద్యం పారిజాతాపహరణంలో లేదు. రామరాజ భూషణుడు వ్రాసిన వసుచరిత్రలో ఉంది. కానీ లోకంలో ప్రతీతి మాత్రం ఆ పద్యం తిమ్మకవే వ్రాశాడని. జనంలో ఉండే ఇలాంటి కథలను బట్టి నిజానిజాలు నిర్ణయించడం వీలూ కాదు, న్యాయమూ కాదు.

తిమ్మకవి గూడా కృష్ణదేవరాయల ఆస్థాన కవే. ఆయన సభలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. రాయలవారి చిన్న భార్య అయిన చిన్నాదేవితో పాటు ఆమె పుట్టింటి రాజ్యం నుంచి అరణంగా వచ్చాడంటారు. ఒకరోజు రాత్రి నిద్రపోతుండగా చిన్నాదేవి కాలు రాయలవారి తలకు తగిలిందనీ, దానికి రాజు కోపించి ఆమె దగ్గరకు రావడం మానుకున్నాడనీ, ఆ బాధను ఆమె తిమ్మకవికి చెప్పుకున్నదనీ, భార్య కాలు భర్తకు తగలడం తప్పేమీ కాదని రాయలవారికి అన్యాపదేశంగా చెప్పడం కోసం కృష్ణా-సత్యభామలకు అటువంటి ఘట్టం ఒకటి కల్పించి పారిజాతాపహరణ కావ్యం వ్రాసి సున్నితంగా సరసంగా రాయలవారికి బోధించాడనీ, ఆ సూచనను సహజ సహృదయమూర్తి ఐన రాయలు గ్రహించి తదాది భార్యతో సఖ్యంగా వున్నాడనీ - ఒక ఐతిహ్యం జనంలో ప్రచలితంగా వుంది. పైన మనం చెప్పుకున్నట్లు జనబాహుళ్యం లోని వదంతుల నిజానిజాలు నిర్ధారించటం కష్టమే. ఏమైనా కానీ ఒక చక్కని ప్రబంధ కావ్యం తెలుగు ప్రజలకు దక్కిందనేది మాత్రం నిజం.

‘ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు’ అనేది సాహిత్యప్రియుల వాడుక. నిజమే. పారిజాతాపహరణం లోని ప్రతి పద్యమూ ఆ విషయాన్ని వేనోళ్ళ చాటుతుంది. ఎంత చక్కని కథాప్రణాలిక వేసుకున్నాడో అంత అందంగా ఆ కథను కావ్యంగా మలిచాడు తిమ్మన. కావ్యంలో ఎన్ని ఆశ్వాసాలున్నాయో గిరి గీసినట్లు అన్ని రంగాలుగా విభజించి వొక మంచి నాటకాన్ని పద్యాల్లో రూపొందించాడనుకోవచ్చు. అయితే కొందరు విమర్శకుల ఆరోపణ కూడా ఒకటుంది. ప్రధాన కథ ప్రథమాశ్వాసం లోనే అయిపోయింది, మిగిలిన ఐదు ఆశ్వాసాలూ అనవసరంగా సాగదీశాడు అని. కానీ అది పూర్తి నిజం కాదు. ప్రథమాశ్వాసం తరువాయి భాగాల్లో కవిత్వం గానీ, పద్యాలు గానీ తక్కువ స్థాయివేమీ కావు.

తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే (ఇమేజ్) వేరు. ఏ యితర భారతీయ భాషా సాహిత్యాలలోనూ సత్యభామకు ఈ ఇమేజ్ లేదని తెలిసిన వారంటారు. భర్తను అపరిమితంగా ప్రేమిస్తూ, భర్త నుండి అంతే విపరీతమైన ప్రేమను పొందుతూ, అతనితో చనవులు నెరపుతూ, అవసరమైనప్పుడు అలుగుతూ, కోర్కెలు తీర్చుకుంటూ, అప్పుడప్పుడూ నిష్ఠురాలాడుతూ, భర్త తన కొక్కతికే అనురక్తుడుగా వుండాలని కోరుకుంటూ, అలానే వున్నాడని నమ్మే ఒక ప్రణయమూర్తి, ఒక గడుసు తెలుగు ఇల్లాలు - తిమ్మన గారి సత్యభామ. తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. నాటకాల్లోని ‘మీరజాల గలడా నా యానతి’ లాంటి పాటలకూ, సినిమాల్లో జమున వేసిన సత్యభామ లాంటి పాత్రలకూ అసలు ప్రేరణ తిమ్మన రూపొందించిన పారిజాతాపహరణం సత్యభామే!

కృష్ణుడు ఒకరోజు రుక్మిణి ఇంట్లో ఉండగా నారదుడు వచ్చి ఒక పారిజాత పుష్పం ఇచ్చి నీకు ఇష్టమయిన వారికి ఇచ్చుకోమని చెపుతాడు. తాను అప్పుడు రుక్మిణితో వున్నాడు కాబట్టి కృష్ణుడు ఆ పూవుని రుక్మిణికే ఇస్తాడు. నారదుడు సత్యభామను గురించి, అప్పుడక్కడే ఉన్న సత్యభామ చెలికత్తె వినేట్లుగా కొన్ని ఎకసక్కెపు మాటలంటాడు. చెలికత్తె పోయి ఈ సంగతంతా సత్యభామకు చెపుతుంది. ఇంకేముంది! ‘వ్రేటు వడ్డ ఉరగాంగన యుం బలె, నేయి వోయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ’ లేస్తుంది సత్యభామ. ఆ సమయంలో తన కోపాన్నీ, అక్కసునూ వ్యక్తంచేస్తూ తన చెలికత్తెతో మాట్లాడే సందర్భం లోనిది పై పద్యం. నిజంగానే నారదుడు అలా మాట్లాడాడా అని అడుగుతుంది. అవన్నీ విని ఊరికే వున్నాడా కృష్ణుడు అని అంటుంది. రుక్మిణి ఏమేం మాట్లాడింది అని ఆరా తీస్తుంది.

అసలు తానే కృష్ణుని మహిషులందర్లోకీ ఆయనకు అత్యంత ప్రియమైన దానినని సత్యభామ నమ్మిక. ఒక మంచి వస్తువు ఆయన చేతికి వస్తే దాన్ని తనకే ఇస్తాడని ఆమెకు ప్రగాఢ విశ్వాసం. అలాంటిది, పారిజాతాన్ని తనకీయకుండా తన సవతి కివ్వడం భరించలేక పోతుంది. నారదుడు తన గురించి ఎకసక్కెపు మాటలు మాట్లాడడం - అదీ రుక్మిణి ఎదుట - ఊహించలేని అవమానంగా భావిస్తుంది. పైగా ఈ ప్రహసనమంతా కృష్ణుని ఎదుట జరగడమూ, ఆయన ఔనూ కాదూ అనకుండా ఉండడమూ, పుండు మీద కారం జల్లినట్లయింది. ఇదీ నేపథ్యం పై పద్యానికి.

ఈ పద్యంలో మూడు పనులు స్పష్టంగా ఎత్తిచూపుతుంది సత్య - నారదుడు పూవుని కృష్ణుని కీయడం, ఆయన దానిని రుక్మిణి కీయడం, నారదుడు తనను గేలి చేస్తూ మాట్లాడడం. ఈ మూడూ సత్యకు హృదయ శల్యాలే. నారదుడు పువ్వును కృష్ణుని కివ్వడంలో తప్పేముంది. కానీ కృష్ణుడు దాన్ని రుక్మిణి కిచ్చేసరికి, అసలు పువ్వును తేవడమే తప్పై పోయింది అభిమానవతీ, కోపనా అయిన సత్యకు. ఈ పద్యంలో సత్యభామ మనస్థితి చాలా స్వభావసిద్ధంగా చిత్రితమైంది. నిజానికి పారిజాతం ‘అతుల మహాను భావ’మైనదే. అది అంత గొప్పది కాబట్టే నారదుడు దాన్ని పెద్ద జేసి వర్ణించాడు. మామూలు పువ్వైతే ఎవరిచ్చినా, ఎవరికిచ్చినా ఎవరూ పట్టించుకోవల్సిన పనే లేదు. ‘అతుల మహానుభావమని యవ్విరి తానొక పెద్ద జేసి అచ్యుతునకు ఇచ్చకం బొడవ సూడిద ఇచ్చిన ఇచ్చెగాక’ అని సత్య అనడం అందని ద్రాక్షపండ్ల సామెతను జ్ఙాపకం చేయడమే గాక, ఒక రకంగా ఆ పూవు గొప్పదనాన్ని అంగీకరించి దానిని తనకు కాకుండా తన సవతి కీయడం పట్ల బాధ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పైగా దాన్ని ‘అచ్యుతునకు ఇచ్చకం బొదవ సూడిద’ ఇచ్చాడట. నారదుణ్ణి ఇచ్చకాలాడే వాడిగా తేల్చి పారేసింది. ‘తానతడు ప్రియంబు గల్గు నెడ కర్పణ జేసిన జేసె గాక’ అనడంలో రుక్మిణి ఎడనే కృష్ణునికి ప్రియమున్నది, తన ఎడ లేదు అని కొత్తగా తెలుసుకున్న నిజం వల్ల కలిగే బాధను అనుభవిస్తూనే, కడుపుడుకుతో ‘తన కిష్టమైన వాళ్ళకు ఇచ్చుకుంటే ఇచ్చుకోనీ’ అంటున్నది. ఇవ్వడం కూడా కాదు ‘అర్పణ’ చేయడం అట.

నారదుడు ఆ మాములు పువ్వును ఓ బ్రహ్మాండమైనదిగా వర్ణించి కృష్ణుడి మెప్పు కోసం ఇస్తే ఇచ్చుకోనీ, దాన్ని కృష్ణుడు తనకు నచ్చిన వాళ్ళకు సమర్పణ చేస్తే చేసుకోనీ! కానీ, మాయావి ఐన ఆ దేవ ఋషి, ఆ మతకరి వేలుపుం దపసి (మతకము + అరి మోసకారి) మమ్మల్ని గూర్చి మాట్లాడ్డమెందుకు అక్కడ? ఇదీ ఆమె బాధ.

ఎంత లెక్క లేని తనమో చూడండి, నారదుడన్నా, రుక్మిణన్నా, తనను చిన్న పరచిన కృష్ణుడన్నా. ఈ పద్యంలో ఆ ముగ్గురి మీదా ఎంత తిరస్కారం ప్రకటించిందో గమనించండి. నారదుడు ఇచ్చకాల మారి, మోసకారి. కృష్ణుడి మెప్పు కోసం ఓ మాములు పువ్వును గొప్పజేసి పొగిడిన భట్రాజు. ఇక రుక్మిణి పేరు ఎత్తడం గూడా ఇష్టం లేదు ఆమెకు. ‘తానతడు ప్రియంబు గల్గు నెడకు’ అని రుక్మిణి ఊసు కూడా పరిహరిస్తూ మాట్లాడడం, ఆమెకు రుక్మిణిపై గల చులకన భావం చెప్పకనే చెబుతున్నది. ఇక కృష్ణుణ్ణి తిరస్కారంగా ‘అతడు’ అని సూచించింది, పువ్వుని ‘అర్పణ’ చేశాడు అంది. వాళ్ళపై తిరస్కారమే గాదు, తన అతిశయోక్తి ఎలా ప్రకటించిందో చూడండి. ‘మమ్ము దలంపగ నేల?’ అట. కృష్ణుడేమో ‘అతడు’ తానేమో ‘మమ్ము’ !

ఇలా సత్యభామ మనసు లోకి దూరి, ఆమె మనోభావాల ఛాయాచిత్రంగా పద్యాన్ని చెక్కాడు తిమ్మకవి. సత్య అతిశయమూ, కోపమూ, బాధా, అక్కసూ, తిరస్కారా లన్నింటినీ అద్భుతంగా బొమ్మ కట్టించాడు. పారిజాతాపహరణం లోని ప్రతీ పద్య సమూహమంతా అమృత బిందు సందోహం. అందులో నాకు నచ్చిన చాలా పద్యాల్లో ఒకటైన ఈ పద్యం ప్రథమాశ్వాసం లోనిది.

 

(14 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. మురళి నందుల అభిప్రాయం:

    April 4, 2008 6:47 pm

    మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు సంతోషం. వీలుచేసుకొని, ఆ ముక్కు పద్యాన్ని కూడా వివరించగలరు.

  2. రానారె అభిప్రాయం:

    April 23, 2008 1:51 pm

    ఈ వ్యాఖ్యానం విన్నాక ఈ పద్యం ఎంత శక్తివంతమైనదో తెలుస్తోంది. నాలుగు పాదాల్లో ఎంత స్క్రీన్ ప్లే యిమిడివుందో తెలుసుకొన్నాక చాలా ఆనందం కలిగింది. మొత్తంగా ఈ శీర్షికే మహగొప్పగా వుంది. బృందావనరావుగారికి నమస్సులు.

  3. Lyla yerneni అభిప్రాయం:

    April 25, 2008 9:00 am

    రానారె అన్నట్లుగానే, ఈ పద్య వ్యాఖ్యానం చాలా రసవత్తరంగా ఉంది.

    “తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే (ఇమేజ్) వేరు.”

    పై మాటలూ సబబే.

    తిమ్మ కవి భాగవతం లో లేనేలేని ఘట్టాన్ని కల్పించే ముందే, ” కులమును రూపమున్మగని కూరిమి కలదాననంచు” రుక్మిణి, సత్యభామలు ఇద్దరి మనసుల్లో రవరవలున్నాయని మనకు చెప్పి అప్పుడు పారిజాతప్పువ్వుతో నారద ప్రవేశం చేయించి అందమైన కథ అల్లారు కదా.

    పోతన భాగవతంలో, నరకాసుర వధ తర్వాత సత్యభామతో కలిసి కృష్ణుడు దేవలొకం వెళ్ళి ఆమె అడిగితే నందనవనము నుంచి పారిజాత వృక్షము దొంగిలించి తెస్తాడు. ఒకవేళ ఆయన ఆ పని చెయ్యక పోతే సత్యభామే తెచ్చుకునేది. ఆమె విలువిద్యా కౌశలం ఎంత గొప్పదో నరకసుర వధ సందర్భంగా పోతన మనకు భాగవతంలొ చూపలేదా :-)

    భార్యల మధ్య ఈసు అంటారా - విశ్వనాథ వ్రాసిన పీఠికలో చెప్పినట్లు, - కృష్ణుడి విషయంలో అది కొద్దిగా నమ్మటం కష్టం. భాగవతంలొ నరకాసుర వధ తర్వాత చెరసాల్లో ఉన్న పదహారు వేల రాజకన్యలను విడిపించి వారికి ఎన్నెన్నో బహుమానాలిచ్చి, వాళ్ళను ద్వారక పంపించి అప్పుడుకదా ఆయన ఇంద్రుడిని చూడ్డానికి వెళ్ళింది. ఆ తతంగమంతా చూసి, అప్పుడు గరుత్మంతుడినెక్కి, ఆయనతో ఇంచక్కా వెళ్ళిన సత్యభామకు, అంత ఈసు ఎక్కడినించి వస్తుంది చెప్పండి. అదీ ఒక్క పూవు గురించి.
    ఐనా తిమ్మన కవి కథ మార్చి,-సవతిని గూర్చి నారదుడి రెచ్చగొట్టే మాటలు, చెలికత్తె అవి చేరవేసినప్పుడు కలిగే చిన్నతనం - వాటినుంచీ కథ పెంచుకుంటూ రసవంతంగా కథ నడిపారు.

    ‘ తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. ”

    తెలుగు సినిమాల్లో ఆ నీరసపు నటి శ్రీరంజనితో రుక్మిణి పాత్ర వేయించి, రుక్మిణి ఇమేజ్ పాడు చేశారు. పోతన భాగవతం చదివితే ఒక చక్కని ధీర ప్రణయిని, ఆదర్శనీయమైన కథానాయిక - అసలు రుక్మిణి కనబడుతుంది గదా.

    లైలా

  4. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    April 25, 2008 11:34 am

    లైలా గారూ,

    ‘ తులసి దళం చేత్తో పట్టుకుని, పతిభక్తి అనుకుంటూ పాదసేవలూ, పూజలూ చేసే రుక్మిణి లాగా వుండే సత్యభామను తెలుగువారు అంగీకరించలేరు. ” అని రాసారు. మన తెలుగు సినిమా వాళ్ళ దౌర్భాగ్యం వల్ల రుక్మిణి అంటే పళ్ళెంలో తులసీ దళం, వీలున్నప్పుడల్లా కృష్ణుడి పాదాభివందనం, తల దించుకుని ఒద్దిక గా ఉన్న స్త్రీ గా చూపించారు. ఇది కేవలం సత్యభామని తలబిరుసున్న వ్యక్తిగానూ, రుక్మిణి అంటే సాత్వికంగానూ చూపించి పాత్రల మధ్య విభిన్నత చూపించే ప్రయత్నంలో రుక్మిణి పాత్రని ఖూనీ చేసి పడేసారు. రుక్మిణి చాలా ధైర్యవంతురాలే కాదు, అనుకున్నది సాధించే గంభీరమైన వ్యక్తిత్వ మున్న స్త్రీ!
    తను నమ్మిన దానికోసం కన్న వాళ్ళని ఎదిరించి కృష్ణుణ్ణి యుద్ధానికి ప్రేరేపించి, ఎవరికీ తలవంపు లేకుండా కార్య సిద్ధి కావించిన ధీర వనిత.
    సినిమాలు చేసే చెడ్డల్లో ఇదొకటి. తీసేవాళ్ళు చదవరు. చదివే వాళ్ళు తీయరు. అందుకే ఈ అపోహలని నా అభిప్రాయం.
    రామాయణంలో కౌసల్య ని కూడా రుక్మిణిని కట్టిన గుంజకే కట్టి పడేసారు. కౌసల్య కి కైక అంటే పీకల వరకూ మంట. ఇది కైక వరాలు అడగక ముందు నుంచీ ఉన్నదే! వాల్మీకి రామాయణం మూలం చదివితే అర్థం అవుతుంది మిడిమిడి జ్ఞానంతో మన సినీ ప్రియులు చేసిన కావ్య హత్యలు.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  5. రానారె అభిప్రాయం:

    April 25, 2008 6:21 pm

    >> “తను నమ్మిన దానికోసం కన్న వాళ్ళని ఎదిరించి కృష్ణుణ్ణి యుద్ధానికి ప్రేరేపించి, ఎవరికీ తలవంపు లేకుండా కార్య సిద్ధి కావించిన ధీర వనిత.”

    కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వరకూ సరే అయినా, ఆమె పుట్టినింటివారికి తలవంపులు మాత్రం తప్పలేదు కదా! రుక్మిణిని కృష్ణుడు రథమెక్కించి తీసుకెళ్తున్నాడన్నవార్త విన్న ఆమె బంధువులు కుతకుతలాడిపోతూ, తమకు రోషాలు నూరిపోసుకంటూ కృష్ణుణ్ణి నిలువరించడానికి సమాయత్తమయ్యే సన్నివేశంలోని ఒక పద్యం …

    ఘనసింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్ బాలఁ దోడ్కొని గోపకుల్ చనుచున్నారదె, శౌర్యమెన్నటికి? మీ శస్త్రాస్త్రముల్ కాల్పనే? తనుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్!?
    (పద్యం నాకు సరిగా గుర్తులేక తప్పులు దొర్లి వుండవచ్చు… )

    యాదవులు తమ కంటే తక్కువవారని భావించే ఈ ‘ఘనసింహంబులకు’ రుక్మిణి తలవంపులు తెచ్చినట్లేకదండీ?

  6. ఎన్‌. వి. రాయ్‌ అభిప్రాయం:

    April 25, 2008 10:09 pm

    ” కౌసల్య కి కైక అంటే పీకల వరకూ మంట. ఇది కైక వరాలు అడగక ముందు నుంచీ ఉన్నదే! వాల్మీకి రామాయణం మూలం చదివితే అర్థం అవుతుంది మిడిమిడి జ్ఞానంతో మన సినీ ప్రియులు చేసిన కావ్య హత్యలు. ”

    అయ్యా, బ్రహ్మానందంగారూ! నాకు వాల్మీకి బాగా తెలీదు. అందుకని ఈ ప్రశ్న.

    ఈ పై పేరగ్రాఫు నాకు సరిగా బోధపడలేదు. కౌసల్యకు కైక అంటే పీకలవరకూ మంట, కైక వరాలు అడగకముందునుంచే ఉండటం వాల్మీకిలో ఉన్నదా? లేక సినిమాలవాళ్ళు తయారు చేసారా? మూలంలో కౌసల్యావిలాపలోఅన్న భాగంలో మాత్రమే కైకేయిని కౌసల్య దూషణభాషలాడుతుంది. అది సహజమేకదా! కొడుకుని, కోడలినీ అడవులకి తోలేస్తే, కైకని కావలించుకొని అందలానికెక్కిస్తుందా? అప్పుడు తప్ప, కౌసల్యకి పీకలవరకూ కైకపై కోపం వరాలు అడగకముందునుంచీ ఉన్నట్టు వాల్మీకిలో ఎక్కడ ఉన్నది? ఒకవేళ అది సినిమాలవాళ్ళు సృష్ఠిస్తే, అదే మీ ఉద్దేశం అయితే, మీరు రాసిన పేరగ్రాఫులో మాత్రం ఆ సూచన సూటిగా రాలేదు. మీరువేసిన ఆశ్చర్యార్థకం(!) లో గూఢంగా ఆ అర్థం ఉంటే మన్నించగలరు, మరియూ దయచేసి వివరించగలరు.
    విధేయుడు,
    ఎన్. వి. రాయ్

  7. Lyla yerneni అభిప్రాయం:

    April 26, 2008 4:47 pm

    రానారె అన్నారు:
    “యాదవులు తమ కంటే తక్కువవారని భావించే ఈ ‘ఘనసింహంబులకు’ రుక్మిణి తలవంపులు తెచ్చినట్లేకదండీ? ”

    కాదండి. మన్నించాలి.
    ‘ఘనసింహాలు’ రుక్మిణి పుట్టింటి వాళ్ళు కారండి. వాళ్ళు శిశుపాలుడు, జరాసంధాది రాజులు. యదు సేనల చేతిలో బాగా దెబ్బలు తిని పారిపోతూ ఆ రాజులు శిశుపాలుడికి;

    *
    బ్రతుకవచ్చు నొదల బ్రాణంబు లుండిన
    బ్రతుకు గలిగెనేని భార్య గలదు
    బ్రతికి తీవు భార్యపట్టు దైవ మెరుంగు
    వగవవలదు చైద్య! వలదు వలదు.

    అని చెప్పేసి, వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు.
    ఒకవేళ అంతకుముందు బలాబలాలు గురించి ఏమనుకున్నా, అప్పటికి యాదవులదే పై చేయి అని తేలింది.
    శిశుపాలుడికి ఇంకా నయం రుక్మిణి నివ్వలేదు. ఆమె కృష్ణుడిని ఎంచుకుని మంచి పని చేసింది, అని రుక్మిణి పుట్టింటి వాళ్ళు అప్పటికైనా తప్పు గ్రహించుకుని , లెంప లేసుకుని ఉండరూ.

    లైలా

    * ఈ పద్యమూ పోతన భాగవతము నుంచే.

  8. Kameswara Rao అభిప్రాయం:

    April 27, 2008 7:27 am

    రాముడు అడవికి వెళతానని తల్లికి చెప్పినప్పుడు మొదటిసారిగా కౌసల్య తన దుఃఖాన్ని బయట పెడుతుంది వాల్మీకంలో.
    “నా భర్త రాజుగా ఉన్న ఇన్ని రోజులూ నేను ఎలాటి సుఖాలూ పొందలేదు. కనీసం నువ్వు రాజువయ్యాకైనా పొందుతాననుకున్నాను! నా సవతులనించి నేనెన్ని దుర్భాషలు విన్నాను పట్టమహిషినై కూడా! నా భర్త నాకు ఏ స్వాతంత్ర్యమూ ఇవ్వక చాలా తక్కువగా చూసేవాడు. కైకేయి దాసీజనం కన్నా హీనంగా నన్ను చూసేవాడు”. ఈ మాటలబట్టి కౌసల్యకి చాలా రోజులుగానే మనసులో ఆవేదన, కైకేయి అంటే ఈర్ష్యా ఉన్నాయనే అనిపిస్తుంది. ఈ మాటలనేటప్పటికి రాముడు కైకేయి వరాల వల్లే అడవికి వెళుతునాడన్న విషయం తెలుసని కూడా చెప్పలేం.

  9. N. V. Roy అభిప్రాయం:

    April 27, 2008 9:10 pm

    కామేశ్వర రావు గారికి అబివాదాలు.
    నిజమే! కౌసల్యతో రాముడు తాను దండకారణ్యానికి వెళ్ళుతున్నానని చెప్పినపుడు, కౌసల్య ఆడినదుర్భాషలు దశరథుడు తనని ఏ విధముగా చూచెడివాడో చెప్పినది. ఆమె కోపముగా చెప్పిన మాటలలో కైకేయిని దూషిస్తున్న అర్థం ఎక్కడ వున్నది? తనని, దశరథుడు కైకేయియొక్క దాసజనముతో సమానముగా, అంతకంటె తక్కువగా చూచెడివాడని అన్నది. పోతే, కైకేయిపై ఈర్ష్య ఉండడం సహజమే! తాను పట్ట మహిషి. కైకేయి చిన్న భార్య. దశరథుడి ముద్దుల భార్య. బహుభార్యాసమాజంలో్సవతులపై ఇటువంటి ఈర్ష్యలు ఉండడం సహజమే కద!
    మీరు రాసిన ఆఖరి వాక్యం మీ స్వంత వ్యాఖ్య. వాల్మీకిలో లేదు కాబట్టి, దానిపై నేను వ్యాఖ్యానించను. పోతే, తన గోడు చెప్పుకుంటూ,
    సా బహూన్య మనోజ్ఞాని వాక్యాని హృదయఛ్చిదాం,
    అహం శ్రోష్యే సపత్నీ నామవరాణాం వరా సతీ. అని వాపోయింది. ఇందులో అందరు సవతులూ తనని అనే ఎన్నో చెడ్డ మాటలు వినవలసి యున్నది, అన్న అర్థం ఉన్నదికదా! ఆవిడకి సవతులందరూ ఒకటే! కైకేయిపై ఆవిడకి పీకలవరకూ మంట అనే భావం నాకు పట్టలేదు.

    విధేయుడు,

    యన్. వి. రాయ్

  10. Sai Brahmanandam Gorthi అభిప్రాయం:

    April 28, 2008 1:01 am

    ఎన్. వి. రాయ్ గారూ

    కౌసల్యకి కైక అంటే కిట్టదు. కారణాలు అనేకం. కానీ పైకి చెప్పదు కూడా. తన మనసులో ఉన్నది మొదటి సారి చెప్పింది రాముడికే! అదీ కాసింతే! దశరధుడు పోయాక మొత్తం కసి వెళ్ళ్గక్కుతుంది. సుమిత్ర దగ్గర కూడా కైకని ఆడిపోసుకుంటుంది.
    అది దృష్టిలో ఉంచుకునే రాసాను( ఆ భావం రాలేదేమో)
    ” కౌసల్య కి కైక అంటే పీకల వరకూ మంట. ఇది కైక వరాలు అడగక ముందు నుంచీ ఉన్నదే! వాల్మీకి రామాయణం మూలం చదివితే అర్థం అవుతుంది మిడిమిడి జ్ఞానంతో మన సినీ ప్రియులు చేసిన కావ్య హత్యలు.” అన్న ఈ రెండు వాక్యాలూ రెండు పేరాలుగా రాసి ఉండాల్సింది. ఇందులో రెండో వాక్యం సినిమా వాళ్ళకి చెందుతుంది. కౌసల్య అంటే సాత్వికురాలిగా చిత్రీకరించార న్నదే నా అభిప్రాయం.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  11. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    April 28, 2008 8:08 am

    వి.ఎన్.రాయ్ గారూ,

    కైకేయిపై ఆవిడకి పీకలవరకూ మంట అనే వాక్య ప్రయోగం నేను సరిగ్గా రాయలేదు. మంట అనకుండా అక్కసు అని రాసుంటే బాగుండేదేమో అనిపించింది. ఈ కావ్యాలూ, పురాణాలు చదివినప్పుడు ఎవరి దృక్పథంలో వాళ్ళు ఆలోచిస్తారు. ఒక్కోసారి మన అభిప్రాయాలు మూలాలపై ఆక్రమణ చేస్తాయి. మరోసారి వాల్మీకి రామాయణం తిరగేసి నా వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

    -సాయి బ్రహ్మానందం్ గొర్తి

  12. జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:

    April 29, 2008 6:44 am

    కౌసల్య అంతపురంలో పంజరం లోని పక్షులు ఎలా కైకని దూషిస్తాయో తెలియజేసే వర్ణన కూడా వాల్మీకి మూలంలో వుంది. అంటే సవతుల మధ్య వైషమ్యాలు మొదటి నించీ వున్నాయనే అర్థం. ఈ రోజుల్లో లాగా పూర్వకాలంలో సవతులు సఖ్యంగా వుండే వారు కాదు. పల్లెటూర్లలో స్త్రీలు, తమ భర్తలు చేరదీసిన స్త్రీలకి కళ్ళు పోతే, వెంకన్న స్వామికి వెండి కళ్ళు చేయిస్తామని మొక్కుకున్న సంఘటనలు వున్నాయి. భర్తలని అనడం, వాళ్ళని కంట్రోల్ చెయ్యడం చేతగాక, భర్తలు చేరదీసిన స్త్రీల మీద అక్కసు చూపించుకోవడం జరుగుతుండేది. ఈ రోజుల్లో అయితే, ఇద్దరు భార్యలున్న ఓ విప్లవ కవి, చక్కగా చెరో భార్య భుజం మీదా చెరో చెయ్యీ వేసి, ఫొటో తీయించుకుని, పత్రికలో వేయించుకుంటాడు. అనేక కారణాల వల్లా ఆ సవతులిద్దరూ, ఎంతో సఖ్యతతో ఒదిగి మదిగి వుంటారు ఫొటోలో. పాత కాలంలో అలా కాదు మరి.

    ప్రసాద్

  13. రానారె అభిప్రాయం:

    April 29, 2008 7:34 am

    యెర్నేనిగారూ, కృతజ్ఞతలు. ‘ఘనసింహంబుల’ పద్యాన్ని నేను తప్పుగా వుటంకించాను.

    రుక్మిణి సోదరుడు రుక్మి “గోపాలకా, వెన్నదొంగా” -అంటూ కృష్ణుని వెంబడించి, “కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువవేని…” అని బెదిరించడం, ఆతరువాత కృష్ణుడు రుక్మిని చంపబోతే రుక్మిణి వచ్చి, “ముకుందుడు మాకు అల్లుడయినాడని సంతోషించు నాతల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించకుమ”ని ప్రాధేయపడటం, కృష్ణుడు దయదలచి రుక్మి తలవెండ్రుకలు, గడ్డము,మీసాలను పాయలుపాయలుగా ఖండించడం … ఇది తలవంపులపనే కదా!

  14. వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    April 29, 2008 9:29 am

    పోతనగారు చాలా చాకచక్యంతో “నీవు గుణరహితుండవు” అని వ్యాజస్తుతి చేశారు. మఱిన్ని వివరాలకై దివాకర్ల వేంకటావధానిగారి “పోతన వ్యాజస్తుతి-వ్యంగ్య వైభవము” అన్న వ్యాసమును “భాగవత వైజయంతిక” లో చదువవచ్చు.

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a