ఈమాట » నడిమి వయసు యిడుములు

Expand to right
Expand to left

నడిమి వయసు యిడుములు

సీ. పూర్వజులెడకల్గు పూజ్యభావములకు
        ముందుతరముపైని మురిపెములకు
సాంప్రదాయమునిల్ప జరుపు పర్వములకు
    యువతరంబులు యూగు యుత్సవముకు
గతపు నెమరువేత కదలు ధోరణులకు
    భావియూహాజగద్భావనలకు
పందెమ్ము పంతమ్ము బాయునలసటకు
    గెలుపుకై పరుగుల గెంతులకును

తే.గీ. విరమణముల కెదురు చూచు విసుగులకును
       నిరత వ్యస్తత నాశించు చురుకులకును
       నడుమ నిదమిధ్ధ మవనట్టి తడబడులవి
       నడిమి వయసు నడలు కావు నుడువ నలవి

సీ. వేళమించిగుడువ వేధించెడి వయసు
      ఒకపూటె భుజియించ నుత్తమంబు
ఒడలుశ్రమపడగానోర్పలేని వయసు
     కాలినడకలెంతొ మేలు గూర్చు
గాయమ్ము శీఘ్రమ్ము మాయనట్టివయసు
    స్వస్థసూత్రానుశాసనమె సుఖము
జాగరమ్ములు సల్ప జాలనట్టి వయసు
    సమయాన నిదురలే సబబు లిపుడు

తే.గీ. ప్రాకులాటలికపయిన బాయ, వయసు
       తగిన మోతాదులోనుండ దగిన వయసు
       శేష జీవనమ్మంత సంతోషముగను
       గడుప సన్నాహమె గద యీ నడిమి వయసు

సీ. తుళ్ళుతు త్రెళ్ళెడి దోరవయసు గాదు
       వంగివణ్కెడిపెద్ద వయసు గాదు
సర్వమాస్వాదించు జవ్వనమిదిగాదు
    చవులుడిగినముదుసలినె? గాదు
ఆయువెంచగబోని ప్రాయమా యిది గాదు
    కాటికి కాల్జాపు కాలమవదు
జడుపు బెరుకులేని పడుచునసలుగాను
    మరణభయముతోడ జరుడ గాను

తే. గీ. బాధ్యతస్పృహలటలేని బాటగాదు
       భారమింకమోయగలేని స్వారి గాదు
       భావిగతములకుచెడిన రేవడిగతి
       మధ్య వయసున పడ్డటి మనుజుని గతి

సీ. వృధ్ధులయినవారి పధ్ధతి కూకొట్టి
      వర్ధమానులకును వార బెట్టి
పాతకాలపువారి సేతల తెగడక
    యవ్వనోత్సాహాంబు కడ్డుపడక
సాంప్రదాయమ్ముల సాగించి భక్తిగ
    కొత్తదారికనువు గూర్చి చనగ
శాస్త్రోక్తవిధముల ఛాందసములనక
    యువకుల ప్రశ్నల చవక గనక

తే.గీ. పాత కొత్తల కలిపెడి సేతు వవగ
      పిన్నపెద్దతరములకభిన్నమవగ
      రెండుభాషలనందునుద్దండులవగ
      నడిమి వయసు కత్తిపయిన నడక! నరుడ!

 

(2 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. phaNi DokkA అభిప్రాయం:

    January 10, 2008 4:21 am

    సూర్యనారాయణగారూ,
    చాలా బాగున్నది ఈ పద్య మాల. చక్కని ఇతివృత్తం, పొందికైన
    మాటల ఎంపిక. ఇలాంటివి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది,
    తెలుగు పద్యం ఇంకొన్నాళ్ళు జీవిస్తుందని..
    అభినందనలతో,
    డొక్కా ఫణి

  2. prabhala l k sastry అభిప్రాయం:

    February 21, 2008 4:02 am

    హర్షనీయ మాట - సూర్యనారాయణగారు మీరు వ్రాసిన పద్య
    సంకలనం మెచ్చుకో తగ్గది.. మీ రచనా శైలి పూర్వం తెలిసిన వాడిని ,
    అయినా ప్రశంసించడం వ్యక్తిగతంగా తలుస్తున్నాను . మీరు
    ముంబయి నుండి పాశ్చాత్య దేశంలో నలస ఏర్పర్చుకున్న
    తర్వాత ఈ కవిత వెబ్ లో చదివాను . కవికి సృజనాత్మక
    ప్రతిభ అవసరం అనే మాట చెప్పినట్లు మీరు నిజంగా భావుక
    పండితులు .
    ఇట్లు , పి. ఎల్. కె. శాస్త్రి

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a