బైపోలార్ భూతం
రెండు వీధుల మధ్య వారధులం మేవు
నిక్కర్ల రోజుల్నుంచి, పైటల్ని చూసి పరవశించే రోజుల్లోంచి
నడివయసు తుఫాను ముంగిటదాకా
రెండు దేశాల మధ్య వారధులం మేవు
కొండల్ని, కోనల్ని, సముద్రాల్ని,
భాషల్ని, భావాల్ని, భేదాల్ని,
దాటి ఎగిరిన రెండు స్వేఛ్చా విహంగాలం మేవు
మనసులో ఏమూల్లో ఎక్కడ పుట్టిందో
ఈ బైపోలార్ భూతం, వాడి
మెదడుని చెర పట్టింది
స్వేచ్ఛని బిగ పట్టింది, మనసు
సునామీలా ఎగిసి పడడం తప్ప
సముద్రంలా తుళ్ళి పడడం నిలిపేసింది
వరదై పొంగి పొర్లటం తప్ప
వానై నాట్యమాడటం మానేసింది
ఎగిరితే ఆకాశంలో సూర్యుడిలా వెలుగుతాడు
జారితే పాతాళంలోకి బుడుక్కని మునుగుతాడు
వికాటాట్టహాసం, గుండెకి శరాఘాతం తప్ప
చిరునవ్వుని, కంటతడిని ఎక్కడో
మనసు లోతుల్లో పారేసుకున్నాడు,
వాటికోసం మందులతో తన
మెదడు చుట్టూ పంజరం కట్టుకున్నాడు
తన మనసు రెక్కలు తానే కోసుకున్నాడు
Poolavari Venkanna అభిప్రాయం:
November 4, 2007 1:50 pm
ఈ వ్యాధితో బాధ పడేవాళ్ళని, కొద్దిమందిని నేనెరుగుదును. వారి ప్రవృత్తిని పద్యం చక్కగా చెప్పింది. వర్తమాన సమాజంలోని ఆటుపోట్లు, ఒత్తిళ్ళు కొంత వరకు కారణం కావచ్చు. పల్లె పట్టున వ్యవసాయం చేసుకుంటూ, నిదానమైన జీవనాన్ని, సామాజిక మార్పుల వల్ల మనం చాలా మందిమి కోల్పోయాము.
Vaidehi Sasidhar అభిప్రాయం:
November 9, 2007 12:16 pm
బైపోలార్ రుగ్మత తో బాధింపబడే వారి మానసిక స్థితిని,పరస్పర విరుద్ధమైన,విపరీతమైన, భావసంచలనం తో మస్తిష్కంలో ఏర్పడే సంక్షోభవాతావరణాన్ని, ఈ Malady ముందు బాధితుని నిస్సహాయతని కవిత చివరి పది,పన్నెండు పంక్తులలో effective గా చిత్రీకరించారు.
అభినందనలు.
baabjeelu అభిప్రాయం:
July 6, 2008 4:02 am
అద్భుతవయిన భావవ్యక్తీకరణ ఉన్న కిరణూ, డైరెక్టుగా అనుభవించినదాన్ని చక్కగా పద్యంకట్టగలిగేవు. ఇంతకుముందు పద్యాల్లో అనుభూతి ఇలాటిది కాదని నా నమ్మకం. వాటిని కూడా ఇంత చక్కని పద్యాల్లా రాయాలంటే కష్టపడాలి. అలవోకగా మంచి పద్యాలు రాసెయ్యగలగడం అరుదు. ఘంటసాలయినా కొత్తపాటని “ఓక్క సుట్టుకే” ఘంటసాల లా పాడలేడు.