కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే …
4.
మరి ఇంతకాలం విమర్శకులు ఈ నాటకాన్ని ఎందుకు సరిగా అర్థం చేసుకో లేకపోయారు? ఈ నాటకం సమాజం కుళ్ళిపోయిందని, సంస్కరణే శరణ్యమని ఉద్బోధ చేస్తున్నదని ఎలా చూశారు?
ఇందుకు నారాయణరావుగారు నాలుగు ముఖ్య కారణాలు చెప్పుతున్నారు. మొదటి కారణం : ఈ నాటకం మొదటి ప్రచురణ - దాని ప్రదర్శన (1892) కి సంబంధించిన సందర్భం. రెండవ కారణం : ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వలస రాజ్య ప్రాబల్యంవల్ల వచ్చిన సమకాలీన సాహిత్య రాజకీయ వాతావరణం. మూడవ కారణం : తెలుగు రచయితలపై, ఆధునిక విద్యావంతులపై టాగూరు గారి ప్రబల ప్రభావం. నాలుగవ కారణం : మార్క్సిస్టులు వాళ్ళ సాంఘిక రాజకీయాలకోసం ఈ నాటకాన్ని స్వంతం చేసుకోవడం.
మొదటి కన్యాశుల్కం నాటకం విజయనగరం మహారాజావారి సంఘసంస్కరణాభిలాష కై రాయబడింది. ఆ పుస్తకంలో రాసిన ఉపోద్ఘాతం, అంకితం వాక్యాలు, విద్యాధికులలో చెరగని ముద్ర వేశాయి. తరువాత అప్పారావు గారు (1909) రెండవ కన్యాశుల్కం రాసారు. ఇదే మనందరికీ అందుబాటులోకొచ్చిన నాటకం. ఇందులో, ఆయనకి అర్థమైన సమాజ పరంగా చాలా మార్పులు ఉన్నాయి. నిజంగా మొదటి కన్యాశుల్కానికీ, రెండవ కన్యాశుల్కానికీ చాలా తేడాలున్నాయి. ఆయన, ఎక్కడా ఈ రెండవ కన్యాశుల్కం ‘ఎల్లా చదవాలో’ చెప్పలేదు. అక్కడక్కడ ఉత్తరాలలోను, డైరీలలోను చిన్న చిన్న సూచనలు చేసి ఊరుకున్నాడు. నాటకం పేరు ఒకటే. మొదటి నాటకానికి రాసిన ఉపోద్ఘాతం, అంకిత పత్రం, మహారాజాగారి బొమ్మ, అన్నీ అలాగే ఉంచారు. రెండవ ఉపోద్ఘాతంలో భాషగురించే ఎక్కువగా రాసారు. బహుశా ఆయన అప్పటికి ఇంకా విజయనగర ఆస్థానంలో ఉద్యోగిగా ఉండడమే కారణం కావచ్చు.
వలస రాజ్య సంస్కృతి వలన ప్రభావితమైన ఆధునికోద్యమం ఈ నాటకం మరోవిధంగా చదవడానికి ప్రేరణ చేసి ఉందకపోవచ్చు. వీరేశలింగం ప్రభృతులు చాలా పలుకుబడిగలవారు. ఇంగ్లీషు చదువులు చదుకున్నవాళ్ళు ఆయన పూనుకున్న సంస్కరణోద్యమానికి జోహార్లర్పించడం జోరుగా ఉండేది. సంప్రదాయ పండితులు రెండవతరగతి పౌరులయ్యారు. టాగూరు గారి ప్రభావం తెలుగు కవులమీద విపరీతంగా పడింది. పాతంతా రోత అయి, అమలిన శృంగారం పేరుతో, భావకవిత్వం ఉర్రూతలూగించింది. టాగూరు వలస కాలపు సాహిత్యానికి, సంస్కృతికీ ప్రతినిథి. విశ్వకవి అనడంతో, అప్పారావుగారి వంటి దూరదృష్టి ఉన్న విజ్ఞులకి సాంస్కృతిక సాహిత్య రంగాలలో చోటులేకుండా పోయింది. క్రిష్టియన్ నీతులు, విక్టోరియన్ విలువలూ తెలుగు దేశ విద్యావంతులపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. అదే సమయంలో, వీరేశలింగంగారు మధ్యయుగ తెలుగు సాహిత్యాన్ని అశ్లీలంగా పరిగణించి వాటిపై ఘాటైన విమర్శలు రాసారు. కేంబ్రిడ్జ్ లో చదువుకున్న రామలింగారెడ్డి గారు సాహిత్యరంగంలోకి దూకి వలస కాలానికి పూర్వం వచ్చిన ప్రబంధసాహిత్యం పై దుమారం లేవదీశారు
మార్క్సిస్టులు కన్యాశుల్కాన్ని తమదిగా చేసుకోవటంతో ఆ నాటకానికి మరొక వ్యాఖ్య రాకండా పోయింది. మార్క్సిస్టు విమర్శకులు సమాజానికి వేశ్యల వల్ల వచ్చే అనర్థాలకి ప్రతీకగా మధురవాణిని చిత్రించి, ఆ పాత్ర ద్వారా సంస్కరణకి దోహదం చెయ్యాలని మొదలుపెట్టారు. 20 వ శతాబ్దంలో, అభ్యుదయ రచయితల సంఘం (మార్క్సిస్టుల సాహిత్య శాఖ) ఈ నాటక రచయితను సమాజ పరివర్తనకి దోహదకారిగా, ఫ్యూడల్ వ్యవస్థకి వ్యతిరేకిగా, వేశ్యావృత్తి నిర్మూలనకి నిబద్ధుడిగా చిత్రించడం మూలంగా మరొక గొంతు వినపడటానికి తావులేకుండా పోయింది.
గిరీశం మోసగాడుగా, మధురవాణి చదువు, సంస్కారం, మంచిహృదయం ఉన్న వేశ్యగా, పరివర్తన పొందటానికి సుముఖంగా ఉన్న దానిగా చిత్రించడం, అగ్నిహోత్రావధానులునీ, లుబ్ధావధానులునీ, క్షీణదశలో ఉన్న బ్రాహ్మణ సంస్కృతికి ప్రతీకలుగా చిత్రించి మూక ఉమ్మడి ప్రచారం చెయ్యడం జరిగింది.
అప్పారావుగారు వీరేశలింగంగారి సంస్కరణలతో పూర్తిగా ఏకీభావం చూపించే వ్యక్తిగా చిత్రించబడ్డాడు. ఆ సాహిత్య వ్యక్తిత్వం ఈ ‘సంస్కరణ’ పరిధిలో పడి తిరిగి బయటికి రాలేదు.