కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే …

3.

కన్యాశుల్కం నాటకం ఏకార్థకం (monologic) కాదు. అది బహ్వర్థకం (polyphonic). ఏకార్థకంలో ఉన్న రచనల్లో రచయిత పాత్రల జీవన పద్ధతిని నిర్దేశిస్తాడు. వారందరి గొంతుకా అతనిదే! అట్లా కాకండా బహ్వర్థక రచనల్లో పాత్రలనుండి మనం రచయిత గొంతు వినం. పాత్రలు తమదైన స్వంత గొంతుతో తమ ప్రపంచంలో ఉండి మాట్లాడుతాయి. అంటే, రచయితకి ఏ విధమైన స్వతంత్రతా లేదని కాదు. ఈ పాత్రలన్నీ రచయిత తయారు చేసినవే! అయితే, ఈ పాత్రలన్నీ రచయిత వాక్కుతో సమాన స్థాయిలో మాట్లాడుతాయి. అంటే, స్థూలంగా, బహ్వర్థక రచనలో ఒకే ఒక్క సందేశం ఉండదు.

మన సాహిత్యంలో బహ్వర్థక రచనలు లేక కాదు. మహా భారతం, రామాయణం, బహ్వర్థక రచనలే! అవి బహ్వర్థక రచనలు కాబట్టే రకరకాల కోణాలనుంచి రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. ఒక్కొక్క సారి, కొన్ని కొన్ని వ్యాఖ్యలు, మూల గ్రంథ రచయిత “ఉద్దేశించిన” అర్థానికి ” వ్యతిరేకంగా ” కనిపించే అవకాశం ఉన్నది. మన ఋషులు రాసిన మహాకావ్యాలలో, పురాణాలలో బహ్వర్థకత్వం పాఠకులు గుర్తించినా, అప్పారావు గారు బహ్వర్థక రచన చేయగల సమర్థులు అనే ధ్యాస ఆ పాఠకులకి కలగక పోవచ్చు.

అప్పారావుగారి కన్యాశుల్కం నాటకంలో బహ్వర్థకంకి ఉదాహరణగా, నారాయణ రావు గారు ఏడవ అంకం ఆఖరి రంగం తీసుకొని వ్యాఖ్యానించారు. నిజానికి ఈ భాగం ఎవరికి వారు చదివి ఆకళింపు చేసుకొని ఆనందించ వలసిన భాగం. క్లుప్తంగా ఆభాగం గురించి వివరిస్తాను.

మదురవాణి మగవేషంలో ఎవరి అనుమతీ లేకండానే సౌజన్యారావు గారి గదిలోకి వస్తుంది. గిరీశం అక్కడే ఉంటాడు. గిరీశం మధురవాణిని గుర్తు పట్టాడా? లేదా? గుర్తు పట్టే ఉండచ్చు! మధురవాణి ఆ గదిలో ప్రవేశించినది మొదలు, చివరివరకూ కథ అంతా తన చేతిమీదే నడిపిస్తుంది. సౌజన్యా రావుకి మధురవాణి ఎవరో తెలియదు. మారు వేషంలో వచ్చిన వేశ్య అని మొదటే తెలిస్తే సౌజన్యారావుకీ ఆవిడకీ సంభాషణలే ఉండేవి కాదు. మదురవాణి గిరీశాన్ని పొగుడుతుంది. ఎంతసేపటివరకూ గిరీశాన్ని ఆ రంగంలో ఉంచాలో మధురవాణికి తెలుసు. ఎప్పుడు గిరీశానికి ఉద్వాసన చెప్పాలో కూడ ఆమె కెరికే! సౌజన్యారావుకి వేశ్యలంటే పడదు కదా! చాలా తెలివి గా వేశ్యలు తమ వృత్తి మానుకుంటే పొట్ట గడిచేది ఎట్లాగ అని చమత్కారంగా ప్రశ్నిస్తుంది. సౌజన్యా రావు వాళ్ళు చదువుకోవచ్చు; ఎవరినన్నావివాహం చేసుకోవచ్చు అంటాడు. గిరీశం లాంటి ‘మంచి వాడు’ వేశ్యని వివాహ మాడుతాడా? అని అడుగుతుంది. సౌజన్యారావు ఆ సలహాని తీవ్రంగా ఖండిస్తాడు! కారణం : అంతకుముందే విధవా వివాహం మిషతో గిరీశం సౌజన్యా రావుని బుట్టలో వేసుకున్నాడు. (ఆ విషయం మధురవాణికి తెలుసా? తెలియదా? ) అయితే, మీరు సంస్కరించబడ్డ వేశ్యని వివాహం చేసుకుంటారా? అని అడుగుతుంది. దానికి సౌజన్యా రావు మండి పడతాడు. వివాహం కాదు కదా, వేశ్యని తాకను కూడా తాకను అంటాడు. మధురవాణి సమయానుకూలంగా, అతి చాకచక్యంగా మాట్లాడి, ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే, సౌజన్యారావు తన గొయ్యి తనే తవ్వుకునేట్టు చేస్తుంది. అక్కడి సంభాషణలన్నీ అంచెలు అంచెలుగా ఎన్ని రకాలుగానన్నా వ్యాఖ్యానించవచ్చు.

లుభ్ధావధానులు పెళ్ళాడిన “పెళ్ళికూతురు” వైనం, కరటకశాస్త్రి పన్నిన పన్నాగం చెప్పడంలో మధురవాణి చూపిన మెరుపులు, విరుపులూ ఎవరినన్నా ముగ్ధుల్ని చెయ్యాలసిందే! ఈ సంభాషణలూ, రకరకాలుగా వ్యాఖ్యానించవచ్చు. చివరిలో, మానసికంగా బలిష్టులమని అనుకునే ఇద్దరు మగవాళ్ళని, గిరీశం, సౌజన్యా రావులని, వాళ్ళ అహంకారాన్నీ ధ్వంసం చేస్తుంది. మధురవాణికి మృచ్చకటికం, తెలుసు. వసంతసేన తెలుసు. భగవద్గీత కూడా తెలుసు! (?)

సౌజన్యా రావు కున్న అమాయకత్వపు సంస్కరణాభిలాష దెబ్బతియ్యడానికి మధురవాణి బృహన్నాటకం ఆడుతూ వుండవచ్చు. ఆధునికుడు, పాశ్చాత్య ప్రాభవంలో పెరిగిన పెద్దమనిషి, నీతులు వల్లించే వాడికి గుణపాఠం చెప్పడానికి మధురవాణి వచ్చి వుండవచ్చు. లేదా, కాలం మారుతున్నది; తన దగ్గిరకి గౌరవనీయులైన వాళ్ళెవ్వరూ రారేమో నన్న భయం పుట్టి వుండవచ్చు. — ఏది ఏమో? వీటికి సమాధానం అప్పారావుగారికే తెలియక పోవచ్చు!

ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ; ఆ సంస్కరణలో నిజమైన సాంఘిక విలువ ఏమీ లేదు. ఈ సంస్కరణ ఘోష కేవలం వలస రాజ్య విధానం వల్ల ఏర్పడ్డ బూటకపు మాయ అని బోధపడుతుంది.

అట్లాగే సుబ్బి పెళ్ళి విషయం తీసుకోండి. సుబ్బి బహుశా పది పనెండేళ్ళ పిల్ల. లుబ్ధావధానులు డెబ్భయ్యో పడిలో ఉన్న పండు ముదుసలి. ఇటువంటి వివాహాలకి వ్యతిరేకంగా సంఘసంస్కరణోద్యమకారులు దేశం నలుమూలలా గందరగోళం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎవరో బయటినుంచి వచ్చిన విద్యాధికులు, ప్రభుత్వ ప్రమేయంతో ఈ దురాచారాన్ని మటుమాయం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. పూజారి, పోలీసు, సేవకులు, స్కూలు పిల్లడు, పెళ్ళికొడుకు కూతురు (మీనాక్షి) అంతా ఈ పెళ్ళి కుదిర్చిన జిత్తులమారి రామప్పంతులునీ, పెళ్ళికొడుకుని మూర్ఖులుగా బయట పెడతారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ఎవరో, సౌజన్యారావు లాంటి అమాయకులు, సమాజం కుళ్ళిపోయిందని భ్రమించి, ఆ భ్రమని నమ్మి, సంస్కరించేద్దామన్న కుతూహలంతప్ప? అల్లాగే నాటకంలో బైరాగి, మిగిలిన తక్కువ కులాల జనాన్ని చూడండి. వాళ్ళందరికీ నిజానిజాలు తెలుసు, మోసం తెలుసు. వాళ్ళ స్థితి స్థానాలు తెలుసు.

వలస కాలంతో వచ్చిన ఆధునికత పేరుతో అవినీతి నిర్మూలన అనే ఉద్యమానికి అప్పారావుగారు వ్యతిరేకి అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే, ఇంగ్లీషు విద్య అవసరం, అనివార్యం అని అప్పారావుగారికి తెలుసు. ఇంగ్లీషు రాకపోవడం వల్ల జనానికి వచ్చే బాధలు తెలుసు. వలస విధానం వల్ల వచ్చిన, వస్తూవున్న అనర్థాలూ తెలుసు.