కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే …
2.
అప్పారావు గారి గురించి రాసేటప్పుడు రెండు ముఖ్య విషయాలు మరిచిపోలేం. ఒకటి : బ్రిటీషు వలస విధానం, రెండు : ఆధునికత. ఆధునికత మన దేశంలో ఎప్పుడు మొదలయ్యింది అన్న ప్రశ్నకి సాధారణంగా మన ఆధునికులు చెప్పే సమాధానం — బ్రిటీషు వాడి వలస రాజ్య స్థాపన తరువాతనే అని. బ్రిటీషు వాడు వలసకి రావడం మూలంగానే మన సంస్కృతి, సాహిత్యం నూతన తేజం పొందాయని వాదం, నమ్మిక. అంతకు పూర్వం, అంటే 17, 18 శతాబ్దాలలోని సాహిత్యం అంతా అవినీతి భూయిష్టం అని, కుళ్ళిపోయిందనే నమ్మకం. అది సరైన వాదం కాదని, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఆధునికత 16 వ శతాబ్దంలోనే ఉన్నదనీ, నారాయణరావు, సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్ మన్ లు గత 15 సంవత్సరాలుగా తమ చారిత్రక సాహిత్య పరిశోధనల ద్వారా మనకి పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనాటి సాహిత్యాన్ని సునిశితంగా, చారిత్రకంగా పరిశీలించి, నూతన పద్ధతుల్లో పరిశోధన చేస్తే బ్రిటీషు వలస కి పూర్వమే ఆధునికత స్పష్టం అవుతుందని వారి వాదం. బ్రిటీషు వాడి రాక మూలంగా వచ్చిన ఆధునికతని వాళ్ళు కాదనడంలేదు ; వాడికి పూర్వమే ‘ ఆధునికత ‘ ఉన్నది — అది చారిత్రక పరిణామంలో క్రమంగా సంప్రదాయకంగా వచ్చిందీ అని అర్థం. వలస రాజ్యం తరువాత వచ్చిన ఆధునికత సంప్రదాయ విరుద్ధం అని చెప్పవచ్చు. ఈ విషయాలపై నిశితమైన చర్చ (Penumbral Visions : Making Polities in Early Modern South India, Sanjay Subrahmanyam, Textures of Time : Writing History in South India 1600-1800, Narayana Rao, Shulman & Subrahmanyam, Symbols of Substance : Court and State in Nayaka-Period Tamilnadu, narayana Rao, Shulman and Subrahmanyam) అనే పుస్తకాలలోను, (The Sound of Kiss, The Demon’s Daughter) అనే పుస్తకాలలో ఉన్న వెనుక మాటలలో చదవ వచ్చు.
బ్రిటీషు వాడి వలసకు పూర్వం నుంచీ క్రమంగా వచ్చిన ఆధునికతనుంచి అప్పారావుగారి కన్యాశుల్కం ఉత్పన్నమైనదని నారాయణ రావు గారి ప్రతిపాదనలో ముఖ్య విషయం. బ్రిటీషు వలస విధానం వలన వచ్చిన ఆధునికత, చారిత్రకంగా సంప్రదాయకంగా వచ్చిన ఆధునికతని అణగ దొక్కింది. ఆకాలపు మధ్య తరగతి వారికి ఈ ఆధునికత సంస్కృతీస్మృతిభ్రంశం, మరుపూ కలిగించింది. ఏ తద్కారణంగా సంప్రదాయ విలువలు తగ్గు ముఖం పట్టాయి. అప్పటి సమాజం క్షీణదశలో ఉన్నదనీ, నైతికంగా పతనం అయిందనీ, మత సంబంధమైన పిచ్చిభ్రమలో సమాజం కొట్టుమిట్టాడుతున్నదన్నే నమ్మిక విద్యాధికులలో బలాన్ని పుంజుకున్నది.
ఈ సందర్భంలో అప్పారావుగారి నాటకంలో పాత్రలు మనముందుకొస్తాయి. ఈ పాత్రలన్నీ చురుకైనవి. సృజనాత్మకమైనవి. హాస్యం పుట్టించేవి; కడుపుబ్బ నవ్వించేవి, కవ్వించేవి. చాలా దృఢమైనవీను. అప్పారావుగారు తన నాటకంలో దిగజారిపోతున్న సమాజాన్ని, నైతికంగా పతనమవుతున్న సమాజాన్నీ సమర్పించలేదు. నైతిక వైరుధ్యం సమాజంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా తలయెత్తితే ఆ సమాజం తనకు తానుగా మార్పు తెచ్చుకోగల స్థితిలో ఉన్నది కాని, సాంఘిక సంస్కరణకోసం ఎదురు చూడలేదు. ఈ సమాజం తనపై తనకి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేటంత వత్తిడి బ్రిటీషు వలస విధానం తెచ్చిపెట్టిన ఉధృతం. ఇందుచేత పైకులాలు తమ ప్రాథమిక యోగ్యతలని మరిచిపోవడం జరిగింది.
అప్పారావుగారికి ఈ సమాజంపై అవగాహన, సమకాలీన రచయితలైన బంకించంద్రకన్నా, టాగూరుకన్నా లోతుగా ఉన్నదన్న విషయం స్పష్టం అవుతుంది. ఆ రకంగా ఆయన ఎంతోముందుచూపు ఉన్న మహానుభావుడని చెప్పక తప్పదు.
బ్రిటీషు వలస విధాన నేపథ్యంలో కొన్ని సామాజిక విశేషాలు మననం చేసుకోవడం అవసరం. 19 వ శతాబ్దపు ఆఖరి దశాబ్దంలో, ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో ‘సంఘ సంస్కరణోద్యమం ‘ మొదలయ్యింది. బ్రిటీషు రాజ్యాధినేతలు ఈ ఉద్యమానికి మౌనాంగీకారం తెలిపారు కానీ, రాజకీయంగా పాల్గొన లేదు. కారణం : సిపాయి విప్లవం తరువాతనే ఈ ఉద్యమం ఆరంభం కావడం. రాజా రామ మోహన రాయ్ స్కూళ్ళల్లో సంస్కృతం చెప్పడం మానేసి, ఇంగ్లీషు బోధన కుపక్రమించమని అర్జీ రాశాడు, తనకు గా తాను సంస్కృత పండితుడే! కారణం : ఇంగ్లీషు విద్య మూలంగా మూఢ నమ్మకాలు, పిచ్చి భ్రమలూ, మూర్ఖత్వం పోయి కొత్తదైన సామాజిక స్వాతంత్ర్యం వస్తుందనే నమ్మకం. ఇందువల్ల జరిగిందేమిటంటే మహామహోపాధ్యాయులు, సంస్కృ త పండితులూ పక్కకి నెట్టబడ్డారు. సంప్రదాయ విద్య పూర్తిగా నాశనం అవడం మొదలయ్యింది. దానికి తోడు, టాగూరు భారత సాహిత్యానికి ఆధునికత తెచ్చాడనే ఉద్యమం దృఢపడి, ఆ పరిధిలోకి ఎంతోమంది సాహితీపరులు కూడా చొరబడ్డారు. ఈ ఉద్యమంతో, అంతకు పూర్వం వచ్చిన సాహిత్యం అంతా మలిన పూరితం, అశ్లీలం అన్న భావం పెరిగిపోయింది. సంఘ సంస్కరణకు తోడుగా సాహిత్య సంస్కరణ తలకెత్తింది.
తెలుగు దేశంలో ఈ ఉద్యమానికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రప్రథముడు, నాయకుడు. ఇంగ్లీషు విద్య అభ్యసించాడు. బ్రాహ్మణులలో విధవా వివాహానికి నాందీ వాక్యం పలికాడు. వేశ్యావృత్తి నిర్మూలనకి కంకణం కట్టుకున్నాడు. అప్పటినుంచి, ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్ళందరూ, క్రిష్టియన్ నీతికి, విక్టోరియన్ విలువలకి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది.
ఈ సాంఘిక నేపథ్యంలో అప్పారావుగారు విజయనగరం మహారాజా వారి (ఆనంద గజపతి) కొలువులోకి వచ్చారు. అక్కడ ఉండగా, కన్యాశుల్కం ( మొదటిది, రెండవదీ) రాయడం జరిగింది. రెండవ కన్యాశుల్కమే ప్రసిద్ధికెక్కిన నాటకం అన్న విషయం అందరికీ తెలిసినదే!