ఏడాది తరువాత…
ఓ రోజున దివ్య లాస్ ఏంజిలిస్ నుండి హరికి ఫోన్ చేసింది.
“అన్నయ్యా! నీ కీ విషయం తెలిసిందా? నే విన్నది నిజమేనా? పిన్నికి ఫోన్ చేస్తే నిజమే నంది..” దివ్య ఏడవడం హరికి వినిపించింది.
“అవును ! నాకూ డాక్టర్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు. డాడీ తో మాట్లాడదామంటే ఫోన్ దొరక లేదు. ముందు నాకు మా మావగారి తమ్ముడు ఫోన్ చేసి చెబితే నమ్మ లేదు. అయినా ఇప్పుడేం కొంపలు ములిగాయని..నాకేమీ అర్థం కావడం లేదు….నాన్నతో ఒక సారి మాట్లాడితేకానీ ఏ సంగతీ తెలియదు…”
“ఏం మాట్లాడుతాం రా? నా కయితే మా అత్తగారిముందు, మావ గారిముందూ తల కొట్టేసినట్లయ్యింది. అయినా…వినడానికే నాకు సిగ్గుగా ఉంది…”
“ఏం చేస్తాం ! నా పరిస్థితీ అంతే ! మా మావగారు, అత్తగారు నాన్న పై జోకులు వేసుకుంటున్నారు. నాన్న ముందు నోరువిప్పడానికే భయపడే వీళ్ళందరికీ మనం చులకన అయిపోయాం! అయినా ఈ వయసులో…ఇదేం పని? ” హరి కి మాటలు రావడం లేదు.
“ఇందులో నాన్న తప్పుందని నేననుకోను. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు అద్దింట్లో దిగిన ఆవిడే మనం రాకపోవడం చూసి మెల్లగా నాన్నని బుట్టలో వేసుకొందని నా అనుమానం….ముసలాయన ఎలాగూ అనారోగ్యపు మనిషే కదా, గుటుక్కుమంటే ఉన్న ఇల్లూ పొలమూ కాజేద్దమన్న ప్లాను అయి ఉంటుంది…” దివ్య తన అనుమానాలన్నీ వెళ్ళగక్కింది.
“డాక్టర్ అంకులే దగ్గరుండి ఈ పెళ్ళి జరిపించారట. పిన్ని కి కాల్ చేసి అడిగితే అదే అంది. మీ అమ్మ పోయి దాదాపు ఇరవై ఏళ్ళయ్యింది. ఎప్పుడూ పెళ్ళి ఊసెత్తని మీ నాన్న – ఇదేమిటని అందరం ముక్కున వేలేసుకున్నాం, అంటూ చెప్పింది…నాన్న తో ఏం మాట్లాడు తాం? ఏమని అడుగుతాం? నాకయితే మనసు రావడం లేదు…తలచుకుంటేనే అసహ్యమేస్తోంది…అందరి ముందూ పరువు పోయింది. మా అత్తగారూ, మావగారిముందు తల ఎత్తుకోలేకుండా అయ్యింది…ఇండియా వెళితే ఎక్కడకి వెళతాం..అందరూ పైకి బాగానే మాట్లాడిన మన గురించి, ముఖ్యంగా నాన్న గురించి…ఊహించుకుంటేనే తట్టుకోలేక పోతున్నాను…” హరి బాధగా అన్నాడు.
వాళ్ళిద్దరూ కొత్తరకం బాధలో ఉన్నారు. వాళ్ళిద్దరి బాధకి కారణం రాజారావు వివాహం. చెప్పాపెట్టకుండా, కనీసం సూచన ప్రాయంగా నయినా పిల్లల్ని సంప్రదించకుండా పెళ్ళి జేసుకున్నాడు.
హరి, దివ్య ముందు ఫోన్ చేద్దామనుకున్నారు. చుట్టూ ఉన్న అత్తమామల విరుపులకీ, వ్యంగాలకీ ఆ ప్రయత్నం మానుకున్నారు. వాళ్ళిద్దరికీ ఈ విషయం మింగుడు పడడం లేదు. ఎనిమిదో తరగతిలో ఉండగా హరి తల్లి పోయింది. అప్పటికి రాజా రావుకి ముప్పై అయిదేళ్ళు. పిల్లలకోసం ఇంకో పెళ్ళి చేసుకోమన్నా ఎప్పుడూ ఆ ఊసే ఎత్త లేదు. తల్లీ తండ్రీ అన్నీ తనే అయ్యి పిల్లలిద్దర్నీ పెంచాడు. ఇద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. తను మాత్రం వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని – పిల్లలకి ఉచితంగా ప్రైవైట్లు చెబుతూ కాలం గడిపాడు. రెండు సార్లు అమెరికా కూడా వచ్చాడు. తనకి పెళ్ళి చేసుకోవాలన్న కోరిక ఉందని ఎవరికీ సంశయం కూడా రాలేదు. అలాంటింది..ఇప్పుడు…హరి మనసు ఎందుకో అంగీకరించలేక పోతోంది. తలలు బోడులైన తలపులు బోడులవునా అన్న సామెత గుర్తొచ్చింది. ఏ సామెత గుర్తుకొస్తే ఏం లాభం, జరగాల్సింది జరిగిపోయాక.