ఆ నెలాఖరుకి మేము అపార్టుమెంటు మారాల్సి వచ్చింది. ఆ రోజే చాలా మందికి ఇళ్ళు మారే రోజో ఏమో, మూవింగ్ కంపెనీ దేన్ని పిలిచినా, ఆరోజుకి కుదర్దని చెప్పేశారు. అతి ప్రయత్నం మీద ఒక ట్రక్కు మాత్రం దొరికింది ఒక పూటకి. విధిలేక మేమిద్దరమే సామానులు సద్దటం మొదలు పెట్టాం. సామాన్లైతే సర్దేస్తున్నాం కానీ వాటిని ట్రక్కులో ఎక్కించి దింపటానికి కనీసం ఇంకో జత చేతులు సహాయం కావాలి. ఎవడు మాత్రం శనివారం శలవు పూట వస్తాడు ఒక చెయ్యి వెయ్యడానికి? ఆ ముందు శనివారం సతీష్‌కి కాల్ చేశాను
“హలో సతీష్, వచ్చే వారం ఊళ్ళోకొస్తున్నారా?”
“ఆ వస్తున్నా, గురువారం నించే రెండ్రోజులు శలవు తీసుకుని వస్తున్నా. ఏంటి విశేషం, ఏమన్నా పార్టీనా, ప్రోగ్రామా?”
“అది కాదు. మేం శనివారం నాడు మూవ్ అవ్వాలి. మాకొక మూణ్ణాలుగ్గంటలు సాయం చెయ్యగలరేమోనని ..”
“ఎప్పుడు? పొద్దునా, మధ్యాన్నమా, సాయంత్రమా?”
“మధ్యాన్నం. ట్రక్కు రెండు నించీ ఆరు దాకా మనదగ్గిరుంటుంది.”
అటు నుంచి నిశ్శబ్దం.
“హలో సతీష్?”
“సారీ, నవీన్ గారూ! మధ్యాన్నం మా బావమరిది ఫేమిలీ వస్తున్నారు న్యూజెర్సీ నించి. పోనీ పొద్దునైతే .. లేకపోతే ఆదివారమైనా ఓకే!”
“లేదులెండి. ఆ ఒక్క పూటకే దొరికింది ట్రక్కు. ఆ టైములోనే జరగాలి.”
“వెరీ సారీ!”
“నో నో! ఇట్సోకే!”. పెట్టేశాను. పక్కనే పుస్తకాల్ని పెట్టెలో సర్దుతున్న శ్రీదేవికి అంతా వినిపిస్తూనే ఉంది.
“బాదరాయణ సంబంధం” అని చప్పుడు కాకుండా నోటితో అభినయించి నవ్వింది. నాకు వొళ్ళు మండి వెళ్ళి వంటగది సామాన్లు సర్దటం మొదలెట్టాను.
చూస్తుండగా ఆ శనివారం రానే వచ్చింది. నాకు టెన్షనుగా ఉంది, ఈ ఇల్లు మార్పిడి ఎలా తెములుతామురో బాబోయ్ అని, కానీ శ్రీదేవికి చీమకుట్టినట్టైనా లేదు. “ఎందుకూ ఊరికే హడావుడి పడి సాధించేదేవుందీ? మనకి చేతనైనట్టు చేసుకుంటాం.” అంది పైగా.
నేను రెండింటికి వెళ్ళి ట్రక్కు తీసుకొచ్చాను. మా అపార్టుమెంటు తలుపు తీస్తుంటే లోపల్నించి ఏవో ఆడా మొగా గొంతులు కలగా పులగంగా వినిపిస్తున్నై. తలుపు తీస్తే .. ఆండ్రియా, హార్లీ, కాక ఇంకో తెల్ల జంట .. షికాగో నించి ఈ కొత్త దంపతుల్ని చూడ్డానికొచ్చిన వాళ్ళ స్నేహితులట! ఆడ పిల్లలు కూడా ఆ మగవాళ్ళతో పోటీపడి పని చేస్తుంటే నాకు బలే ఆశ్చర్యమై పోయింది. అసలు తలకెత్తుకో గలనా అని నేను భయపడ్డ పని రెండు గంటల్లో సునాయాసంగా పూర్తైపోయింది. కొత్త ఇంట్లో సామాన్లు సర్దుకోవాలి మొర్రో అన్నా వాళ్ళు వదిలి పెట్టలేదు. “రేపు సర్దుకోవచ్చులే, ఈ పూటకి ఏం తింటారు” అని బలవంత పెట్టి వాళ్ళింటికి తీసుకు పోయారు. డిన్నర్ చేశాక ఆండ్రియా “మీ కోసం స్పెషల్ ట్రీట్” అంటో డీవీడీ ప్లేయర్లో ఏదో డిస్కు పెట్టింది. “బాబోయ్, ఇప్పుడు వాళ్ళ పెళ్ళి విడియో చూపించి చంపుతారు కాబోలు, తప్పదు గదా” అనుకున్నా.
“పైరేట్స్ ఆఫ్ ది కరిబ్బియన్ – ఎట్ వళ్డ్స్ ఎండ్!”
.. సినిమాలో లీనమైపోయాను.
“నన్ను శరణు జొచ్చినవాడే నావాడు,” అన్నాడు మా పెద్దన్న ఘటోత్కచడు. జనాలు లైనుకట్టి నన్ను శరణు కోరడానికి నేను ఆనాటి ఘటోత్కచుణ్ణీ కాను, ఈనాటి (రాజ)శేఖర్ దాదానీ కాను గనక, “మనకి అక్కరకి వచ్చిన వాడే మనవాడు,” అని మా పెద్దన్న తీర్మానాన్ని కాస్త ఎమెండ్ చేశాను. ఏమంటారు?
