సాయము శాయరా డింభకా!
చలికాలం రోషం తెచ్చుకుని వసంతమైంది. అప్పుడప్పుడూ శ్రీదేవి చెబుతూ ఉంటుంది ఆఫీసులో ఆండ్రియా తమ పెళ్ళి ఏర్పాట్ల ముచ్చట్లు చెబుతూనే ఉన్నదని. ఒకసారి కేటరింగ్ వాడు ఏదో మెలిక పెట్టాడుట. ఇంకోసారి పూలు సప్లై చెయ్యాల్సిన ఆమెతో ఫోనులో గంటన్నర వాగ్యుద్ధం చేసి జయించిందిట. కానీ ఎక్కడా మనల్ని పెళ్ళికి పిలిచారన్న మాట మాత్రం చెప్పదు. నేననుకున్నట్టుగానే శ్రీదేవి పెళ్ళి డ్రెస్సు కోసం ఒక రోజు షాపింగ్ ట్రిప్పు పెట్టింది. ముందసలు మనల్ని పెళ్ళికి పిలవనీ అన్నా. ఏంటీ వీళ్ళు ఇంకా ఇన్విటేషన్ ఇవ్వరు అని తను కూడా చిరాకు పడింది. పెళ్ళికింకా నెలరోజులే ఉందని చాలా హడావుడి కూడా పడిపోయింది. అటు నించి మాత్రం కిమ్మిన్నాస్తి. మళ్ళీ తనకి తనే సమర్ధించుకుంది .. పాపం అన్ని పనులూ వాళ్ళే చేసుకోవాలి గదా, మనకిలాగ తల్లిదండ్రులు చేసి పెట్టరు గదా, బయటి ఊళ్ళ వాళ్ళందరికీ ముందు పోస్టులో పంపించేశాక మనకి చేత్తో ఇస్తుందిలే ఇన్విటేషన్ .. అని నాకు నచ్చ చెప్పింది. మధ్య నాకెందుకూ నచ్చజెప్పడం?
ఇంతలో ఒక రోజు సతీష్ ఫోన్ చేసి వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతమని చెప్పి రమ్మని పిలిచాడు. అది సరిగ్గా ఆండ్రియా హార్లీ పెళ్ళి రోజునే. ఇంక వాళ్ళ నించి పెళ్ళి పిలుపు రాదని నాకెందుకో అకస్మాత్తుగా జ్ఞానోదయమైంది. సతీష్‌కి వస్తామని చెప్పేశాను. అలా చూస్తూ ఉండగానే ఆండ్రియా రెండు వారాలు శలవు పెట్టి కెంటక్కీ వెళ్ళింది పెళ్ళి చేసుకోడానికి. శ్రీదేవీ నేనూ సతీష్ వాళ్ళింటికి వెళ్ళాం సత్యనారాయణ వ్రతం చూడ్డానికి. ఏమైనా, మనవాళ్ళ మర్యాదలు వేరు. వ్రతం పూర్తైనాక భోజనాల మధ్యలో కెంటక్కీలో కేథలిక్కు పెళ్ళికి వెళ్ళే ఛాన్సు కొద్దిలో ఎలా మిస్సయిందో సరదాగా చెప్పి నవ్వించాను.
ఒక పెద్దాయన “అంతేనండీ, ఈ అమెరికా వాళ్ళంతా అంతే” అన్నాడు. ఆ పైన అందరూ తలో మాటా అన్నారు. సతీష్ అన్న మాట నన్ను ఆకట్టుకుంది.
“అమెరికన్లకి మనలాంటి విదేశీయుల్ని చూసి వీడు మనవాడు అని ఎప్పటికీ అనిపించదనుకుంటా. ఉద్యోగ ధర్మంగా ఏదో స్నేహంగానే ఉంటారు గానీ ..”
“సరిగ్గా చెప్పావ్” అన్నాను.
మేం బయల్దేరి వచ్చేస్తుంటే సతీష్, అతని భార్య రశ్మి మా కారు దాకా వచ్చారు. వాళ్ళు ప్రవేటుగా చెప్పిన విషయం: సతీష్‌కి ఎక్కడో టెక్సస్‌లో ప్రాజెక్టు వచ్చిందిట. భార్యా పిల్లల్ని ఇక్కడే ఉంచి అతను రెండువారాల కొకసారి వచ్చి చూసి వెళ్ళేందుకు ప్లాన్. ఈ విషయం మళ్ళీ పదిమందికీ తెలియడం ఇష్టం లేదు. అవును పాపం ఏం చేస్తారు. కొన్న ఇల్లు ఈ డౌన్ మార్కెట్లో అమ్మే పరిస్థితి కాదు. అదీ కాక అక్కడ ప్రాజెక్టు మాత్రం ఎన్నాళ్ళుంటుందో. ఇతని పరిస్థితి ఇంకా నయం .. రెండు వారాలే బెంచి మీద ఉన్నది, మళ్ళీ కొత్త ప్రాజెక్టు దొరికింది. ఇవ్వాళ్టి వ్రతం ఒక పాలు దేవుడికి ధన్యవాదాలు, ఒక పాలు వేడికోలు అనిపించింది నాకు. ఏ మాత్రం సహాయం కావలసినా పిలవమని రశ్మికి చెప్పి శ్రీదేవీ, నేనూ ఇల్లు చేరాం.
వసంతం కాస్తా కన్నెర్రబడి గ్రీష్మమై నిప్పులు చెరగటం మొదలు పెట్టింది. ఒక రాత్రి పది దాటాక పడుకో బోతున్న టైములో ఫోను మోగింది. సతీష్ వాళ్ళ నెంబరు. రశ్మి చేసింది .. వాళ్ళ పాపకి తీవ్రమైన జ్వరం, వాంతులూ అని. తనకి కాళ్ళూ చేతులూ ఆడటల్లేదని ఏడ్చెయ్యడం మొదలు పెట్టింది. ఇదిగో, ఇప్పుడే బయల్దేరుతున్నామని చెప్పి ఇద్దరమూ బయల్దేరాం. మేము వాళ్ళింటికి చేరేలోగా శ్రీదేవి తన సెల్‌లో రశ్మితో మాట్లాడుతూ ధైర్యం చెబుతూనే ఉంది. పది నిమిషాల్లో వాళ్ళింటికి చేరాం. పాపని నేనెత్తుకొచ్చి వెనక సీట్లో పడుకో బెట్టాను. రశ్మి కావలసిన వస్తువులు గబగబా ఒక సంచీలో సద్దుకుని వచ్చింది. మళ్ళీ బయల్దేరి దగ్గర్లోనే ఉన్న ఎమర్జెన్సీ రూంకి చేరాం. వాళ్ళ పుణ్యమా అని తొందరగానే చూశారు.
ఈ లోపల సతీష్ నాకు ఫోన్ చేశాడు. పాపం అతని ఆదుర్దా అతనిది. ఆ సాయంత్రమే అతను తిరిగి టెక్సస్ వెళ్ళాట్ట. పాప అతని కోసం బెంగ పెట్టుకున్నట్టుంది. నాకు జాలేసింది .. ఏంటో ఈ ఉద్యోగాలు, సంపాదనలు .. పిల్లల ముచ్చట్లు చూసుకోకుండా, వయసులో ఉన్నప్పుడు భార్యా భర్తా కలిసుండి జీవితాన్ని ఆనందించకుండా .. నెలకి రెండుసార్లు కలుసుకోవటంలో ఏమానందం ఉంటుంది? మిస్సై పోయిన పిల్లల ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ రావుగదా. తరవాత ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపినా అప్పటికప్పుడు ఆ పాప బెంగ తీరదు కదా? అరగంట కోసారి అతను ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నాకు చేతనైనట్టు ధైర్యం చెబుతూ వచ్చాను. పన్నెండింటికల్లా పాప పరిస్థితి కుదుటపడిందని ఇంటికి తీసుకెళ్ళిపొమ్మన్నారు. సతీష్ కోరిక పైనా, రశ్మి అభ్యర్ధన పైనా మేము ఆ రాత్రికి వాళ్ళింట్లోనే ఉండిపోయాం.
“మనవాళ్ళంటూ మీరున్నారు కనక సరిపోయింది,” అన్నాడూ సతీష్ కృతజ్ఞత నిండిన గొంతుతో.