డాలర్ – యూరో
2002 సంవత్సరం మొదట్లో, 12 యూరోపియన్ దేశాలు (ఇంగ్లెండు, స్విర్జలాండ్ దేశాలు మినహా) కలిసి యూరో కరెన్సీని ప్రవేశపెట్టాయి. అప్పట్లో ఒక యూరోకి 90 అమెరికన్ సెంట్లు వచ్చేవి. అంటే, అమెరికన్ డాలరు కన్న యూరో విలువ తక్కువే! మేం ఫ్రాన్స్ వెళ్ళిన కొత్తల్లో చాలా షాపుల యజమానులు, ఇంకా యూరోకి అలవాటు పడలేదు. ఏ వస్తువు ధర అడిగినా ఇంకా ఫ్రెంచి ఫ్రాంక్స్ లోనే చెప్పే వారు. అమెరికా నుంచి వచ్చిన మాకు, ఫ్రాన్స్‌లో వస్తువులు ధరలన్నీ చాలా ఎక్కువగా అనిపించాయి. ఇండియా నుంచి అమెరికా వచ్చిన కొత్తల్లో, అమెరికన్ డాలర్లలో వున్న వస్తువుల ధరల్ని రూపాయల్లోకి మార్చి చూసుకొని, “అమెరికాలో వస్తువుల ధరలన్నీ చాలా ఎక్కువ” అని అనుకునేవాళ్ళం. ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి అనుభవమే మాకు ఎదురయ్యింది!
మాకు రోజూ వాడుకోటానికి మా కంపెనీ ఒక వాన్ ఇచ్చింది. రెండో కార్‌ను నేను 13 వేల డాలర్లకి కొన్నాను. అప్పటి డాలర్ విలువ (2002 సంవత్సరం) యూరోకి సమానం కాబట్టి మా రెండవ కార్ 13 వేల యూరోలు అన్నమాట. మేం తిరిగి అమెరికా వచ్చే టైంకి ఆ కారును పది వేల యూరోలకి అమ్మాం. ఈ మూడేళ్ళలో డాలర్ విలువ యూరో విలువలో 35 శాతం పడిపోటం వల్ల, పది వేల యూరోలు డాలర్లలోకి మార్చేసరికి అది పదమూడువేల ఐదువందల అమెరికన్ డాలర్లు అయ్యాయి. కార్‌ని కొన్న ఖరీదు కన్న (మూడేళ్ళ వాడకం తరవాత) ఎక్కువధరకి అమ్మటం నేను నమ్మలేకపోయాను! ఈ అనుభవం కూడా ఒక చిత్రమైన అనుభవమే!
తిరిగి అమెరికా ప్రయాణం
ఇన్ని అనుభవాలు అవుతుండగానే, మాకు ముందు ఇచ్చిన మూడు సంవత్సరాల కాలం అయిపోసాగింది. కావాలంటే, ఇంకొక సంవత్సరం ఫ్రాన్స్‌లోనే ఉండచ్చని మా కంపెనీ (అప్పటికి, మోటరోలా కంపెనీలో సెమీకండక్టర్ విభాగం పూర్తిగా మోటరోలా నుంచి విడిపోయి, ఫ్రీస్కేల్ సెమీకండక్టర్ గా మారింది) వారు అన్నారు. ఈ విషయం కల్యాణికి, పిల్లలకి చెప్పి, పోనీ ఇంకొక సంవత్సరం ఫ్రాన్స్‌లోనే ఉందామా అని ఊగిసలాడాం! ఫ్రాన్స్ వచ్చినప్పటి నుంచి, పిల్లల స్కూల్ విషయాల్లో మాకు చాలా అసంతృప్తిగా ఉండేది. ముందు, ఫ్రెంచి స్కూల్ పద్ధతులు, అమెరికన్ స్కూల్ పద్ధతులకి చాలా భిన్నంగా ఉండటం! తరవాత, మా పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్ ఫ్రెంచిలో తప్పనిసరిగా చేయ్యటం! ఈ గందరగోళంలో వాళ్ళు ఎలా చదువుతున్నారో మాకు అర్ధమయేది కాదు. కొన్ని సబ్జెక్ట్స్‌లో నూటికి 70, 80 మార్కులే వచ్చేవి. ఫ్రాన్స్ వెళ్ళక ముందు ఆస్టిన్‌లో వాళ్ళకి నూటికి 90 మార్కుల పైనే వచ్చేవి. అలాంటిది, ఫ్రాన్స్‌లో వీళ్ళకి ఎప్పుడోకాని 90 శాతం పైన మార్కులు వచ్చేవి కాదు. ఇదేంటని మా పిల్లల్ని అడిగితే, “ఫ్రాన్స్‌లో 70 శాతంకన్నా ఎక్కువ మార్కులొస్తే, అవి మంచి మార్కులే” అని వాళ్ళ సమాధానం! ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఆఫీసులో, ఒక ఫ్రెంచి మేనేజర్ తాను తన కింద పనిచెసే ఉద్యోగులెవ్వరికీ తన మేనేజర్‌గా ఉన్నంత కాలం, ప్రమోషన్ల విషయంలో A+ గ్రేడ్ ఇవ్వలేదని చెప్పటం నాకు గుర్తు. మొత్తం మీద, పిల్లల చదువు దృష్టిలో పెట్టుకొని, జులై, 2005 లో తిరిగి ఆస్టిన్ రావాలని నిశ్చయించుకున్నాం! ఫ్రాన్స్ వదిలి వెళ్ళే తారీకు దగ్గిరపడుతున్న కొద్దీ, ఏదో తెలియని వెలితిగా అనిపించడం మొదలైంది. ఇంత చక్కని దేశం, పరిసరాలు, చాలా అందమైన అనుభవాలు మళ్ళీ సాధ్యమా అని అనిపించింది. ఈ మూడేళ్ళలో ఫ్రాన్స్‌తో ఇంత బంధం ఎలా ఏర్పరచుకున్నామో అర్ధం కాలేదు. అమెరికాలో ఉండగా ఎప్పుడూ, తెలుగువారితోనే తిరుగుతూ ఉండే మేం, ఫ్రాన్స్ రావటం వల్ల తప్పనిసరిగా మిగిలిన అమెరికన్ కుటుంబాలతో కలిసి తిరిగే పరిస్థితి వచ్చింది. దానికి తోడు, ఆస్టిన్ నుంచి వచ్చిన అమెరికన్ కుటుంబాలు కూడా, మాలాగే వంటరిగా ఫీల్ అవటం వల్ల, సులభంగా స్నేహితులయ్యాం!
ఫ్రాన్స్ నుంచి డెట్రాయిట్ మీదుగా ఆస్టిన్ వెడుతుంటే, డెట్రాయిట్ – ఆస్టిన్ ఫ్లైట్‌లో రమ్యకి ఆస్టిన్‌లో పాఠాలు చెప్పిన ఒక పాత టీచర్ కనపడి, మేం మూడు ఏళ్ళు ఫ్రాన్స్‌లో ఉన్నామని తెలుసుకొని, మా పిల్లలతో “మీకు ఇంత చక్కగా ఫ్రాన్స్‌లో మూడేళ్ళు గడిపే అవకాశం ఇచ్చిన మీ అమ్మా, నాన్నలు ఎంత మంచి పని చేసారో మీకు పెద్దయ్యాకా అర్ధమవుతుంది!” అంది. ఈ మాటల్లో ఎంత నిజముందో తెలియటానికి ఇంకా టైం పడుతుంది కానీ, ఈ మూడేళ్ళ ఫ్రెంచి జీవితం వల్ల రమ్య, అనూజ్ ఇద్దరూ ఫ్రెంచ్ చాలా బాగా మాట్లాడతారు. నా ఫ్రెంచి మాత్రం అంతంత మాత్రమే!
