మా ఫ్రాన్స్ అనుభవాలు

ఫ్రాన్స్‌లో తోట పని

మాకున్న సరదాల్లో తోట పని ఒకటి. ఫ్రాన్స్ వెళ్ళిన కొత్తల్లో, మాకు బాగా అలవాటయిన మన కూరగాయలు దొరక్క చాలా ఇబ్బంది పడ్డాం. చివరకి, పర్చిమిరపకాయలు కూడా దొరికేవి కావు! ఎప్పుడన్నా పారిస్ వెళ్ళి, అక్కడ ఉన్న ఇండియన్ గ్రోసరీ షాపుల్లో రెండు మూడు వారాలకి సరిపడ కూరగాయలు కొనుక్కొచ్చే వాళ్ళం. ఆష్టిన్‌లో ఉన్నప్పుడు, కొన్ని కూరగాయలు మేం పండించే వాళ్ళం. మిగిలినవి కొనుక్కునే వాళ్ళం. ఫ్రాన్స్ వచ్చిన తరవాత ఈ కూరగాయలు ఒక పెద్ద సమస్య అయిపోయింది. సెంటెమియేలో మా ఇల్లు చిన్నదయినా, ఇంటి వెనక ఉన్న స్థలం చాలా పెద్దది. సుమారు ఒక ఎకరం ఉంటుంది. ఆస్టిన్ నుంచి వస్తూ వస్తూ తెచ్చిన మన కూరగాయల విత్తనాలు, చిన్న చిన్న ముంతల్లో ఏప్రెల్ నెలాఖరికి పెట్టాం. మే నెలాఖరికల్లా, మొక్కలు రావడం మొదలయ్యాయి. బీర, ఆనప, బెండ, చిక్కుడు, దోస, తియ్య గుమ్మడి, కాకర, బూడిద గుమ్మడి లాంటి కూర మొక్కలే కాకుండా గోంగూర, తోటకూర, బచ్చలి కూర లాంటి ఆకు కూరల మొక్కలు కూడా వేశాం. ఇది కాకుండా, ఫ్రాన్స్‌లో చాలా ఎక్కువగా దొరికే వంగ (Aubergines) మొక్కలతో పాటు, టమేటో మొక్కలు కూడా పెట్టాం! నాకున్న అనుభవంలో, ఆష్టిన్‌లో పది మొక్కలు పెడితే అందులో ఐదు మొక్కలు బతికితే చాలా గొప్పే! కాని, ఇక్కడ నేను పెట్టిన మొక్కలన్నీ బతికాయి. బతకటమే కాకుండా, జూన్ నెలాఖరకి ఈ మొక్కలన్నీ కాపు కాయటం మొదలయ్యింది. ఈ కాపు ఎంత ఉధృతంగా ఉందంటే, ఒక్కొక్క టొమేటో మొక్క, 50, 60 కాయలు ఇచ్చేది. నేనేమో ఒక పాతిక మొక్కలు పెట్టాను. ఇక చూడండి. తోటంతా విరగ కాసాయి. గోంగూర మొక్కలు తొమ్మిది, పది అడుగులు పెరిగాయి. ఈ కూరగాయలన్నీ ఏంచేసుకోం? అప్పటికీ ఈ కూరగాయల్ని నిలవ చేసి, శీతాకాలంలో ఏమీ దొరకనప్పుడు వాడుకోటానికి వీలుగా ఒక పెద్ద ఫ్రీజర్ కూడా కొన్నాము. అది, మూడు రోజల్లో వచ్చిన కూరలతో నిండి పోయింది. ఇక మిగిలినవి ఏం చేసుకోవాలో తెలియక, అక్కడ పరిచయిమయిన తెలుగు కుర్రాళ్ళకి, ఇండియన్ స్నేహితులకి, గ్రెనోబుల్‌లో బాగా పరిచయమయిన బోంబే రెస్టరెంట్‌కి ఇచ్చే వాళ్ళం. ఆఫీసు పని మీద వచ్చిన ఒక తమిళ స్నేహితుడు మా తోట చూసి నాతో “నువ్వు తోటమాలివి కాదు. పెద్ద రైతువి!” అని ప్రశంసించాడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అసలు రహస్యం ఏమిటంటే, మేం ఉన్న ప్రాంతం అంతా, ఆల్ప్స్ పర్వతాల వాలులో ఉన్న, అతి చక్కని సారవంతమైన భూమి. దానికి తోడు, వేసం కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) మేం ఉన్న లోయ ప్రాంతంలో సూర్యుడు పొద్దు చాలా బాగుంటుంది. రోజూ చీకటి పడే సరికి రాత్రి పది దాటిపోయేది. సారవంతమైన భూమి, ఎక్కువగా ఉండే సూర్యుడి పొద్దు, సమృద్ధిగా నీరు. ఇంకేం కావాలి? నా జీవితంలో మళ్ళీ అలాంటి తోట మేం బహుశా పెట్టలేమేమో!

చీరల పార్టీ

దాదాపు అరవై కుటుంబాలు మాలాగే ఆస్టిన్ నుంచి ఫ్రాన్స్ వచ్చారని ముందే చెప్పాను కదా! మా అందరికోసం తరచు మా కంపెనీ ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసేది. అప్పుడు అన్ని కుటుంబాలు సరదాగా కలిసి గడిపే వాళ్ళం. ఇటువంటి పార్టీల్లో, ఒక పది కుటుంబాలు మా కంపెనీ కోసం పని చేస్తున్న ఫ్రెంచి వాళ్ళు! ఇలాంటి సందర్భాల్లో, కల్యాణి మన పద్ధతిలో ఉండేట్లు చీర కట్టుకొని వచ్చేది. ఒక నలుగురైదుగురు ఫ్రెంచి, మరొక అయిదు అమెరికన్ ఆడవాళ్ళు ఎప్పుడూ కల్యాణి కట్టుకున్న చీర కట్టు గురించి, “మన సాంప్రదాయంలో బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? మంగళసూత్రం ఎందుకు?” లాంటి ప్రశ్నలతో సంభాషణలకు దిగేవారు! ఒకరిద్దరు ఫ్రెంచి ఆడవాళ్ళు, నా దగ్గరకి వచ్చి, “మీ ఆవిడ చీర కట్టులో బాగుంది?” అని నన్ను ప్రశంసించే వాళ్ళు. నా అమెరికన్ స్నేహితుల భార్యలు కొన్ని చీరలు కొనుక్కున్నారట! కానీ అవి ఎలా కట్టుకోవాలో తెలియక పోవటం చేత, వాటిని, వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో, ఇంటిని అందగా అలంకరించడంకోసం కర్టెన్లుగా, లేదా మరొక విధంగా అలంకరించే వారుట! మొత్తం మీద, ఈ పార్టీల్లో చీర, అది కట్టుకొనే పద్ధతి మొదలైనవి, ఆడవారి మధ్య ప్రధాన చర్చలయ్యాయి. ఇవన్నీ చూసి, కల్యాణి మాకు బాగా తెలిసిన ఒక పది అమెరికన్, ఫ్రెంచ్ కుటుంబాల్లోని ఆడవారిని, ఒక చీరల పార్టీ కోసం మా ఇంటికి పిలిచింది. నన్ను నా స్నేహితుని ఇంటికి పంపించి, మొత్తం ఆడవాళ్ళు, యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లలు, పద్ధెనిమిది మంది కలసి ఒక మూడుగంటల పాటు, మా ఇంట్లో చీరల అలంకరణలో పడ్డారు. కల్యాణి, తనకున్న చీరలు చూపించి, ఎవరికి ఏం కావాలో తీసుకో మన్నది.


చీరలలో ఆడవాళ్ళు (వరుసగా మెక్సికన్ అమెరికన్ లూసీ, అమెరికన్ లీసా, కల్యాణి, ఆస్ట్రియన్ సబీన్, అమెరికన్స్ లారెల్ -అలీస్, ఫిలిప్పియన్ క్రిస్టీనా, ఈజిప్షియన్ అమాని)

ఇలా మూడు, నాలుగు గంటలు నడిచింది చీరల పార్టీ! ఆ తరవాత, ముందు అనుకున్నట్టు, మా పది కుటుంబాలు కలిసి గ్రెనోబుల్‌లో బాంబే రెస్టరెంట్‌లో డిన్నరికి కలిసాం. భోజనాలు చేస్తూ, ఆ వేళ మా స్నేహితులకి, వారి కుటుంబాలకి ఇండియా గురించి చాలా విషయాలు చెప్పాం! దాంతో, చాలా మందికి ఉత్సాహం వచ్చి, ఇండియా వెడితే, ఏ ఏ ఊర్లు చూడాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఇండియా వెళ్ళటానికి వీసాలు ఎలా తీసుకోవాలి లాంటి ప్రశ్నల తరవాత, ఒక నాలుగు కుటుంబాలు 2004 సంవత్సరం క్రిస్‌మస్ శలవుల్లో మాకుటుంబంతో కలసి ఇండియా రావటానికి సిద్ధపడ్డారు. ఈ యాత్రా విశేషాలు మళ్ళీ ఎప్పుడైనా మీకు చెప్పాలి!