నా డ్రైవింగ్ పరీక్షలు
నా 15 ఏళ్ళ అమెరికా జీవితంలో ఒక్క సారి మాత్రమే ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు టిక్కెట్ వచ్చింది. ఫ్రాన్స్‌లో కూడా అమెరికాలో ఉన్నట్టుగా రోడ్డుకి కుడి వైపు డ్రైవ్ (బ్రిటన్‌లో రోడ్డుకి ఇండియాలోలా ఎడమవైపు డ్రైవ్) చేస్తారు. అందువల్ల అమెరికాలో డ్రైవింగ్ అనుభవం ఉన్నవారికి ఫ్రాన్స్‌లో డ్రైవ్ చెయ్యటం అంతకష్టం కాదు. కష్టాలన్నీ, డ్రైవింగ్ లైసెన్సు తెచ్చుకోటంలోనే ఉన్నాయి. మేం ఫ్రాన్స్ వెళ్ళిన తరవాత, అక్కడి డ్రైవింగ్ సిస్టంలో ఉన్న బాధలు అర్ధమయ్యాయి! ఫ్రెంచి ప్రభుత్వం అమెరికాలో ఐదు రాష్ట్రాలతో ఒక పొత్తు కుదుర్చుకొంది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన అమెరికన్‌లు ఫ్రాన్స్‌లో ఏడాది కన్నా ఎక్కువ కాలం ఉండాలని తలిస్తే, వారి అమెరికన్ డ్రైవర్ లైసెన్స్ కి బదులుగా ఫ్రెంచి డ్రైవర్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఈ లైసెన్స్‌తో యూరోపియన్ యూనియన్ లో అన్ని చోట్ల డ్రైవ్ చెయ్యచ్చు. అమెరికాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, మొదటి ఏడాదిలోపల ఫ్రెంచి డ్రైవింగ్ రాత పరీక్ష, తరవాత రోడ్డు పరీక్ష కూడా పాస్ అయితే, అప్పుడు ఫ్రెంచి డ్రైవర్ లైసెన్స్ ఇస్తారు. ఇది జీవితాంతం ఉపయోగించవచ్చు.
మేము టెక్సస్ నుంచి వచ్చాం కాబట్టి, మొదటి సంవత్సరం అవుతుండగా, డ్రైవింగ్ పరీక్షలకి చదవటం ప్రారంభించాము. కల్యాణి మూడు సార్లు ఈ పరీక్షలో ఫెయిల్ అయ్యి, నాలుగో సారి పాసయి, రోడ్డు పరీక్షలో కూడా పాస్ అయి లైసెన్స్ తెచ్చుకుంది! నేను ఆరు సార్లు రాత పరీక్షే ఫెయిల్ అయ్యి, ఇంక మళ్ళీ పరీక్ష రాసే ఓపిక లేక ఏం చెయ్యాలో ఆలోచించటం మొదలుపెట్టాను. ఈ పరీక్షలు ఇంత కఠినంగా ఉండటానికి ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి. ఈ పరీక్షలు ఫ్రెంచిలో ఉండటం! రెండు. మొత్తం ఇచ్చిన నలభై ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నలో ఇచ్చిన నాలుగు ఛాయిస్‌లలో, ఒకటి కన్నా ఎక్కువ సరైన సమాధానాలు ఉండవచ్చు. అంటే, ఒక ప్రశ్నలోని అన్ని సరైన సమాధానాలు రాస్తే తప్ప, ఆ ప్రశ్నకు మార్కులు పడవు! ఇలా ఇచ్చిన నలభై ప్రశ్నల్లో కనీసం ముప్ఫై ఐదు సమాధానాలు సరిగ్గా ఉంటే, అప్పుడు రాత పరీక్ష పాస్ అయినట్టు లెక్క. నాకున్న ఫ్రెంచి భాషా జ్ఞానానికి తోడు, ఇలాంటి పరీక్ష నాకు కొరుకుడు పడలేదు. ఈ పరీక్షలకి ఒక్కొక్క సారి, రాత్రి 12, 1 దాకా చదివినా, పరీక్షలు పాస్ కాలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో, ఒక చక్కని ఆలోచన వచ్చింది. అమెరికాలో, మిచిగాన్ రాష్ట్రానికి ఫ్రెంచి ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం వల్ల, నాకు మిచిగాన్ డ్రైవర్ లైసెన్స్ వస్తే, ఫ్రెంచి డ్రైవర్ లైసెన్స్ వచ్చినట్టే! ఈ ఆలోచన రాగానే, వెంటనే అమెరికా, మిచిగాన్ రాష్ట్రం, డెట్రాయిట్‌లో రామన్న దగ్గరకి వెళ్ళి, మిచిగాన్ లైసెన్స్ సంపాయించి, దాని ద్వారా ఫ్రెంచి డ్రైవర్ లైసెన్స్ సంపాయించాను. అమెరికా వీసా సంపాయించుకోటానికి మరో దేశం వెళ్ళిన వాళ్ళు తెలుసు నాకు! కాని, ఫ్రెంచ్ డ్రైవర్ లైసెన్స్ కోసం ఫ్రాన్స్ నుంచి అమెరికా వచ్చి తెలుగు వాణ్ణి బహుశా నేను ఒక్కడినే అనుకుంటా!
ఫ్రాన్స్‌లో రైలు ప్రయాణాలు
నాకు రైలు ప్రయాణాలంటే సరదా. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన సంస్థ “భారతీయ రైల్వే” అంటే ఇష్టం, గౌరవం కూడా! నేను అమెరికాకు వలస రాక మునుపు ఇండియాలో రైలు ప్రయాణాలను ఆనందించే వాడిని. ఫ్రాన్స్ వెళ్ళక ముందు చాలా కాలం అమెరికాలో ఉన్నా, ఎక్కువ రైలు ప్రయాణాలు చెయ్యలేదు, కొన్ని చేసినా అవి గుర్తుంచుకో దగ్గ అనుభవాలు కావు. ఫ్రాన్స్‌లో నా రైలు ప్రయాణ అనుభవాలు మరచిపోలేనివి. ఫ్రాన్స్‌లో రైళ్ళు శుభ్రంగా ఉండి చాలా వేగంగా ( గంటకు 300 కిలోమీటర్లు దాకా) వెడతాయి. సామాన్య పౌరుడికి అందుబాటులో ఉండేలా ప్రయాణ టిక్కట్ల ధరలు చవకగా కూడా ఉంటాయి. 12 ఏళ్ళ లోపు పిల్లలకి, 65 ఏళ్ళు దాటిన పెద్దవారికి, 25 నుంచి 40 శాతం తక్కు ఖర్చులో టిక్కెట్లు దొరుకుతాయి. 12 ఏళ్ళ లోపు పిల్లలకు ఏడాది సరిపడ పాస్ తీసుకొంటే, ఆ పిల్లలతో ప్రయాణించే నలుగురు పెద్దలకు 15% టిక్కెట్టులో ధర తగ్గిస్తారు. ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, యూరప్ ఖండం అంతా, ముఖ్యంగా ఫ్రాన్స్ ప్రభుత్వం Public Transportation ని ప్రోత్సహిస్తుంది. లీటర్ పెట్రోల్ ఒకటిన్నర యూరో (దాదాపు రెండు అమెరికన్ డాలర్లు, అంటే గాలన్ పెట్రోల్ ధర ఎనిమిది డాలర్లు), అదీకాక ఫ్రాన్స్‌లో రోడ్లు చాలా చక్కగా ఉన్నా, ఆ రోడ్ల మీద ప్రయాణించటానికి టోల్ కట్టాలి. ఈ కారణాల వల్ల, ఎక్కువ మంది రైళ్ళలో వెళ్ళటానికే ఇష్టపడతారు. గ్రెనోబుల్ నుంచి పారిస్ 600 కిలోమీటర్ల దూరాన్ని, సరిగ్గా మూడు గంటల్లో పూర్తి చెసే ఈ రైలుని TGV ( Trains a Grande Vitesse) అంటారు. గ్రెనోబుల్ కొంత కొండ ప్రాంతం కాబట్టి, అక్కడనుంచి ఫ్రాన్స్‌లో రెండవ పెద్ద పట్టణమైన లియాన్ దాకా ఉన్న 100 కిలోమీటర్లు వెళ్ళటానికి ఒక గంట పడుతుంది. అక్కడ నుంచి పారిస్‌కి మిగిలిన 500 కిలోమీటర్లు రెండు గంటల లోపు పూర్తి చేస్తుంది. ఏ కారణాన్నయినా, మీ రైలు 30 నిమషాలకన్నా ఆలశ్యంగా గమ్యం చేరుకుంటే, మీ వచ్చే ప్రయాణంలో 25 శాతం టిక్కెట్టు తక్కువ ధరకు ఇస్తారు. ఫ్రెంచి వారు గర్వంగా చెప్పుకొనే మరొక విజయం TGV రైలు. చార్ల్స్ డి గల్ ఫ్రెంచి ప్రెసిడెంటు కాలంలో మొదలైన ఫ్రాన్స్ దేశపు పురోభివృద్ధి, 80 దశాబ్దంలో బాగా విస్తరించి రైళ్ళు, టెలిఫోన్, రోడ్ల నిర్మాణం వంటి పనులతో అభివృద్ధి చెంది, ఈ నాడు పశ్చిమ దేశాల్లో ఒక ముఖ్యమైన దేశంగా రూపొందింది.

TVG Train
ఫ్రాన్స్‌లో TGV రైళ్ళు చూసిన తరవాత, ఇప్పటికీ నాలో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది. TGV లాంటి రైళ్ళు ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి ఉన్న 650 కిలోమీటర్లు, రెండు గంటల 15 నిమషాల్లో వెళ్ళచ్చు! హైదరాబాద్ నుంచి ముంబైకి (711 కిలోమీటర్లు) రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. హైదరబాద్‌లో పనిచేస్తూ, ఏ విజయవాడలోనో, రాజమండ్రిలోనో కాపరముంటూ లోకల్ ట్రైన్‌లో వెళ్ళినట్టు ప్రతి రోజూ పనికి హైదరాబాద్ వెళ్ళి రావచ్చు. ఈ ఆలోచన నాకు రావడానికి కారణం ఇది! లియాన్ (ఫ్రాన్స్‌లో పారిస్ తర్వాత అతి పెద్ద పట్టణం) నుంచి పారిస్ రోజూ పనికోసం వెళ్ళి వచ్చే వాళ్ళను నేను చూసాను. అలాగే, ఇండియాలో పూణేలో కాపరముంటూ, ముంబైలో పనిచేసే వాళ్ళున్నారు. ఇప్పటికీ, TGV రైళ్ళు ఇండియాలో ఎప్పటికి సాధ్యమవుతాయా అని ఆలోచిస్తూ ఉంటాను!
ఇంతకీ ఫ్రాన్స్‌లో రైళ్ళు, జపాన్‌లో లాగ magnetic levitation (రైళ్ళ చక్రాలు రైలు పట్టాలకి ఒక అంగుళం పైగా గాలిలో తేలుతూ నడిచే) సూత్రం పై ప్రయాణించే బుల్లెట్ రైళ్ళు కావు! TGV రైళ్ళు మనకి ఇండియాలో బాగా పరిచయమైన ఎలక్ట్రిక్ రైళ్ళ వంటివే! 2007 సంవత్సరం, మార్చ్ నెలలో ఫ్రెంచి వారు TGV రైలు పై గంటకి 574 కిలోమీటర్ల వేగాన్ని సాధించారు. రైళ్ళ నిర్మాణంలోనూ, రైలుకట్టలను వేయటంలోనూ ఫ్రెంచి వారి సాంకేతిక పరిజ్ఞానం వల్లే ఇది సాధ్యమయింది. రైలు వేగం గంటకు 300 కిలోమీటర్లు దాటితే, అందుకు కావల్సిన విద్యుత్ శక్తి (electricity) ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. రైలు టిక్కెట్టు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచడం కోసం, గరిష్ట వేగాన్ని 300 కిలోమీటర్లకు పరిమితం చేసారు.