ఈమాట » మా ఫ్రాన్స్ అనుభవాలు

Expand to right
Expand to left

మా ఫ్రాన్స్ అనుభవాలు

ఫ్రెంచి వారి ఆలోచనా పద్ధతి


ఐఫిల్ టవర్ ముందు కల్యాణి, రమ్య, అనూజ్

“ఒక గదిలో ఒక బల్లమీద ఒక అందమైన వస్తువుని పెట్టి, పది మంది ఫ్రెంచి వారిని ఆ వస్తువుని వర్ణించమంటే, ఏ ఒక్కరు చెప్పింది మరొకరు చెప్పకుండా, పది మంది పది రకాల వర్ణనలు ఇవ్వగలరు!” ఫ్రాన్స్ వెళ్ళక ముందు ఫ్రెంచి వారి గురించి ఒక పుస్తకంలో చదివిన వాక్యమిది. ఇది అక్షరాలా సత్యమని మా మూడేళ్ళ ఫ్రాన్స్ జీవితంలో తేలింది! ఇందుకు కారణాలు చాలా ఉండవచ్చు. ప్రతీ వారు, మిగిలిన వారి కన్నా ప్రత్యేకంగా ఉండాలన్న తహ తహ కావచ్చు. లేదా, ప్రతి విషయాన్నీ ఫిలసాఫికల్‌గా చూడాలన్న ఆలోచన కావచ్చు. ఏది ఏమైనా ఫ్రెంచి వారు చాలా విషయాల్లో ప్రత్యేకంగా ఉంటారు. వారికి, ప్రపంచ రాజకీయాలు, మనుష్యులు, సంస్కృతులు మొదలైన విషయాల్లో చాలా లోతైన అవగాహన ఉంది. వీరితో పోలిస్తే, అమెరికన్లకు చాలా విషయాల్లో, ఫ్రెంచి వారికున్న లోతైన అవగాహన లేదేమోననిపిస్తుంది.


ఐఫిల్ టవర్ పై నుంచి పారిస్ నగరం

మార్చ్ 2003లో అమెరికా దేశపు నేతృత్వంలో, ఇరాక్‌తో యుద్ధాన్ని ఖండించిన దేశాల్లో ఫ్రెంచి దేశం ఒకటి. మామూలుగానే, ఫ్రెంచివారికి అమెరికన్స్ అంటే కొంచెం కోపం (అమెరికన్స్‌కి పొగరు అని ఫ్రెంచివారి అభిప్రాయం). అందుకు తోడు, ఇరాక్ యుద్దంతో మరీ మండిపడ్డారు ఫ్రెంచివారు. లంచ్ టైంలో ప్రతిరోజు తప్పకుండా, అమెరికా యుద్ధ వైఖరి మీద చర్చలు జరిగేవి. అమెరికన్ పౌరులుగా పారిస్‌లోని అమెరికన్ ఎంబసీతో మా కుటుంబ అంతా రిజిస్టర్ చేసుకున్నాము (ఇలా చెయ్యమని మా కంపెనీ ఇచ్చిన సలహా మేరకు). ఈ ఎంబసీ నుంచి మాకు తరచు ఈమైల్స్ వచ్చేవి. వీటి సారాంశం ఏమిటంటే, ఇరాక్‌తో యుద్ధం కారణంగా విదేశాల్లో ఉన్న అమెరికన్ పౌరుల ప్రాణాలకి ఎక్కువ ప్రమాదముంది కాబట్టి, అమెరికన్ పౌరులు విదేశాల్లో గుంపులు గుంపులుగా తిరగొద్దని, ఎప్పుడు బయట తిరగాల్సి వచ్చినా అందరికీ “తాము అమెరికన్ పౌరులం” అని తెలిసేలా ప్రవర్తించ వద్దని. మోటరోలా కూడా మా భద్రత గురించి హెచ్చరించేది. ఇందుకు కారణం - కంపెనీ పని మీద విదేశాల్లో ఉంటున్నాం కాబట్టి, మా భద్రతకు పూచీ మా కంపెనీదే!

నేను కలిసి తిరిగిన నా ఫ్రెంచి స్నేహితులకి, అమెరికన్లు అంటే ఎలాంటి అభిప్రాయాలున్నాయో చెపుతాను. అమెరికన్లు: రెస్టరెంట్లలో గట్టిగా మాట్లాడతారు. వ్యాపార సబంధిత విషయాల్లో, అధికారం తమకే కావాలనుకుంటారు. డబ్బు సంపాయించాలన్న కసి, పట్టుదల అందుకు శ్రమించే ఓర్పు ఉన్నవారు. అమెరికన్ కుటుంబ బంధాలు ఒక పద్ధతి లేకుండా కంగాళీగా ఉంటాయి. ఒక ఐదు నిమషాలు ఒక అమెరికన్‌తో మాట్లాడితే, అది అనాసక్తిగా ఉండి, అమెరికన్లకి లోతైన విషయ పరిజ్ఞానం లోపించినట్టు అనిపిస్తుంది. ఇన్ని ఉన్నప్పటికీ, ఫ్రెంచివారికి అమెరికన్లు అంటే ఒక రకమైన ఇష్టం. వేషభాషల్లోనూ, మనుష్యులతో సాదర సంబంధాలు ఏర్పటు చేసుకోటంలో అమెరికన్లు చాలా కలుగోపుగా ఉంటారని. అసలు చిక్కేమిటంటే, అమెరికన్లు అంటే ఇష్టం లేదని ఫ్రెంచివారు అనుకుంటారని అమెరికన్లు ఎందుకు అనుకుంటారో, ఫ్రెంచివారికి తెలియదు!

ఫ్రెంచి భోజనాలు - వైన్

అసలైన ఆంధ్రా భోజనం ఇష్టపడేవారికి, ఫ్రెంచి వంటకాలు బహుశా చప్పగా ఉంటాయి! ఎందుకంటే, ఫ్రెంచి వారు, మనలాగా కారాలు ఎక్కువ తినరు. ఫ్రాన్స్‌లో మేం ఉన్న మూడేళ్ళలో, ఎప్పుడు ఇండియన్ రెస్టరెంట్‌కి వెళ్ళినా అన్ని వంటకాల్లో కారాలు తక్కుగా ఉండేవి. ప్రత్యేకించి కారం కొంచెం ఎక్కువ వెయ్యమనే వాళ్ళం. ఫ్రెంచి వారు తమదని ప్రత్యేకంగా గర్వంగా చెప్పుకొనేది, భాష తర్వాత, భోజనమే అనుకోవచ్చు. పని రోజుల్లో, ప్రతీ రోజూ మధ్యహ్నం భోజనం టైంలో దాదాపు ప్రతి ఒక్కరు, ఠంచన్‌గా 12 గంటలకు కెఫెటీరియాకి వెళ్ళి, కబుర్లు చెప్పుకుంటూ కలసి భోజనం చేసేవారు. ఆ తరవాత, అందరు కాఫీ మెషీన్‌ల దగ్గర గుమిగూడి, కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ మధ్యహ్నం 2 గంటల దాకా గడిపి తిరిగి పనికి వచ్చేవాళ్ళు. అమెరికన్ల లాగా ఏదో లంచ్ ఇంటి నుంచి పట్టుకు రావడం గాని, ఆఫీస్‌లో టేబుల్ దగ్గరే హడావిడిగా భోజనం చెయ్యటం గాని ఫ్రెంచివారు చెయ్యగా నేను చూడలేదు. వారి జీవితాల్లో భోజనం ఎంత ముఖ్యమో, అందరు కలసి భోజనం చెయ్యటం కూడా అంతే ముఖ్యం. మనుష్యుల మధ్య సంబంధాలు ఏర్పరుచుకోడానికి, పెంచు కోడానికి ఇలా సామూహిక భోజనాలు చాలా ఉపయోగపడతాయి. ఇక భోజనాల్లో సామాన్యంగా వైన్ లేకుండా భోజనం ఉండదంటే అది అతిశయోక్తి కాదు! వైన్ కూడా భోజనంలో ఒక భాగమే! ఫ్రెంచి వాళ్ళంతా వైన్ అంటే అంత ఇష్టం చూపించినా, వైన్ ఇచ్చే నిషా వల్ల తూలి పడిన వారిని నేను చూడ లేదు. అంటే, ఒకటి, రెండు గ్లాసుల వైన్ మాత్రమే భోజనం తోటి పుచ్చుకుంటారు. ఈ వైన్‌లలో తెల్ల వైన్, ఎర్ర వైన్ రెండూ చాలా ముఖ్యమైనవే! భోజనంలోకి ఎటువంటి పదార్ధాలున్నాయి అన్న దానిపై ఎటువంటి వైన్ ఎన్నుకోవాలన్నది ఆధారపడుతుంది. మా ఇంటి యజమాని ఒక సారి, నన్ను, కల్యాణిని, మేం ఉంటున్న ఇంటి పక్కనే ఉన్న తన ఇంటి నేలమాళిగలో దాచిన వైన్ సీసాలు చూపించాడు. నేను, కల్యాణి ఆశ్చర్యంగా ఆ సీసాలకేసి చూస్తూ ఉండిపోయాం. అవి సుమారు 1500 లేక 2000 సీసాలు ఉండి ఉంటాయి! అందులోని ప్రతి ఒక్క సీసా మా ఇంటి యజమానికి గుర్తే! ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ వైన్ తాగాలో, దానికి తగ్గట్టు ఎటువంటి భోజన పదార్ధాలు ఉండాలో వివరంగా ఒక గంట సేపు చెప్పాడు. అలాగే, సెప్టెంబర్ నెలలో, ప్రతి ఏటా చవకగా జరిగే వైన్ అమ్మకాల సీజన్‌లో, రకరకలైన వైన్‌ల పేర్లున్న ఒక పెద్ద చిట్టా పట్టుకొచ్చి మాకు ఎటువంటి వైన్‌లు ఇష్టమో కనుక్కొని ఏంఏం కొనాలో సలహాలిచ్చేవాడు. మాకు కూడా రాను, రాను రకరకాలైన వైన్ రుచుల్లో తేడాలు తెలియసాగాయి. దానికి తోడు, మేం వైన్ రుచులు తెలుకొనటం మీద కొన్ని క్లాసులు కూడా హాజరయ్యాము. సాధారణంగా ఈ వైన్‌లలో 10 నుంచి 13 శాతం మద్యసారం ఉంటుంది! మామూలుగా ఎర్ర వైన్ రూం టెంపరేచర్‌లోనూ, తెల్ల వైన్ కొంచెం చల్లగానూ తాగుతారు. మాకు, ఫ్రాన్స్ వెళ్ళిన తరవాత, “కీర్” అన్న ఒక కొత్త పానీయం పరిచయమయింది. ఒక రకమైన బెర్రీలనుంచి 40 శాతం మద్యసారం ఉన్న ఒక లిక్కర్ (కెసిస్)ను తయారు చేసి, దాన్ని తెల్ల వైన్‌లో కలిపి “కీర్” గా తయారు చేసి తాగుతారు. ఇది కొంచెం తియ్యగా ఉంటుంది! కొంచెం తీపి వైన్‌లను ఇష్టపడేవారికి కీర్ బాగుంటుంది.

ఫ్రాన్స్ దేశాన్ని 21 ప్రదేశాలుగా విభజించవచ్చు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన భోజన, వైన్ ప్రత్యేకతలున్నాయి. ఫ్రాన్స్ దేశంలో ఉత్తర - పశ్చిమ ప్రాంతాలయిన బ్రిటనీ, నార్మండీ ల నుంచి దక్షిణ - తూర్పు ప్రాంతంలో ఒక చిన్న ద్వీపంగా ఉన్న కోర్సికా వరకు, ఆ ఆ ప్రాంతాల భోజన ప్రత్యేకతలు వాటికున్నాయి. ఆలివ్ నూనె ఫ్రెంచి వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. రకరకాలైన ఛీజ్ వీరి భోజనాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రెంచి వారంతా మాంసాహారులే. వీరు అన్ని రకాలైన మాంసాలని తింటారు.

ఫ్రాన్స్ దేశంలో “కెఫే”లు (మన కాఫీ హొటేల్సు వంటివి) చాలా ముఖ్యమైనవి. చైనా దేశంలో టీ దుకాణాలు ఎంత ప్రసిద్ధమో, ఈ కెఫేలు ఫ్రాన్స్‌లో అంత ప్రసిద్ధం. కాకపోతే, ఈ కెఫేలు ఎప్పుడూ సిగరెట్ పొగతో నిండి ఉంటాయి! గంటలు తరబడి కెఫేలలో కూర్చుని తింటూ, స్నేహితులతో మాట్లాడుతూ కాలం గడపటం ఫ్రెంచివారికి అతి ఇష్టమైన పనులలో ఒకటి. కొంచెం వాతావరణం బాగుంటే, కుర్చీలు కెఫే లోపలనుంచి బయటకు తెచ్చుకొని, వచ్చేపోయే వారిని చూస్తూ కాలక్షేపం చేస్తారు. ఇలాంటప్పుడు దేశ, ప్రపంచ రాజకీయాలు మాట్లాడుకోటం ఒక పెద్ద కాలక్షేపం! సిగరెట్ పొగ పడనివారికి, ఫ్రాన్స్‌లో కెఫేల్లోనూ, రెస్టరెంట్స్‌లోనూ కష్టంగానే ఉంటుంది. ఇలా బయట కెఫేలకి, రెస్టరెంట్స్లకి వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకోవలసిన సంగతి ఒకటుంది. మీ సర్వర్‌తో మీరు సఖ్యంగా ఉండి, భోజనంలో మీ ఇష్టాఇష్టాలు ఓపిగ్గా చెప్పండి! ఏ కారణం చేతనయినా మీరు సర్వర్‌తో గొడవ పడ్డారో, మీరు జీవితంలో ఆ రోజు అతి చెత్త భోజనం రుచి చూస్తారు. మేం పారిస్‌లో రెస్టరెంట్‌కి వెళ్ళినపుడు, శాకాహారులకి భోజనంలో ఎక్కువగా ఏమీ దొరకవు కాబట్టి, మా సర్వర్ మాకు ఏం ఇష్టమో కనుక్కొని ఆ రెస్టారెంట్ హెడ్ కుక్‌ని మా దగ్గరకు తీసుకొచ్చి, కల్యాణి, పిల్లలకు, ఆఖర్న నాకు ఏమేం కావాలో కనుక్కొని ప్రత్యేకంగా శాకాహారపు వంటకాలు తయారుచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే, ఆ వంటకాల రుచి అద్భుతంగా ఉండటం! ఫ్రాన్స్ దేశంలో అతి చిన్న చిన్న పల్లెటూర్లలో, బయట నుంచి చూస్తే ఏ మాత్రం గొప్పగా కనిపించని రెస్టరెంట్స్‌లో బ్రహ్మాండమైన భోజనాలు మేం రుచి చూశాం.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6