ఈమాట » మా ఫ్రాన్స్ అనుభవాలు

Expand to right
Expand to left

మా ఫ్రాన్స్ అనుభవాలు

ఫ్రాన్స్‌లో మా ఇల్లు, ఊరు పరిచయం

ఇంతకు ముందే చెప్పినట్టు, మా కుటుంబం అంతా ఫ్రాన్స్‌కి బదిలీ అవ్వక పూర్వం, నేనూ కల్యాణి ఒక వారం రోజులు మేం వెళ్ళబోయే ప్రదేశం బాగుందా లేదా చూసుకోటానికి వెళ్ళాం! దీన్నే Look-see-trip అంటారు. పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయో చూసిన తరవాత, ఇళ్ళ వేటలో పడ్డాం. మోటరోలా కంపెనీ ద్వారా ఏర్పాటు చెయ్యబడ్డ relocation agents మాకు అక్కడ ఖాళీగా ఉన్న ఇళ్ళు చూపించారు. అందులో కొత్తగా కట్టడం పూర్తి కాబోతున్న ఇల్లు ఒకటి కల్యాణికి బాగా నచ్చింది. ఇళ్ళ సెలెక్షన్‌లో పూర్తిగా ఆడవాళ్ళ అభిప్రాయాలకి ఎక్కువ విలువ ఇవ్వటం మంచిదని నాకు అనిపించింది (రోజులో ఎక్కువ కాలం ఇంట్లో గడిపేది వాళ్ళే కదా!). ఒక ఎకరం పైగా విస్తీర్ణం ఉన్న జాగాలో చాలా అధునాతనంగా కట్టిన ఇల్లు అది. అందులో, ఆ ఇల్లు ఆల్ప్స్ పర్వతశ్రేణికి ఎదురుగా, చిన్న చిన్న పర్వతాల మధ్యలో, సారవంతమైన కొండవాలు నేలపై ఉంది. మొత్తం ఇంటి జాగా అంతా కలిపితే, 2000 చదరపు అడుగులు కూడా ఉండదు (మేం టెక్సస్ నుంచి వచ్చామని, ఈ మాత్రం వైశాల్యమున్న ఇళ్ళను అతి చిన్న ఇళ్ళుగా తలుస్తామని గుర్తుంచుకోవాలి!). పైగా, రెండు అంతస్తులున్న ఈ ఇంటికి ఏర్ కండిషనింగ్ లేదు! కానీ, కొండ వాలుపై ఉన్న ఇల్లు కాబట్టి, వేసవిలో ఎంత వేడిగా ఉన్నా (2003 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో ఎండ వడ దెబ్బకు అతి ఎక్కువ సంఖ్యలో జనాలు చనిపోయారు!), సాయంత్రానికి చల్లబడి, చాలా ఆహ్లాదంగా ఉండేది! ఆ ఇంటి నిర్మాణ శిల్పంలో (archtecture) రెండు విషయాలు మమ్మల్ని బాగా ఆకర్షించాయి. మొదటిది, ఇంటి కిటికీలన్నింటికి ఉన్న ఎలక్ట్రానిక్ తెరలు. ఈ తెరలకి వాడిన మోటార్లు ఎలాంటివో గానీ, ఉన్న మూడేళ్లలో ఒక్కసారి కూడా వాటి శబ్దం మాకు వినపళ్ళేదు. అంత నిశ్శబ్దంగా పనిచేసేవి. అంతేకాకుండా, వేసవిలో మిట్ట మధ్యహ్నం ఎండ ఇంట్లోకి రాకుండా, ఈ తెరలు పూర్తిగా వేసి, ఇంటిని పూర్తిగా చీకటిమయం చెయ్యచ్చు! రెండోది, చలి కాలంలో ఆ ఇంటికి కావలసిన వెచ్చతనం అంతా, ఇంటిలోపల ఫ్లోర్ మీద ఉన్న టైల్స్ నుంచే వస్తుంది! నీటిని వేడి చేస్తూ వాటి ద్వారా ఇంటికి కావలసిన వేడినిచ్చే ఎలెక్ట్రిక్ హీటర్లన్నీ ఆ టైల్స్ కింద ఉండేవి!


స్నోలో పూర్తిగా కప్పడిన మా ఇల్లు

పనిలో నా అనుభవాలు

నేను మోటరోలా కంపెనీలో పని చెయ్యక ముందు, ఎస్. టి. మైక్రో ఎలెక్ట్రానిక్స్ కంపెనీలో, డాలాస్, టెక్సస్‌లో పనిచేసాను. ఆ అనుభవంతో, మళ్ళీ ఎస్. టి. మైక్రో ఎలెక్ట్రానిక్స్ కంపెనీతో పని చెయ్యటం తేలికే అన్న భావన కూడా నన్ను ఫ్రాన్స్ రప్పించడానికి ఒక కారణం. పనిలో నాకు ఎదురైన అనుభవాలు అంతకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మా మూడు కంపెనీలు కలిసి, పనిలో ఒకరికొకరు ఇంగ్లీషులో మాట్లాడుతూ బిజినెస్ చేయ్యాలని రాత పూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నా, అందరూ ఫ్రెంచిలోనే మాట్లాడేవారు! మా మీటింగులన్నీ ఫ్రెంచిలోనే జరిగేవి! ఏ మీటింగుకి వెళ్ళినా ఏమీ అర్ధంకాక, తిరిగి వచ్చేవాణ్ణి. నా అమెరికన్ సహోద్యోగులకీ, నాకయిన అనుభవమే ఎదురయ్యింది. విచిత్రం ఏమిటంటే, మా మీటింగుల్లో ఏదైనా స్లైడ్స్ చూపిస్తున్నప్పుడు, ఫ్రెంచి వారి స్లైడ్స్ అన్నీ ఇంగ్లీషులోనే ఉండేవి! కానీ, మాట్లాడటం అంతా ఫ్రెంచిలోనే. దీనికి కారణం తెలియాటానికి నాకు దాదాపు రెండేళ్ళు పట్టింది. ఫ్రెంచి పిల్లలంతా, స్కూళ్ళల్లో ఇంగ్లీషు బాగానే నేర్చుకుంటారట! అందువల్ల వాళ్ళకి, ఇంగ్లీషు బాగానే వచ్చు. కానీ, ఇంగ్లీషు రాయటం వచ్చినంత బాగా, ఫ్రెంచి వాళ్ళకి ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అందుకని, ఇంగ్లీష్ మాట్లాడితే, తప్పులు దొర్లుతాయని, ఫ్రెంచిలోనే మాట్లాడతారు. దానికి తోడు, వాళ్ళ భాషాభిమానం కూడా ఇందుకు తోడయ్యింది! అందుకని, మమ్మల్ని ఫ్రెంచి నేర్చుకోమని ప్రోత్సహించే వాళ్ళు! భాషాపరంగా ఇటువంటి ఇబ్బందుల వల్ల, ప్రతిరోజు, పని పూర్తయి ఇంటికి వెడుతున్నప్పుడు ఎంతో అలసటగా ఉండేది! పని పెద్దగా చెయ్యకపోయినా, ఇలా ఫ్రెంచివారితో కలసి, ఫ్రెంచి అర్ధం చేసుకోటానికి ప్రయత్నించటం ఎంత కష్టమో అనుభవంలోకి వచ్చింది! భాష బాధలు పక్కనపెట్టి, మిగిలి విషయాల్లో నైనా కాస్త పని తేలికగా అవుతుందని అనుకుంటే, అక్కడ కూడా చుక్కెదురే! ఇందుకు కారణం, ఫ్రెంచి వారి ఆలోచనా పద్ధతి, బిజినెస్ విషయాల్లో ఫ్రెంచివారి సంస్కృతి, అమెరికన్ల కన్నా పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఫ్రెంచివారు, తెలివైనవారే కాని, అమెరికన్లంత గట్టిగా పని చెయ్యరు (అక్కడక్కడా గట్టిగా పనిచేసిన ఫ్రెంచి వారు కనపడినా!). ఏడాదిలో నలభై రోజులు శలవ తీసుకోటం తప్పని సరి! అది ఫ్రెంచి ప్రభుత్వపు రూలు! (చిన్నప్పుడు ఎవరైనా ఎక్కువ రోజులు కనపడకపోతే, వాడు ఫ్రెంచ్ లీవు మీద వెళ్ళాడని ఎందుకనేవారో నాకు ఫ్రాన్స్ వెళ్ళిన తరవాత అర్ధమైంది) వారానికి, 35 గంటలు పని మాత్రమే చేస్తారు. వారాంతరాల్లో, సాధారణంగా ఫ్రెంచివారు ఎవ్వరూ, ఆఫీసులకి రారు. నా పని అనుభవాల్లో, అమెరికన్లు చాలా మంది, శని, ఆది వారాల్లో పనికి వచ్చేవారు. ఏడాదికి ఉన్న 40 శలవు దినాల్ని, ఫ్రెంచి వారు చక్కగా ఉపయోగించుకొని, కుటుంబాలతో విహార యాత్రలకి, దేశాలు చూడటానికి వెడతారు. నిజానికి, ఒక శలవు నుంచి ఫ్రెంచి వారు పనికి రాగానే చేసే మొదటి పని - రాబోయే శలవుల్లో ఎక్కడకి వెళ్ళాలో, ఏమి చూడాలో ప్లాన్6 చేసుకొని దానికి తగ్గ సన్నాహాలు చేసుకోటం! ఆగస్టు నెల మొత్తం అంతా, మొత్తం ఫ్రెంచి దేశం, శలవులో ఉంటుందంటే, అది అతిశయోక్తి కాదు. మేం ఫ్రాన్స్ వెళ్ళిన తరవాత వచ్చిన మొట్టమొదటి ఆగష్టు నెలలో, మా పనిలో దాదాపు 60 - 70 శాతం ఫ్రెంచి ఉద్యోగులు శలవు తీసుకోటం చూసాను.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6