ఈమాట » “మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

Expand to right
Expand to left

“మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

1.4.3 గర్భ నియంత్రణ -మాతృత్వపు విలువలు

గర్భ నియంత్రణ, మాతృత్వం గురించీ స్త్రీ వాదులకున్న అభిప్రాయాలను రచయిత్రి జయంతి పాత్రను ఆసరాగా చేసుకొని చర్చించే ప్రయత్నంచేశారు. శేషగిరిని చేసుకొని, ‘సుఖపడని’ జయంతి, ఆతని వల్ల వచ్చిన గర్భాన్ని తీయించేసుకొంది. ఇక పిల్లలు పుట్టరని తెలిసి చాలా బాధ పడింది. రెండవపెళ్ళి చేసుకోవడానికిష్టపడే పరిస్థితి ఎలాగూ లేదు. మళ్ళీ ఎటువంటి వాడు భర్తగా వస్తాడో, దానికంటే పెళ్ళి చేసుకోకుండా అలాగే ఉండిపోవడం మంచిదనుకుంది. కానీ, జీవితాన్ని దగ్గరగా పరిశీలించడం వల్ల తన చెల్లి దమయంతి చనిపోవడంతో గోపాలకృష్ణను చేసుకోవాలనుకుంది. కానీ, అతను అంగీకరించలేదు. పిల్లలను మాత్రం ఆమె నర్సరీలో డబ్బు చెల్లించి ఉంచడానికి అంగీకరించాడు. ఉద్యోగం మానేసి నర్సరీ పెట్టింది. పిల్లల పట్ల ఉండే మమకారం తీర్చుకోవడానికి ఇదో మార్గంగా చేసుకొంది. కేతు విశ్వనాథరెడ్డి గారు వ్యాఖ్యానించినట్లు జయంతి జీవిత వైఫల్యం నుండి యాదృచ్చికంగా ‘సేవ’ పుట్టుకొచ్చిందా! చైల్డ్ నర్సరీ పెట్టడంలో ఒంటరితనాన్ని పోగోట్టుకోవాలను కోవడమే కారణమా, లేక దివాకర్ని ఇష్టపడినా, అతడు మొదటి ఇష్టపడి, తనకంటే ఆర్ధికంగానూ, శారీరకంగానూ అందమైన గొప్ప సంబంధం రావడంతో మనీషాని పెళ్ళి చేసుకోవాలని భంగపడి, మళ్ళీ జయంతిని పెళ్ళిచేసుకోవాలని అనుకోవడం, దాన్ని ఆత్మగౌరవానికి భంగకరంగా భావించి తిరస్కరించడంలో జయంతి పాత్రలో అంతర్లీనంగా స్త్రీవాద భావాలున్నాయి,

ఒంటరిగా మిగిలిందను కోవడంలో కూడా కొన్ని సమస్యలున్నాయి. ‘పిల్లలను కనడం’ వేరు మాతృత్వాన్ని అనుభవించడం వేరువేరుగా స్త్రీవాదులు భావిస్తున్నారా? ఈ నేపథ్యాన్ని దీనికి అనువర్తించుకొంటే ఒంటరితనం పోవడానికో, పిల్లలు పుట్టలేదు కనుక మాతృత్వానికి అవకాశం లేక ‘మాతృత్వ భావం’ తో జీవించడానికి నిర్ణయించిందను కోవడమో సరికాదనే అవకాశం కూడా ఉంది. కానీ, స్త్రీ వాదులు భావించినట్లు “మాతృత్వాన్ని నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరంగానో, అద్భుతమైన స్వభావంగానో చూడాలనుకుంటే, అది స్త్రీలకు పునరుత్పత్తి స్వేచ్చ వున్నప్పుడే జరుగుతుంది. పిల్లలని కనటం, మాతృత్వం ఒకటి కాదు ” అనే భావనతో చెప్పిన సందర్భంగా కాకుండా నవలలో “జీవితంలోనే కోల్పోయిన ఆనందం ఈ పసిమొగ్గల్లో వెతుక్కోవాలనే నా తాపత్రయం” అని (పుట: 195) అనడమే కాకుండా, “నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ… అదే స్వర్గమూ…. “తాను ఆ భాగ్యానికి నోచుకోలేదు. ఈ జన్మలో - కన్నీటి పొరల మధ్యనుంచి గోపాలకృష్ణ కనుమరుగయ్యే వరకు చూసింది ” అని ముగించడం వల్ల, నిరాశా, నిస్పృహలనుండి, ఒంటరితనం పోగొట్టుకోవాలను కోవడం ఆ నేపథ్యం నుండి చైల్డ్ నర్సరీ ఏర్పర్చడం స్త్రీ వాదానికి బలమైన సమర్ధనిచ్చే ముగింపు ఎలా అవుతుందో ఆలోచించ వలసిందే!.

1.4.4 ఆర్థిక సంఘర్షణలు - సర్థుబాటు మనస్తత్త్వం

ఈ నవలలో దివాకర్, మనిషా పట్ల పెంచుకొనే ఆకర్షణలో ఆర్థిక కోణమే ప్రాధ్యానత వహించింది. జయంతి, దివాకర్ పట్ల ఆకర్షణ పెంచుకోవటంలో ఆర్ధిక కోణంతో పాటు, మానసిక అనుభూతులు, కలలు ఆశలు వ్యక్తమయ్యాయి. మనీషా, దివాకర్ని తిరస్కరించడంలో ఉన్నత వర్గం ( తరగతి )లో కనిపించని సమస్యలు మధ్యతరగతిలో కనిపించాయి. ఉషారాణి అమెరికా సంబంధాన్ని చేసుకున్నా, సర్దుబాటు తప్పలేదని తెలుస్తుంది.

మనోవిజ్ఞాన శాస్త్రంలో సర్దుబాటునే, ‘ఆనుగుణ్యత’ సిధ్దాంతం అంటారు. కొన్ని సర్దుబాటులు సమాజానికి అవసరమయితే, మరికొన్ని సర్దుబాటులు అభివృద్ధి నిరోధకాలవుతుంటాయని సైకాలజీ చెబుతుంది. ఆ సర్దుబాటు అనేది సమన్వయం కూడా సాధించవలసి ఉంటుంది. దీన్ని స్త్రీవాదానికి అనువర్తించే ప్రయత్నం ‘మనసున మనసై’ నవలలో కనిపిస్తుంది. అవసరమైన సర్దుబాటుని గోపాలకృష్ణ - దమయంతి పాత్రల్లోనూ, ఉండకూడని సర్దుబాటుని శేషగిరి - జయంతి పాత్రల్లోనూ చిత్రించారు. అయితే ‘జయంతి’ పాత్రలో రెండు కోణాలు పెట్టి అవసరమైన సర్దుబాటు కుటుంబ అవిచ్చిన్నతను కాపాడుతుందనీ, అనవసరమైన సర్దుబాటు స్త్రీలో ఆర్ధికపరమైన శక్తి సామర్ధ్యాలతో పాటు, ఆత్మ గౌరవాన్ని పెంపొందించు కోడానికి తోడ్పడుతుందనే స్పృహ కలిగించారు.

అన్నింటినీ సర్దుకుపోవడం కూడా మంచిదికాదు. అవసరమైతే సంఘర్షణ పడినా, ఆ సంఘర్షణలోనూ ఆనందం ఉంటుంది. సంఘర్షణ వల్ల వెంటనే ఫలితాలు రాకపోవచ్చు కానీ, భవిష్యత్తు తరాలు స్వేచ్చగా, ఆత్మగౌరవంతో సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారూ జీవించడానికి కొన్ని సంఘర్షణలు కూడా తప్పవు. ‘సంఘర్షణ’ వల్ల కొన్ని జీవితాలు అశాంతికీ, ఒంటరి తనానికీ కూడా గురై, త్యాగాలకు సిద్ధం కావలసి వస్తుంది. వీటి నేపథ్యంగానే స్త్రీ ఉన్నత చదువు, వివాహ వయస్సు, కుటుంబం, లైంగికత్వం, ఆర్ధిక స్వాతంత్ర్యం, ఉద్యోగ నిర్వహణ వంటి అంశాలు ప్రాధాన్యతను వహిస్తుంటాయి. ఇలాగే నవలలో వివిధ పాత్రలు ఒదిగిపోయాయి.

నవల చదువుతున్నపుడు కొన్ని అక్షర దోషాలు పఠితకు ఇబ్బందిని కలిగిస్తాయి. రచయిత్రి కొన్ని పాత్రల పేర్లని మార్చేశారు. శేషగిరి చెల్లెలు, తమ్ముడు పేర్లు అమాంతంగా మారిపోయాయి. ‘శశి’ అని (పుట: 108, 109 ) ‘శాంతి’ అనీ (పుట: 116,119) మార్చేశారు. సాంకేతికంగా కలిగిన ముద్రణా దోషాల వల్ల వాక్యాలు మళ్ళీ మళ్ళీ ముద్రితమయ్యాయి.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7