ఈమాట » “మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

Expand to right
Expand to left

“మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

1.4 నవలలో స్త్రీవాద దృక్పథం

సమాజంలో స్త్రీ నైతిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మౌలికమైన మార్పులను ఆశించడం, వ్యక్తిగత అనుభవాలతో కలిగిన అవగాహనతో పరిష్కారాలని సాధించడం, జీవితాన్ని అర్థం చేసుకోవడానకకి అనేక కోణాలను సూచించడం స్త్రీవాద ఉద్యమంలో కనిపించే కొని ప్రధాన లక్ష్యాలు. పురుషులతో పాటు స్త్రీలకు సమానహక్కులు కోరుకోవటం వీటిలోనూ మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే స్త్రీ చదువు, స్వతంత్ర ఆలోచన, గర్భనియంత్రణ నిర్ణయాధికారం, వివాహం, కుటుంబం, పిల్లలు, పురుషాధిపత్యం, ఇంటి చాకిరీ స్వభావం, పితృస్వామ్యం, మాతృస్వామ్యం పట్ల అవగాహన, శ్రమకు విలువకట్టడం, లైంగికత్వంలో విచక్షణ, మాతృత్వానికీ, పిల్లలను కనడానికీ మధ్య తేడాని గుర్తించడం, స్త్రీలు సున్నితంగా లలితమైన పదాలతో, మర్యాదా రేఖలను అతిక్రమించకుండా రాయాలనడంలోకనిపించే జెండర్ విధానాన్ని గుర్తించడం, ఆలోచనలతో పాటు తిరుగుబాటు తత్త్వాన్ని పెంపొందించడం, తద్వారా స్వేచ్ఛా జీవితాన్ని స్త్రీ అనుభవించగలిగే అవగాహనను కలిగించడం వంటివన్నీ తెలిసి విమర్శించమనడం కూడా స్త్రీవాద దృక్పథంలో కనిపిస్తుంది. వీటిలో ప్రాధాన్యతను వహించే లక్ష్యాలు, స్వభావాన్ని బట్టే లిబరల్ రాడికల్ ఫెమినిజం వంటి విభజనలు వస్తున్నాయి. చాలా వరకూ ఈ అంశాలను ‘మనసున మనసై’ నవలలో తనదైన దృక్పథంతో చెప్పించే ప్రయత్నం చేశారు రచయిత్రి!

1.4.1 సమాన హక్కులు - బాధ్యతలు

స్త్రీ పురుష సమాన హక్కులు అనేవి ఒకరిస్తే వచ్చేవికాదు. పొందడం ద్వారా మాత్రమే వస్తాయి. అయితే పొందడంలో ఒకవైపునుంచి ఆటంకాలు ఎదురవుతాయి. ‘ఆటంకాలను’ అధిగమించినప్పుడే సాధించగలగడం సాధ్యమవుతుంది లేకపోతే హక్కులు కొందరి దగ్గర ఉన్నవి మరికొందరికివ్వడమే అవుతుంది. కానీ తరతరాలుగా కొందరే అనుభవించడం వల్ల ఆటంకాలని అధిగమించి సాధించడం అనేది హక్కులని పొందడంగా, సాధించుకోవడంగా, కొందరి దగ్గరే కేంద్రీకృతం అయిపోవడంలో ఆశ్చర్యం కూడా లేదు. హక్కులు మగవాళ్ళ దగ్గరే ఉండిపోవడం, అవి తమకీ కావాలని కోరుకోవడం, పోరాడడం, లాక్కోవడం అనేవి క్రమానుగ్రతంగా జరగవలసినవే! ‘జయంతి’ పాత్రను చిత్రించడం లో రచయిత్రి ఈ పరిణామాలు కొంతవరకకు చిత్రించారు, స్పర్శించగలిగారు. జయంతిని పెంచడంలో, చదివించడంలో, ఉద్యోగం చేయడంలో వచ్చిన జీతాన్ని తానే ఖర్చు పెట్టుకోవడంలో ఎక్కడా వివక్షను ప్రదర్శించలేదు. పైగా చదువుకొన్నప్పుడు గానీ, ఉద్యోగం చేసేటప్పుడు గానీ స్వతంత్రంగా ఓ పెళ్ళి కొడుకుని చూసుకోలేక పోయినట్లు కూడా చిత్రించారు. 32 యేండ్ల వరకూ పెళ్ళిచేయకపోవడానికి అవకాశం ఇవ్వడంలో తొందరగా పెళ్ళి చేసి పంపేయ లేదనీ తెలుస్తుంది. అయినా, ఆమె పెళ్లి చేసుకోవడానికి స్వాతంత్ర్య నిర్ణయాలు తీసుకోలేదు. జీవితం పట్ల ఆమె అవగాహనా రాహిత్యమనే దానికి కారణమని అర్థమవుతుంది. ఈ అవగాహన అనేది తన జీవితం పట్ల తాను చదివిన చదువులు అందించిన అవగాహనగానే తెలుస్తుంది. దమయంతిని పోలుస్తూ జయంతిని ఎత్తి పొడుస్తూ తల్లి అంటున్న మాటల్లో ఇలాంటి స్వభావం వ్యక్తమయ్యింది. ఇంగిత జ్ఞానం, తెలివి వుంది కనుక దమయంతి తన అర్హత తాను తెలుసుకుని ఈ సంబంధం చేసుకుంటానంది. అతనూ సంతోషంగా ఒప్పుకున్నాడు. దానికి తల్లిదండ్రి పడే కష్టం తెలుసు మంచీ చెడ్డా తెల్సింది కనుక పెద్దకోరికలు పెట్టుకుని విర్రవీగడం లేదు” (పు: 11) ఇక్కడ దమయంతి కంటే జయంతికి జీవితావగాహన లేదనీ స్పృహ కలుగుతుంది!

ఇరవై ఎనిమిదేళ్ళ వయసు వచ్చినప్పటి నుండీ జయంతికి పెళ్ళి చేయాలని ప్రయత్నించి, చివరికి ముప్ఫై రెండు యేళ్ళనాటికి పెళ్ళి చేయగలిగారు. దాన్ని ఆమె నిలబెట్టుకోలేక పోయింది. పోనీ, మంచి సంబంధం తాము చేయలేదనడానికీ అవకాశం ఇవ్వకుండా, పెళ్ళి చేసుకోవడంలో జయంతికీ స్వతంత్ర్య నిర్ణయానికి అవకాశామిచ్చినట్లు తల్లి మరొక సందర్భంలో అన్నమాటలే నిదర్శనం. “నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నీవు వెతుక్కో”మనే తండ్రి అభిప్రాయాన్ని తల్లి నోటితో చెప్పించారు రచయిత. వీటన్నింటిలోనూ “స్వేచ్ఛ” ను అనుభవించడంలో జయంతికి ఏ మాత్రం లోపం జరగలేదు. స్వేచ్చ ఆమె జీవితంలో వాస్తవ జీవితావగాహన కలిగించ లేకపోయిందనీ, తల్లి తండ్రులు మాట వినకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకొని విడాకులిచ్చి, అబార్షన్ చేయించు కోవడం వల్లనే ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చిందని, దానికంతటికీ సర్దుబాటు లేకపోవడం ప్రధాన కారణమనీ రచయిత్రి సూచించినట్లయ్యింది.

1.4.2 స్త్రీ ఉన్నతవిద్య - తదనంతర పరిణామాలు

స్త్రీ ఉన్నత విద్య చదివినా, అవి కొన్ని తరగతులలో, ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలలో స్త్రీ పురుషుల మధ్య కలిగించే ఘర్షణలు ఎలా ఉంటాయో ‘జయంతి’ పాత్రలో శేషగిరిని చేసుకోవడాన్ని బట్టి చిత్రించే ప్రయత్నం చేశారు. శేషగిరి ఎత్తుగా, కొంచెం రంగు కలిగి ఉండి, ఉన్నత చదువు, జీతం, హోదాలు ఉండటం వల్ల జయంతి పెళ్ళిచేసుకున్నా వివాహానంతరం తన కలలు కల్లలై పోయిన స్థితిని చిత్రించారు. రచనా దృక్కోణం మగ పాత్రను సమర్ధించే ధోరణిలోనే కొంత వరకూ సాగింది. శేషగిరి సర్దుకుందామనుకొన్నా, జయంతి సర్ధుబాటు చేసుకోలేనట్లు చిత్రితమయ్యింది. జయంతికి వివాహం అయిన తర్వాత, హానీమూన్ వెళ్ళాలనే కోరిక ఉండటం, దాన్ని తీర్చుకోవడంలో ఆధిపత్యాన్ని చెలాయించేటట్లు వర్ణితమయ్యింది తప్ప, ఎక్కడా శేషగిరి మాటలని పట్టించుకొన్నట్లులేదు. ‘జండర్ విధానం’ కొంత ఉన్నా జయంతి సున్నితంగా తన కోరికను చెప్పడమనేది కాదిక్కడ!

శేషగిరి చేత సున్నితంగా చెప్పించడామే కాకుండా, గిఫ్టులు తన కుటుంబం వారికే కొనడం, అత్తగారి వైపు వారికెవరికీ కొనక పోవడం వంటివి చేసినట్లు రచయిత్రి వర్ణించడం లోని ఆంతర్యం కొంత సందేహాస్పదమే అవుతుంది. కానీ, శేషగిరి ఏ పనీ చేయకుండా, జయంతి చేత వంట పనులు బలవంతంగా చేయాలని చూడడంలో సమాజంలో మానసికంగా స్థిరపడి పోయిన భావనను చిత్రించగలిగారనుకోవచ్చు. పైగా, ఆధిక్యతను ప్రశ్నించినట్లయితే, వర్తమాన సమాజ పురుషాంకారానికి ప్రతీకగా శేషగిరి రెండవ వివాహం కనిపిస్తుంది. అదీ ఉన్నత చదువు చదవని, ఇంటర్ చదివి మానేసిన, ఉద్యోగం చేయని అమ్మాయిని చేసుకోవడంలో ఆ కోణం కనిపిస్తుంది. సర్దుబాటు లేని జయంతి వివాహాన్ని స్వేచ్ఛకు ఆటంకంగా మార్చుకొంటే, అదే మధ్య తరగతికి చెందిన దమయంతి సర్దుబాటు చేసుకోవడం వల్ల జీవితాన్ని ఆనందమయం చేసుకొంది. గోపాలకృష్ణలో బాహ్య ఆకర్షణ కంటే ఆంతరంగిక సౌందర్యం ఉండటం కూడా కారణమయ్యింది. ‘జయంతి, శేషగిరి’ ల మధ్య కొరవడిన సర్దుబాటు, ‘దమయంతి - గోపాలకృష్ణ’ ల మధ్య పరస్పరం కలిగి ఉండటం వల్ల, దమయంతి హాఠాత్తుగా చనిపోయినా, మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి కూడా మనస్కరించని స్థితికి గోపాలకృష్ణ చేరుకో గలిగాడు.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7