“మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

1.3 రచయిత్రి పరిచయం

రచనకు ఏదొక సామాజిక ప్రయోజనం ఉండాలనే ఆశయంతో రాస్తున్నట్లు చెప్పకొంటున్న శ్రీమతి దూర్వాసుల కామేశ్వరి, ‘ డి. కామేశ్వరి ‘ గా ప్రసిద్ధి. 1935 ఆగస్టు 22 న కాకినాడలో పుట్టి, మెట్రిక్యులేషన్ వరకూ చదివారు. పెళైన తర్వాత 1952 నుండి 1984 వరకూ భర్త చేస్తున్న ఉద్యోగప్రాంతం ఒరిస్సాలోనే ఉన్నారు. 1962 లో అంటే 27 వ యేట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించి ఒక దశాబ్దం గడవకుండానే, ” కథేశ్వరి ” గా కీర్తింపబడ్డారు. ఆమె సుమారు 250 కథలు, 20 నవలలు రాశారు. ” కొత్తమలుపు ‘ నవల ” న్యాయంకావాలి ” సినిమాగా రూపొందింది. వీరి కథలు, నవలలు కన్నడ, తమిళ, హిందీ భాషలలో అనువాదమయ్యాయి.

ఒక ఇంటర్వ్యూలో రచయిత-వ్యక్తిత్వం గురించి ఆమె తన అభిప్రాయాన్ని చెబుతూ – “సమాజంలో సంఘటలను తన రచనా సామర్ధ్యంతో పాఠకుల ముందుంచడం వరకే రచయిత బాధ్యత. చెప్పిందల్లా రచయిత ఆచరించాలని, రాసిందల్లా చేసి తీరాలని లేదు – నేను నా రచనలతో సామాజిక చైతన్యాన్ని, సాంఘిక విప్లవాన్ని సృష్టిస్తానని ఎన్నడూ అనుకోలేదు. రచనతో సాంఘిక విప్లవాలు వచ్చేస్తాయని నేను నమ్మను కానీ, ఆ రచన ఏదో ఒక సామాజిక ప్రయోజనం కలగడానికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను” అని అన్నారు. ఈ అభిప్రాయాలలో వైరుధ్యం కనిపిస్తున్నా, అవే వాస్తవాలనుకోవడానికీ లేదు. అలాగే వాస్తవం కాదనీ చెప్పలేం. అంటే రచనలన్నీ సాంఘిక విప్లవాలు సృష్టించకపోవచ్చు. రచనలు సాంఘిక విప్లవాలకు ప్రత్యక్షంగా దోహదం చేయక పోయినా, పరోక్షంగానైనా కొన్ని రచనలు అలాంటి ప్రభావాన్ని చూపాయని చరిత్ర నిరూపిస్తునే ఉంది. అయితే, ఆ రచనలో ఉండే వస్తు, శిల్పాలను బట్టి ఆ ప్రభావమనేది ఆధారపడి ఉంటుంది. ఆ రచన ఉత్పత్తి చేసిన వారిని బట్టీ, ఉత్పత్తి శక్తులను బట్టీ కుడా ఆ ప్రభావం ఉండవచ్చు. రచయిత్రి ఒక రచన వల్లనే విప్లవాలు వచ్చేస్తాయని భావించకపోయినా రచన వల్ల ప్రభావం అయినా కలగాలనే ఆకాంక్ష లేకపోతే “తరతరాలుగా వస్తున్న పురుషాహంకారం పూర్తిగా వదలడానికి యింకా కొన్ని తరాలు పట్టవచ్చు. భార్య అంటే జీవిత భాగస్వామిగా ప్రేమ, అనురాగం సానుభూతి పంచియిచ్చే భర్తలను ముందు తరంలో మనం చూడవచ్చు” అని ఎలా ఆశించగలరు?. ఈ మార్పులు కేవలం రచనలు రాసి ఊరుకొంటే వచ్చేస్తాయని భావించడం సరికాదనే స్పృహ రచయిత్రి అభిప్రాయంలోనే కనిపిస్తుంది.

ఉద్యమాలు అనేవి రచనా పరంగానే కాకూండా, క్రియాత్మకంగా కూడా జరగవలసి ఉంది. ఇక, రచయిత్రి నవల ద్వారా చెప్పదలచిన అంశాలను విశ్లేషించుకుంటే స్త్రీ సమస్యలని అర్థం చేసుకోవలసిన అవసరం పురుషులకీ, అలాగే పురుషుల్లో తరతరాలుగా పేరుకుపోయిన ‘అహంకారం’ కూడా అర్థంచేసుకుని స్త్రీ సర్దుబాటు చేసుకొంటూ, క్రమక్రమంగా మార్పుని సాధించడం మంచిదనే సందేశం కనిపిస్తుంది. ఆశయాలు ఆచరణలోకి వచ్చేటప్పటికి కొన్ని జీవితాలు సంఘర్షణలతో కూరుకుపోవలసిన పరిస్థితి ఏర్పడి, మానసికంగా, శారీరకంగా అశాంతికి కారణమై, ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదాన్ని గుర్తించమంటున్నారు రచయిత్రి. వీటిని ‘జయంతి’ పాత్ర ద్వారా దృష్టిని కేంద్రీకరించి, వివరించే ప్రయత్నం చేశారు. కొంత మంది రచయితలు/రచయిత్రులు తమ నవలలలో పాత్రలను తమ తమ ఆశయాల సాధనకు అనుగుణంగా మార్చుకొంటూ ఉంటారు. అలాంటప్పుడు పాత్రలను చిత్రించడంలో ఏ మాత్రం రాజీపడరు. జయంతి పాత్రను చిత్రించడంలో రచయిత్రి ఆశయ ప్రతిఫలనం కనిపిస్తుంది.