“మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ
1.2 నవలా సారాంశం
పద్మావతి - వెంకటేశ్వరరావులకు వాసంతి, జయంతి, దమయంతి అనే ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. అప్పటికే తల్లిదండ్రులు వాసంతికి పెళ్ళి చేసి, జయంతికి పెళ్ళిచేయాలనే ఆత్రుతతో ఉన్నారు. గోపాలకృష్ణ అనే బ్యాంకు ఉద్యోగిని చూస్తారు. అతను జయంతిని చూడ్డానికి వస్తాడు. నల్లగా, బట్టతలతో ఉన్న అతను జయంతికి నచ్చడు, ఆ విషయాన్ని అతనింకా బయటకి వెళ్ళకుండానే అతని గురించి వ్యాఖ్యానిస్తుంది జయంతి. అదే సమయంలో ‘జాతక చక్రం’ తీసికెళదామని తిరిగి వచ్చిన గోపాలకృష్ణ అది వినడం, చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. జరిగిన సంఘటనకు మనస్తాపానికి గురైన గోపాలకృష్ణ, ఒకరోజు జయంతి ఆఫీసుకు వెళ్ళి ఒక గిఫ్టు బాక్స్ ఇస్తాడు, దానిలో ఒక అద్దం పెట్టి, ఆమె అందాన్ని చూసుకోమని వేళాకోళం చేస్తాడు. ఆ చర్య జయంతిని తనని అవమానించినట్లు ఫీలవుతుంది. ఆ విషయం ఇంటిలో చెబితే, అలా చేసేముందు గోపాలకృష్ణ తమతో సంప్రదించే చేశాడనీ, పైగా, అతడు, తన చెల్లెలు దమయంతిని చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఈ పెళ్ళేగనుక జరిగితే ఇంట్లో తాను ఆతని ముందు చిన్నబోయినట్లు ఉండవలసి వస్తుందనిఆ పెళ్ళి చేయవద్దనీ, ఒకవేళ చేస్తే, తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది.
గోపాలకృష్ణను దమయంతికిచ్చి పెళ్ళిచేయడం జరుగుతుందనీ, ఇష్టం లేకపోతే వెళ్ళిపో వచ్చుననీ కుంటుంబ సభ్యులంతా జయంతికి చెబుతారు. దానితో తన ఫ్రెండ్ ఉషారాణి ఉంటున్న అద్దెగదిలోకొచ్చి కొన్నాళ్ళు ఉంటానని, జరిగినదంతా వివరిస్తుంది. వివరిస్తూనే కొన్నాళ్ళే కాదు ఇష్టమైతే తనతో పాటు అద్దె చెల్లిస్తూ, పనులు పంచుకొని చేసుకొంటూ ఉండవచ్చని ఆమె చెబుతుంది. ఆ ఒప్పందం బాగుందని అలాగే కొనసాగుతుండగా, ఉషారాణికి వివాహమై వెళ్ళిపోతుంది. జయంతి ఒంటరిగా మిగిలిపోతుంది. జీవితం నిస్సారంగా మారిపొతుంది. ఒకసారి జయంతికి తీవ్రంగా జ్వరం వస్తుంది. ఆఫీసుకి కూడా వెళ్ళలేక, మూసిన తలుపులు కూడా తెరవలేని పరిస్థితుల్లో గోపాలకృష్ణ, వాళ్ళ కుంటుంబం వాళ్ళే ఆమెను తీసికెళ్ళవలసి వస్తుంది.
ఈలోగా తాను పనిచేసే బ్యాంకులో తనకులానికే చెందిన దివాకర్ మేనేజర్ గా వస్తాడు. జయంతి వివిధ పనుల వంకతో దివాకర్ తో చనువుగా ఉంటుంది. అతనికింకా పెళ్ళికాక పోవడం, ఎర్రగా, ఎత్తుగా ఉండి తన కలల రాకుమారుడిలో కొన్ని లక్షణాలైనా ఉండటంతో, అతడిని ఇష్టపడుతుంది. కానీ, అతడు ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ వ్యాపారి కూతురు మనీషా వెంటపడి, వివాహానికి ప్రయత్నించి విఫలమయినవాడు. అప్పటికే జయంతిని చేసుకోమని జయంతి తరపున గోపాలకృష్ణ దివాకర్ ని అడుగుతాడు. దివాకర్ ఆ పెళ్ళికి అంగీకరించడు. మనీషాతో పెళ్ళి జరగలేదు గనుక, జయంతిని చేసుకోవాలని గోపాలకృష్ణ మళ్ళీ దివాకర్ కి చెప్పి అంగీకరించేలా చేస్తాడు. కానీ , జయంతి దివాకర్ని తిరస్కరిస్తుంది. దివాకర్ గోపాలకృష్ణ మిత్రుడు కావడం, ఒకసారి తానే అడిగితే అంగీకరించక ధనవంతుల సంబంధం పోయినందుకే తనని చేసుకోవడానికి అంగీకరించాడని భావిస్తుంది.
ఇదిలా ఉండగా, గోపాలకృష్ణ చేసుకున్న దమయంతి చాలా అదృష్టవంతురాలని జయంతి, ఆ కుటుంబం కూడా భావిస్తుంది. గతంలో గోపాలకృష్ణ, జయంతిని అవమానించిన చర్యకు, ఇప్పుడు ఏదొకలా సాయం చేసి, మంచి వాడనిపించు కోవాలని అతడు ప్రయత్నిస్తుంటాడు. ఆమెని వివిధ సందర్భాలలో “వదినగారూ!” అంటూ పలకరిస్తూ, సంభాషణలో పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఆమె మొదట ఇష్టపడదు కానీ, దమయంతిని ప్రేమగా చూసుకోవడం, తన గురించి దివాకర్ తో సంప్రదించటం వంటివన్నీ మళ్ళీ జయంతిలో గోపాలకృష్ణ పట్ల సదభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఈలోగా ఇంట్లో వాళ్ళ పోరు పడలేకనో, లేక పెళ్ళి చేసుకోవడానికి తగిన అర్హతులున్న వాడు దొరకక పోవడం వల్లనో శేషగిరిని వివాహంచేసుకుంటుంది. శేషగిరి, జయంతి కంటే పెద్ద ఉద్యోగి. ఎత్తుగా, ఎర్రగా ఉంటాడు. ఈ లక్షణాలకు తోడు తనని దివాకర్ తిరస్కరించడం వల్ల కూడా శేషగిరిని పెండ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ, శేషగిరికి తల్లిని చూసుకోవడం చెల్లెలు పెళ్ళి చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. పెళ్ళికి ముందే చెప్పినా, పెళ్ళి అయిన మర్నాడేనుండే ఇద్దరి మధ్యా ఆర్థికపరమైన తగాదాలు మొదలై చిలికి చిలికి గాలివానై, ఆ పెళ్ళి మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది. తల్లిని, కూతురుని, తమ్ముడిని చూసుకోవాలని, ప్రతిపైసా లెక్కప్రకారం ఖర్చుచేయాలనే మనస్తత్త్వం శేషగిరిదైతే, ఇంటి దగ్గర కాకుండా హోటల్లో హానీమూన్ జరగాలనీ, అవసరమైతే దానికి తన డబ్బే ఖర్చు చేస్తాననడం జయంతి వంతయ్యింది. రోజూ ఆఫీసుకెళ్ళి వచ్చి వంట చెయ్యడం కుదరదు. జీతం తెస్తున్నాను కనుక, భోజనం చేసే హక్కు తనకుంది. అందువల్లే తింటున్నానని తినేసి, తిన్న కంచం కూడా కడగని జయంతి పట్ల అత్తగారు, శేషగిరి కూడా ఇబ్బందిగా ఫీలవుతారు. చివరికి వేరే కాపురం పెట్టాలని జయంతి భావిస్తుంది. శేషగిరికి విడాకులిచ్చే ముందు జయంతి తల్లిదండ్రులకు చెబుతుంది. గోపాలకృష్ణ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు, అయినా జయంతి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో జయంతి శేషగిరిలకు విడాకులు తప్పలేదు. శేషగిరి మళ్ళీ ఇంటర్ చదివి మానేసిన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు.
ఇంతలో నాటకీయంగా దమయంతి పిల్లలు జయంతికి మాలిమవుతారు. ముందు శేషగిరి మీద కోపంతో అప్పుడు జయంతి అబార్షన్ చేయించుకొంది. భవిష్యత్తులో పిల్లలు కలగరని తెలిసిన జయంతికి ఈ పిల్లలు దగ్గరవడంతో వారి పట్ల ప్రేమ మరింత పెరుగుతుంది. ఒకరోజు ఏదో పని మీద బయటికి వెళ్ళిన దమయంతి హఠాత్తుగా ఏక్సిడెంట్లో చనిపోతుంది. గోపాలకృష్ణ మాత్రమే కాకూండా, అత్తామామలు, కుటుంబం అంతా సొంతబిడ్డను కోల్పోయినంతగా బాధపడతారు. ఆ ఆత్మీయతానురాగాలు అర్ధమయిన జయంతి మళ్ళీ పెళ్ళిచేసుకోవాలను కొన్నా, మళ్ళీ ఎలాంటివాడు భర్తగా వస్తాడోనని అనుమానిస్తుంది. దగ్గరుండి గోపాలకృష్ణ ప్రవర్తనను గమనించడం వల్ల, అతన్ని చేసుకొంటే బాగుంటుందని భావించి, అతనికి తన అభిప్రాయాన్ని చెబుతుంది. కానీ, దమయంతికి తప్ప మరెవరికీ తన హృదయంలో, తన జీవితంలో స్థానం లేదని సున్నితంగా తిరస్కరిస్తాడు గోపాలకృష్ణ. జయంతి ఉద్యోగం మానేసి మానసిక ప్రశాంతత కోసం నర్సరీ పెడుతుంది. తన పిల్లలను ఆ నర్సరిలో ఉంచడానికి గోపాలకృష్ణ అంగీకరిస్తాడు. జీవితంలో ఆర్థిక విలువలే అన్నింటినీ నిర్ణయించలేవనీ, మనసుని అర్థంచేసుకొని జీవించే జీవితానికి తోడు ఒకరుండాలని జయంతి అనుకొంటూ నర్సరీ లోనే మిగిలిపోవడంతో నవల ముగుస్తుంది.
కథనిలా ముగించడంలో రచయిత్రి ఆశించిందేమిటినిపిస్తుంది. వ్యాస ప్రారంభంలో వచ్చిన ప్రశ్నలే వస్తాయి. మరి, ఇలా కథా కథనాన్ని నడిపిన రచయిత్రి రచనా స్వభావం ఏమిటి?