సాయంత్రం లాస్లోతో ఆమెకు డిన్నర్, సినిమా అంతకు ముందే ఒప్పందం ఉంది.
హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న హై రైజ్ భవంతి లోనే చాలామంది రెసిడెంట్లు, ఫెలోల నివాసం. ఎప్పటికప్పుడు గబుక్కున బట్టలు మార్చుకుని. ఎంత రాత్రైనా నిమిషాల్లో పేషెంట్లను చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళటం, స్నోలోనూ , వానలోనూ డ్రైవింగ్ బాధ, చాలా కష్టాలు తగ్గిపోయి పని చేసే డాక్ట్ర్లర్లకు ఈ వసతులు ఎంతో వీలుగా ఉంటాయి. అద్దెలు నగరంలో వేరే వాటితో చూస్తే చాలా తక్కువ.
పేరు పడ్డ హాస్పిటల్స్ నగరంలో చాలా మంచి ప్రదేశాల్లో ఉంటాయి. మెమోరియల్ హాస్పిటల్ యార్క్ ఏవెన్యూ, అరవయ్యారూ ఆరవయ్యేడు స్ట్రీట్లలో ఉంది. ప్రసిద్ధి గొన్న న్యూయార్క్ హాస్పిటల్ కూడా చాలా దగ్గర్లో ఉంది. చుట్టూ హాస్పిటల్ కి సంబంధించిన భవనాలు ఇంకా ఉంటాయి.
అదే ప్రదేశంలో వేరే భవనాల్లో ఉండాలంటే ధనవంతులకు గాని సాధ్యం కాదు. దగ్గరలో సబ్వేలు, బస్టాపులు . ఎటు నడిచినా ఎన్నో మంచి రెస్టరాంట్ లు , లంచ్ బ్రేక్ లోనూ, సాయంత్రాలూ, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు చక్కగా అ చుట్టుపక్కలంతా షికార్లు కొడుతుంటారు.
నిసి లాస్లో ఒక చిన్న కఫేలో కూర్చుని సాండ్ విచ్ తింటున్నారు. నిసి కుమార్‌ని గురించి చెప్పకుండా ఉండ లేక పోయింది. పేషెంట్ల ప్రైవసీ అంటూనే హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ఒకరికొకరు అందరి గురించి ప్రైవేటుగా ముచ్చట్లు చెప్పేసుకుంటారు.
కుమార్ భలే అందంగా ఉన్నాడని మహా మెచ్చుకోలుగా చెప్పింది.
లాస్లో చిన్న కళ్ళు ఇంకొంచెం చిన్నవయ్యాయి.
” వ్హాట్! నాకన్నా బాగున్నాడా?” అన్నాడు తన ఎర్ర రంగు గడ్డాన్ని అరిచేత్తో రాసుకుంటూ.
“వందరెట్లు ” అంది ఫెడీమని నిసి.
“రాక్షసి!” అన్నాడు లాస్లో.
“ఉడుకుమోతు” అంది నిసి.
“ఏమి అదృష్టవంతురాలివి. పొద్దున ఇరాన్ షా, మధ్యాహ్నం ఇండియన్ నవమన్మథుడు అన్నమాట!”
“అన్నమాటే! సాయంత్రం మాత్రం ఎర్ర గడ్డం హంగేరియన్.”
“బేంకులో పైసాలేని, పెద్ద బరువైన స్టూడెంట్ లోన్ మాత్రమే కలిగిన హంగేరియన్ అను. ఐనా ఈ కుమార్ ఏం మొగాడోయ్! ఇంగ్లిష్ క్లాస్సిక్స్ చదువుకుంటున్నాడా! ఆ తర్వాత ఉద్యోగం ఎవడిస్తాడు? అందంగా ఉన్నాడంటున్నావు. ఆ తర్వాత బ్రాడ్వే మీదికో, సినిమాల్లోకో పోతాడేమో నిసీ ”
“అంతే అయిఉంటుంది. బ్రహ్మాండమైన ఇంగ్లిష్ ఏక్సెంట్ కూడాను.” అంది నిసి.
“పెద్ద కాంపిటీషనే!” అని మూలిగాడు లాస్లో.
ఇద్దరూ కాఫీ తాగేసి, సినిమా హాల్ కేసి నడిచారు.
మరుసటిరోజు పెథాలజీ కాన్ఫరెన్స్ లో వారంతా కుమార్ స్లైడ్స్ చూశారు. హాడ్జ్కిన్స్ వ్యాధి అనీ, ఏ రకమో ఇంకా కొన్ని పరీక్షలు చేసి చెపుతానన్నాడు ఒక పెథాలజిస్ట్ . ఆ పూట డాక్టర్ గోల్డ్‌బెర్గ్ చాలా ఉషారుగా ఉన్నాడు. కేసుని గురించి మహా ఉత్సాహం చూపించాడు. స్క్రీను మీద వేసిన బొమ్మలే కాకుండా, తాను సైడ్స్ ని ప్రత్యేకంగా మైక్రోస్కోపులో పెథాలజిస్ట్ తో కలిసి చూశాడు. సెలెబ్రిటీలను మాత్రమే శ్రద్ధగా చూసే ఈ చీఫ్, ఈ ఇండియన్ కుర్రాడి మీద ఎందుకు శ్రద్ధ. ఎవరైనా పేద్ద స్నేహితుడి రెకమెండేషన్ ఐ ఉండాలి అనుకుంది నిసి. ఎలా తీసుకున్నాడో ఈ కేసు అనుకుంది. తర్వాత లింఫోమా గ్రూపు వాళ్ళు వేరుగా అన్ని కేసులు మాట్లాడుతూ , ఆ కుర్రాడి కేసు కూడా చర్చించారు. నిసీ కూడా ఉంది. ప్రాథమిక దశలో ఉన్న వ్యాధి. ప్రపంచమ్మీద జర్నల్స్ తిరగా మరగా చదివేసి, కొత్త కొత్త ఆర్టికల్స్ నన్నీ చూసి అతలాకుతలం అయ్యేది ఏం ఉంది, ఇందులో అనుకుంది నిసి.
కుమార్ ని మళ్ళీ చూసే రోజు రానే వచ్చింది. చెల్లెలిని వెంటబెట్టుకు వచ్చాడు ఈసారి. చక్కదనాల భరిణి. హైస్కూలు పూర్తి కావస్తున్నదట. అన్న వైద్యం గురించి మాట్లాడేప్పుడు తను ఉండలేననీ, బైట కూర్చుంటానని వెళ్ళిపోయింది. గోల్డ్‌బెర్గ్ వచ్చి ఎంతో ప్రేమగా పేషెంట్ తో కరచాలనం చేశాడు. వైద్యం గురించి చెఫ్ఫాడు. కొత్త ప్రోటొకాల్ ప్రకారం ఒక మూడునెల్లు ఖీమో, మళ్ళీ కొన్నాళ్ళు ఎడమ గ్రాయిన్లోని గడ్డలకు రేడియేషన్, మళ్ళీ మూడు నెల్లు ఖీమోథెరపీ. లేదంటే లివర్, స్ప్లీన్ కీ , పొట్టలో అయోర్టా పక్కనా రెండు గజ్జల్లోనూ ఉండే లింఫ్ నోడ్స్ అన్నిటికీ రేడియేషన్. పొట్ట మీద బొమ్మ గీస్తే తిరగ బడిన ‘వై’ లాగా ఉంటుంది రేడియేషన్ ఇచ్చే ఏరియా. ఇది లార్డెస్ నిసీ ప్రవేశ పెట్టిన చికిత్సల్లో ఒకటి . ప్రోటొకాల్ ఏది నిర్ణయిస్తే అలా చేద్దాం రెండూ మంచి పద్ధతులే అని కష్టాలు నష్టాలు లాభాలు అన్నీ వివరించాడు. అంతా అయ్యేసరికి అసలు రోగికి జబ్బు తగ్గెదీ లేనిదీ అన్న విషయం చెప్పాలన్న విషయమే తట్టదు అతనికి. ఒక అధ్భుతమైన సైన్స్ ప్రాజెక్ట్ లాగా చెపుతాడు. మనిషి, మనసు, జీవితం ఇలాటి చిన్న విషయాలు అతనికి లెక్కలోకే వచ్చినట్లు లేదు . వింటున్న నిసికి రోగికి ఏదో భయంకరమైన వ్యాధి వచ్చినట్లుగాను, దాన్ని నాశనం చెయ్యాలంటే చాలా మారణహోమం వైద్యం చెయ్యాలనీ, అది ఆ హాస్పిటల్లో మాలావు మెషిన్లు ఎంత గొప్పగా చెయ్యగలవో , ఒక మంత్రవేత్త వింతలు విచిత్రాలు చెప్పినట్లుగా అనిపించింది.
ఇందులో కుమార్ ఎక్కడ?
ఇతని జబ్బు చాలా ఆరంభ దశలో ఊంది. గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు. ఈ కొత్త గా డిజైన్ చేసిన ప్రోటోకాల్ చిన్న వయసులోని ఇతనికెందుకు. ఇతని జీవితం అంతా ముందుంది గదా. దీనివల్ల అతనికి సంతానం కలక్కుండా పోవచ్చు. ఆ తర్వాత కొత్త కేన్సర్లు రావచ్చు.
ఎందుకో గోల్డ్‌బెర్గ్ ఈ పేషెంట్ జబ్బు పదింతలు, వైద్యం కొండంతలు చేసినట్లు ఆమె కనిపించింది.
పక్కన కొంచెం వెనగ్గా నుంచున్ననిసీ, తనకు తెలియకుండానే నుదురు చిట్లించింది, మూతి ముడిచింది. తల అప్పుడప్పుడూ అడ్డంగా ఊగించింది.
కుమార్ అంత పెద్ద వైద్యం చేయించుకోవాలనేసరికి కొంచెం చిన్నబోయాడు. ఇంటి దగ్గర ఉన్న తల్లి ఇది వింటే ఎంత బాథ పొందుతుందో అని మనోవ్యాకులత కలిగింది. ఆమె తనకు చిన్న ఇబ్బంది కలిగినా సహించలేదు. తన చిన్న చెల్లి తనను బైటికి వెళ్ళగానే లక్ష ప్రశ్నలు వేస్తుంది. ఆమె కళ్ళ వెంట నీళ్ళు తను చూడలేడే! తండ్రి కూడా ప్రస్తుతం వాళ్ళ దగ్గిర్లో లేడు.
లోలోన మథన పడుతూ అతను మధ్య మధ్యలో నిసీని గమనిస్తున్నాడు.
డాక్టర్ గోల్డ్‌బెర్గ్ – ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే నిసి ముగిస్తుంది- అని వెళ్ళిపోయాడు.
నిసి కొంచెం సేపు మౌనంగా ఉండి, కుమార్ ఇంక ఏమీ అడగక పోవటంతో బయటికి వెళ్ళిపోబోయింది.
“డాక్టర్!“ వెనకనించి పిలుపు.
మళ్ళీ వెనక్కు వచ్చింది.
“నిసీ! డాక్టర్ గోల్డ్‌బెర్గ్ మాట్లాడుతుంటే మీ ముఖంలో కొంచెం ఆదుర్దా చూశాను. ఏమిటి విశేషం? మీరు అతనితో విభేదిస్తున్నారా?”
అతని ముఖం చెమటలు పట్టి నిగనిగలాడుతున్నది. చెవులు ఎర్రగా కందిపోయాయి. కళ్ళు విశాలాలయ్యాయి.
“రియల్లీ! అలాటిదేమీ లేదే” అంది నిసీ.
“ఉంది. నా జబ్బు గురించి మీఅభిప్రాయం ఏమిటి?”
“కుమార్ ! మీ జబ్బు చాలా ప్రారంభ దశలో ఉంది. దాన్ని నయం చెయ్యటానికి ఇంత బ్రహ్మ ప్రయత్నం అనవసరం. కేట్ స్కానుల్లొ, లింఫాంజియో గ్రాం లో ఏం జబ్బు లేదు. పెథాలజీ స్లైడులు హాడ్జ్కిన్స్ వ్యాధిని గురించి బాగా తెలిసిన వాళ్ళు దేశంలో ఇంకోఇద్దరు చూసేట్లుగా అడగండి. అది మంచి పద్ధతి. ఏ రకం లింఫోమానో సరిగ్గా నిర్థారిస్తారు. మీకున్న రకం హాడ్జ్కిన్స్ ఇంకా తక్కువ వైద్యంతోనయం చెయ్యొచ్చు. మళ్ళీ తిరిగి వస్తుందని ఎక్కువ భయం ఉన్న వాళ్ళు ఎక్కువెక్కువ వైద్యానికి ఇష్టపడతారు. కావాలంటే అలాగూ చెయ్యొచ్చు. నా మొగ్గు కొన్నిసార్లు తక్కువ వైద్యం మీద ఉంటుంది. కాని నా ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళకు చాలా అనుభవం ఉంది. తెలుసుగా” అంది.
అతనికి ఎంతో సత్తువ వచ్చింది. “పెద్ద జబ్బేం కాదన్న మాట. తగ్గిపోతుంది. అంతసేపు మాట్లాడి ఆ సంగతి చెప్పడేం మరి ” అన్నాడు.
“సరిగ్గా వైద్యం చేస్తే చిన్న జబ్బు. లేకుంటే పెద్ద జబ్బు కావచ్చు. కాని వైద్యం ఉంది గదా పూర్తిగా నయం చేసేందుకు. రాజా లాటి జబ్బు చప్పున నయం ఐపోతుంది.” అంది నవ్వుతూ నిసి.
బల్ల మీది నుంచి ఒక్క గంతు వేసి కిందికి దిగి నిసిని కావిలించుకున్నాడతను జారే బట్టను సర్దుకుంటూనే. నిసికి ఒళ్ళంతా ఆవిర్లొచ్చాయ్.
“ఎక్కడికీ వెళ్ళొద్దు మీరు. ఇదిగో, నేను బట్టలు మార్చుకునేవరకూ.” నిసి అవతకు తిరిగి నుంచుంది.
బట్టలు మార్చుకున్నాక “ఈ వీక్ ఎండ్ ఏం చేస్తున్నారు” అన్నాడు.
“ఇంకా ఏం అనుకోలేదు ” అంది నిసి.
“మా ఇంటికి రావాలి”
“ఇంకోసారి ఎప్పుడైనా. సోమవారం ఫిజిక్స్ పరీక్ష ఉంది. రేడియేషన్ ఫిజిక్స్ కోర్స్ తీసుకుంటున్నాను. ముప్ఫయిమంది మెడికల్ ఫిజిసిస్టులున్న హాస్పిటల్ ఇది. ఎందరో మహానుభావులు. ఇలాటి అవకాశం మళ్ళీ వస్తుందా! మా ఇటాలియన్ గురువు గారికి నా మీద ఇష్టం. ఫిజిసిస్టులతోపాటు సమానంగా నాకు మార్కులు రాకపోతే ఆయనకు బాధ కలుగుతుంది.”
“ఎక్కువ సెపు ఉండవద్దు. మా అమ్మకు మీరు నా జబ్బు గురించి చెపితే , నేను చెప్పిన దానికన్న బాగా అర్ధం అవుతుంది. ఆమెకు మనశ్శాంతి కలుగుతుంది. ఇండియన్ అమ్మల మనస్తత్వం మీకు నేను చెప్పాలా” అన్నాడు కుమార్ .
నిసి నవ్వింది. “అర్థమయింది. అడ్రెస్ ఇవ్వండి. సబ్వే స్టేషన్ దగ్గరేనా?”
“నేను వచ్చి తీసుకు వేడతాను. మా అమ్మ మీద దయయుంచి వస్తారుగా.”