ఈమాట » కీబోర్డ్ మీద రాగాలు

Expand to right
Expand to left

కీబోర్డ్ మీద రాగాలు

[ఈ వ్యాసంలో పాటలు వినడానికి అడోబీ ఫ్లాష్ ప్లేయర్ (Adobe Flash Player) అవసరం. మీకు ఈ వ్యాసంలో పాటలకు కుడివైపున play బటన్ బొమ్మ కనిపించకపోతే, అడోబీ వారి డౌన్‌లోడ్ సెంటర్ నుండి ఫ్లాష్ ప్లేయర్ పొందవలసిందిగా మనవి. - సంపాదకులు.]

కంప్యూటర్ కీబోర్డు మీద వావీవరస లేకుండా టైప్ చేసినట్టయితే మహాకావ్యం తయారవుతుందా? అవదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సంగీతం కీబోర్డు మీద అయితే ఏదైనా రాగం పలుకుతుందా? చాలామంది నమ్మకపోవచ్చుగాని పలుకుతుంది. నిజానికి అన్నీ తెల్లనివో, నల్లనివో వాయిస్తే రాగం పలకకపోవడమే అరుదు. అతి ప్రాథమిక స్థాయిలో సంగీతం వాయించదలుచుకున్నవాళ్ళ కోసమే ఈ వ్యాసం.

చాలామందికి కీబోర్డు మీదున్న నలుపు తెలుపు మెట్లని చూడగానే కొంత కంగారు పుడుతుంది. ఇన్ని వాడే బదులుగా అన్నీ ఒకే రకమైనవి “ఏడవొచ్చుగా?” అన్నవాళ్ళున్నారు. వీటిని కలగా పులగంగా వాయించకుండా అన్నీ నల్లనివో, లేదా అన్నీ తెల్లనివో మాత్రమే వాయిస్తే ఏమవుతుంది? అలా వాయించినా కూడా కొన్ని రాగాలు పలుకుతాయి. ఏది నొక్కాలి అని తడుముకోకుండా ఒకే రంగు మెట్లని వరసగా వాయించి వాటిని వినిపించవచ్చు.

సంగీతంతో కుస్తీ అనే వ్యాసంలో కీబోర్డు వివరాలు కనబడతాయి. కీబోర్డులోని స్వరాలు పన్నెండు. ఏ మెట్టు నుంచి మొదలుపెట్టి క్రమంగా ఎడమ నుంచి కుడి వేపుకు (నలుపు తెలుపు భేదం పాటించకుండా) అన్ని మెట్లూ వరసగా వాయించినప్పుడు ఇవి మోగుతాయి. స, రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ద1, ద2, ని1, ని2 అనే ఈ స్వరాలకు మనవాళ్ళు శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం అంటూ పేర్లు పెట్టారుగాని ప్రస్తుతానికి ఈ నంబర్ల వ్యవహారమే మేలు.

ఇవి కాక స్వరాల పేర్లతో సంబంధం లేకుండా శ్రుతులు (ఒకటి, ఒకటిన్నర వగైరా) ఏమిటో మొదటి పటంలో చూడవచ్చు. వీటినే పాశ్చాత్యులు సీ(C), సీ షార్ప్(C#) వగైరా పేర్లతో పిలుస్తారు.


పటం 1

ఇక స్వరాల సంగతి వదిలేసి అన్నీ నల్లమెట్లే మోగిస్తే ఏమవుతుందో చూద్దాం. వీటిలో ప్రతిఒక్క స్వరం నుంచి ఒక్కొక్క రాగం వస్తుంది. నల్లవి అయిదే కనక (ఒకే పేటర్న్ రిపీట్ అవుతుందని గమనించాలి) ఇవన్నీ ఔడవ ఔడవ రాగాలు. అంటే అయిదేసి స్వరాలే ఉన్నటువంటివి.

సామాన్యంగా కీబోర్డు మీద ఎడమ కొస నుంచి సి(C) అనే శ్రుతితో మొదలవుతుంది. దాని పక్కనుండేది సీ షార్ప్ అనే నల్లమెట్టు. దాన్ని ఆధారశ్రుతిగా (అంటే స) భావించి అన్నీ నల్లమెట్లే వాయిస్తే శుద్ధసావేరి రాగం మోగుతుంది. (ఇక ముందు చెప్పబోయే అభ్యాసాలలో స అనుకున్న స్వరాన్ని పదేపదే మోగించి మననం చేసుకోవడం అవసరం. శ్రుతులను త్వరగా మార్చేస్తే ఏం వాయిస్తున్నామో అర్థంకాదు. అందుచేత కింద చెప్పిన ఒక్కొక్క వరసనీ చాలాసేపు వాయించి వినాలి)


“పాడనా తెనుగుపాట”
”కుమరేశ్, గణేశ్ వాయించిన వయొలిన్ కీర్తన”

శుద్ధసావేరి రాగంలోని “పాడనా తెనుగుపాట” అనేది అందరికీ తెలిసినదే. (ఇది కూడా ఒకటిన్నర శ్రుతిలోనే ఉండడం కేవలం యాదృచ్ఛికం). ఇదే రాగంలో కుమరేశ్, గణేశ్ వాయించిన వయొలిన్ కీర్తన మరొక శ్రుతిలో ఉంది. కొంత సాధన చేస్తే కేవలం ఈ నల్లమెట్లనే ఉపయోగించి ఈ పాటను పూర్తిగా వాయించవచ్చని ఆచరణ ద్వారా తెలుస్తుంది. కొంత అల్పసంతోషం పరవాలేదనుకుంటే ఈ పద్ధతిలో ఎవరైనా శుద్ధసావేరి రాగం (కనీసం దాని స్వరాలు) పలికించెయ్యగలరు. అవి స రి2 మ1 ప ద2 స. వివరాలు రెండో పటంలో ఉన్నాయి. ఇటువంటి ఎక్సర్ సైజులు చేసేవారు శ్రుతిలో గొంతెత్తి పాడుకోగలిగితే మరీ మంచిది. అలా చెయ్యనివారు తాము వాయిస్తున్నదాన్ని మరింత శ్రద్ధగా వినాలి.


పటం 2

ఇప్పుడు దీన్ని వదిలేసి మరొక శ్రుతికి వెళదాం. మొదటి విడత అయిన కాసేపటికి దీని మొదలుపెట్టడం మంచిది. కింద చెప్పిన ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రత్యేక అంశమని గుర్తుంచుకోవాలి.


“ఏడు కొండలసామి”
”ఎంత నేర్చినా”

రెండున్నర శ్రుతి, లేక డి షార్ప్(D#) షడ్జమంగా అనుకుంటే మూడో పటంలో చూపినట్టుగా శుద్ధ ధన్యాసి స్వరాలు పలుకుతాయి. (దీన్నే ఉదయరవిచంద్రిక అని కూడా అంటారు) ఇందులో ఏడు కొండలసామి అనే పాట మనకు తెలిసినదే. అలాగే లాల్గుడి జయరామన్ వాయించిన ఎంత నేర్చిన అనే త్యాగరాజ కీర్తన కూడా ఉంది. స్వరాలు స గ1 మ1 ప ని1 స.


పటం 3


“తెల్లవారవచ్చె”
”నిన్ను కోరి (వర్ణం)”

తరవాతిది ఎఫ్ షార్ప్ (నాలుగున్నర) శ్రుతిలో మొదలవుతుంది (నాలుగో పటం). ఇందులో వరసగా నల్లమెట్లు వాయిస్తే మోహన రాగం మోగుతుంది. స రి2 గ2 ప ద2 స అనే స్వరాలున్న వరవీణా అనే గీతం అందరికీ తెలిసినదే. ఇందుకు ఉదాహరణలుగా “తెల్లవారవచ్చె” అనే సినీగీతం, రమణి వాయించిన “నిన్ను కోరి” అనే వర్ణం వినవచ్చు.


పటం 4


“సీతారాముల కల్యాణము”
”అలకలల్ల”

ఇక కుడివేపుగా మరొక నల్లమెట్టుకు జరిగి అయిదున్నర శ్రుతిగా జి షార్ప్ షడ్జమంగా ఉపయోగించి అన్నీ నల్లమెట్లే వాయిస్తే అయిదో పటంలో చూపినట్టుగా మధ్యమావతి వినవచ్చు. స రి2 మ1 ప ని1 స అనే స్వరాలు కలిగిన ఈ రాగంలో “సీతారాముల కల్యాణము” అనే పాటనూ, ఎ.ఎస్. గణేశన్ జలతరంగం మీద వినిపించిన “అలకలల్ల” అనే కీర్తననూ వినవచ్చు.


పటం 5


“పగలే వెన్నెలా”
”సామజవరగమనా”

నల్లమెట్లలో ఇక మిగిలినది ఆరున్నర లేక ఏ షార్ప్ ఒక్కటే. దీని నుంచి మొదలుపెట్టి వాయిస్తే స గ1 మ1 ద1 ని1 అనే స్వరాలతో హిందోళం పలుకుతుంది (ఆరో పటం). “పగలే వెన్నెలా” అనే పాటనూ, రాజరత్నం పిళ్ళై వాయించిన “సామజవరగమనా” అనే కీర్తననూ ఉదాహరణలుగా చెప్పవచ్చు.


పటం 6

ఈ పద్ధతిలో వీటన్నిటినీ వాయించడంవల్ల ఉపయోగమేమిటని అడగవచ్చు. ఇందులో అపస్వరం పలికే అవకాశం తక్కువ. పది సార్లు ప్రయత్నిస్తే వీటిలోంచి మీకు తెలిసిన పాటలోని వరస మోగే అవకాశం కూడా ఉంది. పైన చెప్పినవన్నీ ఒకే సారిగా కాకుండా ఒకే రాగాన్ని కాసేపు వాయిస్తే దాని స్వరూపం పట్టుబడుతుందని ఆశించవచ్చు.

ఇదే పద్ధతిలో తెల్లమెట్లను మాత్రమే వరసగా వాయించినప్పుడు కూడా కొన్ని రాగాలొస్తాయి. ఇవన్నీ మేళకర్త (సంపూర్ణ) రాగాలు. అంటే అన్నిటిలోనూ సరిగమపదనిసలన్నీ తప్పనిసరిగా ఉంటాయి.


“శంకరాభరణము”
”స్వరరాగసుధా”

ముందుగా సి, లేక ఒకటో శ్రుతి ఆధారంగా అన్నీ తెల్లమెట్లే వాయిస్తే శంకరాభరణం రాగం వస్తుంది. ఏడో పటంలో చూపినట్టుగా స రి2 గ2 మ1 ప ద2 ని2 స్వరాలతో వినబడే “శంకరాభరణము” అనే సినీగీతం, సూర్యనారాయణ వాయించిన “స్వరరాగసుధా” అనే కీర్తనా ఇందుకు ఉదాహరణలు.


పటం 7


“బాలనురా మదనా”
”గణపతియే”

ఇప్పుడు రెండు లేక డి మెట్టును శ్రుతిగా ఉపయోగిస్తే ఖరహరప్రియ స్వరాలు స రి2 గ1 మ1 ప ద2 ని1 అనేవి వినవచ్చు. “బాలనురా మదనా” అనే పాటా, యు. శ్రీనివాస్ వాయించిన “గణపతియే” అనే కీర్తనా దీనికి ఉదాహరణలు.


పటం 8


“హనుమతోడి” గురించి డా. నూకల
”సంసారం”

మూడో శ్రుతి ఇ నుంచి మొదలుపెడితే హనుమతోడి వినిపిస్తుంది (తొమ్మిదో పటం). స రి1 గ1 మ 1 ప ద1 ని1 స్వరాలతో ఈ రాగలక్షణాలని డా. నూకల వివరించారు. ఈ స్వరాలు ప్రధానంగా సింధుభైరవి రాగంలో వినిపిస్తాయి కనక అందుకు ఉదాహరణగా “సంసారం” సినిమా పాట తీసుకోవచ్చు.


పటం 9


“విప్రనారాయణ” సినిమా పాట
ద్వారంవారి కల్యాణి ఆలాపన

ఇక పదో పటంలో చూపినట్టుగా ఎఫ్ మెట్టును శ్రుతిగా ఉపయోగిస్తే కల్యాణి స్వరాలు స రి2 గ2 మ2 ప ద2 ని2 అనేవి వస్తాయి. ఉదాహరణలుగా ఈ రాగంలో విప్రనారాయణ సినిమా పాటనూ, ద్వారంవారి కల్యాణి ఆలాపననూ వినవచ్చు.


పటం 10


“రాగాలాపన”
”కుంతీకుమారి”

అయిదు శ్రుతిలో వాయిస్తే పదకొండో పటంలోని స రి2 గ2 మ1 ప ద2 ని1 స్వరాలు వినిపిస్తాయి. ఇవి హరికాంభోజి స్వరాలు. ఘంటసాల “కుంతీకుమారి” మొదటి పద్యంలో ఇవే స్వరాలు వినిపిస్తాయి. ఇదే రాగంలో మణి కృష్ణస్వామి “రాగాలాపన” వినవచ్చు.


పటం 11


“మధురమైన జీవితాల”
అష్టపది “యామిహే”

చివరగా ఆరు శ్రుతిని ఉపయోగిస్తే (పన్నెండో పటం) నఠభైరవి రాగం వినిపిస్తుంది. స రి2 గ1 మ1 ప ద1 ని1 ఈ స్వరాలు “మధురమైన జీవితాల” అనే సినీగీతంలోనూ, బాలమురళి అష్టపది “యామిహే” లోనూ వినిపిస్తాయి.


పటం 12

మొత్తం 12 స్వరాల్లో దేనితో మొదలుపెట్టి (అన్నీ ఒకే రంగు మెట్లు) వాయించినా 11 సందర్భాల్లో ఏదో ఒక రాగం వస్తుందన్నమాట. అయితే వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క శ్రుతిలో మొదలవుతాయి కనక వెంట పాడుకోవడం సులువుగా వీలు కాకపోవచ్చు. ఈ వ్యాసం ముఖ్యంగా కీబోర్డ్ సులువుగా వాయించటం చేతగానివారి కోసమే. చేతులకు కాస్త పని తగ్గితే వినబడే స్వరాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వీలవుతుంది. (తెలుగు సినిమా పాటల రాగాల గురించి తెలుసుకోగోరేవారు శ్రీనివాస్ పరుచూరి తదితరులు తయారు చేసిన జాబితాను రామకృష్ణ సంకా వెబ్ సైట్ లో చూడచ్చు.)

  • కీబోర్డ్ మీద రాగాలు అన్నది చదవగానే ఎలక్ట్రానిక్ కీబోర్డ్లు భారతీయ సంగీతానికి పనికిరావని భావించేవారికి ఒక మాట: ఈ వ్యాసం సంగీతానికి సులభపరిచయం మాత్రమే. ఇది చదివినవారికి సంగీతం వచ్చేస్తుందని పొరపాటున కూడా ఎవరూ అనుకోరాదు.
  • రెండోది. రాగం అంటే కేవలం స్వరాల కూర్పు కాదు. అందులో మరెన్నో విశేషాలుంటాయి. అయితే రాగస్వరూపాన్ని గుర్తించడానికి స్వరాలను పోల్చుకోవడం ఒక సులభపద్ధతి మాత్రమే.
  • మూడోది. పెద్ద పెద్ద హిందూస్తానీ గాయకులందరికీ కీబోర్డు సంగతీ, భారతీయ సంగీతంలోని సున్నితమైన స్వరభేదాలను పలికించగలగడంలో దానికున్న పరిమితులూ తెలియనివి కావు. అయినప్పటికీ తమ కచేరీల్లో హార్మోనియమే పక్కవాద్యంగా ఉండాలని వారంతా భావించారు కనక శాస్త్రీయ సంగీతం విషయంలో కీబోర్డుకు కొందరనుకున్నంత అంటరానితనమేమీ లేదు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...

 

(17 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. నాగరాజా అభిప్రాయం:

    September 5, 2007 2:39 am

    థాంక్సు మాస్టారు. చాలా బాగుంది.

  2. Jaya అభిప్రాయం:

    September 5, 2007 3:44 am

    This article is interesting and educative about an uncommon topic.

  3. తెలుగుఅభిమాని అభిప్రాయం:

    September 5, 2007 11:24 pm

    సర్, కీ బోర్డు పైన గమకాలు పలుకుతాయా? అలాగే పాశ్చాత్య సంగీతానికిమల్లే రెండు చేతులు ఉపయోగించి కర్ణాటక సంగీతం కూడా వాయించవచ్చా?

  4. Rohiniprasad అభిప్రాయం:

    September 6, 2007 4:58 am

    మామూలుగా హార్మోనియం మీద పలికే గమకాలన్నీ కీబోర్డు మీద కూడా పలికించవచ్చు. మోడల్ ని బట్టి కీబోర్డులో పియానో, వయొలిన్ మొదలైన ఎన్నో ధ్వనులు పలుకుతాయి కనక వీలును బట్టి ఏదో వాటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఇవికాక కొన్ని మోడల్స్ లో పిచ్ బెండర్ సదుపాయం ఉంటుంది. స్ప్రింగ్ లోడెడ్ పద్ధతిలో పనిచేసే ఈ మీటను ఉపయోగించి కుడిచేత్తో వాయిస్తున్న స్వరానికి అటూ ఇటూ ఉండే స్వరాలను సాగదీసినట్టుగా పలికించవచ్చు. దీన్ని ఉపయోగించి కీబోర్డు మీద కొందరు నిపుణులు వీణ, నాదస్వరం వగైరా పద్ధతుల్లో అద్భుతమైన కర్ణాటక గమకాలను పలికించగలరు. దీనికి ఎంతో అభ్యాసం కావాలి. కీబోర్డు ధ్వనులన్నీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో సృష్టి అవుతున్నవే కనక గమకాల ‘భ్రమ’ను కలిగించడం కూడా సాధ్యమవుతుంది.

    పాశ్చాత్య సంగీతంలో ఎడమచేతిని సామాన్యంగా బేస్ (మంద్ర) స్వరాల కోసమో, కార్డ్ ప్రోగ్రెషన్స్ (స, గ, ప మొదలైన స్వరాల కాంబినేషన్) కోసమో ఉపయోగిస్తారు. ఇటువంటివి మన శాస్త్రీయసంగీతంలో అవసరం కావు. పాశ్చాత్య సంగీతంలో పోలీఫోనీ (ఒకేసారిగా పలు స్వరాలు మోగడం) ఉంటుంది. మనది మోనోఫోనీ. ఎటొచ్చీ కీబోర్డు మీద మన దేశపు సినిమా పాటలు వాయిస్తున్నప్పుడు రెండో చేతిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అయితే కుడి చేత్తో పాట వాయిస్తున్నప్పుడు తక్కిన ఎఫెక్ట్స్ కోసమని ఎడమచేతిని ఉపయోగించడమూ కద్దు.

  5. madhuraswaram అభిప్రాయం:

    September 7, 2007 11:41 pm

    శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి

    ఈ వ్యాసం ఔత్సాహిక కళాకారులందరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రసాద్ గారు చాల అద్భుతంగా విపులీకరించారు. రాగాలకు సంబందించి సినిమా పాటలు సేకరించటం , మళ్లీ వాటికి సంబందించిన శాస్త్రీయ సంగీత కీర్తనలు సేకరించి అన్నింటిని ఒక దగ్గర కూర్చి ఒక వ్యాసం లో రాయటం ఇది చదువుతున్నంత సులభం కాదు. ఒక సంగీత కళాకారుడిగా నాకు తెలుసు ఇది చాల శ్రమతో కూడిన పని . రోహిణిప్రసాద్ గారు అభినందనీయులు .

  6. Rohiniprasad అభిప్రాయం:

    September 8, 2007 5:34 am

    Madhusvaram గారి ప్రశంసకు ధన్యవాదం. వెబ్ పత్రికకు ఉన్న ఆడియో తదితర సదుపాయాలను ఉపయోగించుకుని ఇటువంటి వ్యాసాలను రాస్తే అర్థం చేసుకోవడం సులువు. ఈ విషయంలో సంపాదకవర్గంవారు తీసుకున్న శ్రద్ధా, వారు పడిన శ్రమా కూడా చెప్పుకోదగ్గవే. చదివేవారికి తగినంత ఆసక్తి ఉన్నట్టయితే సంగీతాన్ని పరిచయం చేసే మరిన్ని వ్యాసాలను రాయవచ్చు.

  7. Aruna Gosukonda అభిప్రాయం:

    September 13, 2007 3:17 am

    Very good article anDi.
    Its very encouraging and informative.
    I went through your blog as well once.
    Hope to see few more articles from your pen.

  8. Ram Durvasula అభిప్రాయం:

    September 18, 2007 7:28 pm

    సంగీత జ్ణానం, స్వర పరిచయం అసలేమీ లేనివారికి కూడా…సులభ పద్ధతిలో కీబోర్డు మీద రాగాలు పలికించేందుకు మీరు చేసిన ప్రయత్నం అమోఘం.

  9. Vijayasimha అభిప్రాయం:

    May 12, 2009 11:20 am

    చాలా మంచి article Rohini Prasad Garu,

    I Like music and when ever I thought of learning used to postpone my wish, thinking that it should be learned during childhood only. After reading your article in 2007 and started learning keyboard and Vocal but could not continue for long as I had to move to different places frequently as part of my job. As you said in one of your articles, “Music can be learned at any stage and age of life only thing is one should have the passion and attitude towards learning it”, it is absolutely correct I suppose.

    A small request from my end for you,could you please continue to write some articles in the same topic with different raaga’s and examples so that one who started will continue to go step by step ahead, while i agree that without teacher one cannot learn perfectly.

    hope you consider my request and anticipate your response on this.

    Best Regards
    Vijay

  10. Rohiniprasad అభిప్రాయం:

    May 12, 2009 2:31 pm

    విజయసింహగారికి వ్యాసం నచ్చినందుకు సంతోషం. సంగీతం మీద నేను రాసిన కాసిని రచనలు కొన్ని విషయాలను పరిచయం చెయ్యడానికి పనికొస్తాయి. ఎటొచ్చీ పాఠకుల్లో ఎంతమందికి ఈ విషయాల్లో ఆసక్తి ఉంటుందో తెలియక రాయడం మానేశాను. అవసరమైనప్పుడు వ్యక్తిగతంగా జవాబులివ్వగలను. ఈ మెయిల్ పంపగలరు.

  11. M.S.Prasad అభిప్రాయం:

    May 13, 2009 3:01 am

    రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం నాకు చాలా నచ్చింది. రాగాలని గుర్తు పట్టేంత సంగీత జ్ఞానం లేక పోయినా ఏ పాటనైనా స్వల్ప ప్రయత్నంతో వాయించగల సామర్ధ్యం వున్న నాకు వారి వ్యాసం ద్వారా కొన్ని రాగాలను తెలిసికొని పలికించగలిగిన జ్ఞానం అబ్బింది. ధన్యవాదాలు. వారి నుండి సంగీతసంబంధమైన మరికొన్ని వ్యాసాలను ఆశిస్తాము.

    “ఎటొచ్చీ పాఠకుల్లో ఎంతమందికి ఈ విషయాల్లో ఆసక్తి ఉంటుందో తెలియక రాయడం మానేశాను.”

    ఔత్సాహికులైన ఈ మాట పాఠకులకు విజ్ఞప్తి. మీ ప్రతిస్పందనపైనే ఇంకా కొన్ని సంగీత సంబంధమైన వ్యాసాలు ప్రసాద్ గారినుండి వచ్చే అవకాశం ఆధారపడి వున్నది. మనలో ఎంతమంది అభిలషిస్తున్నారో తెలుపండి.

    భవదీయుడు

  12. M.S.Prasad అభిప్రాయం:

    May 15, 2009 2:57 am

    రోహిణీ ప్రసాద్ గారికి

    ఎప్పుడో 2007 లో వ్రాసిన మీ వ్యాసం మీద నా సందేహం మిమ్మల్ని చేరుతుందో లేదో తెలియదు. ఐనా మీరు గానీ లేక సంగీతజ్ఞులైన పాఠకులెవరైనా నా సందేహం తీర్చగలరేమోనన్న ఆశతో వ్రాస్తున్నాను.
    మేము హార్మోనియం నేర్చుకొనేటప్పుడు G, Gs, B, C, D, Ds, F అని మీరు చూపించిన మెట్లను స,రి,గ,మ,ప,ద,ని లుగా (మాయా మాళవ గౌళ రాగం అనుకుంటా) అభ్యసించాము. శాస్త్రీయ సంగీత సాధన వర్ణాల దగ్గరే ఆగిపోయినా, సాధన కొనసాగించి ఏ పాటనైనా స్వల్ప యత్నంతో 5-6 ఇంస్ట్రుమెంట్స్ మీద వాయించగల సామర్ధ్యం సంపాదించాము. ఏ పాటకైనా ఇతరులకోసం స్వరం కట్టి ఇచ్చేటప్పుడు పైన చెప్పిన మెట్ల ప్రకారం ఇచ్చేవారము. ఉదా: పగలే వెన్నెల - సమమా గామమా, గమమా గాససా. ఇతి ఈ శృతి లో సరి ఐనా వేరే శృతిలో వాయించి స్వరపరచినప్పుడు మా లెక్క ప్రకారం షడ్జం ధైవతంగానో నిషాదంగానో మార్పూ చెందుతుంది. అసలు ఒక శబ్దాన్ని షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషాదాలుగా ఎలా గుర్తిస్తారు? మీరు చెప్పిన దాని ప్రకారం సావేరి లో మధ్యమం ధన్యాసిలో గాంధరంగా, మోహనలో షడ్జంగా, మధ్యమావతిలో నిషాదంగా ఔతుందిగదా. అసలు రాగాలను గుర్తించడం ఎలా? ఈ సందేహాలకు సరళంగా మాకు గ్రాహ్యం అయ్యే లాగ వివరించడానికి వీలుంటే తెలుపవలసినది. లేదా దానికి మా అవగాహనా శక్తి పెంచుకోడానికి చేయాలిసిన అభ్యాసం/అధ్యయనం వివరించవలసినది.

  13. Rohiniprasad అభిప్రాయం:

    May 15, 2009 5:19 am

    ప్రసాద్ గారూ,

    సిద్ధాంతరీత్యా ఏ సంగీతానికైనా ఆధారశ్రుతి ఏమిటో తెలియకపోతే రాగం పేరు చెప్పడం అసాధ్యం. అందుకే భారతీయ సంగీతంలో తంబురావంటిది మోగుతూ ఉంటుంది. లేకపోతే హిందోళం పాడుతున్నప్పుడు మోహన, శుద్ధసావేరి, మధ్యమావతి, శుద్ధధన్యాసి రాగాల్లో ఏదైనా అనుకుని పొరబడే అవకాశం ఉంటుంది. నల్లమెట్లనే ఉపయోగించి ఈ అయిదింటినీ వినిపించవచ్చని నేను వ్యాసంలో సూచించాను. సిద్ధాంతరీత్యా అని ఎందుకన్నానంటే ఇవన్నీ ప్రసిద్ధరాగాలు కనక స్వరాలమధ్యనున్న సంబంధాలను బట్టి శ్రుతి మోగకపోయినా వాటిని గుర్తుపట్టగలం కనక.
    సెహెరా సినిమాలో లతా పాడిన పంఖ్ హోతే తో ఉడ్ ఆతీరే అనే పాట విషయంలో సరిగ్గా ఇదే అనుమానం వస్తుంది. తుహే దిల్ కా దాగ్ దిఖ్ లాతీరే అని అంటున్నప్పుడు చివరి స్వరం షడ్జమం అని సంగీత దర్శకుడి ఉద్దేశం కాబోలు. అది ధైవతం అని మనం అనుకుంటే హిందోళం అవుతుంది.
    దేన్నైనా వాయిస్తున్నప్పుడు ఆధారశ్రుతి (షడ్జమం) ఏదో మనం నిర్ణయించుకోవాలి. ఆ తరవాత రాగం పేరు చెప్పడం తేలికే. మీరు జి (అయిదు శ్రుతి) ఆధారశ్రుతిగా నేర్చుకున్నట్టున్నారు. అది స్త్రీల గాత్రానికి పనికొస్తుంది; మగవారికి కాదు.
    స అనేది ఫ్లోటింగ్ స్వరం. రాగాలన్నీ సరిగమల మీద ఆధారపడతాయి; శ్రుతిమీద కాదు. ఒకే రకం భవనాన్ని పల్లంలోనూ, మిట్టమీదా నిర్మించినట్టు ఒకే రాగాన్ని ఏ శ్రుతిలోనైనా వినిపించవచ్చు. తమాషా ఏమిటంటే రాగాలను గుర్తుపట్టేవారు స్వరాల తరవాత గమనించేది వాటిమధ్య గల గమకాలనూ, సంబంధాలనే. Characteristicగా ఉండేవి అవే.

  14. M.S.Prasad అభిప్రాయం:

    May 15, 2009 11:33 pm

    రోహిణీ ప్రసాద్ గారికి
    మీ సద్యో ప్రత్యుత్తరానికి కృతజ్ఞతలు. స్వరాలను రాగాలను ర్తించే మార్గాన్ని గురించిన నా సందేహానికి సమాధానం అందులో నాకు లభించలేదు. అర్ధం చేసుకొనేంత పరిజ్ఞానం లేక పోవడం కారణమేమో నని భావిస్తాను. G (ఐదో శృతి) ఆధార శృతిగా స్త్రీ కంఠస్వరాలకుంటుందని తెలిపారు. 1956-57 లో
    మా అక్కకు సంగీతం నేర్పిస్తున్నప్పుడు నేను ప్రక్కనుండి నేర్చుకున్నాను గనుక ఈ శృతి నేర్పివుండవచ్చు. మగవారికి ఏ రేంజిలో వుంటుందో తెలుపరా?
    భవదీయుడు

  15. Rohiniprasad అభిప్రాయం:

    May 16, 2009 1:51 pm

    గొంతునుబట్టి మగవారికి ఒకటి, లేదా రెండు శ్రుతులు సరిపోతాయి.
    స్వరస్థానాలను షడ్జమంతో పోల్చడం ద్వారా రాగాలను గుర్తుపడతాం. ఉన్న పన్నెండు (లేక పదహారు) స్వరాల్లో ఏవేవి, ఎటువంటి వరసలో వినిపిస్తున్నాయనేదాన్నిబట్టి రాగాల పేర్లను చెపుతాం. దీన్ని నేను డిజిటల్ పద్ధతి అంటాను. చాలామంది అదే రాగంలో తమకు తెలిసిన పాటతో (సినిమాపాట అయినా సరే) పోల్చి చూసుకుని చెప్పేస్తారు. ఇది ఎనలాగ్ పద్ధతి. ఇందులో స్వరాలను నిర్దుష్టంగా గుర్తించడం జరగకపోవచ్చు.

  16. M.S.Prasad అభిప్రాయం:

    May 20, 2009 3:07 am

    రోహిణీ ప్రసాద్ గారికి
    తంబూర అనే వాయిద్య విశేషం యొక్క ప్రాధాన్యత వివరించవలసినదిగా ప్రార్ధన. శంకరాభరణం సినిమాలోనూ ఇంకా కొన్ని సంగీత కచేరీలలోనూ దీన్ని మీటుతూ ఒకరు ప్రక్కగా ఉండడం చూస్తాము. వీరు తక్కిన వాద్యకారుల లాగా పాడుతున్న సంగీతాన్ని వాయించుతున్నట్లు కనబడరు. అసలు ఈ వాద్యం మీద సంగీతం వాయించగలమా? నారద తుంబురాదుల వద్ద కనిపించేది తంబుర కాక వీణ అనే అనుకుంటాను. కానీ నాకు తెలిసిన వీణ బృహదాకారంతో మెడలో వేసుకొని తిరుగడానికి అనువుగా ఉండదు. మహతి కఛ్ఛపి అనే ఈ వీణలు మామూలు వీణలకన్నా చిన్న ఆకారంలో వుంటాయి. ఇటువంటీ వీణలు మమూలుగా దొరుకుతాయా?

    భవదీయుడు

  17. Rohiniprasad అభిప్రాయం:

    May 20, 2009 6:12 am

    సినిమాల్లోనూ, నాటకాల్లోనూ, చందమామవంటి పత్రికల బొమ్మల్లోనూ కనబడేదంతా నిజమని నమ్మడం పొరబాటు.
    తంబురా అయినా మరే వాద్యమైనా జానపదరూపంలో చూసినప్పుడు దాని మూలాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకటో, రెండో తీగలతో చిన్న వాద్యాలను పట్టుకు తిరుగుతూ పాడే పల్లె గాయకులు దాన్ని ఆధారశ్రుతి కోసమే ఉపయోగిస్తారు. కచేరీల్లో వాడే తంబుర కూడా అటువంటిదే. తీగలను మీటడం తప్ప స్వరాలను పలికించడానికి దాన్నెవరూ వాడరు.
    మనవాళ్ళు మహతి అనేది వీణ అయిఉంటుంది. నారదుడి గురించిన ప్రస్తావన పూర్తిగా ఊహాజనితం.
    దక్షిణాది సంగీతంలో నాలుగు తీగలున్న పెద్ద తంబుర ఉపయోగిస్తారు. ఉత్తరాది సంగీతంలో అపుడప్పుడూ ఆరు తీగలున్న చిన్న తంబురీని వాడడం కద్దు.
    ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ తాను పాడే రాగపు స్వరాలకు ట్యూన్ చేసిన స్వరమండల్ వాడేవారు. ఆయనను అనుకరిస్తూ పాకిస్తాన్ అలీ సోదరులూ, జస్రాజ్, నిసార్ హుసేన్ ఖాన్‌వంటి గాయకులు దాన్ని వాడడం మొదలుపెట్టారు.
    సంగీతం గురించి తెలుసుకోవడానికి వ్యాసాలూ, పుస్తకాలమీద ఆధారపడకుండా కచేరీలకు హాజరవుతూ ఉండడం అవసరం.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a