చంపకోత్పలమాలల కథ
(4) ఉత్పలమాల - సీసము
ఉత్పలమాల-
ఉన్నది యొక్కటే యునికి యో హృదయేశ విశాల భూమిలో
నున్నది నీకె యయ్యునికి యొప్పు కదా ప్రతి యొక్క రోజు నా
కున్నది మేధయం దొకటె యూహ నిజమ్ముగ నెల్ల వేళలో
నున్నది నీకె యీ యుఱుకు యూహ నివాళిగ నిత్తుఁ జక్కగా
నున్నది రూపమో యొకటె యుల్లము నందు సదారసోత్సవా
యున్నది నీవె నాయువున కూర్పు నిరంతర మిష్టబాంధవా
నిన్నయు నేఁడు నీ నెఱయు నీడను నుంటిఁ బ్రశాంతి నిండగా
పున్నెము నీవె నా మునుపు పూజల పుష్ప-ఫలమ్ములై యిలన్
బోవగలేను నే మునుల పుణ్యగృహాలకుఁ బోవలేను నే
నీవిట నుండగా విడచి నిన్ ఋషిపూజకు వెళ్ళలేను నేఁ
గావున చెప్పుమా రథము కట్టకు లక్ష్మణ రాదు సీత, ని-
ర్జీవము లైన ప్రాగ్దిశలు సీత నుడుల్ విని తెల్లబోయెనే!
సీసము-
ఉన్నది యొక్కటే యునికి యో హృదయేశ
యున్నది నీకె యయ్యునికి యొప్పు
నున్నది మేధయం దొకటె యూహ నిజమ్ము
యున్నది నీకె యీ యుఱుకు యూహ
యున్నది రూపమో యొకటె యుల్లము నందు
నున్నది నీవె నాయువున కూర్పు
నిన్నయు నేఁడు నీ నెఱయు నీడను నుంటి
పున్నెము నీవె నా మునుపు పూజ
తేటగీతి-
మునుల పుణ్యగృహాలకుఁ బోవలేను
విడచి నిన్ ఋషిపూజకు వెళ్ళలేను
రథము కట్టకు లక్ష్మణ రాదు సీత
దిశలు సీత నుడుల్ విని తెల్లబోయె
చంపకోత్పలమాలలలో ఇన్ని దేశి పద్యాలను వ్రాయవీలగును. అందుకే ఈ వృత్తములను చదివేటప్పుడు ఒక్కొక్కప్పుడు కందమో, సీసమో లేక తేటగీతియో, మధ్యాక్కరయో అనే భ్రమ కలుగుతుంది. బహుశా ఇందుకే కాబోలు ఈ మాలావృత్తాలపై ఆంధ్రులకు ఎక్కువ మక్కువ.
మాలావృత్తములు - మాత్రాఛందస్సు - సంపఁగి
స్వయంభూఛందస్సు కర్త అన్ని వృత్తాలను మాత్రావృత్తాలుగా వివరిస్తాడు. చంపకమాల (సిద్ధకము) పాదమును అతడు తొమ్మిది మాత్రాగణములుగా (ఏడవది చతుర్మాత్ర, మిగిలినవి త్రిమాత్రలుగా) వివరించాడు. అతడు చెప్పిన మాత్రల అమరిక తీరు ఇలాగుంటుంది- III IU IU III UI IU IIU IU IU. కాని నాకేమో ఇది అంతగా నచ్చ లేదు. చంపకోత్పలమాలలను మాత్రా ఛందస్సుగా ఎలా వివరించవచ్చునో అన్న విషయాన్ని గురించి నేను ఆలోచించగా నాకు అది క్రింది విధముగా సాధ్యమగునని అనిపించింది- II(U)II UIU IIIU IIU IIUI UIU. అనగా ఈ వృత్తాలలో ప్రతి పాదములో వరుసగా ఒక చతుర్మాత్ర, రెండు పంచమాత్రలు, మరలా ఒక చతుర్మాత్ర, రెండు పంచమాత్రలు. అంటే పాదమును రెండు 14 మాత్రల చిన్న పాదములుగా విపులీకరించవచ్చు. యతి చంపకమాలకు పండ్రెండవ అక్షరము, ఉత్పలమాలకు పదునొకండవ అక్షరము (అనగాయిది మామూలు యతికి పిదప అక్షరము). ఇట్టి జాతి పద్యమునకు సంపగి (చంపకమునకు సరిపోయే తెలుగు పదము) అని పేరుంచాను. అన్ని చంపకోత్పలమాలలు ఈ మాత్రాఛందస్సు కావు. పదాలను ఆయా మాత్రా గణములుగా విరిచినప్పుడు మాత్రమే ఈ మాత్రాఛందస్సు సాధ్యము. క్రింద ఉదాహరణలు-
ఉత్పలమాల గణములతో ఒక సంపఁగి-
సంపఁగి పూలతో సరములన్ సరసా రచియింతు నీకు నేన్
సొంపుగఁ బాడనా స్వరములన్ సుధగా మనసార నీకు నేన్
వంపులఁ జూడవా తనువులో వరదా గ్రహియించి కాన్కగా
నింపుగఁ జేరరా తలపులో నిలయే దివియౌను వేడ్కగా
చంపకమాల గణములతో ఒక సంపఁగి-
కనులకుఁ బండుగై కనగ రా కలయే నిజమౌను ముద్దుగా
మనసుకు విందుగా మనగ రా మహిలో మన కేమి వద్దుగా
విను మిక నాకు యీ బ్రదుకులోఁ బ్రియమౌ నిధి యెల్ల నీవెగా
ననయము నాకు యీ వలపులో నజరమ్మగు ప్రేమ నీవెగా
అక్షరయతికి బదులు ప్రాసయతిని ఉంచి సంపగిని వ్రాసిన, వినుటకు సొంపుగా ఉంటుంది. క్రింద అట్టి పద్యము ఒకటి -
చంపకమాల గణములతో ప్రాసయతితో ఒక సంపఁగి-
ముదముల బంతి యిం దలసెనే నిదురా యిటు రావె మెల్లగా
కదలుచు సవ్వడుల్ సలుపకే పదవే చిఱుగాలి చల్లగా
పెదవులఁ దాకవే శశికళా మృదువై పసిపాప నవ్వగా
సదమల తారకా వెలుగుతో హృదయమ్మును నింపు దివ్వెగా
నాకు నచ్చిన మాలావృత్తాలు
నాకు ఎన్నో చంపకోత్పలమాలలు ఇష్టము. అన్నిటిని ఇక్కడ చెప్పుట కష్టము. అయితే నాకు నచ్చిన ఒక రెండు పద్యాలను ఇక్కడ చెప్పాలి. ఇవి నాకు మాత్రమే కాదు, పండితులకు, పామరులకు ప్రియమే. ఇంటిలో కన్నడము మాటలాడుతూ, బడిలో తమిళము చదివిన మా నాన్నగారు యిట్టి పద్యాలను కంఠస్థము చేసి రాత్రిపూట నిద్ర పోయే ముందు వల్లించేవారు!
ఉత్పలమాల-
నల్లనివాఁడు, పద్మనయనంబులవాఁడు, కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు, మౌళిపరిసర్పితపింఛమువాఁడు, నవ్వు రా-
జిల్లెడుమోమువాఁడొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో
మల్లియలార, మీ పొదల మాటునలేఁడు గదమ్మ చెప్పరే
- పోతన, భాగవతము, దశమస్కంధము (1010)
చంపకమాల-
అటఁ జని కాంచె భూమిసురుఁ డంబర-చుంబి-శిరస్సరజ్ఝరీ-
పటల-ముహుర్ముహుర్లుఠదభంగ-తరంగ-మృదంగ-నిస్వన-
స్ఫుట-నటనానుకూల-పరిఫుల్ల-కలాప-కలాపి-జాలమున్
గటక-చరత్కరేణు-కర-కంపిత-సాలము శీత-శైలమున్
- పెద్దన, మనుచరిత్రము (2.3)
ప్రవరాఖ్యుడు హిమాలయ పర్వతమును చేరిన పిదప అక్కడ చూచిన దృశ్యాలను ఈ చంపకమాల వివరిస్తుంది. ఆకాశాన్నంటే పర్వతాలు, ఆ కొండ కొనలనుండి ప్రవహించే సెలయేళ్ళు. అవి పారేటప్పుడు అందులో ఎక్కడచూచినా అలలే. ఆ అలలు చేసే చప్పుడు మృదంగ నాదములా ఉన్నది. దానితో సరిపోయేటట్లు పురివిప్పి నెమళ్ళు నాట్యమాడుతున్నాయి. అక్కడ ఉండే వృక్షాలను ఆడ ఏనుగులు తమ తొండములచే కదలిస్తున్నాయి.
ముగింపు
ఈ వ్యాసాన్ని భారతములోని నన్నయ పద్యముతో ప్రారంభించాను. అదే భారతములోని అరణ్య పర్వమునందలి రెండు పద్యాలతో దీనిని ముగిస్తాను. ముందు ఈ రెండు పద్యాలను ఈ కవులిద్దరు ఈ నవీన యుగములో పుట్టి ఉంటే ఎలా వ్రాసేవారో అనే నా ఊహను క్రింద ఇస్తున్నాను
శారద రాత్రులు, నీరవ రాత్రులు పున్నమి రాత్రులు, వెన్నెల రాత్రులు
మిక్కిలి వెలిగెడు చుక్కల సరములు ఎక్కువగా గల చక్కదనమ్ములు
తెల్లని కలువలు ఎల్లెడ జిమ్మెడు తావుల దెచ్చెను చల్లని గాలులు
మిలమిల మెరిసెడు మిన్నది మిన్నగ పొడి జేసిన కప్పురముల పుప్పొడి
(నాలుగు మాత్రలు)
అరుణ రంజితమైన అమలినాంబరమందు
కిరణముల వెల్లువలు రాగమయ రవికాంతి
రమణముగ విరిసినవి రమ్యమగు కమలములు
కలహంస కలరవము, సారస సుకూజితము
భ్రమరముల సవ్వడులు ధ్వనియించె ధరణిపై
శరదుదయ కాలములు పరమ సంతోషిణులు
(ఐదు మాత్రలు)
నన్నయభట్టు హంసగీతి ఈ ఉత్పలమాల. ఇది దినాంతాన్ని వర్ణిస్తుంది.
శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారకహారపంక్తులన్
జారుతరంబులయ్యె, వికసన్నవ కైరవగంధబంధురో-
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క-
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరి(ర)పూరితంబులై
- నన్నయ, భారతము, అరణ్యపర్వము (4.141)
ఎఱ్ఱాప్రెగడ కోకిలగానము ఈ చంపకమాల. ఇది ఉషఃకాలాన్ని వర్ణిస్తుంది.
స్ఫురదరుణాంశు రాగరుచిఁ బొంపిరివోయి నిరస్త నీరదా-
వరణములై, దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, ను-
ద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడగన్
- ఎఱ్ఱాప్రెగడ, భారతము, అరణ్యపర్వము (4.142)
గ్రంథసూచి
- ఆంధ్ర మహా భారతము - ఛందఃశిల్పము - పాటిబండ మాధవ శర్మ, అభినవభారతీ ప్రచురణము, హైదరాబాదు, 1966 భారతములో వృత్తముల సంఖ్య, ఛందోऽనుక్రమణి - పు 583-585
- కన్నడ ఛందోవిహార - టి. వి. వేంకటాచల శాస్త్రీ, గీతా బుక్ హౌస్, మైసూరు, 1989 పల్లవరాష్ట్రకూట … పు 31
- కవిజనాశ్రయము - వేములవాడ భీమకవి (మల్లియ రేచన), పరిష్కర్త జయంతి రామయ్య పంతులు, ఆంధ్రసాహిత్యపరిషత్తు, 1932 ఉత్పలమాల, చంపకమాల పు 47
- ఛందఃశాస్త్రం - శ్రీపింగలనాగ - సంపాదకుడు పండిత కేదారనాథ, Parimal Publications, Delhi 1994 ప్రమాణి - పు 72, నర్కుటక, కోకిలక - పు 157, ఉత్పలమాలిక - పు 165, శశివదనా - పు 189
- జయదామన్ - A collection of ancient texts on Sanskrit Prosody and a classified list of Sanskrit metres with an alphabetical index - Ed. H D Velankar, Haritoshamala, Bombay నర్కుటక - జయదేవ ఛందస్ - పు 33 కామలతా, చిత్రలతికా - జయకీర్తి ఛందోనుశాసన - పు 49 నాగరక - పు 122
- జానకీహరణం - కుమారదాస (1-9 సర్గలు) - సంపాదకుడు - గోపాల్ రఘునాథ్ నందర్గికర్, Bombay, 1907 అథ హృదయంగమ … పు 128, 267-269
- తెలుగు సాహిత్య చరిత్ర - ప్రథమ భాగము - కొర్లపాటి శ్రీరామమూర్తి, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1991 అరినృపవాజివారణ … పు 30
- నాగవర్మన కన్నడ ఛందస్సు - Rev. F Kittel, Basel Mission Book & Tract Depository, Mangalore, 1875 ఉత్పలమాలె - పు 57, చంపకమాలె - పు 58
- మనుచరిత్ర - అల్లసాని పెద్దన, Vavilla Ramaswami and Sons, Madras, 1951 అట జని కాంచె … పు 83
- మాఘకావ్యము - Vavilla Ramaswami and Sons, Madras, 1912 తురగశతాకులస్య … పు 391-393
- వృత్తరత్నాకరః - కేదారభట్ట, చౌకంభా సంస్కృత సంస్థాన, వారాణసి, 1985 ధృతశ్రీ - పు 163
- శ్రీమదాంధ్ర భాగవతము - బమ్మెర పోతన, Vavilla Ramaswami and Sons, Madras, 1912 నల్లనివాడు … పు 256
- శ్రీమదాంధ్ర భారతము - సంశోధిత ముద్రణము - ఆదిసభాపర్వములు, Osmania University, Hyderabad, 1968 రాజకులైక భూషణుడు … పు 2
- శ్రీమదాంధ్ర భారతము - సంశోధిత ముద్రణము - అరణ్యపర్వము, Osmania University, Hyderabad, 1969 శారదరాత్రు లుజ్జ్వల … పు 320 స్ఫురదరుణాంశు రాగరుచి … పు 321
- స్వయంభూఛందః - సంపాదకుడు - హరి దామోదర వేళంకర్, రాజస్థాన్ పురాతన గ్రంథమాల, జోద్‌పూర్, 1962 సిద్ధి - పు 24
- Principles of Protein Structure - Schulz, G E, and Schirmer, R H, Springer-Verlag, New York, 1979 Gene Duplication and Fusion - p 167
- Sanskrit prosody and its evolution - Amulyadhan Mukherji, Saraswat Library, Calcutta నర్కుటక - పు 194, 197, 212
- Yahoo Groups - Chandassu-3386, Racchabanda-11598, 25 Dec 2004 చంపకోత్పలమాలలు - సంపగి, మోహన రావు
Rao Vemuri అభిప్రాయం:
September 16, 2007 7:07 am
గ్రంధసూచిలో చూపించిన Principles of Protein Structure ఈ వ్యాసంలో ఎక్కడ, ఎలా వాడబడిందో?
J K Mohana Rao అభిప్రాయం:
September 16, 2007 11:44 am
ఆ సూచన రెండవ పుటలోని క్రింది వాక్యమునకు
వర్తిస్తుంది - “పెద్ద వృత్తాలు చిన్న వృత్తాలను పొడిగించి,
ఇతర వృత్తాలతో చేర్చి, తరువాత మార్చి సృష్టించారు. ఇది
మనము చదివే జెనెటిక్స్ లాంటిదే. జెనెటిక్స్‌లో కూడ
జీన్ డూప్లికేషన్, జీన్ ఫ్యూషన్ వంటివి ఉన్నాయి.”
అదియునుకాక చంపకమాలతో సీసము, కందము,
ఆటవెలది, తేటగీతి, మధ్యాక్కరల గర్భితము చేయు రీతి
proteins మరియు nucleic acids లోని sequence
alignment ను బోలినదే. అందులో amino acids మరియు
nucleotides ఉంటాయి. ఇక్కడ గురులఘువులు ఉన్నాయి,
అంతే. - మోహన
mOhana అభిప్రాయం:
November 11, 2008 6:17 pm
పుస్తకాలను తిరగవేస్తుంటే క్రింది పద్యము కనబడింది. ఇది కడప జిల్లా చదిపిరాళ్ళ గ్రామంలో క్రీస్తుశకం 9 - 10 శతాబ్దాల మధ్య కాలపు శాసనంలోని ఉత్పలమాల.
ఈ పద్యాన్ని ఆదినారాయణ శాస్త్రి వ్రాసిన రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం అనే పుస్తకంలో చూచాను.
అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్
ధనము శాశ్వతమైనది కాదు. శరీరము నశ్వరమైనది. జీవము తత్వార్థము కాదు. యమునిచే దండనార్హమైనది. దీనిని నమ్మరాదు. పరార్థానికై, ఎన్నడు మాసిపోని ధర్మార్థమును అందఱు అమ్మన ప్రెగ్గడలా గొప్పగా చేయండి.
ఈ ఉత్పలమాల బహుశా తెలుగులో మొదటి ఉత్పలమాలలలో ఒకటి అనుకొంటాను. విధేయుడు - మోహన
తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
November 12, 2008 7:11 am
చాలా కాలం కిందట ఆదినారాయణ శాస్త్రి గారి పుస్తకం తిరగేస్తూ ఈ పద్యాన్ని చదివి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.ఆ తర్వాత ఎంతోమంది కవితాభిమానులతో ఈ పద్యం గురించి ముచ్చటించాను. కానీ,ఎవరూ ఎరిగినట్టులేరు ఈ తొలినాటి్ ఉత్పలమాలిక గురించి .అద్దంకి శాసనపద్యం (తరువోజ) మీద కొందరు శ్రద్ధ తీసుకుని చిరు పొత్తాన్ని ప్రకటించి ఉన్నారు. అలాగే,ఈ పద్యం గురించి కొంచెం చర్చ జరిపి విస్తృత ప్రచారంలోకి తీసుకు రావలసిన అవసరం ఉంది.నన్నయకు ముందు కవిత్వం లేదు అన్నఅపప్రధను తొలగించవలసి ఉంది.కారణం ,మొన్న ప్రాచీన భాష చర్చల్లో తమిళ పండితులు భద్రిరాజు గారి వ్యాసాన్ని ఉటంకించి నన్నయకు ముందు మీరే తెలుగులో కవులెవరూ లేరని సిద్ధాంతీకరించి ఉన్నారు,మరి ఇదెలా సాధ్యం అన్నట్టు పత్రికల్లో చదివాము.మొత్తానికి ప్రాచీన భాష (లేదా శ్రేష్ఠ భాష) హోదా లభించింది. అది వేరే విషయం.
ముక్కలు ముక్కలైన శాఫో పద్యాలను ప్రకటించటంలో ముందుంటారు పాశ్చాత్య పండితులు.మనం కూడా అజ్ఞాతకవి రచనగా కొట్టిపారేయకుండా ,చదిపిరాళ్ళ కవిగా ప్రచారంలోకి తీసుకురావలసి ఉంది.బలమైన ఎత్తుగడ,స్ఫుటబలోక్తి , సూటిగా దూసుకు పోయే శైలీవిన్యాసాలతో అలరారుతున్నపద్యం నిస్సందే్హంగా ఎన్నదగిన పద్యాల్లో ఒకటి.
తమ్మినేని యదుకుల భూషణ్.
lyla yerneni అభిప్రాయం:
November 12, 2008 10:44 am
“బలమైన ఎత్తుగడ,స్ఫుటబలోక్తి , సూటిగా దూసుకు పోయే శైలీవిన్యాసాలతో అలరారుతున్నపద్యం నిస్సందే్హంగా ఎన్నదగిన పద్యాల్లో ఒకటి.” -తమ్మినేని యదుకుల భూషణ్.
అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్
ఈ పై పద్యం గురించే మీరు చెప్పేది! ఈ పద్యం ఉత్పల మాల ఐతే అవునేమో గాని పద్యం స్ఫుట బలోక్తితో మాత్రం పిటపిట లాడిపోటల్లేదు. మొత్తం కలిపి చదివితే ఈ పద్యానికి అసలు అర్థమే లేదు అనిపిస్తున్నది. The conclusion (or rather the advice given ) is incongruous.
Care to explain?
లైలా
Garikapati అభిప్రాయం:
November 13, 2008 7:07 pm
ఈ పద్యానికి అర్థమే లేదన్నారు. మొదట మీరు వ్రాసింది అదేనా అని ఒక రెండు సార్లు చదివాను. తర్వాత. వ్యంగ్య ప్రయోగమా అని సరి చూసాను. అదీ కాదు. అంటే నిజంగా మీకు అర్థం కాలేదు.
ఒక పద్యానికి అర్థమే లేదు అని చెప్పాలంటే కొంత మీమాంస అవసరమే. మీరు ఎంత ఆలోచించారొ తెలియదు. చాలా మంది ప్రస్తుతం తెలుగు “కవులు” ‘తెలియని వన్ని తప్పులని…” చెప్పడం పరిపాటి అయ్యింది. మీరలా కాదనుకొన్నాను. ఇక పద్యం లోకి వస్తే
ఇది చాలా సూటిగా దూసుకు పోయే పద్యం - భారతీయ తత్వంలో కర్మ ఫలానికి ఉన్న గొప్ప దనం కాస్తో కూస్తో పూర్వ రచనలతో పరిచయమున్న ప్రతి వారికి తెలుసు. జీవితంలో ఏది అశాశ్వతం , ఏది శాశ్వతం అనేది నిక్కచ్చి పదాలతో బలంగా చెపుతోందీ పద్యం. అర్థం అశాశ్వతం అనే బలమైన ఎత్తుగడతో మొదలై (కవి కాలాన్ని గమనించండి). శరీరం అశాశ్వతం అని ఆ తర్వాత ఏది శాశ్వతం అని చెపుతోందీ పద్యం. (మోహన గారి వివరణ తర్వాత అసలు ఈ పద్యానికి ఇంకా వివరణ అనవసరమనుకున్నాను. )
లైలా గారు అప్పుడప్పుడు కొంచెం భారతీయ సాహిత్యం చదువుతూ ఉండండి నిదానంగా అదే అర్దమవటం మొదలవుతుంది.
భవదీయుడు
గరికపాటి
lyla yerneni అభిప్రాయం:
November 19, 2008 8:07 am
‘అర్ధ మశాశ్వతమ్ము…’ పద్యం అర్థం తెలుపమంటే, మీరు ఎందుకో నన్ను గురించి ఆలోచిస్తున్నారే. :-) మీ పై మాటలు ఈ పద్యం అర్థం తెలుసుకోటానికి, ఎవరికీ (నాతో సహా) ఉపకరించవు. మీకు పద్యం అర్థం తెలిస్తే ఇప్పటికీ చెప్పవచ్చు. మరి నాకిప్పటికీ ఈ ఉత్పలమాలకు అర్థం లేదనే అనిపిసున్నది.
ఈ రచయిత వ్యాసం నేను చదివాను. చదువుతున్నాను. ఎన్నో విషయాలు తెలిసికుంటున్నాను. తరువాత అభిప్రాయాల్లో - ఈ పద్యం, తొలి ఉత్పలమాలల్లో ఒకటి ఐవుండవచ్చునని చారిత్రక పరమైన కుతూహలంతో దీన్ని మనకు ఇప్పుడు తెలిపారు. చరిత్ర మీద దృష్టితో కొందరు చర్చ సాగించుకోవచ్చు. ఈ సందర్భంలో పద్యానికి వివరణ ఇవ్వటం వ్యాస రచయిత ఉద్దేశం కాదనుకుంటాను. వారు, పద్యం లో ఉన్న మాటలను వచనంలో పేర్చారు. వాడిన కొన్ని మాటలు పద్యం లో ఉన్న మాటలంత కఠినంగానూ ఉన్నాయి. ఈ వచనము పద్యభావాన్ని తెలుసుకోటానికి పనికి రాలేదు.
కుతూహలంతో, వేమన శతకం తీసి మొదటి పేజీ చూశాను. అందులో మొదటి పద్యము :-)
ఆ. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళ్కుబెళ్కు రాళ్ళు తట్టెడేల?
చదువు పద్యమరయ జాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ.
ఈ పద్యానికి నా వద్దనున్న పుస్తకం లో ముందు టీక ఇచ్చారు. అందువల్ల పద్యములోని ప్రతి పదమునకు గల అర్థము తెలిసినది. తర్వాత ఈ కింది విధంగా తాత్పర్యము ఇచ్చారు.
తా. అన్నియును ఇచ్చునట్టి పరమాత్మ యందు ఒప్పిన వేమన్నా వినుము. ఏ రీతిగా వట్టి రంగులు కల మట్టిరాళ్ళు గంపెడయినను ఇంద్రనీలమణితో సాటిగావో ఆ రీతిగానే, మంచిపద్యము ఒక్కటి యయినను చాలును అని భావము.
ఈ వేమన పద్యపు భావము నాకు తెలిసినది. మరి ఇప్పుడు మనము చర్చిస్తున్న పద్యము ఒక పాత ఉత్పలమాల. ఆ పాత దనానికి “antique value” ఉందేమో. ఉండొచ్చు. కాని ఇది గులక రాయా? ఇంద్రనీలమణియా ? అని నేను అడుగుతున్నాను.
చిత్తము. నేను ఇక్కడ చేస్తున్న పనే అది. ఈ ఉత్పలమాల పద్యము భారతీయ సాహిత్యము లోనిదే గదా. ఈ పద్యం తెలుసుకుంటే కొంత చదివినట్లే. మరి నా అనుమానం ఈ పద్యానికి అర్థం లేదని. అర్థరహితమైన పద్యము ఎప్పుడైనా కాని గణనీయమెలా అవుతుంది?
ఈ ఉత్పలమాల పద్యానికి టికా తాత్పర్యాలు ఇచ్చి, పద్య చర్చకు దోహదం చెయ్యండి. చక్కని భావమున్నదా పలువురు ఆనందిస్తాను. లేదా ఈ పద్యం అందంగా వినవస్తుంది కాని, అసలు అర్థం పర్థం లేదు అన్న విజం నిరూపించబడుతుంది. నిదానంగానే చదువుకుంటాను సాహిత్యాన్ని. నాకు తొందరేం లేదు. ఒకవేళ నాలో ఉన్న దోషాల వల్ల నాకు తెలియక పోయినా - పద్యానికి అర్థమంటూ ఉంటే, వేరే కొందరికైనా తెలుస్తుంది కాదా.
లైలా
Srinivas Nagulapalli అభిప్రాయం:
November 19, 2008 7:01 pm
“అర్థమశాశ్వతమ్ము” అనే ఉత్పలమాల వెయ్యేళ్ళ కింద శిలాశాసనం లో కాక, మూడేళ్ళ కింద “ఈ మాట” లోనో ఇంకో చోటనో ఎవరైనా వ్రాసివుంటే దానికి ఏ మాత్రం ప్రాముఖ్యం వచ్చేది అని సందేహం. శిలపైన కాబట్టి నిలిచింది కాని, జనాల నాలుకపై అది ఇంత పాతది అని చెప్పినా కూడా నిలుస్తుందా అని చెడ్డ అనుమానం. ఏదో మనకూ పాత పద్యాలున్నాయి, vintage wine లాగా అని చెప్పుకోవడానికి తప్ప, ఒక్కరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా దీనిని ఉదహరించి ఉటంకించే అవకాశం ఉంటుందా అని కూడా అనుమానమే.
ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. అటువంటి సందర్భమే వస్తే, పద్యమే చెప్పవలసి వస్తే దీన్ని వదిలి “కారే రాజులు రాజ్యముల్ గెలువరే.. వారేరీ సిరి మూటాగట్టుకొని పోవంజాలిరే..” లాంటి వెన్నో రసవంతమైన, బలవంతమైన వి స్ఫురిస్తాయి కాని ఇది తట్టుతుంది అనే ఆశ మాత్రం లేదు. కాదంటారా?
——-
విధేయుడు
-Srinivas