ఈమాట » చంపకోత్పలమాలల కథ

Expand to right
Expand to left

చంపకోత్పలమాలల కథ

చంపకోత్పలమాలలను కవులు ఎందుకు ఇష్టపడ్డారు?

కవులు ఎక్కువగా చంపకమాలను, ఉత్పలమాలను వాడారంటే దానికి కారణాలు ఉంటాయి. అందులో కొన్ని - (1) వ్రాయుటలో సౌలభ్యము (2) చదువుటకు, వినుటకు ఒక విధమైన ఆనందము, తృప్తి (3) తెలుగు భాష అందాన్ని ఈ పద్యాలు ప్రతిబింబిస్తాయి (4) దేశి ఛందస్సు నడకను జ్ఞప్తికి తెస్తుంది. చంపకమాలలో మాత్రల సంఖ్య 28, లఘువుల సంఖ్య 14/21 (67%), ఉత్పలమాలలో లఘువుల సంఖ్య 12/20 (60%). శార్దూలమత్తేభవిక్రీడితాలలో ఇది 8/19 (42%), 10/20 (50%). లఘువులు ఎక్కువగా ఉంటే పద్యపఠనలో ఒక వేగము కలుగుతుంది. ఈ పద్యముల శ్రవణానందానికి ఇది కూడ ఒక కారణమే. తెలుగు పదాలను విరిచి వ్రాయుటకు ఈ పద్యములలోని గురులఘువుల అమరిక దోహదము కల్పిస్తుంది.

దేశి ఛందస్సులైన కందము, సీసము, ఆటవెలది, తేటగీతులను కూడ కవులు కావ్యాలలో ఎక్కువగా వాడిరి. కందములోని చతుర్మాత్రల గమనము, సీసములోని తూగు, గీతులలోని రామణీయకత చంపకోత్పలమాలలలో కూడ ఉన్నది. అందుకే ఈ మాలావృత్తములను చదువుతుంటే అవి సంస్కృత ఛందస్సు అని మనకు తోచదు. ఈ విశేష విషయమును క్రింద కొన్ని పద్యములతో నేను నిరూపిస్తాను. చంపకోత్పలమాలలకు కొన్ని జాతి దేశి పద్యములకు గల సంబంధ బాంధవ్యములను క్రింది చిత్రములో చూడగలరు.

(1) ఉత్పలమాల - కందము - తేటగీతి

ఉత్పలమాల -
రా మధుసూదనా వడిగ రా వ్యధ దీరు భవమ్ము పూయు నా-
రామములో నిలన్ సరస రాగము పాడుమ చక్కగాను దే-
వా మధురమ్ముగన్ బిలువవా సుధలూర జపింతు పేరు సు-
శ్యామ హరీ స్మృతిన్ విడువజాలను నిన్ శిఖిపింఛధారి నేన్

కందము -
మధుసూదనా వడిగ రా
వ్యధ దీరు భవమ్ము పూయు నారామములో
మధురమ్ముగన్ బిలువవా
సుధలూర జపింతు పేరు సుశ్యామ హరీ

తేటగీతి-
వడిగ రా వ్యధ దీరు భవమ్ము పూయు
సరస రాగము పాడుమ చక్కగాను
పిలువవా సుధలూర జపింతు పేరు
విడువజాలను నిన్ శిఖిపింఛధారి

(2) చంపకమాల - కందము

చంపకమాల-
పిలచిన రాఁడు వాఁడు, తడ వేలకొ, తా నరుదెంచఁ డెందుకో,
చలముల మాఁడినాను, మన సందె వ్యధన్ గరుణించఁడే ననున్,
బలుకుల నాడఁ డేల సిరి వన్నెలతో మురిపించగా, మదిన్
దలచఁడు, నాకు కళ్ళు వఱ దాయె, సఖీ, హరి నన్ను జూడఁడే

కందము -
హరి నన్ను జూడఁడే నా
దరి బిలచిన రాఁడు వాఁడు, తడ వేలకొ, తా
నరుదెంచఁ డెందుకో, మఱి
మఱి చలముల మాఁడినాను, మన సందె వ్యధన్

కరుణించఁడే ననున్, బలు
చిఱు పలుకుల నాడఁ డేల సిరి వన్నెలతో
మురిపించగా, మదిన్ జెఱు-
పరి తలచఁడు, నాకు కళ్ళు వఱ దాయె, సఖీ

(కందమునకు పాదమునకు 32 మాత్రలు గనుక అదనముగా ప్రతి పాదములో నాలుగు మాత్రలను చేర్చినాను. అవి వరుసగా నా దరి, మఱిమఱి, పలు చిఱు, చెఱుపరి.)

(3) ఉత్పలమాల - మధ్యాక్కర

ఉత్పలమాల-
ఎప్పుడు వత్తువో, మఱల నెప్పుడు వత్తువొ నీవు రక్తితో
నిప్పుడు నన్ను వీడకుమ యిప్పుడు నన్నిట నిట్లు యొంటిగా
జెప్పుచు నుండ, ప్రేమ-కథఁ జెప్పుచు నుండగఁ, బోకు దూరమై
నిప్పుల నార్పుమా, యెడఁద నిప్పుల నార్పుమ వేగ స్పర్శతో

మధ్యాక్కర-
ఎప్పుడు వత్తువో, మఱల నెప్పుడు వత్తువొ నీవు
యిప్పుడు నన్ను వీడకుమ యిప్పుడు నన్నిట నిట్లు
చెప్పుచు నుండ, ప్రేమ-కథఁ జెప్పుచు నుండగఁ, బోకు
నిప్పుల నార్పుమా, యెడఁద నిప్పుల నార్పుమ వేగ

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6