మాలావృత్తములు – మాత్రాఛందస్సు – సంపఁగి
స్వయంభూఛందస్సు కర్త అన్ని వృత్తాలను మాత్రావృత్తాలుగా వివరిస్తాడు. చంపకమాల (సిద్ధకము) పాదమును అతడు తొమ్మిది మాత్రాగణములుగా (ఏడవది చతుర్మాత్ర, మిగిలినవి త్రిమాత్రలుగా) వివరించాడు. అతడు చెప్పిన మాత్రల అమరిక తీరు ఇలాగుంటుంది- III IU IU III UI IU IIU IU IU. కాని నాకేమో ఇది అంతగా నచ్చ లేదు. చంపకోత్పలమాలలను మాత్రా ఛందస్సుగా ఎలా వివరించవచ్చునో అన్న విషయాన్ని గురించి నేను ఆలోచించగా నాకు అది క్రింది విధముగా సాధ్యమగునని అనిపించింది- II(U)II UIU IIIU IIU IIUI UIU. అనగా ఈ వృత్తాలలో ప్రతి పాదములో వరుసగా ఒక చతుర్మాత్ర, రెండు పంచమాత్రలు, మరలా ఒక చతుర్మాత్ర, రెండు పంచమాత్రలు. అంటే పాదమును రెండు 14 మాత్రల చిన్న పాదములుగా విపులీకరించవచ్చు. యతి చంపకమాలకు పండ్రెండవ అక్షరము, ఉత్పలమాలకు పదునొకండవ అక్షరము (అనగాయిది మామూలు యతికి పిదప అక్షరము). ఇట్టి జాతి పద్యమునకు సంపగి (చంపకమునకు సరిపోయే తెలుగు పదము) అని పేరుంచాను. అన్ని చంపకోత్పలమాలలు ఈ మాత్రాఛందస్సు కావు. పదాలను ఆయా మాత్రా గణములుగా విరిచినప్పుడు మాత్రమే ఈ మాత్రాఛందస్సు సాధ్యము. క్రింద ఉదాహరణలు-
ఉత్పలమాల గణములతో ఒక సంపఁగి-
సంపఁగి పూలతో సరములన్ _సరసా రచియింతు నీకు నేన్
సొంపుగఁ బాడనా స్వరములన్ _సుధగా మనసార నీకు నేన్
వంపులఁ జూడవా తనువులో _వరదా గ్రహియించి కాన్కగా
నింపుగఁ జేరరా తలపులో _నిలయే దివియౌను వేడ్కగా
చంపకమాల గణములతో ఒక సంపఁగి-
కనులకుఁ బండుగై కనగ రా _కలయే నిజమౌను ముద్దుగా
మనసుకు విందుగా మనగ రా _మహిలో మన కేమి వద్దుగా
విను మిక నాకు యీ బ్రదుకులోఁ _బ్రియమౌ నిధి యెల్ల నీవెగా
ననయము నాకు యీ వలపులో _నజరమ్మగు ప్రేమ నీవెగా
అక్షరయతికి బదులు ప్రాసయతిని ఉంచి సంపగిని వ్రాసిన, వినుటకు సొంపుగా ఉంటుంది. క్రింద అట్టి పద్యము ఒకటి –
చంపకమాల గణములతో ప్రాసయతితో ఒక సంపఁగి-
ముదముల బంతి యిం దలసెనే _నిదురా యిటు రావె మెల్లగా
కదలుచు సవ్వడుల్ సలుపకే _పదవే చిఱుగాలి చల్లగా
పెదవులఁ దాకవే శశికళా _మృదువై పసిపాప నవ్వగా
సదమల తారకా వెలుగుతో _హృదయమ్మును నింపు దివ్వెగా
నాకు నచ్చిన మాలావృత్తాలు
నాకు ఎన్నో చంపకోత్పలమాలలు ఇష్టము. అన్నిటిని ఇక్కడ చెప్పుట కష్టము. అయితే నాకు నచ్చిన ఒక రెండు పద్యాలను ఇక్కడ చెప్పాలి. ఇవి నాకు మాత్రమే కాదు, పండితులకు, పామరులకు ప్రియమే. ఇంటిలో కన్నడము మాటలాడుతూ, బడిలో తమిళము చదివిన మా నాన్నగారు యిట్టి పద్యాలను కంఠస్థము చేసి రాత్రిపూట నిద్ర పోయే ముందు వల్లించేవారు!
ఉత్పలమాల-
నల్లనివాఁడు, పద్మనయనంబులవాఁడు, కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు, మౌళిపరిసర్పితపింఛమువాఁడు, నవ్వు రా-
జిల్లెడుమోమువాఁడొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో
మల్లియలార, మీ పొదల మాటునలేఁడు గదమ్మ చెప్పరే – (పోతన భాగవతము, దశమస్కంధము, 1010)
చంపకమాల-
అటఁ జని కాంచె భూమిసురుఁ డంబర-చుంబి-శిరస్సరజ్ఝరీ-
పటల-ముహుర్ముహుర్లుఠదభంగ-తరంగ-మృదంగ-నిస్వన-
స్ఫుట-నటనానుకూల-పరిఫుల్ల-కలాప-కలాపి-జాలమున్
గటక-చరత్కరేణు-కర-కంపిత-సాలము శీత-శైలమున్ – (పెద్దన, మనుచరిత్రము, 2.3)
ప్రవరాఖ్యుడు హిమాలయ పర్వతమును చేరిన పిదప అక్కడ చూచిన దృశ్యాలను ఈ చంపకమాల వివరిస్తుంది. ఆకాశాన్నంటే పర్వతాలు, ఆ కొండ కొనలనుండి ప్రవహించే సెలయేళ్ళు. అవి పారేటప్పుడు అందులో ఎక్కడచూచినా అలలే. ఆ అలలు చేసే చప్పుడు మృదంగ నాదములా ఉన్నది. దానితో సరిపోయేటట్లు పురివిప్పి నెమళ్ళు నాట్యమాడుతున్నాయి. అక్కడ ఉండే వృక్షాలను ఆడ ఏనుగులు తమ తొండములచే కదలిస్తున్నాయి.
ముగింపు
ఈ వ్యాసాన్ని భారతములోని నన్నయ పద్యముతో ప్రారంభించాను. అదే భారతములోని అరణ్య పర్వమునందలి రెండు పద్యాలతో దీనిని ముగిస్తాను. ముందు ఈ రెండు పద్యాలను ఈ కవులిద్దరు ఈ నవీన యుగములో పుట్టి ఉంటే ఎలా వ్రాసేవారో అనే నా ఊహను క్రింద ఇస్తున్నాను
శారద రాత్రులు, నీరవ రాత్రులు — — పున్నమి రాత్రులు, వెన్నెల రాత్రులు
మిక్కిలి వెలిగెడు చుక్కల సరములు — — ఎక్కువగా గల చక్కదనమ్ములు
తెల్లని కలువలు ఎల్లెడ జిమ్మెడు — — తావుల దెచ్చెను చల్లని గాలులు
మిలమిల మెరిసెడు మిన్నది మిన్నగ — — పొడి జేసిన కప్పురముల పుప్పొడి
(నాలుగు మాత్రలు)
అరుణ రంజితమైన అమలినాంబరమందు
కిరణముల వెల్లువలు రాగమయ రవికాంతి
రమణముగ విరిసినవి రమ్యమగు కమలములు
కలహంస కలరవము, సారస సుకూజితము
భ్రమరముల సవ్వడులు ధ్వనియించె ధరణిపై
శరదుదయ కాలములు పరమ సంతోషిణులు
(ఐదు మాత్రలు)
నన్నయభట్టు హంసగీతి ఈ ఉత్పలమాల. ఇది దినాంతాన్ని వర్ణిస్తుంది.
శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారకహారపంక్తులన్
జారుతరంబులయ్యె, వికసన్నవ కైరవగంధబంధురో-
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క-
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరి(ర)పూరితంబులై
– నన్నయ, భారతము, అరణ్యపర్వము (4.141)
ఎఱ్ఱాప్రెగడ కోకిలగానము ఈ చంపకమాల. ఇది ఉషఃకాలాన్ని వర్ణిస్తుంది.
స్ఫురదరుణాంశు రాగరుచిఁ బొంపిరివోయి నిరస్త నీరదా-
వరణములై, దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, ను-
ద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడగన్
– ఎఱ్ఱాప్రెగడ, భారతము, అరణ్యపర్వము (4.142)
గ్రంథసూచి
- ఆంధ్ర మహా భారతము – ఛందఃశిల్పము – పాటిబండ మాధవ శర్మ, అభినవభారతీ ప్రచురణము, హైదరాబాదు, 1966 భారతములో వృత్తముల సంఖ్య, ఛందోऽనుక్రమణి – పు 583-585
- కన్నడ ఛందోవిహార – టి. వి. వేంకటాచల శాస్త్రీ, గీతా బుక్ హౌస్, మైసూరు, 1989 పల్లవరాష్ట్రకూట … పు 31
- కవిజనాశ్రయము – వేములవాడ భీమకవి (మల్లియ రేచన), పరిష్కర్త జయంతి రామయ్య పంతులు, ఆంధ్రసాహిత్యపరిషత్తు, 1932 ఉత్పలమాల, చంపకమాల పు 47
- ఛందఃశాస్త్రం – శ్రీపింగలనాగ – సంపాదకుడు పండిత కేదారనాథ, Parimal Publications, Delhi 1994 ప్రమాణి – పు 72, నర్కుటక, కోకిలక – పు 157, ఉత్పలమాలిక – పు 165, శశివదనా – పు 189
- జయదామన్ – A collection of ancient texts on Sanskrit Prosody and a classified list of Sanskrit metres with an alphabetical index – Ed. H D Velankar, Haritoshamala, Bombay నర్కుటక – జయదేవ ఛందస్ – పు 33 కామలతా, చిత్రలతికా – జయకీర్తి ఛందోనుశాసన – పు 49 నాగరక – పు 122
- జానకీహరణం – కుమారదాస (1-9 సర్గలు) – సంపాదకుడు – గోపాల్ రఘునాథ్ నందర్గికర్, Bombay, 1907 అథ హృదయంగమ … పు 128, 267-269
- తెలుగు సాహిత్య చరిత్ర – ప్రథమ భాగము – కొర్లపాటి శ్రీరామమూర్తి, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1991 అరినృపవాజివారణ … పు 30
- నాగవర్మన కన్నడ ఛందస్సు – Rev. F Kittel, Basel Mission Book & Tract Depository, Mangalore, 1875 ఉత్పలమాలె – పు 57, చంపకమాలె – పు 58
- మనుచరిత్ర – అల్లసాని పెద్దన, Vavilla Ramaswami and Sons, Madras, 1951 అట జని కాంచె … పు 83
- మాఘకావ్యము – Vavilla Ramaswami and Sons, Madras, 1912 తురగశతాకులస్య … పు 391-393
- వృత్తరత్నాకరః – కేదారభట్ట, చౌకంభా సంస్కృత సంస్థాన, వారాణసి, 1985 ధృతశ్రీ – పు 163
- శ్రీమదాంధ్ర భాగవతము – బమ్మెర పోతన, Vavilla Ramaswami and Sons, Madras, 1912 నల్లనివాడు … పు 256
- శ్రీమదాంధ్ర భారతము – సంశోధిత ముద్రణము – ఆదిసభాపర్వములు, Osmania University, Hyderabad, 1968 రాజకులైక భూషణుడు … పు 2
- శ్రీమదాంధ్ర భారతము – సంశోధిత ముద్రణము – అరణ్యపర్వము, Osmania University, Hyderabad, 1969 శారదరాత్రు లుజ్జ్వల … పు 320 స్ఫురదరుణాంశు రాగరుచి … పు 321
- స్వయంభూఛందః – సంపాదకుడు – హరి దామోదర వేళంకర్, రాజస్థాన్ పురాతన గ్రంథమాల, జోద్‌పూర్, 1962 సిద్ధి – పు 24
- Principles of Protein Structure – Schulz, G E, and Schirmer, R H, Springer-Verlag, New York, 1979 Gene Duplication and Fusion – p 167
- Sanskrit prosody and its evolution – Amulyadhan Mukherji, Saraswat Library, Calcutta నర్కుటక – పు 194, 197, 212
- Yahoo Groups – Chandassu-3386, Racchabanda-11598, 25 Dec 2004 చంపకోత్పలమాలలు – సంపగి, మోహన రావు
