ఈమాట » చంపకోత్పలమాలల కథ

Expand to right
Expand to left

చంపకోత్పలమాలల కథ

చంపకమాల నర్కుటములతో ఉపజాతి

సంస్కృతములో ఇంచుమించు ఒకే విధమైన వృత్తపు పాదములను చేర్చి ఉపజాతిగా వ్రాసెదరు. ఇంద్రవజ్ర-ఉపేంద్రవజ్రలతో, ఇంద్రవంశ-వంశస్థలతో కూడిన ఉపజాతులు చాల ప్రసిద్ధమైనవి. అదే విధముగా శార్దూలవిక్రీడిత-స్రగ్ధరలతో కూడిన ఉపజాతి కూడ ఉన్నది. చంపకమాల-నర్కుటములతో కూడిన ఉపజాతికి క్రింద ఒక ఉదాహరణ-

చంపకమాల-నర్కుటములతో ఉపజాతి-
వదలకు నన్ను నా చివరి శ్వాసను బీల్చకముందు చేరరా
వదలకు నన్ను నా హృదయ వాంఛల దీర్చగ రా
వదనమునందు నవ్వు లను వంద విరుల్ విరియంగ జేయరా
సదమల ప్రేమభిక్ష నిడి సంగ మొసంగగ రా

శార్దూలవిక్రీడితము - చంపకమాల

శార్దూలవిక్రీడితములో వరుసగా చంపకమాలలోని మొదటి తొమ్మిది అక్షరాలు (ఉత్పలమాలలో మొదటి పది అక్షరాలు), చివరి మూడు అక్షరాలు ఉన్నాయి. శార్దూలవిక్రీడితము అతి ప్రాచీన వృత్తము. ఇది అశ్వఘోషుని కాలమునుండి, భాసుని కాలమునుండి వాడుకలో నున్నది. నర్కుటకము, చంపకమాల శార్దూలవిక్రీడితపు మార్పులతో, చేర్పులతో పుట్టినదేమో? దీనిని క్రింది పద్యములతో నిరూపించ వీలగును. ఇది ఒక చిన్న ఊహ మాత్రమే. ఈ రెండు వృత్తముల స్వరూపము, అందులోని ఏకత్వము, భిన్నత్వము ఈ రెంటిని క్రింద చూడగలరు.

ఉత్పలమాల

మత్తేభవిక్రీడితము శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులుగా చేసిన మార్పువలన ఉదయించినది. ఉత్పలమాల చంపకమాల మొదటి రెండు లఘువులను ఒక గురువుగా చేసిన మార్పువల్ల పుట్టినది. మనకు దొరకిన మొట్టమొదటి ఉత్పలమాల కూడ సంస్కృతములో వ్రాయబడినదే. ఆ పద్యము -

పల్లవ రాష్ట్రకూట కురు మాగధ మాళవ చోళ లాట సం-
వల్ల చళుక్య వంశజ మహానృపతిప్రముఖై రధిష్ఠితం
వల్లభ సైన్య మున్నత మతంగ వాజి భయాకుళం జయా-
త్తల్లలనాక్షివారినివహేన సమం సమ్రేన న్యపాతయత్
- కాదలూరు, మండ్య జిల్లా శాసనము, క్రీ. శ. 962

ఇది ఇప్పటి కర్ణాటక రాష్ట్రములో కనుగొనబడిన ఒక శాసన పద్యము. వివిధ దేశాల రాజులను యుద్ధములో పరాజితులను జేసి జయలక్ష్మిని వరించిన రాజును గురించిన వర్ణన ఇందులో గలదు. ఈ పద్యములో కొన్ని విశేషాలను గమనించాలి. పద్యము సంస్కృతమే ఐనా, దీనిపై ద్రావిడ ముద్ర ఉన్నది. నాలుగు పాదాలకు ద్వితీయాక్షర ప్రాస గలదు. సంస్కృతములోవలె పాదాంతములో యతి లేదు. పదాలు ఒక పాదమునుండి మరొక పాదానికి అనాయాసముగా దొరలిపోతుంది. యతి స్థానము వద్ద పదాల విరుపు లేదు. అసలు ఈ పద్యములో యతి స్థానము ఏదో అన్నది కూడ తెలియదు. కాని సంస్కృత వృత్తాలను ద్రావిడ భాషలకు మలచ గలిగే నేర్పు మాత్రము ఇందులో ప్రతిబింబిస్తుంది. చంపకమాలలో గూడ ఒక శాసనము ఉన్నది. అది-

అరి-నృప-వాజి-వారణ-పదాతి-మహాభ్ర-విరామ-మారుతః
వర-కరికార-సుస్థిత-విభా-ప్రవినాశిత-భాను-సన్నిభః
గురుతర-దీన-భాగవత-మానస-మానిత-కల్ప-పాదపః
వర-కరిగల్ల-భూమిప-భుజా-సిరిహాజిధు-విప్రసాదితే
- సాతలూరు శాసనము, క్రీ. శ. 848

ఇందులోకూడ పై పద్యమువలెనే ద్వితీయాక్షరప్రాస గలదు. ఇది గుణకవిజయాదిత్యుని పొగడే శాసనము. శత్రు రాజుల సైన్యమనే పెద్ద మేఘాన్ని తొలగించే పెనుగాలి, రాత్రిని తొలగించే సూర్యుడు, భాగవత జనుల కోరికలను తీర్చు కల్పవృక్షము. అట్టి కరికాల చోళ మహారాజు దోర్దండములకు విజయము సిద్దించుగాక అని దీని అర్థము. మొదటి రెండు పాదములలో యతి కూడ చెల్లుతుంది.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6