ఈమాట » చంపకోత్పలమాలల కథ

Expand to right
Expand to left

చంపకోత్పలమాలల కథ

నర్కుటకము

ఇక్కడ నా ఊహాగానాన్ని కొద్దిగా మీకు వినిపించాలనే కోరిక కలిగింది. చంపకమాలకు ఇరవైఒక్క అక్షరాలు. ఇందులోని మొదటి 17 అక్షరాల గురులఘువులు కలిగిన వృత్తము మరొకటి ఉన్నది. దానిని నర్దటక, నర్కుటక, అవితథ లేక కోకిలక అని అంటారు. ఈ వృత్తము ప్రాచీన వృత్తములలో ఒకటన్నది నిర్వివాదాంశము. భారవి తరువాతి కాలము వాడైన భట్టికవి నర్కుటకవృత్తపు సృష్టికర్త యని భావన. నర్కుటకమును వరాహమిహిరుడు (ఆరవ శతాబ్దము) బృహత్సంహితలో, కుమారదాసు (ఏడవ శతాబ్దము) జానకీహరణములో వాడెను. ఇది జయదేవ ఛందస్సులో (ఆరవ తొమ్మిదవ శతాబ్దముల మధ్య) ఉదహరించబడినది. తొమ్మిదవ లేక పదవ శతాబ్దమునాటి సంస్కృత భాగవతములోని దశమస్కంధములో 87వ అధ్యాయములో 28 పద్యములు ఈ వృత్తములో గలవు. కుమారదాసు సింహళద్వీపపు కవి, రాజు మాత్రమే కాదు, కవిరాజు కూడ. ఇతనికి కాళిదాసు అంటే ఎంతో ఇష్టము. అతని కవితా ప్రభావమువల్ల జానకీహరణము అనే కావ్యమును వ్రాసెను. అందులోని నర్కుటకవృత్తములోని ఒక పద్యము-

అథ హృదయంగమ-ధ్వనిత-వంశ-కృతానుగమై-
రనుగత-వల్లకీ-మృదుతర-క్వణితైర్లలనాః
తముషసి భిన్న-షడ్జ-విషయీకృత-మంద్ర-రవైః
శయితమబోధయన్ వివిధ-మంగల-గీతి-పదైః
- కుమారదాస, జానకీహరణం (8.101)

జానకీరఘురాములు రాత్రి ప్రణయకేళికల పిదప నిద్రించిరి.ఉషఃకాలములో లలనలు కొందరు బయట వారికి మేలుకొలుపు పాడుచున్నారు. ఆ వర్ణనయే ఈ పద్యము. ఆ మంగళ గీతాలలో రెండు షడ్జ స్వరాలు వినబడుతున్నాయి. ఒకటేమో హృదయంగమమైన వేణు నాదము, మరొకటేమో మృదువుగా మీటబడుచున్న వీణా నాదము. ఈ వేణు వీణా స్వనములు రెండున్ను విభిన్నమైనను ఒకేమారు మ్రోగించబడుచున్నాయి.

ఈ నర్కుటక వృత్తానికి చివర రెండు లగములను జతచేసినయెడల మనకు శశివదన లభించును. ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తులో ఉంచుకోవాలి. వేద కాలములో పద్యాలు పండ్రెండు అక్షరాలవరకు మాత్రమే పరిమితము. కాని కావ్యాలలో పొడవైన శార్దూలవిక్రీడితము, స్రగ్ధరల వంటి వృత్తాలలో కవులు వ్రాసినారు. పెద్ద వృత్తాలు చిన్న వృత్తాలను పొడిగించి, ఇతర వృత్తాలతో చేర్చి, తరువాత మార్చి సృష్టించారు. ఇది మనము చదివే జెనెటిక్స్ లాంటిదే. జెనెటిక్స్‌లో కూడ జీన్ డూప్లికేషన్, జీన్ ఫ్యూషన్ వంటివి ఉన్నాయి. అంటే నర్కుటానికి చివర ల-గ-ల-గలను చేర్చినప్పుడు సిద్ధకము సిద్ధిస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న. ల-గ-ల-గమునే (జ-గ) ఎందుకు చేర్చాలి అని. దీనికి రెండు కారణాలు - (1) జ-గము ప్రమాణికలో (జ-ర-ల-గ) సగము. జ-గము ఒక ఇటుకరాయి (building block) వంటిది. దీనితో ఎన్నియో వృత్తములను నిర్మించవచ్చు (ఉదా. పంచచామరము). (2) జ-గము శ్లోకములోని సరి పాదములలో చివర వచ్చును. జ-గణము నియతము. చివర గురువు సామాన్యముగా నుండును. క్రింద ఒక శ్లోకమును దీనిని నిరూపించుటకై వ్రాసినాను.

వేదన నిండె డెందానన్     మోదము నీయ వేలకో
రాధను వేచితిన్ నీకై     మాధవ రమ్ము నా దరిన్

శ్లోకములో మొదటి నాలుగు అక్షరాలు ఏలాగైనా ఉండవచ్చు. అయినా నేను వాటిని చంపకమాలలోవలె భ-గురుగా తీసికొన్నాను. (భ-ర-ల-గ గణములతో నాగర లేక నాగరక అను ఒక వృత్తము ఉన్నది. ఇది ఎప్పుడు పుట్టినదో తెలియదు.) ఇందులో రెండవ నాలుగవ పాదములో అంత్యాక్షరముల గణస్వరూపము జ-గము. శ్లోకనిర్మాణము ఆ కాలపు కవులకు, లాక్షణికులకు కరతలామలకము. కావున నర్కుటకమునకు చివర జ-గమును చేర్చవలయునను ఊహ సులభముగా జనించి యుండును. అందువలన నా ఉద్దేశము నర్కుటకము ముందు, తరువాత దానికి చేసిన చేర్పులతో సరసి పుట్టినది. నర్కుటకచంపకమాలల బాంధవ్యమును క్రింది పద్యములో చూడవచ్చును -

చంపకమాల - న-జ-భ-జ-జ-జ-ర, యతి (1, 11)
ఎదుటను నున్నచో నెపుడు నెంతయు హృద్యమగున్ సునాదినీ
నదివలె పొంగు మానసము నవ్వుల నందనమౌ సుహాసినీ
వదనమునందు వైభవపు బంగరు వన్నెలతో సులక్షణా
సదమల కాంతితో సతము సౌఖ్య మొసంగు సఖీ సుశిక్షణా

నర్కుటకము- న-జ-భ-జ-జ-ల-గ, యతి (1, 11)
కోకిలకము- న-జ-భ-జ-జ-ల-గ, యతి (1, 8, 14)

ఎదుటను నున్నచో నెపుడు నెంతయు హృద్యమగున్
నదివలె పొంగు మానసము నవ్వుల నందనమౌ
వదనమునందు వైభవపు బంగరు వన్నెలతో
సదమల కాంతితో సతము సౌఖ్య మొసంగు సఖీ

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6