చంపకోత్పలమాలల కథ
పరిచయము
తెలుగులోగాని, కన్నడములోగాని చంపకోత్పలమాలలలో వ్రాయబడిన పద్యాలు తెలియని విద్యార్థులు అరుదు అనుటలో అతిశయోక్తి ఏమాత్రము లేదు. ఈ వృత్తాలు ఈ రెండు భాషలలో ఖ్యాత వృత్తాలు. తెలుగులో వీటితోబాటు శార్దూల మత్తేభ విక్రీడితాలను కూడ కవులు ఎక్కువగా వాడినారు. కన్నడ చంపూకావ్యములలో ఈ నాల్గింటితోబాటు స్రగ్ధర మహాస్రగ్ధరలు కూడ వాడబడినవి. తెలుగులో సంస్కృతభాషనుండి మనము దిగుమతి చేసికొన్న వృత్తాలలో ఈ రెండు వృత్తాలనే ఎక్కువగా కవులు వాడినారు. ఉదాహరణకు శ్రీమదాంధ్ర మహాభారతములో చంపకమాల, తరువాత ఉత్పలమాల వృత్తాలలో ఎక్కువగా నున్నవి. ఒక్క పోతన మహాకవి మాత్రమే ఈ వృత్తములకన్న మత్తేభవిక్రీడితమును అధికముగా వాడినాడు. భారతములో నన్నయ గారి మొదటి తెలుగు పద్యము క్రింది ఉత్పలమాలయే.
రాజకులైకభూషణుఁడు, రాజమనోహరుఁ, డన్యరాజతే-
జోజయశాలి, శౌర్యుఁడు, విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ, డపరాజిత భూరి భుజాకృపాణధా-
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్
- నన్నయభట్టు, శ్రీమదాంధ్రభారతము, ఆదిపర్వము (1.3)
ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము ఈ వృత్తాల ఉత్పత్తిని, వికాసమును గురించి చర్చించుటయే. ఈ విషయము ఏదో చూచాయగా తప్ప లాక్షణికులు బాగుగా విపులీకరించలేదు. నా ఆశయము ఈ విషయాలను అందరికీ తెలియజేయుటయే. ఇందులో కొన్ని విషయాలు వేరువేరు గ్రంథాలలో ఉన్నవి. కొన్ని నా ఊహాగానాలు. మరికొన్ని నా పరిశీలనవలన లభించిన ఫలితాలు.
పేరులు
చంపకమాలకు ఎన్నో పేరులు ఉన్నాయి. అవి - చంపకమాల, చంపకమాలిని, చంపకావళి, పంచకావళి, ధృతశ్రీ, శశివదన, సరసి, సిద్ధి, సిద్ధక, చిత్రలత, చిత్రలతిక, రుచిర. సంస్కృతములో రుక్మ(గ్మ)వతీ వృత్తాన్ని చంపకమాల [(UIIUU) (UIIUU)] అని కూడ అంటారు. ఇక ఉత్పలమాలను ఉత్పలమాలిక లేక కామలత అని పిలుస్తారు. అచ్చతెలుగులో చంపకమాలను తుమ్మెదకంటు, పూలపాన్పు అంటారు, ఉత్పలమాలను కలువదండు, పాలబువ్వ అంటారు.
ప్రథమ రచనలు
పింగళఛందస్సులో సరసీవృత్తము గాథా వృత్తముగా పేర్కొనబడినది. పింగళుడు క్రీస్తుశకము రెండవ శతాబ్దమునకు చెందినవాడని పలువురి భావన. కాని సరసికి ఉదాహరణముగా తరువాతి కాలమువాడైన మాఘుని శిశుపాలవధనుండి ఒక పద్యమును ఇందులో మరియు ఇతర గ్రంథములలో ఇస్తారు. కాబట్టి ఈ వృత్తాలు పింగళుని కాలములో ఉండినవో లేవో అన్నది వివాదాంశము. ఏది ఏమైనా చంపకమాలకు మొదటి ఉదాహరణ క్రీ. శ. 700 కు చెందిన మాఘుడు వ్రాసిన పంచ మహాకావ్యములలో ఒకటైన శిశుపాలవధలోని క్రింది పద్యము -
తురగశతాకులస్య పరితః పరమేకతరంగజన్మనః
ప్రమథితభూభృతః ప్రతిపథం మథితస్య భృశంమహీభృతా
పరిచలతో బలానుజబలస్య పురస్సతతం ధృతశ్రియ-
శ్చిరవిగతశ్రియోజలనిధేశ్చ తదాభవదంతరంమహత్
- మాఘుడు, శిశుపాలవధము (3.82)
అన్నివైపుల వందలకొలది గుఱ్ఱములచే నిండియున్నది ఆ శ్రీకృష్ణుని సైన్యము. ప్రతి మార్గములో భూభృతులు (రాజులు) పరాజితులయ్యిరి. అది ఎల్లప్పుడు శ్రీయుక్తమైనది. మరలిపోవుచున్న బలరాముని తమ్ముడైన కృష్ణుని సైన్యమునకు, కేవలము ఎప్పుడో ఒక్క గుఱ్ఱమునకు (ఉచ్ఛైశ్రవము) కారణ జన్మమై భూభృతముచే (మంథరపర్వతముచే) తరువబడినట్టి లక్ష్మిలేని సముద్రునికి, ఎంతయో వ్యత్యాసము ఉన్నది. ఇక్కడ రెండు సముద్రాలకు మధ్య నున్న భేదమును మాఘుడు వివరిస్తున్నాడు. ఒక సముద్రము కృష్ణుని సైన్యము, మరొకటి క్షీర సముద్రము.
ఈ పద్యములో ధృతశ్రీ అను పదము కూడ ఉన్నది, అందువలననేమో ఈ వృత్తమునకు ధృతశ్రీ అనే పేరు. తరువాత ఈ వృత్తమును రత్నాకరుడు కూడ తన హరవిజయములో 21వ ఆశ్వాసాంతములో వాడియున్నాడు.