ఈమాట » అల్లాష్టకము

Expand to right
Expand to left

అల్లాష్టకము

అల్లా యొక్కడె దైవం
బల్లా పంపెను ముహమదు నవనీతలిపై
నెల్లరి జీవన పథముల
దెల్లముగా దెలియ జేసి దివ్యము జేయన్

అల్లా జగమున కాదియు
నల్లా విశ్వమున కంత మగు నెంచంగా
నల్లా శాంతికి నెప్పుడు
నిల్లై నిల్చును, సమతకు నిరవగు నవనిన్

అల్లా నీవే జనకుడు,
యల్లా నీవే జననియు, నాప్తుడు నీవే,
యల్లా నీవే బంధువు,
యల్లా విత్తములు, విద్య లంతయు నీవే

తల్లుల చల్లని ప్రేమలు,
పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్
ఫుల్ల ధవళ కుసుమ సరము
లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్

అల్లా యెడారి నొంటిగ
మెల్లగ పడి లేచుచుంటి మిడిమిడి వడలో
జల్లని నీ జేతుల రం-
జిల్లగ నడిపించి యిల్లు జేర్పించు దయన్

కల్లయు కాదిది కనగా
నెల్ల జగ మొక మధుశాల, యెల్లరు పాంథుల్,
త్రుళ్ళు మదియు సఖి పాటల,
నల్లా ప్రేమామృతరస మాస్వాదించన్

అల్లా నామస్మరణయు
కుళ్ళును మదిలో కడుగును కుతుకముతో, నా
యల్లా కరుణకు నెల్లై
యెల్లరి జీవముల నిల్చు హృదయపు కళయై

అల్లా శాంతిని నింపుమ,
యల్లా తొలగించు భ్రాంతియవనిక ద్రుటిలో
దెల్లని కాంతుల జూపుమ
యల్లా గాఢాంధకారమం దిల మాకున్

ఫలశ్రుతి-

అల్లాష్టకమును జదువగ,
నల్లాష్టకము నతి భక్తి నందఱు వినగా,
నల్లా యిచ్చును జీవుల
యుల్లమునకు సుఖము శాంతి నురుతర గతితో

 

(ఒక అభిప్రాయం) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. M.S.Prasad అభిప్రాయం:

    April 23, 2009 1:41 am

    ఏ కరీముద్దీన్ గారి కలం నుండి గాక ఒక కృష్ణ మోహనుని కలం నుండి వచ్చిన ఈ అల్లా స్తుతి అభినందనీయం.
    శివుడెంచగా కాళి, శ్రీ పతి కాళి, పవనాత్మజుడు విఘ్న పతియును కాళి
    నవగ్రహ దేవతల్ నారాయణుండు, వివరింప వేంకట విభుడును కాళి
    నరసింహదేవుండు నాకెంచ కాళి, గురు రామకృష్ణుండు కొండంత కాళి
    శిరిడీ నివాసుండు శ్రీకరి కాళి, అరయ దోచెడు విశ్వమంతయు కాళి
    ధరియించు వస్త్రంబు తగ కాలిజోడు, ధరనూడ్చు చీపురు, తట్టయు కాళి
    తిరువళికయు కాళి, దీపంబు కాళి, బరగ గూర్చొను గోనె పట్టయు కాళి
    అభీష్ట దైవాన్నే అంతటా చూసే వారికి నామ రూపాలతో పని లేదు. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు (న ఏసు అనేసు = ఏసు కానిది)
    అనేది ప్రపంచంలో లేదు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a