ఈమాట » ఆ రోజులు

Expand to right
Expand to left

ఆ రోజులు

ఆ రోజులు నీవెలా మరిచిపోగలవు!!
చేప పొలుసుల లాంటి మబ్బుతునకల మాటుగా
జాలువారే వెన్నెల సెలయేరులు
నీ మానస సరోవరాన వికసించిన
కలల తెల్లకలువలని డోలాయమానం చేసిన వేళలు
ఆ రోజులు నీవెలా మరిచిపోగలవు!!!!

చెట్ల చిటారు కొమ్మలలో నిదురించే
నున్నని ఆకుల కపోలాల ముద్దిడే
ప్రాతఃకాలపు పిల్లతెమ్మెర
యవ్వనప్రాంగణం లో అడుగిడిన నీ
ముంగురులు సవరించిన రోజులు
ఆ రోజులు నీవెలా మరిచిపోగలవు!!

ఉవ్వెత్తున ఎగసే కెరటమై
రివ్వున దూసుకెళ్ళే బాణమై
ఆశయపరవశమైన మనసు
ఇంద్రధనుస్సుపై అవలీలగా
ప్రాణత్యాగం చేయగలిగే
ఆరోజులు నీవెలా మరచిపోగలవు!!

 

(15 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Raghothama Rao C అభిప్రాయం:

    July 14, 2007 12:38 am

    అనవసరమైన సంస్కృత పదాలను వాడారు. కవితలో కొత్తదనం పై కూడా శ్రద్ధ చూపి ఉండాల్సింది.

  2. C.S.Rao అభిప్రాయం:

    July 15, 2007 5:57 am

    రఘోత్తమరావు గారూ,
    పాలలో వెన్న కలిసి ఉన్నట్ట్లు తెలుగు లో సంస్కృతం ఉండనే ఉంటుంది.
    మీ మంచి పేరు లో ఉన్నదానికంటే ఎక్కువ సంస్కృతం నా కవిత లో ఉన్నదంటారా ?
    ఒక పదం అవసరమా ,అనవసరమా అన్నది మీ లాంటి రసజ్ఞులైన (ఇలా సంస్కృత పదాలు నిత్యం వాడుతూనే ఉంటాము) పాఠకుల అనుభూతికి సంబంధించిన విషయం.
    ఇక కొత్తదనమంటారా,ఈ విషయమై వచన కవితను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చాలా గొప్పకవి తిలక్ గారు అన్నట్ట్లు
    “అసలు కవిత లో నే నవత కూడా ఉంది”.
    కవిత సాధించవలసింది అందం,అందించవలసింది ఆనందం.అవి సాధించలేనపుడు అది కవితే కాదు.ఇక అప్పుడు కొత్తదనం అవసరమే ఉండదు.
    “అమృతం కురిసిన రాత్రి” లో అంటారు తిలక్ గారు,
    “చలజ్జీవన దైనందిన కోలాహల పాంసుప రాగం లో
    తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు”.
    సామాన్య ప్రజానీకం మాట్లాడే భాష రచనలో కూడా వాడాలని అవిశ్రాంతం గా పోరాడిన చలం గారు
    “రవి కిరణాంగుళీ నఖక్షతాలతో శ్యామలాకాశం కందింది”
    అని వ్రాస్తే ,గొప్ప రచయిత,విమర్శకుడు,మార్క్సిస్ట్ మేధావి ,సరళ వ్యావహారిక భాషాభిమాని రాచమల్లు రామచంద్రారెడ్డి గారు పులకించిపోయారు.

    వీరి కవితా పంక్తులలో ఏ సంస్కృత పదాన్ని తీసి ,ఏ తెలుగు పదం అతికి వారు సాధించిన సౌందర్యాన్ని పరిరక్షించుకోగలం?

  3. chavakiran అభిప్రాయం:

    July 15, 2007 9:33 pm

    ప్రాతః కాలం తప్ప మరీ పెద్ద సంస్కృత ఓన్లీ పదాలు నాకు పెద్దగా కన్పించలేదు.

    కవిత బాగుంది.

  4. Raghothama Rao C అభిప్రాయం:

    July 16, 2007 5:48 am

    సి.ఎస్ . రావుగారూ,

    వ్యక్తి పేర్లు, ఊరి పేర్లలోనూ ఉన్న సంస్కృతానికి, కవిత్వంలోని సంస్కృతానికి ఉన్నది బాదరాయణ సంబంధం మాత్రమేనని నా అభిప్రాయం.

    తీసివేయలేని విధంగా వాడిన సంస్కృత పదాల గురించి నేను చెప్పలేదండీ.

    నున్నని ఆకుల కపోలాలు కంటే నున్నని ఆకుల చెక్కిళ్ళు అని అనకూడదా?

    ప్రాత:కాలపు పిల్లతెమ్మర కంటే తొలిపొద్దు పిల్లతెమ్మర అంటే ఎలా ఉంటుంది?

    అచ్చతెలుగు పదాలు వాడితే కవిత్వంలో లోటు రాదు కదా !

    ఈ కవితలో కొత్తదనమంటూ ఉంటే అది ఒకే ఒక్క వాక్యంలోనే ఉంది “చేప పొలుసుల్లాంటి మబ్బుతునకల మాటుగా”.

  5. Vaidehi Sasidhar అభిప్రాయం:

    July 16, 2007 5:15 pm

    రఘోత్తమరావుగారు చెప్పినట్లు పై కవితలో “కపోలాలు” బదులు “చెక్కిళ్ళు”, “ప్రాతఃకాలం” బదులు “తొలిపొద్దు”అనే పదాలు వాడవచ్చు.తెలుగు వంటి సుసంపన్నమైన భాష లో పర్యాయపదాలకి లోటు లేదు.అనేకం ఉన్నాయి.ఆ రకం గా చూస్తే ఈ కవితని (ఏ కవిత నైనా) ప్రతి ఒక్కరూ వారి పంధా లో,వారి కిష్టమైన పదాలు వాడి వ్రాయవచ్చు. కానీ, ఒక రచయిత తన వైయుక్తిక అనుభూతిని ఎలా కవిత్వీకరించాలి అనేది పూర్తిగా ఆ రచయిత నిర్దేశించుకునే విషయం.అయితే ,ఆ ప్రయత్నం లో రచయిత తన అనుభవాన్ని,అనుభూతిని పాఠకుల అనుభవం లోకి సమర్ధవంతంగా, అందించగలిగారా లేదా అన్నది మాత్రమే చర్చనీయాంశమని నా అభిప్రాయం.

  6. కొత్త రవికిరణ్ అభిప్రాయం:

    July 17, 2007 3:30 am

    భాస్కర్రావు గారూ, జాగర్లమూడి, అంగలకుదురు మధ్య ఊరకే అలా నడుచుకుంటూ వెళ్ళినంత ఆహ్లాదంగా ఉంది మీ కవిత

  7. C.S.Rao అభిప్రాయం:

    July 17, 2007 6:20 pm

    రవికిరణ్ గారూ,మీ అభిప్రాయం ద్వారా నాకు ఎన్నో సంవత్సరాలుగా సంబంధం ఉన్న ప్రాంతాల్ని ,వాటి ప్రకృతి సౌందర్యాన్ని,గలగల పారే పంట కాలువల్ని,సోయగంగా ఊగే వరి పొలాల్ని,చల్లగా వీచే గాలుల్ని మనసు ఆర్ద్రమయ్యేలా గుర్తు చేసారు.Thanks.
    మరేం లేదు,నా పేరు C.S.Rao

  8. C.S.Rao అభిప్రాయం:

    July 17, 2007 7:32 pm

    రఘోత్తమరావు గారూ,
    కవితలో రవంత సంస్కృతం ఉన్నా ఇష్టపడని మీరు,మీరు వ్రాసిన మొదటి అభిప్రాయం లో “శ్రద్ధ” బదులు”పట్టించుకోవలసింది ” అనవచ్చుగా?మీ రెండవ అభిప్రాయం లో”బాదరాయణ సంబంధం” బదులు “ఈ రెంటికీ పోలికేమిటి” అనవచ్చుగా?
    తెలుగు, సంస్కృతం అందంగా పెనవేసికొని పోతే ,తెలుగు భాషలోని సరళమైన సంస్కృత పదాలని అంటరాని పదాలు గా చూడాలా?
    “ప్రాతఃకాలం” బదులు”తొలి పొద్దు” ,”కపోలాలు” బదులు “చెక్కిళ్ళు” అన్నప్పుడు మరొకరు “తెల్లారగట్ల” ,”చెంపలు” అనవచ్చుగా అని
    అడగవచ్చునేమో?
    నేనుదహరించిన కవితలలో కూడా ఇలానే ‘దైనందిన” బదులు “రోజువారీ”"కోలాహలం” బదులు “సందడి” వగైరా అనవచ్చుగా?
    తన ఊహకు తగినట్ట్లుగా ఏ పదం వాడి ఎంత సౌందర్యం సాధించగలడో ,తన కవితావేశం పాఠకులకి అందించగలడో , కవిత వ్రాసే వ్యక్తి నిర్ణయించుకుంటాడు.
    పాఠకమహాశయులు తర్కించుకుంటారు,ఆస్వాదిస్తారు.
    పోతే,మాటలకు కొత్తదనం ఏముంటుంది?అవి అనాదిగా వస్తున్నవే.మాటల కూర్పులో ,లయబధ్ధమైన నడక లో,అవగాహనా మాధ్యమాలను వాడటం లో సొగసు,కొత్తదనం ఆవిర్భవిస్తవి.

    Middleton Murry గారి “Mode of Apprehension” కి “అవగాహనా మాధ్యమం” నా అనువాదం.ఇది”metaphor” కి ఆ గొప్పసాహితీ విమర్శకుని
    నిర్వచనం.

  9. Raghothama Rao C అభిప్రాయం:

    July 18, 2007 10:43 pm

    సంస్కృతం పట్ల నాకు చిన్నచూపని, రవంత కూడా పట్టదని నేనక్కడా చెప్పలేదే!! కవిత్వంలో తెలుగు పదాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పేర్లు, అభిప్రాయాలలో దొర్లే వాటి గురించి కాదు. ఐతే మీరు కవితకు వీటికి పోలిక తెచ్చి చూస్తున్నారు.

    “ప్రోష్ఠీశ విగ్రహ నునిష్ఠీవనోద్ధత విశిష్టాంబుచారి జలధే
    కోష్టాంతరాహిత విచేష్టాఘమౌఘ పరమేష్టీడిత త్వవతు మాం
    ప్రేష్టార్కసూను మనుచేష్టార్థమాత్మ విదతీష్టో యుగాంతసమయే
    శ్రేష్టాత్మ శృంగ ధృత కాష్టాంబు వాహన వరాష్టా పద ప్రభతనో”

    “ఎంకి ఏదంటే వెలుగు నీడలకేసి వేలు చూపింతు”

    ఇలా శుద్ధ సంస్కృతమో, శుద్ధ వ్యావహారికమో/గ్రామ్యమో ఏదైనా సరే వాటివే ఐన రంగు, రుచి, వాసనా ఉంటాయి. తెలుగు కవితలో వీలైనన్ని తెలుగు పదాలు ఉంటేనే బావుంటుందని నా అభిప్రాయం.

  10. పాఠకుడు అభిప్రాయం:

    July 19, 2007 11:29 am

    “ఇప్పటి సంగతి” (ఈ మాట, 2002) లో వెల్చేరు గారొకసారన్నారు:

    ఈమధ్య ఒకసారి అఫ్సర్‌తో మాట్లాడుతూ ఇండియా టుడే వాళ్లు వేసిన సాహిత్య సంచికలో మీ పద్యం చూసానని చెప్పాను. అఫ్సర్‌ వెంటనే ఆ పద్యం చాలా పొడుగ్గా ఉందని కొందరు స్నేహితులు అన్నారని నేనేమీ అనకముందే చిన్న గొంతుకతో అన్నాడు. “కవులు పద్యం కూర్పు ఎలా వచ్చిందన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారన్న మాట!” అనుకుని చాలా సంతోషించాను.

    ఈ సంతోషించటంలో ఆయన “ఇట్లా అయితే బాగుంటుంది” అని చెప్పలేదు, ప్రొఫెసర్ కదా!

    ఈ కవితను పక్కకు పెడితే, మీ రెండు వాదనలూ బాగున్నయి. (రఘోత్తమ రావు, సీ ఎస్ రావు). ఆయనను మరింత సంతోష పెడ్తాయి కూడా.

    1.
    తెలుగు పద్యంలో “వీలైనన్ని తెలుగు పదాలు ఉంటేనే బావుంటుందని” అట్లా అయితే అది బాగా కూర్చుంటుందని రఘోత్తమ రావు (తెలుగులో మీ పేర్రాయడం కష్టం, యూనికోడ్ లో అది జరిగే పని కాదు!) గారనటం ఈ కూర వండటం లోకే వస్తుందనుకుంటాను (కూర్పు).

    కవిత్వంలో శుద్ధ సంస్కృతం, శుద్ధ వ్యావహారికం/గ్రామ్యం వాటినుదహరిస్తూ ఆయన ఏది ఎట్లా సరిపోయిందో ఒక పూర్తి నిడువు వ్యాసం (పద్నాలుగు టావులకు తగ్గకుండా) రాస్తే నా లాంటి ‘అక్షర జ్ఞానం’ లేని వాళ్ళకుపయోగపడుతుంది.

    కానీ,
    2.
    సీ ఎస్ రావు గారి అభిప్రాయం: కవులకవసరమైన పదాలు, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పార్సీ కావాలంటే పంజాబీ, గుజరాతీ (నా మటుకు ఆ భాషంటే అదో చెప్పలేని ప్రేమ, అక్కడి అమ్మాయిలు కొంత కారణం కావచ్చు), ఏదైతేనేం వాళ్ళకవసరం అయిన పదాలు వాడే స్వాతంత్య్రం వాళ్ళకు లేదా?

    కవిత గురించి పెద్దగా చెప్పేందుకేంలేదు నాకు.

    సీ ఎస్ రావు గారు చెప్పినట్టు (”పాఠకమహాశయులు తర్కించుకుంటారు,ఆస్వాదిస్తారు”), నేను ఎప్పుడో తప్ప కవిత్వం తలుపు తెరవని పాఠకవర్గంలో వాణ్ణి కాబట్టి పెద్దగా తర్కించటానికి ఏం లేదు, మరి ఆస్వాదించుదామంటే ఈ కవిత ‘కెరటమై’ ‘బాణమై’ అంటూ అక్కడక్కడ గుచ్చుకున్నది.

    చివరి ఆరు లైన్ల కొచ్చాక, పద్నాలుగు రీళ్ళతో ముగిసే తెలుగు సినిమా పద్దెనిమిదికి లాగినట్టనిపించింది. ఈ కవితను ఇంత లోతుగా చూడటం అనవసరమేమో రఘోత్తమ రావు గారూ. కానీ మీ వాదన భాషను, వాడిన పదాలను పట్టుకుని ఎవరైనా (రాసిన మనిషి కాక) ఎడిట్ చేస్తూ పోతే చివరికేం మిగలదు అనిపిస్తుంది.

    సెలవ్.
    పాఠకుడు.

  11. C.S.Rao అభిప్రాయం:

    July 19, 2007 5:48 pm

    రఘోత్తమ రావు గారూ,
    కవితా భాష గురించి మీ అభిప్రాయాలు మీవి. నా అభిప్రాయాలు నావి. నా అభిప్రాయాల గురించి స్పష్టంగా చెప్పటానికి నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేసానని నమ్ముతున్నాను.ఇక కొత్తగా నేను చెప్పబోయేదేమీ లేదు.

    C.S.Rao

  12. Raghothama Rao C అభిప్రాయం:

    July 19, 2007 11:21 pm

    :) @ పాఠకుడు గారు

    సెలవ్ @ సి.ఎస్. రావు గారు

  13. J K Mohana Rao అభిప్రాయం:

    July 22, 2007 2:37 pm

    నాకు కూడ వాదిరాజయతి రచించిన అశ్వధాటిలోని
    దశావతారస్తుతి అంటే ఎంతో ఇష్టము.
    ఇక్కడ ఒకటి చెప్పాలి అందరికీ. అన్ని సంస్కృత పదాలు
    అర్థము చేసికొనుటకు కష్టము కాదు, అన్ని తెలుగు పదాలు
    అర్థము చేసికొనుటకు సులభము కాదు. నాకు అన్నమాచార్యుల
    కీర్తనలలో ఎన్నో పదాలకు ఇంకా అర్థము తెలియదు. క్రింద ఒక
    అచ్చ తెలుగు పద్యము సీతాకళ్యాణమునుండి. ఇది అచ్చ తెలుగు
    మాత్రమే కాక ఇందులోని అక్షరాలు పెదవులను తాకవు.
    గట్టంత ఱాయి నా కా-
    లట్టే తాకంగ నెలతయై నిల్చిన డా
    కట్టడి దెలిసిన యంతా
    గట్టిగ నెఱగంగ జేసి గడతేర్చగదే
    - మఱిగంటి సింగనాచార్య, శుద్ధాంధ్రనిరోష్ఠయసీతాకళ్యాణము (2.65)
    ఇది రాముని కాలి స్పర్శచే ఱాయి అహల్యగా మారినప్పుడు
    రాముడు విశ్వామిత్రునితో తెలిపినది.

    తెలుగో సంస్కృతమో అర్థమైతే చాలు. ఇక ప్రత్యేక పదాలా?
    ఒక్కొక్క కవి ఒకలా వ్రాస్తాడు. ఒకే కవి అదే కవితను మరలా
    వ్రాస్తే అదే విధముగా వ్రాయడు కూడ! - విధేయుడు - మోహన

  14. mohanraokotari అభిప్రాయం:

    August 14, 2007 9:10 pm

    ఎందుకో మేధావులంతా రసాస్వాదన మాని కవితా కన్యకని surgery చేస్తారు. వలువలూడదీసి శల్య పరీక్ష చేస్తారు. కవి మనసుతో కలవరించి పలువరించకుండా. మరచి పోలేని ఆనాటి సాహస కృత్యాలు మరువలేని వారితో మనసు కలపి ఆలోకంలోకి మనుమూ వెల్లితే పోలా.

  15. Alok అభిప్రాయం:

    August 17, 2007 1:16 am

    డాక్టర్ ని గూడా రోగి బాధల్ని చూస్తూ సర్జరీ అనవస్రమని చెప్పగల్రా మోహన్ రావ్ జీ! పిల్లలు తప్పుజేస్తుంటే రసాస్వాదన జేస్తూ పెద్దలు కూర్చోగల్రా?

    ఇంతకూ రసాస్వాదన అంటే ఏమితో చెప్పండి?

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a