కడపసీమలో అపురూపమైన కలివి కోడి
అనేక దశాబ్దాలుగా కనుమరుగయిన బిడ్డ అనుకోకుండా దర్శనమిస్తే ఆ తల్లిదండ్రులు, బంధువులు ఎంతగా ఆనందపడతారో కదా. అదే విధంగా ఇటీవల, అదృశ్యమైపోయిన కొన్ని జాతుల పక్షులు, జంతువులు తిరిగి కనబడడంతో శాస్త్రజ్ఞుల సంతోషాలకి అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవలసినది ఒక అచ్చ తెనుగు పిట్ట: కలివి కోడి.

ఆ విశేష పక్షిని శాస్త్రజ్ఞులు కర్సోరియస్ బిటర్ క్వాటస్(Cursorius bitorquatus) అంటారు. సామాన్య పరిభాషలో డబుల్ బ్యాండెడ్ కోర్సర్ (Double-banded Courser) అంటారు. దీని కంఠసీమలో రెండు హారాలు వేలాడుతున్నట్టు వర్ణ విశేషం ఉంటుంది.
కలివి కోడి కడప జిల్లాకి పరిమితమైనది. ప్రపంచంలో మరెక్కడా కనబడదు. 1848లో మొదటిసారిగా డా. టి.సి. జెర్డాన్ (T.C.Jerdon) దృష్టికి వచ్చింది. నెల్లూరు, కడప ప్రాంతాల్లో దొరుకుతుందని ఈ సైనిక వైద్యుడు నమోదు చేశాడు. పెన్నా తీరవాసిగా వర్ణించాడు. అతని పేరనే దీనికి మరొక పేరు జెర్డాన్స్ కోర్సర్ (Jerdon’s Courser). ఇండియన్ కోర్సర్ అనే సామాన్య పక్షికి ఇది దగ్గిర బంధువు. మనిషి అలికిడి అయితే త్వరగా కొంత దూరం దుముకుతూ పోయి ఎగిరిపోతుంది. ఇది దీని అలవాటు.
తరవాత 50 సంవత్సరాలు అడపా తడపా కనబడుతూవచ్చింది. 1900లో హోవర్డ్ క్యాంబెల్ కంటపడింది. కాని మరి 85 సంవత్సరాలు తెరమరుగయిపోయింది. విలుప్తమయిందనే భావించారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి, అమెరికా స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూట్ వారు వచ్చి ఈ ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేకపోయింది.
శాస్త్రజ్ఞులలో ఆశలు సన్నగిలలేదు. పట్టుదలగానే పరిశీలన గావించారు. 1985లో ఈ పరిశోధన తీవ్రతరం చేశారు. ఆ పరిసరాలలోని ప్రజలకు దీని గురించి తెలియపరచి దాని ఫొటోలు అందజేశారు. అన్ని విధాల స్థానికుల సహాయం స్వీకరించడం ఆరంభించారు.
1986 జనవరి 12న వీరి ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఈ పక్షి ఒక స్థానికుని కంటపడింది. కొన్ని ఇతర పక్షులతో పాటు సంచరిస్తోంది. ఇంకా విశేషం దానిని పట్టగలిగాడు. శక్తివంతమయిన కాంతికి అది నిశ్చేష్టమయింది. అదే రాత్రికి మరో రెండు పక్షులు కనిపించాయి.
నిజం చెప్పాలంటే అది మనకి భోగి పండగ కానుక. 85 సంవత్సరాల తరవాత దానిని చూడగల్గాము. ఆ వేటగాడి పేరు అయితన్న. ఊరు రెడ్డిపల్లి. ఈ సంఘటనను రూఢిపరచిన శాస్త్రజ్ఞుడు భరత్ భూషణ్. ఈ వార్త వెంటనే డా. సలీం అలీకి పోయింది. వెంటనే డా. సలీం “అల వైకుంఠపురంబులో…” అన్నట్లు వెంటనే దొరికిన విమానం అందుకొని కడపలో వాలాడు.
ఆయన వచ్చేసరికి అది చనిపోయింది. తగిన ప్రక్రియలకి గురి అయి, స్టఫ్ కాబడి, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటి మ్యూజియంను అలరించడానికి తరలిపోయింది. ఇటీవల గత 20 సంవత్సరాలలో ఆ పక్షులు మరిన్ని చెంగు చెంగున దూకుతూ కనబడుతూ ఉంటే శాస్త్రజ్ఞుల సంతోషాలకి అవధులు లేవు. కడప జిల్లా సిద్ధవటం మండలం లంకమల్లె అడవుల్లో 465 చ.కి.మీ. ప్రాంతం దీని రక్షణకని ఒక అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం అంటారు. ఈ పిట్టతో పాటు లెపార్డ్, సాంభర్ లేడి, చుక్కల హరిణం, బ్లాక్ బక్ (కృష్ణ హరిణం) వంటివి ఇక్కడ రక్షణ పొందుతున్నాయి.
మొదట్లో ఈ అడవుల్లో నుంచి తెలుగు గంగ ప్రయాణమార్గం నిర్దేశించబడింది. ఇదే కాని వాస్తవంగా ప్రవహిస్తే ఈ పక్షి సంతతికి తప్పక ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల ప్రభుత్వం ఆ కాలువ దారి మళ్ళించింది. ఆనందమోహన్ అనే ఉన్నత అటవీశాఖాధికారి దీని ఫోటో తీసినందుకు కేంద్రప్రభుత్వపరంగా అభినందనలు అందాయి. ఇక చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అడవిలో 4, 5 సార్లు దానిని చూశారు. దాని సంతతి క్రమంగా అధికమవుతోందని తెలుస్తోంది. ప్రస్తుత అంచనాలు 100(±). ఇది చాలదు. ఇంకా అధికం కావాలి.

1988లో దీనిని గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం ఒక తపాలాబిళ్ళ విడుదల చేసింది.
ఏమయినా జోడుపట్టీల కోర్సర్ వల్ల ఆంధ్రదేశం మరొకసారి ప్రపంచపటంలో గుర్తింపు పొందింది. ఎర్రచందనం రాయలసీమలో తప్ప వేరెక్కడా లభ్యం కాదు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆంధ్రదేశంలో కర్నూలు జిల్లాలోనే కనబడుతుంది. దీని సంఖ్య కూడా చాలా బాగా పెరిగింది. అయితే ఇది రాజస్థాన్‌లో కూడా ఉంది.
పెద్దపులుల సంఖ్య మన రాష్ట్రంలోని శ్రీశైలం నాగార్జున అభయారణ్యంలోని టైగర్ ప్రాజెక్ట్‌లో అధికమై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక నల్ల హరిణం, మొసళ్ళు, నీటిబర్రె, ఇండియన్ బైసన్ (గౌర్), ఇంకా చాలా జాతుల విషయంలో ఆంధ్రదేశం శ్రద్ధ వహిస్తోంది.
అయితే విచారకరమైన విషయం చిరుతపులి (చీటా) చివరిసారిగా మదనపల్లి ప్రాంతంలోనే 100 సంవత్సరాల వెనక కనబడింది. మరి దాని దృశ్యాన్ని చూసే అవకాశం ఎవరికీ రాలేదు. అలాటి చరిత్ర పునరావృతం కాకుండా చూడాలి. జెర్డాన్స్ కోర్సర్ సందర్భంగా పోచర్స్ (దొంగ వేటగాళ్ళ) విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
chavakiran అభిప్రాయం:
May 2, 2007 1:54 am
చీటా ఎప్పుడో తిరుపతి అడవిలో కన్పడినట్టూ, ఎవరిపైన్నో దాడి చేసినట్టు చదివినానే!
Rao Vemuri అభిప్రాయం:
May 2, 2007 9:02 am
ఇటువంటి వ్యాసం రాసినందుకు జమ్మి కోనేటిరావుగారినీ, ప్రచురించినందుకు ఈమాట సంపాదకవర్గాన్నీ అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ భూమి మీద మానవుడికి ఎంత హక్కు ఉందో సమస్త జీవకోటికీ కనీసం అంత హక్కూ ఉంది. నా చిన్నతనంలో అనకాపల్లి - చోడవరం రోడ్డు మీద, గోవాడ దగ్గర, ఒక ఒక పెద్దపులిని చంపేరు. అంటే ఆ మన్యప్రాంతాలలో పులులు తిరిగేవనే కదా తాత్పర్యం. అదే రోడ్డు మీద మా పెద్దన్నయ్య ఒక దుమ్ములగొండిని కూడ చూసేడు. ఇప్పుడు పులులు లేవు, దుమ్ములగొండ్లూ లేవు. మన వన్య సంపద నశించి పోయిన తరువాత విచారించి లాభం లేదు.
Rohiniprasad అభిప్రాయం:
May 2, 2007 9:27 am
వైల్డ్ లైఫ్ గురించి తెలుగులో రాస్తున్న కొద్దిమందిలో కోనేటిరావుగారొకరు. మన దేశంలో ఈకో టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజం పెరుగుతున్న దాఖలాలూ కనిపిస్తున్నాయి. ఒకవేపు బడా నాయకులూ, వారి సహచరులూ నెమళ్ళవంటి అపురూప ప్రాణులని చాటుగా చంపి తింటున్నప్పటికీ మొత్తం మీద ఈ విషయాల గురించిన అవగాహన పెరుగుతోంది. ఇలాంటి వ్యాసాలు అందుకు తోడ్పడతాయి.
cbrao అభిప్రాయం:
May 4, 2007 1:32 am
కలివి కోడి పక్షులు ఎక్కువగా రాత్రి పూటే సంచరిస్తాయి. చాలా పిరికివి. మనిషి అలికిడికి పారి పోతాయి. లంక మల్లీశ్వరం అడవుల్లో నుంచి తొలుత తెలుగు గంగ ప్రయాణమార్గం నిర్దేశించబడనప్పుడు ఈ పక్షులను రక్షించటం కీలకమైంది. అప్పటి ముఖ్య మంత్రి N.T.రామారావు గారు పక్షి కోసం తెలుగు గంగ దారి ఎందుకు మళ్ళించాలి అన్న ప్రశ్నకు అప్పటి Chief Conservator of Forests శ్రీ పుష్ప కుమార్ గారు లౌక్యంగా ఈ Jerdon’s Courser పక్షి ప్రపంచంలో మన కడప జిల్లాలో మాత్రమే ఉంటుందనీ, అసలు ఇది ప్రపంచంలోనే అరుదైన తెలుగు పక్షి అని చెప్పి రామారావు గారి తెలుగు అభిమానాన్ని తెలుగుగంగ కాలువ దారి మళ్ళించి పక్షిని ,దాని పరిసరాలను పరిరక్షించటానికి వాడారు.
1986 లో ఈ అరుదైన పక్షిని కనుగొన్న 20 సంవత్సరాలకే మరో ఉపద్రవం ఈ పక్షిని మట్టుపెట్టడానికి వచ్చింది.నీటి పారుదల శాఖ వారు లంక మల్లీశ్వరం అభయారణ్యంగుండా కాలువ తవ్వటానికి అనుమతించినప్పుడు contractor భారీగా యంత్ర సామగ్రిని అడవికి తరలించిన సమయంలో Bombay Natural History Society Research Scholar భరత్ భూషణ్ వాటిని కనుగొని సకాలంలో అటవీ శాఖ అధికారులను హెచ్చరించటంతో వారు ఆ సామగ్రిని స్వాధీనం చేసుకొని కాంట్రాక్టర్ పై కేసు పెట్టడం జరిగింది. దరిమెలా BNHS Director అసద్ రహ్మాని, W.W.F. మరియు Birdwatchers Society of Andhra Pradesh సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసి కాలువ దారి మళ్ళింపు యొక్క ఆవశ్యకత గురించి చెప్పి వారిని ఒప్పించటం లో కృతకృత్యులయ్యారు.
కలివికోడి రక్షణకు పైన చెప్పిన సంస్థల కృషి అభినందనీయం.
భారత ప్రభుత్వం వారు ఈ పక్షిపై వెలువరించిన తపాలా బిళ్ళను చూడండి.
http://www.geocities.com/rs_suresh/jcourserstamp.jpg
కొనేటి రావు గారి వ్యాసంలోని చిత్రాలలో Jerdon’s Courser ‘Double Bands’ చూడండి . వాటిలో నల్ల అంచుల మధ్యలో గులాబీ రంగు గమనించండి. ఇంతవరకు వెలువడిన ఏ చిత్రాలలోను లేని స్పష్టత వీటి లో వుంది. కారణం ఇవి పగలు తీసిన ఛాయా చిత్రాలు. ఈ ఛాయా చిత్రాల రచయిత పేరు వ్యాసం లో ఉదహరిస్తే బాగుండేది. చక్కటి వ్యాసాన్ని అందచేసిన జమ్మి కోనేటి రావు గారికి అభినందనలు.
ఆసక్తి ఉన్నవారు కడప-బద్వేలు-లంక మల్లీశ్వరం అభయారణ్యం లో స్థానికుల సహాయం తో కలివి కోడిని చూడవచ్చు.
Lyla Yerneni అభిప్రాయం:
May 4, 2007 7:30 pm
బహు అందమైన ఛాయాచిత్రాలు. అందమైన వ్యాసము.
రచయితకు ధన్యవాదాలు.
అసలు సౌందర్య రాశి - వ్యాసములోని కలివి కోడి - గురించి
మరికొన్ని గమనించవలసిన విషయాలు తెలిపిన సి.బి రావు గారికి
కూడాను.
naveen garla అభిప్రాయం:
May 5, 2007 3:34 am
నాది మదనపల్లె. మా నాయన చిన్నప్పుడు శేషమహల్ దగ్గర ఏరు కాడ చిరుతపులి కనిపించిండెంట….ఇది జరిగి సుమారుగా ఓ 50 సంవత్సరాలైతాంది.
Jaydev Mettupalli అభిప్రాయం:
May 14, 2007 12:56 pm
కడప ప్రాంతం లో కనిపించే అతి అరుదైన పక్షి గురించి వ్యాసం ప్ర చురించిన మీకు కృతఙ్ఞతలు. వ్యాసకర్త శ్రీ కోనేటిరావు గారికి అభినందనలు. సుమారు 20 సంవత్సరాల క్రిందట నేను లంకమల్ల అడవులకు వెళ్ళినపుడు ఈ అరుదైన పక్షి ని చూసే అవకాశం దొరకలేదు. బట్టమేక లు కనపడ్డాయి కాని కలివికోడి కనబడలేదు.
జయదేవ్ మెట్టుపల్లి
చికాగో
రానారె అభిప్రాయం:
May 22, 2007 7:41 am
కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి - అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ - అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సాయపడగలవని ఆశిద్దాం.
రానారె అభిప్రాయం:
May 22, 2007 7:47 am
కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి - అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ - అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సహాయపడగలవని ఆశిద్దాం.
రానారె అభిప్రాయం:
May 22, 2007 8:28 am
ఇంటర్నెట్లో వెతికితే, కలివికోడి (Jerdon’s Courser) శాస్త్రీయనామం ఈ వ్యాసంలో చెప్పినట్లు Cursorius bitorquatus అని కాక Rhinoptilus bitorquatus అని కనబడుతున్నది వికీపీడియాలోనూ, మరిన్ని ఇతర వెబ్సైట్లలోనూ!!?