ఈమాట » నామాట

Expand to right
Expand to left

నామాట

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మన తెలుగు సంస్థలు కానీయండి,స్థానికంగా ఊరూరా వెలిసిన సంస్థలు కానీయండి;– వీటి ఆదర్శాల జాబితాచూస్తే మనకు ఏవిధమైన తేడా కనిపించదు. కారణం? ఇవి అందరికీనచ్చిన,అందరూమెచ్చే,ఏ ఒక్కరికీ అభ్యంతరంలేని ఆదర్శాలు.

దేశంకాని దేశంలో మన తెలుగు సంస్స్కృతిని పరిరక్షించుకోవడం. ముఖ్యంగా,మన పిల్లలకి మన సంస్కృతి గురించి తెలియజెప్పడం!ఈ ఆదర్శాలని ఎవరు కాదనగలరు? ఆదర్శాలు అన్నీ మంచివే. అయితే కొన్ని ఆచరణ సాధ్యాలు; కొన్ని కేవలం “utopia”లు.

అసాధ్యంకాని ఆదర్శాలనికూడా ఆచరణలో పెట్టడాని కొచ్చేటప్పటికీ, మన సంస్థలు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్దయెత్తున ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకొనే స్థోమత ఉన్నసంస్థలు,– తానా,ఆటా లు రెండూ అడవిలో అబ్బా అంటున్నాయా అన్న సందేహం రాక మానదు.

ఇందుకు ఒక కారణం,మన సంస్కృతి యొక్క ప్రాచీనత,దాని విస్తృతీ కావచ్చు. మన భాష, మన వెయ్యేళ్ళ సాహిత్యం, మన చరిత్ర,మన లలిత కళలు,(బహుశా అలలితకళలుకూడా!) ఇవన్నీ మన సంస్కృతిలో అంశాలే!మన ఆదర్శాలని ఆచరణలో పెట్టడానికి అనువుగా ఏ అంశాలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి,ఏ అంశానికి మద్దతు ఇవ్వాలీ అన్నవిషయంపై ఏకగ్రీవమైన అభిప్రాయం లేకపోవడం మరొక కారణం కావచ్చు.

ఏది ప్రధానం,ఏది కాదు అన్న విషయం గురించి (నా అనుభవం) ఒక ఉదాహరణ చెప్పుతా. ఏ మెగాస్టార్‌ని మన వార్షిక ఉత్సవాలకి ఆహ్వానించాలి అనే విషయం పై చర్చ తీసుకోండి. ఎంత ఖర్చుపెట్టి ఎవరిని తీసుకు రావచ్చు అన్న విషయమే ముఖ్యంగా చర్చిస్తారు కానీ, అసలు ఏ మెగాస్టారు నైనా ఎందుకు తీసుకోరావడం అన్న విషయం పై చర్చ జరగదు. కారణం? అది ఎజెండాలో ఉండదు కాబట్టి! అయినా ఆప్రశ్న లేవదీశారనుకోండి. మీకు వచ్చే “stock” సమాధానం: మెగాస్టారు రాకపోతే ఎనిమిది వేలమంది రారు. అంతమంది జనం రాకపోతే మన ఉత్సవాలు నిరిటికన్నా, ముందటేటి కన్నా నాసి అంటారు. ససి,పసీ లేని ఉత్సవాలు, అని వచ్చిన జనం అంటారు! ఇది నిజంకాదని, ఉత్సవాలకొచ్చే మనజనం ఉత్త మేకల మంద కాదని వాదించడం అనవసరమే! ఎందుకంటే,మనం ప్రయత్నిస్తేకదా,నిజమో కాదో రుజువయ్యేది?

సినిమా స్టారులన్నా,సినిమా సంగీతం స్టారు లన్నా నాకు ఏవిధమైన వ్యతిరేకతా లేదు. వాళ్ళని ఆహ్వానించి అందలానికెక్కించడం మన ఆదర్శాలకి అవసరమా అన్నది అసలు ప్రశ్న!

ఈ రకమైన చర్చ వచ్చినప్పుడల్లా, నాకు సినిమా ప్రొడ్యూసర్ల గురించి శ్రీశ్రీ (కృష్ణాపత్రిక, ఆగస్ట్ 25)రాసిన వాక్యాలు గుర్తుకొస్తాయి.

శ్రీశ్రీ రాస్తాడు:

అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడ మన ప్రొడ్యూసర్లకు పరిపాటి అయింది. ఇది ఎంత అసందర్భంగా ఉన్నదో చెబుతా వినండి - ఆహారాన్ని విక్రయించడం ఒక వ్యాపారంగా నడపడం 20 వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. ప్రతివాడూ తిండికోసం హోటలుకు వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం (మంచిది) లభించక పోవచ్చు. అయినా రోజూ హోటలుకు వెళ్ళక తప్పదు.

ఆహారం వలెనే ఈ నాడు మానవునికి సినిమా కూడా ఒక అవసరం - అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కానీ కంపుకొట్టే వేరుశనగ నూనెతో చేసే వంటకాలను కాని ప్రజలు ముట్టరని, వాటికి అలవాటు పడ్డారని యజమాని చెబితే, ఎంత అసందర్భంగా ఉంటుందో, ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పడం కూడా అలాగే ఉన్నది.

ఈ సామ్యం ఇంతకన్నా విపులంగా వివరించక్కరలేదు.

మన సంస్కృతిని పరిరక్షించుకోడానికి,అమెరికన్లకీ,తెలుగు-అమెరికన్‌ భావి పౌరులకీ మన సంస్కృతి గురించి విపులంగా, సాధికారంగా విశదీకరించడానికీ,ఆచరణ సాధ్యం అని, అవసరం అనీ నేను నమ్మిన, ప్రయత్నిస్తున్న ఒక అంశం గురించి చెబుతాను.

రాబోయే అయిదారు సంవత్సరాలలో (లేదా పది సంవత్సాలు !) దక్షిణ ఆసియా విభాగాలున్న అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో (ముఖ్యంగా సంస్కృతం, హిందీ బోధించే చోట్ల ), తెలుగు సాహిత్యం చరిత్రలు పాఠ్యభాగాలుగాను, పరిశోధనాంశాలుగానూ చెయ్యవలసిన అవసరం ఉన్నది. ఇందుకు దేశవ్యాప్తంగా వెలిసిన తెలుగు సంస్థల మాటల మద్దతే కాదు, మూటల మద్దతూ అవసరం. స్థానిక సంస్థలు ఇప్పటికే, బర్క్‌లీ, ఎమరీ (అట్లాంటా) విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్య బోధన. పరిశోధనలకు ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. అల్లాగే ఆస్టిన్‌లో కూడా! డెట్రాయట్లో తెలుగు వాళ్ళు ఈ పని మూడేళ్ళక్రితమే సాధించారు. అయితే, స్థానిక సంస్థలు మాత్రమే ఈ పని సాధించలేవు! దేశవ్యాప్త సంస్థలు పూనుకోవలసిన సమయం వచ్చింది. అది ఇప్పుడు సాధ్యం కూడాను!

ఒక అనవద్యమైన, నిరపాయకరమైన సూచన: తానా సభలకీ, ఆటా సభలకీ పెట్టే మొత్తం ఖర్చులో 10% (tithe)ఈ పనికై నిర్దేశించడం. అది ప్రారంభం. ఆ పని చెయ్యగలిగితే, ఒక దశాబ్దంలోపుగా, కనీసం అరడజను అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్య పదవి స్థాపించడం సాధ్యం.

భావితరాల పౌరులు — ఇది మాది, ఇది మా సాహిత్యం, మా సంస్కృతి — అని గర్వంగా చెప్పుకోడానికి ఇంతకన్నా ముఖ్యమయిన పని ఇంకొకటి ఉన్నదని నాకు తోచటల్లేదు.

 

(14 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Rohiniprasad అభిప్రాయం:

    March 2, 2007 7:58 am

    ఉన్న సంస్కారం సంతృప్తికరంగా లేదనీ, మంచి విలువలు పెంపొందితే బావుంటుందనీ అనుకునేవారు యువతరంలో నేటికీ చాలామందే ఉన్నారని తెలుస్తోంది. ఆసక్తి ఉన్నా లేకపోయినా మర్నాడు ఆఫీసు కొలీగ్స్ తో్ మాట్లాడగలగడానికి రాత్రంతా టీవీ లో గేమ్స్ చూసేవాళ్ళున్నట్టే ఇతరులు ఏమైనా అనుకుంటారేమోనని తమ మంచి టేస్టును బైటపెట్టుకోకుండా కొందరు “జాగ్రత్త పడతారని” నాకనిపిస్తుంది.

    వేలం వెర్రి సినిమా పిచ్చిని ధనబలంతో పనిగట్టుకుని ప్రోత్సహిస్తారు కనక దాన్ని అడ్డుకోవడం సులభం కాదు. మంచి అభిరుచిని బలపరిచే ప్రయత్నాలు కొనసాగించడమే ఉత్తమం. పెద్ద సంచలనం కలిగించలేకపోయినా, కమర్షియల్ ఒత్తిళ్ళు లేని ఈమాట వంటివి అందుకు ఫోరమ్ గా పనికివస్తాయి.

  2. మురళి అభిప్రాయం:

    March 2, 2007 10:00 am

    మూడేళ్ల క్రింద యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో ప్రారంభించిన తెలుగు బోధన 2007 ఏప్రిల్ తో మూసివేస్తున్నారని తెలిసింది. సంవత్సరానికి $40,000 ఖర్చయ్యే ఈ కోర్సు నిధుల లేమి వల్ల ఆపివేస్తునారట.

    గతమూడేళ్లు స్థానిక తెలుగు సంఘం ప్రతీ ఏటా $20,000 తమ వంతుగా జమ చేసారు. ఈ ఏడది యూనివర్సిటీ వారు తమ వంతు కూడా కలుపుకొని $40,000 ఇమ్మన్నారట. అది శక్తికి మించిన పని కావటంతో స్థానిక సంఘం చేతులెత్తేసారు.

  3. విహారి అభిప్రాయం:

    March 2, 2007 11:50 am

    వేంకటేశ్వర రావ్ గారూ,

    మీరన్న మాటల్లొ ఎంతో నిజం వుంది. ఎన్ని సంఘాలు వున్నా వాటి ఆదర్శాలు పూర్తిగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. అలా అని అవి లేకుండా పోతే మొదటికే మోసం వస్తుంది. ఇవన్నీ కంటికి రెప్ప ఇస్తున్నంత రక్షణ అని నా అభిప్రాయం. ఇవి కూడా లేకపోతే మన సంప్రదాయాలు పూర్తి అంతరించే ప్రమాదమున్నది. ఇక్కడే నేను కూడ తెలుగు సంఘం లో వున్న ప్రధాన కార్య వర్గ సభ్యుణ్ణే. దీని గురించి చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. మొన్న మేము చేసిన దీపావళి సంబరాల్లో గాయకులు కొన్ని చిరంజీవి పాటలు పాడారు. దానికి పిల్ల పీచు అందరూ పెద్ద ఎత్తున స్టేజ్ ఎక్కి డ్యాన్సులు చేశారు. తరువాత ఒక “రామ దాసు” సినిమాలోని పాట డ్యాన్సులు చెయ్యడానికి ముందుకు రమ్మంటే ఒక్కరు కూడా రాలేదు. అలాగే ఈ కార్యక్రమాల్లో సినిమా పాటల మీద మసాల మాటల కామెడీల మీద చూపించే ఇంట్రెస్ట్ మిగతా వాటి మీద వుండదు. సినిమా పాటంటే హాలు ఫుల్లు త్యాగరాజ కీర్తనంటే హాలు నిల్లు. అంత మందిని ఒక చోటకు తీసుకు రావడానికి ఎన్నెన్నో తంటాలు పడాల్సి వస్తోంది.

    శ్రీ శ్రీ గారు చెప్పింది కరక్టే. శంకరాభరణం సినిమా చూసి హిట్ చేసిందీ తెలుగు జనులే…మంగమ్మ గారి మనవడు, అల్లుడా మజాకా లాంటి డబుల్ మీనింగ్ డైలాగుల సినిమాలను హిట్ చేసింది అదే తెలుగు జనులే. మన కీర్తిని చెప్పడానికి ప్రతి సారీ బాపు నో, సి.నా.రె. నో, ఆత్రేయ నో, బాల మురళీ కృష్ణ నో తీసుకు వస్తే ఇప్పుడున్న నలభై ఏళ్ళ లోపు వాళ్ళలో థొంభై శాతం మంది గుర్తుపట్టలేక పోవచ్చు. అదే ఏ సినిమా వాడినో పట్టు కొస్తే సులభంగా పబ్లిసిటీ వస్తుంది. పనిలో పనిగా ఆ తెప్పించిన వాళ్ళకూ పబ్లిసిటీ వస్తుంది.

    అలాగే విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధన మొదట్లో బాగానే వుంటుంది. తరువాతే సమస్య అంతా. కొంత మంది దాతలు డబ్బు ఇచ్చినా అందులో చేరే వారు కరువవుతారు. రోహిణి ప్రసాద్ గారన్నట్లు అర్థ కాని ఫుట్ బాల్ మ్యాచ్ ను అర్థం చేసుకోవడానికి వెచ్చించే సమయాన్ని తెలుగు బాష మీద సంస్కృతి మీద పెడితే మనం తెలుగు ను ఇంకొంత కాలం బతికించుకో గలుగుతాము.

    ప్రమంచంలో వున్న తెలుగు సంఘాలన్నీ తెలుగు వాళ్ళ కోసం కాకుండా తెలుగు మీద అభిమానమున్న వాళ్ళకు మాత్రమే పనిచేస్తాం అనే ఆదర్శం తో ముందుకు పోతే కాస్త సఫలమవుతారు.

  4. madhusoodana rao అభిప్రాయం:

    March 2, 2007 12:22 pm

    విహారి గారు,

    ” విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధన మొదట్లో బాగానే వుంటుంది. తరువాతే సమస్య అంతా” అని మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు కరక్టు! మన తెలుగు వాళ్ళకి కాస్త అహంకారం పాలు ఎక్కువ! ఈగో తో అనేక మంచి ఉద్దేశ్యాలు నీరు గారుస్తారు. తెలుగు వాడంటే ఒంటి కాయి సొంటి కొమ్ము !
    మందిలో మనలేడు. అమెరికా వచ్చి అరవై ఏళ్ళు దాటినా అందర్నీ కలుపుకొని పని చేయడం చేతకాకపోవడం వల్ల జరిగే నష్టాలు ఇవి. తెలుగు భాష ని, సంస్కృతిని ఉద్దరిస్తున్నామని పబ్లిసిటే చేసే సంస్థలు ఇలాంటి వాటికి ముందుకు రావడం తక్కువే! ప్రతీ వాడు - నాకేంటట? - అనుకుంటూ పైకి మాత్రం మేం పేరు కోసం చెయ్యం కేవలం భాషమీద అభిమానంతోనే అనడం చూస్తాం. ఒక ఊరిలో తెలుగు జనాభా 1000 మంది ఉంటే 10 వేల తెలుగు సంఘాలు ఉంటాయి. ఒక సంఘం తెలుగు భాషకి సంబంధిచిన పని చేస్తే రెండో సంఘం దరిదాపులకు కూడా రాదు! ఎవరి స్వప్రయోజనాలు వారివి!
    ఇది తెలుగు వాళ్ళకి దాపురించిన దౌర్భాగ్యం!

  5. Rohiniprasad అభిప్రాయం:

    March 2, 2007 12:43 pm

    తెలుగు సంఘాలని గురించి పెద్ద ఎత్తున చర్చించటానికి ఇది సరైన వేదిక కాకపోవచ్చు గాని విహారిగారు రాసినది చదివాక లోగడ నేను చేసిన ఒక సూచనను మళ్ళీ ప్రస్తావించా లనిపిస్తోంది.

    టీనేజర్లకు తెలుగు గురించి చెపుతున్నప్పుడు మన చిత్ర కవిత్వం గురించీ, బంధ కవిత్వం, అష్టావధానాలను గురించీ తెలిసినవారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చెయ్యగలిగితే వారికి కొంత ఆసక్తి కలిగే అవకాశం ఉంది. భాషని పెర్ఫార్మింగ్ ఆర్ట్ గా ప్రదర్శించడం సరికాకపోవచ్చు కాని దాని శక్తుల గురించి తెలియజేస్తే కొన్నేళ్ళకైనా బాపూ, సినారె తదితరులను గురించి తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తారేమో.

    తరవాతి తరాలు సంస్కారపరంగా ఆటవిక దశకు చేరుకోకుండా చూడాల్సినది మనమే కదా. అందుకని నిరాశపడకుండా ప్రయత్నాలు చెయ్యాలి. ఏ ప్రోగ్రాములకు ఎంతమంది వస్తున్నారనేది ముఖ్యం కాదు. మంచి ప్రోగ్రాములు నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగి తీరాలి. కేవలం అంకెలనే ప్రామాణికంగా తీసుకుంటే అర్ధనగ్న రికార్డు డాన్సులు పెట్టించాలి. అప్పుడు చిరంజీవి పాటల కన్నా హెచ్చుగా జనం వస్తారు. అందుకని జనం రావడం ఒక్కటే కొలమానం కాదు. ఆడియన్స్ సంస్కారం కంటే కార్యకర్తల సంస్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది మరిచిపోకూడదు.

  6. J K Mohana Rao అభిప్రాయం:

    March 2, 2007 1:17 pm

    రోహిణీప్రసాద్ గారూ:

    సుమారు పది సంవత్సరాలుగా ఛందస్సులో శాస్త్రీయముగా
    పరిశోధన చేస్తున్నాను. దాని ఫలితాలను ఛందస్సు, రచ్చబండల
    మూలముగా అందరికీ తెలియజేస్తున్నాను. సుమారు 300
    పద్యాలను గర్భ, బంధ తదితర చిత్రకవితలను వ్రాసియున్నాను.
    కాని ఇందులో జనులకు అంతగా ఆసక్తి లేదండీ. దేనికీ ఫీడ్ బ్యాక్
    ఉండదు. కొన్నిటికి పవర్ పాయింట్ ప్రెసెంటషన్లు కూడ ఉన్నాయి.

    నా ఉద్దేశములో ఇంటర్నెట్ ద్వార తెలుగు నేర్చే ప్రయత్నాలను
    ఎక్కువగా చేయాలి. విశ్వవిద్యాలయాల ద్వారా నేర్చుకోవడం
    కొద్దిగా కష్టమేమో? కాని ఈ విశ్వవిద్యాలయాలు ఆన్ లైన్
    డిస్కషన్లకు వినియోగిస్తే బాగుంటుందేమో?

    ఆలోచనలకు ఆసక్తికరమయిన మాటను శ్రీ వేలూరి గారు
    అందజేసినందులకు వారికి హార్దిక వందనములు.

    - మోహన

  7. lalitha అభిప్రాయం:

    March 2, 2007 5:44 pm

    నేను నా వైపు ప్రయత్నంగా పిల్లల కోసం తెలుగు (నా బ్లాగు లింకు) మొదలు పెట్టాను. మెచ్చుకోళ్ళు బాగానే వస్తున్నాయి. అవి నాకు ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి. నిజంగా ఎంతమంది ఎంత తరచుగా అందులోని అంశాలు గాని దాని వల్ల స్ఫూర్తినందుకొని ఇతరం ఏవైనా గాని తమ పిల్లలకు తరచుగా పరిచయం చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంటుంది. కాని నేను సందేహంతో ఆగదల్చుకోలేదు. ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతూనే ఉంటాను. నా పిల్లలకైతే ఉపయోగపడుతోంది. ఇంకొంచెం విస్త్రుతంగా పరిచయమైతే చేసుకుంటూనే ఉంటాను. ఒకే లాంటి అభిరుచులూ, ఆశయాలూ ఉన్న వాళ్ళు కొందరు తప్పని సరిగా ఉంటారు. వారు కొందరూ కలిసినా చాలు. ఇది నా వైపునుంచి నా ప్రయత్నం.

    ఇక, రచ్చబండ లో చాలా మంది చాలా advanced భాషా విషయాలు చర్చిస్తారు, మంచి అనువాదాలు, కవితలూ రాస్తూ ఉంటారు. ఎవరైనా పూనుకుని వాటిని compile చేసి ఒక బ్లాగులో కాని వెబ్సైటు లో కాని పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకెప్పుడూ.

    ఈ రోజున internet లో తెలుగులో రాయ గలుగుతున్నాము, చాలా మంచి బ్లాగుల్లో మంచి తెలుగు ఉపయోగింప బడుతోంది. తెలుగు భాషకు సంబంధించిన విషయాలు తెలియజేయబడుతున్నాయి. ఈ రాస్తున్న వారిలో చాలా మంది యువకులు కూడ ఉన్నారు. ఇవన్నీ ఆశాజనకమైన విషయాలు అనిపిస్తుంది నాకు. ఏమి లేకున్నా, పిల్లలకు తెలుగుని పరిచయం చెయ్యాలన్నా, వాళ్ళకు కుతూహలం కలిగించాలన్నా, వాళ్ళని తెలుగుతో “touch” లో ఉంచాలన్నా, ఇప్పుడు చాలా సమాచారం అందుబాటులో ఉంది. ఉన్న మంచిని పెంచుకుంటూ ముందుకి సాగుతూ ఉందాము.

    ఇది నా అభిప్రాయం.

    లలిత.

  8. Ravikiran Timmireddy అభిప్రాయం:

    March 2, 2007 8:01 pm

    అయ్యా,
    మట్టి పిసుక్కోని, ఎద్దు తోక తిప్పుకొనేవాడ్నే కానీ, యెప్పుడో సిన్నప్పుడు, మా ఊరయ్యొరు పున్నెవా అని ఏదో రెండు ముక్కలొంట బట్టినాయ్ కాబట్టి, నేనీ రెండు ముక్కలు రాస్తుండా. నాకు సంస్కృతవెంత తెలుసో, సంస్కృతి, సంస్కారాల గురించికూడా అంతే తెలుసు. అందుకని వాటి గురించి నేను మాట్లాడితే బాగుండదు. కాకపోతే ఇన్నేళ్ళు తెలుగు గడ్డమీద బతికేను కాబట్టి, తెలుగు బతుగ్గురించి కొంచెంతెలుసు. అదిగిదిగో దాన్ని గురించే చెప్తున్నా. దాన్నే మీరు సంస్కృతి, సంస్కారవనో, మట్టీ మశానవనో ఏదో అంటారు. మందలేందంటే అయ్యా, మన తెలుగోళ్ళలో మూడూముక్కాలు మందికి సదవటవే రాదు. నాలుగచ్చరాలు వొచ్చినోల్లు ఒందకి నలగరకన్నా ఎక్కువుండరు. అట్టాటోల్లకి బాపూలు, సినారేలు ఏందెలస్తారయ్యా? వాళ్ళకి నన్నయ, మావూర్లోపుట్టిన తిక్కన గురించే తెలీదు. ఇంకమాకు బంధ కవిత్వాలు, అష్టావధానాల గురించేంతెలస్తదయ్యా. సరే మేవేదో యెగసాయం కేసుకునేవాళ్ళం అనుకుంటే, దురద్రృష్టం కొద్దీ మిగతావాళ్ళు మాకన్నా అన్నేయం. ఈ నాలుగు ముక్కలు నేర్చే అవకాశం, తీరికా కుడాలేఓళ్లకి. ఇంతకీ మందలేందంటే, ఏవీ తెలీకపోయినా, భాస కుడా సరిగా రాకపోయినా, మీరనే ఆ సంస్కృతి మా బతుకుల సారవే. మేవే కదా తెలుగు నేలంతా, తెలుగుతనవంతా మాదే కదా. బాపూది, సినారేది, నన్నయ్యది, తిక్కనది, లేకపోతే మావూరి తెలుగయ్యోరిది, మా వూరి భజనసంగానిదీ మాత్రవే కాదుకద తెలుగుతనం. భజన సంఘవంటే గుర్తుకొచ్చింది, మీ తానాలూ, ఆటాలు అట్టటియే కదా. కాకపోతే మీది కోచం ఐటెక్కు అంతేకదా. మా భజనసంఘం మా తెలుగుతనాన్ని రచ్చించదు. మా తెలుగుతనవే లేకపోతే మీరనేటటువంటి మా సంస్కృతే భజన సంఘాన్ని రచ్చిస్తది, పోసిస్తది. సంస్కృతంటే మాపోలేరమ్మ ఇగ్రహంకాదు, రాతిలో పోతపోసినట్టు, నిన్నా, ఈరోజు, రేపు కూడా శిలకొట్టినట్టు మార్పు లేకుండా అట్టె వుండడానికి. మంచికానీ, చెడుకానీ అది మారేది మారేదే. బాపూలూ, సినారేలు, అష్టావదానాలు, శథావదానాలు, ఎమ. ఎ తెలుగులు, చంధస్సులో డాక్టరేట్లూ, త్యాగరాజు కీర్తనలు, సరసవైన ప్రార్థనలు, భజన సంఘాలు, తానాలు, ఆటాలు ఇయ్యన్నీ సంస్కృతిలో భాగవే, ఈటితోపాటు, జజ్జనక జనారేలు, లబ్జు లబుకు సినిమా పాటలు, రికార్డీంగు డేన్సులూ కూడా ఈరోజు తెలుగు సంస్కృతిలో భాగవే. అందుకని మీరేం దిగులు పడకండి, సినిమా వాళ్ళని పిలిసినందుకు, పిలకాయలు త్యాగరాజ కీర్తనలకి డాన్సులేయనందుకు. మరీ భాదపడిపోకండి, తనాలు ఆటాలు లేకపోయినా అమెరికాలో తెలుగు సంస్కృతికేం డోకా రాదు. బాపూలూ, సినారేలూ లేకపోయినా, తెలియకపోయినా తెలుగు సంస్కృతికేం పరవాలేదు, తరవాతి తరాలు సంస్కారపరంగా ఆటవికదశకి చేరుతాయని మీరు మనేద పడబల్లే. సంస్కృతికి ఏ వొక్కరి రక్షా అక్కరలేదు, తెలుగు మాట్లాడే మనుశులుంటే చాలు. మీ లాగా, నా లాగా, ఇంకా రకరకాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళుంటే సాలు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  9. విహారి. అభిప్రాయం:

    March 2, 2007 8:03 pm

    ఏ కార్యక్రమమైనా ముందుకు సాగాలంటే మొదలు పెట్టిన కొన్నాళ్ళకు కాస్త ఉత్సాహ పరిచే వాళ్ళుండాలి. అది లేక పోతే ముందుకు సాగడం కష్టం. మన సంస్కృతి ఉనికి కోసం ఎందరో పాటుపడుతున్నారు. వాళ్ళ లో కొంత మంది కొంత కాలం ఆయ్యాక ఎన్నో కారణాంతాల వల్ల ఆపేసుంటారు. ఆ కారణాలు ప్రొత్సాహం లేక పోవడం వల్ల కావచ్చు. లేక ఆర్థిక కారణాలు అయ్యుండచ్చు. లేక వాళ్ళ దైనందిన కార్యక్రమాలు మారడం వల్ల కావచ్చు. విదేశీ గడ్డ మీద ఇలాంటి ప్రయత్నాలకు చాలా పరిమితులుంటాయి.

    ఈ మధ్య మాధ్యమాలు(ఇంటర్నెట్, టి.వి.) లస్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే వేలుంది. అవి అందరి ప్రయత్నాలకు కాస్త సహాయ కారిగా వుంటున్నాయి.

    ఒక్కటి మాత్రం నిజం మన వాళ్ళలో మళయాళీయులకు, తమిళులకు ఉన్న బాషాభి మానంలో ఓ పది శాతం ఉండి వుంటే ఇలాంటి చర్చ కూడ వచ్చేది కాదేమో. ఇది నా అనుభవంలో కొచ్చిన వాటిద్వారా చెబుతోంది.

    విహారి.

  10. chavakiran అభిప్రాయం:

    March 5, 2007 9:26 pm

    Generic comment.

    It is time to install some more word press plug in’s to eemaata. isn’t it?

    particularly plugins like Ajax comments and etc…

  11. Anuradha అభిప్రాయం:

    March 12, 2007 2:52 am

    శ్రీవెంకటేశ్వరరావు గారి సంపాదకీయం చాలా ఆసక్తిదాయకం
    గా ఉంది.శ్రీ రోహిణీప్రసాద్ గారు, భావితరాలవారు సంస్కార
    పరంగా ఆటవిక దశకు చేరుకోకుండా చూడవలసినది
    మనమేనని చెప్పి,ప్రతి వ్యక్తికీ సమాజం పట్లగల బాధ్యతను
    గుర్తు చేశారు. సమాజ ప్రాధాన్యత తగ్గి వ్యక్తి ప్రాధాన్యత
    పెరుగుతున్నఈ కాలంలో క్రమేణా అభిరుచుల స్థాయి
    దిగజారుతోంది. పాశవిక ప్రవృత్తులను ప్రేరేపించే చవకబారు
    సంగీత,సాహిత్య,నృత్యాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.
    ఇలాంటి పరిస్థితుల్లో ఉదాత్తమైన,ఉన్నతమైన కళా సృష్టిని
    ప్రోత్సాహపరిచే కార్యక్రమాల అవసరం ఎంతైనా ఉంది.
    అనూరాధ

  12. Vaidehi Sasidhar అభిప్రాయం:

    April 13, 2007 5:38 am

    Thought provoking well written editorial.

  13. rajasankar kasinadhuni అభిప్రాయం:

    April 15, 2007 5:28 am

    నేను మా స్థానిక తెలుగు సంస్థలో కార్యకర్తగా పనిచేసినప్పటి అనుభవాలు, మనోభావాలు శ్రీ వేంకటేశ్వరరావుగారి సంపాదకీయ వ్యాసం, తదితర పాఠకమిత్రుల వ్యాఖ్యలతో మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఈ తెలుగు సంస్థల charters లో చెప్పినదానికి, సగటు సభ్యుడికి ఉన్న expectations కి చాలా తేడా వున్నదని గ్రహించగానే, నేను చేసిన మొదటి పని, ఇంట్లో మా పిల్లలకి శతక సాహిత్య పరిచయం. సుమతీ శతకం, వేమన శతకం లోంచి సుళువుగా నోటికి వచ్చే పద్యాలని వాళ్ళతో కంఠస్థం చేయించి వాటి తాత్పర్యాలని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పటం మొదలుపెట్టాను. వాళ్ళు ఇప్పటికీ ఎంతోకొంత శ్రధ్ధతో వాటిని మననం చేసుకుంటూ ఉంటారు. నన్నయ, తిక్కన, ఇతర ప్రాచీన కవుల సాహిత్యం చదివి అర్థం చేసుకుని ఆనందించే స్థాయికి వాళ్ళు వెడతారనే ఆశ నాకు ఏ కోశానా లేదు కానీ, వాళ్ళతో పాటు తెలుగు భాష మీద వాళ్ళకి ఉన్న ఆసక్తి కూడా పెరిగి ఎక్కడున్నా తెలుగు మాట్లాడడం మానరనే నమ్మకం మాత్రం ఉంది.
    అమెరికా విశ్వవిద్యాలయాల్లొ తెలుగు పాఠ్యాంశంగా ఉండాలా, ఉంటే దానివల్ల కలిగే లాభాలు, స్థానికి సంస్థలకి తెలుగు భాషపట్ల ఉన్న apathy వంటి విషయాలు పక్కనుంచి, ఎవరికివారు తమ తమ స్థాయిలొ మన భాషని, సంస్కృతిని పిల్లలకు అందజేయడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే వచ్చే ఫలితాలు మెండు.

    విధేయుడు,
    కాశీనాథుని రాజాశంకర్

  14. Sridatta Kompella అభిప్రాయం:

    April 26, 2007 3:29 pm

    Hi All

    I think we need to start reforms at home. Teach your kids to talk and read in Telugu at home and teach them to use RTS to write. Telugu culture will follow. Putting the Telugu seed in your children will spread the message thru out the community.

    Thanks to my parents for talking in Telugu naturally at home, I realized that it is part of my heritage and I learned to answer in Telugu and became fluent. Me speaking Telugu helped me understand a lot about Telugu culture. Now, I can connect with my Andhra Roots while still being a first generation American teenager.

    regards
    Sridatta Kompella

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a