ఇద్దరు దుర్మార్గులు
అసలు నాకే ఇలా అవుతుందో, లేక అందరికీ ఇలానే అవుతుందో తెలియదు. ఎన్నో సార్లు అనిపిస్తుంది,ఇలా ఇంకెవ్వరికీ జరగదేమో, కేవలం నా జాతకంలోనే ఇలా ఉందేమో అని. లేకపోతే తెలుగు ఎమ్మే చదవడవేవిటీ,కంప్యూటర్‌కంపెనీలో మేనేజరు ఉద్యోగవేవిటి? ఎక్కడన్నా పొంతన ఉందా? ఎక్కడో అగ్గురారంలో పుట్టి, ఎగిరొచ్చిహైదరాబాదులో స్థిరపడడవేవిటి? నాలాంటి స్థిరం తక్కువ వాడికి డాక్టర్‌దీప లాంటి భార్య దొరకడవేవిటి?కారూ, ఇల్లూ, కొడుకూ..ఏవిటో, ఇవన్నీ నాకే జరిగాయా?
నా జీవితంలో అన్నీ అనుకోని మార్పులే. ఎప్పుడో, ఏజన్మలోనో చేసుంటాను రవ్వంత పుణ్యం. పాపం దేవుడు ఋణం తీర్చేసుకుంటున్నాడు కావాల్ను. ఎంతటి శ్రోత్రీయమైన కుటుంబం? శాస్తుర్లు గారి లాంటి ఘనాపాటీ కోనసీమలో మరొహడు లేడని చెప్పుకునేవారు నాన్న గురించి. ఆ ఇల్లో తులసి వనం,నేనో నిగమ శర్మ. అసలు నాకు ఈ తిరుగుడు ఎలా అలవాటయ్యిందో? మొదట్లో తప్పు చేసినప్పుడు ఇంటికి వెళ్ళి దీపకి మొహం చూపించడానికి భయం వేసేది. పిల్లాణ్ణి దగ్గరకి తీసుకోవాలంటే తెలియని భయం, చేతులు వణికేవి. రాను రాను అలవాటైపోయింది. నా తిరుగుడు బహుశా దీపకి తెలుసునేమో. తెలిసీ నాతో కాపురం చేస్తోంది. అందుకే ఆవిడ దేవత. ఆవిడ దేవత ఐతే, మరి నేను? బహుశా దెయ్యాన్నేమో? మరీ అంత వెధవనా? అంత వెధవనైతే గోపిక ఎందుకు రానిస్తుంది..ఎందుకు రానివ్వదూ? డబ్బులు చేదా? వెళ్ళిన ప్రతిసారీ ఐదువేలు ఊడగొడుతుందిగా, దొంగపీనుగ. ఛా..పాపం దొంగపీనుగ కాదులే. చాలా పద్ధతైన మనిషి. కన్యాశుల్కంలో మధురవాణి అంతటి మంచి మనిషి. ఎవర్ని చేరదియ్యాలో, ఎవర్ని దూరంగా అట్టేపెట్టాలో తెలిసిన మనిషి. రసికత తెలిసిన జాణ. నాకు స్ఫూర్తి నిచ్చే దేవత. ఏవిటో అందరూ దేవతలే…ఎటొచ్చీ నేనే…”
ఆలోచించగా అలోచించగా తన రూపం మరీ అష్టావక్రంగా కనిపించసాగింది మోహన్‌కి. ఎందుకో నవ్వొచ్చిందతనికి.
అతని భార్యకి ఇల్లు ఒక ఆలయం. దేవుడు నడి రాత్రి కొండదిగి వెళ్ళినా, ఆలయంలో ఉన్నప్పుడు పవిత్రంగా వుంటే చాలు అనుకునే మనస్తత్వం ఆమెది. ఇల్లాంటి పాత్రలు కేవలం పాత సినీమాల్లోనే చూసి ఎరుగును మోహన్.అందుకే అతనికి ఆమె అంటే చాలా గౌరవం, కొంచెం భయం కూడా. తప్పుచేస్తున్నవాడు సత్యపీఠమెక్కడానికి ఎలా భయపడతాడో, అతను ఆమె దగ్గర అలా భయపడతాడు. కానీ తను బైటపడటంలేదని అనుకుంటూ ఉంటాడు. ఆమెకి విషయం ఏవన్నా చూచాయగానన్నా తెలిసిందేమోనని అప్పుడప్పుడూ పరీక్షిస్తూ ఉంటాడు, పొంతనలేని ప్రశ్నలడిగి. ఆవిడ ఎప్పుడూ బయటపడదు. అందుకే ఆమె అతనికి అర్థం కాలేదు. ఆమె, భర్త కోరినది ఇస్తుంది, అతను కోరితే. లేకపోతే లేదు. అది అతనికి నచ్చదు. అతనో భావుకుడు, పిపాసి. అతనికి సృజనాత్మకత కావాలి, కొత్తదనం కావాలి. అమెకి తెల్లని పూలంటే ఇష్టం. అతనికి ఇంద్రధనుస్సంటే ప్రాణం. అందుకే అతనికి కావలసినది బహుశా గోపిక దగ్గర దొరుకుతుందేమోనని అపుడప్పుడూ వెడుతూంటాడు.
“సార్.”
చేతన్‌పిలుపుతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చాడు మోహన్. ఏమిటన్నట్టు చూసాడు.
“ఇంకో అరగంటలో కాన్ఫరెన్సు కాల్‌ఉంది. ఈలోపులో మీరు ఈ ప్రెజెంటేషను రివ్యూ చేస్తే, మన టీమ్‌పని పూర్తి అవుతుంది సార్”
“ఓ.కే. లెట్‌మీ సీ…” అంటూ పేపర్లు అందుకున్నాడు.
“గోపీ పీన పయోధర మర్దన..”
అబ్బా, ఏవిటిది? పొద్దున్నించీ ఇదే పాట వేళ్ళాడుతోంది బుర్రలో. ఏవిటో. ఒక్కోరోజు అంతే. మొన్నటికి మొన్న ఇంకేదో పాట “కూడ బలుక్కుని కన్నారమ్మో నీయమ్మా, నాయమ్మా నా అత్త నీయమ్మో, నీ అత్త నాయమ్మో” అంటూ. ఇంట్లో అదే పాట, కారులో అదేపాట. ఆఖరికి లిఫ్టులో కూడా అదేపాట. పెదాలమీదకొచ్చేసింది అనుకోకుండా. అంతే, ఆ బిజినెస్‌ఎనలిష్టు లిడియా చూసిన చూపు ఇంకా గుర్తుంది. ఛీ ఛీ…ఏవిటో.
“గోపీ పీన పయోధర మర్దన…”
అబ్బా…జయదేవుడు గారూ. మీరు కాస్త ఊరుకుంటే, నేను ఈ పేపర్లు చూసుకుంటాను. “గోపీ…” .ఇంక వళ్ళు మండి పేపర్లు మొక్కుబడిగా తిరగేసి అవతల గిరాటెట్టాడు.
“గోపీ..”
ఆ వాక్యం గురించే ఆలోచన. నిజంగా ఎంతల్లా రాసేశాడు జయదేవుడు? సంస్కృతంలో రాసాడు కాబట్టి సరిపోయింది, అదే తెలుగులో రాసుంటే, మోతెత్తిపోయేదేమో. అది అమలిన శృంగారమని చెప్పేవారు సుబ్బారాయుడు మేష్టారు. నిజమే, అసలు శృంగారం ఎప్పుడూ అమలినమే. మనం చూసే దృష్టిని బట్టి, మన ఆలోచనని బట్టి అది మలినమైపోతూ ఉంటుంది. మంచి పాట వినడం, విందు భోజనం చెయ్యడం ఎలా తప్పుకాదో, అలాగే శృంగారాన్ని ఆనందించం, అనుభవించడం కూడా తప్పు కాదు.
అది ఈ సమాజం ఒప్పుకోదు. దాని కట్టుబాట్లు దానికున్నాయి.
అతని అవసరాలు అతనికున్నాయి.
అన్యమనస్కంగానే కాన్ఫరెన్సు కానిచ్చేసాడు. కిటికీలోంచి బయటకి చూస్తూ. బైట కనపడే సినీమా హాల్లో ఏదో ఇంగ్లీష్‌సినిమాలాగుంది. పోస్టర్లో కనిపించే యువతి మతి పోగొట్టేట్టుగా వుంది. అతనికి పదే పదే ఆ పాటే గుర్తొస్తోంది. ఆ యువతిలో అతనికి గోపిక కనబడింది. వెంటనే కోరిక పుట్టింది. ఎలాగూ భార్యా, పిల్లాడూ ఊరెళ్ళారు. సాయంత్రం ఓ సారి గోపిక దగ్గరికెళితే? అంతే, వెంటనే మిగితా పనులన్నీ పూర్తిచేసేసాడు. గోపికకి ఫోను చేసాడు. ఏడింటికల్లా రమ్మంది. తరవాత సమయం ఎలా గడిచిపోయిందో అతనికే తెలియదు. ఆరవుతూ ఉండగా కారు తీసి బయల్దేరాడు. ట్రాఫిక్కులో ఈదుకుని ఆమె అపార్టుమెంటుకి చేరేసరికి సరిగ్గా ఏడు. తలుపు తెరిచే ఉంది. లోపలికెళ్ళాడు. గోపిక రాత్రి భోజనం సిద్ధం చేస్తోంది. ఆమెని అలా వంటింట్లో గృహిణిగా చూస్తూంటే, పట్టరాని సంతోషం వేసింది.అరుకాసురుడు లాంటి అతని కోరిక అతణ్ణి మింగేసింది. పంటగడిలోకెళ్ళాల్సిన పావు, పామ్మింగేసి ఏ పదో గళ్ళోనో పడిపోయింది. అంతే, అమాంతం వెళ్ళి గోపికని చుట్టేసాడు. ఆతరవాత ఏమయ్యిందో అతనికి తెలియదు. ఏదో తుఫానులో కొట్టుకుపోతున్నట్టు లీలగా గుర్తుంది అతనికి. వాన వెలిసిపోయింది. అతనికేమీ గుర్తులేదు. ఆమెకి అంతా తెలుసు. అతను కళ్ళువిప్పి చూస్తే పక్కనే ఉంది గోపిక. అతని మనసులో ఇప్పుడా పాట లేదు. ఆ సినీమా యువతీ లేదు. గోపిక కూడా లేదు. ఆమె నవ్వుతోంది. “ఇప్పుడేమనిపిస్తోంది?” కొంటెగా అడిగింది. “నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, ఇంకా ఇక్కడ ఎందుకున్నానా అనిపిస్తోంది. నీ డబ్బు నీకు పారేసి, పారిపోవాలనిపిస్తోంది.” ఏ జంకూ లేకుండా నిజం చెప్పేసాడు మోహన్.
“నాకు తెలుసు, కానీ పూర్తిగా వెళిపోగలరా, మళ్ళీ, ఏ రెండ్రోజులకో, వారానికో రావాలనిపిస్తుంది. వస్తారు. మళ్ళీ ఇదే వ్యవహారం. పునరపి జననం, పునరపి మరణం, కదూ?”.
“అవును, ఎంత కాదన్నా నీలో ఒక శక్తి ఉంది, నాలో ఒక బలహీనత ఉంది. నా భార్యలో లేనిదేదో నీలో ఉంది. అందుకే వస్తున్నాను, పోతున్నాను, దారి తెలియక ఇలా తిరుగుతున్నాను.”
“దారులు మనకు కనిపిస్తాయి, గమ్యాలు మాత్రం కనబడవు. ఏగమ్యానికి వెళ్ళాలో ముందే నిర్ణయించుకోవాలి. మనం ఎంచుకున్న గమ్యాన్నిబట్టే దారులు నిర్దేశింపబడతాయి.”
“నా గమ్యం మంచిది కాదా?”
“అసలు మీ గమ్యమేవిటో మీకు తెలుసా?”
“…”
“మాటలతో విసిగిస్తున్నానా?”
“లేదు, నాకిలా మాట్లాడేవాళ్ళేకావాలి. నాకు నిశ్శబ్దమంటే పడదు. ఒంటరితనమంటే అంతకన్నా పడదు. జీవితంలో ప్రతీ క్షణం అనుభవించాలి, ఆనందించాలి, నేను నమ్మేవి రెండే రెండు, పుట్టుక, చావు అంతే. ఈ రెండిటి మధ్యలోనే జీవితం. ఎవరో అన్నట్టు స్వర్గం, నరకం, పునర్జన్మ..వీటిలో నాకు నమ్మకం లేదు.”
“అమ్మో, మన సంభాషణ ఎక్కడికో వెళిపోతోంది కదా..”
“అవునూ నిన్నొకటడుగుతాను చెప్పు, ఇందాకా నాకు నిన్ను చూస్తే అసహ్యం ఎందుకు వేసింది?”
“ఒడ్డు చేరేదాకా ఓడ మల్లన్న, ఒడ్డు చేరాకా బోడి మల్లన్న, సామెత వినలేదా?”
“..అంటే?”
“అంటే, అవసరం తీరేవరకే నేను అప్సరసలా కనిపిస్తాను. తీరిన వెంటనే ఆడ దెయ్యంలా కనిపిస్తాను, అదీ..సహజం.”
” నేను ఏ ఆనందాన్ని పొందాలని వస్తానో, అది దొరికీ దొరకకుండా మాయమౌతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. నువ్వు చెప్పు, నాకేమిటి కావాలి, నా గమ్యమేవిటి?”
“తరవాత చెబుతాను గానీ, ముందు స్నానం చేసి రండి, హాయిగా భోజనం చేద్దాం, మీకోసం బిరియానీ చేసాను”
” నువ్వు నాకోసం ఇవన్నీ ఎందుకు చేస్తూంటావు, అందరిలాగా నా దగ్గరకూడా డబ్బు తీసుకుని తోలెయ్యచ్చుకదా?”
“తెలియదు, మీలో ఒక మొద్దబ్బాయి వున్నాడు, బహుశా నాలో ఒక అమ్మ వుందేమో, ఆ అమ్మకి వాడంటే చాలా ఇష్టం, అందుకేనేమో..”
“అర్థంకాలేదు..” అన్నాడు మోహన్‌అమాయకంగా..
“మరేం పర్లేదు గానీ..వెళ్ళి స్నానంచేసి రండి” అంది అతన్ని ముక్కు పట్టి లేపుతూ.
భోజనాలయ్యాయి.
“పోనీ ఇవాల్టికి ఇక్కడే ఉండిపోకూడదూ?” అడిగింది అతన్ని.
“నీకే నష్టం, అలోచించుకో..”
“ఆ నష్టం నాకిష్టమైతే, ఉంటారా?”
“ఇక్కడ వద్దు, ఎక్కడికైనా పోదాం, హాయిగా, మళ్ళీ రేప్పొద్దున్న నుంచీ గాడిద బతుకు మామూలేగా”
“సరే అయితే, ఐదు నిముషాల్లో రెడీ అయివస్తానుండండి” అంటూ లోపలికెళ్ళింది.
ఎవరికో ఫోను చేసింది. అలంకరించుకుని బయటికొచ్చింది. ఇప్పుడు అతన్నీ అమెనీ చూస్తే, భార్యాభర్తలంటే నమ్ముతారు.
“పదండి” అంది చెయ్యి పట్టుకుంటూ.
“గమ్యం తెలుసా?”
“ఇక్కడికి దూరంగా, ఒక ఫాం హౌస్‌కి”
“లోపలికెలా వెళ్తాం ?”
“ఇవిగో తాళాలు…” అంటూ ఒక తాళం గుత్తి చూపించింది.
“ఏవిటి పెద్ద పార్టీనా?” అడిగాడు కొంచెం అసూయగా.
“అవును, మినిస్టరుగారబ్బాయి, నాకు బర్త్‌డే గిఫ్టు”.
“ఏవిటీ, అచ్చంగానే?”
“కాదు, ఎప్పుడైనా వాడుకోడానికి”.
“బావుంది, సర్లే, నువ్వే డ్రైవ్‌చెయ్యి, నేనో చిన్న కునుకు తీస్తా అంటూ వెనక్కి వాలాడు సీట్లో.
కళ్ళు తెరిచేసరికి ఒక నిర్మానుష్యమైన రోడ్డు అక్కడోటి, అక్కడోటి గుడ్డి లైట్లు. కారు ఒకచోట కుడి వైపుకి తిరిగి ఆగింది. ఎదురుగా పేద్ద గేటు. వాచ్‌మెన్‌తో ఏదో చెప్పింది, గేటు తెరుచుకుంది.
లోపల కిలోమీటరు పొడవు రోడ్డు. అటు చివర పేద్ద పొలం. మధ్యలో సన్నపాటి కాలిదారులు. దానికి అవతల ఒక ఫాం హౌసు.
“దిగండి మొద్దబ్బాయిగారూ” అంది గోపిక.
ఇద్దరూ దిగారు. కారు అక్కడే పార్క్‌చేసి, నడవడం మొదలెట్టారు. చుట్టూ పంట చెక్కలు, కాలిదారిలో అక్కడక్కడా దీపాలు. పైన నిండు చందమామ. చల్లని వెన్నెల. ఇద్దరూ ఫాం హౌసు చేరారు. లోపలికెళ్ళి సోఫాలో కూర్చునారు.
అతను తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఇప్పుడతనిలో కోరిక లేదు. కానీ ఎందుకో ఆమె బావుందనిపించింది.
“ఈ డ్రెస్సులు వద్దు, చీర కట్టుకుని రావా, ప్లీజ్ “అన్నాడు అమాయకంగా.
ఆమె చీర కట్టుకుని వచ్చింది.
“పదండి అలా వెన్నెల్లో నడుద్దాం” అంది. ఇద్దరూ బయటికొచ్చారు, చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. ఒక పక్కగా చిన్న కొలను కనపడింది.
“ఇలా రండి, ఈ గట్టు మీద కూర్చుందాం” అంది. ఆమె కూర్చుంది, అతను కూర్చుని ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ
“నువ్వెవరు?” అడిగాడు.
“నేను మోహన్‌ని” అంది గోపిక.
“అబ్బా, అది కాదు, నాకు నీగురించి చెప్పు, తెలుసుకోవాలని ఉంది”.
“నేను బోలెడు కలలుగన్న ఓ ఆడపిల్లని. ఇంజనీరింగు చదివేదాన్ని తెలుసా?”
“మరి ఇలా ఎప్పుడయ్యావు?”
“బహుశా ఎనిమిదేళ్ళయిందనుకుంటా. నాకు సినిమాలో హీరోయిన్‌అవ్వాలని వుండేది తెలుసా? నేను బాగా పాడతాను కూడా. నాకు అవకాశమిస్తానని, హీరోయిన్ని చేస్తానని ఒకతను చెబితే, ఇంకేమీ అలోచించకుండా ఇక్కడికి వచ్చేసాను.”
“..అలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడమే?”
“అతను మా ఎమ్‌ఎల్‌యే గారి కొడుకు. మంచివాడే. ప్రేమించానన్నాడు.అతనితో వచ్చేస్తే నాకు కావలసింది ఇప్పిస్తానన్నాడు. నేను నా మాట నిలబెట్టుకున్నాను.”
“..అతను మోసంచేసాడు, అంతేనా?”
“లేదు. అతను నన్ను పెళ్ళి చేసుకున్నాడు. హైదరాబాదులో కాపురం కూడా పెట్టాము. కానీ పాత కక్షలతో, అతన్ని ఎవరో చంపేసారు. ఒకరోజు బైటకెళ్ళి తిరిగి రాలేదు” ఆగింది మౌనంగా ఎటో చూస్తూ.
“మరి వాళ్ళ వాళ్ళు?” అడి గాడు మోహన్
“వాళ్ళని చంపాకే..అతన్ని చంపేసారు, శతృ శేషం లేకుండా”.
“మరి మీ వాళ్ళు?”.
ఒక్క సారి మౌనంగా ఉండిపోయింది గోపిక. తరవాత చెప్పింది.
“ఒక సారి గడప దాటాకా, వాళ్ళకి నేను లేను, నాకు వాళ్ళు లేరు.”
“…”
“బాధగా ఉందా మోహన్?”
“అవును”.
“…”
“సరే, తరవాత ఏమయ్యింది?”
“ఏముంది, బతకడం నేర్చుకున్నాను. ఆడదాన్ని కాబట్టి, నానుంచి మగవాడు ఏమి ఆశిస్తాడో నాకు తెలుసు. అది వాడికిచ్చాను, నాక్కావలసింది తీసుకున్నాను.”
“మరి నీకు మీ ఆయన గుర్తు రాడా?”
“గుర్తొచ్చినా అతను తిరిగి రాడుగా? నేను అతని దగ్గరకి ధైర్యంచేసి వెళ్ళలేనుగా?”
” కష్టాలొచ్చిన ఆడవాళ్ళందరూ నీలాగే లేరుగా, నువ్వు వేరే పనేదైనా వెతుక్కొని ఉండచ్చుగా?”
“ఏవిటీ? సినిమాల్లో చూపిస్తారే, కుట్టుపని, చిప్స్‌అమ్మడం ఇలాంటివా? అవి చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి. తీరా చేసినా, అక్కడ కూడా ఇదే సమస్య. ఒంటరిగా ఉన్న ఆడది అందరికీ కావాలి.
ఇంతమందితో వేగడం కన్నా, నేను ఎన్నుకున్న దారే సరైనదని నాకనిపించింది అప్పుడు. మోహన్., చిన్నప్పటినించీ నా దృష్టిలో నేనో యువరాణిని.అలాగే పెంచారు మా నాన్న. అడగకముందే అన్నీ తెచ్చి ఇచ్చేవారు. ఆయనలాంటి తండ్రి మరొకళ్ళు ఉండరేమో. అయినా కూడా నేను విదుల్చుకు వచ్చేసాను, చూసారా, కోరిక ఎంత బలమైనదో, ఎంత దుర్మార్గ మైనదో..?”
“అప్పుడు నీ గమ్యమేవిటి?”
“నాకు తెలియదు, మీలాగే, బాగున్న దారివెంట పరుగులెత్తాను, ఇంకా పరిగెడుతూనే ఉన్నాను”.
“గమ్యమంటే గుర్తొచ్చింది, నా గమ్యమేవిటో చెబుతానన్నావుగా, చెప్పు” అన్నాడు మోహన్ .
“ఓ..మొద్దబ్బాయ్ గారూ.. మీ గమ్యం ఆనందానుభవం. దానికోసం అక్కడా, ఇక్కడా పరిగెడుతున్నారు, కానీ ఆనందం మీ ఇంట్లోనే ఉంది తెలుసా?”
“ఏవి ఆనందంలే. నేను వెళ్ళేసరికి అన్నం రెడీ. తినేసరికి పిల్లాడ్ని పడుకోబెట్టి, తను వస్తుంది. నేను దగ్గరకు తీసుకుంటే సరి, లేదు, వెళ్ళి పడుకుంటుంది, ఇంక అక్కడ ఆనందం ఎలా ఉంటుంది చెప్పు?”
“మీ ఆవిడకిష్టమైన రంగేవిటి?”
“ఏమో..తెలుపో నలుపో, గుర్తులేదు, అయినా ఎందుకిప్పుడు? ”
“తనకి నచ్చిన పాటేమిటి? ”
“….”
“మీ ఆవిడ ఏ హాస్పిటల్లో పని చేస్తుంది?”
“సెంట్‌జోసఫ్ ”
“మీ ఆవిడకి నచ్చిన చీర ఏది?”
“….”
“మీ ఆవిడ ఏ కూర బాగా చేస్తుంది?”
“….”
“మీ ఆవిడ ఏ డ్రెస్సులో చాలా బావుంటుంది?”
“నీలం పట్టు చీరలో”
“ఒక్కసారి ఊహించుకోండి, ఆ పట్టుచీరలో మీ ఆవిణ్ణి. ఎలావుంది? నా కన్నా, మీరు చూసిన ఎంతోమంది అందమైన ఆడవాళ్ళకన్నా అందంగా ఉందా? లేదా?”
(మెల్లిగా..) “ఉంది. కాని…”
“నన్ను చెప్పనీండి మోహన్.పెళ్ళైన ఇన్నేళ్ళలో మీరెప్పుడైనా ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం చేసారా? బహుశా లేదేమో. మీరామెకి భర్త. ఆమె మీకు భార్య. అంతే.. అంతకుమించి ఎవరూ ఎవరికీ ఏమీ కారు. ఇద్దరు అపరిచితుల్లా బతికేస్తున్నారు.
ఆనందం అనేది మన మనసులో ఉంటుంది మోహన్. ఒక మనిషిని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు, వారిని వారికున్న లోపాలతో సహా స్వీకరించగలిగినప్పుడు, వారిమీద ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ భార్యాభర్తల మధ్య జీవితకాలం నిలబడే స్నేహానికి దారితీస్తుంది, అది శాశ్వత ఆనందాన్నిస్తుంది, ఆదే మీ గమ్యం. ఈ శృంగారం, కిందా మీదా పడడం, ఇవన్నీ పై పై మెరుగులే.”
“…”
“నేను మీకిచ్చే ఆనందం ఎలాంటిదో తెలుసా? అదిగో ఆ మిణుగురు పురుగును చూడండి. మెరుస్తుంది, ఆరిపోతుంది. అల్లాంటిదన్నమాట. మెరిస్తే ఆనందం. ఆరిపోతే అసహ్యం. అందుకే మీరు నన్ను ఇందాకా అసహ్యించుకున్నది.”
“నీకు నేనంటే ఇష్టమా?”
“చాలా. ఒక మొద్దబ్బాయంటే ఎవరికి ఇష్టం ఉండదు? మీరు చాలా మంచివారు. మీ మనసు బంగారం” అతని నుదురు ముద్దు పెట్టుకుంది.
“నువ్వు ఎంత మంచిదానివో…” అంటూ అతను ఆమె చేతిని ముద్దుపెట్టుకుంటూ.
“అవును, కానీ, దేవుడే చెడ్డవాడు, మనని వెంట్రుకవాసి పక్కదోవలో పడేసాడు” అంది నవ్వుతూ. అతనూ నవ్వాడు.
“అన్నీ తెలిసీ, నువ్వు ఎందుకిలా ఉన్నావు?” అడిగాడు.
“బతకాలిగా మరి” అంది ప్రశాంతమైన చిరునవ్వుతో చుక్కల్లోకి చూస్తూ.
తెల్లారింది. ఆతను ఆమెకి డబ్బులిచ్చి, దింపి ఇంటికొచ్చేసాడు. సాయంత్రం భార్యా, పిల్లాడు వచ్చేసారు. రాత్రైంది. ఎప్పటిలాగే పిల్లాణ్ణి పడుకోబెట్టి భార్య వచ్చింది.
” నీకు ఏ అష్టపదంటే చాలా ఇష్టం? ” అడిగాడు మోహన్ ,ఆమెను దగ్గరికి తీసుకుంటూ.
ఆమె అర్థం చేసుకుంది. ముందు నవ్వింది.తరవాత చెప్పింది.
వాళ్ళలా ఎంతసేపు మాట్టాడుకున్నారో తెలియదు, పడుక్కునే సరికి ఏ మూడో, నాలుగో అయ్యింది.
అతను వెతుకుతున్న ఆనందం అతనికి దొరికింది.
అతను ఇప్పుడు కూడా గోపిక దగ్గరికి వెడతాడు అప్పుడప్పుడూ, కానీ ఒక అవసరం తీర్చుకోడానికి మాత్రం కాదు, ఒక నేస్తాన్ని కలవడానికి. వీలున్నప్పుడల్లా అతనితో దీప కూడా వెడుతోంది.

రచయిత శ్రీనివాస ఫణి కుమార్ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ... పూర్తిగా »
Shiva అభిప్రాయం:
March 4, 2007 11:08 am
చాలా బాగున్నది
Kishore అభిప్రాయం:
March 5, 2007 1:15 am
భాగుంది. ఇంతకీ ఈ కథకి “ఇద్దరు దుర్మార్గులు” అనే పేరు ఎందుకు పెట్టారు?
PhaNi DokkA అభిప్రాయం:
March 5, 2007 8:41 am
కిశోరు గారూ,
నమస్కారం. కథపై మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. మీ ప్రశ్నకు సమాధానం ఇదిగో:
దుర్మార్గులు = చెడు మార్గమును పట్టినవారు.
సమాజం దృష్టిలో మోహను, గోపిక అటువంటివారే కదా. అందుకనే ఆ పేరు పెట్టాను.
వ్యక్తిగత బలహీనతలున్నా, చెడు మార్గంలో ప్రయాణిస్తున్నా, నా దృష్టిలో వారు చెడ్డవారు మాత్రం కారు. వారిద్దరి మనసు మంచిది. ఈ కథలో అది చెబుదామనే ప్రయత్నించాను.
ధన్యవాదాలతో,
మీ ఫణి డొక్కా.
ప్రసాదం అభిప్రాయం:
March 5, 2007 9:42 pm
చాల మంచి కథ, బాగా రాసారు. అభినందనలు
ప్రసాద్ అభిప్రాయం:
March 6, 2007 9:46 am
కథ చాలా బాగుంది. సంభాషణలు ఎక్కడా దారి తప్పకుండా బాగున్నాయి.
“గోపీ పీన పయోధర” అన్నప్పుడు నాకు నవీన్ “అంపశయ్య” గుర్తుకు వచ్చింది. అందులో కథానాయకుడికి ఇది ఇలాగే మరిన్ని బూతులు మళ్ళి మళ్ళీ మెదడులోకి వచ్చి విసుక్కుంటాడు.
ప్రసాద్
http://blog.charasala.com
ravikiran timmireddy అభిప్రాయం:
March 8, 2007 8:08 am
కథ వ్రాసిన తీరు బాగుంది. కానీ కథలో వుండాల్సిన భావావేశం పూర్తిగా లుప్థమైపోయింది. గోపిక శరత్ గారి రాజ్యలక్శ్మినో, చంద్రముఖినో కొంచం అరువుతెచ్చుకున్నా, కనీసం వొక పాత్రగా, ఇష్టం, కష్టం, ప్రేమ మొదలైన వుద్వేగాలున్నటువంటి పాత్రగా, మనిషిగా కనిపిస్తుంది. కానీ మొహన్కవేవీ వున్నట్టు అనిపించదు. భార్యంటే గౌరవం, కించిత్ భయం, తప్ప ఎక్కడా ప్రేమ కనిపించదు. గోపిక పట్ల, ఆపుకోలేని నరాల వొత్తిడి తప్ప ఏ మాత్రం ప్రేమ కనిపించదు. గోపిక చెప్పిన నాలుగు మాటలతో మారిపోయిన మోహన్ పాత్ర, చాలా అసహజంగా, చాలా షాలో గా వుంది.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
PhaNi DokkA అభిప్రాయం:
March 8, 2007 11:28 am
రవికిరణ్ గారూ,
నమస్కారం. నా కథపై మీ అభిప్రాయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు.
లక్షణమైన నా తెలుగు పాత్ర “గోపిక” ఉండగా, ఏ బెంగాలీ పాత్రనో అరువు తెచ్చుకోవడానికి నాకు మనస్కరించదు. పైగా, మీరు చెప్పిన శరత్ గారి రాజ్యలక్ష్మి ఎవరో నాకు తెలియదు కూడాను.
సంఘదృష్టితో చూస్తే మోహన్ దుర్మార్గుడిలా అనిపిస్తాడు. కానీ అతనిలోనూ ఆత్మ పరిశీలన వున్నది, మంచీ చెడులని వేరుగా చూడగల విచక్షణ ఉన్నది, అంతర్మధనం వున్నది. కథ దానితోనే మొదలయ్యిందిగా.
సాధారణంగా, మనకేదైనా విషయం అర్థం కాకపోయినా, దాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నించకపోయినా, ఆ విషయంపై మనకు ద్వేషమూ, వ్యతిరేకతా కలుగుతాయంటారు. మోహన్ కి దీప అర్థం కాలేదు. అతను తెలుసుకోవాలనీ ప్రయత్నించలేదు. అయినా అతనికి ఆమె అంటే గౌరవం, కాస్త భయం ఉన్నాయి, ద్వేషం లేదు.
ఇన్ని బాగుపడే లక్షణాలున్నా, “ఆడదాని చూడ అర్థంబు చూడ..” అన్న చందాన, అతని బలహీనత అతనికుంది.
చెప్పే విధంగా చెబితే, బుర్రకెక్కడానికి నాలుగు మాటలు చాలు. గోపిక ఆ పనే చేసింది, రవ్వంత సమయం, సందర్భం చూసుకుని.
ఏదో నాకు తోచింది చెప్పాను, మిమ్మల్ని ఎల్లాగోల్లా ఒప్పించేసే ఉద్దేశ్యంతో మాత్రం కాదు…ఏదో నా తుత్తి కోసం.
మీ అభిప్రాయాలని గౌరవిస్తూ,
ఫణి డొక్కా.
Kamesh Challa అభిప్రాయం:
March 9, 2007 3:55 pm
Phani garu,
This story is quite different from what we’re used to from your “pen”. This show how diverse you would think and can write. The way you joined the two parallel lives is worth the thought. Keep up the good work!!. Really nice job!!. And keep writing … ;-)
Good luck.
Cheers,
–Kamesh
JUBV PRASAD అభిప్రాయం:
March 9, 2007 6:19 pm
ఈ కధ రాసిన రచయితని గానీ, దాన్ని ఇష్టపడ్డ పాఠకులని గానీ నొప్పించకుండా అభిప్రాయం రాయాలని నా తాపత్రయం. ఈ ప్రయత్నంలో సఫలీకృతుణ్ణి కాలేకపోతే, మన్నించమని రచయితకీ, ఇష్టపడ్డ పాఠకులకీ మనవి. ఈ అభిప్రాయంలో వున్న వ్యంగ్యం, వెటకారం ఈ కధలోని పాత్రలకి మాత్రమే అని గమనించండి.
ఈ కధలో మూడు పాత్రలున్నాయి. ఒక “వేశ్య”, ఒక “విటుడు”, ఒక “గృహిణి”. “విటుడు” రసికత కోసమో, మరో “అనిర్వచనీయమైన ఆనందం” కోసమో (నిజానికి ఇటువంటి అనిర్వచనీయాలు ఏవీ వుండవు. పరాయి ఆడవాళ్ళ దగ్గర మగాళ్ళకి దొరికే ఆనందమే ఇది. దీనికి ఎంత భావుకత వున్న పేర్లు పెట్టుకున్నా, అసలు విషయం ఇదే! ఇది మగవారిని “గర్వ” పడేట్టు చేసే విషయమే!) “వేశ్య” దగ్గరకి వెళుతూ వుంటాడు. ఎటొచ్చీ తను తప్పు చేస్తున్నాడని మాత్రం తెగ ఒప్పేసుకుంటూ, ఆ విధంగా తెగ ఆలోచించేస్తూ, ఒక్కో రాత్రికీ ఐదు వేలు ఖర్చు పెడుతూ, కాసింత గిల్టీ కాన్షస్‌తో “పెద్దమనిషి”లా చలామణీ అయిపోతూ వుంటాడు. అలా ఒకరోజు ఆ “వేశ్య” దగ్గరకి వెళితే, ఆవిడ తన “వుదాత్తత”తో “మీరు మీ భార్య గురించి తెలుసుకోండీ” అని “నాలుగు మంచి మాటలు” చెప్తుంది. ఈ మనిషి ఇంటికి పోయి (అడ్డమైన తిరుగుళ్ళూ తిరిగి, తిండి కోసం ఇంటికి చేరిన పక్షి, కనీసం స్నానం అయినా చేసి చచ్చాడో, లేదో, పాడు!), “నీకు ఏ అష్ట పదంటే చాలా ఇష్టం” అని అడిగి, ఇంకా ఏవేవో మాట్టేడేసి, (అన్నీ ఒక్క రాత్రిలోనే) “అనిర్వచనీయ మైన ఆనందా”న్ని పొందేస్తాడు. ఇదే “అనిర్వచనీయమైన ఆనందం” అంతకు ముందు ఆ “వేశ్య” దగ్గర ఒక్క మాట కూడా మాట్టాడకుండా పొందుతాడు. అప్పటి నించీ ఆ “వేశ్య” దగ్గరకి భార్యాభర్తలిద్దరూ కలిసి వెళుతూ వుంటారు స్నేహంగా!
ఈ కధలో ముఖ్యంగా వళ్ళు మండించే పాత్ర “గృహిణి”. ఈవిడ పేరు దీప. ఈవిడ డాక్టరంట కూడా. ప్రేమ వివాహం కాదు కాబట్టి, శ్రోత్రియ కుటుంబం నించే వచ్చిందనుకోవాలి. ఈవిడకి వెన్నెముక అనేదే వుండదు. డాక్టరెలా అయిందో “పైవాడి”కే తెలియాలి. పతివ్రతల కోవలో పుట్టిన మనిషి ఈవిడ. శిధిలాలలో తప్ప మామూలుగా దొరకరు ఇలాంటివాళ్ళు. అయినా ఇలాంటి వాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరిగే మగాళ్ళ పాలిట దేవతలు లెండి. భర్త “వ్యభిచారం” గురించి తెలిసినా సరే, “ఇంట్లో వ్యభిచారం చెయ్యకపోతే చాలు” అనుకుంటుంది. అటువంటి కొంప, ఒక గుడి లాంటిదిట ఈవిడకి. ఎంత సిగ్గుమాలిన పాత్రో ఇది. బొత్తిగా సినిమాలా, టీవీలా, పుస్తకాలా జ్ఞానం ఏవీ వున్నట్టు లేదు అసలు. అదన్నా కాస్త ఏడిస్తే, భర్తల “వ్యభిచారానికి” భార్యలు కనీసం ఎలా ఎదురు తిరుగుతారో, ఎలా బాధ పడతారో తెలిసేది. “భర్త కోరినది” ఇచ్చేస్తూ వుంటుంది. ఇలాంటి పనికిమాలిన మనిషి, భర్త “వేశ్యని” ఇంటికి తెచ్చుకుంటే ఏం చేస్తుందో! ఏమీ లేదు, వంటలు చేసి, వాళ్ళకి సరఫరా చేస్తూ వుంటుంది ఈ డాక్టరు. అదేగా మరి “భర్త కోరేది” అప్పుడు. డాక్టరు చదువులూ, ఇంజినీరింగు చదువులూ జీవితంలో ఎందుకూ పనికి రావు అనే నగ్న సత్యాన్ని ఈ కధ చక్కగా చూపిస్తుంది. భర్త “వ్యభిచారం” మానేశాక, ఈ సిగ్గులేని మనిషి ఆ “వేశ్య”తో స్నేహానికి భర్తతో కలిసి వెళుతూ వుంటుంది.
జీవితంలో ఇలాంటి పాత్రలూ, పరిస్థితులూ ఆడవాళ్ళకే వుంటాయి. వాళ్ళంటే నోర్మూసుకు పడుంటారు, డాక్టర్లయినా సరే. డాక్టర్ దీపగారే బయట వేరే మగాడితో “అనిర్వచనీయమైన ఆనందాన్ని” పొందుతూ వుండి, ఆ తరువాత ఆ బయట మగాడి “మంచి మాటల” వల్ల తిరిగి భర్తని, “ఎల్లారీశ్వరి పాటల్లో నీకే పాటంటే ఇష్టం” అని అడిగి, అతన్ని దగ్గరకు తీసుకుంటే, ఆ భర్త ఇలాగే భరించి, ఆ బయట మగాడితో స్నేహం చేస్తాడా? స్త్రీల గౌరవం గురించి మాట్టాడే వాళ్ళు, ఇలాంటి పాత్రల గురించి చదివి, ఎలా భరిస్తారో నాకు అర్థం కాదు.
ఇంక “వేశ్య” పాత్ర గురించి. ఈ అమ్మాయి పేరు గోపిక. చాలా వుదాత్తమైన “వేశ్య”. ఇంజనీరింగు చదివే అమ్మాయిని, ఒక ఎమ్మెల్లే కొడుకు ప్రేమించి, సినిమాల్లో హీరోయిన్ చేస్తానని చెప్పి, వేరే వూరు తీసుకు వచ్చి, పెళ్ళి చేసుకుని కాపురం పెడతాడు. పెళ్ళయిపోతే హీరోయిన్ ఎలా అవుతుందో ఈ రోజుల్లో! ఏదో ఒకటి లెండి. ఏవో పాత కక్షల కొద్దీ ఎవరో ఆ అబ్బాయిని చంపేస్తారు. ఇక ఇంజనీరింగు చదువు వెలగ బెట్టిన ఈ గోపిక, కుట్టు పనీ, చిప్స్ అమ్మడం లాంటి పనుల కన్నా “వ్యభిచారం” గొప్పదని తేల్చేసుకుంటుంది. ఒక్కసారికి ఐదు వేలంట. వేరే గతి లేక గానీ, పురుష దౌర్జన్యాలతో గానీ, వేరే దౌర్భాగ్యుల వల్ల గానీ, “వ్యభిచారం” లోకి దిగిన స్త్రీలు ఎన్నో అవస్థలు పడుతూ వుంటారు. ఇంకేదన్నా గతి దొరికితే అటువంటి మురికి లోంచీ బయటకి వచ్చేద్దామని చూస్తూ వుంటారు. ఇంజినీరింగు చదువుతున్న గోపికకి తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇదొక్క మార్గమే కనబడుతుంది మరి. “వళ్ళు బలిసి, డబ్బాశ కొద్దీ ఆ చెత్త పని మొదలెట్టిందంటారే” గానీ, “తప్పని పరిస్థితుల్లో కాదు”. ఒక్కసారికి ఐదువేలు సంపాదించే ఈ పాత్రకి బోలెడంత వుదాత్తత. వంట కూడా తనే చేసేస్తూ వుంటుంది “విటులకి” పెట్టడానికి. సంఘ భయం, బ్రోకర్ల భయం, పోలీసుల భయం, గట్రా బొత్తిగా లేవు ఈ పాత్రకి. ఇలాంటి పాత్రని చూస్తే ఎంత చీదర పుడుతుందో! చివర్లో “విటుడికి” నాలుగు “మంచి మాటలు” చెప్పేసి, అతని భార్యతో అతన్ని కలిపేస్తుందీవిడ. తర్వాత, వాళ్ళ స్నేహితురాలయి కూర్చుంటుందీవిడ. డ్రామా విషయంలో సినిమాని దాటి ఎక్కడికో వెళ్ళి పోయిందీ విషయం.
ఆఖరుగా “విటుడి” పాత్ర చూద్దాం. ఇష్టమైన అష్టపది గురించీ, అలాంటివే ఇంకేవో ప్రశ్నలడిగేసి, తన “అనిర్వచనీయమైన ఆనందాన్ని” ఇంట్లోనే పొందచ్చని తెలియక, బోలెడన్ని “ఐదువేలు” తగలేసుకుంటాడు. అలా అని ఆ “వేశ్య”ని ఏమన్నా గౌరవిస్తాడా? అదీ లేదు వీడికి. ఐదు వేలు తీసుకుంటుందని మొదటి నించీ ఏడుపే. ఆ తరువాత తన అవసరం తీరాక “అసహ్యం” వేస్తుంది వీడికి. మరి ప్రేమ లేని చోట ఇంకేం వేస్తుంది అవసరం తీరగానే? అసలా “అసహ్యం” తన మీద తనకే వెయ్యాలి. “నీ భార్య కూడా నీలాగే వ్యభిచారం చేస్తే వూరుకుంటావా?” అని ఎవరైనా వీడిని మొహం మీదే అడగాలి. ఒక వెధవ పని చేస్తూ, అది చేస్తున్నానని ఒప్పుకుంటే అది వుదాత్తంగా అయిపోతుందా? చేసే పని తప్పు అని తెలియని వాళ్ళని ఏమన్నా కాస్త క్షమించవచ్చేమో గానీ, ఇలాటి అతి తెలివి గల మనుషులనా? ఇలాంటి మనుషులకి కొన్నాళ్ళకి తమ “అనిర్వచనీయమైన ఆనందం” భార్యల దగ్గర దొరకడం మానేస్తుంది. అప్పుడు మళ్ళీ కధ మొదలు. అప్పుడు ఈ నాలుగు “మంచిమాటలు” కూడా బొత్తిగా పని చేయవు.
ఈ చెత్త పాత్రలు స్త్రీల గౌరవాన్నీ, సమాజంలో వున్న నిజమైన వుదాత్తతనీ పరిహసిస్తూ వుంటాయి.
కాబట్టి, భార్యల దగ్గర “అనిర్వచనీయమైన ఆనందం” దొరకని మగవాళ్ళూ, మీరేం చెయ్యాలీ? వెంటనే “వేశ్యల” దగ్గరకి పరిగెత్తండి. మీరెళ్ళకపోతే, మీ కష్టాలు తీరవు మరి. మీ భార్యలు ఏమీ అనుకోరు లెండి. మీరు వెళ్ళే ఆ “వుదాత్తమ ఆడవాళ్ళి” మీకు నాలుగు “మంచి మాటలు” “చెప్పే విధం”గా చెప్తారని మీ భార్యలకి తెలుసు లెండి. చివర్లో మీరంతా ఇంచక్కా స్నేహితులయిపోవచ్చు కూడా!
ఇలాంటి నెగిటివ్ కధల్లో ఆడవాళ్ళని అవమానించి, పురుష పెత్తనాన్ని పదిలం చేసే విషయాలు తప్ప, మంచి విషయం ఒక్కటుండదు!!
“ఇద్దరు దుర్మార్గులు” అని బడాయిగా పాత్రల్ని చెడ్డవాళ్ళు అని ఒప్పేసుకోవడం వల్ల, అవి మంచి పాత్రలయిపోవు. ప్రతీ మనిషీ ఏదో ఒకటి ఆలోచిస్తూనే వుంటాడు. అంత మాత్రాన అది “అంతర్మధనం” అయిపోదు. నాలుగు నిజాలు ఒప్పేసుకుని, చేసే చెత్త పనులు చేస్తూనే వుంటే, అది విచక్షణ వున్నట్టూ కాదు.
ప్రసాద్
kiran అభిప్రాయం:
March 14, 2007 12:25 pm
కధ కన్నా ప్రసాద్ గారి విశ్లేషన నాకు బాగా నచ్చింది. కథ లోని ప్రతి పాత్రయొక్క నిజస్వరూపాన్ని కల్లకు కట్టినట్లు వివరించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
కిరణ్.
Kameswara Rao అభిప్రాయం:
March 15, 2007 8:55 am
ప్రసాద్ గారూ,
చలం మీ అభిమాన రచయితా?:-)
ఈ కథలో ఉన్న పాత్రలని ఒక మూసలోకి (మంచి పాత్రలు, చెడ్డ పాత్రలుగా) తెచ్చే ప్రయత్నం కథలో కన్నా మీ విమర్శలోనే ఎక్కువగా కనబడుతోంది. శృంగార జీవితంలో యాంత్రికత చోటుచేసుకుని, అది తొలగించుకోవడం చాత కాక తిప్పలు పడే పాత్ర మోహన్ ది. ఆ పాత్రకి అంతకంటే లేబుల్సు తగిలించడం సబబు కాదు. కథ ఈ పాత్ర చుట్టూనే తిరిగింది. ఈ పాత్రకి ఉదాత్తత ఆపాదించే ప్రయత్నం నాకెక్కడా కనపడలేదు.
జీవితంలో తప్పుదోవ పట్టి, అది వదలడం చాత కాక దానితో రాజీ పడిపోయిన పాత్ర గోపికది. ఈ పాత్రకీ ఉదాత్తత ఆపాదించే ప్రయత్నం కథలో నాకు కనపడలేదు. అలా తప్పుదోవలో నడుస్తున్న మనిషికి మంచి ఆలోచనలు కానీ, తెలివి కానీ ఉండదనుకోవడం ఆ పాత్రని ఒక మూసలో పొయ్యడమే.
ఇక మోహన్ భార్య పాత్ర. నిజమే, ఈ పాత్రకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కనిపించదు. స్త్రీ వాదులకి చాలా అభ్యంతరకరమైన పాత్రే! ఐతే కథలో ప్రతి పాత్రకీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండి తీరాలంటారా? ఒక సామాన్య వ్యక్తికి కథలో పాత్ర అయ్యే పాత్రత లేదంటారా? మరొక విషయం. కథ మొత్తం మోహన్ దృక్పథం నుండే చెప్పబడింది, నేరుగా అతని ద్వారా కాకపోయినా. కాబట్టి అతని భార్య పాత్రకి అంత కంటే ప్రాముఖ్యం కథలో ఇవ్వాల్సిన అవసరం లేదు.
గోపిక నాలుగు మాటలు చెప్పేసరికి మోహన్ లో మర్పు వచ్చేయడం కొంత dramaticగా ఉన్నది వాస్తవమే. ఐతే అలా జరగడానికి అవకాశం బొత్తిగా లేకపోలేదు. దానికి కొంత వాతావరణం కథలో చూడవచ్చు.
సారాంశమేమిటంటే, కథ నాకు నచ్చింది.
ఐతే చివర్లో “ఆమె అర్థం చేసుకుంది. ముందు నవ్వింది.తరవాత చెప్పింది.” అన్న మాటలు అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉంది. ఆమె ఏం అర్థం చేసుకుంది, ఎందుకు నవ్వింది అన్నది పాఠకుని ఊహకు వదలి వెయ్యడం గాలిలో దీపం పెట్టి పాఠకుడా కాపాడూ అనడంలా ఉంది! మోహన్ దీపలకి మధ్యకొంత సంభాషణ పెట్టి, దాని ద్వారా దీప పాత్ర వ్యక్తిత్వాన్నీ, మోహన్ ఆలోచనలో పరివర్తననీ చూపెట్టి ఉంటే మరింత నిండుగా ఉండేదేమో.
Anil Ivaturi అభిప్రాయం:
March 22, 2007 12:46 pm
kiran గారి అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను.
*********
కధ కన్నా ప్రసాద్ గారి విశ్లేషన నాకు బాగా నచ్చింది. కథ లోని ప్రతి పాత్రయొక్క నిజస్వరూపాన్ని కల్లకు కట్టినట్లు వివరించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
కిరణ్.
*******
NaChaKi అభిప్రాయం:
March 26, 2007 1:01 pm
ఫణి డొక్కా గారి కలం నుంచి నిజంగానే expect చెయ్యని కథ నాకు కూడా! జె.యు.బి.వి. గారి అభిప్రాయంతో సహా అన్ని అభిప్రాయాలు చదివాక నాకు ఇప్పటికీ కథ కథగా నచ్చింది. నేనేదో విమర్శకుడిని కాను కానీ నాకు తోచింది చెబుతాను: కథావిశ్లేషణ చేస్తున్నప్పుడు ఆ పాత్రలు విశ్లేషణాపరిధిలోకో, విశ్లేషకుల దృక్పథంలోకో వచ్చేట్టు చూడటం సరియైన పద్ధతి కాదేమోనని నా అభిప్రాయం. మరి చెయ్యవలసిందేమిటి అంటే కథావిశ్లేషణాపరిధిని ఆయా పాత్రల చుట్టూ గీసుకోవటం! పాత్రలు ముందు పుట్టాయి విశ్లేషణ కన్నా. అలాంటప్పుడు గాల్లో ఎక్కడో నిలబడి భూమి మీద విషయాన్ని గురించి పుంఖానుపుంఖాలుగా వ్రాసే లోపుగా అసలు విశ్లేషిస్తున్న కథావస్తువునైనా పరిధిలోకి తీసుకోవాలా వద్దా? కథలోని ఒక్కో పాత్రలో నిలబడి చూస్తే ఎవరికి వారు తమ పరిధులను దాటకుండా “ఉదాత్తంగా” అయినా కాకున్నా హుందాగానే ప్రవర్తించారు.
కథలోని మూడు పాత్రలకూ బలహీనతలున్నాయి. భర్తని నిలదీయలేని, దూరం చేసుకోలేని బలహీనత దీప పాత్రది. దీపతో వివాహబంధానికి ద్రోహం చేస్తున్నా, గోపికను వదులుకోలేక తన గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతూ, అయినా జన్మతః వచ్చిన సంస్కారం వల్లనో మరొక కారణం వల్లనో ఇద్దరినీ గౌరవిస్తూనే సాగే పాత్ర మోహన్. మరొకరిని నమ్మి కుటుంబాన్ని వదిలి కోల్పోయిన దాని కోసం వెనక్కి వెళ్ళే ధైర్యం లేక, ప్రపంచాన్ని ఎదిరించి ఒక్కర్తీ గౌరవంగా బ్రతికే ధైర్యమూ లేక తోచిన పద్ధతిలో బ్రతుకుతూ మింగలేక కక్కలేక బతికే పాత్ర గోపిక. అందరివీ “సామాన్యమైన” పాత్రలే, బలహీనమైన బ్రతుకులే.
చిన్న సామ్యం తోచింది ఇది వ్రాస్తోంటే: చీకటిలో దీపతో కలసి నడుస్తూ ఒక దిగుడు బావిలో పడ్డాడు మోహన్. పై నుంచి చూస్తున్నా, భర్త బావిలో ఉన్నాడని గ్రహించినా ఏమీ చెయ్యలేని పాత్ర దీపది. పైకొచ్చే ప్రయత్నం చెయ్యకుండా ఎందుకు, ఎలా పడ్డాడో ఆలోచిస్తూ ఉన్న పాత్ర మోహన్‌ది. అప్పటికే అదే దిగుడు బావిలో పడి పైకి ఎలా వెళ్ళాలో తెలిసినా బావిలోనే “బ్రతుకు” ఏర్పరచుకుని రాజీ పడిన పాత్ర గోపికది. ఇలా చూస్తే ఆయా పాత్రల limitations అర్థమవుతాయి, ఆ limitations వల్ల తమని తాము నిందించుకున్నా నిందించకున్నా పక్క వాళ్ళని నిందించకుండా తమ సమస్యలకి తామే కారణం అనే realization కనిపిస్తుంది ఈ పాత్రల్లో. ఏమంటారు?
డొక్కా ఫణి గారికి అభినందనపూర్వక ధన్యవాదముతో,
నచకి
rajasankar kasinadhuni అభిప్రాయం:
March 27, 2007 6:36 pm
“మాటలతో విసిగిస్తున్నానా?” ఇది రచయత పాఠకులని అడగవలసిన ప్రశ్న. కథావస్తువు చప్పగా ఉండడం వలన కావచ్చు, కథనంలో అసలు పట్టు లేదనిపించింది. చదువరులను ఆకట్టుకోలేని సగటు కథల లాగా ఈ కథని కూడా installments లో చదవాల్సి వచ్చింది.
PhaNi DokkA అభిప్రాయం:
March 28, 2007 4:16 am
కామేశ్వరరావుగారూ,
కథపై మీ అభిప్రాయమూ, విశ్లేషణ బావున్నాయి, ధన్యవాదాలు. నా కథని మనసు పెట్టి చదివినందుకు కృతజ్ఞతలు.
చిన్న వివరణ:
“ఆమె అర్థం చేసుకుంది, ముందు నవ్వింది, తరవాత చెప్పింది”:
ఎప్పుడూ తనతో ముచ్చట్లాడని భర్త, తన ఇష్టాయిష్టాలగురించి మొదటిసారి అడిగాడు, ఆ రాత్రి. అలా ఎందుకు చేసాడో ఆమె అర్థం చేసుకుంది. ఇక మీదట తమ సంసారం ఒక గాడిలో పడబోతోందికదా అని మనస్ఫూర్తిగా నవ్వింది. అటుపైన చెప్పింది.
ఈ విషయాన్ని మరికొన్ని సంభాషణలద్వారా చెబితే, మరీ అరవ హాస్యంలా ఉంటుందేమోననిపించి, చెప్పలేదు.
కథలో దీప పాత్ర ఎప్పుడూ నేపధ్యంలోనే సాగుతుంది, తంబూరా శృతిలాగ. శృతిలేనిదే పాట లేదు, దీప పాత్ర లేనిదే ఈ కథా లేదు. ఆ పాత్రకున్న “సటిలిటీ” ని కథ ముగింపు వరకూ కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే చివరిలో అలా ముగించేసాను.
కృతజ్ఞతలతో,
మీ ఫణి డొక్కా.
PhaNi DokkA అభిప్రాయం:
March 28, 2007 4:26 am
నచకి గారూ,
కథపై మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన సామ్యం బావుంది, కథలోని పాత్రల స్వభావాన్ని కొంతవరకు ఆవిష్కరించింది.
ధన్యవాదాలతో,
మీ ఫణి డొక్కా.
కొత్తపాళీ అభిప్రాయం:
March 28, 2007 12:43 pm
నచకీ గారి సామ్యానికి సవరింపు:
అప్పటికే బావిలో పడి ఉండి ఆ బావిలో ఉన్న మురుగు నీళ్ళని ఒకటోరకం ఫ్రెంచి మద్యంలాగా తీర్థమిస్తున్నది గోపిక.
అది ఒకటో తరగతి ఫ్రెంచి మద్యమే అని నమ్మేసి బావిలోకి దూకి తీర్థం పుచ్చుకుంటున్నవాడు మోహన్.
మొగుడు పుచ్చుకుంటున్న తీర్థంలో తన భాగం రావటం ఎలాగా అని బావిలోకి దిగటానికి తాడుకోసం వెతుకుతున్నది దీప.
rajasankar kasinadhuni అభిప్రాయం:
March 28, 2007 1:48 pm
కొత్తపాళీగారి సవరణ చదివి నవ్వకుండా ఉండలేకపోయాను. మంచి కథలను కాకపోయినా మంచి వ్యాఖ్యలను ఆకర్షించే కథలను వ్రాసినందుకైనా రచయతలను అభినందించాలి.
NaChaKi అభిప్రాయం:
March 30, 2007 9:04 pm
పుఱ్ఱెకొక్క బుద్ధి పుడమిన్ సుమతీ! :-)
శ్రీనివాస్ అభిప్రాయం:
July 27, 2007 5:51 am
తెలుగు కథ అనగానే నాకు చదవాలంటే భయం. ఎందుకంటే, ఎంతసేపు బరువయిన పాత్రలు, సంభాషణలు పలికిద్దామనే తాపత్రయమే తప్ప, అసలు ఈ కథని ఒక సామన్యుడు (నేననుకునే సామాన్యుడికి తెలుగు బాగ చదవటం, వ్రాయటం మరియు అర్థం చేసుకోవటం మాత్రమే వచ్చు సుమండీ, వాడికి తెలుగులో ఎమ్మేలు, పీహెచ్డీలు ఉండవు) చదువుతాడా లేదా అన్న ఆలోచనలు కనపడవు.
క్షమించాలి, దయచేసి కథా రచయితలు కథ, వస్తువు, కథనం, విశ్లేషణ, భావుకత లాంటి బరువయిన పదాల ఊబి లోంచి బయట పడ్డట్టయితే, సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు చదవగలుగుతారు.
నేను కథ లోతు పాతులకు వెళ్ళ దలచుకోలేదు. ఎంచేతంటే, ఈ కథ పైన ఉదహరించిన వాటికి అతీతమేమీ కాదు. బహుశ రచయిత కూడా అదే ఊబిలో కొట్టుకుపోతున్నాడేమో అనిపిస్తోంది.
ఈ సామాన్యుడి అభిప్రాయం తప్పనిపిస్తే, దులిపేసుకోండి. విషయముందనిపిస్తే, గ్రహించగలరు!
–వికటకవి
Ramam అభిప్రాయం:
April 3, 2008 10:06 am
Routine story, but not expected from Phani…విశ్లేషణలు బావున్నై.
అసంఖ్య ధవళ అభిప్రాయం:
July 21, 2008 12:27 am
@వికట కవి గారూ: ఈ ఒక్క ప్రతిస్పందనలో మాత్రం మీరు చెప్పిన తీరు ఎలావుంది అంటే, న్యాయమూర్తి వాదన వినకుండ తీర్పుని ఇచ్చినట్టుగా ఉంది!
నచ్చకాపోతే దులిపేసుకోండీ అనడం ఇంకా విడ్డూరంగా వుంది. మీరు చెసిన వ్యాఖ్య “సగటు కధలని” దృష్టిలో పెట్టుకుని చేసినది అయినా, కధ చదవకుండ ఈ రచయిత ని అదే గాటకి కట్టడం ఎంతరకు సమంజసం?
@ప్రసాద్ గారూ: అన్నీ కధలూ నీతిని బోధించాలి అనిగాని ఏమైనా వుందా, లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా. పాత్రల స్వరూప స్వభవాలని విశ్లేషించడం, పాఠకునిగా మన భాద్యత కావచ్చుగాని, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడం మన హక్కుమాత్రం కాదు…
ఇటువంటి కధని ఎంచుకున్నందుకు రచయిత ధైర్యన్ని మెచ్చుకుంటూన్నాను. (వి)విమర్శలు చేసిన రచనా “దురంధురల” (దుస్)సాహసాన్ని కూడా!!!
-అసంఖ్య ధవళ
జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
July 23, 2008 10:47 am
అసంఖ్య ధవళ గారూ,
ఈ కధ చదివాక, “రచయిత ధైర్యాన్ని మెచ్చుకోవడానికీ”, “విమర్శలు చేసిన రచనా దురంధురల (దుస్) సాహసాన్ని ప్రస్తావించడానికీ” మీకెంత ‘హక్కు’ వుందో, అంతే ‘హక్కు’, ఈ కధ నచ్చని వారికి, “ఈ పాత్రలు ఉపయోగపడవు, ఈ కధ నిరర్ధకం” అని తీర్మానించడానికి వుంటుంది.
ప్రతీ కధా ఒక నీతిని బోధించాలి అని ఎవరూ అనరు. అయితే రచయిత ఆ కధని చెప్పేటప్పుడు, దాని లోని విషయాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏకీభవించడమో, విమర్శించడమో చేస్తాడు. వార్తా విలేఖరి మాత్రమే ఒక విషయంలోని సత్యాసత్యాల్ని ఒక వార్తలాగా చెప్పి వూరుకుంటాడు. రచయితలు సమాజం లోని విషయాలనే తమ రచనల్లోనూ ప్రతిబింబిస్తారు. దాన్ని బట్టీ పాఠకులు తమ చైతన్యానికి అనుగుణంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారు.
“పాఠకులకు బాధ్యతలే వుంటాయీ, హక్కులు వుండవూ” అని మీరు అనడం నిజంగా సాహసమే. ఈ అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తాను. ఒక రకంగా చూస్తే, పాఠకుడికి రచనకి సంబంధించి ఒక బాధ్యత అంటగట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఒక రచనకి సంబంధించి, పరిమితుల్లో, తన చైతన్యానికి అనుగుణంగా, స్పందించే హక్కు ఒక పాఠకుడికి ఎప్పుడూ వుంటుంది. విమర్శ సహేతుకంగా వుంటే, ఇతర పాఠకులు కూడా అంగీకరించొచ్చు, లేదా విభేదించొచ్చు. లేకపోతే రెండు మాటల్లో, “నచ్చలేదూ, ఈ కధ అనవసరం” అంటూ, తన అభిప్రాయం చెప్పుకోవచ్చు. రచయిత తన రచనని పబ్లిక్ లో పెట్టినప్పుడు, ఇటువంటి విమర్శలకి సిద్ధపడి వుండాలి. అభిప్రాయాలని సెన్సార్ చెయ్యడానికి ఈమాట వారు ఎప్పుడూ వున్నారు.
ఆఖరుగా చెప్పొచ్చేదేమంటే, పరిమితుల్లో, ఒక పాఠకుడికి ఒక కధ ఎంత వరకూ పనికి వస్తుందీ అని చెప్పే హక్కు వుంటుంది అని. రచయితలు రాసేదే పాఠకుల కోసం కనుక.
ఇంకో విషయం. మీరు, “లేక కధలోని ప్రతీ పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడానికి ఒక “పెద బాలశిక్ష” ఏమైనా వుందా” అని అడిగారు.
కధలోని పాత్రలు వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకోవడం ఏమిటీ? అవి కధలో పాత్రలు కదా? కధ చదివే వాళ్ళు ఆ పని చేస్తారు. రచన చేసేటప్పుడు రచయిత కూడా ఆ పని చేస్తాడు. తాను సరి అనుకున్నదే తన పాత్రల చేత చెప్పిస్తాడు విమర్శ లేకుండా. పాఠకులు కూడా తాము సరి అనుకున్నవాటితో ఏకీభవిస్తారు. లేదా విమర్శిస్తారు. వారికి ఆ హక్కు లేదనే హక్కు మీకు లేదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒక పాఠకులే కదా?
- ప్రసాద్