రాఫెల్ ( Raffle )
ఆ ఆలోచనల్లో ఉండగా, కారు ఆమెను ఇంటికి చేర్చింది. కారు బైట డ్రైవ్ వేలో వదిలేసి, వెంటనే బాత్రూం లోకి పోయి , షవర్ తీసుకుంది. అప్పుడు కూడా అక్కడికి అద్దంలోంచి కనిపించే , ఇండోర్ గార్డెన్ లో గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ఊదా రంగు పూలను, వాటిమీద వాలి ఉన్న తుమ్మెదలను చూడటం మరువలేదు.
” క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా, భ్రమరమ్ములు ఘుమలు ఘుమలుగా, ఝుంఝుమ్మని పాడగా, …మనసు పరిమళించెనే, ఆహా..”
ఎవరీ మధుర కవి! పొయెట్రీ రాసే వాళ్ళు, చదివే వాళ్ళు అదృష్టవంతులు. కాని పొయెట్రీని జీవించేవాళ్ళు కదా అసలు భాగ్యవంతులు!
ఒంటికీ, ముఖానికి, పరిమళపు లోషన్లు పూసుకుంటూ, ఎలాటి బట్టలు ధరించటం అని ఆలోచించుకుంది. చూసింది గదా, అంతకు ముందే ఆ లోపలికి వెడుతున్న వాళ్ళు ఎక్కువగా ఎలాటి దుస్తులు వేసుకున్నారో.
నలుపు, నలుపు. అవును నలుపు బాగుంటుంది. రీగల్. ఫార్మల్. ఐనా ఇవ్వాళ నేను నలుపు వేసుకోను. ఇవ్వాళ తేడాగా ఉందాం అనుకుని తెలుపు, వెండి రంగులు మిళాయించిన చేతులు లేని సిల్క్ బ్లౌస్, సిల్క్ పేంట్స్ వేసుకుంది. ఎలాంటి ఆభరణాలు? ఒక్కటే వజ్రం ఉన్న పోగులు. వంద వజ్రాలున్న మ్యుల్లర్ వాచ్. ఒక్కటే రవ్వల గాజు కుడిచేతికి. మెడలో - ఏం వద్దు.
సిల్క్ బ్లౌస్ పైగా, చక్కగా టేన్ అయిన గుండెల మీద అందమైన నల్లని పుట్టు మచ్చ మెరిసింది. ఎందుకు మెడలో నగలు?
జుట్టు ఉంగరాలు ఉంగరాలు తిరిగి పోయిందా రోజెందుకో. నలుపు, తెలుపుల మిశ్రమం. ధరించిన వెండి దుస్తులకూ తలలోని వెండి చమక్కులకూ చక్కగా తగిపోయింది. కాళ్ళకు మెరిసే వెండి రంగు ఆరంగుళాల హీల్స్ .
భుజాలపైన మెత్తగా, మెరుస్తూ జారే మేచింగ్ సిల్క్ కోట్ వేసుకుని -మళ్ళీ కార్లో ఆర్ట్ సెంటర్ కి వెళ్ళింది. అప్పటికి చీకటి పడిపోయింది. ఫిఫ్త్ యావెన్యూ పొడుగూతా పామ్ ట్రీస్ చిన్ని చిన్ని మినుకు మినుకు దీపాలతో అలంకరించబడిఉన్నాయి.
తారా మండలమే భూమ్మీదికి దిగివచ్చినట్లు మెరిసి పోతున్నది. ప్రజలు సంతోషంగా బైట చిన్న బల్లల చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ, పానీయాలు తాగుతున్నారు. కొంతమంది ఫౌంటెన్ల చుట్టూ, కేనొపీల కిందా, పచార్లు కొడుతున్నారు.
వాన్ లీబిగ్ ఆర్ట్ సెంటర్ ఆ రాత్రి మణిహారంలో పతకంలో పెట్టిన పెద్ద ఎమరాల్డ్ వలె ఉంది.
కౌంటర్ దగ్గిర మనుషులు ఎక్కువమంది లేరిప్పుడు. ఫంక్షన్ మొదలయి పోయింది. మాటలు నవ్వులు వినిపిస్తున్నాయ్ ఎగ్జిబిషన్ రూం లోంచి.
లోనికి వెడుతుంటే అక్కడ కొందరు “వచ్చారు! రండి, రండి. వెనక్కి వచ్చారు, ఎంతో సంతోషం, లోనికి వెళ్ళండి. నేం టేగ్. ఏమీ అక్కర్లేదు వెళ్ళి ఆర్ట్ చూడండి” అన్నారు. లోన అందరూ గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. మధ్యలో వేదిక మీద ఒక పియానో, డ్రమ్స్, సేక్స ఫోన్ వాయిద్యాలు, సంగీత కారులు. అక్కడే మైక్ పట్టుకుని ఒక అమ్మాయి పెయింటింగ్ ఆక్షన్ జరుగుపుతున్నది .
మూడు వేలు, మూడు వేల వంద , మూడు వేల రెండొందలు - అక్కడ ఉంది వేలంపాట.
నిసికి భయం పుట్టింది. అయ్యబాబోయ్ తను సరిగ్గా వినలెదా? రాఫెల్ అన్నారు. ఇప్పుడు ఆక్షన్ జరుగుతుందేం. అవంటే నిసికి చాలా భయం. పొరపాటున ఏ చెయ్యో, జుట్టు సర్దుకోటానికి ఎత్తితే , తను మూడువేల మూడొందలు అని పాడిందనుకుని ఆ బొమ్మ తనను కొనమంటే చాలా గొడవై పోతుంది.
టికెట్ ఖరీదే చాలా ఉంది. ఇప్పుడు ఇంకా ఆక్షన్ కూడానా. పక్కనే ఉన్న ఒక వన్నెలాడిని అడిగితే - ఈ ఒక్క చిత్రం మాత్రమే వేలాం. ఇదొక్కటే. దీని అసలు విలువ పదివేల డాలర్ల దాకా ఉంటుందని చెప్పారు.
ఎవరు ఎక్కువ బేరం ఇస్తే వాళ్ళకు. ఆ తర్వాత మళ్ళీ రేఫెల్ సాగుతుంది. ఇంతకు ముందు కొన్ని ఆర్ట్ వర్క్ లాటరీ అయిపోయింది. కొంత మంది అదృష్టవంతులు చిత్రాలు గెలుచుకు పోయారు.
నిసి కొంచెం జనం లోంచి దారులు చేసుకుని వెడుతూ, గోడలు కొన్ని చోట్ల ఖాళీగా ఉండటం గమనించింది. కొంతమంది ఇంకా గదిలో చుట్టూ తిరుగుతూ, తమ పేరు పిలిస్తే తామైతే ఏ బొమ్మ తీసుకుంటారో అని ఆలోచించుకుంటున్నారు. పక్క వాళ్ళతో చిన్న చర్చలు చేస్తూ వినోదిస్తున్నారు.
నిసి బల్ల దగ్గరకు వెళ్ళి రెడ్ వైన్ తెచ్చుకుంది. బల్ల వెనక బార్టెండర్ ఉన్నా, అక్కడ ఒక ఆర్గనైజర్ ప్రత్యేకంగా వైన్ గ్లాసు అందిస్తూ, గబుక్కున ఆమెను గుర్తించి,
“ఓ మై గాడ్! ఎంత మార్పు. ఎంత అందంగా ఉన్నారు!” అన్నాడు చిరునవ్వులొలుకుతూ.
“అవునవును. ప్రెట్టీ ఉమన్ సినిమా లో జూలియా రాబర్ట్స్ లాగా మారిపోలా నేను ఒక గంటలో !” అంది ఉడికిస్తూ నిసి.
“మరే. మరే. అంతకన్నా తక్కువ ఏమాత్రం కాదు. బ్యూటిఫుల్ . బ్యూటిఫుల్” అన్నాడతను.
“ఓ మై గాడ్ . షి ఈస్ బేక్” అని ఉత్తేజంతో అరిచారు ఆమెను చూసిన కుర్ర పిల్లా, ఆమె స్నేహితుడూ.
నిసి నవ్వుకుంది. అమెరికాలో తెలుగు వనిత ఒక ఎక్సాటిక్ బర్డ్. ఈ చిత్రాల్లో చిలకలూ, సీతాకోక చిలకల్లాగానే. ఆంధ్రా పోతే ఒక్కరు మన దిక్కు చూడరు. ఇక్కడ తెలుగు అందం ప్రత్యేకంగా కనపడుతుంది.
మంచిదేగా! మనకేం నష్టం. అనుకుంది.
టికెట్ అమ్మిన అమ్మాయి, స్నేహితుడు ఆమెను ప్రశంసాపూర్వకంగా చూశాడు. అది నిసి గమనించింది. ఆ కుర్రవాడొక్కడే అక్కడ చాలా సాదాగ వచ్చింది. గళ్ళ ఆకు పచ్చని చొక్కా పొడుగ్గా కిందికి వేళ్ళాడుతోంది. మామూలుగా వేసుకునే నీలపు జీన్స్. పక్కన అమ్మాయి చక్కని సూట్లో, ఇతడు మామూలు దుస్తుల్లో. ఐతేనేం ఇద్దరూ ఎంతో ముచ్చటగా ఉన్నారు. చాలా అందమైన ముఖాలు. మర్యాద ఉట్టిపడుతోంది ఇద్దరి దగ్గరా.
ఎక్జిబిషన్ హాల్లో లోపలికి చూస్తే అక్కడి వారు అందుకు పూర్తిగా వ్యతిరేకం. అందరూ డాలర్, డాలర్, డాలర్ అని బోర్డులు మెడలో వేలాడేసినట్లే ఉన్నారు. వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళంతా పోర్ట్ రాయల్ కుబేరులు. డబ్బు రాసులు కలవారు. గుండ్రటి బల్లల వద్ద కూర్చుని విలాసంగా తాగుతూ, పక్కనే వాళ్ళకు తెలిసిన వాళ్ళతో మాత్రమే అప్పుడప్పుడు మాట్లాడుతూ, ఊరికే ఒక కన్ను చిత్రాల మీదా, ఒక చెవి మధ్య మధ్య వినిపించే పియానో, సాక్సఫోన్ సంగీతమ్మీదా పడేశారు. కొంతమంది మాత్రం, అబ్బో! అర్ట్ మీద వాళ్ళకున్న ప్రేమను, ఏది మంచి కళ, ఏది చవక బారు, ఎలా తేల్చి చెప్పగలరో అది వాళ్ళకు పుట్టుకతో వచ్చిన విద్యలా ప్రక్క వాళ్ళతో డంబాలు కొడుతున్నారు.
మామూలు ప్రకారమే అక్కడ నిసికి ఒక్కరు కూడా తెలియదు. ఆమెకు ఎక్కడకు వెళ్ళినా ఎవరూ తెలియరు. ఆమెకు ప్రపంచంలో తెలిసినవాళ్ళు చాలా తక్కువ. డాక్టరు పని మానేసాక ఆ సంఖ్య ఇంకా చిన్నదై పోయింది. ఐనా ఆమెకు ఒంటరితనం లేదు. తెలిసిన ముఖాలైతేనే సుఖం, లేకపోతే గిలగిల లాడిపోటం ఆమెకు లేదు. ఎవరు పక్కన ఉంటే, వాళ్ళతో మాట్లాడటం వాళ్ళనించి ఏదో కోంత నేర్చుకోటం, వినోదించడం ఆమెకు అలవాటు .
గోడల మీద మిగిలిన బొమ్మలను వరసగా చూస్తూఉంది . ఒక దాన్లో నీలపు కోతులు, ఇంకో దాన్లో పింక్ కుర్చీ, మూడు ఎర్ర పిట్టలు, సీ షెల్స్, బ్లూ హార్బర్, ఒక రాణి, గణేష, పసుపు రంగు పిట్టలు ఇలా - - బాగున్నాయ్ . బాగున్నాయ్, రంగుల మిశ్రమాలు. కొన్ని బొమ్మలు ఎక్సైటింగ్ గా ఉన్నయ్.
అంత ఖరీదయినవి కావు చిత్రాలు. ఖరీదు కడితే, ఏదీ 500 డాలర్లు దాటి ఉండదు. ఐనా పేరు పడిన ఆర్టిస్ట్ చిత్రానికి ఉండే విలువ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పోను పోనూ కొన్ని విపరీతంగా వెల పెరగవచ్చు. తన దగ్గర ఉన్న లిస్ట్ చూస్తూ, గోడల మీద ఉన్న బొమ్మలు చూస్తూ, తనైతే ఏది తీసుకుంటుందా అని ఆలోచిస్తూంది.
మళ్ళీ ఆమె దగ్గరికి ‘కుర్రపిల్లా, బోయ్ ఫ్రండ్’ వచ్చి పలకరించి పోయారు. ఆ పిల్ల చెప్పింది, తనైతే ఏ వాటర్ కలర్ తీసుకుంటుందో. దానికేసి చూసింది. ఏం గొప్పగా అనిపించలేదు. నిసి కీ మధ్య రంగుల మీద మోజు జాస్తి అయింది. ఆ బొమ్మ చాలా, సీదా సాదాగా ఉండి ఆమెను ఆకర్షించలేదు. ఐనా నిసికి తనకు ఎలాగూ గెలిచే యోగం లెదని తెలుసు.
ప్రతి రెండు నిమిషాలకూ, వేదిక మీద గుండ్రంగా తిరిగే జార్ ఆగినపుడల్లా అందులొంచి ఒక చీటీ తీసి ఒక పేరు చొప్పున చదివటం , తమ పేరు వచ్చిన వాళ్ళు ఆనందంగా అరుపులూ, కేకలూ, గోడ మీంచి ఒక చిత్రం తీసుకో్టం. చకచక సాగుతోంది. ఫొటో గ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నారు. ఫ్లాష్ లు మెరుస్తున్నయ్.
చూస్తుండగానే గోడల మీది అన్ని వాటర్ కలర్స్ ఐపోయాయి. 60 మందికి బొమ్మలు వచ్చాయ్. 180 మంది ఏ బొమ్మా లేకుండా వెనక్కి పోతారు. మెల్లిగా, అతిధులు ఒకళ్ళ కొకళ్ళు వీడ్కోలు ఇచ్చుకుంటూ హాలు ఖాళీ అవసాగింది.
ఆక్షనీర్ స్టేజ్ దిగివచ్చి తనకు కొంచెం భయం కలిగినట్లూ, అంతా సరిగ్గా చేశానా అని వాళ్ళ స్నేహితుల దగ్గరనుండి కనుక్కుంది. ఒక వ్యవహర్త వచ్చి అంతా బాగా జరిగిందని, భుజం తట్టి వెళ్ళాడు. చక్కగా సంగీతం మొదలయ్యింది. అప్పటికే ఎంతో సేపు అక్కడ గడిపినందున, ఎక్కువమంది వెళ్ళిపోతున్నారు.
నిసి - వెళ్ళనీ, వెళ్ళనీ, హాయిగా సంగీతం వినొచ్చు అనుకుని ఒక బల్ల దగ్గర బేండ్ కు ఎదురుగా కూర్చున్నది. వెయిటర్ వచ్చి వైన్ గ్లాస్ నింపిపోయాడు. పళ్ళెంలో ఛీస్ ముక్కలూ, ఎర్ర ద్రాక్షలూ. ఆమె కొంచెం సేపట్లోనే సంగీతంలో లీనమై పోయింది. ఆరోజు ఆమె రక్తం వేడిగా, వాడిగా ప్రవహిస్తున్నది. ఎందుకో ఆమె చాలా ఆనందంగా ఉంది. ఆ పియానో ధ్వనులు, ఆ డ్రమ్ముల లయలు, ఆ వాయిద్యాలు ఆమెకు ఎంతో హాయి కలిగించాయి. ఆ వెళ్ళే వాళ్ళను ఏమీ పట్టించుకోకుండా చేతితో బల్ల మీద తాళం వేస్తూ, కాళ్ళు లయగా , భూమి మీద టాప్ చేస్తూ, సంగీతం వింటూ ఆనందిస్తున్నదామె.
కొంచెంసేపటికి గదిలో ఎవ్వరూ లేరు. ఆమె. బేండ్ అంతే. నిసికి అదెంతో ఇష్టంగా ఉంది. అప్పుడు ఆమె తనకోసం ఒక సంగీత కచ్చేరీ జరుగుతున్నట్లుగా అనుకుంది. ఎవ్వరూ లేక పోతేనేం. సంగీతం వింటానికి వెరే మనుష్యుల తోడు ఎందుకు. అదుగో ఆర్టిస్టులు ఎదురుగా. ఇదిగో ఇక్కడ శ్రోత తాను.
వెళ్ళిపోనీ ఆ కుబేరులందరినీ, వాళ్ళు బైటికి వెళ్ళి, బైట టెర్రేస్ ల మీద నుంచుని వాళ్ళ రియల్ ఎస్టేట్ ఎంత పెరిగిందో, ఎంత తరిగిందో , స్టాక్ మార్కెట్టూ, ప్రపంచ వ్యవహారాలూ మాట్లాడుకుంటారు. వారికి ఈ సంగీతం ఎందుకు? తనకు ఆ గొడవెందుకు? ఇక్కడ ఎవ్వరూ లేరని వారితో తనెందుకు పోవడం.
అదిగో! చిత్రాలు చూశాను. సంతోషం. ఇప్పుడు సంగీతం సాగుతుంది. మహా భాగ్యం. ఆ ధ్వని తరంగాలు శ్రావ్యంగా మనసును తేల్చి వేస్తున్నాయ్. ఆమె పాదాలు, చెతులు, తల, వళ్ళు, లయగా కదులుతున్నాయ్. పక్క బల్ల మీద దరువు వేస్తున్నది. అప్పుడప్పుడు చప్పట్లు కొడుతోంది. మళ్ళీ పక్కనే ఆ అమ్మాయీ, ఆకుపచ్చ గళ్ళ చొక్కా కుర్రాడు వచ్చి నించున్నారు. కాసేపు ఆమె పక్కనే నించుని -బాగుంది కదా సంగీతం? అన్నారు.
అవును ఫ్రెండ్స్ ! అంది నిసి వాళ్ళతో. మళ్ళీ సంగీతం వినసాగింది. ఇంతలో ఆ అమ్మాయి తూనీగలా వెళ్ళి పోయింది. అబ్బాయి మాత్రం చనువుగా, నిసి పక్కనే నేల మీద మీగాళ్ళ మీద వంగి ఆమె కుర్చీ వెనకాల చెయ్యి వేసి కూర్చున్నాడు. కొంచెం సేపు ఉండి, నాతో డాన్స్ చేస్తారా? అన్నాడు నవ్వుతూ.
ఆశ్చర్యంగా చూసింది నిసి. అతని ముఖం పైకెత్తి ఉంది. ఎంత అందంగా ఉన్నాడు. చక్కని నవ్వు. కళకళ లాడిపోతున్నది ముఖం.
“నేనా! నీ గర్ల్ ఫ్రెండ్ తో చెయ్యవోయ్!” అంది.
“ఐ నో. ఐ విష్. మీరు చెయ్యండి నాతో డాన్స్ ” అన్నాడు. నిసికి కొంచెం అర్ధమయీ అవనట్లు అర్ధమయింది . అతని స్నేహితురాలు, ఆ పిల్ల -ఇక్కడ పని చేస్తున్నది ఈ సాయంత్రం. ఈ సందడి, ఈ సంగీతం ఇక్కడ తనలా డబ్బు కట్టిన అతిధుల కోసం. ఆమె నృత్యం చెయ్యటం ఆర్గనైజర్లకు నచ్చదు? అందుకా? ఐతే తననెందుకు అడగటం?
“నాకు డాన్స్ రాదు మిత్రమా” అంది నవ్వుతూ.
“నాకూ రాదు మేడం. ఐతే ఏం? దేనికైనా మొదటిసారి ఉందంటారుగా”
అసలు చెప్పాలంటే, నిసీ కాళ్ళు అప్పటికే, సిండెరెల్లా షూలో ఉన్నట్లున్నాయి. ఆ హాల్ ఒక్క సారిగా బాల్ రూమ్ ఐ పోయింది. నిజంగానే ప్రిన్స్ చార్మింగ్ వచ్చాడు. ఇదేమి వింత!
“సరే, సరే, ” అని లేచి నించుంది.
చక్కగా స్లో మ్యూజిక్. ఎదురుగా అందమైన చిన్నవాడు. ఆమెలో స్త్రీత్వం పొంగింది. ఆమె చందమామై పోయింది. తెలియకుండానే ఆమె అందంగా ఊగింది.
ఎంతో మర్యాదైన కుర్రాడు. చక్కని స్టెప్స్ వేస్తున్నాడు. నిజంగా ఇతనికి నాట్యం రాదా? అతని కాళ్ళ వంక చూస్తూ, అతని బూట్లు ఎలా కదులుతూ ఉంటే తనూ అలానే కదులుతూ నృత్యం చేసింది.
ఎవ్వరూ లేరు హాల్లో. సంగీతం. సంగీతకారులూ. తనూ, ఇతడు.
ఇతడెవ్వరు? ఏమో?
డాన్స్ చేస్తూ, కబుర్లు చెపుతున్నాడు. ఎక్కడ చదువుతున్నదీ . అతని స్నేహితురాలు ఎక్కడ చదివేదీ.
ఇతడెవరు? ఇతనితో తను ఈ నృత్యమేమిటి?
నిసి దుస్తులు, అందంగా మెరుస్తున్నాయి. ఆమె కాళ్ళకున్న సిల్వర్ హైహీల్స్ ధగధగ లాడిపోతున్నయి. ఆమె పాదాలకు, ఆ అందమైన హీల్సే ఎలా కదలాలో, అవే నేర్పిస్తున్నాయి.
రెడీ? అన్నాడు కుర్రాడు, చెయ్యి పైకి చాపుతూ. ఆ వదులుగా వేలాడే చొక్కా లోంచి, అతని వెడల్పు భుజాలు, సన్నని నడుము చక్కదనం ఆమెకు చక్కగా తెలిసింది.
“నో కిడ్డింగ్” అంది నిసీ. చక్కగా అతడి చెయ్యంది పుచ్చుకుని గిరగిరా తిరిగింది. వెన్నెల వలె నవ్వాడతను.
“డాన్స్ రాదన్నారు? మరి ” అన్నాడు.
అని నవ్వుతూ ఆఖరి సారుగ, మళ్ళీ ఆమెను గిరగిర తిప్పాడు. పాట ముగుస్తుందనగా, మెల్లిగా అడుగులు నెమ్మది చేస్తూ, ఆగిపోయారిద్దరూ.
చాల థేంక్స్! నాతో డాన్స్ చేసినందుకు - అని చెయ్యి పట్టుకుని మెత్తగా వత్తి, స్నేహంగా ఊపి నవ్వుతూ ఎలా వచ్చాడో అలాగే వెళ్ళి పోయాడప్పుడు ఆ అందగాడు.
ఆమె కొంచెం సేపు కూర్చుని, తన గుండె అదటు అణచుకుని, వైన్ సిప్ చేస్తూ, ఈ సారి సంగీతం ఆపినపుడు పియానో ప్లేయర్ కూ , ఇతర ఆర్టిస్ట్ లకూ, తనకు వారి వాయిద్యం ఎంత బాగా ఉందో చెప్పి, ధన్యవాదాలు తెలిపి, బైటికి నడిచింది. లాబీలో పలచగా జనం ఉన్నారు. ఆర్గనైజర్ ఒకతను పుస్తకాలు, లెక్కలు చూసుకుంటున్నాడు.
నిసి సాంతం బైటకి నడుద్దామనుకునేంతలో ఒక అతిధి, గబగబా వచ్చి, “నీతో మాట్లాడవచ్చా, మై డియర్ ? ” అంది.
ఆమె ఎవరో నిసికేం తెలుసు. ఆమె వాళ్ళ ఆయన్ను చాలా ఉత్సాహంతో పిలిచింది. ఆయనేం పట్టించుకోలేదు. వింతేముంది! చాలామంది భర్తల్లానే. అయినా, ఆమె పట్టు వదలకుండా నిసిని ఆయనకు పరిచయం చేసింది.
ఆయన ఏం మొహమాటం లేకుండా నిసిని, వాళ్ళావిడనీ ఇద్దరినీ ఇగ్నోర్ చేశాడు.
“మీరు ఇండియానుంచి వచ్చారా? అబ్బా, చాలా బాగుంది మీ నృత్యం. నే బైటి నుంచి చూస్తున్నా. ఎక్కడ నేర్చుకున్నారు?”
“ఎక్కడా లెదండీ. సంగీతం బాగుందీ, అబ్బాయి బాగున్నాడూ. అతనికి ఎదురుగా, ఊరికే అటూ ఇటూ కాస్త కదలటమేగా” అంది నిసి.
“ఇంకా నయం. భలేగా ఉంది. జస్ట్ గ్రేట్. ”
నిసి చాలా ఆశ్చర్యపోయింది. ఆమె కొద్దిగా తాగి ఉంది. తనూ అంతే. అప్పుడు అన్నీ అందంగానే ఉంటయ్ కదా! అని అనుకుంది.
ఆవతలి ఆమె జర్మన్ లాగ ఉంది. తన కార్డ్ తీసి ఇచ్చి , “తప్పకుండా మమ్మల్నెప్పుడన్నా పిలవండి. మళ్ళీ మాట్లాడుకోవాలి మనం” అంది, వాళ్ళాయనను కూడా సంభాషణలలో కలుపుకుంటూ. ఆయన వేరే దిక్కు చూశాడు.
అలాగే! అని కార్డ్ చదువుకుంది నిసి.
వింటర్ లో ఇక్కడా, స్ప్రింగ్ లో ఇక్కడ, సమ్మర్లో ఇక్కడ, ఫాల్లో ఇక్కడా - అని ప్రపంచంలో నాలుగు చోట్ల ఇళ్ళ అడ్డ్రెస్లు రాసి ఉన్నాయి. సంవత్సరం అంతా ఆమె ఎక్కడ దొరుకుతుందో ఒక అడ్రెస్ , ఫోన్ నంబరు ఉంది.
నిసికి భయం వెసింది. ఈమె గాని ఈమె ఇంటికి పిలిచి ఏ పార్టీ లోనైనా నా నృత్య ప్రదర్శనం ఇమ్మనదు కదా అని. బైటికి పోతూ ఉండగా, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ‘కుర్రపిల్లా, బాయ్ ఫ్రెండూ’ ఇంకో తలుపులోనుండి, వాళ్ళూ వెళ్ళి పోతున్నారు. గుడ్ నైట్ చెప్తూ వెళ్ళిపోయారు. ఆమెకు ఎందుకో గాని వాళ్ళు ఆ రాత్రి, చాల మధురమైన రాత్రి గడుపుతారనిపించింది.
ఆమె కారు లో వెడుతుండగా ఆమె మనసంతా ఆనందం. ఏవో బొమ్మలు చూసి, ఏదో ఒక బొమ్మ ఇంటికి తెచ్చుకుని గోడ మీద తగిలించుకుందామనుకుంటే, అసలు రాఫెల్ గెలవనే లేదు. ఎందుకు? ఏదో గెలిచిన ఈ సంతోషం?
అప్పుడు మళ్ళీ ఇలా అనిపించిందామెకు. అసలు లాటరీ గెలిచింది తనేనేమో అని .
బెంజ్ కారు టాపు దింపివేసి ఆ వెచ్చని గాలులలో - తన జుట్టూ, దుస్తులూ మెరుస్తూ ఎగురుతుండగా, మెల్లగా ఆ నక్షత్రాల వీధులలో మబ్బులను పరికిస్తూ, సంతోషంగా కారు ఇంటి దిక్కుగా నడుపుకుంటూ పోతున్న నిసికి; షెల్లీ కవి ‘ద క్లౌడ్’ కవితను అనుసరించి, ఎవ్వరెరుగని ఒక కవయిత్రి వ్రాసిన:
“ధవళాగ్ని గోళపు ధగధగల భామ!
మర్త్యులనియేరు ఆమెను చందమామ.
నడిరేయి గాలులు లాగికొని రాగ,
ఆమె మెరయుచూ నూగాడు
నా ఉలిపిరి పాన్పుల మీద.
కనరెవ్వరామె పాదాల గురుతులు,
వినగలరు! వేల్పులే! ఆ లాస్యాల ధ్వనులు.. “
కొన్ని పంక్తులు మనసులో మంద్రంగా వినిపించి, వళ్ళు ఝల్లుమంది.
*
chavakiran అభిప్రాయం:
March 7, 2007 10:11 pm
చాలా బాగుంది
P. Siva అభిప్రాయం:
March 14, 2007 6:52 am
ఆహ్లాదకరమయిన సాయంత్రంలా ఉంది కథ. అయితే మొదటి పేజీ కథకి బొత్తిగా అనవసరం. చెట్టును ట్రిమ్ చేసుకున్నట్టే కథనూ చేసుకోవాలి మరి.
Vaidehi Sasidhar అభిప్రాయం:
March 30, 2007 10:20 am
Very pleasant story with flowing and photographic narration.