రంగు తోలు
ఆదివారం. నీలవేణికి తోచడంలేదు. వూళ్లో నాటకసమాజమొకటి ఏదో నాటకం, భిన్నజాతులసంఘర్షణగురించి వేస్తున్నారని టీవీలో చూసింది. అదేమిటో చూద్దాం అనిపించి సుందరాన్ని అడిగింది. అతను రాబోయే కాన్ఫరెన్సుకోసం సీరియస్‌గా పేపరు రాసుకుంటున్నాడు. తనకి టైం లేదని అనడంతో ఒక్కతే బయల్దేరింది. సుందరం కారులో దింపుతాననీ, నాటకం అయేవేళకి మళ్లీ వస్తాననీ చెప్పాడు. థియేటర్ అట్టే దూరం లేదు. అట్టే చలి లేదు, నడిచి వెళ్తానంది నీలవేణి. వచ్చేటప్పుడు మాత్రం తనొచ్చేవరకూ గేటుదగ్గరే వుండమని గట్టిగా చెప్పాడతను.
థియేటర్ దగ్గర జనం బాగానే వున్నారు. టికెట్లు అమ్ముడయిపోయేయి. దిక్కులు చూస్తూ నిలబడ్డ నీలవేణికి ఎవరో సౌంజ్ఞ చేసారు కళ్లతోనే. అటు తిరిగి చూసింది.
ఒక మూడేళ్ల అమ్మాయి ఏడుస్తూ నిలబడింది చేతిలో ఓటికెట్‌తో. ఏగుడ్విల్ స్టోరులోనో కొన్న సాదాగౌనూ, పాతజోళ్లూ, నల్లని ఉంగరాలు తిరిగినజుట్టుని చుట్టుకు ఎర్రరిబ్బను. ఎవరో ఓ చల్లనమ్మ ఆపిల్లని అంటకుండా, గజందూరంలో నిలబడి ఓదార్చడానికి తంటాలు పడుతోంది. ఆఅమ్మాయి ఏడుపు తప్ప మరే జవాబూ లేదు. “మామీ” అన్నమాట తప్ప మరోమాట లేదు. ఒకరిద్దరు ఆ అమ్మాయికి బాగా దూరంలో నిలబడి, ఏవో నంగిప్రశ్నలేస్తున్నారు. ఓ పెద్దాయన నీలవేణివేపు చూసాడు అర్థవంతంగా. ఆచూపుకి ఎన్నో అర్థాలు లేవు. ఒకే ప్రశ్న “మీపిల్లని మీరు చూసుకోనక్కర్లేదూ?”
నీలవేణికి ఏంఅనాలో తోచలేదు. ఆచిన్నదానికి అతనెంత చుట్టమో తనూ అంతే. తన రంగు మూలంగా, తనకీ ఆ పాపకీ చుట్టరికం కలిపాడాయన.
అదే క్షణంలో ఆపాప కూడా నీలవేణిని చూసిందేమో ఒక్కపరుగున వచ్చి, కాళ్లకి చుట్టుకుంది. నీలవేణి దిగ్భ్రమతో అవాక్కయి చుట్టూ చూడసాగింది, ఆపిల్లతలమీద చెయ్యేసి, అసంకల్పప్రతీకారచర్యలా. ఈపాప తనదగ్గరికి పరుగెత్తుకు రావడం తనరంగు చూసే క్షణకాలం అయాచితంగా మనసులో మెదిలిన ఆలోచన అదీ.
“ఇంకా నయం. మిమ్మల్ని నేను చూడకపోతే, ఎవరోఒకరు సోషల్ సర్విస్‌ని పిలిచేసుండేవాళ్లు,” అన్నాడు తన సమయస్ఫూర్తికి తనే మురిసిపోతూ ఇందాకా తనకి కన్నుగీటినాయన.
నీలవేణికి ఆసిస్టమ్‌గురించి అట్టే తెలీకపోయినా కోర్టుటీవీ అదేపనిగా చూడ్డంవల్ల తెచ్చుకున్న విజ్ఞానంతో ఆసిస్టమ్‌లో పడితే ఏమవుతుందో త్వరగానే ఊహించుకోగలిగింది. అంచేత గట్టిగా ఆపిల్ల తనచుట్టం కాదని చెప్పలేకపోయింది. సిస్టమ్ సిస్టమ్ అని కొట్టుకునే చాలామంది బుర్రలకి నిత్యజీవితాల్లోని కటికసత్యాలు ఎక్కవు.
హాల్లో ఆట మొదలయింది. ప్రేక్షకులు లోపలికి వెళ్లిపోయారు. గూడు చేరిన గువ్వలా పాప ఏడుపు మానేసి, జరుగుతున్న నాటకంలో తనకేం భాగం లేనట్టు నోట్లో వేలేసుకు నిలబడింది ఆవిడకాళ్లమాటున. నీలవేణి మరో అయిదు నిముషాలు దిక్కులు చూస్తూ నిలబడింది
ఆతరవాత ఏంచెయ్యాలో తోచక, ఆపాపని తీసుకుని హాల్లోకి వెళ్లి, షాపరాన్ చూపించినసీట్లో కూచుంది పాపని పక్కసీట్లో కూచోపెట్టుకుని.
పావుగంట అయింది. రంగంమీదకి కొత్త పాత్ర ప్రవేశించింది. “మామీ” పాప అరిచింది హఠాత్తుగా. చుట్టూ కూర్చున్నవాళ్లు హుష్ష్ అంటూ తమ అసహనాన్ని వెలిబుచ్చారు. నీలవేణి వాళ్లకి క్షమాపణలు చెప్పుకుని, ఆపాపని మళ్లీ నెమ్మదిగా అడిగింది ఆవిడ మీఅమ్మాఅని. అవును మామీయే. తల్లెవరో నిర్ధారణ అయిపోయింది. నీలవేణి ప్రాణం తెరిపిన బడింది. ఆట ముగిసేసరికి ఆపసిదానిబాధ్యత కూడా తీరిపోతుందని.
ఆట అవగానే ఆతల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆపకుండా పావుగంటసేపు క్షమాపణలూ, కృతజ్ఞతలూ చెప్పుకుంది.
ఆతరవాత తెలిసినకథ ఏమిటంటే - ఆతల్లి మహానటి కావాలని మహా తాపత్రయపడుతోంది రెండేళ్లుగా. ఇంతకాలానికి ఓచిన్నఅవకాశం దొరికింది రంగంమీదికెక్కడానికి. బేబీసిటర్లని పెట్టుకునే స్తోమతు లేదు. వచ్చిన ఒక్కఅవకాశం వదులుకోలేక వూళ్లోనే వున్న ఓకజిన్, ఆంట్ కమీలాని అడిగింది పిల్లని చూడమని. ఆవిడ తనకి అట్టే టైము లేదనీ, ధియేటరుదగ్గర కలుసుకుని చూస్తానని మాటిచ్చింది. ప్రతిఫలంగా ఆట చూడ్డానికి ఉచితటికెట్ ఇవ్వడానికి ఒప్పుకుంది తల్లి. ఆటకి టైమయిపోతోంది. ఆకజినుమీద నమ్మకంతో ఆంట్ కమీలా వచ్చేవరకు గేటుదగ్గర నిల్చోమని ఆపాపతో చెప్పి తాను తెరవెనక్కి వెళ్లింది. అదీ కథ.
సుందరంకోసం ఎదురుచూస్తూ నిలబడింది నీలవేణి. ఎంతసేపటికీ అతని జాడ లేదు. మరిచిపోయాడో, వచ్చి వెళ్లిపోయాడో. తెలిసినవాళ్లు ఎవరైనా కనిపించి రైడిచ్చేరేమో అనుకున్నాడో. … తనీపాపగొడవలో పడి అన్నమాటప్రకారం గేటుదగ్గర నిలవడం వెంటనే జరగలేదు. పాపగురించే ఆలోచిస్తూ ఇంటివేపు నడవసాగింది. వీధిలో అట్టే జనం లేరు. జోరుగా దూసుకుపోయే కార్లు, అక్కడా అక్కడా సైకిళ్లూ …
నీలవేణికి ఆతల్లిని తలుచుకుంటే జాలేసింది. సకలజనులూ సమానులే అంటూ గొంతులు చించుకునే ఈదేశంలో కొందరు కొంచెం “ఎక్కువ సమానం” అని తను ఈదేశంవచ్చినకొత్తలో అర్థం అయింది.
ఓరోజు కూరలు తెచ్చుకోడానికి రెండు వీధుల అవతల వున్నషాపుకి వెళ్లింది. ఆరోజు సరదాగా నవ్వుతూ వెళ్లిన నీలవేణి చిరాగ్గా మొహం ముడుచుకు ఇల్లు చేరింది. సీరియస్‌గా పేపరు రాసుకుంటున్న సుందరం తలెత్తి భార్యామణి మొహం చూసి ఏంవైందన్నాడు,
నీలవేణి గ్లాసుడు మంచినీళ్లు తాగి మార్కెట్లో జరిగిన సంగతి చెప్పింది. బండిలో తనకి కావలసిన సామానులు వేసుకుని చెకర్‌దగ్గరికొచ్చింది. తనముందున్న తెల్లావిడ బండెడు సామాన్లకి చెక్కు రాస్తే ఏబాధా లేదు. తను ఇరవైడాలర్ల సామాన్లకి చెక్కు రాస్తే, డ్రైవర్స్ లైసెన్స్ చూపించమంది ఆ చెకర్. నీలవేణికి అది లేదు. మామూలుగా సుందరం, తనూ కలిసే వెళ్తారు ఎక్కడికెళ్లినా. అతనే సారధి. ఈఒక్కసారి అట్టే దూరం లేదు, కావలిసినవి అట్టే లేవు, ఆనాటి వాక్ కూడా అయిపోతుందని బయల్దేరింది. ఇరవై డాలర్లసామాన్లకి, తానేదో షాపు దోచుకుపోతున్నట్టు సవాలక్ష ప్రశ్నలేసింది ఆచెకర్. ఆపైన మేనేజరు వచ్చి ఓకార్డుమీద పేరు, ఎడ్రెసూ, తన లేక భర్త వుద్యోగం - అవన్నీ రాయమన్నాడు. నీలవేణికి ఒళ్లు మండింది.
“మీసామాను మీరే వుంచుకోండి. నాకక్కర్లేదు,” అంది, చేతులో బండి వదిలేసి. ఆమేనేజరు ఓనిముషం ఆలోచించి సరే, చెక్కు తీసుకో అన్నాడు ఆతెల్లపిల్లతో.
సుందరం “పోనిద్దూ ఎవరిరంధి వాళ్లది” అన్నాడు.
నీలవేణి అతనివేపు పరీక్షగా చూసింది. నిజమే, తనరంగు విషయం అతన్ని బాధించదు. తనపెళ్లినాడే లేకపోయింది అతనికి ఆయావ.
ఆరోజుల్లో తను ఎన్నిసార్లు చూసుకునేదో తనచేతులు పరీక్షగా. నిగనిగలాడుతూ నీలమేఘశ్యామం.
నాన్నమ్మ ఓదార్పులు - “నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు” అన్నారు కాని తెల్లనివాడు అన్నారా?”
“తెలుపు అసలు రంగే కాదు, ఏడురంగుల పోగు,” అన్నయ్య సముదాయింపు.
“కాకి నలుపు, కోకిల నలుపు, వసంతవిజయంతో తెలియు అసలు మెరుపు” అంటూ సంస్కృతం మాస్టారి ఓదార్పు.
నీలవేణికివేమీ ఊరట కలిగించలేదు అప్పట్లో.
“ఈనల్లపిల్లకి పెళ్లాడ్డానికి ఎవడొస్తాడో” అంటూ అమ్మ చాటుగా కళ్లొత్తుకోడం చూసినప్పుడు ప్రాణం గిలగిల కొట్టుకుంది. అయితే ఆపిల్లపెళ్లి అతిసుళువుగా అయిపోయింది కాలం, ఖర్మ కలిసొచ్చి.
పొరుగింటి కాముడత్తయ్యగారి సుపుత్రుడు సుందరం నీలవేణిని చేసుకుంటానన్నాడు.
“కోడలు నలుపయితే కులమంతా నలుపు” అంటూ తల్లి మొదట కాస్త గునిసినా, త్వరలోనే సర్దుకుంది, “చిన్నప్పట్నించీ ఎరిగినచిన్నది, ఇంట్లో మనిషిలా మసలినపిల్ల. ఎక్కడ్నుంచో ఏపడుచునో పట్టుకొస్తే ఆవిడగారు నెత్తినెక్కి కదం తొక్కదనేముంది? ఆకోటమ్మకోడల్ని చూడరాదూ. తెల్లగా పిండిబొమ్మలా ఉందన్న మాటే కాని ఆమిడిసిపాటూ, అదీనూ …” అనుకుని.
సుందరం తనకు తానై ముందుకి రావడంతో నీలవేణికి తనతోలురంగు రంధి తగ్గి, కాస్త ఉపశమనం కలిగించింది. తల్లిదండ్రులు తమ నెత్తిన పాలవాన కురిసిందని మురిసిపోయారు.
ఆతరవాత అచిరకాలంలోనే అమెరికా చేరుకున్నారు నూతనదంపతులు.
అమెరికా వచ్చింతరవాత నీలవేణికి తొక్కరంగుగురించి కొత్తసంగతులు క్రమంగా తెలిసొస్తున్నాయి. ఇక్కడ అందం కాదు తోలురంగు జాతిచిహ్నం. తనని ఆఫ్రికననుకుంటున్నారు ఇక్కడితెల్లవారు.
నీలవేణికి తాను కట్టుకునే బట్టలు మార్చేవరకూ ఆసంగతి తెలియలేదు. నిజానికి అమెరికాకి రాగానే తాను చీరెలు కట్టడం మానేయలేదు. కొంతకాలం చీరెలే కడుతూ వచ్చింది. వాటివల్ల ఎంతసౌఖ్యమో చాలామందికి తెలియచేస్తూ వచ్చింది కూడాను. దరిమిలా, పేంట్లూ, చొక్కాల్లో మొదలెట్టాక, వాటిలోనూ అంత సౌఖ్యమూ వుందనిపించింది. మనం ఏం చెయ్యాలనుకున్నా గాని కారణాలు వాటికి తగ్గట్టు వాటంతటవే దొరుకుతాయన్న సత్యం తెలిసొచ్చింది. వస్త్రధారణతోనే తదితర అలంకరణలూనూ. బొట్టు, గాజులు అన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టేసింది.
అదుగో అప్పుడే ఎదురైంది కొత్తబాధ. తనని స్థానికులు ఆఫ్రికను అనుకున్నందుకు కాదు కాని, నీలవేణికి దాని వెన్నంటి ప్రచారంలో వున్న స్టీరియోటైపు అభిప్రాయాలు, వారు చిలకరించే చిర్నవ్వులు - అదో సొద.
ఆమధ్య ఎవరో హాస్యమాడేరు, మనల్నెందుకు అనడం “కలర్డ్” అని.
నిజానికీ వారే వెలుగుతున్నారు నానావర్ణాల్తో.
కోపమొచ్చి హుంకరించినప్పుడు కెంపులు తిరిగినమొహం,
దిక్కుల్తోచనప్పుడు వెలాతెలా పోయే మొహం,
లాగి లెంపకాయొకటి ఇచ్చుకున్నప్పుడు కమిలి నీలిమ పులుముకునే మొహం.
నానావర్ణాలూ ప్రతిఫలించేది తమరి వదనాల్లోనే అంటూ.
అసలు తెలుగొక భాష అనీ, తెలుగువాళ్లు ఒక జాతి అనీ తెలీనివాళ్లు అమెరికాలో చాలామంది వున్నారు. అక్కడక్కడా ఒకటో రెండో ఎంగిలిముక్కలు దొరకపుచ్చుకున్నకొందరు, “అయితే ఇప్పుడు హరిజనుల పరిస్థితేమయినా మెరుగయిందా?” అని జాలిగా అడుగుతున్నారు. ఆప్రశ్న వెనకునున్న అమాయకత్వానికి, బోళాతనానికి నవ్వూ, చిరాకూ కలిగేవి తనకి.
***
నీలవేణి ధియేటరుదగ్గర తనకి తటస్థపడ్డ పాపని గురించే ఆలోచిస్తూ నెమ్మదిగా అడుగులేస్తోంది. ఆకజినెవరో. ఎందుకు రాలేదో … రావడం ఆలస్యమయిందేమో, ఈలోపున తను ఆపాపని హాల్లోకి తీసుకెళ్లిపోలేదు కదా… ఇంతలో ఎవరో వెనకనించి తనచేతిలో సంచీ లాక్కోబోయారు. తను హేయ్ అంటూ సంచీ గట్టిగా పట్టుకుంది బెదిరిపోతూ. తిరిగి చూస్తే ఒకరు కాదు ముగ్గురు కుర్రాళ్లు … సంచీ వదిలేసింది ఒణికిపోతూ. అందులో ఒకడు ఏం అనుకున్నాడో తనని గట్టిగా తోసాడు. తను అరుస్తూ కింద పడింది. నుదురు చిట్లింది. వాళ్లేదో అంటున్నారు కాని ఒక్కముక్క కూడా అర్థం కాలేదు, కళ్లు మసకబారుతున్నాయి. ఇంతలో మరెవరిదో గొంతు వినిపించింది.
ఆతరవాత ఏంజరిగిందో స్పష్టంగా తెలీలేదు కాని తనని రక్షించడానికి మరెవరో గట్టిగా ప్రయత్నిస్తున్నారని అర్థం అయింది.
మరికొంతసేపటికి …
వీధిదీపం వెలుగులో నల్లటిమొహంమీద కారుతున్న ఎర్రని రక్తం,
తెల్లటిచొక్కామీద రక్తం,
నీలవేణి గుండెలు గజగజ వణికేయి లేతరెమ్మలా.
అదేసమయంలో అతను కూడా నెమ్మదిగా తనవేపు తిరిగాడు. వంట్లో శక్తిననంతటినీ కూడగట్టుకుని, “హౌవార్యూ” అని అడిగాడు, ఎక్కడో ఏడూళ్లవతలినించి వినిపించింది ఆస్వరం.
నీలవేణి ఫరవాలేదన్నట్టు తలూపింది. అతను గమనించేడో లేదో … కళ్లు మూసుకున్నాడు.
నాప్రాణానికి తనప్రాణం అడ్డం వేసిన ఈమానవుడెవరు చెప్మా? ఎందుకు వేశాడు? చాలామందిలాగే అతను కూడా తనని “తమవారు” అనుకున్నాడా?
దారిన పోతున్న మరోకారు ఆగింది. ఆ పుణ్యాత్ముడు 911కి సందేశం పంపించాడు సెల్లులో.
ఆదరాబాదరా రెండు పోలీసుకార్లు, ఎర్రనిట్రక్కులో పెరమెడిక్కులూ దిగారు. ఇద్దరు పెరమెడిక్కును అతనివేపు నడిచారు. ఒకమ్మాయి తనదగ్గరికొచ్చింది, ఎలా వున్నావంటూ.
”నేను బాగానే వున్నాను. అతనికెలా వుంది?” అంది ఆదుర్దాగా నీలవేణి.
“ఫరవాలేదు. స్పృహ తప్పింది, ప్రమాదం లేదు.”
ఆమెచుట్టూ చెదురుమదురుగా రక్తపు చుక్కలు.
నుదుటిమీంచి గొంగళీపురుగులా జారుతున్నరక్తం,
తెల్లని బ్లౌజుమీద, నల్లనిచేతులమీద చుక్కలు, చుక్కలుగా ఎర్రని రక్తం.
అటుతిరిగి అతనివేపు చూసింది.
స్పృహ లేకుండా పడివున్నాడు. ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి కారి చారలు కడుతున్న ఎర్రనిరక్తం, చొక్కామీద చిందిన రక్తం,
రోడ్డుమీద పారుతున్న రక్తం …
నీలవేణి హృదంతరాలనుండీ తొలిసారిగా తనతోలురంగుతాలుకూ తలుపులు తొలగి, ఎర్రని, గోరువెచ్చని అరుణకాంతులు చివ్వున ఎగిసేయి దిగంతాలకు తలకావేరిలా.
****
bharathi అభిప్రాయం:
January 2, 2007 1:56 am
కధ బావుంది. ఎక్కడా bore కొట్టకుండా మంచి flow maintain చేసారు.మంచి theme. opinion అడిగారు కాబట్టి ఎమన్నా highlight points కానీ suggestions ఇవ్వ దగ్గ points కానీ దొరుకుతాయేమోనని మళ్ళీ చదివాను.
[very difficult to type in telugu in this box. i will go with english/tinglish]
“..ఈమానవుడెవరు చెప్మా? ” - May be this expression is used in a different situation as the tone a causual or relaxed state. It would have been more in-tune with the situation if the expression was in the tone of astonishment mixed or colored with fear.
“..911కి సందేశం ” - Nothing wrong in this but just thinking what would could be the exact translation to the word “message” may be సమాచారం/వర్తమానం/కబురు/ or just మెసేజ్. . I don’t know if we can find proper translation for mobile/computers usage related words.
last line మాత్రం అర్ధం కాలేదు.
malathi అభిప్రాయం:
January 9, 2007 5:46 am
Thanks, Bharati garu. You are right about the comment on 911.
In the last line, I tried to point out that raktam has a negative connotation as opposed to words like goruvecchani, and arunima which have positive connotation, meaning, the protagonist finally got to see what is beyond the color of skin. The color is only skin-deep.
Once again thanks.
Malathi Nidadavolu
Sowmya అభిప్రాయం:
January 10, 2007 8:04 pm
బాగుందండీ.
అయితే ఇంతకీ ఆ “ఈమానవుడెవరు చెప్మా?” పాత్ర అంతేనా!
నేను ఇంకా కథ ఉందేమో అనుకున్నా! :)
Yeah, I also agree with the comment by Ms Bharathi on “ఈమానవుడెవరు చెప్మా?” phrase.
rajay అభిప్రాయం:
February 10, 2007 9:08 pm
Good one.
కథా శిల్పం బాగున్నది. రెండు లేక మూడు సంఘటలని ఏకీకరించి ఆ సంఘటనలతో కథా సౌందర్యాన్ని వెలికి తీయ్యదం అన్నది కథకుల కౌశల్యం. నిడదవోలు మాలతి గారు american background లో చెప్పిన కథ కౌశలం అలోచింప దగినదిగా ఉన్నది.
regards
rajay
http://www.tirumala-hills.blogspot.com/
Vaidehi Sasidhar అభిప్రాయం:
February 25, 2007 11:57 am
Well written story with flowing narration and readability