రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101

రచన: సురేశ్ కొలిచాల
జనవరి 2007

గత సంవత్సరం తమిళానికి దీటుగా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో రుజువు చెయ్యడానికి ప్రయత్నిస్తూ తెలుగు పత్రికల్లో కనిపించిన వ్యాస పరంపర చూసి మొదట్లో ఆనంద పడ్డ వాళ్ళలో నేనూ ఒకణ్ని. ఈ వ్యాసాలు తెలుగు భాష పూర్వ చరిత్ర గురించి , తెలుగు వారి పుట్టు పూర్వోత్తరాల గురించి సమగ్రమైన చర్చకు, సశాస్త్రీయమైన పరిశోధనకు పాదుకొల్పుతాయని ఆశ పడ్డాను. తెలుగుదేశంలోని యూనివర్సిటీలకు, భాషా పరిశోధకులకు మన పూర్వ చరిత్ర గురించి ఉన్నత స్థాయిలో పరిశోధనలు జరుపడానికి అపూర్వమైన అవకాశం దొరికిందని పొంగిపోయాను. అయితే, కేవలం ఒకటి రెండు పదాల సారూప్యత ఆధారం చేసుకొని తెలుగు వారి గతాన్ని సుమేరియన్ల నుండి యూదుల సంతతి వరకు, బహ్రేన్ నుండి బర్మా జాతుల వరకు ఆపాదిస్తూ అన్ని పత్రికల్లోనూ వచ్చిన నేలబారు పరిశోధనలు నాలో నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. ముఖ్యంగా, గత రెండు శతాబ్దాలుగా ఆధునిక భాషా శాస్త్రం సాధించిన అభివృద్ధి గురించి కనీస స్థాయి అవగాహన కూడా ఈ రచనల్లో కనిపించకపోవడం తీవ్రమైన అసంతృప్తిని, బాధని కలిగించింది.

ఇంతేకాక తెలుగు జన్మతః ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని కాల్డ్‌వెల్ శాస్త్రీయంగా నిరూపించి 150 సంవత్సరాలు అయినా, ఇంకా ఇది సంస్కృత జన్యమేనని వాదించే వారు ఈనాటికీ ఉండడం నమ్మలేని విషయం. గత సంవత్సర కాలంలో తెలుగును ప్రాచీన భాషగా నిరూపణ చేయడానికి ప్రతి ఒక్కరు యథాశక్తి పత్రికలకు సమర్పించుకొన్న వ్యాసాలలో సంస్కృత జన్య సిద్ధాంత వ్యాసాలు కూడా ఉండటం విచిత్రమే. చరిత్రకారుడిగా పేరున్న ఒక రచయిత తెలుగు, తమిళాది భాషలు సంస్కృత ప్రాకృత జన్యమైన పైశాచి భాషనుండి పుట్టాయని కొంత కాలంగా చాటింపు వేస్తున్న వారిలో ప్రముఖులు. ఈయనే అస్త్రాలయా ఆస్ట్రేలియా అయ్యిందని, మూడు వేల సంవత్సరాల క్రితమే అర్జునుడు అమెరికా పర్యటించినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ మధ్య ఒక వ్యాసంలో ఆయన తెలుగు అంకెల గురించి రాస్తూ, “ఏక” శబ్దం నుండి “ఒక” , “దొందు” శబ్దం నుండి “రెండు” వచ్చాయని చెప్పి మూల ద్రావిడం మిధ్య అయిపోతుందని మరోమారు తనదైన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యం లో సజాతి పద నిర్ధారణకు, భాషా సంబంధ నిరూపణకు భాషాశాస్త్రం ఉపయోగించే ప్రాథమిక సూత్రాల గురించి ఒక ఔత్సాహిక విద్యార్థిగా నేను తెలుసుకొన్న కొన్ని విషయాలు ముచ్చటించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

భాషా సంబంధ నిరూపణ – తులనాత్మక పద్ధతి

ఏవైనా ఒక రెండు భాషల మధ్య సంబంధం నిరూపించాలంటే, ఆ భాషల్లో ఒకే రకంగా ధ్వనించే సమానార్థకాలైన పదాలని చూపించాలన్నది సామాన్యంగా వినిపించే అభిప్రాయం. ఒకే భాషా కుటుంబానికి చెందిన సోదర భాషల్లో తరచూ ఇటువంటి పదాలు కనిపిస్తాయి కూడా. కాని భాషాశాస్త్ర దృష్టితో చూస్తే ఇటువంటి పదాలు భాషా సంబంధ నిరూపణకు నిజంగా అత్యవసరం కాదు; ఒకవేళ ఉన్నా అవి మాత్రమే సరిపోవు. అదీకాక, చాలాసార్లు పదాలలో పైపైన కనిపించే పోలికలు, భాషలమధ్య లేని సంబంధమేదో ఉన్నట్టు మభ్య పెడుతాయి. ఉదాహరణకు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో దాదాపు ఒకే అర్థం ఉండి ఒకే రకంగా ధ్వనించే ఈ పదాల జంటలను గమనించండి:

ఒన్ను one
అటక attic
నీటు neat
కాపు cop
పెట్టు put

పైన చూపిన జంట పదాల ఆధారంగా ఇంగ్లీష్ తెలుగు భాషనుండి పుట్టిందని వాదించడం ఎంత హాస్యాస్పదమో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

ఆధునిక భాషా శాస్త్ర పరంగా రెండు భాషల మధ్య జన్మసంబంధ (genetic relationship) నిరూపణకు భాషావేత్తలు గత రెండు శతాబ్దాలుగా వాడుతున్న విధానాన్ని “తులనాత్మక పద్ధతి (Comparative Method)” అని అంటారు. ఈ విధానాన్ని వివరించే ముందు ఈ పద్ధతికి ఉపయోగపడే రెండు ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావిస్తాను.

ధ్వని పరిణామం (Sound Change)

కన్నడ భాషతో కొద్దిపాటి పరిచయం ఉన్న తెలుగువారెవరైనా గమనించగలిగే విషయం, తెలుగులో /ప/ అక్షరంతో ప్రారంభమైన చాలా పదాలు కన్నడభాషలో /హ/ అక్షరంగా మారినట్టుగాకనిపించడం.

కన్నడ తెలుగు
హాలు పాలు
హగలు పగలు
హళ్ళి పల్లె
హణ్ణు పండు
హంది పంది
హత్తు పది
హావు పాము
కన్నడ తెలుగు
హిడి పిడి
హువ్వు పువ్వు
హుళి పులి
హుంజు పుంజు
హొట్ట పొట్ట
హో- పో-
హోరాట పోరాటం

నిజానికి పాత కన్నడ లో(హలెగన్నడలో) ఈ పదాలన్నీ /ప/ అక్షరంతోనే ఉపయోగించేవారని, కాలక్రమేణా /ప/ ధ్వని /హ/ ధ్వనిగా రూపాంతరం చెందిందని మనకు తెలుస్తోంది. సరిగ్గా ఇటువంటి ధ్వని పరిణామం వల్లనే తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల (front vowels) ముందు /క/ శబ్దం /చ/ శబ్దంగా మారింది . ఈ క్రింది తెలుగు కన్నడ పదాలను గమనించండి.

తెలుగు కన్నడ
చెయ్యి కై
చెవి కివి
చెడు కెడు
చెఱువు కెఱె

ప్రాఙ్నన్నయ యుగ శాసనాలలో 8 వ శతాబ్ది దాకా చేయు ( <*కేయు) అనే క్రియకు రూపాలైన కేచిన (చేసిన), కేసి (చేసి), కేసిరి (చేసిరి) మున్నగునవి క-కారంతోనే ఉండేవి. ద్రావిడ భాషా కుటుంబంలోని ఇతర భాషల్లో కూడా ఈ పదాలు క-కారంతో ఉండటం బట్టి, మూల ద్రావిడ భాషలో ఈ పదాలన్నీ /క/-కారాలుగా ఉండేవని మనం గుర్తించవచ్చు. ఈ రకమైన ధ్వని పరిణామాలు ప్రపంచంలోని అన్ని భాషలలోనూ, అన్ని కాలాల్లోనూ జరుగుతూ వస్తున్నాయని ఆధునిక భాషావేత్తలు కనుగొనడం భాషా శాస్త్ర పరిశోధనలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ప్రపంచ భాషలలో, ముఖ్యంగా ఇండో-యూరోపియన్ భాషలలోని ధ్వని పరిణామాలను సూత్రీకరించే ధ్వని సూత్రాల నిర్మాణం శాస్త్రజ్ఞులను విస్మయ పరిచే ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చింది. భాషా సంబంధాల విషయంలో అప్పటిదాకా అంతు చిక్కని సమస్యలనెన్నింటినో పరిష్కరించింది. సజాతి పద (cognate) నిరూపణకు "శబ్ద సామ్యం" ముఖ్యంకాదని ధ్వని సూత్ర శీలమైన "ధ్వని అనుగుణ్యత (Sound Correspondence)" ముఖ్యమని తెలియ జెప్పింది. ఉదాహరణకు, "దేవ" శబ్ద సంబంధమైన లాటిన్ భాషలోని deus అన్న పదం, అదే అర్థంలో వాడే గ్రీక్ భాషలోని theos అన్న పదం సజాతి పదాలని చాలా కాలంగా నమ్మేవారు. కానీ, సంస్కృత, లాటిన్ భాషలలోని /d/ ధ్వనికి గ్రీక్ భాషలోని /th/ ధ్వనికి ధ్వన్యనుగుణ్యత చూపించలేకపోవటం వల్ల ఈ రెండు పదాలు సజాతి పదాలన్న నమ్మకాన్ని అసత్య వాదంగా (false cognates) నిరూపించగలిగారు. నిజానికి, గ్రీక్ భాషలోని theos, లాటిన్ భాషలోని fes-, festus పదాలు, సజాతి పదాలని ఈ ధ్వన్యనుగుణ్యత సూత్రాల ద్వారా చూపించగలగటం ఈ సిద్ధాంతం యొక్క విజయాన్ని, శాస్త్ర నిబద్ధతను ధ్రువీకరించింది. అంతేకాక, ఈ సూత్రాల ఆధారంగానే శబ్ద సామ్యం లేని పదాలను కూడా సజాతి పదాలుగా నిరూపణ చెయ్యగలగడం ఈ సిద్ధాంతాల ద్వారా సాధించిన సత్ఫలితాల్లో ప్రధానమైనది. అర్మేనియన్ భాషలోని erku (=రెండు) పదానికి ఇండో-యూరోపియన్ మూల ధాతువైన *dw- (*ద్వ-) కు గల అనుబంధం క్రమబద్ధమైన ధ్వని సూత్రాల ఆధారంగా నిరూపించారు. ఈ ధ్వని సూత్రాల ఆధారంగానే ఇంగ్లీష్ భాషలోని /five/ అన్న పదాన్ని సంస్కృత భాషలోని /పంచ/ అన్న పదానికి సజాతి పదంగా రుజువు చెయ్యవచ్చు. ఆధునిక వ్యుత్పత్తి శాస్త్రానికి పునాదులు వేసిన వారిలో ఒకరిగా భావించే ఏ. ఎఫ్. పాట్ (A. F. Pott) అనే జర్మన్ భాషావేత్త "మినహాయింపులు లేని ధ్వని పరిణామ సూత్రాలు (Exceptionless Sound Laws)" ఉన్నాయని గాఢంగా నమ్మేవాడు. ఆ రోజుల్లో పైపైన కనిపించే పోలికల ఆధారంగా అశాస్త్రీయమైన భాషాసిద్ధాంతాలు చేసే వారిని - ఆయన మాటల్లో చెప్పాలంటే "champions of pseudo-etymologies, the comparative linguistic quacks [ ...] who let themselves be seduced by the sirens of phonetic similarity[7]" - ఆయన తీవ్రంగా దుయ్యబట్టేవాడు. అయితే ఏదో ఒక రకమైన మినహాయింపులు లేని ధ్వని సూత్రాలు చాలా తక్కువేనని నేటి భాషావేత్తలందరూ ఒప్పుకుంటారు.

ప్రాథమిక పదజాలం

రెండు భాషల మధ్య సంబంధం చూపించాలంటే ఆ భాషలలోని ప్రాథమిక పదజాలాల మధ్య సంబంధం చూపించాలి. ప్రాథమిక పదజాలం అంటే ఆ భాషలో అనునిత్యం వాడే మౌలికమైన పదజాలం ఉదా: బంధుత్వాల పేర్లు, శరీర అవయవాల పేర్లు, సర్వనామాల పేర్లు, సంఖ్యావాచకాల పేర్లు, ఋతువులకు, కాలాలకు సంబంధించిన పేర్లు, కాలకృత్యాలకు వాడే పేర్లు మొదలగునవి. ఒక భాష వేరే భాషాకుటుంబంనుండి పదజాలాన్ని ఎంతగా అరువు తెచ్చుకున్నా, ప్రాథమిక విషయాలను వ్యక్తపరచడానికి మాత్రం తన సొంత భాషలోని పదజాలాన్నే ఉపయోస్తుంది. కానీ ఒక్కోసారి కొన్ని భాషలలో ప్రాథమిక పదజాలంలో కూడా అన్యభాషా పదాలు కనిపించడం కద్దు. అయితే, ఇలాంటి సందర్భాలలో చాలాసార్లు ఆ ప్రాథమిక పదాలకు సొంత భాషలో పదాలు కూడా ఉండటం గమనిస్తాము. ఉదాహరణకు జపనీస్ భాషలో కనిపించే రెండు రకాలైన సంఖ్యావాచకాలు: ఒకటి చైనీస్ భాషనుండి అరువు తెచ్చుకున్న సంఖ్యావాచకాలైతే, మరొకటి జన్మతః సంక్రమించిన జపనీస్ అంకెలు.

భాషా సంబంధాలను వివరించడానికి ఉపయోగించే ప్రాథమిక పదజాలానికి ఒక ఉదాహరణ Swadesh list. కానీ ఈ ప్రాథమిక పదాల పట్టికను తయారు చేసిన Morris Swadesh దీని ఆధారంగా సోదర భాషల మధ్య కాల వ్యత్యాసాన్ని గణిత సూత్ర సంబంధంగా (glottochronology) కొలవటానికి ఉపయోగించడంతో ఇది వివాదాస్పదంగా మారింది. ప్రాథమిక పదజాలం అన్ని భాషలలోనూ ఒకే గతిలో మార్పు చెందుతుందన్న Swadesh ప్రతిపాదన చాలామంది భాషావేత్తలు ఒప్పుకోరు. అయితే, భాషాసంబంధ నిరూపణకు అవసరమైన ప్రాథమిక పదజాలానికి మాత్రం ఈ పట్టిక ఒక నమూనాగా ఉపయోగపడుతున్నది.

ధ్వన్యనుకరణ పదాలు, శైశవ పదాలు

భాషాసంబంధ విషయంగా పదజాలాలను పోల్చిచూసేటప్పుడు, భాషావేత్తలు ధ్వన్యనుకరణ పదాలను, శైశవ పదాలను ప్రాథమిక పదజాలంగా పరిగణించకుండా జాగ్రత్తపడతారు. ధ్వన్యనుకరణ పదాలు ప్రపంచంలోని చాలా భాషలలో ఒకే రకంగా వినిపిస్తాయి. కోడి కూత తెలుగులో కొక్కొరక్కో అయితే, జపనీస్ భాషలో కొక్కెకొక్కో, ఇంగ్లీష్ భాషలో కొక్క-డూడుల్-డూ. ఈ పదాల ఆధారంగా తెలుగు, జపనీస్, ఇంగ్లీష్ భాషల మధ్య ఏదో సంబంధం ఉందనడం పసలేని వాదన అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలాగే , “అమ్మ” అన్న పదానికి చైనీస్ భాషలో వాడే పదం “మా”, బాస్ఖ్ భాషలో పదం “అమ”, వెస్టిండీస్ లో కోబన్ తెగ వారు మాట్లాడే భాషలో పదం “అమ్మీ”. అంతమాత్రం చేత ఈ భాషలకు తెలుగు భాషకు సంబంధం ఉందని చెప్పలేము. ఈ పదాలలో సామ్యతకు మౌలికమైన వివరణ ఉంది. పసి పిల్లలు మాటలు నేర్చుకునే వయస్సులో కొన్ని రకాల ధ్వనులను మాత్రమే ఉచ్ఛరించగలుగుతారు. పెదవులతో తేలికగా ఉచ్ఛరించగలిగే /ప/, /ఫ/, /బ/, /భ/, /మ/ (ఓష్ఠ్యాలు) శిశువులు మొట్టమొదట పలకగలిగే ధ్వనులు. అచ్చులలో తేలికగా పలికే అచ్చు /అ/. అందుకనే పసిపిల్లలు పలికే మొదటి పదం మనకు “అమ్మ” అనో “మా” అనో వినిపిస్తుంది. ఆ మొట్టమొదటి పదాన్ని తల్లికి ఆపాదించడం సహజం కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా మ-కారంతో కూడిన తల్లి పదం. అదే విధంగా అన్ని భాషలలో వేర్వేరు అర్థాలలో కనిపించే పాపా, మామా, బాబా, దాదా, తాతా, నానా అన్న పదాలు. ఈ శైశవ పదాలలో కనిపించే సామ్యతను, సార్వజనీనతను కూలంకషంగా చర్చించి, వివరించిన భాషాశాస్త్రవేత్త జాకబ్‌సస్ [5].

తులనాత్మక పద్ధతి (Comparative Method)

ఆధునిక భాషా శాస్త్ర పరంగా రెండు భాషల మధ్య జన్మసంబంధం (genetic relationship) నిరూపించాలంటే “ఆ రెండు భాషల ప్రాథమిక పదజాలంలో దాదాపు సమానార్థకాలైన పదాలకు క్రమబద్ధమైన ధ్వనుల అనుగుణ్యత (sound correspondence) చూపగలగాలి.” ఈ రకమైన ధ్వన్యనుగుణ్యత ద్వారా మూల ధాతువులను, తద్వారా ఈ రెండు భాషలకు మాతృక అయిన ఒక మూల భాష (proto-language) ను పునర్నిర్మాణం చేయగలిగితే ఆ భాషలు ఒకే భాషా వృక్షానికి చెందినవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సంబంధాన్ని నిరూపించడానికి అవసరమైన ధ్వని పరిణామాల ద్వారా ఆయా భాషల మధ్య సామీప్యత (nearness) ని కూడా అంచనా వేయవచ్చు. ఈ పద్ధతినే తులనాత్మక పద్ధతి అంటారు.

స్థూలంగా తులనాత్మక పద్ధతిలో ప్రధానమైన అంశాలు ఇవి:

1. సజాతి పద సేకరణ
2. ధ్వని పరిణామ సూత్రాల ద్వారా సజాతి పద సమర్థన
3. మూల ధాతువులు, మూల ధ్వనుల ప్రతిపాదన
4. మూల భాష పునర్నిర్మాణం

ఉదాహరణకు సజాతి పదాలు గా అనిపించే ఈ పదాల వరసలను గమనించండి:

ఇండో-యూరోపియన్ భాషలలో కొన్ని సజాతి పదాలు
Sanskrit Avestan Greek Latin Gothic English
pitar pitar pater pater fadar father
pada padam poda pedem fotu foot
daśa dasa deka decem taihun ten

మొదటి రెండు పదాల వరుసల ఆధారంగా మూల ఇండో యూరోపియన్ పదాలలో /ప/ ధ్వని ఇంగ్లీష్, గాథిక్ మొదలైన జర్మానిక్ భాషలలో /f/ ధ్వనిగా పరిణమించిందని ఊహించవచ్చు. అట్లాగే చివరి రెండు వరసలు /ద/ ధ్వని జర్మానిక్ భాషలలో/T/ ధ్వనిగా మారిందని చెప్పడానికి వీలు కల్పిస్తాయి. అయితే ఈ కొన్ని ఉదాహరణలతో సరిపెట్టుకోకుండా ఈ ధ్వనుల మధ్య ఆయా భాషలలో క్రమబద్ధమైన అనుగుణ్యత చూపించి భాషాశాస్త్రజ్ఞులు ఈ ధ్వనిపరిణామాన్ని ధ్రువపరిచారు. ఆధునిక పద్ధతులతో భాషాశాస్త్రజ్ఞులు కనిపెట్టిన ధ్వని పరిణామ సూత్రాలలో కొన్నింటిని దాదాపు 2500 సంవత్సరాల క్రితమే పాణిని గ్రంధస్థం చేసాడన్న విషయం ఆశ్చర్యకరమైన విషయమే (ఉదా: Grassmann’s Law)!

అలాగే ఈ క్రింది ఉదాహరణలను గమనించండి:

Sanskrit Avestan Greek Latin Gothic English మూల ధాతువు
bhratar bratar phrater frater brothar brother *bhrater
bharami barami phero fero baira bear *bher

సంస్కృతంలో /భ/ ధ్వని కి, అవెస్తా లో /బ/ ధ్వనికి, గ్రీక్ భాషలోని /ఫ/ ధ్వనికి లాటిన్ భాషలో /f/ ధ్వనికి, ఇంగ్లీష్, గాథిక్ భాషలలో /బ/ ధ్వనికి మాతృకయైన ధ్వని ఒకటి మూల భాషలో ఉండి ఉండాలని ఊహించి, ఆ ధ్వనిని పునర్నిర్మించడం తులనాత్మక పద్ధతిలో తదుపరి మెట్టు. సంస్కృతంలోని వేద వాఙ్మయం, లాటిన్, గ్రీక్ భాషలలో లభ్యమైన ప్రాచీన సాహిత్యం ఈ ధ్వనులు ఎలా రూపాంతరం చెందుతున్నాయో చెప్పడానికి కచ్చితమైన ఆధారాలుగా ఉపయోగపడతాయి. ఈ క్రింది పదాలలో మూల ధాతు ప్రతిపాదనలను గమనించండి:

Sanskrit Avestan Greek Latin Gothic English మూల ధాతువు
pitar pitar pater pater fadar father *p@-t-er
padam padam poda pedem fotu foot *ped
bhratar bratar phrater frater brothar brother *bhrater
bharami barami phero fero baira bear *bher
jivah jivo wiwos qius quick (‘living’) *gwei
sanah hano henee senex sinista senile *sen
virah viro wir wair were(wolf) (‘man’) *wiro
tri tri tris tres thri three *trei
daśa dasa deka decem taihun ten *dekm
śatam satem he-katon centum hund(rath) hundred *dkm-tom

ప్రాచీన, ఆధునిక ఇండో-యూరోపియన్ భాషలలో ఇటువంటి సజాతి పదాలను వేలకొలది విశ్లేషించి, వాటి మూల ధాతువులను, మూల ధ్వనులను వివేచించిన భాషావేత్తలు ఇండో-యూరోపియన్ మూల భాషను పునర్నిర్మించగలిగారు. ఇంతేకాక యూరప్ నుండి భారత ఉపఖండం దాకా విస్తరించిన ఈ మహా భాషా కుటుంబ వృక్షాన్ని శాఖోపశాఖలుగా వర్గీకరించడం ఈ తులనాత్మక పద్ధతి ద్వారానే సాధ్యమయ్యింది.

ఈ తులనాత్మక పద్ధతికి సిద్ధాంత పరంగానూ, ఉపయోగంలోనూ కొన్నిపరిమితులున్నాయి[6]. కానీ గత రెండు శతాబ్దాలుగా ఈ పద్ధతి ప్రపంచ భాషల వర్గీకరణకు, భాషల అంతర్నిర్మాణ పరిశోధనకు భాషాశాస్త్ర వేత్తలకు ఎంతగానో తోడ్పడిన ఏకైక ఉపకరణం.

తెలుగు అంకెలు, సంస్కృత సంఖ్యలు

ఇకపోతే ఏక శబ్ద నుండి “ఒక”, దొందు శబ్దం నుండి “రెండు” సంఖ్యావాచకాల ఉత్పత్తి సాధ్యమా అన్న విషయం తులనాత్మక పద్ధతి ద్వారా పరిశీలిద్దాం. భారతీయ ఇండో-ఆర్యన్ భాషలలో మొదటి రెండు సంఖ్యావాచకాలు ఇలా ఉంటాయి[8]:

1. ఏక (సంస్కృతం) ఏక్ (హిందీ) ఏక (పాళీ) ఏకు (సింధీ) ఏక (ఒరియా) హెక్/ఇక్క (పంజాబీ)
2. ద్వ/ద్వౌ (సంస్కృతం) దో (హిందీ) దో బా (సింధీ) దుఇ/బేని(ఒరియా) బే (మరాఠీ)

ఇందులో ఏక శబ్దం అన్ని భాషలలో దాదాపు ఒకే రూపంలో ఉన్నా పంజాబీ భాషలో మాత్రం హెక్/ఇక్క గా మారింది. కానీ, పంజాబీ భాషలో నొక్కి పలికినపుడు ఎ- ధ్వని హె- ధ్వనిగా కానీ, హి- ధ్వనిగా కానీ మారుతుందని ఇతర ఉదాహరణల ద్వారా నిర్మించిన ధ్వని సూత్రాల ద్వారా నిరూపించవచ్చు. అలాగే వ- ధ్వని బ-ధ్వనిగా మారటం ఇండో-ఆర్యన్ భాషలలో సర్వ సాధారణం. ఈ ధ్వని సూత్రాల ద్వారా ద్వ- శబ్దం ద్బ- శబ్దంగా, ఆపైన బ- శబ్దంగా పరిణామం చెందిందని చెప్పవచ్చు. తెలుగు “ఒక” శబ్దం “ఏక” శబ్దం నుండి ఉద్భవించిందని చెప్పాలంటే *ఏ > ఒ ధ్వని పరిణామానికి క్రమబద్ధమైన ధ్వన్యనుగుణ్యత చూపించగలగాలి. అలాగే దొందు శబ్దం రెండు శబ్దంగా రూపాంతరం చెందిందని చెప్పడానికి పదాదిన ద- ధ్వని ర- ధ్వనిగా మారడానికీ, పదాంతంలో ద- ధ్వని డ- ధ్వనిగా పరిణమించడానికి మరిన్ని ఉదాహరణలతో క్రమబద్ధమైన అనుగుణ్యత చూపగలగాలి.

నిజానికి తెలుగులో మొదటి సంఖ్యా వాచక శబ్దం ఒకటి- మిగిలిన ద్రావిడ భాషలవలే *ఒన్, *ఒన్ఱు > *ఒండు, *ఒరు, *ఒక్ అన్న ధాతువులకు దగ్గరిదని నిరూపించడం సులభం. ఒంటి-, ఒంటరి- అన్న ప్రాచీన తెలుగు పదాలు ఇందుకు ఉదాహరణలు. అలాగే రెండు- అన్న శబ్దం *ఇరు-/*ఇరండు ధాతువు నుండి పరిణామం చెందిందని చూపడం తేలిక. ఇరువురు, ఇరువది (ఇరు+పది), ఇమ్మడి (రెండు రెట్లు), ఇరువాగు వంటి ఇరు- సంబంధ శబ్దాలు తెలుగులో కోకొల్లలు.

ఇండో-యూరోపియన్ కుటుంబంలోని వేర్వేరు భాషలలోనూ, ద్రావిడ భాషలలోనూ సంఖ్యా వాచకాలను ఒక్క సారి పరిశీలిస్తే తెలుగు అంకెలకు, సంస్కృత, ప్రాకృత సంఖ్యావాచకాలకు లంకె లేదన్న విషయం సుస్పష్టమవుతుంది.

ఇండో-యూరోపియన్ భాషలలో సంఖ్యా వాచకాలు
మూల ధాతువు Sanskrit Avestan Greek Latin Gothic English
*oi- eka aēuua oios ūnus ains one
*duwo / *dwo dva duua duō duo twai two
*treyes tri θri treis trēs þreis three
*kwetw- catur čaθware tessares quattuor fidwor four
*penkwe pañca paṇča pente quinque fimf five
*sweks / *seks ṣaṣ xšuuaš heks sex saihs six
*sept@m sapta hapta hepta septem sibun seven
*októ aṣṭa ašta oktō octō ahtau eight
*new@n nava nauua ennea novem niun nine
*dek@mt daśa dasa deka decem taihun ten
*dkm-tom śatam satem he-katon centum hund(rath) hund-red
ద్రావిడ భాషలలో సంఖ్యా వాచకాలు
మూల ధాతువు తమిళం తెలుగు కన్నడ
*ఒన్/*ఒన్ఱు ఒన్ఱు ఒండు ఒందు
*ఈర్/*ఇర్ ఇరు/ఇరంటు/రెండు ఇరు/రెండు ఇరు/ఎరడు
*మూహ్-/*మూ-/*మూన్ఱు- మూన్ఱు మూఁడు మూఱు
*నాల్- నాల్కు నాలుగు నాల్కు
*చయ్-మ్- ఐంతు/అంజు ఏను/అయిదు అయిదు
*చాఱ్- ఆఱు ఆఱు ఆఱు
*ఏఴు- ఏఴు ఏడు ఏఴు
*ఎణ్- ఎట్టు ఎణుంబొంది / ఎనిమిది ఎంటు
*తొల్-/*తొణ్- తొంటు తొమ్మిది ఒంబత్తు
*ప@-/*పత్తు- పత్తు పది పత్తు
*నూఱు- నూఱు నూఱు నూఱు

తెలుగు పత్రికలలో భాషావ్యాసాల తీరు

భారత కేంద్ర ప్రభుత్వం తమిళ భాషని ప్రాచీన భాషగా గుర్తించి ఆ భాషకు నూరు కోట్ల రూపాయలు బహూకరించిండంతో తెలుగు భాష ప్రాచీనత గత సంవత్సరంలో ముఖ్య చర్చనీయాంశం అయ్యింది. తమిళానికి దీటుగా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో రుజువు చేయ్యడానికి పలురకాల ప్రతిపాదనలు పత్రికల్లో కనిపించాయి. అయితే ఈ వ్యాసాల్లో తర్కబద్ధమైన వివేచనతో, నిర్దిష్టమైన రుజువులతో శాస్త్రపరీక్షకు నిలువగలిగే విశ్లేషణ చాలా తక్కువనే చెప్పక తప్పదు.

ఉదాహరణకు ఒక రచయిత క్రీ. పూ. 3000 సంవత్సరాల క్రితం బహ్రేన్ లో వెలసిల్లిన తెల్‌మున్ నాగరికత తెలుగు వారిదేనంటూ, “సుస” అనే నగరంలో దొరికిన ‘క్లే టాబ్లెట్స్’ లో ఉన్న ఒక ఉత్తరంలోని భాషకు తెలుగు భాషకు సంబంధం అంటగట్టారు. అయితే, ఇందులో తెలుగు పదాలుగా చెప్పుకున్న పదాలు ప్రాచీన తెలుగు శబ్దాలు కావు. అసలైతే ఇందులో తెలుగు పదాలుగా పేర్కొన్న అన్నాయం, సకియం వంటి చాలా పదాలు అర్వాచీనాలైన సంస్కృత తద్భవాలు. మరో రచయిత ఊరు, గుడి, గుడియ అన్న పదాల ఆధారంగా సుమేరులో తెలుగుతేజం వెలిగిందని నిర్ణయించారు. క్రీ. పూ. 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండే తెలుగు వారు గోదావరి లోయ గుండా సముద్ర మార్గాన సుమేరు ప్రాంతాలకు వలస వెళ్ళారని తమ పూర్వజులతో వర్తక సంబంధాలు కొనసాగించారని ఈయన పేర్కొన్నారు. కానీ క్రీ. పూ. 1100 నాటి కంటే ముందు దక్షిణ భారత దేశంలో ఏ రకమైన నాగరికత వెలసిల్లినట్టుగా ఆర్కియలాజికల్ ఆధారాలు లేవు. మరో రచయిత కృష్ణుడు అంధక వృష్ణీయంలో పుట్టిన వాడు కాబట్టి తెలుగు జాతివాడేనని అభిప్రాయపడ్డారు. తమిళులు శ్రీలంక నుండి భారతదేశానికి వలస వస్తే, తెలుగు వారు బలూచిస్తాన్ ద్వారా భారత దేశానికి ప్రవేశించారని మరో రచయిత సూచించారు. ఇవేవీ శాస్త్ర పరిశీలనకు నిలువగలిగే వాదాలు కావు. బౌద్ధ జాతక కథలో ప్రస్తావించిన ‘తెలివాహ’ గోదావరి నదేనని రాసిన వ్యాసంలో మాత్రం కొంత భాషాశాస్త్ర బద్ధమైన విశ్లేషణ కనిపిస్తుంది.

తెలుగు, ఆంధ్ర శబ్దాలను తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన వేర్వేరు భాషలుగా చిత్రిస్తూ ఈ మధ్య వచ్చిన వ్యాసాలు కూడా ఈ కోవకు చెందినవే. “తెలుగు”, “ఆంధ్ర” శబ్దాల వ్యుత్పత్తి గురించి, వాటిని భాషా పరంగా, జాతి పరంగా, ప్రాంత పరంగా పూర్వ వాఙ్మయంలో వాడిన దృష్టాంతాల గురించి భాషాశాస్త్రవేత్తలు [గంటి] [భద్రిరాజు] చేసిన విశ్లేషణకు మించి, ఈ వ్యాసాల్లో శాస్త్ర విమర్శకు నిలువగలిగే వివరాలేవీ నాకు కనబడలేదు. జన్యుశాస్త్ర పరంగా తెలంగాణా ప్రజలు, కోస్తాంధ్ర ప్రజలు భిన్న జాతికి చెందినవారని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. తెలంగాణా తెలుగు, కోస్తాంధ్రా తెలుగు భాషల వ్యుత్వత్తి వేరని నిరూపించాలంటే, తులనాత్మక పద్ధతిద్వారా ఈ భాషల ప్రాథమిక పదజాలంలో క్రమబద్ధమైన అనుగుణ్యత లేదని రుజువు చెయ్యగలగాలి. భాషాశాస్త్ర సిద్ధాంత దృష్టితో చూస్తే ఈ రెండు “భాషలు” ఒకే భాషకు చెందిన రెండు మాండలికాలుగానే తప్ప మరేరకమైన వాదన చేయడానికి వీలు లేదని తెలిసిపోతుంది. తెలంగాణా భాషకు లంబాడి, సవర భాషలకు సంబంధం ఉండవచ్చునేమోనని మరో రచయిత సందేహం వెలిబుచ్చారు. లంబాడీ భాష రాజస్థానీ ఉపశాఖకు చెందిన ఇండో-ఆర్యన్ భాష. సవర భాష ముండా ఉప శాఖకు చెందిన ఆస్ట్రో-ఏసియాటిక్ భాషా కుటుంబానికి చెందింది. తెలుగు భాషపై ఈ రెండు భాషల ప్రభావం చాలా తక్కువేనని చెప్పకోవచ్చు.

వచ్చిన చిక్కేమిటంటే భాషా చరిత్రలపై ఈ వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు. సాహిత్యం ఒక కళ అయితే భాషాశాస్త్రం విజ్ఞాన శాస్త్రం. సాహిత్య సృష్టికి కల్పనా శక్తి చాలా అవసరం. విజ్ఞాన శాస్త్ర పరిశోధనకు తార్కిక వివేచన, విశ్లేషణ ((Logical Reasoning and Analytical Skills) అత్యంత ప్రధానమైన అంశాలు. మౌలిక పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏవో కొన్ని వాస్తవాంశాలకు తమ కల్పనా శక్తిని జోడించి తమ దృక్పథాల ప్రకారం, ఏవో తాత్కాలిక ప్రయోజనాలకోసం, చరిత్రలు రాయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది.

ఉప సంహారం

కనీసం మూడువేల సంవత్సరాలుగా భారత ఉపఖండం బహు భాషా కుటుంబ ప్రదేశం (Linguistic Area)గా విలసిల్లింది. ఇండో-ఆర్యన్ భాషలు, ద్రావిడ భాషలు, ముండా భాషలు, టిబెట్టో-బర్మీస్ భాషలు సహజీవనం చేసిన భారతదేశపు పూర్వ చరిత్ర సంక్లిష్టమైనది. సింధూలోయ నాగరికత లోని ప్రజలు ఏ భాష మాట్లాడి ఉంటారన్నది ఇప్పటికీ పరిశోధకులకు అంతుచిక్కని అంశం. ఆర్య భాషలపై ద్రావిడ భాషల ప్రభావం ఇప్పటికీ వివాదాస్పదమైన విషయమే[8][10][11]. క్లిష్టమైన ఈ పూర్వ చరిత్ర పునర్నిర్మాణానికి మౌలికమైన పరిశోధనలు చాలా అవసరం. చారిత్రక, భాషాత్మక ఆధారాలతో ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, జియాలజీ, జెనెటిక్స్ మొదలైన విజ్ఞాన శాస్త్ర ఆధారాలను అనుసంధానం చేయగలిగే పరిశోధనలు మాత్రమే ఈ చిక్కుముడులు విప్పగలవు.

పాశ్చాత్య చరిత్రకారులు తమ స్వార్థం కోసం తిమ్మిని బమ్మిని చేసి తప్పుడు చరిత్ర బనాయించారని ఒక విమర్శ వినిపిస్తూఉంది. సామ్రాజ్యవాద దృక్పథం వల్లనో, శ్వేతజాతి అహంకారం వల్లనో, భారతీయులను చరిత్రహీనులుగా ప్రచారం చేసే ఉద్దేశ్యంతోనో పాశ్చాత్య విద్వాంసులు భారతీయ చరిత్రకు న్యాయం చెయ్యలేదని, చెయ్యలేరని వీరి వాదన. అసలైన భారతీయ ఆత్మను ఆవిష్కరించే సమగ్ర యత్నం భారతదేశం నుండే రావాలని వీరి నమ్మకం. అయితే సర్ విలియం జోన్స్, కాల్డ్‌వెల్ ల నుండి బరో, ఎమెనోల వరకూ భారతీయ భాషలపై అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారు పాశ్చాత్యులే. తొలితరం పాశ్చాత్య చరిత్రకారులు చేసిన సిద్ధాంతాలలో కొన్ని లోపాలను ఈ తరం పరిశోధకులు కనిపెట్టి ఉంటే ఉండవచ్చు – ఒక శాస్త్రవేత్త తయారు చేసిన సిద్ధాంతానికి తరువాతి తరం శాస్త్రవేత్తలు మెరుగులు దిద్దటం కానీ, లోపాలు సవరించడం గాని శాస్త్రపరిశోధనారంగంలో ఎల్ల కాలాల్లోను జరుగుతున్న పని. కానీ తొలితరం పాశ్చాత్య విద్వాంసులు అవిశ్రాంతంగా పనిచేసి సేకరించిన ఆధారాలు, శాస్త్ర బద్ధంగా చేసిన పరిశోధనలు ఇప్పటికీ అనుసరణీయాలే. భారతీయ భాషలకు చేసిన మహత్తరమైన సేవలకి వారు ఎప్పటికీ చిరస్మరణీయులే.

అయితే మన గత చరిత్ర గురించి మనమే ఆసక్తి, అభిమానం చూపడంలోనూ, అధ్యయనం చెయ్యాలనుకోవడంలోనూ తప్పేమీలేదు. అంతేకాక భారతదేశంలో శాస్త్ర పరిశోధనకు అవసరమైన ప్రతిభకు కొరతలేదు. కానీ ఈ పరిశోధనలకు కావాల్సిన మౌలికమైన శిక్షణ, వనరులు (training and infrastructure) మన దేశంలో అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా శాస్త్రపరిశోధనలు భారతదేశంలో జరగాలంటే భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఉత్తమ స్థాయి పరిశోధనకు అవసరమైన వనరుల్ని, వసతుల్ని ఏర్పాటుచెయ్యగలగాలి. పరిశోధనకు కావల్సిన అన్వేషణా ప్రవృత్తిని, జిజ్ఞాసను ప్రేరేపించే వాతావరణం యూనివెర్సిటీలలో నెలకొల్పగలగాలి. భారతీయ భాషా పరిశోధనలకు, భారత చరిత్ర రచనలకు ఈ యూనివెర్సిటీలు కేంద్రాలు కావాలి. ఆధునిక భాషా శాస్త్రాలకు భిక్ష పెట్టిన పాణిన్యాదులు మన భాషాపరిశోధకులకు స్ఫూర్తి కావాలి. మన మధ్యే నివసిస్తున్న ప్రపంచ ఖ్యాతి చెందిన భద్రిరాజు కృష్ణమూర్తి వంటి భాషావేత్తల మేధాశక్తిని, విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఈ మహత్తర బాధ్యతను మన యూనివెర్సిటీలు నిర్వర్తించనంత కాలం భారతీయ భాషా, చరిత్ర, సంస్కృతుల గురించి పాశ్చాత్య పరిశోధకుల రచనలే శిరోధార్యం కాక తప్పవు.

ఉపయుక్త గ్రంథాలు

  1. Principles of Historical Linguistics, Hans Hock [1991]
  2. Historical Linguistics: An Introduction, Lyle Campbell [2004]
  3. Dravidian Languages, Bhadriraju Krishnamurti [2003]
  4. ఆంధ్ర భాషా వికాసము, గంటి సోమయాజి [1947]
  5. Why “mama” and “Papa”? Roman Jakobson [1959]
  6. On the limits of Comparative Method , S. P. Harrison in “The Handbook of Historical Linguistics: Brian D. Joseph, Richard D. Janda” [2003]
  7. Language, Culture, and Society: key topics in linguistic anthropology, Christine Jourdan, Kevin Tuite [2006]
  8. The Indo-Aryan Languages Colin P. Masica [1991]
  9. Indo-European Numerals, Jadranka Gvozdanović [1992]
  10. Linguistic Archaeology Of South Asia, Franklin C. Southworth [2005]
  11. The Munda Languages, Norman H. Zide (Editor), Gregory D. S. Anderson (Editor) [2006]
    
   

31అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Rao Vemuri January 1, 2007 4:46 pm

    బాగుంది. నా ఉద్యోగాన్ని మానేసి భాషాశాస్త్రంలో పరిశోధన చెయ్యాలనిపిస్తోంది.

  2. 2
    J K Mohana Rao January 1, 2007 7:49 pm

    A very good essy. It may be mentioned that lingustic science has enormously helped the development of protein and nucleic acid sequence comparisons. The concept of sequence similarity and building evolutionary trees had its origin in lingustic science. Now this field is far more developed and it is possible to feed back some of the concepts herein to the field of comparative linguistic studies. Again congratulations to the author SrI surES kolichAla.
    Reagrds! – J K Mohana Rao

  3. 3
    Kameswara Rao January 2, 2007 11:23 am

    చాలా మంచి వ్యాసం! భాషాశాస్త్రం ఏమాత్రం తెలీని వాళ్ళకికూడా సులువుగా అర్థమయ్యే విధంగా ఉంది. కేవలం పాపులరిష్టు వ్యాసాలకీ, శాస్త్రప్రమాణం కలిగిన వ్యాసాలకీ ఉన్న వ్యత్యాసాన్ని పాఠకులు, పత్రికల సంపాదకులూ ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోవాలి.

    ఒకే ఒక్క మాటతో మాత్రం నేను విభేదిస్తున్నాను, “భాషా చరిత్రలపై ఈ వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు.” అన్నారు. అలా అనడం సురేష్ గారి ఔదార్యమే తప్ప అందులో సత్యం లేదని నా నమ్మకం.

  4. 4
    Vaidehi Sasidhar January 2, 2007 2:14 pm

    Impressive,thought provoking and very well written article with keen analysis presented very logically and scientifically.Infact it is a very interesting introduction to linguistic science to people like me who knew very little about language or linguistics.

  5. 5
    కొడవళ్ళ హనుమంతరావు January 5, 2007 11:28 pm

    భాషావేత్తల సరదా తగాదా ప్రయాణం

    వార్తాపత్రికలలో మన భాష మీద వచ్చే ఊహాగానాల వలన ఒక ఉపయోగముంది – “ఔత్సాహికులు” వాటిని చదివి నిరాశపడి ఊరుకోకుండా వాటిలోని నిజానిజాల గురించి అద్భుతమైన వ్యాసాలు రాయడం. సురేష్ ఇంతకుమునుపూ, ఇప్పుడూ రాసిన వ్యాసాలు భాషాశాస్త్రంలో ప్రవేశం లేని నాలాంటి వాళ్ళకి సులభంగా అర్థమవడమేకాక ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం కలిగిస్తున్నాయి. ఇవి 201, 301, … సీరీస్ లా కొనసాగుతాయని నా ఆశ.

    స్వల్ప లోపాలనిపించిన రెండు విషయాలు:

    1. అందుబాటులో లేని ఉపయుక్త గ్రంథాలు: గంటి గారి పుస్తకం అరవై ఏళ్ళనాటిది, అది దొరకడం కష్టం. భద్రిరాజు గారి పుస్తకం ఖరీదు డెబ్భై అయిదు డాలర్లు! అమెరికాలో ఉన్న భాషాభిమానులైనా కాస్త వెనకాడతారు. ఇంతకన్నా అందుబాటులో ఉన్నవి ఏవైనా ఉంటే చెప్పండి.

    2. పేరులేని విమర్శలు: “సాహిత్యం కళ, భాషాశాస్త్రం విజ్ఞాన శాస్త్రం” అన్నారు, బావుంది. చరిత్రకారుడిగా పేరున్న ఓ ప్రముఖ రచయిత, తెలుగు పైశాచి భాష నుండి పుట్టిందనీ, అర్జునుడు అమెరికా వెళ్ళొచ్చాడనీ ఘంటాపథంగా చెప్తున్నారనీ విమర్శించారు. సాహిత్యరంగంలో సంప్రదాయాలెలా వున్నా, శాస్త్రీయరంగంలో వేరేవాళ్ళని విమర్శించేటప్పుడు వారి రచనని ప్రస్తావించడం ఆనవాయితీ. కనీసం రచయిత పేరన్నా చెప్తే వారి రచనలని పరిశీలించే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఆ రచయిత గూడా “ఈమాట”లో తనని తాను సమర్థించుకోడానికీ లేకపోతే సరిదిద్దుకోడానికీ వీలవుతుంది.

    అర్జునుడు అమెరికా వచ్చాడనడం హాస్యాస్పదం కావచ్చు గాని, పైశాచీ ప్రాకృతమే తెలుగుకు మాతృక అని పేరున్న పండితులే వాదించారని చదివాను. అదీ Caldwell శాస్త్రీయంగా నిరూపించిన వందేళ్ళ తర్వాత గూడా! మన సాహిత్యంపైనేకాక మన భాష మీదకూడా విస్తృతమైన పరిశోధనలు చేసిన చిలుకూరి నారాయణరావు గారు Caldwell తో విభేదించారట. మిడిమిడి జ్ఞానంగల వాళ్ళనీ రాజకీయ ప్రయోజనాల దృష్టి తో చేసే వాదనలనీ వదిలేద్దాం. చిలుకూరి లాంటి గొప్ప పండితుడు గూడా ఒప్పుకోలేదంటే, మనం తెలుసుకోదగ్గ కారణాలు ఏవో ఉండి ఉండాలి. వాటిని స్థూలంగానయినా చెప్తే బావుండేది.

    ఇది చదువుతుంటే, శిథిలావస్థలో ఉన్న తిరుమల రామచంద్ర “సాహితీ సుగతుని స్వాగతం” గుర్తుకొచ్చి తీస్తే, దాంట్లో “దేశినామమాల లోని మరికొన్ని తెలుగు పదాలు” అనే వ్యాసం నన్నాకర్షించింది. మన భాషావేత్తల తగాదాలకు రైలుపెట్టెలకన్నా సరైన చోటు మరి లేనట్లుంది.

    “నిన్ను చూస్తే తందామనిపిస్తుందోయ్!” అన్నారట చిలుకూరి, మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో తిరుమల రామచంద్రని చూసి. “అంతటి అపరాధం ఏం చేశానండీ?” అని అడిగితే, “అపరాధం? మహాపరాధమే చేశావ్. సంస్కృత ప్రాకృత సాహిత్యాలకే ద్రోహం తలపెట్టావు. గాథాసప్తశతిలో తెలుగు పదాలు చేరాయని వ్రాశావు” అన్నారట.

    తిరుమల రామచంద్ర, “నాదేముందండీ, ఆచార్య హేమచంద్రుడంతటి వాడే శ్రమపడి అలాంటి పదాలని “దేశి నామమాల” గా క్రోడీకరిస్తే,” అన్నారట. “పదకొండో శతాబ్దపు హేమచంద్రుడా నీకు ప్రామాణికం?” అంటే, “నేను గూడా సొంతంగా పరిశోధించి కనుగొన్నానన్నా”రట తిరుమల. “ఏదీ చెప్పు చూద్దాం” అంటే, గుక్క తిప్పుకోకుండా, తెలుగు, కన్నడం, తమిళం నుండి సంస్కృతంలో వచ్చి చేరిన పదాలను – వరసలు, వస్తువులు, జంతువులు, రుతువుల గురించి – ఇలా అనేక పదాల పుట్టుపూర్వోత్తరాలని తిరుమల తడువుకోకుండా వివరించారు.

    నాకు బాగా నచ్చిన ఒక పదం గురించి మాత్రం రాస్తాను. అందుకు కారణం చిన్నప్పుడు ఆడిన ఆటలూ పెద్దయింతర్వాత చదివిన కవితలూ గుర్తుకురావడమే.

    శ్రీశ్రీ Swinburne కవితల్ని “షెల్లీ కవనపు హల్లీసకం” తో పోల్చాడు. నేను పాతికేళ్ళుగా, “హల్లీసకం” అంటే అర్థం తెలియకుండానే ఆ కవితని గుర్తుచేసుకునే వాణ్ణి. ఈ మధ్య, వేలూరి గారితో పరిచయమయిన తర్వాత, “అర్థం తెలియకుండా చదివిన చదువూ ఒక చదువేనా!” అని ఆయన మెత్తని “దీవెనలు” ప్రసాదిస్తే, బుద్ధిగా నిఘంటువు చూడటం అలవాటు చేసుకున్నాను.

    “హల్లీసకం” అంటే స్త్రీలు గుండ్రంగా నిలిచి ఆడే ఆట అని బ్రౌన్ లో ఉంది. అది సంస్కృత పదం. దానికి తిరుమల వ్యాఖ్యానం చూడండి:

    “హాల్లీసో = రాసకః. మండలేని స్త్రీణాం నృత్యం. మనకు, కన్నడం వారికి హళ్ళి అనే పదం ఉంది. ఇది సున్నకు పర్యాయపదం. చిన్న వర్తులానికి అల్లి అంటారు కొన్ని ప్రాంతాలలో. గోలీలను అల్లి కాయలంటారు. అల్లికాయలంటే గుండ్రని గుళ్ళు. బొంగరాలాటలో నేలమీద గుండ్రని గీటుగీచి దాని మధ్యన ఒక బొంగరాన్ని ఉంచుతారు చూచారా? అలా గీచే గుండ్రని గిరిని అల్లి అంటారు. అలాగే పిల్లలు ఒకరి చేయి ఒకరు పట్టుకుని గుండ్రంగా పందెం కట్టి నిలవడాన్ని అల్లి కట్టడం అంటారు. కనుక ఈ అల్లే హల్లీసో అయిందేమో! హల్లీసం నుంచే అల్లీ కాకూడదూ అని ఎదురు ప్రశ్న వేస్తారు కదూ? కావచ్చు. కాని హేమచంద్రుడు దీన్ని దేశి పదంగా పరిగణించాడు కనుకనే ఈ శ్రమంతా.”

    అలా మాట్లాడుకుంటూ పోతే రైలు అరక్కోణంలో ఆగినప్పుడు గాని తెలియలేదట, ఎంతసేపు అయిందనీ, తను టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాననీ! అప్పుడు చిలుకూరి:

    “చూచావా! నీకిదే శిక్ష. తెల్లవారుజాము బండి ఎక్కి మద్రాస్ చేరుకో. మరొకమారి హోరాహోరిగా పోట్లాడుకుందాం. ద్రావిడ భాషావాద సన్నిపాతం ముంచుకొచ్చింది. మీ కందరికీ స్వాస్థ్యం కలగాలంటే కొంతకాలం పడుతుంది,” అన్నారు.

    జులై 1959 “భారతి”లో వచ్చిన ఈ వ్యాసాన్ని తిరుమల ఇలా ముగించారు: “నేను బండి దిగాను. బండి కదిలింది. సాహిత్యంలో అభిప్రాయ భేదాలను వ్యక్తిగత ద్వేషంగా భావించుకొని పగపట్టే ఈ కాలం ఎక్కడ? అభిప్రాయ భేదాలు వేరు. అభిమానాదరాలకూ, మానవత్వానికి సాహిత్యంలోని మత భేదాలు అడ్డురావనే ఆ సహృదయ విమర్శక పరిశోధకాగ్రణి ఎక్కడ? అలాంటి ఉదాత్త హృదయుడు మరొకడు నాకు కనిపించలేదు. ఆయన కీర్తిమూర్తికి నా నమోవాకాలు.”

    ఇంతకీ చిలుకూరి తెలుగు సంస్కృత ప్రాకృతాలనుంచి పుట్టిందనడానికి కారణాలేవిటో నాకు తెలియలేదు. రైలు ప్రయాణం లో ఎక్కువ మాట్లాడింది తిరుమలే. చిలుకూరి రాసిన “ఆంధ్ర భాషా చరిత్ర” కూడా అందుబాటులో లేదు. ఈ లోటుని ముందు ముందు సురేష్ పూరించాలని కోరుకుంటూ,

    కొడవళ్ళ హనుమంతరావు

  6. 6
    Suryanarayana Murthy Akella January 7, 2007 4:38 am

    సురేష్ గారి వ్యాసం చాలా బాగుంది, అంతే బాగుంది హనుమంతరావు
    గారి అభిప్రాయం. దీనికి further గా వ్యాసాలు, అభిప్రాయాలు వచ్చి సుసంపన్నం చేస్తాయని ఆశిస్తున్నాను.

  7. 7
    సురేశ్ కొలిచాల January 7, 2007 6:35 am

    ప్రోత్సహిస్తూ అభిప్రాయాలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు! హనుమంత రావు గారు ప్రస్తావించిన స్వల్ప లోపాల గురించి:

    – గంటి సోమయాజి గారి పుస్తకం DLI లో దొరికింది. ఈ మాట పాఠకుల సౌలభ్యంకోసం వాటిని PDF రూపంలో ఇక్కడ ఉంచాను (Part I, Part II, Part III). భద్రిరాజు గారి పుస్తకం ఇండియాలో వెయ్యి రూపాయకే కొన్నాను. మిగిలిన పుస్తకాలన్నీ మా లోకల్ లైబ్రరీ నుండీ, ఎమరీ లైబ్రరీ నుండీ సేకరించినవే.

    – చిలుకూరి నారాయణ రావు గారి పుస్తకం “ఆంధ్ర భాషా చరిత్రము” నేను చదవలేదు గానీ ఆయన వ్యవహారిక వాదాన్ని సమర్థించిన వారిలో ఒకడని (బూదరాజు: వ్యవహారిక భాషావికాసం పే. 97), ఆయన సిద్ధాంత గ్రంథం నన్నయ భారత భాషను, సమకాలీన శాసన భాషను తులనాత్మకంగా పరిశీలించిన సమగ్ర రచనయని (భద్రిరాజు: భాషా, సమాజం, సంస్కృతి – అవతారిక పే x) ఆయన గురించి సదభిప్రాయాలే విన్నాను. అయితే ప్రాకృత భాషలలాగే తెలుగు భాషకూడా ప్రాచీన ఆర్య భాషల నుండి పుట్టిందని ఆయన 1937 లో చేసిన సిద్ధాంతానికి సమాధానం గానే గంటి సోమయాజి గారు 1947 లో సమగ్ర ఆధారాలతో, కూలంకష చర్చతో ద్రావిడ భాషా కుటుంబ సిద్ధాంతాన్ని నిరూపిస్తూ రాసిన “ఆంధ్ర భాషా వికాసము”.

    -పైశాచి భాష ఇండో-యూరోపియన్, ఇండో-ఇరానియన్ భాషా కుటుంబానికి చెందిన దర్దిక భాష (Dardic Language). గుణాఢ్యుని కాలంలో నేపాళీ దేశంలో ఈ భాష మాట్లాడి ఉండవచ్చు. [ “ఆంధ్ర భాషా వికాసము” పే. 75-80].

    – పేరు లేని విమర్శలు: రచయిత పేరును ప్రస్తావించకుండా విమర్శించడం గురించి ఒక సమీక్షకుడు (reviewer) కూడా అభ్యంతరం తెలియజేసాడు. వ్యక్తిగత దూషణ నా వ్యాసంలో ప్రధానాంశం కాకూడదనే వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం అంత ముఖ్యం కాదని అనుకున్నాను. తెలుగు పైశాచి భాష నుండి పుట్టిందనీ, అర్జునుడు అమెరికా వెళ్ళొచ్చాడనీ ఘంటాపథంగా చెప్తున్న రచయిత ఆంధ్రభూమిలో అంతర్యామిగా మసలే ముదిగొండ శివప్రసాద్ గారు. పాశ్చాత్య చరిత్రకారులు తమ స్వార్థం కోసం తిమ్మిని బమ్మిని చేసి తప్పుడు చరిత్ర బనాయించారని విమర్శించి “ఏది చరిత్ర?”, “ఇదీ చరిత్ర!” అన్న రెండు పుస్తకాలతో David Frawley-మార్కు చరిత్రను ప్రచారం చేస్తున్న రచయిత ఆంధ్రభూమి ఎడిటర్ ఎం. వి. ఆర్. శాస్త్రి గారు. “తెలిమన్ భాష తెలుగు భాష” అంటూ ప్రచారం చేసిన వారు సంయుక్త కూనయ్య, సంగనభట్ల నరసయ్య గార్లు. శ్రీకృష్ణుడు తెలుగు జాతి వాడే అని చెప్పింది రిటైరైన ఆర్కియాలజీ డైరక్టర్ వి. వి. కృష్ణశాస్త్రి గారు. భాషాపరంగా తెలంగాణ తెలుగు వేరు, ఆంధ్రం వేరు అన్న వాదాన్ని లేవనెత్తినవారు కనకదుర్గ దంటు గారు. [చిక్కేమిటంటే మన పత్రికల్లో రెండు వారాలకు మించి ఏ పత్రికా ఆర్కైవులు ఉంచక పోవడం].

    – సంస్కృతంలో దేశి పదాలను గూర్చి: ఒక పదం ద్రావిడ భాషలనుండి వచ్చిందని చెప్పడానికి ఈ విషయాలు తోడ్పడుతాయి (ద్రావిడ భాషలు: పి. ఎస్. సుబ్రహ్మణ్యం): 1. మిగిలిన ఇండో-యూరోపియన్ భాషలలో ఆ పదానికి సజాతి పదాలు లేకపోవడం 2. ద్రావిడ భాషలో ఆ పదం ప్రచురంగా ఉండడం 3. ద్రావిడ భాషలో దానికి వ్యుత్పత్తి ఉండడం లేక దాని ధాతువు నించి వచ్చిన ఇతర పదాలు కూడా ఉండడం 4. సంస్కృతంలో అదే అర్థాన్ని సూచించడానికి ఇతర పదాలు ఉండడం లేదా ఆ పదం మన దేశంలోనే ఉండే జంతువులూ, వృక్షాలు మొదలైన వాటిని సూచించడం.

    – గాథాసప్తశతిలో తెలుగు మాటల గూర్చి: ” పల్లి”, ” ఊరు”, “వాడ”, “వాడి” అన్న పల్లెల పేర్ల ద్వారా మహారాష్ట్రలో Dravidian Substratum ఉండేదన్న విషయం సుస్పష్టమే అయితే అది పూర్వ-తెలుగుకు (Pre-Telugu or Proto-South-Central Dravidian (SD2)) కు దగ్గరైన భాషో లేదా పూర్వ-తమిళ-కన్నడ (Proto-SouthDravidian (SD1)) భాషలకు దగ్గరైన భాషో తెలియాలంటే ఇంకా పరిశోధనలు జరగాలి.

  8. 8
    Sai Brahamanandam Gorti January 7, 2007 9:31 pm

    మనకంటూ శాస్త్ర పరిశోధనా పద్ధతి, ముఖ్యంగా భాష పుట్టు పూర్వోత్తరాల గురించి మొదలైంది 20 వ శతాబ్దం లోనే. పైగా ఈ పరిశోధనలకి మూల గ్రంధాలు సాహిత్యమే కదా! పలానా కావ్యంలో ఇలా రాసినట్లుగా ఉంది కాబట్టి ఆ కాలంలో పదాల వాడుక నిర్ధారించి కాల క్రంలో అవి ఎలా రూపాంతరం చెందాయో భాషా కోవిదులు వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది మీరంటునట్లుగా వారు చదివిన, విన్న వాటి నాధారంగా వాళ్ళ సొంత కవిత్వం కలిపి ప్రజల మీది రుద్దేస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య రాజకీయం ప్రవేశించి సాహిత్యం కూడా కలుషితం అయిపోతోంది. మాండలికానికి, మూలానికి అర్ధం తెలియని వారికి ఈ వ్యాసం కాస్త కనువిప్పు కలగజేసే అవకాశం ఉంది.

    ఆ మధ్య ఇంకో తర్కం చదివాను. మహమ్మదు ప్రవక్త భార తీయుడే ఆయన పేరు మహామతి అని, ఏసుక్రీస్తు పేరు ఈశు కృష్ణ అనీ, ఇలా చాలా కల్పిత తర్కాలు రాసేస్తునారు. పత్రికలవాళ్ళూ పంపిందే తడవుగా ప్రజలందరికీ అచ్చులో అందిస్తున్నారు.

    మంచి వ్యాసం. ఈ మధ్య వచ్చిన కొన్ని మంచి వ్యాసాల్లో ఇదీ ఒకటి.

  9. 9
    Lakshmanna Vishnubhotla January 9, 2007 7:33 am

    తెలుగు భాషపై ఈ మధ్య వివిధ పత్రికల్లో ఎన్నో అభిప్రాయాలను సద్విమర్శ చేసిన పరిశోధనా వ్యాసం ఇది! తెలుగులో ఇంత చక్కని వ్యాసాన్ని ప్రవాస ఆంధ్రుడు, ఒక ఔత్సాహిక విద్యార్ధిగా, రాయగలగటం గొప్ప విషయం. “సాహిత్యం ఒక కళ అయితే, భాషాశాస్త్రం విజ్ఞానశాస్త్రం” వంటి వాక్యాలు ఎంతో లోతైన ఆలోచన చేస్తే తప్ప రావు!

    ఈమాటలో ఇంత చక్కని వ్యాసం వచ్చినందుకు, సురేష్ కి నా అభినందనలు. ఈ వ్యాసం స్పూర్తితో మరెన్నో పరిశోధనా వ్యాసాలు రావాలని కోరుకొంటూ,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. 10
    సురేశ్ కొలిచాల January 10, 2007 10:18 am

    చిలుకూరి నారాయణరావు గారి ఆంధ్రభాషాచరిత్రము రెండవ సంపుటము (volume II) మాత్రమే DLI లో దొరికింది. అది PDF రూపంలో ఈ క్రింద ఇచ్చిన link ద్వారా download చేసుకోవచ్చు. అట్లాగే గత సంవత్సరంలో తెలుగు పత్రికలలో వచ్చిన వ్యాసాలు కొన్ని Internet లో కనిపించాయి. వాటి లింకులు కూడా ఇక్కడ ఇస్తున్నాను.

    – ఆంధ్రభాషాచరిత్రము – రెండవ సంపుటము (37.4MB)
    – తెల్‌మున్‌ భాష తెలుగు
    – ‘సుమేరు’లోనే వెలిగిన తొలి తెలుగు
    – తెలంగాణ గోదావరే ‘తెలివాహ’!
    – శ్రీ కృష్ణుడు తెలుగు జాతివాడే
    – తెలుగువేరు, ఆంధ్రం వేరు!

    రిగార్డులతో,
    సురేశ్ కొలిచాల
    —
    కొసమెరుపు: మోహన రావు గారు చెప్పినట్టుగా జీవశాస్త్రం, భాషాశాస్త్రం 19 వ శతాబ్దంలో కూడా ఒకదానిపై ఒకటి ప్రభావం చూపినట్టున్నాయి. ఈ క్రింది వ్యాసం Comparative Method పుట్టుకకు జీవశాస్త్రంలోని Comparative Anatomy ఆధారం అని వాదిస్తోంది:
    Where does the ‘Comparative Method’ Come from?

  11. 11
    SrinivAs vurupuTuri January 13, 2007 8:47 am

    సురేశ్ గారికి
    మీరు రాసిన భాషా శాస్త్ర వ్యాసం చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. మీకు నా అభినందనలు, కృతజ్ఞతలు.

    ఇంతకు మునుపు (నవంబర్ 2005) తెలుగు భాష వయస్సు గురించి రాస్తూ, మీరు “ఆర్య, ద్రావిడ పదాలు భాషా కుటుంబాలని సూచించే పదాలే గాని, రెండు వేర్వేరు జాతులని సూచించే పదాలు కావని శాస్త్రవేత్తల నమ్మకం. జన్యుశాస్త్రంలో సాధించిన అభివృద్ధి ఆధారంగా ఈ దశాబ్దంలో జరుపుతున్న పరిశోధనలు భారతదేశంలో ఆర్య, ద్రావిడ అని రెండు విభిన్నమైన జాతులు లేవన్న శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని ధ్రువపరుస్తున్నది” అన్నారు. ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఇంకొన్ని వివరాలు, లింకులు ఇవ్వగలరా?

    పాఠకుల అభిప్రాయాలపై స్పందిస్తూ, మీరు “ఏది చరిత్ర?” గురించి ప్రస్తావించారు. వీలుంటే, ఈ పుస్తకాన్ని, దాని జత పుస్తకాన్ని సమీక్షించగలరా? Any takers?

    శ్రీనివాస్

  12. 12
    కొడవళ్ళ హనుమంతరావు January 13, 2007 4:07 pm

    చరిత్ర, ‘శాస్త్రీయ’ దృక్కోణం

    శ్రీనివాస్,

    “తెలుగు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల పునరుజ్జీవనం కోసం నిస్వార్థ కృషి చేస్తున్న” అజో-విభో-కందాళం ఫౌండేషన్ నుండి “చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా చూడాలో, ఎట్లా చెప్పాలో, ఎట్లా రాయాలో అనే అంశాలమీద మనజాతి అలవరచుకోవలసిన దృక్పధాల్ని” శాస్త్రిగారు నిర్దేశించారని హార్దిక ప్రశంసలను అందుకున్న పుస్తకాన్ని,

    చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారిచే “భారతీయ చరిత్రకు దిద్దిన తిలకం”గా “శాస్త్రీయ ఆయుర్వేద సామాజిక బలవర్థక ఔషధం” గా కీర్తించబడ్డ గ్రంథాన్ని, క్లుప్తంగానన్నా సమీక్షించడానికి నాకు చరిత్రలో డిగ్రీ లేదు సరికదా,కనీసం ఔత్సాహికులకుండాల్సిన పరిజ్ఞానమన్నా లేదు.

    “చరిత్ర గతికి, కాలచక్ర గమనానికి సంబంధించినంతవరకూ అస్పష్టతకు తావు లేని ప్రాచీన భారతీయ సారస్వతాన్ని,” “క్షణంలో 1/300 వంతు అయిన వేధ నుంచి 30 కోట్ల 67 లక్షల సంవత్సరాలుండే మన్వంతరం వరకు, ఆపైన కూడా ఆధునిక కంప్యూటర్లకు సైతం అంతుబట్టనంత సూక్ష్మాతి సూక్ష్మ, స్థూలాతిస్థూల కాలగణన అనాదిగా సొంతమైన” భారతీయ మేధని అందుకోడానికి నేను ఎప్పుడో వెలగబెట్టిన కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఏమాత్రం పనికొస్తుంది?

    “ప్రాచీన భారత చరిత్రకు తిరుగులేని ప్రమాణాలైన భవిష్య, మత్స్య, బ్రహ్మాండ, విష్ణు, వాయు పురాణాలు” ఏమైనా చదివానా?

    ప్రాచీన సాహిత్యాన్ని చదవడమేకాక, భర్తృహరి కవిత్వం మీదనే అసమాన విమర్శ రాసి, లెక్కల్లోనూ జన్యుశాస్త్రంలోనూ కృషి చేసి, తనతో అంగీకరించని చరిత్రకారులచేత గూడా ఆద్యుడిగా ప్రశంసించబడ్డ కోశాంబి రచనలతోగానీ, వాటిని తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన బాలగోపాల్ పుస్తకంతోగానీ పోల్చడానికి, వాళ్ళు దేశద్రోహులూ, జాతిద్రోహులూ అయిన మార్క్సిస్టు వర్గానికి చెందిన కుహనా మేధావులాయె!

    భారతీయ ఆత్మని ఆవిష్కరించగల బ్రహ్మజ్ఞాన సంపన్నులెవరన్నా సమీక్షించడానికి అర్హులేమో!

    కొడవళ్ళ హనుమంతరావు

  13. 13
    Srinivas vurupuTuuri January 14, 2007 6:03 pm

    హనుమ గారికి
    మీ పొడవాటి వ్యంగ్యభరితమైన జవాబు చూసాక…
    మీరు ఆ పుస్తకం చదివారా లేదా తేల్చుకోలేకపోయాను. పురాణాల నుంచి చారిత్రిక ఆధారాలను సేకరించారని,సుప్రసిద్ధ చరిత్రకారులను (“మార్క్సిస్టు వర్గానికి చెందిన కుహనా మేధావుల”ను) ఆక్షేపించారని మీరు సూచించిన రెండు విషయాలే, ఈ పుస్తకానికి సంబంధించినవి గా తోచాయి.
    నేను, కొంతకాలం క్రితం “ఏది చరిత్ర?” చదివాను.హోల్ మొత్తంగా కాకపోయినా, మరీ బేసబబుగా అనిపించలేదు నాకు (అఫ్ కోర్స్, ఉత్సాహం కొద్దీ చదవటమే కానీ, చరిత్రగురించి నాకు పెద్దగా తెలీదు.మూల గ్రంథాలు చదివి నిజానిజాలని బేరీజు చేయటం నాతో అయ్యే పని కాదు). ఎప్పుడో,తీరిగ్గా ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాను. అందాకా…
    ఈ పుస్తకం ఉత్తి చెత్తే అనుకుందాం. కానీ, నా లాంటి uninitiated (I can’t think of the right word) పాఠకులను, నా లాంటి వారి నుంచి సెకండ్ హాండ్, థర్డ్ హాండ్ గా విని తెలుసుకునే వారిని ప్రభావితం చేయగలుగుతుంది అని అనుకుంటాను. ముఖ్యం, ఈ వాదనలు మళ్ళీ, మళ్ళీ వినిపిస్తూ ఉండటం వల్ల. ఆ ప్రమాదాన్ని నివారించేందుకైనా సరే,ఎవరైనా ఓ “చరిత్ర 101” రాస్తే బావుంటుందని అనుకుంటాను. ఏవంటారు?

    శ్రీనివాస్

  14. 14
    Rohiniprasad January 15, 2007 2:35 pm

    సురేశ్ గారి వ్యాసంలో భాష గురించిన పరిశోధనలన్నీ శాస్త్రీయ దృక్పథంతోనే జరగాలనీ, అందులో రాజకీయ ధోరణులకూ, ప్రాంతీయ దురభిమానాలూ, కక్షలూ, కావేషాలకూ తావుండకూడదనీ చక్కగా చెప్పబడింది.

    తెలుగు ద్రావిడభాష అనేది మద్రాసులో పుట్టి పెరిగిన నాలాంటివాళ్ళకు బాగా అనిపిస్తూ ఉండేది. తమిళంలోని కొన్ని పదాలే కాక త్రికసంధి పద్ధతిలో వాళ్ళు మాటలను ముడిపెట్టడమూ ఇత్యాదులన్నీ తెలుగులాగే అనిపిస్తాయి. పాత శాసనాల్లో ఇమ్మడి (రెండో), ముమ్మడి (మూడో) వగైరా విశేషణాలు కూడా ద్రావిడభాష మూలాలనే సూచిస్తాయనిపిస్తుంది.

    ప్రాంతీయంగా సురేశ్ గారు చెప్పినట్టు కన్నడిగులు ప అనేదాన్ని హ అని (తప్పుగా?) పలికినట్టే మలయాళంలో వత్స అనే మాటను వల్స అని తప్పుగా పలుకుతారని నాకు తెలుసు. ఎందుకంటే త్ అనే అక్షరం ల్ లాగా ఉంటుందట.

    మధ్య ఆసియాతో వేదకాలానికి వేల ఏళ్ళ మునుపే సింధు నాగరికతకు సంబంధాలుండేవనేది నిజమే. అక్కడి నిప్పూరు మొదలైన స్థలాల పేర్లు తెలుగులా అనిపిస్తాయి కాని కొందరు పరిశోధకులు చెపుతున్నది సింధు నది నాగరికతలో ప్రజలు మాట్లాడినది ద్రావిడ కుటుంబానికి చెందిన భాష అయి ఉంటుందనే. దానికి తిన్నగా తెలుగుతో ముడిపెట్టడం సబబుగా తోచదు. ఆ కాలంలో (క్రీ.పూ.2400-2000 ప్రాంతాల) అక్కడివారు మాట్లాడినది ద్రావిడ భాషే నని తేలితే అది తెలుగు, తమిళం మొదలైనవాటికి మాతృక అయి ఉండే అవకాశం ఉంటుంది. సంస్కృతం, ప్రాకృతం, పాలీ మొదలైన భాషలూ, బ్రాహ్మీ లిపీ అన్నీ తరవాతి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఇది నిరూపణ అయితే ద్రావిడ భాషలన్నీ (ఒక్క తమిళమే కాదు) అతి ప్రాచీనమైనవేనని తేలుతుంది. ఎందుకంటే సింధు నాగరికతకు బీజాలు బలూచిస్తాన్ లో క్రీ.పూ. 6500 నుంచీ ఉన్నాయట. అప్పటి నుంచి వేదకాలం (క్రీ.పూ. 1400 తరవాత) దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగిన సమాజ జీవితంలో కొన్నయినా ద్రావిడ భాషల మాతృకలు ఉండి ఉంటాయని అనుకోవచ్చు.

    మంచి వ్యాసాన్ని అందించిన సురేశ్ అభినందనీయులు.

  15. 15
    కొడవళ్ళ హనుమంతరావు January 15, 2007 10:32 pm

    శ్రీనివాస్,

    1. పుస్తకం చదవకుండానే పేరాలు కోట్ చెయ్యడానికి నేనేమీ స్వాములవారిని కాదుగదా! మీరు చదివినంత లోతుగా నేను చదివుండకపోవచ్చు. మీదృష్టీ నాదృష్టీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కావచ్చు.

    2. నేను రాసినదాంట్లో చివరి వాక్యం తప్ప మిగిలినదాంట్లో వెనక్కి తీసుకోవాల్సిందేమీ కనబడలేదు. శ్రుతి మించిన స్తోత్రాలకూ, సంయమనం లోపించిన “శాస్త్రీయ” విశ్లేషణకూ విరుగుడుగా కాస్తంత వ్యంగ్యం వాడాను. భావ్యం కాదంటారా?

    3. ఇవి రెండే ముఖ్యమైన విషయాలని గానీ, అదొక చెత్త పుస్తకమని గానీ నేనన లేదు. అక్బరు అంతఃపురం ఎంత వ్యభిచార కేంద్రమో, తాజమహల్ అసలు ఎందుకు హిందూ రాజ్ మహలో, … లాంటి వేడి వేడి కబుర్లనొదిలేసి, నేను అప్రధాన విషయాలని పట్టించుకున్నాననా మీ ఆక్షేపణ? ఇప్పటి వరకూ వచ్చిన చరిత్ర అంతా తప్పుల తడిక, అందుకు ఈ కుహనా చరిత్రకారులే కారణం, మన పురాణాల్లో వున్నవాటిని (కనీసం కాలానికి సంబంధించినంత వరకు) శాస్త్రీయంగా కోటా వెంకటాచలం గారు ఏనాడో నిరూపించారు, అంతకన్నా ఇంకేం కావాలి? అన్నవి రచయిత ఉద్ఘాటించిన ప్రధానాంశాలలో కొన్ని. నేను అసందర్భంగా కోట్ చేస్తే మీరు తప్పు పట్టండి.

    4. ఏదో ఒకటి రెండు పేరాలను తీసుకుంటే చాలదు, పుస్తకం మొత్తం మీద అభిప్రాయం వెలిబుచ్చాలంటారా? దానికి వేరే సందర్భం కావాలి. చరిత్ర గురించి మన జాతి అలవరచుకోవాల్సిన దృక్పధాలని ఆకాశానికెత్తేసే ప్రశంసల్ని చదివి, ఉండబట్టలేక ఒకటి రెండు రచయిత దృక్పధాలని ఉదాహరణలగా ఇచ్చాను.

    5. ఇంకా చాలా రాయొచ్చు కాని, దీనిని పొడిగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అదీగాక దీనికి సురేష్ వ్యాసంతో కొంత సంబంధమున్నా కాస్త దూరమైన విషయం. చరిత్ర మీదా, “ఏది చరిత్ర?” మీదా కూడా వ్యాసాలు రావాలి. ఆ విషయంలో మీతో ఒప్పుకుంటాను. ఎందుకంటే, కొడవటిగంటి కుటుంబరావు అన్నట్లు, “చరిత్ర గురించి శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటే అన్ని విషయాల గురించీ శాస్త్రీయంగా ఆలోచించగలుగుతాం.”

    కొడవళ్ళ హనుమంతరావు

  16. 16
    Bapa Rao January 19, 2007 5:45 pm

    చక్కటిదీ, చదివించేదీ, ఆలోచింపజేసేదీ ఈ వ్యాసం. ఇంతకు మించిన మెచ్చికోళ్లు పలువురి వంతపాడటం మినహా మరో ప్రయోజనాన్నివ్వవు. అందుకే, ఈ రచనని ఇంకా మెరుగు పరచడానికి నాకు తోచిన సూచనలనిచ్చి ఊరుకుంటాను.

    1. భాషాశాస్త్రం 101 కి పరిమితం చేసి ఉంటే బాగుండేది.

    ఈ వ్యాసానివి రెండు ముఖ్య విషయాలు (1) తులనాత్మక భాషాశాస్త్రాన్ని తెలుగుకి అన్వయించడాన్ని పరిచయం చెయ్యడం (2) దుష్తర్కభూయిష్టాలై, చదివేవాళ్లని సిగ్గిలజేసే వాదాలతో తెలుగుభాషకి ఉన్నాయో లేవో తెలియని గుణాలని అంటగట్టే రచనల్ని దుయ్యబట్టడం.

    (1) మీద కేంద్రికరించి, దాంతోపాటు భాషావిశ్లేషణ తరీఖాల్లో తగిలే జారుడుమెట్లని ఉల్లేఖించి, అంతటితో కట్టిపెడితే ఈ వ్యాసానికి మరింత సమగ్రతా, చక్కదనం చేకూరేవి. నిజమే, చెత్త విశ్లేషణలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. ఆ చిరాకే రచయితనకేఈ వ్యాసానికి పురిగొల్పిందన్న మాట కూడా నిజమే. చెత్తని నిరోధించవల్సిన ఎడిటర్లు, ప్రొఫెసర్లూ కొందరు స్వయంగా ఈ చెత్తకి పాల్పడటం మరీ దారుణం.

    అయినప్పటికిన్నీ, భాషాశాస్త్రం 101 వల్ల కొత్త విషయం తెలుసుకున్నామన్న ఆనందానికీ, కుశాస్త్రబుద్ధులని వాయించే తీవ్రతకీ పొంతన లేదు. రసాభాస విషయం అటుంచితే, ఈ రెండు విషయాలని కలబోయడం వల్ల వాటిల్లే పెద్ద ముప్పు మరొకటి ఉంది.

    ఈ చెత్త పుట్టుపూర్వోత్తరాలూ, స్థితిగతులూ పరిశీలించాలంటే, “మన వాళ్లు ఉట్టి వెధవాలోయి” అనేసి పబ్బం గడుపుకునే రోజులు చెల్లిపోయాయి. ఇలాంటి చెత్త “క్రియేషనిజం” లాంటి “అనిజాల” రూపంలో అమెరికాలోనూ ఉంది. కనుగొంటే అంతటా ఉంది. ఊరికే చెత్తని తిట్టేసి ఊరుకుంటే మజాగానే ఉంటుందిగానీ, ఆ తాత్కాలికానందం చెత్తకీ చరిత్రకీ ఉండే సంబంధాన్ని విడమర్చాల్సిన అవసరాన్ని విస్మరింపజేస్తుంది. ఈ చెత్త దానంతట అదే అధ్యయనీయ విషయం.

    2. రెండు విషయాల్ని కలబోస్తే ఒకదానికి అన్యాయం జరగచ్చు.

    a. Kuhn పండితుడు Structure of Scientific Revolutions వెలయించి అరశతాబ్దం కావస్తోంది. “Paradigm Shift” అని ఇప్పుడు కాకపోతే కాసేపటికి అనేసేవాడే ప్రతివాడూనూ. ఇప్పటికైనా శాస్త్రీయ పరిశోధన అనేది క్రమపద్ధతిలో, మునుపటి తప్పులని దిద్దుకుంటూ అలాగ్గా పురోగమిస్తుందనే అపప్రథని ప్రచారం చెయ్యడాన్ని నిషేధిస్తే మంచిది. స్థూల స్థాయిలో చూస్తే సైన్సు తన సిద్ధాంతాల్ని ఒక పట్టాన మార్చుకోదనీ, వస్తేగిస్తే అలాంటి సైద్ధాంతి పరిణామం విలయానికేమీ తక్కువకాదనీ ఒప్పుకుతీరాలి. కుశాస్త్ర తరీఖాలని చెండే వ్యాసంలో శాస్త్రగతి తీరుగురించి పాతరోజుల పడికట్టురాళ్లనే తిరగదోడటం అభ్యంతరకరం. .

    b. పాశ్చాత్య పాలకులు మనల్ని చిన్నబుచ్చడానికి పన్నిన వెధవ పన్నాగమే ఈ సైన్సంతా అనే వాళ్లది తెలిసీ తెలియని వాదమే కావచ్చు. కానీ అటువంటి అజ్ఞానాన్నీ, అమాయకత్వాన్నీ ఖండించబూనుకున్న వ్యాసంలో కేవలం విలియం జోన్సులాంటి దిట్టల పేర్లు ఉటంకించి, దాంతో పూర్వపక్షం పని పూర్తయిపోయిందనిపిస్తే ఏమన్నట్టు? తెల్లవాడు నిన్నగాక మొన్నటి దాకా మానవశాస్త్రం పేరుతో పుర్రెల ప్రమాణాలు కొలిచి తెల్లజాతి ఎక్కువా, నల్లజాతి తక్కువా అని నిరూపించడానికి నానా తిప్పలూ పడ్డాడు. బుద్ధిపూర్వకంగా కొంతా, అసంకల్పిత దురభిప్రాయాల వల్ల కొంతా, సాంఘికశాస్త్రాల్లో నానా కంగాళీ చేసారు పాశ్చాత్యులు. సూక్ష్మంగా ఎందరో మహానుభావులుండినా, స్థూలంగా తెల్లవాడి సైన్సుని అనుమానంగా చూసేవాడు ప్రతివాడినీ దురభిమానమే నెడుతోందనేయడం చరిత్ర వాస్తవాలని విస్మరించడమే అవుతుంది.

    ఇక్కడ అసలు సమస్య ఇంత విషయాన్ని మరో అంత విషయంతో ఒకే వ్యాసంలో కూరితే వచ్చిపడే అనర్థం.

    3. ఈ దురవస్థకి వనరుల లేమే కారణమా?

    ఈ రంగంలోని తెలుగువాళ్లల్లో భద్రిరాజు, బూదరాజు తదితరులవంటి మహనీయులు ఉన్నారని రచయిత ప్రస్తావించారు. వనరుల లేమి వీరికేమీ అడ్డంకి కాలేదు. భాషాశాస్త్రం కణభౌతికశాస్త్రం లాంటిది కాదు–దీనికి పెద్ద ఎత్తున యంత్రాలూ, దినుసులూ అవసరం లేదు. మేధస్సులూ, పుస్తకాలూ, ఇంటర్నెట్టూతో చాలా దూరమే పోవచ్చును. ఉన్నతస్థాయి పండితుల ప్రభావపంకిందిస్థాయి వారిమీద ప్రసరించలేదంటే అందుకు సంస్థాగత కారణాలుంటాయి. కుసంస్థకి డబ్బుపోస్తే ఫలితాల్నిస్తుందా? అన్న విషయం అలోచించాలి. అదిన్నీ భాషాశాస్త్రం 101 తో కాకుండా విడిగా.

    4. భాషాశాస్త్రం 101 ని మరికాస్త దూరం తీసుకెళ్లాలి

    పదజాలమే కాకుండా వ్యాకరణ నిర్మాణం కూడా తులనాత్మక అధ్యనానికి ఉపకరిస్తుందా? ఉదాహరణకి తెలుగు సంధులూ, తమిళ సంధులూ, సంస్కృత సంధులూ పరస్పరం పోలిస్తే తెలిసేది ఏమిటి? అలాగే సమాసాల విషయంలో.

    5. ఈ ప్రయత్నాన్ని (భాషాశాస్త్రం 101) ముందుకు తప్పక తీసుకెళ్లాలి. ఇతరత్రా ప్రచురించిన పక్షంలో తదుపరి అధ్యనానికి ఉపకరించే విధంగా annotated references and links అందిస్తే ధన్యులం.

    6. ఇక మీద దయచేసి spell checker వాడి Correspondance వంటి నిష్కారణమైన మీటపాట్లని తప్పించి మమ్మల్ని రక్షించాలి.

    సద్భావనలతో,
    కొచ్చెర్లకోట బాపా రావు

  17. 17
    విప్లవ్ January 21, 2007 5:31 am

    “భాషాశాస్త్రం 101 వల్ల కొత్త విషయం తెలుసుకున్నామన్న ఆనందానికీ, కుశాస్త్రబుద్ధులని వాయించే తీవ్రతకీ పొంతన లేదు.”

    నేను రాద్దామనుకున్న ముచ్చటను బాపారావు గారు చెప్పేశారు, కానీ ఆయన ఒకప్పటి “ఆంధ్ర పత్రిక” భాషలో చెప్పారేమో అనిపించి నేను చెప్పాలనుకున్నది నాకు తోచినట్టు రాస్తున్నాను.

    పట్టపగలు నాలుగు రోడ్లు కలిసే బజార్లో, చీకటి వేశ్యాగృహాల్లో, తెలుగు పత్రికల్లో జరిగే చర్చలను ఆధునిక దేవాలయాల్లో మళ్ళీ చర్చించడం వాటికి కొంత లెజిటిమసీ ఇవ్వటమే. (“ఈ మాట” ను దేవాలయంతో పోల్చే ఉద్దేశం నాకు లేదు. కానీ ఆ ప్రమాణాలు, విలువలకుండే తేడాను చూపించటానికి ఆ మాత్రం contrast చూపించాలనున్నాను.)

    ఏ కల్లంలో గింజలు అక్కడే తూర్పార పట్టాలి అని నేనకుంటాను.

    ఒక వేళ వేరే ఒక వ్యంగ్య చిత్రమేదైనా గీయదలచుకుంటే వ్యధ సిరీస్ మీద మాధవ్ రాసినట్టు ఒకట్రెండు ఎపిసోడ్స్ రాసుకోవచ్చు.

    సురేశ్ రాసిన మిగతా విషయాలు అవి చెప్పిన కోణం ఇప్పట్లో మెయిన్ స్ట్రీం తలకెక్కవు — వాటికి పాట్రొనేజ్ తక్కువ. సుమేరియన్లు మనకు వేలు విడిచిన మేనమామ పినతండ్రి అక్క ఆడపడుచుకు దూరపు చుట్టాలేమో అనుకునే భావన, వాళ్ళ భాషకూ మన దానికీ ఉన్న లింకు అంతకంటే దగ్గరిదే అయి ఉండొచ్చు అనే వాదనకున్న పస శాస్త్రానికి అందదు, ఉండదు.

    ఇక తెలుగు, ఆంధ్రం ప్రస్తావన రాజకీయమైనది, దానికీ భాషకూ సంబంధమే లేదు. “ఆంధ్రం పేరుతో ఆంధ్ర భాష లేక భావనను ఒక కొత్త జాతిగా మలిచి విస్తరించడం పాత కొలోనియల్ ఇచ్చులు కచ్చకాయలను చూపెడుతుంది” అన్నది ఇప్పటి తెలంగాణ భాషా, జాతి రాజకీయ సమీకరణాల నేపధ్యం. దేని బలం, పస ఎంత అన్నది రాజకీయపు నాలుగు రోడ్ల బజార్లో మాత్రమే తేలవలసింది. “చెప్పిండు” “వచ్చిండు” వంటి వాడుకలు మార్జినలైజ్ చేసి భాష పేరుతో గుండు గుత్తకు ఆధిపత్యాన్ని ప్రకటించడాన్ని నిరసించడానికి ఎటువంటి అస్త్రం అయినా ప్రస్తుతం సమర్ధనీయమే అన్నది తెలంగాణలో మెజారిటీ నమ్మే విశయం. “మెజారిటీ” “ప్రాతినిధ్య భావన” లాంటివి రాజకీయమే తప్ప మరొకటి కాదు, ఇదే నాణానికి వేరొకవైపు, ఇన్నాళ్ళూ మెజారిటీ పేరుతో చెలామణీ అయిన ఆంధ్ర భావన, భాష.

    ఇవన్నీ ఇక్కడ కాక తెలుగు పత్రికల్లో తేల్చుకోవటమే మంచిదని నా నమ్మకం కాబట్టి ఇక నా డిస్కషన్ ఉండదు ఇక్కడ వీటి మీద.

    ఇకపోతే కామేశ్వర రావు గారు “సాహిత్యకారులు” మీద చెప్పింది కరెక్ట్. సురేష్: ప్రస్తుతం బ్రతికున్న ఆ సాహిత్యకారులెవరో (లేక చర్తిరకారులెవరో) ఒక లిస్టు ఉంటే రాయండి, వల్లంపాటి పోయాక ఆ లిస్టు మరీ చిన్నదై పోయిందనుకుంటాను. అయినా, ఈ మధ్య (ఈ వంద కోట్ల ట్రెజర్ హంట్ మొదలైనంక) భాషా చరిత్ర మీద రాసిన పై లిస్టులో చేర్చవలసిన చరిత్ర కారులు లేక సాహిత్య కారుల వ్యాసాలు కానసలు ఏవైనా ఉన్నాయా? అవి లేకపోతే కామేశ్వర రావు గారు చెప్పిన వాక్యం ఇందులోనుండి ఎడిట్ చేయాల్సిందే. If I were a reviewer I would insist.

    విప్లవ్

  18. 18
    సురేశ్ కొలిచాల January 22, 2007 10:40 am

    భాషా చరిత్రల పై నాకున్న ఆసక్తి వ్యాపకంగా మారటానికి ప్రేరకులు, కారకులైన కొద్ది మంది వ్యక్తులలో బాపారావు గారొకరు :-]. గత కొంత కాలంగా తెలుగు చర్చావేదికలకు దూరంగా అజ్ఞాతంలో ఉంటున్న బాపారావు గారు ఈ వ్యాసం కారణంగానైనా మరుగుదాటి తెర ముందుకు రావడం నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా ఈమాటలోనూ, మిగిలిన చర్చావేదికలలోనూ ఆయన తన విలక్షణమైన విశ్లేషణా శైలిని ప్రదర్శిస్తూ తిరిగి వ్యాసాలు రాయాలని, రాస్తారని నా ఆశ.

    ఇక ఈ వ్యాసాన్ని మెరుగు పరచడానికి ఆయన చేసిన సూచనలు:
    1. భాషాశాస్త్రం 101 కి పరిమితం చేసి ఉంటే బాగుండేది.
    నిజానికి ఈ వ్యాసంలో “తెలుగు పత్రికల్లో భాషావ్యాసాల తీరు” అన్న విభాగం ఆఖరి నిమిషంలో కూర్చిందే. కుతర్క వాదాల గురించి కొంతైనా విపులంగా ప్రస్తావించక పోతే, తెలుగు పత్రికలు అంతగా చదవని పాఠకులకు భాషాశాస్త్రం-101 యొక్క ఆవశ్యకత అర్థం కాక ఈ వ్యాసం పరమ బోర్ గా తయారవుతుందని ఒక సమీక్షకుడు చేసిన సూచన, నాకు కూడా సబబే అనిపించి ఆ విభాగం చేర్చాను.

    2a. కూన్ పండితుని “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” గురించి, సామాజిక-విజ్ఞాన (Social Sciences) రంగాలలో ప్రత్యక్ష్యోత్తర (అంటే Post-Positivist:-)) వాదం గురించి గానీ ప్రస్తావించడానికి భాషాశాస్త్రం-101 సరైన చోటు కాదేమో. అయినా ఒక విప్లవాత్మకమైన కొత్త ఆలోచనా-రూపావళి (Paradigm) ద్వారా ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలకైనా పరిష్కారం చూపించేంత వరకూ ప్రస్తుత రూపావళి చట్రంలోనే (within the frame of the current paradigm కి వచ్చిన తిప్పలు) ఇతర పరిశోధనలను విమర్శంచడం కద్దు. అంతేగాక, శాస్త్రగతిలో రూపావళి మార్పు (Paradigm-shift) ని ప్రస్తావిస్తూ భాషాశాస్త్రం-301 రాయడానికి అవసరమైన శిక్షణా, సామర్థ్యాలు నాకు లేవు.

    2b. భారతీయ భాషలపై పరిశోధన చేసిన పాశ్చాత్య పండితులందరూ ఏ రకమైన జాత్యంకారము, దురభిమానాలు లేని మహానుభావులని కీర్తించడం నా ఉద్దేశ్యం కాదు. మానవ సహజమైన అభిజాత్యం అందరిలోను ఉండి ఉండవచ్చు. అదీకాక, వారు ప్రతిపాదించిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలను అప్పుటి ఆంగ్ల ప్రభువులు, క్రిస్టియన్ మిషినరీలు, స్వాతంత్ర్యానంతరం మన తమిళ నాయకులు, తమ తమ ప్రయోజనాలకోసం వాడుకోని ఉంటే ఉండవచ్చు. కాని పాశ్చాత్య శాస్త్రజ్ఞులందరూ ఎంత దురభిమానులైనా వారి పరిశోధనల్లో శాస్త్ర ప్రమాణాలను పాటించడంలో ఒక రకమైన చిత్తశుద్ధి, నిబద్ధతా చూపించారని నాకనిపిస్తోంది.

    3. పాండిత్యం రాణించాలంటే ప్రతిభతో పాటు వ్యుత్పత్తి, అభ్యాసాలు అవసరమని మన లాక్షణికులు చెప్పారు కదా. వనరులు అంటే నా దృష్టిలో training and infrastructure: అత్యుత్తమ స్థాయిలో పరిశోధనలు చేయడానికి తగిన శిక్షణ, ప్రోత్సాహం (grants, సంఘంలో గుర్తింపు), వాతావరణం (నిరుపహతి స్థలంబు, తప్పు మెప్పరయు లేఖక పాఠకోత్తముల్ వగైరాలు మాత్రమే కాదు) లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది మట్టిలో మాణిక్యమే. నా దృష్టిలో భద్రిరాజు, చేకూరి గార్లు భాషా శాస్త్రజ్ఞులుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి వారు అమెరికా విశ్వవిద్యాలయాల్లో పొందిన శిక్షణే కారణం (ఎమెనో గారి వద్ద శిష్యరికం వల్లే తను ఇంతవాడయ్యాడన్న భద్రిరాజు గారి మాటల్లో అతిశయోక్తి లేదు). అద్వితీయమైన ప్రతిభ ఉండీ కూడా బూదరాజు గారు అంతగా శాస్త్ర పరిశోధనలు చేయ(లే)కపోవడానికి కూడా ఈ శిక్షణ లేమి కారణమని నా అనుమానం.

    4. ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే భాషా సంబంధ నిరూపణకు ధ్వనులు (phonemes), శబ్దాలు (morphemes), పదజాలం (vocabulary) తోడ్పడినంతగా వేరే వ్యాకరణాంశాలు ఉపయోగపడవు. కాలగతిలో ఒక భాషలో లింగ (gender), కాల (tense), వాక్య నిర్మాణాది (syntax) వ్యాకరణాంశాలలో ఎన్నో మార్పులు సంభవించినప్పటికీ ప్రాథమిక శబ్దాలు మాత్రం అంతగా మార్పు చెందవన్న అంశం తులనాత్మక పద్ధతి (Comparative Method) కి మూలాధారం. అందుకే అంతకు ముందు పద్ధతులైన Comparative Philology, Comparative Grammar లను తోసిరాజని గత శతాబ్దంలో చారిత్రాత్మక భాషా పరిశోధకుల అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రంగా మారిన ఉపకరణం ఈ Comparative Method. Agglutinative భాషలైన తెలుగు, తమిళాదులలో సంధుల గురించి నాకు వేరే అభిప్రాయాలున్నాయి. వాటి గురించి వేరే ఎప్పుడైనా ముచ్చటిద్దాం.

    5, 6. తదుపరి వ్యాసాల్లో మీ సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాను.

    ఇకపోతే విప్లవ్, కామేశ్వర రావు గార్లు “సాహిత్యకారుల” గురించి చెప్పింది కొంతవరకు కరెక్టే. కానీ ఈ వ్యాసాలు రాసిన వారందరికీ తెలుగు సాహిత్యంతో పరిచయమున్నంతగా విజ్ఞానశాస్త్ర రంగంలో పరిశోధనకు కావల్సిన అవగాహన, శిక్షణ లేవనే నా అభిప్రాయం. అదీ కాక నేను ఆ వాక్యం రాస్తున్నప్పుడు మనసులో అనుకున్న మాట చెప్పేస్తున్నాను: “నాటి కవి సామ్రాట్టు నుండి నేటి నవలా చక్రవర్తి వరకూ భాషా చరిత్రలపై వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు.” సాహితీ క్షేత్రంలో విశ్వనాథ సత్యనారాయణ గారు సామ్రాట్టులే గాని, చరిత్ర అధ్యయనం లో కాదని నా చిన్ని అభిప్రాయం.

    “ఏ కల్లంలో గింజలు అక్కడే తూర్పార పట్టాలి” అన్న విప్లవ్ కోరిక ప్రకారమే నా వ్యాసాన్ని తెలుగుదేశంలోని ఓ పత్రికకు పంపించాను. ఈ కోణానికి మెయిన్ స్ట్రీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.

  19. 19
    G. Anand January 23, 2007 10:41 am

    ఈ వ్యాసం చాలా ఉపయోగకరంగా ఉంది.

    “భాషాశాస్త్రం 101 వల్ల కొత్త విషయం తెలుసుకున్నామన్న ఆనందానికీ, కుశాస్త్రబుద్ధులని వాయించే తీవ్రతకీ పొంతన లేదు.”

    “భాషాశాస్త్రం 101 లో కొత్త విషయాలను పాఠకులను అనందింపజేసేలా తెలియచెప్పిన తీరుకూ, కుశాస్త్రబుద్ధులను వాయించే తీవ్రతకూ పొంతన లేదు” అన్నది బాపారావుగారి ఉద్దేశమయి ఉండాలి.
    (భాషాశాస్త్రం పై చర్చలో వ్యాకరణ దోషం చూడలేక).

  20. 20
    Kameswara Rao January 23, 2007 10:54 am

    సురేశ్ గారూ,

    విశ్వనాథ వారు భాషా చరిత్రపై రాసిన వ్యాసాలు గురించిన వివరాలు కొంచెం ఇస్తారా? అతని వ్యాసాలలో అక్కడక్కడ కొన్ని భాషా చరిత్రకి సంబంధించిన విషయాలు ప్రస్తావనకి రావడం తెలుసుకాని, భాషా చరిత్ర గురించిన వ్యాసాలు నాకు తెలీదు. అతన్ని భాషా శాస్త్రవేత్తగా ఎవరూ పరిగణించినట్టుగా కూడా నాకు తెలీదు. భారత దేశ చరిత్రగురించి అతను పాశ్చాత్యులతో విభేదించడం తెలుసు. అదికూడా అతను శాస్త్ర పద్ధతిలో కాక, తన అభిప్రాయాలను నవలల రూపంలోనే ప్రకటించారు. అంచేత విశ్వనాథ కూడా తనకి తాను చరిత్రకారుడినని భావించలేదనే అనుకోవాలి. మరి మీకా అనుమానం ఎందుకొచ్చింది?

    విప్లవ్ గారు నా మొదటి అభిప్రాయంలో అన్న మాటలని కొంత అపార్థం చేసుకున్నారేమో అనిపించింది. సురేష్ గారన్న దాంట్లో “చాలా మంది” సాహిత్య కారులు అన్న దానితోనే నేను విభేదిస్తున్నాను కానీ ఒక్కరూ సాహిత్య కారులు కాదు అన్నది నా ఉద్దేశం కాదు. పైగా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాబట్టి దీని గురించి చర్చ కొనసాగించడం అనవసరం.

  21. 21
    సురేశ్ కొలిచాల January 23, 2007 12:43 pm

    కామేశ్వరరావు గారు,

    అనవసరంగా విశ్వనాథను ఈ చర్చలోకి లాగినందుకు నాకు సరైన చురకలే అంటించారు. మీరు చెప్పింది నిజమే: ఆయన భాషా చరిత్ర లపై తనకున్న అభిప్రాయాలను వ్యాసాల రూపంలో రాయలేదు. అయితే ఆయన రాసిన “పురాణ వైర గ్రంధమాల (12 నవలలు)”, “నేపాల రాజ చరిత్ర (ఆరు నవలలు) “, “కాశ్మీర రాజ చరిత్ర (ఆరు నవలలు)” లోని చారిత్రక అంశాలన్నీ తాను చిలుకూరు వీరభద్రరావు మొదలైన చరిత్ర పరిశోధకుల నుండి నేర్చుకొన్నవి లేదా తను స్వయంగా శ్రమపడి పరిశోధించినవేనని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. యువభారతి వారు 1972లో ప్రచురించిన “మహతి” లో “నేనూ నా సాహిత్య రచనలు” అన్న అంశం మీద ఆయన రాసిన వ్యాసంలోని ఈ పంక్తులను గమనించండి:

    “ఈ ఇరువది నాల్గు నవలలలో మన పురాణములలో ఆయా చరిత్రములలో నున్న యంశములు తారీఖుల ప్రకారము కాలమును చూపించితిని, సందర్భములను వివరించితిని. చరిత్రలోని ప్రధానాంశములను వదలి పెట్టలేదు. … అందరునూ నేను పడ్డ శ్రమ పడరు …”

    “మన చరిత్ర విస్పష్టముగా నున్నది. మన పురాణములయందలి మగధరాజ వంశాదుల యందలి యధార్థ చరిత్ర ననుసంధించి నేను పురాణవైర గ్రంధమాలను పండ్రెండు నవలలను వ్రాసితిని. అందులో చంద్రగుప్తుని స్వప్న మన్న నవల గుప్త చంద్రగుప్త, మౌర్య చంద్రగుప్తుల భేదమును చెప్పునది.”

    “ఆంధ్ర చరిత్ర త్రవ్వి త్రవ్వి పరమ రహస్యములు కొన్ని “ఆంధ్రప్రశస్తి” లో, కొన్ని నవలలుగా “స్నేహ ఫలము” “చందవోలు రాణి”ముదలైన గ్రంధములలో వ్రాసితిని”

    “నేను నిద్రాహారములు లేకుండ సంపాదించిన విజ్ఞానమంతా నా నవలలలో, పుస్తకములలో ఉంటుంది.”

    అయితే భారతీయు చరిత్ర గురించీ, తెలుగు భాషా చరిత్ర గురించి ఆయన రాసిన విశ్లేషణలను పరికిస్తే, ఈ మధ్య భాషా వ్యాసాలు రాసే కొంతమంది రచయితలకు స్ఫూర్తి ఎక్కడిదో అర్థమవుతుంది. అందులో మచ్చుకు కొన్ని:

    “”ఫిలిప్పైన్ ద్వీపము కింద మాండెనో అని ఒక ద్వీపమున్నది… అక్కడ ఆదిమ వాసులు తివోలిజాతి. వాళ్ళ ఆచారములు ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ ఆచారములు. వాళ్ళ భాష పేరు తెగలాగ్ – తెలుగు అన్నమాట.”

    “”కాల్డ్వెల్ ఆఫ్గాన్ స్థానములో బ్రహూయీ అను ఒక భాష యున్నదనీ, ఆ భాషకూ మన తెలుగు భాషకూ పలు విషయాలందు సామ్యమున్నదని వ్రాసినాడు. శాతవాహను లాంధ్రులు – వారు భారత సామ్రాజ్యమును పాలించునప్పుడు ఆయా ప్రాంతములందలి అధిపతులందరు నాంధ్రులై యుందురు. ఆనాటి ఆఫ్గాన్ స్థానములో నెవడో ఆంధ్రుడు అధిపతియై ఆ ఆటవికులచేత మన భాష చదివించియుండును. దీని లక్షణములక్కడ పాతుకుపోయినవి”

  22. 22
    కొడవళ్ళ హనుమంతరావు January 24, 2007 12:06 am

    “శాస్తవేత్తలకే గోచరించని Kuhn శాస్త్రీయ స్వరూపం!”
    ”The Structure of Scientific Revolutions” అంటే “శాస్త్రీయ విప్లవాల స్వరూపం” అన్నది నచ్చింది. ”Paradigm Shift” అంటే “రూపావళి మార్పు” అన్నది శ్రావ్యంగా ఉంది గాని, మాట వివరిస్తే తప్ప మనసుకి తట్టదు. ప్రతిమానం అంటే పరవాలేదేమో. ఆలోచించే తీరు, దృక్పథం అంటే సులభంగా అర్థమవుతుంది నాకు. ”Post-positivist” అంటే “ప్రత్యక్ష్యోత్తర” అన్నది మాత్రం ఇంగ్లీషులోనూ అంతకంటే మిన్నగా తెలుగులోనూ కర్ణకఠోరంగా ఉంది. ఆధునికోత్తర వాదం లాంటిదా ఇది? ఇవి పంటికింద పడిన రాళ్ళలా బాధిస్తాయి.

    ఇంతకీ నేను చెప్పదలచుకున్నది అనువాదాల గురించి కాదు. సురేష్ తన వ్యాసంలో అన్న మాట:

    ఒక శాస్త్రవేత్త తయారు చేసిన సిద్ధాంతానికి తరువాతి తరం శాస్త్రవేత్తలు మెరుగులు దిద్దటం కానీ, లోపాలు సవరించడం గాని శాస్త్రపరిశోధనారంగంలో ఎల్ల కాలాల్లోను జరుగుతున్న పని.
    దానికేననుకుంటాను, బాపారావు గారు కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు:
    Kuhn పండితుడు Structure of Scientific Revolutions వెలయించి అరశతాబ్దం కావస్తోంది. “Paradigm Shift” అని ఇప్పుడు కాకపోతే కాసేపటికి అనేసేవాడే ప్రతివాడూనూ. ఇప్పటికైనా శాస్త్రీయ పరిశోధన అనేది క్రమపద్ధతిలో, మునుపటి తప్పులని దిద్దుకుంటూ అలాగ్గా పురోగమిస్తుందనే అపప్రథని ప్రచారం చెయ్యడాన్ని నిషేధిస్తే మంచిది. స్థూల స్థాయిలో చూస్తే సైన్సు తన సిద్ధాంతాల్ని ఒక పట్టాన మార్చుకోదనీ, వస్తేగిస్తే అలాంటి సైద్ధాంతి పరిణామం విలయానికేమీ తక్కువకాదనీ ఒప్పుకుతీరాలి. కుశాస్త్ర తరీఖాలని చెండే వ్యాసంలో శాస్త్రగతి తీరుగురించి పాతరోజుల పడికట్టురాళ్లనే తిరగదోడటం అభ్యంతరకరం. .

    వారిద్దరి రాతల్ని బట్టి వాళ్ళు నాకన్నా ఈవిషయాల్లో బాగా తెలిసినవాళ్ళని తెలిసినా, బాపారావు గారు అన్నదానికి అభ్యంతరం తెలపక తప్పడం లేదు. వారు Kuhn గురించి అన్న నాలుగు మాటలకి నేనింత చాటభారతం రాయడం అసందర్భం అనిపించవచ్చు. కాని శాస్త్రీయ పద్ధతులూ స్వరూపం ఈ వ్యాసానికీ జరుతున్న సంభాషణకీ ముఖ్యమనిపించి, మిడిమిడి జ్ఞానంతోనే సాహసిస్తున్నాను. ఎందుకంటే:

    శాస్త్ర చరిత్రకారుడైన Thomas Kuhn సైన్సు స్వరూపాన్నీ స్థితిగతుల్నీ బట్టబయలు చేసి శాస్త్రీయ అవగాహనలో ఓ నూతనోధ్యాయాన్ని సృష్టించాడంటారు కొందరు. సైన్సు “వాస్తవికత”కి దగ్గరగా రావడమన్నదాంట్లో అర్థం లేదనీ, ఓ ప్రతిమానాన్ని నమ్మిన శాస్త్రవేత్తలు దానికి లోబడి వున్న సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారనీ, కాని కొన్ని చిక్కువిడని సమస్యల్ని తీర్చడానికి కొత్త ప్రతిమానాన్ని ప్రతిపాదిస్తారనీ, కొన్నాళ్ళకి దాంట్లోనూ తీర్చలేని సమస్యలుండి, మరో కొత్త ప్రతిమానాన్ని ప్రవేశపెడతారనీ, అది పాతదాన్ని స్థానభ్రంశం చేస్తుందనీ, ఇదే శాస్త్ర స్వరూపం – ఇది Kuhn సారాంశం అనుకుంటాను.

    ఒక ప్రతిమానం మరొకదానికంటె మిన్న అని చెప్పడానికి వాస్తవమైన ఆధారమేమీ లేదు, మిగిలిన శాస్త్రవేత్తలని నమ్మించగలిగితే చాలు అదే నెగ్గుతుంది, అన్నది ఆయన భావన అని అర్థం చేసుకున్నాను. సైన్సు, శాస్త్రవేత్తలు చేసే వ్యాఖ్యానం మాత్రమే, అదొక రకమైన “భాషా క్రీడ”; అంతేగాని కాలం గడిచేకొలదీ సైన్సు “సత్యానికి” దగ్గరగా వస్తుందనటంలో అర్థం లేదన్నది Kuhn వాదన.

    అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే Kuhn తో అంగీకరించరు [1]. Structure లో చెప్పిన ప్రతిమానాల చిత్రీకరణతో ఒప్పుకునే శాస్త్రజ్ఞుల పేర్లివ్వమని బాపారావు గారిని కోరుతున్నాను.

    శాస్త్రవేత్తల కన్నా Kuhn ప్రభావితం చేసింది ఓ తరహా తత్వవేత్తలనీ, సాహిత్యకారులనీ. వాళ్ళకీ శాస్త్రవేత్తలకీ చుక్కెదురు! ఒక తత్వవేత్త అయితే, భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజేకాదు, ఆశాస్త్రంలో వాళ్ళ పేరుమీద కొన్ని సూత్రాలున్నా కూడా, వాళ్ళకి జ్ఞానమీమాంస (epistemology) గురించి ఏమీ తెలియనప్పుడు నోటికొచ్చినట్లు వాగకూడదని Kuhn ని విమర్శించినందుకు కొందరు శాస్త్రవేత్తలని అమర్యాదగా తిట్టిపోశాడు [2].

    నా ఉద్దేశంలో శాస్త్రవేత్తలు కాని వాళ్ళు సైన్సు గురించి రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. Quantum Mechanics మూలంగా సైన్సు సత్యాన్ని నిశ్చయంగా తెలుసుకోలేదని రుజువయింది కనుక సైన్సుకి ఆధునికాంతర కాలంలో వేరే అర్థం, ప్రాముఖ్యతా ఇవ్వాలనే వాళ్ళు వాళ్ళ పరిథిని దాటి పోతున్నారని నా అనుమానం [3].

    నామటుకి నాకు ఇవన్నీ అర్థమయానని అనలేను కాని, ఇవి చదవడం వలన ఎవరికీ ఎలాంటి హానీ కలిగిందనుకోను. ఈ భిన్నాభిప్రాయాలలో వేటినీ నిషేధించాల్సిన అవసరం కనబడటం లేదు. నిజం చెప్పాలంటే, Kuhn భావనలని వక్రీకరించి కుశాస్త్రానికి దోహదం చేస్తున్న వాళ్ళు మిక్కిలి హానికరమనుకుంటాను [4].

    బాపారావు గారు, తిరుపతిరావు గారు, Thomas Kuhn, Richard Rorty – వీళ్ళనెవరినీ నేను హానికరమైన వాళ్ళ జాబితాలో చేర్చడం లేదని మనవి.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    1. “The Revolution That Didn’t Happen,” Steven Weinberg, The New York Review of Books, Volume 45, Number 15, October 8, 1998. ఈయన University of Texas at Austin లో Physics professor. చాలా పేరున్న శాస్త్రవేత్త, 1979 ఫిజిక్స్ నోబెల్ గ్రహీత. తన నలభై-ఏభై ఏళ్ళ శాస్త్ర పరిశోధనా జీవితంలో ఎన్నో విప్లవాత్మకైన మార్పుల్ని చూసినా, సిద్ధాంతం సరైనదా కాదా అని పరిశీలించే తీరులో పెద్ద మార్పేమీ లేదనీ, Kuhn ప్రకటించిన Paradigm Shift లాంటివేమీ జరగలేదనీ వాదించాడు.

    2. ”Thomas Kuhn, Rocks and the Laws of Physics,” an essay in “Philosophy and Social Hope,” by Richard Rorty. ఈయన సాహిత్యం, ఫిలాసఫీలో Stanford లో Emeritus professor. Kuhn ని మార్గదర్శకుడిగా గుర్తించిన సమకాలీన తత్వవేత్తలలో ముఖ్యుడు.

    3. “పోస్ట్ మోడర్నిజం,” బి. తిరుపతిరావు. ఈయన విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులు. క్వాంటం సిద్ధాంతం ఎలక్ట్రాన్ స్థలమూ వేగమూ ఒకేసారి నిశ్చయంగా తెలుసుకోలేమని నిరూపించింది గదా. అణుప్రపంచంలో సాధ్యం కానిది స్థూల ప్రపంచంలో ఎలా సాధ్యమవుతుందంటూ, సైన్సులోకానీ సామాజిక శాస్త్రంలోగానీ నియతివాదానికి చోటులేదనీ, ఇదే ఆధునికాంతర సైన్సు ప్రాముఖ్యత అనీ, అందుకు Kuhn రచనల్ని ఆధారంగా చూపెట్టారు. శాస్త్రవేత్తలు వీటికి ఒప్పుకున్న దాఖలాల్లేవు. వీరి అభిప్రాయాలతో అంగీకరించినా లేకపోయినా, తెలుగులో ఆధునికోత్తర వాదాన్ని పరిచయం చేస్తూ ఈ పుస్తకం రాసినందుకు వీరిని మెచ్చుకోవాలి.

    4. “Pseudoscience and Postmodernism: Antagonists or Fellow-Travelers?” by Alan D. Sokal. ఈయన New York University లో Physics professor. పోస్ట్ మోడర్నిజం పేరుతో అన్ని రకాల మూఢత్వమూ సైన్సులోకీ చరిత్రలోకీ జొరబడిందనీ, దురదృష్టవశాత్తూ జాతీయవాదులేకాక వామపక్షవాదులూ దీనికి దోహదం చేస్తున్నారనీ, భారతదేశంలో ఈమధ్యకాలంలో సాగుతున్న శాస్త్రీయ అవగాహనని ఉదాహరణలతో విశ్లేషించి ఖండించాడు.

  23. 23
    ravikiran timmireddy January 26, 2007 10:04 am

    సురేష్,

    వొక అద్భుతవైన రచన, పాఠకుల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మీ వ్యాసం మీద వెల్లువెత్తిన అభిప్రాయాలే వొక వుదాహరణ. శ్రీశ్రీ కవిత్వం చాలా మంది సాధారణ పాఠకుల్ని కవులుగా మార్చింది అన్నది వొక అభిప్రాయం. మీ వ్యాసం కుడా కొందరు పాఠకుల్ని భాషాశాస్త్ర దిశలో ప్రయాణం కట్టిస్తుందని నా అబిప్రాయం.

    పత్రికలు చదివే చాలామంది పాఠకులు నాలాగే, ప్రత్యేకవైన భాషా, సాహిత్య పరిఙ్ఞానంలేని సాధారణ పాఠకులే. సాధారణ జీవితం ఇచ్చిన కొద్దిపాటి లోకఙ్ఞానం, పాఠశాలల్లోనో, కళాశాలల్లోనో నేర్చుకున్న కొద్దిపాటి శాస్త్ర పరిశీలనా పరిఙ్ఞానం, ఈ రెండిటి కలబోతలోంచి అలవరచుకున్న కొద్దిపాటి తర్కఙ్ఞానం ఇవే మాకున్న అతి సరళవైన logical skills, నిజాన్నిఅబద్దంలోంచి వేరుచైడానికి, తప్పుని వొప్పులోంచి చెరిపేయడానికి. ఐతే ఈ nascent rational attitude lives along with irrational emotional beliefs about race, language, nationality in our minds. తెలుగు ప్రాచీనత మీద ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఆ నాలుగు వ్యాసాలు చదివేక మనసుకెంత ఆనందవేసిందంటే, ఎక్కడో కుర్చోని ఎదో చదువుకుంటున్న నా ఏడో తరగతి కుతుర్ని పిలిచి, చదివి వినిపించి, చుశావా, మన తెలుగు జాతి, తెలుగు భాష గొప్పదనం, ఎప్పుడో సుమేరియన్ నాగరికత కాలంలోనే మన roots వున్నయ్ అని డబ్బా కొట్టి మరీ చెప్పెటంత ఆనందం. తర్వాత మళ్ళా నా కుతురుతో కుర్చోని అ తప్పుని సరి చేసుకోవటం సురేష్ రచన చదివేకే సాధ్యపడింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సురేష్ గారి వ్యాసం ఇంతకుముందు వచ్చిన వ్యాసాలమీద విమర్స లేకుండా వొక్క భాషా శాస్త్రం 101 కే పరిమితవైయ్యుంటే బావుండేది అనే అభిప్రాయం ఈమాట అభిప్రాయాల్లో వ్యక్తం కావటం వలనే. మేవు అతి సాధారణ పాఠకులం, మా బుర్రలో వుండే సవాలక్ష తర్కానికి నిలవని నమ్మకాల్ని తొలగించుకొని, ఎక్కడో, మనసులో ఏ ములో నక్కి నిద్రపోతున్న శాస్త్రియ పరిశీలనని నిద్రలేపాలంటే సురేష్ వ్యాసంలో వున్నటువంటి juxtaposition అవసరవని నా ఉద్దేశం.

    విప్లవ్ చెప్పినట్టు ఏ కళ్ళంలో గింజలు ఆ కళ్ళంలో నే నూర్చుకోవటం సహజవే. చేనైతే చాలానే వుంది. కానీ అదేం యదకొచ్చిన చేనేం కాదు. నిదర్శనం కావాలంటే మన ఘనత కెక్కిన విశ్వవిధ్యాలయాల భాషాశాస్త్ర శాఖల వెబ్ సైట్లకెళ్ళి వొకసారి చూడండి. పెట్టుబడైతే చాలానే పెడ్తున్నరు గాని, చేన్ని మాత్రం చవుడు నేల చేస్తున్నారు. కాబట్టి దుక్కి దున్ని, నారేతలేసి, కోసి, నూర్పులు చేసే మెళుకువలు, వోపికలు లేని నాలాటి పాఠకులకి శాస్త్రం తో పాటు, అశాస్త్రియతని వేలెత్తి చూపే సురేష్ గారు వ్రాసిన వ్యాసాలే ఉపయోగకరం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  24. 24
    Rohiniprasad January 26, 2007 4:57 pm

    మనుషుల్లో వివిధ వ్యక్తులకి వివిధ విషయాల్లో ఆసక్తి ఉండడం సహజంగా అనిపిస్తుంది. ఎవరి కిష్టమైన సబ్జెక్ట్ వారు చదువుకుంటే సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా ప్రతీ సబ్జక్ట్ లోనూ నిష్ణాతులు తయారవుతారు. అలా కాకుండా మంచి మార్కులొచ్చాయి కదా అని మనలో చాలా మంది తోసినట్టుగా ఇంజనీరింగో, మెడిసినో చదివి, “విధిలేక” అదే రంగంలో జీవితమంతా కొనసాగుతారు. “ఎందుకూ పనికిరాని” ఏ తెలుగు సాహిత్యంలోనో ఆసక్తి ఉన్నప్పటికీ అది ఔత్సాహిక దశలోనే ఆగిపోతుంది.

    సురేశ్ వంటి వారు తెలుగు భాష, సాహిత్యం తదితర విషయాల్లో తమకున్న గాఢమైన ఆసక్తిని చంపుకోలేక మరేదో ఉద్యోగం చేస్తూ, ఇటువంటి విషయాల గురించి ఉన్న పరిమిత సమయంలోనే చదివి, తమ ఉత్సాహాన్ని నలుగురితోనూ వ్యాసాల ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యాసాలను విమర్శించకూడదని అనలేముగాని, రచయిత ఎటువంటి ఒత్తిళ్ళకు లోనయి ఇటువంటి ప్రయత్నం చేస్తాడో పాఠకులు కాస్త గుర్తుంచుకోవాలని నాకనిపిస్తుంది.

    యూనివర్సిటీల్లో జరిపే రిసెర్చ్ మరింత నిర్దుష్టంగా ఉండవచ్చు గాని ఔత్సాహికుల రచనల్లాగా అవి చదువరులను ఎక్సయిట్ చేసి ఆసక్తి కలిగించలేకపోవచ్చు. ఈ వ్యాసానికి లభించిన, లభిస్తున్న స్పందనే అందుకు ఉదాహరణ.

    ఈమాట, తదితర వెబ్ పత్రికలలో ఇతర ప్రొఫెషన్లలో ఉన్నవారు ఎన్నో విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాసాలు రాస్తున్నారనేది గమనించాలి. వీరిలో ప్రసిద్ధ రచయితలుగాని, మహా పండితులుగాని ఎక్కువగా లేకపోవచ్చు. తెలుగు గురించి విశేష పరిశోధనలు చేసిన ఒక చేరాగారో, బూదరాజువారో, వెల్చేరువారో అరుదుగా కనిపిస్తారుగాని తెలుగు రచనల్లో వైవిధ్యాన్నీ, విస్తృతినీ కలిగించటానికి ప్రయత్నిస్తున్న ఇతర “చిన్న” రచయితల ప్రయత్నాలు ఎంతో మెచ్చుకోదగ్గవి.

    సురేశ్ గారికి అభినందనలు.

  25. 25
    ప్రసాద్ March 8, 2007 7:52 am

    కనక దుర్గ వ్యాసాలు, ఇంకా నాలాంటి సాధారణ వ్యక్తి తర్కానికే నిలవని వ్యాసాలు ఎందుకు ప్రముఖ పత్రికలలో ప్రచురిస్తారో అర్థం కాదు.
    మొత్తానికి గడ్డి బాగా పెట్టారు. అలాంటి వాదన ఎక్కడ తలెత్తినా ఇదిగో అంటూ చూపించడానికి మంచి వ్యాసం రాశారు. ధన్య వాదాలు.
    వ్యాసానికి మరిన్ని హంగులు దిద్దిన, శోభ చేకూర్చిన ఈ అభిప్రాయమాలకు అభినందనలు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  26. 26
    షణ్ముఖన్ January 28, 2012 3:01 pm

    మీ కృషి ఎనలేనిది. మీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.

    విస్తృత ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్.

  27. 27
    Siddineni Bhavanarayana March 1, 2012 10:02 am

    “చాలాసార్లు పదాలలో పైపైన కనిపించే పోలికలు, భాషలమధ్య లేని సంబంధమేదో ఉన్నట్టు మభ్య పెడుతాయి.”

    Leonard Bloomfield in his” Language”[University of Chicago 1984] is very informative in this respect. Elaborating phoneme theory,, he cites exhaustively from his intimate acquittance of Indo European languages like Sanskrit, Latin, Greek, Proto- German. In order to prove the distinctiveness he juxtaposes phonetically similar terms from diverse languages. His meticulous study of the Old world languages, as well as that of Amerindian language groups such as Fox, Cree, Menominee, and Ojibwa, stands him in good stead as he gives his examples from a wide variety of families of languages.

    గంటి జోగీసొమయాజి is the name of the university teacher, as I remember. As a student of literature, rather than that of language, I am pleasantly surprised at the perseverance of a non professional Telugu expatriate.

  28. 28
    pardhasaradhi December 17, 2013 12:09 pm

    చాల మంచి వివరణ ఇచ్చారు.మీ లాంటి వారు ఇలా వివరణ ఇవ్వబట్టే నాకు చాల విషయములు తెలిసినవి. ధన్యవాదాలు.

  29. 29
    అజయ్ కృష్ణ January 15, 2024 11:47 pm

    అద్భుతమైన విశ్లేషణ

  30. 30
    Palanki Sathya January 28, 2026 5:58 am

    మంచి వ్యాసం. చాలా బాగా రాశారు. ధన్యవాదాలు

  31. 31
    ఉమామహేశ్వరరావు గారపాటి January 29, 2026 12:42 pm

    ఈ వ్యాసం నచ్చింది, దానిపై వచ్చిన అభిప్రాయాలు చాలావరకూ వ్యాసం ప్రామాణికతకు లోటు రానీయకుండానే ఉన్నై. అయితే paradigm shift అంటే ‘రూపావళి మార్పు’ అనడం సరికాదు. భాషాశాస్త్రంలో రూపావళిని paradigmకి (ధాతువుకి తిఙ్ ప్రత్యయాలు చేర్చగా ఏర్పడిన పదావళి) వాడుతున్నది నిజమే గానీ ఆ paradigm ఇక్కడి paradigm వేరు. ఇక్కడి చర్చలో paradigm అంటే కొన్ని సిద్ధాంతాలకు ప్రాతిపదిక. దాన్ని అధిసిద్ధాంతం అనవచ్చునేమో.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • పలుకుబడి: రంగులు
  • అక్కమహాదేవి వచనాలు – 4
  • ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II
  • ఋగ్వేద ప్రథమ సూక్తం – తెలుగు అనువాదం
  • పలుకుబడి: ఋతువులు, కాలాలు

ఇటువంటివే…

  1. తెలుగు భాషా ప్రాచీనత
  2. వ్యవహారిక భాషా బహిష్కార నిరసనము
  3. వ్యవహారిక భాషా వికాసం
  4. వ్యవహారిక భాషా ఉద్యమంపై ఈమాట ప్రత్యేక సంచిక
  5. దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో

జనవరి 2007 సంచికలో ...

  • వలసపోతున్న మందహాసం
  • “సందుక”: నారాయణస్వామి
  • అనంతం
  • ఓ శాంతీ
  • కిటికీ
  • జనవరి 2007 సంచిక విడుదల
  • జానపద సాహిత్యంలో స్త్రీలు – 1
  • తరం మారినా …
  • నామాట: నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • నేనూ నా రచనలు
  • పద్యాలు – వాడుకభాష
  • భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101
  • యథార్థ చక్రం -5
  • రంగు తోలు
  • వర్షానంతరం
  • విదేశంలో మనుమరాలు
  • విమర్శా శిల్పి వల్లంపాటి అస్తమయం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జనవరి 2007 సంచిక విడుదల
తరం మారినా …

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.