ఈ-మెయిలు
ముక్కుపై కోపాలు
ఎక్కువ మనిద్దరికి
అక్కసుల వాదాల
చిక్కితిమి ఆనాడు
వానలో రాత్రిలో
వద్దన్న వినక ను-
వ్విక నన్ను జూడనని
చకచకా వెళ్ళేవు
ఉత్తరము వచ్చునని
తత్తరముతో తరచు
నే జూడ ప్రతి రోజు
నీ జాబు కనబడదు
తుదకు వచ్చినది నే-
డిది స్వర్ణ దినమేమొ
నేడొక్క ఈ-మెయిలు
నాపేర పంపావు
నేనెన్ని మారులో
ఆ నాల్గు పంక్తులను
చదివేను కన్నీళ్ళ
తడబడెడు హృదయాన
మరచి పోదామన్న
మరువలే నే నెపుడు
మరల నను జూతువో
గరళమును ఇత్తువో
మరచి పోదామన్న
మరువలే నిన్నెపుడు
మరల నిను జూచెదను
మరల అమృతము నిత్తు
చాలు నా కీ వార్త
పాలు త్రాగెను మనసు
నను జూడకుండినను
నీ కుశలమే చాలు
పున్నెముల ఫలములా
పున్నముల వెలుగులా
పూల నెత్తావిలా
పొంగించ రావేల
హారములు నా కేలు
హారతులు నా మేను
పీయూష మీ మోవి
పొంద రా అంద రా
ప్రియముగా పాడుతా
ప్రీతితో ఆడుతా
ప్రేమతో నింపుతా
మరలి రా తరలి రా
జరిగినది పీడకల
జరుగు నిక మంచి యిల
కోపాలు ఈ విరహ
తాపాలు వద్దింక
ఈ-మెయిలు చూచి యిక
ఆలసించక రమ్ము
నిదుర పోవక నేను
ఎదురుచూతును నిన్ను
మరచి పోదామన్న
మరువలే నిన్నెపుడు
మరల నిను జూచెదను
మరలి రా తరలి రా
ప్రసాద్ అభిప్రాయం:
November 1, 2006 1:34 pm
ఈమెయిలు అని చూడగానే ఈమెయిలు సాంప్రదాయిక వుత్తరాలను ఎలా నాశనం చేసిందో చెప్తున్నారేమొ ననుకున్నా!
చాలా బాగుంది.
–ప్రసాద్
http://blog.charasala.com
K.Reddeppa అభిప్రాయం:
November 2, 2006 3:12 am
చానా బాగుంది. చాలా సంతోషంగా వుంది తెలుగులో మంచి సైటును ఏర్పాటు చేసినందుకు.
ధన్యవాదాలతో
కె.రెడ్డెప్ప
రామసముద్రము
చిత్తూరు జిల్లా
ఆంద్రప్రదేశ్
Sudheer Kumar Kothuri అభిప్రాయం:
November 4, 2006 3:25 am
బాగుంది…అలిగిన వేళ రాజీకి ఈమెయిలొక సాధనమయ్యింది. మీ కవిత ఎంతో సహజంగా వుంది. నేను కూడా నా భార్యతో ఏమైనా గిల్లీకజ్జాలు జరిగి మాటలు మూగవోయినప్పుడు ఈమెయిల్ నే రాజీ సందేశానికి ఉపయోగిస్తాను. అందుకే మా ఇద్దరి మధ్య ఎమైన గొడవైనప్పుడు నా వైఫ్ పదే పదే ఈమెయిల్ చెక్ చేస్తూంటుంది.
phaNikaanta అభిప్రాయం:
November 11, 2006 1:23 pm
ఉదయకళ గారి కవిత ఏ ఛందస్సో తెలియదు కానీ
బావుంది. ఇది చదివేక గుర్తొచ్చిన ఒక ఆరుద్ర మినీ కవిత:–
ఆలు మగల లడాయి
అంతమొందిన రేయి
అనుపమానపు హాయి
ఓ కూనలమ్మ!
–P
Aravind అభిప్రాయం:
November 21, 2006 8:49 pm
నా భార్యతో తగవులాడిన సందర్బాలు గురుతుకొచ్చాయి.
చాలా బాగుంది
pvramarao అభిప్రాయం:
December 9, 2006 6:45 am
nowadays no letters are written by any one because of the facility of emailing.kavitha is excellant.
baabjeelu అభిప్రాయం:
July 25, 2008 3:36 am
ఇది కవిత్వం. తేటయిన కవిత్వం. హాయి హాయి కవిత్వం.”గరళమును ఇత్తువో” ఇస్తే ఇయ్యి గరళాన్ని కూడా నిభాయించుకోగలనన్న ధీమా,”మరల అమ్రుతమునిత్తు” మళ్ళీ అమ్రుతాన్నే ఇస్తానని భరోసా ఇవ్వడం. బేహద్బీగా వుంది.”ఇత్తువో” బదులు “నిత్తువో” అని వుంటే ఇంకా సాఫీగా వుండేదేమో?ఏ ఛందస్సయినా అవనీండి. నడక చక్కగా వుంది. నడత చక్కగా వుంది. “నను జూడకుండినను, నీ కుశలమే చాలు” గరళమిచ్చినా అమ్రుతమే ఇస్తాను లాటివి చూసి స్త్రీ వాద కవిత్వం రాసీ వాళ్ళందరూ ఉదయకళ గారిని దెబ్బలాడతారేమో? అయితే వాళ్ళు దెబ్బలాడీది కవిత లో కవిత్వం లేదని కాదు. కవిత లోని వస్తువు ని చూసి అనుకుంటాను. ఈ మెయిల్ చూసి, రిప్లై మీద క్లిక్ కొట్టి, సారీ బాస్ చెయ్యి కాళీ లేదు సెండ్ క్లిక్ కొడితే, స్త్రీ వాద కవిత్వం రాసీ వాళ్ళందరూ ఈ కవితని ఊరూరా మోసుకు తిరుగుతారు. ఆహా, ఓహో అంటారు.
వాళ్ళదీ తప్పు కాదు కాబోలు. పెద్దలెవరయినా వివరిస్తే బాగుంటుంది.