ఈమాట » ఛందోధర్మము

Expand to right
Expand to left

ఛందోధర్మము

కవిత్వం పుట్టిన నాటినుండి — కామవశములైన క్రౌంచమిథునంలోని పోతుపక్షిని నిర్దాక్షిణ్యంగా నిషాదుడు వధింపగా ఏకాకియై విలపించే పెంటిపక్షిపోరును చూచి దయార్ద్ర హృయావేశపరిపూరితుడైన ఆదికవి వాల్మీకినోట అప్రయత్నంగా వెడలిన “మా నిషాద” అనే శ్లోకం పుట్టిననాటినుండి — కవిత్వానికి, ఛందస్సుకుగల ఘనిష్ఠసంబంధాన్నిగుఱించి చర్చలు సాగు తూనే ఉన్నవి. కాని ఛందస్సు రామాయణంతోటే ఆరంభం కాలేదు. అంతకంటె అతిపూర్వములైన వేదాలలో చాలా భాగాలు ఛందోమయంగానే ఉన్నవి. వేదమంత్రాలు పఠించేందుకు ముందుగా, ఆమంత్రానికి కారకుడైన ఋషిని, అధిపతియైన దేవతనూ, అది చెప్పబడిన ఛందస్సును ముందుగా ధ్యానించి, ఆ తర్వాతనే మంత్రాన్ని పఠించడం పరిపాటి. మనం తెలుగులో ఈనాడు వాడుకొనే సీస,గీతపద్యాల లక్షణాలు వేదాలలో ఉన్నాయని 18వ శతాబ్దికి చెందిన పొత్తపు వేంకటరమణకవి తన లక్షణశిరోమణిలో సోపపత్తికంగా నిరూపించినాడు.

తెలుగులో ఆదికవి నన్నయ మహాభారతం వ్రాసిననాటినుండీ నేటివఱకు సంప్రదాయకవులు ఛందస్సులోనే కవిత్వాన్ని వ్రాస్తున్నారు. విశ్వనాథ సత్యనారాయణగారు “కవిత్వమును ఛందస్సులోనేవ్రాయవలెను” - అని చెప్పి కొన్నారు. ఐతే ఈనాడు వచనకవిత్వప్రాబల్యంవల్ల కవిత్వానికి ఛందస్సుతో ప్రమేయంలేదనే వాదన బలవత్తరంగా వినవస్తూ ఉన్నది. నేటి వచనకవులకు గురుస్థానంలో నున్న శ్రీశ్రీగారు ఛందస్సర్పపరిష్వంగవిముక్తమైనదే నవ్యకవిత్వమని మహా ప్రస్థానంలో వ్రాసికొన్నారు. ఇది ఈనాటి వచనకవులకు వేదవాక్యంలాగ భాసించడం సహజమే. ఆంగ్లభాషలో బయలుదేరిన అచ్ఛంద, స్వచ్ఛందకవితోద్యమం తెలుగుకవిత్వానిపై చూపిన ప్రభావంకూడ ఈవిధమైన ధోరణికి కారణమని మనం గుర్తించవచ్చు. శ్రీశ్రీగారు స్వయంగా స్విన్బర్నుకవిచేత ప్రభావితుడైనట్లు, వారి మహాప్రస్థానంలోని కొన్ని ఖండికలు చెప్తు న్నాయి.

ఈవ్యాసంలో నేను కవిత్వానికి ఛందస్సు అవసరమా, అనవసరమా అనే వాదానికి తలపడడంలేదు. ఛందస్సులో వ్రాసిన సంప్రదాయకవులను భూషించడం లేదు, వ్రాయని వచనకవులను దూషించడం లేదు. కాని, సంస్కారవంతుడైన కవికి కవితావేశం కల్గినప్పుడు వెలువడే కవిత్వంలో ఛందస్సు స్వయంభువుగా - అంటే తనంతకు తానే - ఉద్భవిస్తుందని నిరూపించ దలచుకొన్నాను. అందుకొఱకే ఈ ప్రస్తావనకు “ఛందోధర్మము” అని పేరుపెట్టుకొన్నాను.

ఐతే, వచనకవిత్వం వాడవాడలా వినవస్తున్న ఈరోజుల్లో ఛందస్సును గుఱించిన ఈ విచారం కేవలం ఛాందసం కాదా? అని కొందరడుగవచ్చు. వచనకవిత్వాన్ని వ్రాసినంతమాత్రాన ఛందస్సును గుఱించి తెలిసికొనగూడదని, దాన్ని గుఱించి విచారింపగూడదని ఎవ్వరూ నిషేధింపలేదు. పైగా ఈరకమైన విశ్లేషణ వచనకవులకుగూడ హితంగాను, వారి క్రాఫ్టును నిశితంచేసేందుకుగాను తోడ్పడుతుందని నా విశ్వాసం.

“సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయమ్|
ఏకమాపాతమధరం, అన్యదాలోచనామృతమ్||”

అని ఉన్నదేకదా! సంగీతము, సాహిత్యము రెండూ గొప్పకళలు. సాహిత్యం లేకుండా సంగీతం వుండవచ్చు - పాశ్చాత్య దేశాలలో వందలాది వాద్యసంగీతకారులు చేరి వాయించే సింఫనీలు, ఆకాశవాణిలో తరచుగా వినిపించే వాద్యగోష్ఠులు ఇట్టివి. అట్లే సంగీతం లేకుండా సాహిత్యం వుండవచ్చు. దీనినే మనం వచనం అంటాము. ఆంధ్రప్రభాపత్రికలలోని కథానికలలోను, ఈనాడు కొల్లలుగా ప్రచురితమౌతున్న నవలలలోను ఉండేది వచనం. ఒక అందమైన అమ్మాయి వుంది. ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు. వారు వ్యస్తంగా ఉన్నప్పటికంటే వారి ప్రేమమయమైన సాహచర్యం మఱింత పర్యాప్తంగా వుంటుంది. ఉద్యానవనంలో ఒక గున్నమామిడి ఉన్నది. ఒక మాధవీలత కూడ ఉన్నది. కాని అవి వేఱువేఱుగా ఉండే దానికంటే మాధవి మామిడిచుట్టూ అల్లుకొని నిండారినపూలతో నవ్వతూ వుంటే మఱింత అందంగా వుంటుంది. ఇటువంటిదే సంగీతసాహిత్యాల కుండే సంబంధం. సాహిత్యం సంగీతమయమైతే దానిని మనం పాట అంటాం. పాటలో పదానికంటే నాదానికే అధిక ప్రాముఖ్యం. నాదానికంటె పదానికి ప్రాముఖ్యమధికమైనప్పుడు మనం దాన్ని పద్యమంటాం. పదాని కీవిధంగా నాదసౌష్ఠ వాన్ని చేకూర్చేదే ఛందస్సు.

ఛందస్సనేది భాష కెవరో ఒకరు పెట్టినటువంటి అలంకారంకాదు. అది ఇజాలకు, గిజాలకూ, వాగ్వివాదాలకూ, అరస,విరసవిచక్షణలకూ లోబడింది గాదు. అది భాషలోగల పదాల అమరికలోంచి స్వయంభువుగా పుట్టుకొచ్చే నాద లక్షణం. చక్కని అంగాల పొందికనుండి అందమెలాగ స్వయంభువుగా భాసించి సర్వులనూ ఆనందపరవశులను చేస్తుందో చక్కనిపదాలపొందికనుండి ఛందస్సు తనకుతానుగా ఆవిర్భవించి కవిత్వానికి నాదసౌష్ఠవం చేకూరుస్తుంది. భావావేశం కలిగినప్పుడు కవితాత్మ ఛందస్సులో అప్రయత్నంగా ఘోషిస్తుంది. బాధితమైన క్రౌంచమిథునాన్ని చూచినప్పుడు ఆవేశ పూరితమైన ఆదికవి కవితాత్మఘోషయే అనుష్టుప్ ఛందంగా ఈవిధంగానే రూపొందిందని అందఱూ ఎఱిగినదే. దీనిని చర్వితచర్వణం చేయడం అనవసరం.

ఈ సందర్భంలో ఇటీవలి నా అనుభవాన్ని ఉదాహరింపలేకుండ ఉండలేను. అమెరికావాసులందఱికీ తెలుసు. కెనడా cold country అని. US లో చల్లగా ఉన్నపుడెల్లా Canadian Arctic Weather ను వారు నిందిస్తుంటారనికూడా నాకు తెలుసు. మొన్నటి మేనెలలో విన్నిపెగ్‌లో ఒకరోజు 22 డిగ్రీలు, ఆ మఱునాడే రెండు డిగ్రీలుండి, మంచుకూడ కురిసింది. ఈ విషయాన్నిగుఱించి మాట్లాడుతూ నేనొక మిత్రునితో

Yesterday it’s twentytwo,
Today it’s Two,

అని అన్నాను. అతడు హఠాత్తుగా,
It’s lousy that’s true.

అని పూరించాడు. నాకే ఆశ్చర్యమైంది. కలిపి చదివితే అంత్యప్రాసతో ఈ మూడువాక్యాలూ ఒక హైకూలాగ అయాచి తంగా తయారైనాయి. ఇది గొప్ప Poetry అని నేను చెప్పడం లేదు. భావావేశంవల్ల చేకూరిన పదాలకూర్పువల్ల నాదసౌష్ఠవ మెట్లా అయాచితంగా ఉద్భవించిందని చెప్పడమే దీని లక్ష్యం. ఇందులో ఛందస్సు శిథిలరూపంలోనైనా అయాచితంగా ఉద్భవించింది.

మఱొక ఉదాహరణం తీసుకొందాం. ఛందస్సర్పపరిష్వంగంనుండి కవితాకన్యను విముక్తి చేయ బద్ధకంకణుడైన శ్రీశ్రీ గారు కవిత్వాన్ని గుఱించి వ్రాసిన ఈ ఖండికను గమనించండి:

“కద-లేదీ, కద-లించే-దీ,
మా-రేదీ,- మా-ర్పించే-దీ,
పా-డేదీ,- పా-డించే-దీ,
పెను-నిద్దుర- వద-లించే-దీ,
మును-ముందుకు- సా-గించే-దీ,
పరి-పూర్ణపు- బ్రతు-కిచ్చే-దీ,
కా-వాలోయ్- నవ-కవనా-నికి” (చతురస్రగతి: 2+4+2+4+2)

తన కవితాకన్య ఛందస్సర్పపరిష్వంగంనుండి విముక్తురాలైందని ఘోషించే ఈ ఖండికను చూడండి. ముందుగా ఆయన పాదాల విఱుపును చూపి, ఆ తర్వాత అందులో గల లయను స్పష్టీకరించేందుకుగాను, ఈ పాదాలను మాత్రాబద్ధంగా సంధించి చూపుతున్నాను.

“పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్లు విడిచి,
ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి -
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగిడినై, నాయెద నడుగిడినై
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవఝ్ఝరవత్ పరివర్తనలో,
నే నేయే వీథులలో
చంక్రమణం చేశానో,
నా సృష్టించిన గానంలో
ప్రక్షాళిత మామక పాపపరంపర
లానందవశంవదహృదయుని జేస్తే –”

“పుంఖా|నుపుం|ఖంగా|
శ్మశా|నాల|వంటి| నిఘం|టువుల| దాటి|
వ్యాక|రణా|ల సం|కెళ్లు| వదలి| (గణానికి 3 మాత్రల త్ర్యస్రగతి)
ఛం|దస్సుల| సర్పప|రిష్వం|గం| వదలి -
వడి|గా, వడి|వడిగా| వెలువడి|నై|
పరు|గిడినై,| నాయెద| నడుగిడి|నై|
ఆ| చెలరే|గిన కల|గాపుల|గపు|
విల|యావ|ర్తపు బల|వఝ్ఝర|వత్
పరి|వర్తన|లో, నే|నేయే|వీథుల|లో
చం|క్రమణం|చేశా|నో, నా| సృ|
ష్టిం|చిన గా|నంలో| ప్రక్షా|ళిత|
మా|మకపా|పపరం|పర లా|నం
దవ|శంవద|హృదయుని| జేస్తే — (చతురస్రగతి - 2+4+4+4++2)

పై గేయాలు సలక్షణమైన మాత్రాచ్ఛందస్సులో సాగినవి. త్ర్యస్రగతిలో నడిచే 3 పాదాలు మినహాయిస్తే, మిగితా పాదాలన్నీ చక్కని చతురస్రగతిలో నడుస్తున్నాయి. అంతేకాక మొదటి ఖండికలో అంత్యప్రాసకూడ పాటింపబడింది. అంటే ఈ మహాకవి కవితాత్మను అతనికే తెలియకుండా ఛందస్సర్పం కాటేసిందన్న మాట. పై శ్రీశ్రీగారి గేయాన్ని, ఈక్రింది గేయంతో పోల్చిచూడండి:

“చరణములన్
గనకస్ఫుటనూపురజాలము ఘల్లనుచుం జెలఁగన్,
గరములఁ గంకణముల్ మొరయన్,
నలిగౌ నసియాడఁ, గుచాగ్రములన్ సరులు నటింపఁ, గురుల్ గునియన్,
విలసన్మణికుండలకాంతులు విస్ఫురితకపోలములన్ బెరయన్
వ్రజసుందరు లంద ఱమందగతిన్…”

ఈ గేయ మెవ్వరిదా అని మీరు విస్తుపోతూ ఉండవచ్చు - ఈ విడ్డూరాన్నినేను తీరుస్తాను - ఇది పోతనమహాకవి శ్రీమద్భాగ వతంలోని దశమస్కంధంలో బలరాముని చూడవచ్చిన గోపికల యవస్థను వర్ణంచే గేయం - కాదు కాదు - కవిరాజవిరాజిత మనే పద్యం. అన్ని పద్యాలు వ్రాసినట్లు గణబద్ధంగా దీనిని 4 పాదాలలో వ్రాస్తే, దీని స్వరూప మీవిధంగా ఉంటుంది (నేనిక్కడ ఇందులో గల చతుర్మామాత్రాగణబద్ధమైన లయను ఊర్ధ్వరేఖలతో వ్యస్తంగా చూపెట్టినాను):

“చరణము|లం గన|కస్ఫుట|నూపుర|జాలము| ఘల్లను|చుం జెల|గన్
గరములఁ| గంకణ|ముల్ మొర|య న్నలి|గౌ నసి|యాడ గు|చాగ్రము|లన్
సరులు న|టింపఁ గు|రుల్ గుని|యన్ విల|సన్మణి|కుండల|కాంతులు| వి
స్ఫురితక|పోలము|లన్ బెర|యన్ వ్రజ|సుందరు|లంద ఱ|మందగ|తిన్..”

మఱొక వచనకవి కాళోజీ నారాయణరావు వ్రాసిన ఈ ఖండికను గమనించండి:

“వెనుకకు చూస్తే భూతం
కనుపించును చూడకు అటు,
లభ్యంకాని భవిష్యం
లక్షిస్తూ రభసపడకు,
వర్తమానం వ్యర్థం చేయని
కర్తవ్యం నీదని మఱువకు,
పశ్చాత్తప్తులు పూర్వతప్తులు
ప్రస్తుత మెఱుగని వ్యక్తులు వ్యర్థులు.”

ఇది చక్కని చతురస్రగతిలో నడిచే గేయం. అంతేకాక నియతంగా యతియో ప్రాసయతియో ఈ ఖండికలో ఉండటం విశేషం. అంటే ఈకవి కవితావేశాన్ని మఱింతఘాటుగా ఛంద స్సర్పం కాటువేసిందన్నమాట!

పై ఉదాహరణాలను పేర్కొనడంవల్ల నేను చెప్పదలచిందేమంటే, ఛందస్సనేది కృత్రిమమైన ఆభరణంగాదు. సంస్కారవంతుడైన కవికి కవితావేశం కలిగినప్పుడు దొరలే పదబంధాలలో స్వాభావికంగా సముద్భవమయ్యే నాదగుణం. నా వాదానికి లక్ష్యమింతమాత్రమే కాని, ఛందస్సులో వ్రాశారని ఈవచనకవులను విమర్శించడం కాదు.

మౌలికమైన ఛందోలక్షణాలను గఱించి తెలియనివా రరుదుగా ఉంటారు. ఐనా సందర్భపరిపుష్టికై మళ్లీ వాటిని గుర్తుచేస్తాను. తెలుగులో ఛందస్సులను అక్షరఛందస్సులని, మాత్రాఛందస్సులని రెండురకాలుగా విభజింపవచ్చు. ఉత్పల, చంపక, మత్తేభాదివృత్తాలు అక్షరచ్ఛందస్సులకోవకు చెందినవి. ఒకటినుండి 26 గుర్వక్షరాలను క్రమంగా వ్రాసి, వానిని ప్రస్తారం చేస్తే కోట్లాది అక్షరచ్ఛందోవృత్తాలు నిష్పన్నమౌతాయి. ఐతే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇట్లు కోట్లాది అక్షరగణ వృత్తాలున్నప్పటికీ మన తెలుగులో దదాపుగా 50,60 వృత్తాలకంటె ఎక్కువ ప్రచారంలో లేవు. వీనిలోనూ పాదానికి 20 అక్షరాలుండే ఉత్పల, మత్తేభవృత్తాలకూ, పాదానికి 21 అక్షరాలుండే చంపకమాలకూ, 19 అక్షరాలుండే శార్దూలవృత్తానికీ ఉన్నంత వ్యాపకం ఇతరవృత్తాలకు లేదు. ఈ అక్షరవృత్తాలకుండే ఇతరలక్షణాలు యతిప్రాసలు. యతిప్రాసల గుఱించి చాలామందికి సామాన్యంగా తెలిసేవుంటుంది. ఐనా పరిపూర్ణతకై వాని లక్షణాలను సంగ్రహంగా చెప్తాను. పాదాద్యక్షరముతో పాదమునందు నిర్ణీతస్థానములో స్వరమైత్రి కలిగిన మిత్రాక్షరమును వేయుట యతి వేయుట అనబడును. మొదటి 9 ఛందస్సులలోని పాదములు చిన్నవిగా నుండుటచే వానికి యతినియమము లేదు. 10 అక్షరములకు పైబడిన పాదములున్న వృత్తములకే యతినియమము. పాదమునందలి రెండవ అక్షరమునకు ప్రాసాక్షరమని పేరు. అదే రెండవ అక్షరము అన్ని పాదములలో సమముగా నుండుటయే ప్రాసలక్షణం. ఉదాహరణంగా, ‘హ’ కారం యతిగా, ‘ర’కారం ప్రాసగా గలిగిన శ్రీమద్భాగవతంలోని పోతనమహాకవీశ్వరుని ఈ హృద్యమైన పద్యాన్ని చూడండి:

“హారికి, నందగోకులవిహారికిఁ, జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీమనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.”

ఆధునికు లనేకులు ఈ యతిప్రాసలెందుకుండాలి? సంస్కృతంలో ప్రాసనియమం లేనేలేదు. యతియైనా పదవిరామమే కాని, తుల్యాక్షరం వేయాలనే నియమం లేదు. మఱి తెలుగులో ఈ బాధలెందుకు? అని అడుగవచ్చు. ఇంతకుముందు మనం చెప్పు కున్నాం - పదసంచయనంవల్ల సంగీతసౌలభ్యం, శ్రుతిసుభగత్వం చేకూర్చడమే ఛందస్సుయొక్క ప్రయోజనమని. హిందీ లోను, ఇంగ్లీషులోను అంత్యప్రాసలను వాడటం అలవాటు. ఉదాహరణం:

The lovely Helen launched a mortal strife
When Paris the Prince plotted to gain a wife

ఇక్కడ strife కు wife కు మధ్య అంత్యప్రాస. దీన్నే ఇంగ్లీషులో Rhyme అంటారు. అట్లే lovely, launch లలోని లకారాలకూ, Paris, plotted లలోని పకారాలకూ యతిమైత్రి ఉందని చెప్పవచ్చు. ఈ విశ్లేషణప్రకారం మన తెలుగులోని ప్రాసను ఆది Rhyme గా గుర్తింపవచ్చును. అంటే ఇంగ్లీషు,హిందీకవులకు అంత్య Rhyme ఇష్టమైతే తెలుగువారికి ఆది Rhyme ఇష్టమైందన్నమాట. ఈ విషయాన్ని స్పష్టంగా పై పోతనగారి పద్యంలో గుర్తించవచ్చు. ఆంగ్లభాషాప్రభావంవల్ల ఈనాటి వచన,గేయకవులు సామాన్యంగా అంత్యRhyme ను పాటించడానికి ఉబలాటపడటం మనం గమనించవచ్చు. “కదలేదీ, కదలించేదీ” - అనే శ్రీశ్రీగారి గేయంలో దీన్ని స్పష్టంగా చూడవచ్చు. కాని కాళోజీ మాత్రం పూర్వకవులపద్ధతిలో పదాదిలో యతియో , లేక ప్రాసయో పాటించి తన కవనానికి సంగీతసౌలభ్యతను చేకూర్చినాడు. ఇంతకు చెప్పదలచిందే మంటే, గణబద్ధమై సుస్పష్టమైన లయనుగాని, లేదా ఆంతరంగికలయను గాని కల్గిన వృత్తాల శ్రవణసుభగత్వాన్ని అధికం చేయడానికే యతిప్రాసనియమాలు తెలుగుఛందస్సులో చేర్చబడ్డాయని.

శ్రీశ్రీవంటి ఆధునికులు యతిప్రాసలు వ్యర్థప్రయాస లనడం మనం వినే వున్నాం. కాని ఇవి కవితాకల్పనకు దోహదం చేసే నియమాలని నేను కొన్నిసార్లు స్పష్టమైన అనుభూతిని పొందాను. ఉదాహరణకు ఈ పద్యం చూడండి:

“వీరులు, స్వామిరక్షణపవిత్రకళానిరతాంకితాంగధీ
సారులు, సద్వివేకపథచారులు, శాత్రవరాక్షసాటవీ
చారులు, త్యాగయోగగుణసారులు, నాంధ్రధరాసతీశుభం
కారులు, నాదు యోధులని క్ష్మాపతి యాత్మను నమ్మియుండగన్.”

ఇది నా “హనుమప్పనాయకుడు” కావ్యంలోని పద్యం. గద్వాలప్రభువైన సోమనాద్రి స్వల్పబలంతో కర్నూలుదుర్గంలో తురక సేనల మధ్య చిక్కుపడి ఉన్న సందర్భంలో, ఆ దుర్గానికి వెలుపల చిక్కుకొన్న అతని సైన్యం యుద్ధవిరమణ చేసి తిరిగిపోవా లని ఆలోచిస్తున్నపుడు హనుమప్ప అనే యోధుడు వారిని యుద్ధంచేసి ప్రభువును రక్షింపుడని ఉద్బోధించే ఘట్టంలోని దీ పద్యం. ఈ పద్యం రెండవపాదంలో “సారులు” అనే పదంలోని “సా”తోటి యతి “చారులు” అను పదంలోని “చా”తో చెల్లింది. దీన్ని చెల్లించడానికి సద్వివేకపథచారులు అనే సమాసం పడింది. సైన్యం ప్రభువును వదలిపెట్టి తిరోగమింప యత్నించుచున్న సమయంలో అట్టి విచారం సద్వివేకపథంలో చరించే యోధులకు తగదని - అట్లా చేయడం అవివేకమనీ, వారికి సూటిగా చెప్తుంది ఈ సమాసం. ఇది పడడంవల్ల ఈ పద్యానికి ఎంతో అర్థపుష్టి కలిగింది. నాకు బాగా గురుతు - సాతోటి యతి చెల్లించడానికే, ఒకటి రెండు నిముషాలు ఆలోచించి నేనీ సమావేశాన్ని వేసినాను. అంతేకాక వీరులు అనే పదంతో పద్యం మొదలు కావడంవల్ల, దానితో Rhyme చేసే పదాలు ప్రాసనియమాన్ని పాటించుటకు నాల్గుపాదాల మొదట్లో వేయుటయేకాక, ఈ Rhyming effect ను అధికతరం చేయడానికి 2,3 పాదాల మధ్యలో చారులు, సారులు అనే పదాలు పడ్డాయి. పద్యానికి ప్రాసనియమమే లేకుంటే పద్యరచనలో ఈ అదనపు అందాన్ని కూర్చే ఆలోచన నాకు తట్టకపోయేదేమో| మఱొక ఉదాహరణ. కొంతకాలం క్రింద ప్రసన్నభారతిలో ప్రచురితమైన “కన్నెగులాబి” అనే నా పద్యఖండికలో ఈ పద్యా లున్నాయి.

“నను గనినంత నెఱ్ఱనయినట్టి మదీయమనోహరాంగనా
హనుయుగముం గరాబ్జముల నంటుచు నంటి, “చెలీ! వనంబులం
గనుపడ వెందుఁజూచినను కన్నెగులాబులు నేడు, ఔనులే!
కనుపడు నెట్లు నీ మృదులగండము లందవి డాగియుండఁగన్!”

అనియెడు నాదుమాటలకు నగ్గలమై తగు సిగ్గుపాటుచే
కనకలతాంగి నెమ్మొగము కందె మఱింతగఁ, బ్రాక్సముత్థపా
ర్వణశశివోలె, మున్నుగను పాటలవర్ణవిభాసితంబులై
చనిన గులాబిపూలిపుడు చక్కని రక్తిమఁ దాల్చె వింతగన్.

కన్నెగులాబిపూవువలె కాయమునందున యౌవనంబు మే
ల్కొన్నపు డున్న వైనమిది; కోనకు జాఱెడు నేఱువోలె సం
స్కన్నములయ్యె నేండ్లిపుడు, కాని మనంబున జాఱకుండెఁబో
మున్నుగ మత్ప్రియాముఖసముత్థములైన గులాబియందముల్! ”

ఈ మూడవ పద్యంలోని రెండవపాదం “ల్కొన్నపుడున్న” అని ప్రారంభమౌతుంది. దీనికి యతి గూర్చడానికి “కోనకు జాఱెడు నేఱువోలె సంస్కన్నములయ్యె నేండ్లిపుడు” - అని వ్రాసినాను. నిజంగా ఈ పద్యాన్ని ఆరంభించినప్పుడు జారిపోయే వయస్సును, లేదా కాలాన్ని లోయలో జాఱిపడే నదితో పోల్చాలని నేననుకోలేదు. కాని “కో”తో యతి చెల్లించాలనే విజ్ఞతవల్ల చక్కనైన ఈ ఉపమానం మనస్సుకు అయాచితంగా తట్టింది. వయస్సు జాఱిపోవడమంటే కాలం జాఱిపోవడమే, ఒకసారి జాఱిపోయిన కాలాన్ని మనం వెన్కను త్రిప్పలేము. అట్లాగే లోయలో అధోగతమైన నీటిని మనం తిరిగి పైకెక్కించ లేము. క్రొత్త నీటిని పోకుండా అడ్డుకట్ట కట్టగలమేమో కాని, పోయిన నీరు గతం గతః. అందుకొఱకే “గతజలసేతుబంధన”మనే నానుడి ప్రసిద్ధమైంది. ఈ చక్కనైన ఉపమాన మిక్కడ పడడానికి యతినిర్బంధమే దోహదం చేసిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లే రెండవపద్యంలో ‘కనకలతాంగి’ - అనే సార్థకసమాసం, ‘పార్వణశశివోలె’ - అనే సార్థకమైన సుందరోపమానం ముందుగా నేననుకోనివిధంగా ప్రాసనిబంధనవల్ల స్వతస్సిద్ధంగా సన్నద్ధమైనవని నా స్వీయానుభవాన్ని వ్యక్తీకరిస్తున్నాను.

ఐతే పైవిధమైన ఛందోనియమజన్యమైన భావస్ఫూర్తి కి అన్యమైన ఉదాహరణా లున్నాయా అనే ప్రశ్న ఉదయింప వచ్చు. ఇట్టి భావస్ఫూర్తి స్పష్టంగా ప్రతిబింబించే పద్యాల ఉదాహరణాలు కొన్నింటిని నేనిక్కడ చూపుతాను.
అష్టదిగ్గజాలలో మేటి దిగ్గజమైన రామరాజభూషణుడు నా కత్యంతప్రీతిపాత్రుడు. అతడు వసుచరిత్రలో అధిష్ఠాన పురాన్ని వర్ణించే సందర్భంలో ఆ నగరంలోని పూఁదోఁటలనుగుఱించి ఈ పద్యాన్ని వ్రాస్తాడు:

“పురిపూఁదోఁటలతావి మిన్నలమ వేల్పుల్ మెచ్చి తద్భూజ భా
స్వరసంతానములన్ దివిం బెనుప, నా సంతానముల్ దివ్య ని
ర్ఝరిణీనిర్మలవారిపూరపరిపోషం బందియుం దన్మహా
తరులక్ష్మీపరిపూర్తిఁ గాన కెసఁగెం దత్కల్పశాఖిప్రథన్.”

అధిష్ఠానపురంలోని ఉద్యానవనాలలో ఉండే పూల సుగంధం ఆకాశపర్యంతం వ్యాపించింది. దానికి దేవతలు మెచ్చుకొని, అట్టి సుగంధము దేవలోకంలో లేదనుకొని, ఆ పూలమొక్కల సంతానాలను (పిలకలను) తీసికొనిపోయి దేవలోకంలో నాటుకొని వాటికి ఆకాశగంగాజలాలను పాఱించినా, అవి అధిష్ఠానపురంలోని పూలమొక్కలకు సరిగానందున, ఆ దేవలోకవృక్షాలకు (తత్) కల్పవృక్షాలని పేరు వచ్చిందని చమత్కారంగా రామరాజభూషణుడు వర్ణించాడీ పద్యంలో. మనందతఱికీ తెలుసు దేవలోకంలో వుండేవి కల్పవృక్షాలని. ఐతే కల్పశబ్దము సమాసంలో ఉత్తరపదమైనప్పుడు “అంతకంటె కొంచెము తక్కువైనది - దాదాపుగా అటువంటిది” - అనే అర్థం వస్తుంది. అందుచేత “తత్-కల్పశాఖిప్రథన్” - అన్నపుడు భూలోకవృక్షాలకంటె కొంచెం తక్కువవైనందువల్ల ఆ దేవతావృక్షాలకు కల్పవృక్షాలని పేరువచ్చిందని ఇందులో చమత్కారం. ‘పంచైతే దేవతరవో మన్దారః పారిజాతకః, సన్తానః కల్పవృక్షశ్చ పుంసి వా హరిచన్దనమ్’ - అని అమరంలో చెప్పినట్లు సంతానమనేది స్వర్గ లోకంలో గల ఐదు దేవతావృక్షాలలో ఒకదానికి పేరు. అధిష్ఠాననగరంలోని చెట్ల సంతానం గావడంవల్ల ఆ దేవతావృక్షానికి సన్తానమనే పేరు వచ్చిందని ఇందులో మఱొక చమత్కారం. ఈ పద్యంలోని భాష కాస్త క్లిష్టంగా ఉండడంవల్ల నే నీ వివరణ ఇచ్చినాను. ఇక ప్రస్తుతాంశానికి వత్తాం. ఈ పద్యంలో ‘ర’కార ప్రాస ఉంది. దానిని చెల్లించ డానికిగాను రెండవపాదంలో భా’స్వర’ - అని వేసినాడు రామరాజభూషణుడు. ఈ శబ్దం ప్రాసనియమంవల్లనే అతనికి స్ఫురించి ఉంటుందని నా విశ్వాసం. ఈ శబ్దంవల్ల ఈ పద్యానికి విశిష్టమైన అర్థస్ఫూర్తి కలిగింది. ‘భాస్వర’మంటే ప్రకాశించేది అని అర్థం. అంటే దేవతలు తీసికొని పోయి నాటుకొన్నవి నాసిరకం మొక్కలు కాదు- అవి నిగనినగలాడే సారవంతమైన మొక్కలు - అటువంటి మేలురకపు మొక్కలను నాటుకొని దివ్యగంగాజలాలను పాఱించినా అవి భూలోకపు వృక్షాల కంటె తీసికట్టుగానే ఉన్నవని ప్రాస నియమంవల్ల కవి వేసిన ‘భాస్వర’శబ్దంవల్ల విశేషార్థం ఈ పద్యంలో స్ఫురిస్తూ ఉన్నది.

ప్రబంధకవులకంటె పూర్వుడైన నాచన సోమనాథుని ఉత్తరహరివంశం నాకు ప్రియమైన కావ్యం. అందులో శ్రీకృష్ణుడు ద్వారకను వీడి, బదరీకేదారములు, కైలాసాలను దర్శింప నేగుచు తాను లేనప్పుడు ద్వారకను రక్షించు బాధ్యతను సాత్యక్యా దులకు, యదువృద్ధులకు అప్పగిస్తూ యాదవవృద్ధుడైన ఉద్ధవునితో ఈ విధంగా అంటాడు:

“తండ్రులు మీరు, మీకు నయతత్త్వము చెప్పెద మన్న మమ్ము నే
మండ్రు జనంబు, లూఱడు బృహస్పతి మీయెడ, నేను లేనిచో
వెండ్రుకయంతమోసమును వేచి దురంబున కెత్తి వచ్చు నా
పౌండ్రుడు, వానిచేత మనబంధులు చిక్కక యుండఁ గావుఁడీ!”

“మీరు తండ్రివంటివారు మాకు, మీకు మేము హితాహితాలు చెప్పడం తగదు, మీ బుద్ధికుశలత బృహస్పతికిగూడ ఊఱట కలిగిస్తుంది, కాని నేను లేనప్పుడు వెండ్రుకయంత పొరపాటు జరిగినను పౌండ్రకవాసుదేవుడు ద్వారకపై దండెత్తి వస్తాడు, అతనిచేత మనవారు చిక్కకుండ మీరు కాపాడవలెను” - అని శ్రీకృష్ణుడు వృద్ధుడైన ఉద్ధవునికి విన్నవించుకొంటాడు. ఇందులో యతినియమంవల్ల ‘ఊఱడు బృహస్పతి మీయెడ’ - అనే విశిష్టార్థబంధురమైన పదబంధం, ప్రాసనియమంవల్ల ‘వెండ్రుకయంత మోసమును’ - అనే సార్థకోపమానం అయాచితంగా ఈ పద్యంలో సన్నద్ధమైనవని గుర్తించడం పద్యవిద్యా భ్యాసపరులకు కష్టం గాదు.

ఆధునికులలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారంటే నాకమితమైన గౌరవం. వారి పద్యాలలో ఎన్నో అపూర్వమైన, విశిష్టమైన పదబంధాలు మనకు కనపడుతుంటాయి. వారి దక్షారామకృతి ఒక సుందరప్రౌఢఖండకావ్యం. దక్షారామ భీమేశ్వరుని మహిమలను వర్ణించే భీమఖండాన్ని శ్రీనాథకవిసార్వభౌముడు బెండపూడి అన్నయమంత్రికి అంకితమిచ్చే సన్నివేశం ఈ ఖండకావ్యేతివృత్తం. ఆ సందర్భంలో అన్నయమంత్రి శ్రీనాథుణ్ణి సభాముఖంగా సత్కరించి, ఆస్థాననర్తకీ నాట్యకళావిన్యాసనీరాజనంతో సంతుష్టుని గావిస్తాడు. ఆ సందర్భంలో హనుమచ్ఛాస్త్రిగారు వ్రాసిన పద్యమిది:

“తీయనిచూపులన్ గడుసుదేఱిన నాట్యపురాణి సోగ కం
దోయిని వెల్గు స్నేహమయధోరణులం బరికించి, చెక్కిళుల్
మోయఁగ వెన్నెలల్, మధురమూర్తి కవీంద్రుఁడు మందహాససు
శ్రీయుతవక్త్రుఁడై కనెను నృత్యచలద్భువనైకమోహినిన్.”

ఇందులో ‘య’ అనేది ప్రాసాక్షరం. ఈ నియమాన్ని పాటించేందుకుగాను హనుమచ్ఛాస్త్రిగారు ‘చెక్కిళుల్ మోయఁగ వెన్నెలల్’ - అని అత్యంతసుందరమైన పదబంధాన్ని వేసినారు. ఆ నర్తకియొక్క శృంగారమయమైన చూపులకు ముగ్దుడై మందహాసంచేసే కవిసార్వభౌముని చెక్కిళ్లపై నూత్న ప్రకాశం విస్తరించింది అనే భావాన్ని ‘చెక్కిళుల్ మోయఁగ వెన్నెలల్’ అని చెప్పడం ఎంత సుందరంగా ఉంది? కవిత్వానికి ఇంతకంటె పరమావధి ఏముంటుంది? మఱి ఈ పదబంధం ప్రాస నియమం వల్లనే కవికి అయాచితంగా స్ఫురించి ఉంటుందనుటలో సందేహమేముంది? ఈ విధంగా ప్రాచీనార్వాచీనకవుల కృతులలో అనేకపద్యాల నుదాహరింపవచ్చు. మచ్చుకు కొన్నింటిని మాత్రం నేనిక్కడ చూపినాను.

ఐతే ప్రతిపద్యాన్ని ఇట్లా లయబద్ధంగా వ్రాయాలనే నియమం లేదు. కవిత్వం భావప్రాధాన్యమైన దగుటచే అందులో లయకంటె భావస్పష్టీకరణానికే ప్రాముఖ్యం. కాని ఛందస్సు వెనుక నుండే లయవిన్యాసాన్ని గ్రహించిన కవి, వాడేపదబంధాలలోను, పదాల విఱుపులోను ఎంతగానో లయవిన్యాసాన్ని ప్రదర్శింపవచ్చు. అందుచేతం ఈ అంశాలను దృష్టిలో నుంచుకొని కవిత్వం వ్రాయడంవల్ల మేలే కాని కీడు చేకూరదని నా అభిప్రాయం. ఇంగ్లీషులో “Necessity is the mother of Invention” అనే సార్థకమైన సామెత వుంది. ఈ సామెతే యతిప్రాసల నియమాలనుకోండి, నిర్బంధాలనుకోండి - వీనికి వర్తిస్తుంది. పరిణతకౌశల్యం గల వ్యక్తి కీ నిర్బంధాలు సంకెళ్లుగా గాక, పూలదండలుగా భాసించి, అతని కవితాకౌశల్యాన్ని ఇనుమడింప జేస్తాయని నా అభిప్రాయం. ఆరంభంలో ఊహింపని పద బంధాలకు, ఉపమానాదులకూ, ఈ నిర్బంధాలు ఉద్భవకారకము లౌతాయని నేనంటాను. ఛందస్సుకు తాను లోబడక, ఛందస్సును తాను లోబఱచుకొన్న కవియొక్క కవితాకౌశల్యాన్ని నిశితంజేసే వీ నిబంధనలనీ, వాటిని దూషించడం ‘ఆడరాక అంగణం వంకర’ అన్నటువంటిదంటూ మనవి చేస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

 

(42 అభిప్రాయాలు)

  1. ప్రసాద్ అభిప్రాయం:

    November 1, 2006 12:52 pm

    కృష్ణదేశికాచార్యులు గారూ,
    మీలాంటి పెద్దలకు చెప్పేంతవాన్ని కాదు. అలాగే మీరు చెప్పిన వుదాహరణలతో విభేదించాల్సిన పనీ లేదు. చందోబద్దమైన పద్యానికి, లయ బద్దమైన గేయానికి, భావ బద్దమైన వచన కవిత్వానికి దేనికున్న విలువ దానికుంది. అలాగే చంధస్సు అన్నది స్వయంభువు అన్నదానితో మీ వుదాహరణలతో నేనేకిభవిస్తాను. ఒక మంచి లయబద్దమైన పాట వింటున్నపుడు కాలు లయబద్దంగా ఎలా కదులుతుందో అలాగే మనసును రంజింపజేసిన భావము కవి నోటిలో చంధోబద్దంగా పద్యాన్ని పలికిస్తుందని మీ వ్యాసమంతా చదివాక తెలుసుకున్నాను.
    అయితే చంధస్సు, యతి ప్రాసల నియమాలు కవితాకల్పనకు దోహదం చేసే నియమాలనడంతో విభేదించాల్సివస్తోంది. మీరే అన్నట్లు లయ ప్రాధాన్యంగా వుండాలంటే చందస్సు అవసరమే. అయితే భావమే ప్రధానమంటే చందస్సు కాక బావాన్ని కఠినంగా వ్యక్తపరిచే పదాలనే ఎన్నుకోవాలి కదా! చంధస్సుకు సరిపడలేదనే కారణంచేత సరైన భావాన్ని పలికించే పదాన్ని వదిలివేయడం ఎంతవరకు సబబు? మీరే చెప్పిన చాలా వుదాహరణల్లో యతి నియమం కోసం ఒకటి రెండు నియమాలు ఆలోచించి ఆ పదభందాలు చేర్చామన్నారు కదా. నాకప్పుడు ఏమనిపించిందంటే ఈ యతి నియమం సంతృప్తిపరచే పదభందం దొరగ్గానే మీలోని కవి మరింత మంచి పదానికై తన శోధనను ఆపివేశాడేమొనని! ఆ నియమమే లేకుంటే ఇంకెంత భావపుష్టి కలిగిన పదం మీకు దొరికేదో! ఆవేశంగా ఆశువుగా పదభందాలు దొర్లి automaticగా చంధోబద్దమైన పాదాలు జనిస్తే సరే కానీ యతో, ప్రాసో కలిసిందనే సాకుతో అంతకంటె మంచివైన పదాలను వదిలివేయడం సమంజసం కాదేమొ, లయబద్దమైన కవిత్వమే కావాలనుకుంటే తప్ప!
    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. Raja Shankar Kasinadhuni అభిప్రాయం:

    November 2, 2006 3:35 pm

    కృష్ణదేశికాచార్యులగారి వ్యాసం చాలా బాగుంది. మంచి పద్యం చదివినప్పుడు, యతి ప్రాసల నియమాలని పాటిస్తూ కూడా ఈ కవి ఎంత చక్కని పద్యం వ్రాయగలిగాడని అనుకునేవాడిని. అయితే, యతి ప్రాసలు పదదారిద్ర్యంతో బాధపడే కవులకు సంకెళ్ళైతే, సత్కవులకు తమ భావాన్ని మరింత బాగా వ్యక్తం చేయడానికి దోహదం చేసే సాధనాలనే ఆలోచన ఈ వ్యాసం చదివేదాకా కలగలేదు. ఇంత చక్కని వ్యాసం వ్రాసిన రచయతకూ, ప్రచురించిన ఈమాట సంపాదకులకూ ధన్యవాదాలు.

    కాశీనాథుని రాజాశంకర్

  3. baabjeelu అభిప్రాయం:

    August 8, 2008 8:23 am

    అయ్యా,
    మీరు వ్రాసిన వ్యాసం చాలా చక్కగా వుంది.
    “ప్రసాదు” గారు వ్రాసిన అభిప్రాయం సరైనది. దానికి మీరు ప్రతిస్పందించకపోవడం బాధాకరమయిన విషయం.
    “రాజాశంకర్ ” గారు వ్రాసిన “పదదారిద్ర్యం తో బాధపడే” కవుల విషయం అన్యాయం.
    కవిత్వం కోసం ఛందస్సా, ఛందస్సు కోసం కవిత్వమా? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా?

    కవికి ఛందస్సుతో పాటూ, సంస్క్రుతం, కరాటే, భరతనాట్యం, వుర్దూ, ఇటాలియన్, గోంగూర పచ్చడి చేయడం, వూడిపోయిన గుండీలు కుట్టడం, పుస్తకాలకి అట్టలేయడం, పిల్లలకి అన్నాలు పెట్టడం, చిత్రలేఖనం, మేజిక్ చేయడం, పిల్లిమొగ్గలేయడం వగైరాలలో అద్వితీయ ప్రతిభ వుంటే, ఆ కవిగారి కవిత్వానికి మీలాటి పండితులూ, “ప్రసాదు” గారిలాటివాళ్ళు, మా బోంట్లు మైమరచిపోతం.

    మీవంటివారు శ్రీశ్రీ కవిత్వాన్ని పరామర్శించి, శ్రీశ్రీ కూడా చందస్సనే పాముకాటుకి గురయ్యాడని రాయడం భావ్యమా? మధ్యలో కాళోజీ గారి “గొడవ”, “జయప్రభ” గారు కూడా “గతి” తప్పలేదని తెలిసి “హమ్మయ్య” అనుకున్నను.

    శ్రీశ్రీ ఛందస్సు చదువుకుని వచ్చినవాడేకదండీ? అందుకే తొలిరోజుల్లో రాసిన కవిత్వం వుత్పలమాల, చంపకమాల వగైరాలలో వుండకపోయినా “గతి”లో వుంటుంది. శ్రీశ్రీ కూడా “గతి” తప్పలేదని “ప్రూవ్” చేసెస్తే ఛందస్సు గొప్పదయిపోతుందా?

    మారుతున్న కాలంతో పాటూ మారిన కవులందరూ ఇవాల్టికీ బతికేవున్నారు.
    నన్నయ తెలుగులో కవిత్వం మొదలెట్టిన రోజుల్లో ఎన్నితిట్లు తిని వుంటాడండీ, సంస్క్రుత పండితుల వల్ల. అలాగే మాములు ప్రజలు మాట్లాడే భాషలో కవిత్వం రాయడం మొదలెట్టిన కవులు, నన్నయ “పధ్ధతిలో” వ్రాసిన కవుల తిట్లు తినేవుంటారు.
    అంతెందుకు, యండమూరి వీరేంద్రనాథ్ మొదట్లొ తిట్లుతిని, తరవాత, తరవాతి తరం వాళ్ళని “సాహిత్యాన్ని భ్రష్టు పట్టించెస్తున్నారు” అని అనడం కాల మహిమ కదూ? వింత కదూ?
    పానుగంటి వారు వ్రాసిన “కాల స్వరూపుడు” చదివితే, నన్నయని తిట్టిన వాళ్ళూ, తరవాతి వాళ్ళని తిట్టిన వాళ్ళూ, వీరేంద్రనాథూ అందరూ “సర్వేజనా సుఖినో భవంతు” అనుకునుండే వారు. (”సర్వేజనా” అంటే “సర్వే” డిపార్ట్మెంటే కాదు “రెవిన్యూ” వారు కూడా అని మనవి.)
    “ధారణ” గురించీ, కంఠతా పట్టవలసిన అవసరం లేకపోవడం గురించీ ఇక్కడ వ్రాయడం మీ లాటివాళ్ళ విజ్నతని అనుమానించడవే. అంత సత్తువ నా దగ్గర లేదు.

  4. rajasankar kasinadhuni అభిప్రాయం:

    August 20, 2008 6:28 am

    కవిత్వం కోసం ఛందస్సా, ఛందస్సు కోసం కవిత్వమా? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా?

    ఛందస్సువలన కవిత్వానికి ఒరిగేదేమిటి?

    ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆంగ్లకవి P.B. Shelley రాసిన “To a Sky Lark”


    Thou art unseen, but yet I hear thy shrill delight

    Like a high-born maiden
    In a palace tower,
    Soothing her love-laden
    Soul in secret hour
    With music sweet as love, which overflows her bower…

    లోని భావాన్ని రాయప్రోలు సుబ్బారావుగారు తన చంపకమాల పద్యాలలో ఎంత మధురంగా పొందుపరిచారో ఆలోచించి చూస్తే దొరకవచ్చు:
    “ప్రమద రసోదయాలస తరంగములన్ దవిలించి, పారవ
    శ్యమున నుయాలలూపెదవయారె! చరాచర చేతన ప్రపం
    చము బహిరంతర భ్రమణ సాధ్వసమేది ప్రశాంతమయ్యె, నే
    త్రములకు గానరావు, మధురంబుగ పాడెదవెందొ కోయిలా!

    ధవళ చిరత్న రత్నరచితంబగు సౌధమునగ్రమందు పూ
    నవకపు సెజ్జపై వలపునన్ తన కిన్నెర మేళవించి మో
    హవశముగా ప్రపంచమును నాకులపెట్టు నొయారివోలె, నీ
    భువనమునెల్ల రాగమయ భోగములన్ దనియింతొ కోయిలా!”

    నేను నమ్మిన సత్యం: నిజమైన కవిత్వం చెప్పగలిగన వారికెవరికీ ఛందస్సు ఆటంకం కాదు. భాష మీద పట్టులేక, వచనకవితా ప్రక్రియని అడ్డంపెట్టుకుని ఎదో గిలికి పారేసి ఛందోధర్మాన్ని వదిలిపెట్టినందువల్లె ఇంత గొప్ప కవిత్వం వ్రాయగలిగామని జబ్బలు చరుచుకునే (కు)కవులు, వారి భజంత్రీలు విస్తృతపఠనం అలవాటు చేసుకుంటే పైన మచ్చుకు చెప్పిన ఉదాహరణలులాటివి కోకొల్లలు కనపడతాయి తెలుగు సాహిత్యంలో.

    ఆధునిక తెలుగుకవిత్వానికి ఆద్యుడుగా గుర్తింపు పొందిన రాయప్రోలువారు అద్భుతమైన కవిత్వాన్ని అలవోకగా చిలికించగల గొప్ప కవి. యతిప్రాసలు పద్యానికి అతికించినట్టు ఉండకూడదనేవారిలో ఆయన ఒకరు అని ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారు నాతో ఎప్పుడూ అనేవారు. కవిత్వభాష గురించి అలాంటి మహనీయుడు రాయప్రోలువారి మాటల్లోనే:

    ధేనువులు తిను బహువిధ తృణచయమ్ము
    త్రావు నానానదీకూప జీవనమును
    కలిసి పరిణమింపవె పాలుగా ధరిత్రి
    శబ్దమేళన తంత్రనైజమ్ము నిదియె

    రాయప్రోలుగారి కవిత్వానికి నన్ను పరిచయం చేసిని పూజ్యులు ఆచార్య భొడ్డుపల్లి పురుషోత్తంగారికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను.

    రాజాశంకర్ కాశీనాథుని

  5. satya rama prasad kalluri అభిప్రాయం:

    August 20, 2008 7:27 am

    అన్నట్లు శ్రీశ్రీ ‘ సిప్రాలి ‘ ఏమిటండీ? ‘సిరిసిరిమువ్వ, ప్రాసక్రీడ, లిమరిక్కుల సమాహారమే కదా! వీటిలో ఛందస్సు లేనివేవి?

    తెలుగు సామెతల్లో సాధారణంగా యతో, ప్రాసో లేకుండా ఉండి ఉంటే వాటిలో సగానికి సగం కాలగర్భంలో కలిసిపోయి ఉండేవి కావా?

    భావం పుణ్యాంగన అయితే దానికి సోకును (బాహ్యమే కానక్కరలేదు) ఛందస్సు అనుకోవచ్చును అని నేననుకొంటున్నాను. (దీనినే ఎవరో ఒక పూర్వికుడు పుణ్యాంగనకు పణ్యాంగనకువలె అందాన్ని కూర్చేది ఛందస్సు అన్నాడు.) ‘యతిప్రాసలు విసర్జింపబడినవి’ అని బోరవిరుచుకోవటం సులభమేగాని, లయ కూడా లేని కవితలు కాలపురుషుడి కట్టెదుట నిలవటం కష్టమే.

    ఎటొచ్చీ ఛందస్సుకోసం కవిత్వం అనటంకూడా తెలివితక్కువే.

    ఆంధ్రపత్రికలో ఒకప్పుడు ప్రాస ఎంత సాంక్రామికమో (contagious) చెప్పటానికి ఒక ఉదాహరణను ఇచ్చారు. ఎవరో ఒక సింగుగారు క్రొత్తగా తెలుగుతో కుస్తీపడుతూ ‘అనుమానానికైనా ఆస్కారంలేకుండా తిరస్కరించి పంపారు’ అంటే కోపంతో వాళ్ళ బాసు ‘మిస్టర్ సింగ్ ! రైమింగ్ కోసం మీనింగ్ పాడుచేయద్దని మీకెన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి?’ అన్నాడట. మరి దీనిని కవిత్వం అని ఎవరూ అనరు కదా!

    చేతనైన వైణికుడి చేతిలో ఎలాగైతే స్వరాలు వాటంతట అవే సరిగ్గా వస్తాయో, అలాగే కవిత్వంచెప్పేవాడి ముఖతః రావలసిన లయ, సందర్భోచితఛందస్సు వగైరా అవే వచ్చిపడతాయి. వెతుక్కుంటే వచ్చేవికావు అవి.

    గణితంప్రకారం కవిత్వంలో భావం, ఛందస్సు పరస్పరపూరకాలు (complementary) అనుకోవటం సబబేమోననిపిస్తోంది నాకైతే.

    ఏది ఏమైనా ఆలోచింపజేసిన, మంచి వ్యాసాన్ని అందించిన దేశికాచార్యులవారిని అభినందిస్తున్నాను.

    కల్లూరి సత్యరామ ప్రసాద్
    kalluriprasad@hotmail.com

  6. baabjeelu అభిప్రాయం:

    August 20, 2008 9:27 am

    పావలా పట్కా, పాతికరూపాయిల జట్కా.
    పట్కా ఛందస్సు, సంధులూ, సమాసాలూ వగైరాలు.
    జట్కా కవిత్వం.
    మరి గుర్రం?
    అసలయిన దానినెలా వొగ్గెస్తావండీ.
    “కవితా వస్తువు”.

    పద్య కవిత్వవయినా, పొలై పొలై / మిల్లు ఖద్దరు కవిత్వ వయినా “ఇత్యాని పద్య/కవిత లక్షణాని” (పైటలు/చున్నీలు తగలెట్టండి అనే కవిత్వవయినా)

  7. rajasankar kasinadhuni అభిప్రాయం:

    August 20, 2008 10:22 am

    కుక్కపిల్ల, అగ్గిపెట్టి, సబ్బు బిళ్ళ, గుర్రం, గాడిద కావేవీ కవితకనర్హం. ఎటొచ్చీ రాసేవాళ్ళకున్న అర్హత తోనే పేచీ.

    రాజాశంకర్ కాశీనాథుని

  8. పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    August 20, 2008 1:08 pm

    పద్యవస్తువును నేను.
    నేనొకప్పుడు కళ్ళెంలేని గుఱ్ఱం
    స్వేచ్ఛాప్రాణీ, స్వైరవిహారీ, పంచకళ్యాణి
    నా చూపే నా పరిధి, నా దారే నా వీధి

    తిన్నదే భోజనం,
    విన్నదే సంగీతం,
    చూసిందే ఇంద్రజాలం,
    చేసిందే చమత్కారం.

    నాకు గతంలో కళ్ళెం తొడిగారు
    డెక్కలకి లాడాలు కొట్టారు
    కళ్ళకి గంతలు కట్టారు
    మూతికేమో చిక్కం వేసారు

    వీపుకి జీను తగిలించారు
    మెడకి గంటలు కట్టారు
    తమ పిచ్చన గమ్యాలు వివరించారు!
    నా బాధ్యతలను ఘోషించారు!

    రౌతులెందరో వీపెక్కారు
    కర్మకొద్దీ బరుఘోలు మోయించారు
    లేకపోతే బళ్ళు లాగించారు
    ఉరుకులు పరుగులు వేయించారు
    కాదంటే కొరడా ఝుళిపించారు

    అప్పుడా గంతలే నా జీవితం
    నా బరువులే నాటి మనుగడ
    నా జీనే అప్పటి నా స్వర్గం
    ఝాటీ దెబ్బే నా నరకం
    రౌతే నా భగవంతుడు

    చిక్కంపోతే భోజనం;
    పని చిక్కితే ఉపవాసం
    గంతలుపోతే వీక్షణం;
    విశ్రాంతికే అప్పుడు కాటకం
    నుంచుంటే ఒక శోష,

    పడుకుంటేనొక మైకం
    అలా ఆ సాహిత్య సాగరాన్ని
    లంఘించడమసాధ్యం!
    అందుకేనోయ్! మళ్ళీ ఇప్పుడు
    మూర్ఖత్వాన్ని మట్టుబెట్టి

    మరోసారి పద్య వస్తువు
    కళ్ళెం లేని గుఱ్ఱం!
    స్వేచ్ఛాప్రాణీ,
    స్వైరవిహారీ,
    పంచకళ్యాణి.

    అయ్యా బాబ్జీలు గారు

    మీరు ప్రతిభావంతులనీ, పండితులనీ, విటులనీ [:-) as in English wit; యిటువంటి తర్జుమాలతో వచ్చిన గొడవే ఇది. వెధవది మనం చెప్పొచ్చేదొకటి, ఇతరులకి అర్థమయ్యేది యింకోటీను. పోనీ విట్టులందామా అంటే అది యింకా ఘోరం కదండీ! మొత్తానికి నేను చెప్పొచ్చేది మీకు అర్థమయ్యింది కదా, అదే చాలు] అందరూ ఒప్పుకున్నారు కదా! మరి గజేంద్రుడి మొర ఆలకించని విష్ణు మూర్తిలా ఎన్నాళ్ళు వుంటారు చెప్పండి?

    నమస్కారములతో

    పామర్తి సత్యనారాయణ వ్రాలు

  9. baabjeelu అభిప్రాయం:

    August 20, 2008 9:06 pm

    రాసీ వాళ్ళ “అర్హత” తో పేచీ?
    రాసీ వాళ్ళూ “రాసినదాని” తో పేచీ?
    “అర్హత” లేన్నివాళ్ళు మంచి కవిత్వం రాస్తే పేచీ?
    “అర్హత” వున్న వాళ్ళు ఎలా గిలికినా “పేచీ”?

    చాలా పెద్ద పేచీ.

  10. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    August 21, 2008 9:52 am

    బాబ్జీలు గారు,
    మీరొచ్చాక ఈమాట కి హిట్లూ, రాసే వాళ్ళకి తిట్లూ పెరిగాయి : )-
    మీకు “అర్హత” తో పేచీ - నాకు “ప్రశ్న” లతో పేచీ!

    ప్రశ్నించే వాళ్ళ “అర్హత” తో పేచీ?
    ప్రశ్నించే వాళ్ళ “ప్రశ్నల” తో పేచీ?
    “అర్హత” లేన్నివాళ్ళు మంచి ప్రశ్న వేస్తే పేచీ?
    “అర్హత” వున్న వాళ్ళు ఎలా ప్రశ్నించినా “పేచీ”?
    అసలు ఏ “ప్రశ్నా” లేకపోతే పేచీ!

    చాలా పెద్ద పేచీ.
    ఈ “పేచీ” యే అంతు చిక్కని ప్రశ్న!

    సరదాకి రాసాను - దయచేసి బాణాసంచాలు బయటకి తీయకండి. దీపావళి దగ్గర్లో లేదు :)

  11. baabjeelu అభిప్రాయం:

    August 21, 2008 10:24 am

    సాయిగారూ,

    రాసేవాళ్ళకి అర్హత అక్కర్లేదు.

    ఎందుకంటే వాళ్ళు రాసిన దాని “అర్హత” మీద అది బతికితే బతుకుతుంది, లేకపోతేలేదు. రాసినవాళ్ళు “మలబారు పోలీసు గేంగీల్నెట్టి, రాసింది బాగోలేదని రాసిన వాళ్ళందర్నీ సితక్కొంటీచిసినా” దాని అర్హత మారదు.

    రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు “రత్తాలు రాంబాబు” నవల విషయంలో చెప్పింది, రాసే వాళ్ళందరూ ఆచరించదగ్గది.

    “కథ రాసేక, దాన్ని మరింక విడిచి పెట్టక, దాని మానాన్న దాన్ని బతకనివ్వక (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు, దాన్ని సాకుతూ, సంరక్షించుకుంటూ, సమర్థించుకుంటూ, నెత్తిని పెట్టుకొని తిరగడం నాకు ఇష్టం లేదు.

    నిజానికి దగ్గరగా వుంటే కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది, లేకపోతే పోతుంది.

    “రత్తాలు రాంబాబు” నవల గురించి ఏమైనా తెలియాలంటే, అది నవల వల్లే తెలియాలి కాని నా వల్ల కాదు.”

    అందుచేత, రాసిన ప్రక్రియకి అర్హత ఉండాలి, చదివే వాళ్ళందరిచేతా “సెబాస్” అనిపించుకునే అర్హత. చదివే వారికి అర్హత కావాలి. అర్థం చేసుకునే అర్హత. “సెబాస్” అనగలిగే అర్హత. రాసే వాళ్ళకి ఏ అర్హతా అక్కర్లేదు. రాయగలిగే అర్హత తప్ప.

  12. పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    August 21, 2008 11:17 am

    పైకింకోసారి వెళ్ళి అభిప్రాయాలన్నింటినీ మళ్ళీ చదివాను. ఎక్కడో కుకవులన్న మాట కనపడింది. అంటే ఏమిటబ్బా అని ఆలోచించాను.

    సుకవులు సుక్కలు (stars) కదా. ప్రాస కలవాలంటే కుకవులు కుక్కలవక తప్పదు.

    నాకొద్దు బాబోయ్ ఆ శునక సంబరం.

    కాబట్టి తక్షణ కర్తవ్యంగా

    ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
    ఏతేషామవిరోధేన పద్య కర్మ సమారభే

    ఛందామావాహయామి, ప్రాసామావాహయామి, యతీమావాహయామి
    యమాతారాజభానసలగమావాహయామి, చంద్రామావాహయామి, సూర్యామావాహయామి, ఇంద్రామావాహయామి, నానావిధాని దివ్యాని గణానామావాహయామి.

    నమో నమః

    పామర్తి కాలభైరవ (సొంత పేరు చెప్పుకుంటే వున్న వూరు అచ్చిరాదు అన్నారు పెద్దలు!)

    తాజా బలపం: గొర్తి వారి హిట్సూ, తిట్సూ ప్రాస బ్రహ్మాండంగా వుంది.

    తాజా తాజా బలపం: దీపావళి మాట దేవుడెరుగు. వినాయక చవితి మంత్రాల్లో కూడా గణాలే వినబడుతున్నాయి నాకు. నమ్మ శక్యం కాక పోతే మీరే చెప్పండి. గణానాంత్వా గణపతి …

    All this is for fun. I love both metrical and non metrical poetry as long as it is good. :)

  13. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    August 21, 2008 11:38 am

    బాబ్జీలు గారూ,

    మోహన రావు గారన్నట్లు “మీరొచ్చాక ఈ మాట క్లిక్ చేయని రోజు” లేదు. వచ్చీ రాగానే మీ కామెంట్ల కోసం చూస్తాను. అవి చదవడం ఇప్పుడోక వ్యసనం లా తయారయ్యింది. నాకూ “రావి శాస్త్రి” రచనలంటే చాలా ఇష్టం. ఆయన “వేతన శర్మ” అని, 1970 ల్లో అనుకుంటా, ఓ కథ రాసారు. అది ఇప్పటికీ వర్తిస్తుంది. ఇదే కథనాధారంగా నేను “చినుకు” అనే నాటకం రాసాను, ఓ నాటకాల పోటీకి. అది విశాఖ పట్నంలో ప్రదర్శించారు. 1984 లో జగదాంబ సెంటర్లో రావిశాస్త్రి గార్ని కలిసాను. దాదాపు పాతికేళ్ళ తరువాత కూడా “అక్షరం పొల్లుపోకుండా” నాకింకా గుర్తున్నాయి ఆయన మాటలు. ఆయన రాతలతో నిమిరిన తెలుగు కథ అజారమరం.
    మీరన్నట్లు “సత్తు” వుంటే కాలం మోస్తుంది. లేకపోతే అది రచయత భుజాల మీద బ్రతుకుతుంది.
    మీ వాక్యాలు పాత జ్ఞాపకాలని తవ్వుతున్నాయి.

  14. విప్లవ్ అభిప్రాయం:

    August 22, 2008 10:31 am

    బాబ్జీలు గారూ,

    “రాసేవాళ్ళకి అర్హత అక్కర్లేదు.” అనేది అంత డెఫినిటివ్ గా చెప్పటం కష్టమేమో?

    రాసింది గొప్పదయితే దానికదే నిలబడుతుంది, అన్నది బాగానే ఉంది.

    కానీ,

    పిల్లలకొరకు ‘నీతి పుస్తకాలు’ రాయటానికి child molestors పనికి రారు, రాసిన విషయం ఎంత గొప్పదయినా సరే. రాసే వాళ్ళకు credibility ఉండాలి కాబట్టే ఎవర్రాసారు అన్నది ముఖ్యం.

    ఇక “క్రెడిబిలిటీ” అన్నది ఒక జారుడుబండే కదా అంటే, అది కూడా నిజమే. రాసిన విషయానికున్న తీవ్రతను బట్టి రాసిన వారిని ప్రశ్నించటం జరుగుతుంది, కాదంటారా?

    నిన్నీమధ్యే ఈ కామెంట్లు చదవటం మొదలు పెట్టాను. మీర్రాసే భాషకు మంచి స్పందన ఉంటుంది అన్నది వేరే ఎవరూ చెప్పాల్సిన పనిలేదు.
    ఎవరైనా “రాసే తెలుగు” కు ఒక స్టాండర్డ్ ఉండాలి అని అంటే మీరేమంటారు, ఈమాట యూనికోడ్ అలవాటైనాక? మీ అభిప్రాయం మీ భాషలో చెప్పండి.

    విప్లవ్

  15. Ravikiran Timmireddy అభిప్రాయం:

    August 25, 2008 6:34 am

    “ఇదిగో, బతుకంటే ఇదీ బతుకు, ఇలా బతకడవే బతుకు.” ఫలాని విధంగా బ్రతకటవే గొప్ప, ఫలాని దార్లో ప్రయాణించడవే వొప్పు, బతుక్కి ఫలాని నిర్వచనవే కరక్టు. ఒక అనంతవైన అనుభవానికి దిశ నిర్దేశం చేసే ప్రయత్నం. ఎల్లలు లేనటువంటి ఒక అద్భుతానికి చట్రాలు బిగించే ప్రయత్నం. నియమితవైన సంఘంలో, పరిమితవైన అవకాశాలున్న సంఘంలో (బతుకవసరాలు తీర్చుకోడానికి) ఈ రకవైన దిశనిర్దేశం సహజవే. కానీ కొందరుంటారు వాళ్ళని నియమాల్తోనూ, అవకాశాల్తోనూ ఆపడం సాద్యంకాదు. అకాశాన్నీ, గాలిని, అనంతాన్ని నింపుకుని పుట్టిన వాళ్ళు, ఆన్ని చట్రాలని పగల కోడ్తారు, అన్ని నియమాల్ని చిందరవందర చేస్తారు. వాళ్ళకి బ్రతుకొక స్వప్నం, వాళ్ళు బ్రతుకుని, బ్రతకడాన్ని వేరువేరుగా చూడరు, వాళ్ళు కవితని, వచన కవితని విడదీసి చూడరు. నా ద్రుష్టిలో బ్రతుకుని అనుభవించి పలవరించడవే కవిత్వం. ఆ పలవరింతకి వొక నియమావళి అక్కరలేదు, ఒక రెఫరెన్సు అక్కరలేదు. దానికో ప్రణాలిక, పాఠ్య గ్రంధం అక్కరలేదు, దానికో సర్టిఫికేట్ అక్కరలేదు. ఆ అనుభూతి, ఆ పలవరింత ఎదుటి మనసుని తాకగలిగితే చాలు (తాకకపోయినా పరవాలేదు). అది ఏ రూపంలో వుంది, ఏ భాషలో వుంది, ఎవరి బతుకును తనలో పొదువుకునొచ్చింది అనేవి అవసరవని నేననుకోను. ఛందోధర్మాలు, వ్యాకరణ సూత్రాలు వుంటే వుండనివ్వండి, కానీ అవి లేకపోవడం బలహీనత కాదు. భావప్రసరణ జరిగిందా లేదా అనేదే కావాలిగానీ, గడిచిపోయిన దినాల్లో, నడిచిపోయిన కవుల రెఫరెన్సులు అవసరం వుందని నేననుకోను.

    నామిని, రావీ శాస్త్రి రచనల్లో నాకా బతుకు పలవరింతే కనపడుతుంది, నాకు కవిత్వవే కనపడుతుంది. అది వచనవా అంటే వచనవే కానీ అది నిస్సండేహంగా కవిత్వవే. మన అనుభవాన్ని వ్యక్థం చేయడానికి రోజువారీ పదాలు సరిపోకపోవడవేవిటో నాకు తెలీదు. అక్కడా, ఇక్కడా గతంలోనూ, గ్రంధాల్లోనూ వెతకనక్కరలేదు. ఈమాటలో ప్రచురితవైన కవితల్లో (కవితలన్నీ నచ్చాలని కాదు), నాకెక్కడా పదదారిద్ర్యం కనపడలేదు. మామూలు మనుషుల, మామూలు బ్రతుకుల, మామూలు మాటల్లో వ్యక్తీకరించలేని జీవితానుభవం వొకటుందా?

  16. baabjeelu అభిప్రాయం:

    August 25, 2008 7:16 am

    విప్లవ్ గారూ,
    “రాసే తెలుగు” గురించి: ఇది “అమ్రుతం”, “క్రుష్ణుడు” అని నేను రాసిన వాటిగురించి అనుకుంటాను. వుప్పల లక్ష్మణరావుగారి ప్రభావం. ఈ మాట సంపాదక వర్గం వారే హెచ్చరించేరు. మా గురువుగారు కూడా “స్పెల్లింగ్” దిద్దించేరు.అమృతం అని రాయడం కష్టవని నేననుకోవటంలేదు. నిజానికి అంత పట్టింపూ లేదు. మిగిలిన కవుల/రచయత(త్రు)ల, వ్యాసుళ్ళ తల్లిదండ్రులు ఈ మాట సంపాదకవర్గాన్ని కలిసి ఇలాటి “స్పెల్లింగులు” రాసే వాళ్ళ అభిప్రాయాలు మీ పత్రికలో వేస్తే కుదరదు, కాదూ కూడదంటే మాపిల్లల “టీసీ” లిచ్చేయండి అని బెదిరించేరనుకోండి, అప్పుడు నేను మారిపోవచ్చు లేదా ఈ మాట లో నేను అభిప్రాయాలు రాయకపోవొచ్చు.
    ఇహ “క్రెడిబిలిటీ” గురించి: “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్నదీ, దాని గురించి మిగిలినవాళ్ళందరూ రాసింది, రాసే వాళ్ళ రాయగలిగే సత్తువ గురించి. ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి. ఇదంతా “గుంచీ” దగ్గరో, “బొంకులదిబ్బ” దగ్గరో, “ఐకోనేరు గట్టు” మీదో (పెద్దాంజనేయస్వామి గుడి దగ్గర) సాయింత్రం కలుసుకుని కబుర్లాడుకునే వాళ్ళ వ్యవహారం. మిగతా పరిస్తితులన్నీ మారకుండా వుంటే అప్పుడు కవికి కావల్సిన “అర్హత” ల గురించి.

    మీరు చెప్పిన జారుడుబండ సంగతి: జీవితంలో మిగిలిన వ్యవహారాల్లో కవి ఎలావుండాలన్నది. చాలా కష్టం. జీవితం “డైనమిక్” వ్యవహారం కదా? అందులోనూ “ఫోర్త్ డైమన్షన్” ని పట్టుకుని అప్పుడు “త్రీడైమన్షన్” లో కవిగారి సంగతి తేల్చడం “కమ్నిస్టులు” కూడా చెయ్యలేరేమో? ఎందుకంటే “ఫోర్త్ డైమన్షన్” ని పట్టుకుని ఆపగలగడం కుదరదు. అందుకే, తెలిసిన వారు కాబట్టి “జారుడు బండ” అని చక్కగా చెప్పేరు. (”కమ్నిస్టులు” అంటే మిగిలిన అందరికన్నా తెలివయిన వాళ్ళని చిన్నపట్నించీ “బ్రైన్ వాష్” అవడంవల్ల వాడేను.)
    మీరు రాసిన “ఛైల్డ్ మోలెస్టర్స్” చిన్న పిల్లల కథలు రాయడానికి పనికిరారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళకోసం కథలు రాస్తే పర్వాలేదా?

  17. mOhana అభిప్రాయం:

    August 25, 2008 12:41 pm

    నన్నయ కాలములో ఋ-కారాన్ని రి-కారముగా పలికేవారు.
    అందుకే ఆ కాలపు శాసనాలలో కూడ ఋణము అనృ దానికి
    బదులు రిణము అని వాడారు. కాని తిక్కన కాలానికే ఋ-కారాన్ని
    రు-కారముగా పలకడానికి ఆరంభించారు. తిక్కనగారు కొన్ని
    చోటులలో ఋ-కారానికి రు-కారానికి యతి కూడ చెల్లించారు.
    సామాన్యముగా ఛందస్సులో ఇది నిషిద్దము. ఋ-కారానికి
    రి-కారానికి, ఇ, ఈ, ఎ, ఏ, హి, హీ, హె, హే, యి, యీ, యె,
    యే, ఋ-కారము ఉన్న అన్ని హల్లులకు యతి చెల్లుతుంది.
    కాబట్టి అమ్రుతము అని పలికేటప్పుడు, వ్యావహారిక భాషలో
    అమృతమునకు బదులు అలా రాయడములో తప్పు లేదని
    నా భావన. గ్రాంథికముగా మాత్రము అది సరి కాదు, అంతే.
    తెలుగువారు మాత్రమే కాదు, కన్నడ, మరాఠీ, ఒరియా భాషలలో
    ఋ-కారాన్ని రు-కారముగా పలుకుతారు. మిగిలిన ఉత్తర
    భాషలలో రి-కారముగా పలుకుతారు.
    విధేయుడు - మోహన

  18. జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:

    August 26, 2008 7:25 am

    విప్లవ్ గారు, “పిల్లలకొరకు ‘నీతి పుస్తకాలు’ రాయటానికి child molestors పనికి రారు, రాసిన విషయం ఎంత గొప్పదయినా సరే. రాసే వాళ్ళకు credibility ఉండాలి కాబట్టే ఎవర్రాసారు అన్నది ముఖ్యం” అని రాసినదాన్ని, బాబ్జీలు గారు మహా యాంత్రికంగా అర్థం చేసుకుని, బదులుగా ఆయన, “మీరు రాసిన “ఛైల్డ్ మోలెస్టర్స్” చిన్న పిల్లల కథలు రాయడానికి పనికిరారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళకోసం కథలు రాస్తే పర్వాలేదా?” అని అడిగారు. అదా దానర్థం?

    విప్లవ్ గారు రాసిన మాటల వెనకనున్న అర్థాన్ని సరిగా గ్రహించాలి. నీతివంతమైన ప్రవర్తన లేని మనుషులు గురివింద గింజల్లాగా, నంగనాచుల్లాగా ఇతరులకి నీతులు చేప్పే అర్హత కలిగి వుండరు అని అర్థం. యాంత్రికంగా అర్థం చేసుకుని, చైల్డ్ మోలెస్టర్సూ, పెద్దాళ్ళూ, గట్రా అని రాస్తే, ఏమన్నా అర్థం వుంటుందా?

    విప్లవ్ గారు రాసింది చాలా కరెక్టు. “దెయ్యాలు మంత్రాలు వల్లించకూడదు” అని అంటారు చూశారా, అలాగన్న మాట. నీతి లేని వారు నీతి గురించి ఇతరులకి చెప్తే, “నువ్వు చేసేదేవిటీ, చెప్పొచ్చావు గొప్పగా ఇతరులకి” అని ఆ ఇతరులు నిలదీస్తారు. వాళ్ళు దులుపుకు పోతారనుకోండీ, అది వేరే సంగతి.

    అయితే ప్రస్తుత సమాజాన్ని పరిశీలించండి. దెయ్యాల కధలూ, థ్రిల్లర్ నవల్లూ రాసి, పాపులర్ రచయితగా పేరు సంపాదించుకుని, కాలేజీ ఆడపిల్లను వశపరుచుకుని, ఆ పిల్ల ఆత్మహత్యకు కారణమైన గొప్ప రచయిత ఈ రోజుకీ గొప్పగానే చలామణీ అవుతున్నాడు. విప్లవాల గురించి గొప్పగా రాసి, ఇద్దరు భార్యలను పెట్టుకుని, బయట స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటూ, “ఎన్ని సిగరెట్లు కాల్చినా చార్ మీనార్ కాల్చిన తృప్తి వుండదు. ఎంత మంది ఆడవాళ్ళతో తిరిగినా, నా రెండో భార్యతో గడిపినట్టు వుండదు” అని ఆత్మ కధలో రాసుకుని, ఆ బయటి ఆడవాళ్ళను స్నేహితులతో పంచుకుంటూ, విచ్చలవిడిగా తిరుగుబోతుతనాన్ని ప్రదర్శించిన వారు మహా కవులుగా చలామణీ అవుతూ, పతితల గురించీ, భ్రష్టల గురించీ గొప్ప కవిత్వాలు రాశారు. ఇద్దరు భార్యల భుజాల మీదా చేతులు వేసి, పత్రికల్లో ఫొటోలు వేయించుకునే విప్లవ కవులున్నారు. ఇలా ఎంత మంది గురించో చెప్పుకోవచ్చు. ప్రజలు వీళ్ళ సాహిత్యం చదవడం మానేశారా? ఆ మధ్య ఆడపిల్లల్ని ఇండియా నించి తీసుకువచ్చి, అమెరికాలో వ్యభిచారంలోకి దించిన బిజినెస్ మేన్ కేసు గురించి విన్నాము. ఆ మనిషీ హాయిగా బతుకుతూనే వున్నాడు.

    పైన వుదాహరించిన వాళ్ళకి సమర్థకులు లేరా? వాళ్ళేమంటారు? “ఈ సాహిత్యకారుల అసలు జీవితాలు మాకెండుకూ? వారు రాసింది మాత్రమే చూస్తాం” అని సన్నాయి రాగాలు తీస్తారు. ఇంకా గడుసు సమర్థకులైతే, “వీళ్ళ గురించి తెలిసినవన్నీ నిజాలే అని గేరంటీ ఏమిటీ? ఏమో, అవి నిజాలు కావేమో? మీరేమన్నా చూశారా? మీ దగ్గర రుజువులున్నాయా?” అని మన్నే దబాయిస్తారు. చాలా మంది అయితే, “ఏమోనండీ! మాకవేవీ తెలియవు” అని తప్పించుకుంటారు.

    అదీగాక నీతులు రాసేవారి చరిత్రలు చాలా మందికి నిజంగానే తెలియవు. తెలిసినా పట్టించుకోరు. “సిగరెట్ కాల్చేవాడు ఇతరులకి కాల్చొద్దని చెప్పకూడదా? ఆ అలవాటు వల్ల జరిగే హాని అనుభవిస్తున్నాడు కాబట్టి, ఇతరులకి చెప్పగలుగుతున్నాడు” అని మొండిగా వాదిస్తారు కొంత మంది మహానుభావులు.

    ఇదంతా చూస్తే, కప్పల తక్కెడ వ్యవహారమే గుర్తొస్తుంది. “ఏది నీతీ, ఏది అవినీతీ? అన్నీ కాలాన్ని బట్టి మారుతూ వుంటాయి” అని అడ్డగోలుగా మాట్టాడే సూడో ఫెమినిస్టులూ, సూడో కమ్యూనిస్టులూ కూడా వున్నారు.

    ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, విప్లవ్ గారు చెప్పింది కరెక్టే అయినా, ప్రస్తుత సమాజంలో ఆయన చెప్పింది జరగడం లేదు. అవినీతి పరులు నీతి గురించి సాహిత్యంలో పొగలు కక్కుతూనే వున్నారు!

    - జె.యు.బి.వి. ప్రసాద్

  19. Kameswara Rao అభిప్రాయం:

    August 26, 2008 9:30 am

    పదేళ్ళుగా eగ్రూపుల్లో ఉండి చూసిన సాధారణ విషయం ఒకటుంది. ఒకరేదో విషయం మీద ఒక పోస్టు వేస్తారు, దానికి సంబంధించిన టైటిలేదో పెట్టి. అది సిసింద్రీలా వేసిన చోట ఉండకుండా దానిష్టం వచ్చిన దిశలో, ఇష్టం వచ్చిన రీతిలో భూమ్యాకాశాల్లో సంచరించడం మొదలుపెడుతుంది. దాంతో కాస్త తెలివున్న వాళ్ళు ఆ పోస్టు టైటులు మారిన విషయానికి అణుగుణంగా మారుస్తూ ఉంటారు.
    అలాటి సౌకర్యమిక్కడేమైనా ఉంటే ఈ వ్యాసం టైటిలు అర్జంటుగా మార్చేయాల్సిన అవసరం ఉన్నట్టు నాకు గట్టిగా అనిపిస్తోంది :)

  20. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    August 26, 2008 11:02 am

    ఈ మాటలో “దీపావళి” బాగుంది.
    మాటల తూటాలూ, సిసింద్రీ కామెంట్లూ ( కొన్ని తుస్సు మంటాయి), “ఆహా ఓహో” తారాజువ్వలూ, “Y-D-N-K-A” మార్కు లక్ష్మీ బాంబులు, వెనక నుండి ఎవరు వేసారో తెలీని చీమటపాకాయలూ, మధ్యలో సొంత గోల “తుస్సు” బ్రాండు చిచ్చు బుడ్లూ, “భజన” మార్కు మతాబాలూ, ఇలా రకరకాల బాణా సంచాలతో ఈ “దీపావళి” సంచిక నచ్చనివాళ్ళుంటారా?

    ( సరదాకి రాసిందిది. దయచేసి మీ బాణాసంచా వచ్చే దీపావళికి దాచండి. :) -

  21. ravikiran timmireddy అభిప్రాయం:

    August 26, 2008 1:53 pm

    ఈ మాట వారికి ఒక మనవి. మీరెలా గా “ఈమాట రచయితలు” లో రచయితల పరిచయం యిస్తున్నారు కాబట్టి, దాంతోపాటే రచయితల గుణ గణాల పరిచయం కూడా ఇస్తే బావుంటుందని నా అభిప్రాయం. మచ్చుకి రచయితకి ఎంతమంది భార్యలు లేక భర్తలు వున్నారనే వివరాలు. అక్కడతోనే ఆగేరా లేక ఇంకా ఇద్దరు ముగ్గురిని కట్టుకునే, పెట్టుకునే ఆలోచనలేవన్నా వున్నాయా. వాళ్ళే కాక ఇంకా బయటి వ్యక్తులతో వాళ్ళ సంబంధాలు. వాళ్ళని పంచుకోగలిగే అవకాశాలు. వాళ్ళు భార్యల, భర్తల (ఎంతమంది మీద వొకటే సారి చేతులైగలిగితే అంతమంచిది) భుజాలమీ చేతులేసి తీయ్యించుకున్న ఫొటొ వొకటి వీలైతే. రచయిత మంచి కమ్యినిష్టు, కాంగ్రేసు, జనసంఘవా, లేక చెడ్డ కమ్యునిష్టు, కాంగ్రేసు, జనసంఘవా. వీళ్ళు మంత్రాలు వల్లించే దెయ్యాలా, లేక ఏవీ వల్లించని దేవతలా. ఫుల్ టైమ్ దయ్యాలా, లేక మూన్ లైటింగ్ దయ్యాలా. వీళ్ళ సూడో కమ్యునిస్టు, సూడో ఫెమినిష్టుల నంబర్ (0-10 స్కేలు). ఇత్యాది సమాచారం ఈమాట పాఠకులకి లభ్యమైతే, ఇక పాఠకుల ఇష్టా ఇష్టాలని బట్టి (రచయిత గుణగణాలకనుగుణంగా)రచనల్ని చదవగలిగే అవకాశం కలుగుతుందని నా మనవి. కానీ జరిగిపోవలసిన అనర్థం జరిగే పొయ్యింది కదా అని నా బాధ. ప్రసాదు గారి గురించి తెలియకుండానే, కనీసం తెలుసుకోవాలనే ఆలోచన లేకుండానే ఆయన కథలు చదివేశానే ఇప్పుడెలా రా భగవంతుడా (ఖర్మ ఆయన్ని కూడా త్రాసులో పేట్టాలి కామోసు).

    కామేశ్వరరావు గారు చక్కటి విషయం చెప్పేరండీ.

  22. పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    August 26, 2008 2:28 pm

    జె యు బీ వీ ప్రసాదుగారు రాసింది చదివిన తర్వాత నాకు పైన రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్* చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.

    నీతిని వల్లించే వాళ్ళని ఎప్పుడూ భీతితో చూడాలి.

    :))

    పురుగులుండే మేడి పండు కన్నా పచ్చి అరటి కాయే నయం. కొంప దీసి నేను ఇప్పుడు చెప్పిన రెండు ముక్కలు కూడా నీతి వాక్యాలేనా ఏమిటి? తస్మాత్ జాగ్రత జాగ్రతః.

    నమస్కారములతో

    పామర్తి సత్యనారాయణ
    *“The louder he talks of honor, the faster we count our spoons.” — Ralph Waldo Emerson

  23. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    August 26, 2008 8:49 pm

    రచయితలు, శ్రీరంగనీతులు

    ఇది జె.యు.బి.వి. ప్రసాద్ గారి అబిప్రాయంపై నా స్పందన. పాతికేళ్ళ క్రితం ఆంద్రజ్యోతిలో అనుక్షణికం సీరియల్ చివరకొస్తుండగా, పాఠకులతో ప్రశ్న-జవాబుల ముచ్చట ముగిస్తూ, వడ్డెర చండీదాస్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి:

    “చాలా మంది పాఠకులు నా గురించి (’పర్సనల్’ విషయాలు) అడుగుతూ వొచ్చారు. మీరు మీ నవలలో కులాలను కులాలుగా స్పష్టంగా చిత్రించారు కదా. మీది యే కులం. మీ సొంత కులాన్ని మీరు ఏ విధంగా చిత్రించారో తెలుసుకోవాలనుంది / మీ భార్య చనిపోయినప్పుడు “హిమజ్వాల”, ప్రేయసి చనిపోయినప్పుడు “అనుక్షణికం” రాశారట కదా / మీరు కన్వెర్టెడ్ క్రిస్టియన్నట కదా / మీ జీవితంలో కులతత్వాల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ వొచ్చారు / మీరు తిరుగుబోతట కదా / మీది కులాంతరమట కదా / మీరు తిక్కమనిషట కదా / మీరు దేవుడిలాంటివారట కదా / మీరు అవివాహితులట కదా / మీకు ఇద్దరు భార్యలట కదా / మీరు బ్రహ్మచారులట కదా, యిలా యెన్నో. వాటికి వేటికీ జవాబు లివ్వలేదు. నచ్చితే నా రచన చదవండి. నా జీవితాన్ని అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ అలా వుంచండి. నా రచననీ నా జీవితాన్నీ కలిపి పరిశీలించతగిన రచయితనైతే అందుకు యింకా వ్యవధి వుంది….

    ఐతే. నా జీవితం - అందులో అల్పత్వాలున్నా మహత్వాలున్నా అసహ్యతలున్నా అభినందనీయాలున్నా అభిశంసనీయాలున్నా నా జీవితం నా జీవితంగా యధాతధంగా పరిశీలించాల్సిన వేళ వొస్తే ఆనాడు తప్పక అలా యధాతధంగా లభ్యమవుతుంది.”

    చండీదాస్ లాంటి రచయితలు అరుదు. కాని ఆయనన్నది అందరికీ వర్తిస్తుందనుకుంటాను. యండమూరి, శ్రీశ్రీ, శివారెడ్ది, పసంద్ రెడ్డి (?) - వాళ్ళ రచనలు అసలు ముందర చదవదగ్గవో కావో పరిశీలించండి. చదవదగ్గవి కాకపోతే, వాళ్ళ జీవితం లో కెళ్ళడం వ్యర్థం. చదవదగ్గవే కాక, ఉన్నతమైన రచనలైతే, వాళ్ళ జీవితాల్లో కెళ్ళండి. వారి అల్పత్వాలని బయల్పరచి వాటి మూలంగా ఒకప్పుడు విలువైనవనుకున్న రచనలు ఇప్పుడు పాఠకులు ఎందుకు విసిరి పారెయ్యాలో వివరించండి. వెంటనే పాఠకులలో మార్పు వచ్చి సమాజంలో నీతీ న్యాయం పెరుగుతాయనుకోను గాని, మీ ఆక్రోశానికి మాత్రం సాహితీ గౌరవం లభిస్తుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

  24. baabjeelu అభిప్రాయం:

    August 27, 2008 9:50 am

    యిప్లవుబాబూ,
    ఒల్లకున్నావేటీ? రాత్రేల రామ్మందిరం కాడ కూకోని కబుర్లాడీవోల్లందర్నీ యీ రొచ్చు లోకి లాగింది నువ్వు కాదేటి? నానా, నువ్వా?
    మరయితే, ముచ్చటేటంటే, నాన్రాసిన “వాక్యం” లో నాననుకన్న “టోన్ & టెనర్” నాననుకున్నట్టు “ప్రెహాదు” బాబుకినిపించనేదు. అందుకే అలా బెజ్జరిల్లిపోనాడు.
    అదాబాబు తప్పుకాదు. అది నా తప్పే. ఎందుకంటే రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.
    “క్రెడిబిలిటీ” ని నువ్వే జారుడుబండంటావు. “అదీ నిజమే” అనికదా నువ్వు రాసింది. నానూ వొప్పేసుకున్నానుగదా?
    “క్రెడిబిలిటీ” గురించే, యిప్లవ్ బాబూ, ఇటాలకించు,దీనికేటంటావు?
    యేమన పజ్జాలు మనవందరివీ సదువుకున్నాం, మన పిల్లలసేత కంటతా పట్టించెస్తన్నాం. యేమన్నొదిలెద్దావా బాబూ? ఎందుకంటే, ఆ బాబు ఆ పజ్జాలు రాయకముందు మన్లాటోడే గదా? అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి? మాలాటోళ్ళవొప్పినా, నువ్వూ “ప్రెహాదు” బాబూ వొప్పుతారేటి?మన పిల్లల్ని మనం కానుకోవా? యేమనలాటోడికి మన పిల్లల్ని వొప్పగించెస్తావా? యేమన మనకంటా “బేవార్సా”, మనం యేమన కంటా “బేవార్సా?”. ఆ బాబు సేసిన జల్సాలు నువ్వు సేసేవా? నాను సేసేనా? “ప్రెహాదు” బాబు సేసేడా? ఆ వొయిసులో”జల్సాలు” సెయ్యడం “తప్పు గాదెహె” అనంటావా? మరేటి సేస్తే తప్పు. మరెప్పుడు సేస్తే తప్పు. మరోడు సేసింది తప్పా వొప్పా సెప్పడానికి నువ్వెడివెహె?” అనడిగీవోళ్ళకి నువ్వేటంతావు?
    నిజాయితీ అంటే ఏటో చరిగ్గా తెలీనోళ్ళందరం మేం. నీతి గురించేటంటాం?
    నిజాయితీని దాటి, నీతికాడికెళిపోయినోడు, “ప్రెహాదు” బాబు.
    ఇలా వొల్లకుండిపోడం అన్నేయం యిప్లవ్ బాబూ. లేదూ, “అపీసు” పన్లో యీలు దొరక్క ఏటీ అన్లేదంటావా? యీలు దొరికేకే సెప్పు. సెప్పీదేదో సరిగ్గా సెప్పు. నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.
    ఎందుకంటే, “ఛందస్సూ” మిగిలిన వాటి గురించి కొట్టుకు ఛస్తున్న మమ్మల్ని ఈ “జారుడుబండ” వ్యవహారంలోకి లాగింది మీరు. పాపం “ప్రెహాదు” గారు, ఆయన్నొగ్గెద్దాం. మీరేటంతారు?
    ఒకటి మాత్రం నిజం. మాలాటి కడుపు నిండిన వాళ్ళు, నీతి గురించీ, అవినీతి గురించీ, ‘చండీదాస్” చెప్పినట్లు, ఆంధ్రజ్యోతి లోనే, నిజాయితీని దాటేక కదా సెయ్యాల.
    దెయ్యాలు వేదాలు (మంత్రాలు కాదు, యిప్లవ్ బాబూ) వల్లించడవంటే, నువ్వూ, నానూ చేస్తున్నది. ఔనంటావా? కాదంటావా?

  25. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    August 27, 2008 10:33 am

    హనుమంతరావు గారికి,

    వ్యక్తిగత విషయాలూ,వ్యక్తిత్వాలూ రెండూ వేర్వేరు. మీరు ఈనవల మీ ప్రేయసి పోయినప్పుడు రాసారట కదా అన్నది వ్యక్తిగత విషయం. కులం గురించి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తూ కాస్ట్ ఫీలింగ్ చూపడం వ్యక్తిత్వం. ఏ రచనయినా బాగుందనిపిస్తే ఆయా రచయితలగురించి ఆరా తీయడం సహజం. అప్పుడప్పుడు ఈ వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిత్వాలు కూడా వద్దన్నా బయటకొస్తాయి. వాటితోనే
    ( రచయితలతోనూ, వారి రచనలతోనూ) పాఠకులకి పేచీ!
    నేను నాకు నచ్చింది రాస్తానూ, నా జీవితం నా ఇష్టం / నచ్చితే చదువు / లేదా వదిలేయి / రచన్నీ, రచయిత జీవితాన్ని కలిపిచూడద్దు / అని రచయితే చెప్పడం ( ముక్కు సూటి వ్యవహారంలా కనిపించచ్చు ) ఎంతవరకూ సబబు? ఏ రచనయినా రాసేవాళ్ళ దృక్పథాన్ని బట్టే కదా వచ్చేది? సొంత అనుభవాల్లోచో లేదా పక్కవాళ్ళ జీవితాల్లాంచో రచనలు పుడతాయి. వీటిని యథాతథంగా రాయడం వేరు. వేరే దృక్పథంలో చెప్పడం వేరు. రెండూ ఒకటి కాదు. అప్పుడే రచయిత వ్యక్తిత్వం బయల్పడేది. చేతిలో సిగరెట్టు వెలిగించి, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడంలా ఉంటుంది. నాస్తికులు పురాణ కథని చెబితే చెప్పిన దానస్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు పాఠకులకుండదా? నాగురించి కళ్ళు మూసుకో. వస్తువునే చూడు అని చెబితే ఎంతమంది ఒప్పుకుంటారు?
    నెను శ్రీ శ్రీ దేవుణ్ణి నమ్మరని విన్నాను. ఆయన అనేక భక్తి డబ్బింగ్ సినిమాలకి రచనలు చేసారు. నేను మూల రచనని యథాతథంగా రాసానంతే - రాయడం నా వృత్తి - నమ్మకం వేరు - జీవనోపాధి వేరు అనని శ్రీ శ్రీయే చెప్పడం డబాయింపులా కనిపిస్తుంది కానీ సంజాయిషీ అవదు. ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
    బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.

  26. విప్లవ్ అభిప్రాయం:

    August 27, 2008 1:06 pm

    మై డియర్ బాబ్జీలు,

    జారుడుబండ మీద కాలేస్తే ఏమవుతుందో తెలిసీ, పెద్దగా పట్టించుకోని రచయితలు మనకు కావాలని ఎవరైనా కోరుకుంటే ‘చదివే సమాజం’ పరిధి పెరగాలి. మనమున్న బావి, కాదు ఇంకుడు గుంత, లోంచి కనీసం తలైనా పైకెత్తి ప్రపంచాన్ని చూద్దాం అని చదివే వాళ్ళకుండాలి. చదివే వాళ్ళకు అర్హత అవసరం అన్నది కొంతవరకూ కరెక్ట్. అది ఎట్లాంటి అర్హత అనేదగ్గరే కొద్ది పేచీలు. వాటిని తీర్చడానికి కొంత అర్హత కలిగిన వాళ్ళే రాయాలి. వాటి మీద మళ్ళీ చదవటానికి, రాయటానికి “క్వాలిఫై” అయిన వాళ్ళే కావాలి.

    విషయం తీవ్రబడి, చిక్కబడ్డప్పుడు అర్హత అనేది ముఖ్యమవుతుంది. కొడవళ్ళ కోట్ చేసిన, ఆయన ఫేవరైట్ రచయిత మాటలు ఆ దాంట్లోకే వస్తాయి. అది డిఫెండ్ చేయగలిగే మాట.

    విషయానికున్న తీవ్రతను రచయితకన్నా అర్హత కలిగిన పాఠకుడే బాగా గ్రహిస్తాడేమో అని నా అనుమానం.

    ఇక మళ్ళీ ఒకసారి ముందునించే మొదలు పెడితే:

    సరే, మీరన్న రాయటానికి అర్హత అక్కర్లేదు అన్నది “ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి” అయినా కూడా ఆయా విషయాలకు ఉన్న తీవ్రత ఏ అర్హతా లేని వాళ్ళకు తెలవదు, రాయలేరు. (తెలుస్తుందని, రాయగలరని మీకు అనిపిస్తే, “ప్రూఫులు కావాలి” బాబ్జీలు గారూ అంటాన్నేను :)). “తెలవటం” ఒక అర్హత.

    ఇది గుడిపాటి అడిగిన “మన కవులు అక్షరాస్యులేనా!” దగ్గరికే తీసుకు రావచ్చు. లేదా “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్న దగ్గరే మొదలు పెట్టొచ్చు. “కవికి కావలసిన కనీస అర్హత గురించి కవులే చెప్పాలి” అని నేనూ ఒక పెద్ద సారును తల్చుకుని ఇప్పటి మటుకు వదిలించుకోవచ్చు. ఇవి రాయటానికి నాకేం అర్హత ఉందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివే వాళ్ళు డిసైడ్ చేయాల”ని చెప్పటం తప్ప మరో మాట లేదు.

    అర్హత కలిగిని చదివే వాళ్ళు, రాసే వాళ్ళ అర్హతను నిర్ణయిస్తారు అని మరోవిధంగా చెప్పొచ్చేమో, మన ఆంజనేయ స్వామి గుడిమెట్ల మీద — చెప్పుకునే విషయంగా. “రచ్చబండ” అయితే మాత్రం ఇంకా స్పష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది.

    అసలు నేను రాసింది వెనక్కు తీసుకుందామనుకున్నాను. కానీ కాలు పెట్టింతర్వాత అది తీయటం కష్టం అనిపించి మాట్లాడలేదు. ఒక కాలే కదా అని ఊరుకుంటే ఇప్పుడు రెండోది కూడా పెట్టి చూడమన్నందుకు మీకు ధన్యవాదాలు.

    ఇక ముందుకెళ్ళి, మిగతావి కూడా చూద్దాం:

    (వీటిని పెద్దగా కాంటెక్స్ట్ లో పెట్టి, అంటే వెనక్కెళ్ళి, భూతద్దం అప్పుతెచ్చుకుని, చూడకండి, దేనికదే అన్నట్టు చదవండి, వీలైతే)

    “రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి. యివ్వకపోతే రాసినినోడిది తప్పు.” కాదు, చదివే వాడి అర్హత ఇక్కడ ప్రశ్నార్ధకం.

    “నిజాయితీతో సెప్పు. ఆ యెనక నీతితో సెప్పు. అంతెగానీ వొల్లకోకు.” వొల్లకుంతానికి నానేవన్నా పెండ్లి సేసుకున్న సీతాల్నా! అవుసరవైతే అయిదారుగురికి ఒక్క సారే గురెట్టి, ఒకల సిగలొకలకు ముడివెట్టి కొత్త భారతవేదైనా పుట్టి చస్తుందేవో అని సూసే వోడికి ఇదేం లెక్క?

    నీతులు చెప్పటానికే కాని వినటానికి బాగుండవు అని ఎవరో పెద్దతలకాయ అనగా విన్నాను. నిజాయితీ అనే అర్హత మాత్రం ఏది రాయాలన్నా కావాలి.

    వేమన గురించి “అంత సెండాలం మనిషి అలాటి కబుర్లాడితే మన్లాటోళ్ళం వొప్పుతావేటి?” అని అడిగినందుకు: కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి ‘నీతి’ మారుతుంది. ‘నిజాయితీ’ మారదు. ఇవాల్టి నీతి రేపుండక పోవచ్చు. నేను రాసిన ఒక బేవార్స్ ఎక్సాంపుల్ ‘నిజాయితీ’ గురించి, నీతి గురించి కాదు. మన దగ్గర (ఇప్పటికీ) పది పదమూడు ఏండ్ల పిల్లలను పెండ్లీలు చేసుకునే వాళ్ళున్నరు, వాళ్ళంతా ఛైల్డ్ మాలెస్టర్సే మరో ప్రాంతపు నీతిని బట్టి చూస్తే. అట్లాంటి క్వాలిఫికేషన్స్ కాకుండా, నిజాయితీ గురించి మాత్రమే నేను రాసింది.

    నిజాయితీ మరో అర్హత రాయటానికి.

    సెలవ్.

    విప్లవ్

  27. ravikiran timmireddy అభిప్రాయం:

    August 27, 2008 2:17 pm

    ఇక్కడ వ్యక్తులూ, వ్యక్తిత్వమూ, వస్తువూ వేర్వేరు గా చూడ్డం కుదరని పని.
    బహుశా జె యు బి వి గారికీ ( నాక్కూడా ) దీనితోనే అభ్యంతరం అనుకుంటాను.

    మంచిది నీతిమంతులారా, మహా ప్రస్థానాన్ని విశాఖ సముద్రంలోకి విసిరెయ్యండి, గుయెర్నికాని కాల్చెయ్యండి. అక్కడతో ఆగకండి, ప్రాచీన కళా కారులు, సాహితీకారులేం మడి కట్టుకోని కూర్చోలేదు వారి చిత్రాల్ని, రచనల్ని సైతం సమిధలు చేసెయ్యండి. ఐతే వొక మనవి ఆ మంట వెలుగులో మీవెనక భాగాలు మాత్రం ఎవరికీ కనపడకుండా కప్పి పెట్టుకోండి, లేకపోతే ఎవరో మిమ్మల్ని కూడా ఆ మంటల్లోకి దోశెయ్యగలరు.

    నీతులు చెప్పడం సాహిత్యం కాదు. బ్రతుకుని చిత్రించడం సాహిత్యం. ఆ జీవిత చిత్రణ ఎవరి కలంనుంచొస్తేనెవి. అక్ష్రర రూపం తీసుకున్న ఆ అంతరంగ వుప్పెన కి దానికంటూ వొక అస్థిత్వం ఏర్పడుతుంది. రచయితతో సృష్టికర్తతో సంబంధంలేని వ్యక్తిత్వం ఆ రచనకి అబ్బుతుంది. రేఖా మాత్రంగా రచయిత రచనలో కనిపడొచ్చేవో but by itself it will be an independent entity. Like any of us who inherited a few characteristics from our parents. Still we grow up to be independent human beings and we will not and do not want to be judged by personalities of our parents. రచనలు, రచయితల మధ్య కూడా అదేవిధవైన సంబంధం వుందని నా నమ్మకం.

  28. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    August 27, 2008 11:30 pm

    నమ్మకాలు - బ్రతుకుతెరువు

    సాయి గారికి,

    చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.

    రేపో మాపో చండీదాస్ స్వీయచరిత్ర వెలువడితే, ఆయనొక యోగిలా బ్రతికాడని తెలిస్తే, అనుక్షణికం విలువ ఓ పిసరు పెరగొచ్చు. భ్రష్టుడనిపిస్తే ఓ పిసరు తగ్గొచ్చు. కాని మౌలికంగా నవల విలువలో మార్పుండదు. ఉంటే మనం సాహిత్యాన్ని వెలకట్టడానికి వాడే తూనికరాళ్ళని తనిఖీ చెయ్యాలి.

    శ్రీశ్రీ భక్తి రచనలు జీవనోపాధి కోసం రాశానన్న సమర్థన దబాయింపు గానూ లేదు, సంజాయిషీ గానూ లేదు. కఠోరమైన వాస్తవికతతో కూడి ఉంది. మహాప్రస్థానం తోనో విప్లవ రచనలతోనో వచ్చే డబ్బుతో పొట్ట గడుస్తుందంటారా? గడవకపోతే ఏమాయె, “సతుల్, సుతుల్, హితుల్ పోతే పోనీ, … తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ,” అన్న కళా రవి, ఆ మాత్రం నిజజీవితంలో ఆటుపోట్లకి తట్టుకోలేనివాడు, కవిత్వం, కాకరకాయా రాయడమెందుకు అంటారా?

    నాస్తికులు పురాణకథని చెప్తే ప్రశ్నించే హక్కు పాఠకులకుండొచ్చు. కొడవటిగంటి కుటుంబరావుకి నివాళులర్పిస్తూ చలసాని ప్రసాదరావు చందమామ నిర్వాహకులు సమర్పించిన శ్రద్ధాంజలిని ప్రస్తావించారు:

    “తన విశ్వాసాలు, నమ్మకాలూ ఎలాంటివైనా చందమామ పాఠకుల కోసం ఆయన విశేషమైన కృషి చేసి, సేకరించి, అందజేసిన ప్రాచీన ఇతిహాసాలూ, పౌరాణిక గాథలూ, ఆ శైలీ మరువరానివి. స్వర్గీయ శ్రీ చక్రపాణి ఆశయాలకు రూపం కల్పించి, తన శైలితో పాఠకలోకాన్నీ, తక్కిన పత్రికలనూ ఆకర్షించిన మేధావి శ్రీ కుటుంబరావు.”

    అంటే కుటుంబరావు తన నమ్మకాలతో సంబంధంలేని రచనలకి మెరుగులు దిద్దే పనికి అంకితమయ్యేడనే కదా! ఎందువలన? అని చలసానే కుటుంబరావుని సూటిగా ఆయన బ్రతికుండగనే అడిగారు:

    “మీరు – నేనూ ఒకే వృత్తిలో ఉన్నాం. ఎడిటర్ గిరీ అనేది ఒక వృత్తి. బతుకుతెరువు. మనం ఎడిటర్లగా కాక ఏ ఆఫీసర్ గానో, లెక్చరర్ గానో, బ్యాంకు ఉద్యోగిగానో వుంటే, ఆఫీసులో మనం చేసే పని గురించిగానీ, దాని స్వభావం గురించిగానీ ఎవరూ ప్రశ్నించరు, విమర్శించరు. కానీ, ఎడిటర్ అనీగాన అందరూ అతను పనిచేసే పత్రికలోని భావాలన్నింటికీ అతన్నే బాధ్యుడిగా భావిస్తారు, విమర్శిస్తారు. మీరు చందమామ లో వేసే కథల స్వభావం గురించి, వాటిలో రాక్షసులు, భూతాలు, దయ్యాలు, దేవుళ్ళు మున్నగు వాటిలో గల ఔచిత్యాన్ని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు…. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?” (రసన, పేజీ 133.)

    కుటుంబరావు దీనికి సమాధానం ఇవ్వలేదు కాని, నేనూహించుకోగలను - కుటుంబరావుకీ పోషించాల్సిన కుటుంబమొకటుంది. శ్రీశ్రీ, కుటుంబరావు, ఇంకా అనేకమంది, పొట్టపోషణ కోసం తమ నమ్మకాలతో పూర్తిగా కాకపోయినా కొంతయినా పొసగని పనిలో ఉండి ఉండొచ్చు. వాళ్ళు తమ నమ్మకాలని వదిలెయ్యాలా? లేక వేరే బ్రతుకుతెరువు చూసుకోవాలా? మీరయితే ఏం చేస్తారు?

    కొడవళ్ళ హనుమంతరావు

  29. Srinivas Nagulapalli అభిప్రాయం:

    August 28, 2008 11:32 am

    It is unfair to take a dig at Vemana’s past. He wrote padyams after, not before, overcoming his past. Same thing with Valmiki et.al.

    శ్రీశ్రీ భక్తి రచనలు ఉపాధికోసం రాసాను అనడం వాస్తవికతనే కాక అతని నిజాయితీని కూడా చెప్పుతుంది. అయితే ఈ చర్చ కేవలం రచనలు, రచయితలకే పరిమితం చేయడం అన్యాయం!

    “తిట్టొద్దు, కొట్టొద్దు, (లేదా మీకిష్టమొచ్చిన తప్పిదాన్ని ఇరికించండి)
    అని చెప్పుతూ, నువ్వు అవ్వే చేయొచ్చు, కాని నేను అవి చేస్తే తప్పేంటి నాన్నా” అని అనడం, వినడం తెలియని వారెవ్వరు! మాటకు, చేతకు అదే సంబంధం. చేత మనిషి వ్యక్తిత్త్వం అయితే మాటలు ఆ వ్యక్తి రచనలు కావచ్చు.
    తప్పిదాలగురించి కాదు, వొప్పిదాల గురించి అయితే కూడా ఇదే పరిస్థితా అని అడుగొచ్చు.

    అందరికి తెలిసిన కథ గుర్తుకొచ్చింది.

    గాందీజీ దగ్గరకు ఒక తల్లి బిడ్డను తీసుకొచ్చి వీడికి చక్కెర ఎక్కువ తినొద్దని చెప్పమని వేడుకుందట. తల్లి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి గాంధీజీ దగ్గరకు తీసుకొచ్చింది ఆయన చెపితేనన్నా వింటాడేమో అని ఆశతో.

    ఏముంది! ఇప్పుడు కాదు, వారం రోజులయింతరువాత తిరిగి రమ్మన్నారట గాంధీజీ. మళ్ళీ వారం తరువాత వెళ్ళితే, గాంధీజీ పిల్లవాడిని ప్రేమతో దగ్గరకు చేర్చుకొని చక్కెర ఎక్కువగా తినకు అని చెప్పాడట. ఈ మాత్రం ముక్క చెప్పడానికి వారం తరువాత ఎందుకు రమ్మన్నారు అని ఆ తల్లి ఆడిగిందట. వారం రోజుల క్రితం వరకు నేను కూడా చక్కెర ఎక్కువగా తినేవాడిని. నేను తగ్గించిన తరువాత ఇప్పుడు చెప్పాను అని వివరించాడట గాంధీజీ. కథ కంచికి.

    రచయిత అకారణంగానో, సకారణంగానో, ఒకరి దుకాణంకోసమో,లేక సవాలక్షల కారణాలతో రాయొచ్చు. ఎందుకు రాయకూడదు? అందంగా, అధ్భుతంగా కూడా ఆ రచనలు రావొచ్చు. అవార్డులు కూడా పొందొచ్చు. అయితే నిజాయితీ లోపించే రచనలు ఆ తల్లి చెప్పిన మంచి మాటల్లాగానే మిగిలిపోతాయేమో.

    నిజాయితీతో చెప్పిన మాటలు పెద్ద రచయితవి అయినా కాకపోయినా, అవార్డులు రివార్డులేవి వచ్చినా రాకపోయినా, అసలు రాయడం చదవడం కూడా రాని వాడివైనా కూడా గుండెకు తగులుతాయి. మార్పుకు ఊపిరి ఇస్తాయి.

    విధేయుడు
    -Srinivas

  30. mOhana అభిప్రాయం:

    August 28, 2008 12:13 pm

    రచయితల పేరులను తొలగించి వారి “మంచి” రచనలను
    మన ముందు ఎవరైనా ఉంచితే, అందులో ఏ రచన
    నిజాయితీ ఉన్న రచయిత రాసింది, ఏ రచన నిజాయితీ
    లేని రచయిత రాసింది అనే విషయాన్ని చెప్పడం సులభం
    కాదనుకొంటాను. రచయిత దుర్బలుడుగా ఉండవచ్చు,
    అంత మాత్రాన అతడు (ఆమె) రాసిన రచనలు ఆదర్శవంతముగా
    ఎందుకు ఉండరాదు? రచయిత వ్యక్తిగత జీవితానికి
    ఆ రచయిత రాసిన రచనకు లంకె పెట్టడం సబబు కాదు.

    విధేయుడు - మోహన

  31. పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    August 28, 2008 12:39 pm

    నాకు చందమామ పుస్తకాలంటే చాలా ఇష్టం. నేను తెలుగులో ఈ మాత్రం వెలగ బెట్టగలుగుతున్నానంటే వాటి తోడ్పాటు వల్లే నని ఒప్పుకోక తప్పదు.

    హనుమంతరావుగారన్న మాటలు చదివాక నాకు ఎవరి టీ షర్టు మీదో చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. “Please take my advice. I don’t use it anyway!”

    వారు “నమ్మకాలు బ్రతుకుతెరువు” అన్న శీర్షిక కింద రాసిన విషయాలు నమ్మదగినట్టే వున్నాయి. కానీ మనము ఇలా కూడా ఆలోచించవచ్చేమో!

    ఒక స్థూలకాయుడో స్థూలకాయురాలో నేను మీ బరువు తగ్గిస్తానని ఆర్భాటంగా ఏదైనా పత్రికలో ప్రకటన ఇచ్చారనుకుందాం. దానికి ప్రజల స్పందన ఎలావుంటుంది?

    అలాగే మనము కొన్ని సార్లు టీవీ లో చూస్తూ ఉంటాము. ఏదో ఒక ఇంద్రలుప్తకుడు ఇతరుల కేశసంపదనీ సౌందర్యాన్నీ పెంపొందిస్తానని (సంకోచం ఏమాత్రమూ లేకుండా) అనర్గళంగా వ్యాఖ్యానించి నిష్క్రమిస్తారు. అది ఎలా వుంటుంది?

    స్థూలంగా ఉండటమో, బట్టతల కలిగి ఉండటమో అపరాధాలు కావు. నేను కూడా కొద్దిగా స్థూలంగానూ, బట్టతలతోనూ వున్నానని అనుకుంటున్నాను. :-)

    కానీ ఇలాంటి ప్రకటనలకీ వ్యాఖ్యానాలకీ ప్రజలు ఎలా స్పందిస్తారో అదే విధంగానే రచయితల రచనలక్కూడా స్పందిస్తారని ఊహించడం అసమంజసం కాదనుకుంటాను.

    ఇకపోతే నమ్మకాలనూ, స్వభావాలానూ సులభంగా కప్పిపుచ్చవచ్చు. తమ తమ ఆశయ ఆకాంక్ష, నమ్మకాలకు వ్యతిరేకంగా రచయితలు తమ రచనలను సాగించవచ్చు. రచయితలందరూ నీతిమంతులుగా ఉండాలన్నది లేదు.

    జైళ్ళల్లో కూరుచుని రాసే/రాసేసిన రచయితలు లేరా?

    ఎవరి ఇష్టం వారిది. ఎవరి జీవితం వారిది. రచయితలు భ్రష్టులతే అభ్యంతరం చెప్పవలిసిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. లేదనే నేననుకుంటున్నాను. రాయడం సవ్యంగా వస్తే చాలు. చెత్త రచనలకి వెల ఎంతైనా ఎక్కువే, విలువ ఎంతైనా తక్కువే అని వేరే చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను.

    వారేమి రాసినా దాని గతో దుర్గతో నిర్గతో నిర్ణయించడాన్ని పాఠకులే చూసుకుంటారు.

    మరి చివరి విషయం. రచయితలలో రెండు రకాలు. తెలివైన వారూ, తెలివితక్కువవారు. అదేలాగా పాఠకులు కూడా రెండు విధాలు. తెలివైన వారూ, తెలివితక్కువవారు.

    రచయితలందరూ తెలివైన వారైతే బాధ లేదు. అలాగే పాఠకులందరూ తెలివైన వారైనా బాధ ఏమాత్రమూ లేదు.

    పాఠకులు కొందరు మాత్రమే తెలివైన వాళ్ళైతే రచయితలు భ్రష్టులైనా నీతిమంతులైనా ఒక్కటే. అటువంటి పాఠకులు చదివిన ప్రతిదానినీ విచక్షణా దృక్పథంతో చూచి తమకు నచ్చినది మాత్రం ఏరుకుంటారు. మిగిలిన చెత్తని విసర్జిస్తారు.

    ఇక పోతే మిగిలినది బుద్ధితక్కువ పాఠకుల విషయం.

    పాఠకులు బుద్ధి హీనులైతే బుద్ధిహీనుల రచనలనే సమర్థిస్తారు. అవే వారికి నచ్చుతాయి. వారు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్న ధోరణిలో ఉంటారు. వారికి ఏమీ చెప్పకుండా, వారిని ఎక్కడా గిల్లకుండా ఉంటే ఏ బాధా లేదు.

    ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే తెలివితక్కువ వారికి తెలివిగలవాళ్ళు తెలివితక్కువ వాళ్ళుగా కనిపిస్తారు. తెలివిగలవాళ్ళకి తెలివి తక్కువవారు తెలివితక్కువ వారుగానే కనిపిస్తారు.

    అంటే ఒక విధంగా అందరూ తెలివితక్కువ వాళ్ళే. ఇంకో విధంగా అందరూ తెలివిగలవాళ్ళే. కాబట్టి అస్సలు బాధే లేదు.

    మీరెవరైనా చెప్పే ముందే ఒప్పేసుకుంటాను. నేను తెలివి తక్కువ వాణ్ణేను.

    నమస్కారములతో

    పామర్తి సత్యనారాయణ

  32. Srinivas Nagulapalli అభిప్రాయం:

    August 28, 2008 5:22 pm

    చక్కగా సత్య గారు సత్యాన్నే చెప్పారు.

    ఇంకొక్క ఆలోచన. రచయిత వివరాలేమీ తెలియకుండానే రచనను ఆదర్శవంతం అని అనుకున్నట్లే, రచయిత నడవడి తెలిసింతరువాత, అది రచన యొక్క ప్రధానాంశానికి పచ్చి విరుద్ధంగా ఉన్నప్పుడు, అయ్యో రచన అందించిన ఆదర్శం రచయితకే ఎంత దూరంగా ఉంది అనుకొని, ఆ రచన యొక్క ఆదర్శ స్ఫూర్తితోనే ఆ రచయితను సైతం బేరీజు వేసుకోవడం సహజమూ, సమంజసమే అనుకుంటాను. అంతమాత్రాన రచన గుణాలు తగ్గాయని కాదు. రచన చూపించే వెలుగుతోనే రచయితను కూడా నిగ్గుదేల్చి, స్పష్టంగా చూడడం మాత్రమే.

    ఇది కేవలం రచన, రచయితలకే పరిమితం అయిన విషయం కాదని కూడా అనిపిస్తుంది. ఎటుచూస్తే అటు అంతటా ఉన్న విషయమేనేమో!

    ఎకరాలకెకరాలు భూకబ్జాలు చేసి, గజాలకొద్ది మాత్రం గుడికో, ఆసుపత్రికో విరాళం ఇవ్వడం, ప్రశంసనీయమా, “విచార”ణీయమా! భారీగా పన్నులు ఎగ్గొట్టి, ప్రభుత్వ నియమాలను నేలరాసి, ప్రకృతి ఉపద్రవాలొచ్చినప్పుడు ప్రధాన మంత్రి relief fund కు కొన్ని పైసలివ్వడం గొప్పనా, దారుణమా! ఇట్లా ఎన్నో!

    ఆధునిక తెలుగు సాహితీలోకంలోనే మన ముందున్న ఒక ప్రముఖ ఉదాహరణ. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి అవధాన ప్రజ్ఞను, పాండితిని ప్రశంసించిన అభిమాన సంఘాలు, సంస్థలే ఆయన వ్యక్తిగత అంశాలను తెలుసుకున్నాక ఆయనలోని కళాకౌశలాన్ని దూరం నుంచి మాత్రమే అందుకోవడానికి ముందుకురావడం చూస్తునే ఉన్నాం. దూరంగా ఉంచింది రచనను, కళను కాదు, రచయితనో, కళాకారున్నో మాత్రమే. ఇది ఏదో నా అభిప్రాయం కాదు, కళ్ళెదుటున్న వాస్తవం.

    విధేయుడు
    Srinivas

  33. Srinivas Nagulapalli అభిప్రాయం:

    August 28, 2008 5:31 pm

    సత్య గారు చెప్పిన దాంట్లో చిన్న అసత్య ముంది.
    అది వారు తెలివి తక్కువ అని చెప్పుకోవడం.
    సత్య గారు క్షమిస్తారని ఆశిస్తూ
    విధేయుడు
    Srinivas

  34. baabjeelu అభిప్రాయం:

    August 28, 2008 11:50 pm

    బాబ్బాబు, అందరూ వొక్క సిటం ఆగండి,
    మనం మాటాడీది, “చెందస్సు” కాణ్ణించీ, “స్టాండర్డ్” బాస కాణ్ణించీ “చైల్డ్ మోలెస్టర్స్” మీంచీ ఇంకో యేపెల్ల కుండా సూసీసుకుందాం.
    “చెందస్సు”:
    సాలా సెప్పుకునీ, బోరుకొట్టిందందరికీ, ముఖ్యంగా చదివీవాళ్ళకీ, బాగా చదువుకున్నోళ్ళకీ.
    “స్టాండర్డ్” బాస:
    దానికీ గొడవేటీ లేదు.
    అయితే రాసిన వాక్యం అందరికీ అదే భావాన్నివ్వాలి, యివ్వకపోతే రాసినోడిది తాప్పు అని నాను రాసిందానికి. (బాబ్జీలు ఉవాచ అని రాయకూడదు. కళ్ళుపోతాయ్. నాలాటివాళ్ళు, తెలిసిన వారని నేను నమ్మిన వాళ్ళు చెప్పినవాటికీ, మాకన్నీ తెలుసు అని వారికి వారే నమ్మీ వాళ్ళు చెప్పినవాటిని మాత్రంమే “ఉవాచ” లనాలి.) విప్లవ్ బాబు ఉవాచ:..కాదు చదివేవాడి అర్హత ప్రశ్నార్థకం.??????
    “నీతి”: పెద్దలు చెప్పినివి ఆలకిద్దాం.
    జెయుబివిపి ఉవాచ:
    “ఏది నీతీ, ఏది అవినీతీ? అన్నీ కాలాన్నిబట్టి మారుతూవుంటాయి” అని అడ్డగోలుగా మాట్టాడే సూడో ఫెమినిస్టులు, సూడో కమ్యూనిస్టులూ వుంటారు.
    విప్లవ్ బాబు ఉవాచ:
    కాలాన్నీ, ప్రాంతాన్నీ బట్టి నీతి మారుతుంది. నిజాయితీ మారదు.
    “అర్హత”:
    విప్లవ్ బాబు ఉవాచ:”ఇది రాయటానికి నాకేం అర్హత వుందీ అని నన్నే అడిగితే మాత్రం జవాబు “అది చదివేవాళ్ళు డిసైడ్ చెయ్యాలని చెప్పటం తప్ప మరోమాట లేదు. “మరోమాటచెప్పు” అని మనం మారుబేరం చెయ్యకుండా తెగ్గొట్టీసేరు.
    పెద్దలందరూ చెప్పిందే. చదివీవోళ్ళు, ముందుగా, రాసినదాని అర్హత ని డిసైడ్ చేస్తారు. దాని అర్హత మరీ ఎక్కువగావుంటే “ఎవర్రాసేరండీ?” అని మొదలెడతారు. “కాంటెంపరరీ” అయితే అప్పుడు నిస్సందేహంగా కవి నిజాయితీ, ఆయెనక నీతీ వల్ల అప్పటిదాకా “లొట్టలు” యేసుకుని చదివినా “చేదు” గా మారొచ్చు, లేదా “అర్హత” మరీ పెరిగిపోవచ్చు. వుదాహరణకి “అతడు అడివిని జయించాడు” గురించి ఏవంటారు అని “వొక పెద్దాయనని” అడిగితే, “ఆ పసువుల డాట్రు ఏదో వైద్యం చేసుకోక కాపీ కథలూ అవీ ఎందుకు? అలాటి వాటి గురించి నేను మాట్లాడను” అన్నారు.
    ఇంకో ఉవాచ విప్లవ్ బాబుదే అర్హత గురించి: తెలవటం ఒక అర్హత.
    బతుకు తెలియాలి అంతే, మరేటీ తెలక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడెవరూ “ప్రభువుల్ని” హీటెక్కించడానికో, లేదా ప్రభువు “నడుం పట్టీసిందయ్యా కవీ, పాండ్రంగ మహచ్చెవో, మరోటో, సదువు రెండ్రోజులు” అంటే “హీటు” తగ్గడానికి “వస్తా వట్టిదే, పోతావట్టిదే” మొదలెట్టక్కర్లేదు. మొదలెట్టినా తప్పుకాదు, బతకడం కోసం కాబట్టి. “రసన” 133 పేజీ కాళ్ళ మీద పడితే తప్పకుండా బుధ్ధొస్తుంది, బుధ్ధిజీవులకి కూడా.
    “నిజాయితీ”:
    విప్లవ్ బాబు ఉవాచ: నిజాయితీ మరో అర్హత రాయటానికి
    దిక్కుమాలిపోయిన ఈ బూమ్మీద, ఎవరేపని చేసినా, నిజాయితో చేస్తేనే రాణిస్తుంది.
    నిజాయితీ, రాసేవాళ్ళకి ఓ “డోసు” ఎక్కువుండక్కర్లేదు.
    ఆఖరవుకి “క్షవరం” చేసే వాడుకూడా నిజాయితీ తో చేస్తేనే, గిరాకీ. ఏదో వొహలా “డెక్కీ” వోడు “ఓ క్షవరానికి, ఇంకో క్షవరం ఫ్రీ” అన్నా ఎవరూ పట్టించుకోరు.

    మాట మన్నించి, “జారుడు బండ” మీద రెండో కాలు కూడా పెట్టిన విప్లవ్ గారికి ధన్యవాదములు. “ఈ మాట” రచ్చబండ కాదని మీరే అన్నారు. అవనివ్వం అని మా అందరి తరపున నేను మాటిస్తున్నాను. సూస్తూ, సూస్తూ, చేజేతులా, సుబ్బరంగా వున్న ఈ మాట ని “యూపీ”, “ఏపీ”, “టిఎన్” లేదా మరొహ దాందో “అసెంబ్లీ” లాగా చెయ్యనివ్వం.
    విప్లవ్ బాబూ మరిక మీరు సెలవు తీసుకోవచ్చు.

    శ్రీనివాస్ నాగులపల్లి గారికి: నేను రాసిన “వేమన” వుదాహరణ లో, వేమన ని కానీ, వేమన పద్యాలని కానీ కించపరచ లేదు.

  35. Bhushan అభిప్రాయం:

    August 29, 2008 1:03 am

    శ్రీరంగనీతులు చెప్పేవాళ్లు దొంగదారులు దూరొచ్చు. మనకు నీతి కథలు రాసేవాళ్లు అవినీతిగా వుండొచ్చు. తానే ఆచరించలేనిదాన్ని ఇతరులకెందుకు చెప్పాలి? దెయ్యాలు వున్నట్టు ఆద్యంతం కథ రాసిన రచయిత ఆఖర్న తన జుట్టులోని వెంట్రుకల్ని చేతబడి చేసేవాళ్ళకెవరికైనా పంపించడానికి రెడీ అంటాడు. కథలోని మంచిని సమర్థించేవాళ్లు, కథకుళ్లోని చెడ్డని ఖండించకపోతే అప్పుడు ఎటు వైపున వున్నట్టు? ఇలా అభిప్రాయాన్నిచెప్పిన జె.యు.బి.వి.గారూ, సాయిబ్రహ్మానంద గొర్తిగారూ, మీ దగ్గర మహాప్రస్థానాలు వుంటే వాటిని మహాసముద్రంలో విసిరెయ్యాల్సిన పని లేదు గానీ, అలాంటి రచయితల వ్యక్తిగతజీవితాల కుళ్ళుని విమర్శించి తీరాల్సిందే. లేకపోతే చాలామంది పాఠకులు, ఆ రచయితల కథల్లాగే, కవితల్లాగే వాళ్ళని కూడా వుత్తములనుకునే ప్రమాదముంది.

    భూషణ్
    nagabhushanamr@hotmail.com

  36. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    August 29, 2008 6:06 am

    హనుమంత రావు గారూ,

    మీరు
    “చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.” అని రాసారు. చండీదాస్ లా ధైర్యంగా చెప్పే రచయితలెంత మందున్నారు? కాకపోతే సాధారణ పాఠకులు హంసలు కారు. వ్యక్తినీ, రచన్నీ, వ్యక్తిగత సిద్ధాంతాలనీ దేనికది వేర్వేరుగా తూకం వెయ్యరు. వెయ్యలేరు.
    అలాగే రచయితలందరూ నీతీ, నిజాయితీ మడిబట్ట కట్టుకొని రచనలు చేస్తారని నేనుకోను. చెప్పే సిద్దాంతాలకీ, నీతులకీ, తాను చేసే పనులకీ పొంతన లేకుండా ఉంటే రచయిత నిజాయితీ మీద నమ్మకం ఎలా కలుగుతుంది?
    మీరు కుటంబరావు గారి ఉదాహరణ చెప్పారు. మీరు చెప్పినట్లుగా కుటుంబరావు గారికీ ఓ కుటుంబం ఉంది. దాని పోషణా బాధ్యతా ఉంది. అందుకోసం పత్రికా సంపాదకులుగా ఆయన నమ్మిన సిద్ధాంతాలని పక్కనబెట్టి, ఆయనకప్పగించిన పనిని అద్భుతంగా చేసారు. కాదనను. ఆయన మీద నమ్మకంతో ఓ బాధ్యత అప్పగిస్తే, ఇంతకంటే గొప్పగా ఎవరూ చేయలేరన్నట్లుగా చేసి చూపించారు. అది ఆయనకి పనిమీదుండే గౌరవాన్ని చూపిస్తుంది.
    ( తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తాయన. ఆయన నా అభిమాన కథకుల్లో ఒకరు. )
    ఇక్కడ నాదో ఉదాహరణ. ఓ నాస్తికుడు దేవాలయ బోర్డులోనో, లేదా దానికి సంబందించిన ఓ పనికో నియమింప బడి, అది చేయచ్చు. దాన్నెవరూ ప్రశ్నించరు. కానీ అదే వ్యక్తి పురోహితుడిగా ఉద్యోగం చేస్తూ, నేను దేవుణ్ణి నమ్మను కానీ పౌరోహిత్యం నా జీవనాధారం అంటే ఎవరూ ఏం చేయలేరు. కాకపోతే అదేమిటి ఇంత విరుధ్ధంగా వుందా వ్యక్తిత్వం అనిపించడం సహజం. అలాంటప్పుడే నిజాయితీ అనేది బయటకొస్తుంది. కాదంటారా?
    నేనేమీ ధర్మవ్యాధుళ్ళాంటి వాణ్ణి కాను. అందువల్ల నాకూ మామూలు పాఠకుల్లాగే అనిపిస్తుంది.
    రాత్రి పీకల వరకూ పీతల్లా తాగి తెల్లారేసరికి మంచి మంచి రచనలు చేయచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. తాగుబోతు రాసాడంటూ ఆ రచన్ని అరేబియా సముద్రంలో విసిరేయను. ఎవరి అలవాట్లు వాళ్ళవి అనూరుకుంటాను. నా దృష్టిలో అలవాట్లూ వేరు. వ్యక్తి త్వం వేరు. మంచిగా రాస్తే చదివి ఆనందిస్తాను. కానీ -ఆ రచయితే “తాగడం తప్పు, దీనివల్ల ప్రజలకి మంచిది కాదంటూ నీతి వాక్యాలు వాళ్ళ రచనల్లో చుట్టేసేడనుకోండి. అప్పుడే చిర్రెత్తుకొస్తుంది. అలాంటి రచయితంటే నాకు గౌరవం లేదు. అదే నాకున్న అభ్యంతరం.
    నాకు నమ్మకం లేని విషయాలు నేనాచరించలేను. నా పిల్లలకీ చెప్పలేను. నేను నమ్మే సిద్ధాంతాలకి వ్యతిరేకంగా జీవిస్తూ, అవి వాళ్ళకి నూరిపోయను. ( కమ్యూనిష్టు సిద్ధాంతాలను నమ్ముతూ, బి జె పి లో పనిచేయలేను :)- )
    మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇదే చేస్తాను.

  37. పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    August 29, 2008 1:06 pm

    అయ్యల్లారా, అయ్యయ్యల్లారా! (అమ్మలందరూ ఏరి?)

    జీవితాన్ని చిత్రించడం మాత్రమే సాహిత్యం అయితే జేకే రౌలింగ్ రాతలు సాహిత్యం కాదు. అవి అభూతకల్పనలు కనుక. అదే విధంగా కథాసరిత్సాగరమూ, పంచతంత్ర కథలూ కూడా సాహిత్యం కావు. ఎక్కడైనా జంతువులు మాట్లాడతాయా? ఆలోచించి మనుష్యుల్లా వ్యవహరిస్తాయా?

    మనము ఆచరించేదే కథల్లో రాయాలని తీర్మానించుకుంటే అవి మన చేతులకి మనమే తొడుక్కున్న సంకెళ్ళవుతాయి.

    కథలు కల్పితాలు. ఆత్మ కథలు కల్పితాలు కారాదు. ఈ రెంటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఆత్మ కథల్లో రచయితల జీవితాలను చిత్రించడం జరుగుతుంది. నిజాన్నీ, నిజాయితీని ప్రదర్శించడం జరుగుతుంది. నమ్మకాలూ, సందేహాలూ తెలియజేయబడుతాయి. అలా జరగని పక్షంలో అవి విమర్శనార్హాలవుతాయి.

    ఆత్మకథల్లోనో, నిజమని చాటించబడి ప్రచురించబడిన రచనల్లోనో వాస్తవికత లోపిస్తే నిస్సందేహంగా విమర్శించండి. కల్లా కపటం కనిపిస్తే ఖండించండి.

    కొడవటిగంటి గారు ప్రతి బేతాళ కథ అంతంలోనూ “కల్పితం” అని రాసేవారు. కావాలంటే పాత చందమామలు తిరగవేయండి. తర్వాత భావ్యమని అనిపిస్తే విమర్శించండి. అంతే కాదు. చందమామలో వచ్చిన ఏ ఒక్క కథనూ తనదిగా చాటుకున్నట్లు లేదు.

    ఆత్మకథలకు ఉండాల్సిన లక్షణాలను ఇతర సాహిత్య రచనలకు ఆపాదించవలసిన అవసరం లేదు. ఇతర సాహిత్యం అన్నది ఈ విశాల ప్రపంచంలో “జీవితాన్ని చిత్రీకరించడం” అన్న కుగ్రామపు పరిధి లోపల చెర బాధననుభవించనక్కర్లేదు. ఈ విధి కి బలికానవసరంలేదు.

    కథలన్నవి, రాసే వారి నమ్మకాలకు అనుగుణంగా లేక పోయినా పర్వాలేదు. వాస్తవికతకి దూరంగా ఉన్నా పర్లేదు. మీరందరూ నిజాయితీ, నీతి, అవినీతి అని రచయితల విషయంలో బాధపడటం అవసరం లేని పనిగా నాకు తోస్తున్నది.

    ఈ రచయిత శ్రీరంగ నీతులు బోధిస్తున్నాడు (కథల్లో). చాలా మంచి పాటలు పాడేస్తున్నాడు. వీడి జీవిత చరిత్రని తవ్వుదాం. అవినీతిని బట్టబయలు చేద్దాం. వాణ్ణి కపటవేషధారి అని నిరూపించి వీధి మధ్యలోకి ఈడ్చి చీల్చి చెండాడుదాం. భ్రష్టుడనిపించుదాం. ధ్వజస్తంభానికి కొరత వేద్దాం అనే లాంటి ఉద్రేక పూరిత మాటలు సబబుగా గోచరించట్లేదు.

    నమస్కారములతో

    పామర్తి సత్యనారాయణ

  38. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    August 29, 2008 2:01 pm

    పామర్తి గారూ,

    ఇక్కడ ఏ రచయితనీ చీల్చి చండాడడం లేదు. ప్రశ్నించే వాళ్ళ పీక నొక్కడం లేదు. సీమ సినిమాల్లో లాగా కత్తులు నూరడం లేదు. అందులో తప్పేమిటి? ఎవర్ని ఎవరూ తూలనాడడం లేదు. నీకేం తెలీదు, నే చెప్పేది విను అన్న ధోరణి అంతకన్నా లేదు. “ప్రకర్ష” పేరుతో ఎదుటి వాళ్ళని చులకనగా చూడ్డం లేదు. ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు గిరి దాటకుండా చెబుతున్నారంతే! ఉద్వేగాలూ, ఉద్రేకాలు అంతకన్నా లేవు :)- ఒకవేళ ఎవరైనా “చెయ్యి” జారితే, సంపాదకుల కత్తెర చూసుకుంటుంది. కాబట్టీ, ద్వారకానగరము దారి బట్టీ అన్నట్లుగా చర్చించుకో వచ్చు. :)-

  39. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    August 29, 2008 11:43 pm

    సాయి గారికి,

    మీ పురోహితుడి ఉదాహరణ నాకర్థం కాలేదు. కుటుంబరావుది ఉద్యోగధర్మమూ, శ్రీశ్రీది మరొకటీనా? ఎలా? ఇద్దరూ బతుకుతెరువు కోసం తమ నమ్మకాలతో కొంత రాజీపడినట్లుంది. మహాకవులూ, మేధావులూ కూడా రాజీ పడితే ఎలా? అని ధర్మజీవులడగొచ్చు. కాని, రాజీపడకపోతే, మన సమాజంలో అలాంటి నమ్మకాలున్నవాళ్ళకి సరయిన ఆస్తిపాస్తులుంటే తప్ప ఇల్లు గుల్లవచ్చు. ఏం? ఆ మాత్రం త్యాగం చెయ్యలేరా? అంటే, ఏమో, అది కడుపులో చల్ల కదలని నాలాంటి వాళ్ళు చెప్పడం ధర్మం కాదు.

    పరిమితమైన నా సాహితీ పరిధిలో చండీదాస్ లా ధైర్యంగా చెప్పే రచయితలెవ్వరూ లేరు - చలం తప్ప.

    మీరు “సాధారణ పాఠకులు హంసలు కారు. వ్యక్తినీ, రచన్నీ, వ్యక్తిగత సిద్ధాంతాలనీ దేనికది వేర్వేరుగా తూకం వెయ్యరు. వెయ్యలేరు,” అన్నారు. మీరే సమర్థించిన ప్రసాదు గారి ఆక్రందన - ప్రజలు వేర్వేరుగా తూకం వేస్తున్నారనే గదా?

    హంసలంటే చలసాని ప్రసాద్ రాసిన “అనంతం” ముందుమాట గుర్తొచ్చింది: “ఏ ముసుగులూ, దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్టు రాశాడు శ్రీశ్రీ. … మింగలేని చేదునిజాలూ, వినలేని సంగతులూ, చూడలేని దృశ్యాలూ … ఏదిఏమయినా ప్రజలు హంసల లాంటివారు…”

    సామాన్య పాఠకులకి హంసలతో కాస్తో కూస్తో చుట్టరికం లేకపోతే, అనంతం వెలువడిన పాతికేళ్ళ తర్వాత కూడా మహాప్రస్థానం ఎందుకు నిలుస్తుంది?

    సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.

    (నేనీ లాంగ్ వీకెండ్ ని సద్వినియోగపరచుకుంటే, వచ్చే వారం అలాంటి ఒక ద్రష్ట గురించి నా కంప్యూటింగ్ వ్యాసంలో చదవచ్చు. విషయం, సందర్భం, మన రచయితలతో పోల్చదగ్గది కాదు కాని నేను పైన అన్న దానికి ఓ ఉదాహరణ.)

    కొడవళ్ళ హనుమంతరావు

  40. పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    August 30, 2008 5:31 am

    సాయి గారికి:

    బాబ్బాబు, నా సందేశం లోని చివరి పేరాని ఏరి పారేసి మిగిలినవి చదువుకుందురూ. మీకు పుణ్యం వుంటుంది. అక్కడ కాస్తంత కవి హృదయాన్ని ప్రదర్శిద్దామని ప్రయత్నించాను. క్షమించండి. :)

    హనుమంతరావు గారు ఇలా అన్నారు:

    సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.

    దీనితో నేను ఏకీభవిస్తున్నాను. నేను సాధారణ పాఠకుణ్ణే. ఆస్కర్ వైల్డ్ ఏకవాక్యాలు (one-liners) నాకు బాగా నచ్చేవి. ఆ తర్వాత అతని జీవిత చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం తెచ్చి చదివితే తెలిసింది అతన్ని రెండు సంవత్సరాలు అప్పట్లో ఒక చెప్పుకోదగని నేరానికి చెరసాలలో పెట్టారని.

    అది చదివి హతాశుణ్ణయ్యాను. కానీ అతని వాక్యాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. అతని నేరం (?) ఏమాత్రమూ నచ్చదు. :-)

    నమస్కారములతో

    పామర్తి సత్యనారాయణ

  41. ravikiran timmireddy అభిప్రాయం:

    August 30, 2008 8:13 pm

    సత్యన్నారాయణ గారు,
    జీవితాన్ని చిత్రించడం సాహిత్యవంటే, జీవితంలో కల్పన లేదని కాదండీ. బతుకులో వాస్తవవెంత నిజవో, కల్పనా అంతే అవసరం. కల్పనే లేకపోతే మన బాల్యంలో వొక అత్యద్భుతవైన కలని, ఆ కలతో మమైకవైపోయిన ఆ బతుకుని పారేసుకోవడవే కదా. కల్పనా, కలే లేకపోతే యవ్వనం ఎంత నిస్సారంగా నీరుకారిపోతుందో మీకు తెలీదా, నాకు తెలీదా. నేలనొదిలి కొన్నిసార్లు పగటి కలల్లో ప్రయాణం అనుభవం లేని మనిషంటూ ఎవరైనా వుంటారా. జీవితాన్ని చిత్రించడవంటే ఎక్కాలతోపాటూ, ఏడేడు సముద్రాల అవతలనున్న మార్రిచెట్టు తొఱ్ఱలో చిలక గురించి కూడా చెప్పటం అండీ. అందుకని లెక్కల మాస్టారు ఎంత నిజవో, ఎగిరే గుర్రవెక్కిన రాకుమారుడు జీవితంలో అంత అవసరవే. మరందుకని బతుకంటే, నవ్వులూ, ఏడ్పులూ మాత్రవే కాదండీ, కలలూ, కల్పనలూ కూడా వుంటాయని మనవి.

    హనుమంత రావుగారు, సాయి గారు,
    వొకవేళ సరైన ఆస్తిపాస్తులుండి, బతుకులో పోషణకోసం రాజీపడవలసిన అవసరం లేకపోతే, అప్పుడు ఆ రచయితలు తప్పులు చేస్తే వాళ్ల రచనలకి ఆ తప్పులంటుతాయా? కడుపులో చల్లకోసవైనా, ఒంట్లో వేడి కోసవైనా తప్పు, తప్పే కదండీ. ఐతే తప్పు చేసిన వాళ్ళకీ, తప్పు చేసే వాళ్ళకీ బతుకులో కష్టం, సుఖం అనుభవించే అర్హత లేదా? ఆ అనుభవాన్ని చెప్పుకునే అవకాశం వాళ్లకి లేదా? మనుషులుగా వాళ్ళని మనం నెత్తిన పెట్టుకుని తిరగక్కరలేదు, కానీ కవులుగా, రచయితలుగా, కళాకారులుగా వాళ్ల సృష్టిని కించపచవలసిన అవసరం వుందా? వొక వేళ వాళ్ల ఒళ్ళు కొవ్వెక్కే తప్పులు చేసున్నా, ఆ తప్పుల్ని వాళ్ళ రచనలకి ఆపాదించాల్సిన అవసం వుందా? చండీ దాసు గారికున్నంత ధైర్యం లేని రచయితలు, బలహీనులు, వ్యసనపరులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, రాజకీయనాయకులు (?) వీళ్ళెవరికీ కస్టాన్నీ, సుఖాన్నీ, ఏడుపుని, నవ్వునీ, కన్నీళ్ళనీ, ప్రేమనీ, నిజాన్ని, కల్పన్నీ, వాళ్ళు నమ్మిన నిజాన్నీ (వాళ్లకది ఆచరణ సాద్యం కాకపోవచ్చు) కాగితం పైన పెట్టే అర్హత లేదా.

  42. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    August 30, 2008 10:06 pm

    రవికిరణ్ గారూ,

    మీరడిగిన ప్రశ్నలకి మీవీ నావీ సమాధానాలు ఒకటిగానే ఉంటాయి - మనిద్దరి అభిప్రాయాలని చూస్తే. మరో విధంగా అనిపిస్తే, అది నా వాదనలో లోపం. రచయిత జీవితంతో ప్రమేయం లేకుండా రచనకి ప్రాధాన్యత ఇవ్వాలని నిష్కర్షగానే చెప్పాను.

    కొడవళ్ళ హనుమంతరావు