ఉద్యోగం

ఆ మర్నాడు: మధ్యాహ్నం: పన్నెండు గంటలు:

కూపర్ ఆడిటోరియమ్. ప్రతి మంగళవారం అక్కడ బ్రెస్ట్ కాన్సర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ రోజు ఊళ్ళో ఉన్న చాలా హాస్పిటల్స్ నుండి అక్కడకు స్పెషలిస్ట్లు వస్తారు. యూనివర్సిటీ లోని పెద్ద పేరున్న సర్జన్లూ, ఆంకాలజిస్టులూ, పెథాలజిస్టులు, రేడియాలజిస్టులు. వీరు కాక ఆంకాలజీ ఫెలోస్ , రెసిడెంట్లు, మెడికల్ స్టూడెంట్లు. ఇంకా సోషల్ వర్కర్లు, డ్రగ్ రెప్రెసెంటెటివ్లు ఇలా. ఆ రోజు ఎప్పటిలానే ఆడిటోరియమ్ కిటకిటలాడిపోతున్నది. అంతా హడావిడిగా ఉంది. గొడవగా ఉంది.

ఆడిటోరియమ్ వెనకాలగా ఒక పక్కన బల్లమీద డ్రగ్ కంపెనీలు కేటర్ చేయించిన లంచ్ – సాలడ్ లు , చైనీస్ చోమైన్లూ, లోమైన్లూ, ఎగ్ ఫూయాంగ్లు , జాపనీస్ సూషీ, క్రాబ్ ఫిష్ , రకరకాల సేండ్విచ్ లు- ఉన్నయ్. ఇంకోపక్క బల్ల మీద కాఫీ్ టీలూ, కేక్ కుక్కీలూ, కోక్ పెప్సీలూ ఉన్నయ్ . అందరూ లంచ్ తెచ్చుకొని కూర్చుంటున్నారు. కొందరు వాళ్ళు తెచ్చుకున్న లంచ్ బాక్సులు తెరిసి తింటున్నారు.

ఇంకొంచెం సేపట్లో ఈ లంచ్ సద్దు మణిగి, కాన్ఫరెన్స్ మొదలవుతుంది. ఆ వచ్చిన డాక్టర్లు కేసుల గురించి చేసుకొనే వాదాలు, విసురు కొనే విసురులు, చర్చలు అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉత్తేజకరంగా ఉంటాయి. ఒక్కరి క్కూడ ఆ యుద్ధరంగం వదిలి వెళ్ళాలనిపించదు. కొన్ని సార్లు గడువును మించి వాదించుకొంటారు డాక్టర్లు. ఒకరిని ఒకరు ఒప్పించాలని చూస్తారు. మా వైద్యం గొప్పదంటే మాది గొప్పదని బీరాలు పల్కుతుంటారు.

చాలా వరకూ, ఒక్కొక్క కేసూ చర్చించి, ఒక అభిప్రాయానికి రావటానికి ప్రయత్నిస్తారు. చర్చలు, రికార్డ్ చేస్తారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు చెప్పిన అభిప్రాయాలు, భక్తితో నోట్ చేసుకుని, మళ్ళీ వాళ్ళ రోగులను చూసినప్పడు ఇది యూనివర్సిటీ పెద్ద డాక్టర్లిచ్చిన సలహా అని చెప్పి వాళ్ళకు ధైర్యం కలిగిస్తారు. ఈ చర్చల మూలాన కొంతవరకూ, ఊళ్ళోని ఇతర ఆసుపత్రులలో కూడా మంచి వైద్యం జరగటానికి అవకాశం కలుగుతుంది.

కాన్ఫరెన్స్ మొదలయ్యింది. రెసిడెంట్లు, ఫెలోస్ , వేదిక మీదకు వచ్చి, పోడియం వద్ద నిలబడి, పేషెంట్ల కేసు వివరాలు చెప్పి వెళ్ళి కూర్చుంటున్నారు. వరసగా సభలో ఉన్న సీనియర్ డాక్టర్ల అబిప్రాయాల ప్రకటనలు, చర్చలు జరిగి పోతున్నాయి.

ఆ రోజు పాల్ భార్య మరిస్సా కేస్ కూడా లిస్ట్ లో ఉంది. రెసిడెంట్ డాక్టరుకు కొంచెం భయంగానూ ఉంది. కొంచెం గర్వంగానూ ఉంది. రేడియేషన్ డివిజన్ ఛైర్మన్ గారి భార్య గారి కేస్ తను సభకు పరిచయం చేస్తున్నందుకు. రెసిడెంట్ సభలో వారికి , మరిస్సా బ్రాఫ్ కేస్ వివరాలు చెప్పాడు. కేస్ మీద చర్చ మొదలు పెట్టబోతూ ఉంటే అతను ” డాక్టర్ బ్రాఫ్ తను వచ్చేవరకూ మొదలెట్టద్దన్నారు . ఆయన్ని పేజ్ చేశాను. వస్తూనే ఉండాలి. ” అన్నాడు.

ఇంతలో డాక్టర్. పాల్ బ్రాఫ్ రానే వచ్చాడు. అతని పక్కన ఒక యువతి ఉంది. ఆమె చక్కనిది. కాలు పొడుగు మనిషి. చక్కని సిల్క్ సూట్ వేసుకొనిఉంది. జుట్టు సరికొత్త ఫేషన్ లో కత్తిరించి ఉంది. ఆ అమ్మాయి ముఖం మీద డాక్టరు అనీ, ఐవీలీగ్ స్కూలు నుండి అనీ, స్టాంప్ స్పష్టంగా కొట్టినట్లే ఉంది.

ఫాల్ కాన్ఫరెన్స్ రూమ్ వేదిక ముందు నిల్చొని,

” ఫ్రెండ్స్ ! ఈమె డాక్టర్. సాండ్రా మాండ్రెల్. ఈ వచ్చే జులై నుండీ మన బ్రెస్ట్ – గైనే సర్వీస్ చీఫ్ గా ఉండటానికి అంగీకరించింది. అది మన అదృష్టం . మన హాస్పిటల్ ఈమె రాకతో వన్నె కెక్కుతుంది. వివరాలు తర్వాత అందరికీ చెపుతాను. ప్రస్తుతానికి, నా ఇన్విటేషన్ మీద మనం ట్యూమర్ బోర్డ్ ఎలా నడుపుతామో చూడటానికి వచ్చింది.” అని చెప్పి ఆమెతో సహా వెళ్ళి సభలో కూర్చున్నాడు.

వాళ్ళకేసి కొందరు తలలూపారు. కొందరు చిరునవ్వులు నవ్వారు. కొంతమంది డాక్టర్లు లోలోపల ఆశ్చర్య పోయారు. నిసీకి వేరే పదవి ఇచ్చారా? ఆమె ఏమి చేస్తుంది ? ఏమీ చెప్పలేదే?

నర్సులు కొంతమంది నిసీ కూర్చున్న చోటికి దృస్టి సారించారు. చప్పట్లు కొట్టబోయిన రెసిడెంట్లు మళ్ళీ గబుక్కున డాక్టర్ నిసీ షామల్, ఆ హాల్లోనే ఉన్న సంగతి గుర్తొచ్చి విరమించారు.

డాక్టర్ షామల్ ఉద్యోగం మానెయ్య దలుచుకుందేమో. ఆమె భర్తకు ఆరోగ్యం బాగా లేదటగా? కుతూహలం అందరి మనసులో.

నిసీ అప్పటివరకూ మామూలుగా కేసులు డిస్కస్ చేస్తూ ఉంది. ఆమెకు పాల్ భార్య మరిస్సా ఎక్స్ రేల విషయం తెలియదు. ఇలా ఈ రోజు పాల్, కొత్త డాక్టర్ ను తీసుకు వస్తాడని అసలే తెలియదు. ఆ ఉదయం వాళ్ళు స్టాఫ్ మీటింగ్లో కలిసినప్పుడు, అతను కొత్త డాక్టర్ను గురించి ఆమెతో ప్రస్తావించనే లేదు. ఆ తర్వాతైనా సాండ్రాను తనకు పరిచయం చెయ్యలేదు.

ఆమె ఇంకా స్నెహితులు ఎవరితోనూ తన ఉద్యోగం పోయిన సంగతి చెప్పనే లేదు. వారి సలహాలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని అకస్మాత్తుగా తీసుకొచ్చి, అందరికీ పరిచయం చేశాడు. పాల్ కి తన పరువు ప్రతిష్ఠలతో సంబంధమే ఉన్నట్లు లేదు.

నిసీకి చాలా బాధ కలిగింది. వాంతి వచ్చేలా అనిపించింది. తల తిరిగింది. గుండె బిగదీసింది.

రోగుల మీద దయ చూపించే డాక్టర్లు, వెరే డాక్టర్లతో ఇంత క్రూరంగా ఎలా ఉండగలరు? మనుషులకు బీదల పట్ల, రోగుల పట్ల మాత్రమేనా దయ. ఆరోగ్యంగా ఉన్న మన తోటి ప్రాణుల మీద దయా గౌరవాలు లేవా?

తుఫాను రేగుతున్నదామె మనసులో.

వ్యూ బాక్సుల మీద మరిస్సా ఎక్స్ రేలు పెట్టారు. రేడియాలజిస్ట్ ఒక పాయింటర్తో ఎక్స్ రేలు అందరికీ వివరించాడు. కొన్ని ముఖ్యమైన ఎక్స్ రేలు, తెర మీద ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ వాటిని వివరించాడు. వాళ్ళ సరి కొత్త పరికరాలతో చాలా సులువుగా రొమ్ములోని ఆ కేల్సిఫికేషన్లను ఎలా తీసివెయ్యచ్చో చెప్పాడు. .

తర్వాత డాక్టర్. జాన్ బెన్నెట్ తను ఓపెన్ బయాప్సీ చెయ్యదలిచినట్లుగా చెప్పి , రేడియాలజీ వాళ్ళు చెప్పినట్లు కాక తను ఇలా చెయ్యడం పేషెంటుకు ఎందుకు మంచిదో కారణాలతో వివరించాడు.

సభలో కొందరు సర్జన్లు లేచివెళ్ళి , మామోగ్రాములను దగ్గరగా వెళ్ళి చూసి బెన్నెట్ చెప్పిన మాటలను సమర్ధించారు.

మామూలుగా ఆ తర్వాత రేడియేషన్ లేక మెడికల్ ఆంకాలజీ డాక్టర్లు వాళ్ళ అభిప్రాయం చెపుతారు. నిసీ షామల్ మాట్లాడవలసిన సమయమది.

నిసీ మాట్లాడకముందే పాల్ కల్పించుకొని , “సాండ్రా మేండ్రెల్ ఉద్దేశమేమిటో ఈ విషయంలో, వాళ్ళ సెంటర్లో ఏం చేస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది.” అన్నాడు.

కొద్దిగా సభలో సంచలనం రేగింది. అటూ ఇటూ ఊగారు కుర్చీల్లో సభికులు. నిసి మీద అభిమానం ఉన్న వాళ్ళు, లోలోన ఏమిటీ పాల్ ! ఎందుకిలా! అనుకున్నారు.

కొంతమందికి మామూలు మనుషులకు ఉండే కుతూహలమే ఉంది. తర్వాత వింత చూడాలనే తహతహ. రోజూ రోగాలూ, రొష్టులూ ఐతే విసుగు కాదా! మధ్య మధ్య ఇలాటి సోప్ ఆపెరాలు కావాలి ఆస్పత్రుల్లో పని చేసే వాళ్ళకు.

డాక్టర్. సాండ్రా మేండ్రెల్ చాలా వివరంగా, తను అది ఎలాంటి కాన్సర్ అనుకుంటుందో చెప్పింది. పేషెంటుకి చాలా స్ట్రాంగ్ ఫేమిలీ హిస్టరీ ఉన్నందువల్ల, చిన్న వయసు ఐనైందునా, ఎడమ బ్రెస్ట్ తప్పక తీసెయ్యాలని చెప్పింది. ఈ మధ్య ఐతే ఇలాటి కేసుల్లో వాళ్ళు తమ హాస్పిటల్లో రోగి రెండు రొమ్ములూ కూడా తీసి వెయ్యాలని సలహాలిస్తున్నారనీ, కొత్త కొత్త ఆర్టికల్స్ ఉదహరిస్తూ చెప్పి అందరినీ మురిపించింది.

ఆ తర్వాత “రెండు రొమ్ములూ మళ్ళీ తయారు చెయ్య వచ్చు. ఇక్కడ ఎంత గొప్ప సర్జన్లున్నారో దేశమంతా తెలుసు” అంటూ మెచ్చుకోలుగా అంతకు ముందు కొంతమంది సర్జన్లు మాట్లాడిన దిక్కుగా చూసింది. అందరూ పులకించి పోయారు. ఆమె తెలివికి, క్షుణ్ణంగా అంత విప్పి చెప్ప గలిగిన విజ్ఞానానికి, ఆమె ముందు చూపుకి.

ప్లాస్టిక్ సర్జన్లు ఈ కొత్త డాక్టరు ఎప్పుడెప్పుడు వస్తుందా తమ ప్రాక్టీసు ఎప్పడు పెరుగుతుందా అనుకున్నారు.

నిసీ మరీ కన్సర్వెటివ్ డాక్టర్. మాస్టెక్టమీనే చెయ్యకుండా అడ్డు పెడుతుంటే, ఇంకా రీకన్స్ట్రక్షన్ ఎక్కడ? వాళ్ళ సర్జరీ చేసిన పేషెంట్ల స్లయిడులు మీటింగ్స్ లో చూపినపుడు అప్పుడప్పుడూ వాళ్ళను ఫ్రాంకెన్ స్టైన్ లని చెప్పి ఎగతాళి చేస్తుంది అందరిలోనూ.
దేవుడిచ్చిన అందమైన రొమ్ములను మీరెందుకోయ్ చెడగొట్టటం అంటుందయ్యె. ఇంకా ఇంకా, తక్కువ సర్జరీ చెయ్యమంటుంది. ఇంక మా సర్జన్ల ట్రెయినింగెందుకు, మట్టి కొట్టుకు పోను? పేషెంట్లేమో ఆమె కోసం ఎగబడుతున్నారు.
నేషన్ లో బ్రెస్ట్ కాన్సర్ కు ఎంత గిరాకీ ఉంది. అలాటి గిరాకీ ఉన్న ఫీల్డ్ లో సర్జన్ల విలువ తగ్గిచ్చేస్తే ఎలా? అవీ కొందరు సర్జన్ల ఆలోచనలు.

ఈ లోపల పాల్ మనస్థితి చూడాలి. అతడికి అకస్మాత్తుగా డాక్టర్. సాండ్రా మేండెల్ ని చూస్తే భయం వేసింది. అంతలోనే తన పెళ్ళాం మరిస్సా తన ముందు ఒక రొమ్ముతోనూ , తర్వాత రెండు రొమ్ములూ లేకుండా ఒక బల్ల లాగా ఉన్న ఛాతీతోనూ, తన ఎదురుగా నుంచున్నట్లు కనిపించింది. వేళ్ళాడే తోళ్ళూ, వికృతమైన స్కార్లూ కనిపించాయి. ఓ మై గాడ్! ఖీమోథెరపీ కూడా ఇస్తే? విగ్గులు పెట్టుకున్న మరిస్సా, తన బోట్ మీద వాంతులు చేసుకుంటున్న మరిస్సా.

పాల్ అసలు చిన్న సర్జరీతో సమస్య తేలిపోతుందనుకున్నాడు. ఒకవేళ కాన్సర్ ఐనా మహా ఐతే రేడియేషన్. అతను ఈ బ్రెస్ట్ లు తీసివేసే తతంగమంతా ఒక్క సారి కూడా అనుమానించలేదు.

తను ఈ ఊళ్ళో ఇంకా కొత్త డాక్టర్. హాస్పిటల్లో పెద్ద బాధ్యతలున్నాయి. ఛైర్మన్ భార్యగా, దేశంలోని ఫిలాంత్రపిస్టులతో ఛారిటీ ఇవెంట్స్ లో , బాల్ రూమ్ గౌనులు వేసుకొని రొమ్ములు లేని మరిస్సా డాన్స్ లెలా చేస్తుంది? చెయ్యక పోతే తనకు పెద్ద గ్రాంటు లెలా వస్తాయి? అది సరే, తన సంసార సుఖం మాటేమిటి? తన పిల్లల గతి ఏమిటి?

పాల్ కు గాజు కళ్ళు పడినయ్యి. నోరు తెరుచుకు పోయింది. అతని మనస్సులో తన పడవ తలకిందులై పోయి , దాని మీద రొమ్ముల్లేని మరిస్సా కూర్చుని చేతులూపుతున్నట్లూ, తను మునిగి పోతున్నట్లూ, తన లాబ్ కోట్ నీళ్ళలో కొట్టుకు పోతు న్నట్లూ అనిపించింది

ఈ లోపల నిసీ బాధ నిసీది. ఆమె మరిస్సా కేసు గురించి వింది. వినలెదు. ఎక్స్ రేలు చూసింది. చూడ లేదు. చర్చలు వింది. వినలేదు.

ఆమెకు తననెవరో కొరడాలతొ కొట్టినట్లుంది. నడివీధిలో తనను వేలాం వేసినట్లనిపించింది. భార్య ఉండగా ఉంపుడుకత్తెను తీసుకువచ్చి , మొగుడు ఆమె ముందే ఉంచుకున్నదానితో నాట్యం చేస్తే ఆ భార్య కిలాగే ఉంటుందేమో అనిపించిందామెకు. ఆమె వళ్ళంతా భగ్గున మండింది.

ఇదేనా! ఒక డాక్టరుకు ఒక హాస్పిటల్లో జరగవలసిన సత్కారం. ఛీ! దీనికోసమేనా, ఇంత చదువులూ. కష్టపడి పని చెయ్యటాలూ? అనుకుంది నిసి.

ఆమె గబుక్కున లేచింది. ఆడిటోరియమ్ ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. ఆమె చక చకా మెట్లు దిగింది. అందరి చూపులూ అటే . ఆమె ముందుకు వచ్చి బయటకు వెళ్ళే తలుపు దగ్గర అగింది. ఆడిటోరియమ్ అంతా ఊపిరి బిగ పట్టింది. కోటు జేబుల్లో చేతులు దూర్చి ఏదో ఆలోచనలో అక్కడ నిలబడింది. అది ఒక్క నిమిషమే ఐనా ఒక రోజులాగా అందరికీ అనిపించింది.

ఐతే ఆమె బైటికి వెళ్ళకుండా, గిర్రున తిరిగి వేదిక ముందుగా నడిచి ఎక్స్ రే -వ్యూబాక్సుల దగ్గరకు వెళ్ళింది. ఆ ఎక్స్ రేలు కాసేపు, అటూ ఇటూ మార్చి పెట్టుకుంది. శ్రద్ధగా వాటి వంక చూసింది. మళ్ళీ అటూ ఇటూ మార్చి పెట్టుకుని చూసింది.
అందరూ వింతగా చూస్తున్నారు ఆమెనే. అంతటా మౌనం.

సభికుల వైపు తిరిగి “నా ఉద్దేశం ఎవరూ అడగలెదనుకోండి. ఐనా నేను ఈ కేస్ గురించి మాట్లాడ వచ్చా?” అంది.

ఎవ్వరూ మాట్లాడ లేదు. పాల్ వైపు చూసింది. అతడు పలక లేదు. ముఖం పక్కకు తిప్పివేశాడు. బెన్నెట్ వంక చూసింది. ఆయన తల ఊగించాడు.

“నా ఉద్దేశంలో ఈ పేషెంటుకు కాన్సర్ లేదు. ఈ కేల్షియం డిపాసిట్ రొమ్ములో లేదు. ఇవి బైట చర్మంలో ఉన్నాయి. ఇవి అసలు ఏమీ హాని కలిగించవు. ఈ వ్యూలలో ఇలా కనిపించినా ఇంకా కొన్ని ఎక్స్ రేలు తీస్తే, ఈ విషయం స్పష్టంగా తెలిసి పోతుంది. ఈమెకు ఏ వైద్యమూ అక్కర్లేదు. బయాప్సీ కూడా అక్కర్లేదు. ఇదీ నా అభిప్రాయం” అని చెప్పి నిసీ షూ టకటక లాడిస్తూ బైటికి వెళ్ళిపోయింది.

పాల్ మళ్ళీ నోరు తెరిచాడు. ఒక్కసారిగా అతని గుండె మీద పెద్ద బరువు తొలిగి పోయింది. అతని వళ్ళు తేలికై పోయింది. కాళ్ళు రబ్బరు లాగా వేళ్ళాడాయి. మూర్చ పోతాడెమో అనుకున్నాడు ఒక్క క్షణం .

సభ మళ్ళీ స్తంభించి పోయింది. డాక్టర్ బెన్నెట్ తన టై సర్దుకుని, చిన్నగా నవ్వుకున్నాడు. అతనికేం కొత్త కాదు. నిసీ తననూ హాస్పిటల్ నూ అనవసరమైన మాల్ ప్రాక్టిస్ గొడవలు రాకుండా ఎన్నిసార్లు రక్షించలేదు! నిసీ స్నేహితులు శభాష్ నిసీ! అనుకున్నారు. మనసులో చప్పట్లు కొట్టుకున్నారు. గుసగుసలాడుతూ మెల్లిగా ఆడిటోరియమ్ లోని అందరూ, బయటకు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళి పోయారు.
*