ఉద్యోగం
ప్రెసిడెంట్ మార్గరెట్ బ్లూమ్ ఎంతో పొడుగ్గా, హుందాగా, గంభీరంగా ఉంది. చక్కటి మెరిసే తెల్లని జుట్టు. తెలివి వెల్లి విరుస్తున్న ముఖం. ఆమె ముందు నిసీ చిన్న పిల్లలా ఉంది.
అంత ఇబ్బందిలోనూ ఆమె తన డాక్టరుకు కానుక తేవటం మరిచి పోలేదు.
“మీకు ఏమి ఇష్టం అని వాకబు చేస్తే, పుస్తకాలంటే మీకు అధికప్రీతి అని తెలిసింది.” అంది. తన చేతిలోని పుస్తకం నిసీకి అందించింది. ” ఈ రచయిత మా ఊరికి పేరుతెచ్చిన ముద్దుబిడ్డ. పులిట్జర్ ప్రైజు వచ్చింది. మీకు నచ్చుతుందీ పుస్తకం అనుకుంటున్నా. ”
“ఓ! నెను చదవాలనుకుంటున్న పుస్తకం. మీకెలా తెలిసింది?” స్నేహంగా నవ్వింది నిసీ. వాళ్ళిద్దరి మధ్యా మాటలు సులువుగా జరిగేందుకు, కాసేపు మార్గరెట్ ఉద్యోగం గురించిన విశేషాలడిగింది. వాళ్ళ యూనివర్సిటీ లో బోధించే కోర్సులేమిటో? ఆమెకు విద్యార్ధులకు పాఠాలు చెప్పే బాధ్యతలున్నాయా? లేక అంతా అజమాయిషీ యేనా? ఇలా అడుగుతూనే ఆమెను పరీక్ష చెయ్యటం సాగించింది.
” డాక్టర్ షామల్! మిమ్మల్ని గురించి నేను గొప్పగా విన్నాను. ఇక్కడ పై చదువులు చదువుకొని, ఈ దేశం మీది కాదు అని తలచకుండా, మీ వాళ్ళను వదిలిపెట్టి మాకు మంచి వైద్యం చేస్తున్నారు. మా అదృష్టం.” మార్గరెట్ బ్లూమ్ అన్నది.
నిసీకి సంతోషం కలిగింది. అంతలోనే తన ఉద్యోగం సంగతి గుర్తొచ్చి విషాదం. తనకు ఉద్యోగం తీసివేసినట్ట్లు తెలిస్తే ఈ రోగికి మరునిమిషంలో తన మీది గౌరవం నిలుస్తుందా? అసలు ఇప్పుడు ఈమెకు ముందుగా, కొన్ని నెలలలో తను ఇక్కడ పని చెయ్యదని చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉన్నదా? తన కర్తవ్యం ఏమిటీ?
ఈమెకు ఏమి వైద్యం అవసరమవుతుందో ఇదంతా ఎన్ని నెలలు పడుతుందో ముందు నిర్ధారించాక, అవన్నీ - అనుకుని పరీక్ష సాగించింది. కాని లోలోపల ఏదో తప్పు చేసినట్లు, ఆమెను మోసగించి పరీక్ష చేసినట్లుగా నిసీకి అనిపించింది.
తనను గురించిన ఆలోచనలు వెనక్కి నెట్టేసి, రోగి వ్యాధిని గురించి పరీక్ష వివరాలన్నీ, తర్వాత వైద్యంలో తను తీసుకోవలసిన జాగ్రత్తలు నోట్ చెసుకుంది. మార్గరెట్ కు రేడియేషన్ ఇస్తే రొమ్ము కాని, కుడి చెయ్యి కాని వాస్తుందా? వాపువలన గాని నొప్పి వల్ల గాని, ఆమె రోజూ పనులకు ఆటంకం వస్తుందా? అలా రాకుండా తను వైద్యం ప్లాన్ చెయ్యాలి అనుకుంది. పరీక్ష పూర్తి చేసి, రోగితో తన అభిప్రాయం, చెయ్యవలసిన వైద్యమూ గురించి మాట్లాడింది.
మార్గరెట్ బ్లూమ్ తన వైద్యం గురించిన వివరాలు విని, శ్రద్ధగా నోట్స్ రాసుకుంది. తన కేలెండర్లో కొన్ని తెదీలు గుర్తు పెట్టుకుంది. ఆమె చాలా స్థిమితంగా ఉంది. ఒక్క సారి మాత్రమే, నిసీ “మీకు ఏం భయం లేదు, మీకు క్యూర్ ఛాన్స్ ఎక్కువ” అని చెప్పినప్పుడు మాత్రం ఒక నిట్టూర్పు విడిచింది. కళ్ళలో నీటి పొర కనిపించింది.
“మార్గరెట్ ! మీరు మీ స్టూడెంట్ల పని చూసుకోండి . మేం మీకు వైద్యం, మీ పనికి ఇబ్బంది రాకుండా అమరుస్తాం. నా సెక్రెటరీ చిన్నదే ఐనా, చాలా ఎఫిషిఎంట్ . ఆమె మీరు ఈ ఊరికి వైద్యానికి వచ్చినప్పుడు వసతి ఏర్పాట్లు కూడా చక్కగా చేస్తుంది. డాన్ తో ఎప్పుడు కావాల్సినా మాట్లాడండి. నాతో వెంటనే సంప్రదిస్తుంది. ఆ అమ్మాయిని మీకు కావాల్సిన టెలిఫోన్ నంబర్లన్నీ ఇమ్మంటాను. ” అని చెప్పి వెళ్ళిపోయింది నిసీ.
ఇంటర్వ్యూ అంతా ముగించేసరికి నిసీ అలిసిపోయింది. అంతకు ముందు పాల్ తనకు వినిపించిన వార్త ప్రభావం అప్పుడు తెలుస్తున్నదేమో. ఐనా, ఆమెకు డాక్టర్. మార్గరెట్ బ్లూమ్ తో పరిచయం, ఆమె తనపై చూపిన గౌరవం , తను ఆమెకు జబ్బు నయం చేయగలదన్న విషయం ఉత్సాహాన్నిచ్చాయి.
ఆ ఆనందం ఎంత సేపుంటుంది నిసీకి!
ఇప్పుడు తన సంగతేమిటి ? పాల్ తో తగువు పెట్టుకొని ఈ హాస్పిటల్ లోనే పని కొనసాగించడమా? లేక వేరే ఉద్యోగం వెతుక్కోడమా?
ఆమెకు వాడాలంటే పలుకుబడి ఉంది. అంతకు ముందు తను వైద్యం చేసిన పేషెంట్లు-పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు , తన మీద గౌరవం ఉన్న డాక్టర్లు, పైవాళ్ళ మీద వత్తిడి తేగలిగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కాని అలా చెయ్యవచ్చా?
చైర్మన్ నిర్ణయమే సరైతే? ఏమో! అతని ఉద్దేశాలే రైటేమో! కొత్త డాక్టరు తనకన్నా మంచి వైద్యం చెయ్యగలగొచ్చు!
ఐతే తన రోగులను , వాళ్ళ పట్ల తన బాధ్యతలను వేరే వాళ్ళకు వప్పజెప్పి కొత్త చేట చేరాల్సిందేనా? ఈ ఉద్యోగం పోడానికి భర్త జబ్బు కారణమైనట్లే, ఇంకోటి వెతుక్కోడానికీ అది అడ్డమే. తను వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న రాకమానదు.
వైద్య రంగం ఎంత విచిత్ర మైనది! రోగులు ఎప్పుడూ ఆస్పత్రులకు రావాలి. అవి కిటకిటలాడుతూ ఉండాలి. కాని డాక్టరు ఫేమిలీకి డాక్టరుకు జబ్బులే రాకూడదన్నట్లు, రావన్నట్లు ప్రవర్తిస్తారు. ఒక్క రోజు సిక్ కాల్ చేసినా దొంగ నాటకం ఆడుతున్నట్లు చూస్తారు.
అబ్బా! ఇప్పుడు ఈ ఆలోచనలకు ఖాళీ ఎక్కడ. ఇంకో పేషెంటు రూమ్ లో రెడీగా ఉంటే. నిసీ తలుపు తోసుకుని లోనికి పోయింది.
*