ఈమాట » తెలుగు సాహిత్యం లో విమర్శ

Expand to right
Expand to left

తెలుగు సాహిత్యం లో విమర్శ

[అక్టోబర్ 14, 2006 - ఐదవ తెలుగు సాహితీ సదస్సు, హ్యూస్టన్ లో చదివిన కీలకోపన్యాసం –నూరు సంవత్సరాల క్రితం ప్రబంధ సాహిత్యంపై వచ్చిన విమర్శని స్థూలంగా పరిశీలించడం; ప్రస్తుతం వస్తున్న సాహిత్య విమర్శనలగురించి ముచ్చటించడం; ఈ విమర్శనా ధోరణుల వలన సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చిన, వస్తూన్న నష్టాలని గుర్తించడం, నా ముఖ్యోద్దేశం. ఈ పరిస్థితిని మార్చడానికి కావలసిన ప్రేరణ, తగిన శిక్షణల గురించి సాహితీపరులందరూ, ముఖ్యంగా diaspora సాహితీపరులందరూ ఆలోచించడం ఆవశ్యకమని నా నమ్మిక. అది నా లక్ష్యం. - రచయిత].

ఒకరు చెప్పింది తప్పనో, రాసింది ఒప్పనో, అనంగానే, సాథారణంగా అటువంటి నిర్ణయానికి ప్రాతిపదిక ఏవిటి? ఆథారం ఏవిటి అనే ప్రశ్నలు వచ్చితీరుతాయి. గుడ్డిగా దేనినీ ఒప్పుకోవలసిన అవసరం లేదు. మామూలు రోజు వారీ విషయాలలోనే, ప్రాతిపదికా రహితంగా ఏ విషయం నిర్థారణగా చెప్పలేం. ఎవరు చేసిన ఏ నిర్ణయమైనా సరే — సాంఘిక, రాజకీయ, వ్యక్తిగత పరిస్థితుల ప్రేరణ లేకుండా ఉండదు. ఇక పోతే, సాహిత్యానికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా సాహిత్యవిమర్శలో పైనచెప్పిన పరిస్థితుల ప్రభావం తప్పదు. పైకి కనుపించకపోయినా, పరిశీలనలో ఈ పరిస్థితుల ప్రభావం బయట పడుతుంది. ఈ పరిస్థితుల ప్రభావాన్ని ఉమ్మడిగా, bias, పక్షపాతం అని చెప్పవచ్చు. అందుచేత ఒక్క విషయం మాత్రం ఖాయం. పక్షపాతం లేని విమర్శ ఉండడం చాలా అరుదు అన్న విషయం!

సాహిత్య విమర్శలో ఈ పక్షపాతం అనావశ్యకమైన ఆవేశం గా మారితే, ఆ విమర్శ ల వల్ల సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చే నష్టాల వివరణ ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. ఆవేశమే ముఖ్య ప్రాతిపదికగా పెట్టుకొని విమర్శలు చేసిన విమర్శకులు ఆర్థికంగా రాజకీయంగా అధికారబలంగల వాళ్ళయితే సాహిత్యానికి, సంస్కృతికీ వచ్చే నష్టం అపారం. అటువంటి కొన్ని విమర్శలను గురించి ముచ్చటించి, ఈ స్థితినుంచి తేరుకోవడానికి (విముక్తికి) మార్గాలేమయినా ఉన్నాయా అని ప్రశ్నించి, ఆలోచనకి ప్రేరేపించడం నా రెండో ముఖ్యోద్దేశం.

కళాపూర్ణోదయం, తెలుగు సాహిత్యంలో మొదటి “నవల.” ఒక వినూత్న ప్రక్రియకి నాంది. కథ చెప్పించిన పద్ధతి, కథలోకథలోకథ అత్యద్భుతంగా కూర్చిన విధానం, వచనంలో మాట్లాడుకున్నట్టే ఉండే పద్యసంభాషణలు, కథలోపునశ్చరణ వంటి ఎన్నో విశేషాలు ఇందులో…

గొప్ప కవులెవరైనా సరే — సాహితీపరంగా — వారున్న కాలానికి దూరంగా ఉంటారు. అంటే, వారి కవిత్వం “సమకాలీన కవిత్వం,” అనే ముద్రకి లొంగదు. అటువంటి గొప్ప కవులు భూత కాలంలో కాస్త తారాడుతూ ఉండటమో, భావజనితమైన భవిష్యత్తులోకి చొరబడటమో, చేస్తారు. అంతే కాదు. ఆకవులు వారిది అని చెప్పుకోదగ్గ ఒక ప్రత్యేకమైన వర్తమానంలో ఉంటారు. పాఠకుడిని ఆ వర్తమానంలోకి తీసుకొపోవడానికి ప్రయత్నిస్తారు! అటువంటి కవుల సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు, భూత, వర్తమాన కాలాలని మననం చేసుకొని, భవిష్యత్తు గురించి, ఆలోచించి మరీ విమర్శించాలి. ఇందుకు సహృదయత చాలా ముఖ్యం.

పదహారవ శతాబ్ది వాడైన పింగళి సూరన్న కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అనే రెండు కావ్యాలని రాశాడన్న విషయం మీ అందరికీ తెలిసినదే! కట్టమంచి రామలింగారెడ్డి గారు 1899 లో వ్యాస రూపముగా అనేక సాహితీసభలలో చదివి, తరువాత 1914 లో కళాపూర్ణోదయ ప్రభావతీప్రద్యుమ్న విమర్శగా “కవిత్వతత్త్వ విచారము” అనే పేరుతో రెండువందలపైచిలుకు పేజీలలో పుస్తకము ప్రచురించారు. 1932 లో ఈ పుస్తకాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారు ప్రచురించారు.

ఇక్కడ గతశతాబ్ద చరిత్ర మననం చేసుకోవడం కొద్దిగా అవసరం. 1902 వ సంవత్సరములో రామలింగారెడ్డి గారు ఇంగ్లాండు లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పైచదువులకు పోయి 1907 లో ఆంధ్రదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ ఆంగ్లసాహిత్యం, అక్కడి సాహితీవిమర్శల వలన బాగా ప్రభావితులైనారు. ఇంగ్లాండు లో ఆయన ఉన్న కాలం రాజకీయంగా, సాంఘికంగా, సాహిత్యపరంగా “విక్టోరియన్ యుగం”, లేదా “విక్టోరియన్ యుగాంతం” అని చెప్పవచ్చు. ఆ సమయంలో ఆంగ్ల సాహిత్యాన్ని పేరుపొందిన ఆంగ్ల విశ్వవిద్యాలయాల్లో పాఠ్య విభాగంగా పెట్టడానికి ఉన్న రాజకీయ, సాంఘిక కారణాలను కూలంకషంగా చర్చిస్తూ, Chris Baldick చక్కని పరిశోధనా వ్యాసం రాశాడు. తదుపరి The Social Mission of English Criticism [6] లో ఈ వివరణలు బాగా విశదీకరీంచబడ్డాయి.

ఆంగ్ల సాహిత్యాన్ని పాఠ్య భాగం చేయడానికి ఒక ముఖ్య కారణం, లేదా ప్రత్యేక కారణం అనండి, ఆంగ్లేయులు తమ సాహిత్యం సంస్కృతుల ఆధిక్యత, బానిస రాజ్యాల వారికి తెలియచెప్పడం! బానిస ప్రజల నెత్తిపై పులవడం అనవచ్చేమో! ఈ విషయం శ్రద్ధగా గమనించడం మనకి చాలా అవసరం. ఎందుకంటే, రెడ్డి గారిని ప్రభావితం చేసినది ఆనాటి సాహిత్య విలువలు, వాటికి తోడుగా ఆనాడు ప్రబలంగా ఉన్న “విక్టోరియన్” నైతిక విలువలు!

కళాపూర్ణోదయం గురించి, ప్రభావతీ ప్రద్యుమ్నం గురించీ, మొత్తం తెలుగు ప్రబంధ సాహిత్యం ( పదహారవ శతాబ్దం మొదలు పద్ధెనిమిదవ శతాబ్దం ఆఖరువరకు) పై రెడ్డి గారు చేసిన విమర్శలు, ఆయన విదేశీ విద్య నేపథ్యంలో చూడటం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను కాబట్టి, ఈ గత చరిత్ర స్థూలంగా తెలియ పరిచాను.

ఇప్పుడు, ఆయన విమర్శనా గ్రంధం, కవిత్వతత్త్వ విచారము [1] నుండి కొన్ని వాక్యాలు:

“మహమ్మదీయులచే నోడింపబడి యుక్కు తక్కువయై కుక్షింభరులమైయున్న కాలంబులో బుట్టి పెరిగిన ప్రబంధకవులలో పాండిత్యబలము విశేషముగనున్నను పందతనమొక్కటి యెక్కువగనున్నదేకాని, …”

“బ్రిటిష్ గవర్నమెంటువారు మనకు మనసారనిచ్చిన విద్యా ప్రభావముచేత నిప్పుడు పరచింతనంతగా నుంచుకొనక యైహికముల సాధించు నుద్యోగములను పునరాచరణమునకు తెచ్చికొనుచున్నాము.”

వర్ణనలన్నా, అలంకారాలన్నా రెడ్డి గారికి పరమ అసహ్యం. మన ప్రబంధకవులు ఈ రెండూ ఎక్కువగా చేస్తారని ఆయనకు ఎనలేని కోపం. ఈ విషయం ఆయన పుస్తకంలో పదే పదే విసుగుపుట్టేట్టు చర్వితచర్వణంగా ఉదహరిస్తారు.

“కమలముతో బోల్పకున్న సీతాదేవి ముఖము చూచువారికి సుఖము నియ్యదా? చిన్నతనము బూనునా? …. ప్రతి పదార్థమునకు ఒక ఉపమానముండి తీరవలయునన్న కట్టకడపటి యుపమానమునకాధారమేమి?”

ఆయనకు ఎనలేని ఇంగ్లీషు సాహిత్యాభిమానం. ఆ అభిమానం ఆయన పుస్తకంలో కొట్టవచ్చినట్టు కనబడుతుంది.

కాస్తో కూస్తో ఇంగ్లీషు సాహిత్యం తో పరిచయం ఉన్న తెలుగు మేథావులందరికీ, ఈ ఆంగ్లాభిమానం, ఈ మక్కువా కావలసినదానికన్నా కాస్త ఎక్కువే! ఉదాహరణకి, “చూశారా! ఎలియట్ ఏమన్నాడో! Objective Correlative గురించి? అబ్బ! ఎంతబాగా చెప్పాడండీ,” అని గుడ్లు మిటకరించి సంభ్రమాశ్చర్యాలని ప్రకటించే నవీన పాఠకులని మీరు కలిసే ఉంటారు. నిజం చెప్పాలంటే, ప్రాచీన ఆలంకారికులు చెప్పిన విభావ, అనుభావ, సంచారీ భావాలను కాస్త జాగ్రత్తగా అర్థం చేసికొని ఉంటే, “సాధారణీకరణం” అంటే universalization అనే భావానికి , ఎలియట్ గారి Objective Correlative కి ఎంతదగ్గిర సంబంధం ఉన్నదో తెలుస్తుంది. ఆ విషయం ఎలియట్ గారు చెప్పేవరకూ మన నవీన పాఠకుల బుర్రలకెక్కలేదు!

రెడ్డిగారు రాస్తారు:

“ఇంగ్లీషు కవులకంటె నాంధ్రకవులలో నలంకారము లధికములు. అందును ప్రబంధకవులలో అత్యంత విపరీతములు. దీనికి కారణమేమన, అలంకార రచన ఆలోచనా శక్తికి చేరినంత భావనాశక్తికి చేరినది కాదు.”

“ప్రాచీనులు వ్రాసినట్లును అలంకారశాస్త్రములాదేశించినట్లును విరచింప ప్రయత్నించుట తెలివి తక్కువ పని.”

అలంకార శాస్త్రాలని సాహిత్య విమర్శనా గ్రంధాలుగా రెడ్డి గారు అర్థం చేసుకోవడానికి కనీస ప్రయత్నం చేసి వుంటే, ఈ విధంగా నిరసన భావంతో రాసే వారుకాదేమో! పోతే, అలంకారశాస్త్రం “ఇల్లాగే రాసితీరాలి” అని ఎక్కడా ఆదేశించి నిర్బంధించిన దాఖలాలు లేవు. కానీ, కొందరు కవులు విపరీతానికి పోవడం ఆ కవుల వెర్రితనం కాని, అలంకారశాస్త్రాల తప్పుకాదు! ఈ చిన్న విషయం ఆయనకు తెలియక పోవడం ఆశ్చర్యంగా వున్నది!

ప్రబంధాలలో సహజంగా చెప్పే కథ గురించి వ్యాఖ్యానిస్తూ రెడ్డిగారు ఇలా రాసారు:

“కన్యామణియొక్క కాకకు నుపశమనము చేయుటకై చెలులామె నుద్యానవనమునకు పిలిచికొని పోవుట. సరోవరసందర్శనము. ఆ ప్రొద్దుమాత్ర మందరును స్నానముచేయుట, చన్నీళ్ళువడువేళకు గగుర్పాటు వణకు మొదలైన శృంగారావస్థలు తిక్కెక్కినట్లు ప్రబలుటయు, యజమానురాలిని చివురుటాకుల శయ్యపై పరుండ జేసి వస్త్రములు సడల్చి శైత్యోపచారములు చేయుట…”

ప్రబంధములలో నాటక సరణి లేక, పాత్రోచితమైన భాష మందునకైననూ దొరకదని ఆరోపణ చేస్తూ, అంతా “శ్లేష” యేనని, అపహాస్యము, అవహేళన!

అసలు శ్లేష అంటే ఏమిటో జాగ్రత్తగా ఆలోచించి ఉంటే, ఈ అపహాస్యం వచ్చేది కాదేమో! (శ్లేష అంటే, “కలయిక,” “సంశ్లేషణ,” embrace, అని భావం. శ్లేషః సర్వాసు పుష్ణాతి ….. చూ: దండి రాసిన కావ్యాదర్శం : రెండవ పరిచ్ఛేదం, 363 వ శ్లోకం.[8]. Also for an explanation of Slesha, as it pertains to Kalapurnodayam, see The Sound of The Kiss, Velcheru Narayana Rao and David Shulman, page 173, [2])

కళాపూర్ణోదయ కావ్య రచనలో సూరన్న మూడు ప్రధాన లక్షణాలు సాధిస్తానని ముందుగా అన్నాడు. ఇవీ ఆ లక్షణాలు: “అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి. ఉదాహరణకి, “బుష్ గారు ఇరాక్ యుద్ధం గురించి ప్రపంచప్రజలకి అబద్ధాలు చెప్పుతున్నాడు, అని కథ రాస్తున్నాను,” అని ప్రారంభంలోనే చెప్పాననుకోండి. నా కథ చదివిన ఏ విమర్శకుడైనా, నేను ఇది సాధించానా లేదా అని ప్రశ్నించడం న్యాయం, ధర్మం. ఇక పోతే, రెడ్డి గారు రాస్తారు : “కవి తన అభిమతము నెరవేర్చుకొన్నాడు గాని, ఇట్లు పంతముపట్టి వ్రాసినందున నిష్కళంకమైన కృతి యేర్పడినదా లేదా అనుట సందేహము.” ఇటువంటి “పొగడ్త” ని left-handed compliment, “పుర్రచేతి ప్రియభాషణం,” అనచ్చు.

ప్రభావతీ ప్రద్యుమ్నము గురించి ప్రస్తావిస్తూ, “రచనా దోషములు లేకున్నను కళాపూర్ణోదయము కన్న నిది నికృష్ట మనుటకు భావ లోపములు కారణములు. …. ఇక ప్రభావతి యన్ననో, నాకుంజూడ నెంతయు నసహ్యురాలు! రూపమున్నది. నాథుడెప్పుడు వచ్చి పైబడునాయను తహతహ దట్టముగ నున్నది. ….. నిజము చూడబోయిన ప్రభావతీప్రద్యుమ్నము శైలినొక్కదానిందప్ప తక్కిన విషయములలో సామాన్య ప్రబంధముల మీరినది కాదు. కథ మిక్కిలి సన్నము. చిత్రరూపములు, దూతికలు మొదలగు మధ్యవర్తుల మాటలు, వీనిచే నాకాలము వారికి కామాగ్ని యున్నట్టుడి ప్రభవిల్లి మనసులను దేహములను దహింపజేయునంత తైక్ష్ణ్యమును బహుత్వరలో గాంచుట సర్వసాధారణమేమో!”

మళ్ళీ మరోసారి, ఆంగ్ల సాహిత్య వ్యామోహం! పాశ్చాత్యుల శృంగార వర్ణనము తో పోలుస్తూ, “వారి యొక్కయు మనయొక్కయు శృంగారమునకు ముఖ్య తారతమ్యములేవనగా: మనవలె వారంగవర్ణనమంతగా జేయరు. చేసినను మొగము కన్నులు మొదలగు బాహిరభాగముల మాత్రము ప్రశంసింతురు. మనలో నఖశిఖపర్యంతము విప్పివిప్పి చూపుట అందరు ఆశ్రయించిన కావ్య లక్షణము … అంగముల వర్ణించునపుడును, ఐరోపాలోని కవులు ఆ యంగము లేరీతి భావమును ప్రదర్శించుననుట జూపుదురేకాని, భావస్థ గీతంబులుగాని యవి అసంభావ్యములని వాని మాట తలపెట్టరు… స్త్రీల గుణగణములను శ్లాఘనతో వర్ణించుట పాశ్చాత్యులలోని సదాచార్యము… ప్రబంధములలోని నాయికలు నామీద వచ్చిపడు మనుట దప్ప ఇంకే యశస్కరములగు పాటులకైన పురికొల్పుట చూచినారా? ఇది శుద్ధ పశుప్రాయమైన కేళి…” ప్రభావతీదేవి వర్ణనము తుచ్చము అని చెప్పుతూ, “అంగముల గూర్చి పలవించుట గణికలకైన తగునా? మోహమనగా వీరికి దేహ క్రీడయేకదా! ఇదియా శృంగారము!” అని ఈసడింపుతో ఆ వర్ణనలు తిరిగి తిరిగి రాశారు, రెడ్డిగారు!

అయితే, ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. రెడ్డిగారికి వర్ణనలన్నీ నిరర్థకములు కావు! ఆయనకి ప్రభావతీప్రద్యుమ్నములో ఒక వర్ణన బాగా నచ్చింది. “ప్రద్యుమ్నుడు “పోలో” యనబడు గుర్రపు సవారీ చెండాట నాడుచుండుట కవి యెంత రమ్యముగ వర్ణించియున్నాడో,” అని అంటూ ఆ సీస పద్యం ఉదహరిస్తారు. ఆయనకు ఇంగ్లీషు సాహిత్యమే కాకుండా, ఇంగ్లీషు వాళ్ళు పెర్షియనుల దగ్గిర నేర్చుకొని, దేశియుల నెత్తిన రుద్దిన ఆటలంటేకూడా ఎంత అభిమానమో, చూడండి! (కేంబ్రిడ్జ్ లో క్రికెట్ గురించి చెప్పి పొగడడానికి రెడ్డిగారికి ఇక్కడ అవకాశం దొరకలేదు కాబోలు!)

కళాపూర్ణోదయములో రంభానలకూబరద్వయవిలాసము, ఆయనకు కామెడీ ఆఫ్ యెర్రర్స్, అనే షేక్స్పియర్ నాటకము గుర్తుకుతెప్పించినది! (సూరన్న, షేక్స్పియర్ సమకాలీనులు! ఒకరికొకరు తెలియకపోయినా, ఒకేవిధమైన కథని చెప్పడం ఆశ్చర్యమే!) ఈ ఒక్క ఉపాఖ్యాన విశేషమూ తప్ప, ఈ రెండింటికీ ఇంకెక్కడా పోలిక లేదు! ఆ విషయం రెడ్డిగారు చెప్పరు!

ఆయన పరిభాషలో, “అసహ్య శృంగారము” ఉదహరిస్తూ, “వధూవరులేకాంతము కోరుచున్నారు. చెలికత్తెలు కొంచెమున వదలరు. కవియన్ననో ఈ సమయమున ప్రాణముపోయినను వారినివదలబోడు! …”

ఇంత వివరంగా నేను ఎందుకు చెప్పుతున్నాను అన్న ప్రశ్న మీకు రాక మానదు. రెడ్డిగారి రెండువందలపైచిలుకు పేజీల విమర్శనా గ్రంధంలో, ప్రతి రెండవ పేజీలో శృంగార వర్ణనల ఏవగింపు, అపహాస్యం, అవహేళన, కొట్టవచ్చినట్టు కనిపిస్తుందని చెప్పడానికి! ఆయనకు నచ్చిన భాగాలగురించి చేసిన ప్రశంసలు, ఈ అవహేళనా సముద్రంలో ముణిగి మరుగున పడిపోయాయి. ఆయన పుస్తకం ఎప్పుడు చదివినా, ఎన్నిసార్లు చదివినా (ఆయన భాష ఇప్పుడు మనకి కొంచెం కష్టంగా కనిపిస్తుందనుకోండి, అది వేరే విషయం!) , ఆయన అవహేళనలే గుర్తుంటాయి కానీ, ఆయన చేసిన “పుర్ర చేతి ప్రశంసలు” అసలు గుర్తుకు కూడా రావు! రెడ్డిగారు తన వ్యాసం సభల్లో చదివిన రోజుల్లో, వేదం వేంకటరాయ శాస్త్రిగారు నీ వ్యాసంలో “అత్యుక్తి” దోషాలున్నాయని ప్రేమతో మందలిస్తూ చెప్పారుట! ఈ వ్యాసం పెరిగి పెద్దదై, పుస్తక రూపంలోకి వచ్చేటప్పటికి ఈ దోషాలే ఎక్కువై, పుస్తకం నిండా కనిపించటం ఆశ్చర్యంగా ఉన్నది.

రెడ్డి గారి ఉద్దేశంలో కళాపూర్ణోదయము ఆరవ ఆశ్వాసంలోని 189 వ పద్యంతో ముగిసిందని! మిగిలిన భాగాలు, కేవలం అనవసరమైన వర్ణనల మూలంగా కథాగమనం మందగించిందని ఆయన వాదు. నిజానికి, ఎనిమిదవ ఆశ్వాసం చివర చెప్పిన సుగ్రుహుడి వృత్తాంతం లేకపోతే కథ ఎంతో అసమగ్రంగా మిగిలి పోతుంది!

కళాపూర్ణోదయం, తెలుగు సాహిత్యంలో మొదటి “నవల.” తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న ప్రక్రియకి నాంది. కథ చెప్పించిన పద్ధతి, కథలోకథలోకథ అత్యద్భుతంగా కూర్చిన విధానం, ఐదవ ఆశ్వాసం వరకూ కథ ఎక్కడ ప్రారంభమయిందో పాఠకుడికి తెలియకుండా గుట్టుగా ఉంచి, కథని అత్యంత ఉత్సాహంతో చదవడానికి ప్రేరేపించడం (flash back technique) వచనంలో మాట్లాడుకున్నట్టే ఉండే పద్యసంభాషణలు, కథ కవిచెప్పకండా పాత్రలద్వారా కథను మలుపులుతిప్పడం, మణిత, మణిహారాల మాటల్లో ఇమిడి ఉన్న గూఢార్థాలు, కథలోపునశ్చరణ, కథాక్రమం, వీటిపై చక్కని వివరణకు The Sound of the Kiss[2], లో “Invitation to a Second Reading” కాస్త శ్రద్ధగా చదవండి. అందులో రెడ్డిగారి మేథకి అందని, చాలామంది ఆధునిక విమర్శకులకి అర్థంకాని విషయాలు, కూలంకషంగా చర్చించబడ్డాయి. వారి అనువాదానికి పెట్టిన పేరు, The Sound of The Kiss అన్నది ఎంత చక్కని పేరో, “మణిత” అన్న పదానికి ఎంత అనువుగా ఉన్నదో, బోధపడుతుంది.

ఇక పోతే, ప్రభావతీప్రద్యుమ్నం కావ్యంలో నాయకుడు, నాయిక ప్రబంధసాహిత్యంలో అప్పటివరకూ ఉన్న సాంఘిక కట్టుబాట్లని ఎల్లా ఉల్లంఘించారో, ఆ పుస్తకంలో కల్పనా పాటవం, వర్ణనా చాతుర్యం, ఇతర నవ్య విశ్లేషణలు The Demon’s Daughter, A Love Story from South India [3] లో విపులంగా విశదీకరించబడ్డాయి.

ప్రభావతీ ప్రద్యుమ్నము కేవలం చదువరులకోసం రాయబడింది. అంటే, మనలో మనం చదువుకొని, ఆ శైలిని, కథాకథనాన్నీ ఆనందించడం కోసమే అని అర్థం. ఇందులో, సూరన్న గారు, అంతకుముందు ప్రబంధకవులలా కాకుండా, వచనాన్ని పద్యంలో ఇమిడ్చిన పద్ధతి అద్వితీయం. ఆయన పద్యరచన పద్ధతి, ఆయన చూపించిన కొత్తప్రక్రియలు, తరువాతి కవులకు మార్గదర్శకమయినాయి అనడంలో అతిశయోక్తి లేదు.

నామటుకు నాకు, అనువాదంలోకొచ్చిన ఈ రెండు పుస్తకాలూ నేను చదివి ఉండకపోతే, మూలకావ్యాల [9,10] జోలికి పోయి ఉండే అవకాశమే లేదు. ఈ కాస్త వివరణా సాధ్యం అయ్యేది కాదని రూఢిగా తెలిసింది. ( సిగ్గు విడిచి చెప్పుకోవడం మంచిది. నాకుకూడా, మనలో చాలామందిలాగే, మొదటగా ఇంగ్లీషులో చదవందే, తెలుగు సాహిత్యం నాణ్యత గుర్తించలేక పోవడం! )

ఈ వ్యాసానికి ముఖ్యమైన కారణం: రెడ్డిగారి విమర్శ రెండువందల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి చేసిన అపకారం ప్రస్తావించడమే! రెడ్డి గారు అప్పట్లో చాలా పలుకుబడి గలవారు; పైగా అధికారం ఉన్న వారు. ఆంధ్రవిశ్వకళా పరిషత్తుకి మొదటి ఉపాధ్యక్షులు, Vice Chancellor (V.C.) (అప్పటి వీ.సీ. లకి, ఇప్పటి వీ.సీ. లకీ అధికారంలో చాలా తేడాలున్నాయన్న విషయం మీకు తెలియనిది కాదు!) అంతే కాదు; ఆయన గ్రంథం అప్పుడూ, ఇప్పుడూ కూడా పాఠ్య పుస్తకం! ఇప్పటికీ, శృంగారం, వర్ణనలని దాటి ఆ కాలపు సాహిత్యాన్ని మరొక దృష్టితో చూడగలగడం తెలుగులో పట్టభద్రులకి ఇంకా సాధ్యం అవటల్లేదు. తెలుగు సాహిత్యంలో ఈ మధ్యకాలంలో వచ్చిన, ప్రస్తుత కాలంలో వస్తున్న పట్టభద్రులగురించి తరువాత చెప్పుకుందాం.

ఒక యుగాన్ని, ఒక కవి వ్రాసిన కావ్యాన్నీ అవహేళన చేస్తూ విమర్శలు రాలేదనటల్లేదు. మోతాదులో అవహేళణ మనకి చాలా ప్రాచీనమైనదే!

శృంగార నైషధ కర్త శ్రీహర్షుడు, మమ్మటుడనే ఆలంకారికునికి మేనల్లుడట[7]! శ్రీహర్షుడు తన నైషధకావ్యాన్ని మేనమామాకు చూపించాడట! అది చదివి మమ్మటుడు - “నువ్వు ఈ కావ్యం కొంచెంముందుగా నాకు చూపిస్తే బాగుండేది; నా కావ్య ప్రకాశలో దోషప్రకరణంలో వివిధ దోషాలకు ఉదాహరణలు చూపడానికి ఈ కావ్యంలోను, ఆకావ్యంలోను వెదికి చాలా శ్రమ పడ్డాను. నీ కావ్యం అప్పుడే లభించి ఉంటే అన్ని దోషాలకీ ఉదాహరణలు దీనిలోనే లభిస్తున్నాయి కాబట్టి నాకా శ్రమ అంతా తప్పి ఉండేది,” అని అన్నాడట! ఇది కట్టు కథ కావచ్చు. కాని, ఇది హేళనే! చాలా సున్నితమైన హేళన.

(ఇది విన్నతరువాత, శ్రీహర్షుడు తన దోషాలన్నీ సవరించుకున్నాడని కథ!)

అయితే, ఇటువంటి అవహేళనలు ఎప్పుడో మరుగునపడిపోయాయి. కారణం: కవుల ప్రతిభ ఒక్కటే కాదు; ఆ అవహేళన చేసిన విమర్శకులకి ఏ రకమయిన రాజకీయాధికారం లేకపోవడమే!

హద్దు దాటిన అవహేళనకు మరొక ఉదాహరణ అక్కిరాజు ఉమాకాంత పండితులు వ్రాసిన (1928) “నేటి కాలపు కవిత్వం”.[4] భావకవిత్వం పేరుతో అప్పట్లో ప్రసిద్ధమై, ప్రచారమైన కవిత్వాన్ని తీవ్ర పదజాలంతో ఆయన విమర్శించారు. చెప్పవలసిన దానికన్నా ఎక్కువగా చెప్పడం, “విస్తరణాధికరణ” దోషమని నిర్వచించి, ఒక్క యెంకి పాటలు మినహా మొత్తం భావకవిత్వాన్ని దుయ్యబట్టారు. “అయోమయత్వం, పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం” అనే పేర్లు పెట్టి నిరసనగా రాసారు. సాంఘికంగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా, భావకవిత్వం చరిత్రలో నిలిచింది. ఉమాకాంతంగారి విమర్శ మరుగున పడిపోయింది. అయితే, చెప్పే విషయాలలో సూటిదనం, నిర్భీకత, నిజాయితి, స్పష్టత, తర్క పటిమ ఉమాకాంతంగారి సద్గుణాలు. ఆయన పాండిత్యానికి భయపడి, ఆ రోజుల్లో ఎవ్వరూ ఆయనకు సమాధానం చెప్పలేకపోయారట (శ్రీశ్రీ, 1960, ఆంధ్రదర్శని - Preface to Ref.4). ఉమాకాంతం గారికి పాండిత్యానికి తోడు, రాజకీయ అధికారం కూడా ఉండి ఉంటే భావకవిత్వం ఏమయి ఉండేదో ఆలోచించండి!

ఇక పోతే ప్రస్తుతకాలంలో సాహిత్య విమర్శ కేవలం వ్యక్తి దూషణగానో, ఒక ప్రత్యేక వర్గ సంబంధిగానో తయారయ్యింది. మార్క్స్, ఎంజెల్స్, లెనిన్, మావో ల భౌతికవాద మార్క్సిజం [5] పై సందేహం పైకి చెప్పితే చాలు, ఆ రచయిత పని సున్నే! అలాకాకండా, మానవతావాద మార్క్సిజం బహుశా మంచి సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ సరైన తోవ చూపించవచ్చునేమో అని ఎవరన్నా అంటే చాలు, వాళ్ళు రివిజనిస్టులు; వాళ్ళు ఎంత గొప్పకవిత్వం రాసినా సరే, అది బూర్జువా కవిత్వమే అవుతుంది; ఏ విమర్శ చేసినాసరే, అది బూర్జువా విమర్శే అవుతుంది. ఈ రెండు వాదాలూ కూడా సాహిత్యం మేరకు ఓ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేవేమో అంటే వాళ్ళు రివిజనిస్ట్లులకన్నా హీనమైన జాతి వారు! వాళ్ళని పేరుపేరునా దుయ్యబట్టటం కొంతమంది నవవిమర్శకులకి పరమావధిగా తయారయ్యింది. ఇటువంటి వితండ వాదన చేసేవాళ్ళకీ, బుల్లి బుష్ గారికీ పెద్ద తేడా లేదనే చెప్పాలి! ఇక్కడ మళ్ళీ బుష్ గారి ప్రస్తావన తెస్తున్నందుకు క్షమించండి. ఇరాక్ యుద్ధం గురించి ఆయన రాజకీయాలని సమర్థించకపోతే, వాళ్ళ జత కచ్చి కచ్చి, కావ్ కావ్! If you are not with us, you aren’t a patriot! అన్నట్టు!

మనకి, అనావశ్యకమైన ఆవేశం, విపరీతమైన పక్షపాతం లేకుండా, ఎవ్వరికీ ఏ ఇజానికీ అడుగులకు మడుగులొత్తకుండా, నిష్కర్షగా చెప్పగల ధైర్యం ఉంది. అవకాశం ఉంది. అయితే ఆ ధైర్యం, అవకాశం మాత్రమే చాలవు. వాటికి తోడు తగిన ప్రేరణ, సరైన శిక్షణ ఉంటే, బహుశా, మనం తెలుగు సాహిత్య విమర్శలో కొత్త పుంతలు తొక్క గలమనే ఆశ.

ఇటువంటి సందర్భంలో, విమర్శ, కనీసం dialog అయినా అతిపాక్షికంకాకండా ఎలావుంటుంది? ఏ వాదాలను సమర్థించేవాళ్ళు, ఆ వాద ధోరణిలో వచ్చిన సాహిత్యాన్ని అందలానికెక్కించడం, విపరీతంగా పొగడటం (మళ్ళీ అత్యుక్తి దోషం కి మరో ఉదాహరణ!) మిగిలిన సాహిత్యాన్నంతనీ, ఆ రచయితలందరినీ దూషించి, దుయ్యబట్టడం జరుగుతూన్నది. ఇదీ ప్రస్తుత కాలంలో సాహితీ విమర్శ!!

ఈమాటసెప్టెంబర్ 2006 సంచికలో నేను రాసిన సంపాదకీయంనుంచి కొన్ని వాక్యాలు ఇక్కడ పునశ్చరణ చెయ్యటం అసంబద్ధంకాదనుకుంటాను. స్థూలంగా అక్కడ చెప్పిన భావాలు ఇవి: తెలుగు దేశంలో, ఇప్పుడు సాహితీ చర్చలు ఆలోచనాయుతంగా జరగటల్లేదు. ఆ చర్చలన్నీ వ్యక్తి నిందలతోటి, కొరగాని ఆవేశాలతోటీ, గజిబిజి వాక్యాలతోటీ, అంతం అవుతున్నాయి. తెలుగులో ఇప్పుడు వస్తున్న రకరకాల కవిత్వాలకి అన్నిటికీ ఒకే విమర్శ సిద్ధాంతం వర్తించవలసిన అవసరం లేదు. ఎవరికవిత్వపు మంచిచెడ్డలు వివరించడానికి, విశ్లేషించడానికి అవసరమైన విమర్శ భావాల్ని, పరిభాషనీ వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అయితే, విమర్శలో ఏదిమంచిది, సమర్థమైనది, ఏది అనవసరపు ఆవేశాలతోనూ, ఊకదంపు గజిబిజి వాక్యాలతోనూ నిండిన అసమర్థ విమర్శ అన్న సంగతి ఆయా కవితారంగాల్లోఉన్న విమర్శకులే చెప్పాలి. తమ విమర్శకులకి కావల్సిన తరిఫీదు ఎలా ఉండాలో వాళ్ళే నిర్ణయించాలి. తెలుగు కవిత్వానికీ, విమర్శకీ ప్రమాణాలు కవిత్వం రాసే వాళ్ళు, విమర్శ రాసే వాళ్ళూ తమలోతాము చర్చల ద్వారా నిర్ణయించాలి. ఏ ప్రమాణాలూ లేకుండా ఏదిరాసినా కవిత్వమే, ఎవరు రాసినా విమర్శే అనే పరిస్థితి ఎవరికీ మంచిది కాదు.

పోతే, మన విశ్వవిద్యాలయాల్లో, తెలుగు సాహిత్య విమర్శ కొత్త పుంతలు తొక్కే అవకాశం శూన్యం. ముఖ్య కారణం: గత ఐదు దశాబ్దాలుగా, తెలుగు సాహిత్యంలో పట్టభద్రులవుదామనే కుతూహలం చూపించే వారెవరు? పైచదువులకి అంటే విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళే వారిలో ఎక్కువమంది (సుమారు 99.5 శాతం!), ఇంజనీరింగులోకి, వైద్యవిద్యలోకి, మిగిలిన శాస్త్ర విద్యలలోకి ప్రవేశిస్తారు! మరి కొద్దిమంది, వ్యాపార సంబంధమైన విద్యల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇటువంటి విద్యల్లోకి ప్రవేశం దొరకని ( లేదా ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేని వారు) వాళ్ళే ఎక్కువ మంది తెలుగు సాహిత్య అధ్యయనం కి వస్తున్నారు! దానికి తోడు, తెలుగులో ఎం.ఎ. లో ప్రవేశించడానికి, ఏవిధమైన ప్రవేశ పరీక్షలోనూ ఉత్తీర్ణులు కానక్కరలేదని విన్నాను. ఈ పట్టభద్రులే, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఉపన్యాసకులు, ఆచార్యులూ అవుతున్నారు. ఇటువంటి స్థితిలో, తెలుగు సాహిత్య పఠనం, తెలుగు సాహిత్య విమర్శ, పటిష్టం అవడానికి మార్గం కనిపించడం లేదు.

ఈ మధ్య ఎక్కడో చదివిన గుర్తు: Nathaniel Hentoff అనే ప్రఖ్యాత సంగీతవిమర్శకుడు అన్నాడట! Anybody can be a jazz critic. The Standards are very low, అని. తెలుగులో విమర్శ కూడా సరిగ్గా అదే స్థితిలోఉంది అని అనడానికి సందేహం లేదు.

diaspora సాహిత్యంతో సతమతమవుతున్న మనకి, అనావశ్యకమైన ఆవేశం, విపరీతమైన పక్షపాతంలేకుండా, ఎవ్వరికీ ఏ ఇజానికీ అడుగులకు మడుగులొత్తకుండా, నిష్కర్షగా చెప్పగల ధైర్యం ఉంది. అవకాశం ఉంది. అయితే ఆ ధైర్యం, అవకాశం మాత్రమే చాలవు. వాటికి తోడు, తగిన ప్రేరణ, సరైన శిక్షణ ఉంటే, బహుశా, మనం తెలుగు సాహిత్య విమర్శలో కొత్త పుంతలు తొక్క గలమనే ఆశ. దయచేసి ఆలోచించండి.

ఆఖరిగా, కొన్ని వందల సంవత్సరాలక్రితం కవిత్వం రాసిన కవి మనకి సమకాలీనుడే! వర్తమాన కాలానికి, భూతకాలానికీ, లంకె కవులే! కవులు మన సంప్రదాయాలకి సంరక్షకులు అని గుర్తు పెట్టుకోవడం ఎంతైనా అవసరం! అందుకే సాంస్కృతిక విలువలు సంప్రదాయాలూ సమసి పోవు; అవి సార్వజనీయాలు.

References:

  1. కవిత్వ తత్త్వ విచారము (6th Editoin) - కట్టమంచి రామలింగారెడ్డి, ఆంధ్ర యూనివెర్సిటీ, జనవరి 1981.
  2. The Sound of The Kiss or The Story That Must Never be Told, Pingali Suranna, Translated by Velcheru Narayana Rao and David Shulman, Columbia University Press, New York, 2002.
  3. The Demon’s Daughter, A Love Story from South India, Pingali Suranna, Translated by Velcheru Narayana Rao and David Shulman, State University of New York Press, Albany, 2006.
  4. నేటి కాలపు కవిత్వం - అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 1994 (చేకూరి రామారావు గారి ముందుమాట నాకు ఉపయోగపడింది)
  5. Marxism and Literary Criticism - Terry Eagleton, University of California Press, Berkeley, 1976 (An excellent student introduction on the subject).
  6. Literary Theory, An Introduction - Terry Eagleton, The University of Minnesota Press, Second Edition, 1993 (I am benefited from the Chapter entitled ‘The Rise of English,’ which gave me the lead to Chris Baldick and his work).
  7. కావ్య ప్రకాశము - మమ్మటుడు (తెలుగు వ్యాఖ్య: పుల్లెల శ్రీరామచంద్రుడు), సంస్కృత భాషా ప్రచార సమితి, హైదరాబాద్, 1995 (ముఖ్యంగా ఉపోద్ఘాతం)
  8. కావ్యదర్శః - దండి (తెలుగు వ్యాఖ్య: పుల్లెల శ్రీరామచంద్రుడు), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాద్, జనవరి 1981.
  9. కళాపూర్ణోదయము (2 సంపుటములు) - పింగళి సూరన, వ్యాఖ్య బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, Emesco Edition, 1997
  10. ప్రభావతీ ప్రద్యుమ్నము - పింగళి సూరన, Emesco Edition, 1990.
 

(12 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Alok Vastav అభిప్రాయం:

    November 4, 2006 12:07 pm

    అక్కిరాజు ఉమాకాంతం గారిది హద్దుమీరిన అవహేళన అన్న మీ మాటలు అంతగా నచ్చలేదు. యే కొంచెం సూటిగావున్నా అది హద్దులు మీరిందనా కొలబద్ద? కట్టమంచివారికంటే అక్కిరాజుగారిలో నాకు నిజాయితీ, ఆవేదనా కనపడుతుంది. శ్రీశ్రీ మాటల బట్టి జూస్తే కవులకు అక్కిరాజుగారి పాండిత్య భయమేగానీ ఆయన ఆవేదన కనబడలేదులా వుంది. అంటే ఆయా కవులకి కవిత్వవీరత్వం, పాండిత్యభీరుత్వమని తీర్మానించవొచ్చుగదా! లేదూ ఆయన చేత విమర్శింపబడ్డవారందరూ కవిపండితులే అనుకొంటే ఆయన విమర్శలని దీటుగా ఎదుర్కొంటూ యేల గ్రంధాలు, వ్యాసాలు వెలయించలేదు? “ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానమ ఎవరేం చెప్పగలరు? మరింత ఉత్సాహంతో, పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుకొన్నాం” అని కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలో రాసినట్టు శ్రీ పేర్వారం జగన్నాధం గారు రాసారు. “మేమనుకొన్నాం” అన్న పదం నాకెందుకో “మూక మనస్తత్త్వా”న్ని గుర్తుకుతెచ్చింది.వొక్క పండితుడి “అవహేళన”కి మూక ప్రచారం స్థాయిలో సమాధానమివ్వాలని అంతమంది కలిసి తీర్మానించడమే సాక్షి అక్కిరాజుగారిది అవహేళనతో కూడిన విమర్శ కాదని. సంపూర్ణంగా భారతీయతత్వ చింతనతో విమర్శించిన అక్కిరాజుగారిని కట్టమంచివారి సరసన కట్టివేయడం మనసుకి కష్టంగా వుంది.

  2. Ananth B. Shastry అభిప్రాయం:

    November 5, 2006 8:41 am

    మీ వ్యాసం కాస్త ఓపిగ్గా చదవ వలసి వచ్చింది.

    సుమారుగా 100 ఏళ్ళ క్రితం వ్రాసిన విమర్శ గురించి సోదాహరణంగా విపరీతంగా చర్చించారు. 40/50 ఏళ్ళ క్రితం వ్రాయబడ్డ (నాకు ఉమాకాంతం గారు ఏ సంవత్సరంలో వ్రాసారో గుర్తులేదు) విమర్శ గురించి ఒక్క ముక్క చెప్పి, దానిపై మీ అభిప్రాయం వ్రాసారు. ప్రస్తుత విమర్శనా ధోరణి పై మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అంత వరకూ బాగుంది. కాని, కొత్త విమర్శలకు ఉదారణలు ఇచ్చి ఉండవలసింది. కనీసం నలుగురి పేర్లు, వారి రచనల పేర్లిచ్చినా బాగుండేది.

    విమర్శ ఎలా ఉండకూడదో చెప్పారు బాగానే ఉంది. ఎలా ఉండాలో చెప్పే విమర్శలు తెలుగులో లేవనుకోవాలా? అనే సంశయాన్ని కలిగించారు. మంచి విమర్శల గురించి కనీస ప్రస్తావన చేస్తే బాగుండేది.

    వ్యాసంలో ఋణ విద్యుచ్ఛక్తి దండిగా ఉంది. మీ ఆశయం దాన్ని చదువరులకు తెలియజెప్పడం కాదు గదా! వారి దృష్టి ధనాత్మకత వైపు మళ్ళించడానికి అది ఒక వేదిక మాత్రమే.

    ఇది ఒక సాహితీ సభలో కీలకోపన్యాసంగా ఇవ్వబడిందని చెప్పుకున్నారు గాబట్టి ఒక మనవి. కీలకోపన్యాసాలు ఋణాత్మకంగా మొదలవడంలో తప్పులేదుగాని, ఉపన్యాసం పూర్తయేసరికి ధనాత్మకత హృదయాల్లో ప్రతిష్ఠించాలి. ఈ వ్యాసం ఆ పని చెయ్యగలదని అనిపించలేదు నాకు.

    పైన చెప్పిందంతా కేవలం నాకొక్కడికే అనిపిస్తే అది నాలోపమే.

    విధేయుడు
    అనంత్

  3. Veluri Venkateswara Rao అభిప్రాయం:

    November 5, 2006 11:08 am

    Alok Vastav గారు కృష్ణశాస్త్రి గారి మూల వ్యాసం చదివి ఉంటే, ఉమాపతి గారి గురించి నేను అన్నమాటలకి అక్షేపణ చేసేవారు కాదనుకొంటాను.

    కృష్ణశాస్త్రి గారి “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము” అన్న 1948 భారతి పత్రికలోని వ్యాసం 1923 నుంచి 1948 వరకూ వచ్చిన కవిత్వంపై, నాటి కవితా ఉద్యమాలపై చక్కని విమర్శనా వ్యాసం అని నిస్సంశయంగా చెప్పవచ్చు.

    ఓరియంట్ లాంగ్మన్ వారు 1993 లో ప్రచురించిన “అప్పుడే పుట్టి ఉంటే” అన్న కృష్ణశాస్త్రి గారి వ్యాస సంపుటి లో ఈ వ్యాసం తిరిగి అచ్చయ్యింది. 1/8 డెమీ సైజులో 34 పేజీల సుదీర్ఘ వ్యాసం ఇది. ఆ వ్యాసంనుంచి ఈ కింది వాక్యాలు (చూ: 29 వ పేజీ):

    “… కృష్ణపక్షం ప్రచురించాను. స్ఫుటంగా నా మనస్సులో నాటుకొపోయిన మరి రెండు మూడు ఘట్టాలు ఉన్నాయి. 1925 లో నేమో అక్కిరాజు ఉమాకాంతం గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వము” అనే గ్రంథం వచ్చింది. ఆశనిపాతమంత తీవ్రధాటితో వచ్చింది. రాకేం జేస్తుంది? ఎప్పుడయితే నిజమైన ఒక ఉద్యమం బయలుదేరిందో, అప్పుడే దాని గుణదోషవిమర్శన కూడా వస్తుంది. ఆయన తీవ్ర విమర్శననుంచి నావంటి కవులు నేర్చుకోవలసినది లేకపోనూ లేదు; కాని కొంత ఆర్ద్ర దృష్టితో కవితాహృదయముతో ఆ విమర్శన సాగితే, నేటికాలపు కవిత్వంలో వారు చక్కదనమూ కవిత్వగుణమూ గ్రహించి ఉండేవారు. ఊపిరాడనీయనంత కోపంతో ఆ గ్రంథం దాడిచేసినట్లనిపించింది నావంటి వారికి. దానికి జవాబు వ్రాద్దామా అన్నారు కొందరు మిత్రులు. ఏమి జవాబు మేము వ్రాయగలం? కొత్త పద్యాలు వ్రాయడమే జవాబనిపించింది. వ్రాయకుండా ఎలాగుండగలం? ఈ సంకల్పం 1925 లో మదరాసులో మరీ దృఢపడింది.”

    ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము ఉమాకాంతపండితులకు లోపించిందని ఇంతకన్నా మృదువుగా, కృష్ణశాస్త్రిగారి కన్నా చక్కగా ఇంకెవరు చెప్పగలరు?

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  4. Rohiniprasad అభిప్రాయం:

    November 5, 2006 3:43 pm

    విమర్శల్లో తెగనాడినవి గుర్తున్నంతగా తక్కినవి గుర్తుండవేమో! తెలుగులో మంచి విమర్శలు చాలానే వెలువడ్డాయి. కాని వేలూరివారు చెప్పినట్టుగా కొన్ని విమర్శల ద్వారా రచన గురించే కాక విమర్శకుడి సంగతి కూడా మనకు తెలుస్తుంది.

    పాత సాహిత్యంలో “అమలినం” కాని శృంగారాన్ని పద్ధెనిమిదో శతాబ్దం నుంచీ విమర్శకులు ఈసడించుకోవడం కనిపిస్తుంది. ఆ తరవాతి కాలంలో కూడా ముద్దుపళనివంటివారి రచనలు తీవ్ర విమర్శకు లోనవడం గురించి ఆరుద్ర ప్రస్తావించారు. వాటిలో కొన్ని శృంగారాన్ని గురించిన స్త్రీల దృక్పథాన్ని తెలుపుతాయనీ, వాటిని తరవాతి కాలంలో అణచకుండా ఉన్నట్టయితే అదొక ఆధునిక స్త్రీవాద సాహిత్యానికి దారి తీసి ఉండగలదనీ ఆయన భావించారు.

    వ్యాసంలో ప్రస్తావించిన రచనలోనే కృష్ణశాస్త్రిగారు తనకన్నా సీనియర్లనూ, జూనియర్లనూ కూడా పేర్కొంటూ, విమర్శ కాకపోయినా సమీక్ష చేశారు. కె.వి.రమణారెడ్డి అనేకుల రచనలను వివరంగా విమర్శించారు. “ఋణ” దృక్పథంతో చేసిన విమర్శల్లో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు దిగంబర కవులను గురించి రాసినది కూడా ఒకటి. త్రిపురనేని మధుసూదనరావు విశ్వనాథ రచనలను విశ్లేషించి మరీ చెండాడాడు.

    ఈ మధ్య ద్వానాశాస్త్రి తదితరులు విప్లవ, స్త్రీ వాద, దళితవాద, మైనారిటీ వాద రచనలను సహృదయతతో విమర్శ చేస్తున్నారు. ఇవి అంతగా గుర్తుండకపోవటానికి కారణం ఇవన్నీ దిన, వార, మాసపత్రికల్లో ఏదో ఒక మూల కాస్తకాస్తగా కనిపిస్తూ ఉండడమే. సాహిత్యానికే దిక్కులేని ఈ రోజుల్లో విమర్శలను పట్టించుకునేవారే తక్కువ.

    మంచి సాహిత్యాన్నిగాని, ఉన్న సాహిత్యంలో మంచినిగాని పరిచయం చేస్తే అది కూడా ఉపయోగకరమే. 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వెల్చేరు నారాయణరావుగారు వెన్నెల రాత్రి వేళ హాస్టలు డాబామీద తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితను విద్యార్థులకు చదివి వినిపించడం గుర్తుంది.

    విమర్శకులూ, సమీక్షకులూ సామాన్య పాఠకులకన్నా కాస్త లోతుగా పరిశీలించి, రచనలను గురించి వ్యాఖ్యానం చేస్తారు కనక సాహిత్యాభిమానులకు అది ఉపయోగపడుతుంది. అయితే వారికి కూడా తప్పనిసరిగా కొన్ని పరిమితులుంటాయి. వేలూరివారి వ్యాసంవల్ల నాకు అర్థమయినదిదే.

  5. Alok Vastav అభిప్రాయం:

    November 6, 2006 3:41 am

    వేలూరిగారూ, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు తెలిసేవుంటుంది.ఐనా వుదహరిస్తాను.ఉమాకాంతంగారు గురజాడవారిని మద్రాసు నగరంలో కలిసినప్పుడు జయంతిరామయ్య మొదలైనవారి గ్రాంధికభాషా సమర్థనను ప్రస్తావిస్తూ అక్కిరాజుగారు గ్రాంధికభాషను సమర్ధించారు.ఐతే అందుకు సమాధానంగా గురజాడ “వారు పెద్దవారు అంచేత వారికి నా వాదన అర్థంకాలేదు.మీరు యువకులు మీకూ అర్థమవడంలేదు” అని చెప్పారు.వెనక్కి వచ్చిన ఉమాకాంతంగారు మరి యేమీ ఆలోచించక తమ గ్రంధాన్ని వ్యావహారికంలోనే రాసారు. ఉమాకాంతంగారి సున్నితత్వం కూడా కృష్ణశాస్త్రిగారంత సున్నితమే.

    తల్లికి బిడ్డడి మీద వున్నట్టుగానే కవులకు తాము రాసిన రాతల పట్ల మమకారం వుండడం అత్యంత సహజం.ఎవరైనా బిడ్డని అనాకారియని తిట్టితే తల్లికి ఖేదమవడంలో సహజత వుంది. గానీ ఎవరైనా బిడ్డని దుష్టుడని నింద వేస్తే తల్లి కోపగించక ఆరోపణలోని నిజానిజాలను విచారించుకోవాలి. బిడ్డ నిజంగానే దుష్టుడైతే ఆ ఆరోపణ జేసిన వ్యక్తికి కృతజ్ఞత తెలియజెప్పాలి. అంతేగానీ గుడ్డినమ్మికతో ఆరోపించిన వ్యక్తిని నిందించడమో, ఆ ఆరోపణను తృణీకరించడమో జేస్తే అది ఆత్మహత్యాసదృశమే. కట్టమంచివారు మొదటి చర్యకు పాల్పడితే, ఉమాకాంతం గారు రెండవదాన్ని జేసారు. అనగా కృతులలోని దుష్టాలను ఖండించారు. రూపాన్ని అవహేళన జేయడం నీచమేగానీ గుణ లోపాలను ఎత్తి చూపడం నేరం గాదు. అంచాత అక్కిరాజుపైని అక్కసు అర్థరహితం. అక్కిరాజుగారికి అర్ర్ద హృదయం కొరవడలేదుగానీ కవులకు అర్థజ్ఞానం కొరవడిందన్నది నిర్వివాదం.

  6. Kameswara Rao అభిప్రాయం:

    November 6, 2006 10:04 am

    ఇక్కడ కృష్ణశాస్త్రిగారన్న “ఆర్ద్రత”, “కవితాహృదయం” అన్న పదాలని కొంత స్పష్టపరచాలి. వేలూరి వారీ వ్యాసంలో చెప్పినట్టు, రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు. ఒకో రకం కవిత్వానికి ఒకో రకమైన రూపం, వస్తువు, పాఠకవర్గం, ప్రత్యేక ప్రయోజనాలూ ఉంటయి. వాటికి తగట్టు ఆ కవిత్వానికి ప్రమాణాలు ఏర్పడతాయి. వాటిని అర్థం చేసికొని దానికి తగినట్టు విమర్శ చేస్తే అది సహృదయ విమర్శ అనిపించుకుంటుంది. లేకపోతే, ఎంత మంది ఎంతగా ఇష్టపడితే నాకేంటి, నేను మెచ్చిందే కవిత్వం అన్నట్టుంటుంది. సహృదయ విమర్శ అంటే ఊరికే రాసిన వాళ్ళను పొగడటం కాదు. వాళ్ళ కవిత్వాన్ని సరిగా అంచనా వేసి (పైన పేర్కొన్నట్టు), దానికి తగట్టు విమర్శించడం. అక్కిరాజు వారీ పని చెయ్యలేకపోయారు.

  7. Alok Vastav అభిప్రాయం:

    November 6, 2006 10:57 am

    కామేశ్వరరావు గారు పొరబడ్డారు.అక్కిరాజుగారు తమ గ్రంధంలో ఎక్కడా “ఇది నా అభిప్రాయం, “ఈ కవిత నా అభిప్రాయానికి అనుగుణంగా లేదు”, “లేదు కాబట్టి ఇది కవిత గాదు” అని ఎక్కడా అనలేదు.అల్లా అనడం బుద్ధితక్కువదనమని మనకే తెలిసినపుడు వ్యాకరణ, తర్క నిష్ణాతుడైన ఆయనకు తెలియకపోవడమేంటి?

    తాను మండన జేసిన ప్రతి సిద్ధాంతానికీ వేద, పురాణ, ఇతిహాస, అలంకారశాస్త్రం వంటి ప్రామాణికగ్రంధాలను ఉదహరించారు.అక్కడే కట్టమంచివారికీ అక్కిరాజుగారికీ తేడా కనపడేది. ఎవరైతే ప్రత్యక్ష, అనుమాన, ఆగమాలను వాడకండా వాదిస్తాడో అది సిద్ధాంతమవదు రాద్ధాంతమౌతుంది.

    అల్లా ప్రామాణికంగా రాసిన విమర్శని నిరుపయోగమైన సెంటిమెంటులతో తోసిపుచ్చడం పరిణితి చెందని మనసులకే సాధ్యం.

  8. విప్లవ్ అభిప్రాయం:

    November 7, 2006 8:26 am

    వేలూరి గారు రెండు ఉద్దేశాలు చెప్పారు మొదట్లోనే, అందులో ఒకటి:

    “సాహిత్య విమర్శలో ఈ పక్షపాతం అనావశ్యకమైన ఆవేశం గా మారితే, ఆ విమర్శ ల వల్ల సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చే నష్టాల వివరణ ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.”

    ఇందులో కొంతైనా నెరవేరినట్టుంది. ఆయన రెండవ ముఖ్యోద్దేశం గా చెప్పినది (”ఈ స్థితినుంచి తేరుకోవడానికి (విముక్తికి) మార్గాలేమయినా ఉన్నాయా”) కొద్దిగా నైనా జరగాలంటే పై మొదటిది విమర్శకులు దాటుకుని వెళ్ళాలి.

    నాకు చాలా డౌట్లు ఉన్నయి, వాటికి తొందర లేదు.

    కామేశ్వర రావు గారన్న మాట:

    “రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు.”

    ఈ మాట మీద కొంచెం వివరణ అవసరం అనుకుంటాను. నా ప్రశ్న: మనం మార్క్సిస్టు విమర్శ అనే సిద్ధాంతకోణం లోనించి ఒక శతాబ్దం లేక దశాబ్దం లో వచ్చిన సాహిత్యాన్ని critic చేయటం తప్పంటారా? (”మార్కిస్టు విమర్శ” మీద అభ్యంతరాలు ఉంటే దాని బదులు మోరలిస్ట్ విమర్శ కాకపోతే మరొకటి అనుకోండి ఇప్పటి మటుకు).

    విప్లవ్

  9. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 8, 2006 5:16 am

    #
    ఉమాకాంతం గారి “నేటి కాలపు కవిత్వం” చదివిన తరువాత నాకైతే అతనికి ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము లోపించాయని అనిపించలేదు. మరి కృష్ణశాస్త్రిగారికి అనిపించింది. ఏది నిజం ఏది కాదు అంటే ఎవరు చెప్పాలి? అయినా ఇవి కావేమో విమర్శకుడికి ఉండల్సిన ముఖ్యార్హతలు.

    ఆర్ద్ర దృష్టి కవితా హృదయము కన్నా వేలూరి గారన్నట్లు నిష్పక్షపాత దృష్టి, నిజాయితీ హృదయమే విమర్శకు ఎక్కువగా కావలసిన సామగ్రి అనుకుంటాను.

    చదవగానే వినగానే మైమరిచి కరిగిపోయే ఆర్ద్రదృష్టి, భావాల వెల్లువలో తూలిపోయే కవితా హృదయం, భావ సమాధికి తన్మయత్వానికి సాయపడుతాయి కాని, పలు దృక్కోణాలనుంచి సమగ్రంగా అవగాహన పొందడానికి, సంయమనంతో విశేషంగా విశ్లేషించడానికి సాయపడడం కన్నా, అవి కొంత అడ్డుగానే నిలబడతాయని అనుకుంటాను.

    రచనలు పలు రకాలైనప్పుడు విమర్శలు కూడా పలు రకాలుగా ఉండడం సహజమూ అనివార్యమూ కూడా. అయితే రకాలు ఎన్నైనా, విషయం పాఠకునికి అందించడమే రచనలన్నింటి ఉద్దేశం. ఆ ఒక్కటి నెరవేర్చడంలోనే ఎన్నో ప్రక్రియలు, మార్గాలు, వైవిధ్యాలూ, సొగసులు, సృజనాత్మకమైన ప్రయోగాలు అన్నీనూ.

    అట్లే విమర్శలు ఎన్నో రకాలున్నా విమర్శించే రచన గురించి విశేషమైన అవగాహనను అందించే వరకూ అవి అన్నీ విమర్శలే, ఖచ్చితంగా. అయితే విశేషమైన అవగాహన కలిగించడం సుళువైన పని కాదు, కొన్ని సార్లు రచన కన్నా కష్టతరమైనది కూడా.

    మరి సమగ్ర విమర్శకు ఏమి కావాలి ? విమర్శకునికి రచనలో ఉన్న లోతులను చూసే నిశితమైన దృష్టి, అది వ్యక్తపరచే భావాలను అందుకునే హృదయ వైశాల్యం, సోంత ఇష్ట అయిష్టాలకు అందనట్టి ఎత్తులో ఉన్న నిష్పక్షపాతం - ఇవ్వన్నీ ఉంటేనే సమగ్రమైన అవగాహన పొందడానికి కానీ, ఇతరులకు అందించడానికి కాని సాధ్యం కాదనుకుంటాను. ఇక అవగాహన పెరుగే కొద్దీ విమర్శ యొక్క అభివ్యక్తీకరణలో స్పష్టత, క్లుప్తత వస్తుంది, సహజంగా. సూటిదనం కూడా ఉండి పాఠకున్ని విసిగించదు.

    మరి విమర్శ చేయడానికి ప్రేరణ, శిక్షణ అవసరమా అంటే తప్పకుండా అవసరమే. అయితే ప్రేరణ అందుకునేదే కాని అందించేది కాదు. ఇక శిక్షణా పద్ధతులు మాత్రం చర్చనీయాంశం.

    చివరగా ఒక్క మాట. తెలుగు భాష యొక్క వెలుగే తగ్గుతున్న రోజుల్లో తెలుగు సాహిత్యం పై చేసే విమర్శలో శిక్షణకు ఎంత priority ఉందో, ఉండాలో తెలియదు. తెల్లటి బట్టపై చిన్న మరక పడితే వేలెత్తి చూపిస్తారు కాని, పూర్తిగా మాయకపోయినా తెలె తెల బోయే బట్టపై మరకలను ఎవరు వెతికి చూపిస్తారు! రచనలు ఎక్కువగా నిస్సారమైనప్పుడు గొప్ప విమర్శలు మాత్రం ఎక్కడినుంచి వస్తాయి అని అనుకుంటాను.

    విధేయుడు
    -Srinivas

  10. Kameswara Rao అభిప్రాయం:

    November 8, 2006 12:10 pm

    విప్లవ్ గారు మంచి ప్రశ్నే వేసారు. విమర్శ సిద్ధాంతానికున్న విస్తృతి, పరిమితీ బట్టి అది ఎలాంటి కవిత్వానికి వర్తింపచెయ్యవచ్చు, ఎలాటి విశ్లేషణకి ఉపయోగించవచ్చు అన్న విషయం ఆధారపడి ఉంటుంది. కాలంతో పెద్ద సంబంధం లేదు. మార్క్సిస్టు విమర్శ నాజు తెలిసీ కవిత్వ ఆవిర్భావానికి వెనకనున్న సామాజిక పరిస్థితులు, దాని ప్రభావమూ విశ్లేషించడానికి ఉపయోగపడినంతగా కవిత్వాన్ని విలువకట్టడానికి ఉపయోగపడదు. ఇది దృష్టిలో ఉంచుకొని దానికి తగిన విశ్లేషణ చెయ్యడానికి, ఏ కవిత్వానికైనా, మార్క్సిస్టు విమర్శ పనికివస్తుంది. దీనిని వల్లంపాటివారు “విమర్శా శిల్పం”లో చక్కగా వివరించారు:
    “ఉదాహరణకు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం సాహిత్య వస్తువుకూ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని నిర్వచించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వస్తువుకూ రచయిత అంతరంగానికీ ఉన్న సంబంధాన్ని తీవ్రంగా పట్టించుకోదు. అలాగే ఆ వస్తువుకు రచయిత ఇచ్చిన రూపాన్ని విశ్లేషించటానికి మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం తగిన కొలబద్దలను ి రూపొందించలేదు. శిల్పాన్ని గురించీ, శైలిని గురించీ శాస్త్రీయమైన విశ్లేషణ చేయటానికి కూడా ఇది ప్రయత్నించదు. ప్రక్రియలు మారినప్పుడు సాహిత్య వస్తువు తీసుకొనే విభిన్న రూపాలను గురించి కూడా మార్క్సిస్టు సిద్ధాంతం దాదాపు నిశ్శబ్దంగానే ఉంటుంది. కానీ సాహిత్య ప్రక్రియల పుట్టుకకూ, అవి పుట్టిన సామాజిక సందర్భాలకూ మధ్య ఉన్న సంబంధాన్ని లేదా వైరుధ్యాన్ని మార్క్సిస్టు సాహిత్య విమర్శ మాత్రమే వివరించగలదు. శైలీ, దృష్టికోణం, కంఠస్వరం, పదచిత్రాలు, కవిత్వ ఛందస్సు మొదలైన శిల్పాంశాల విశ్లేషణకు ప్రత్యేకంగా మార్క్సిస్టు సాహిత్య దృక్పథం అంటూ ఏమీ లేదు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకున్న బలమూ, బలహీనతా కూడా పునాదీ - ఉపరితలమూ సిద్ధాంతమే. ఈ సిద్ధాంతం యొక్క పరిమితుల్ని అర్థం చేసుకొని ఉపయోగిస్తే ఇది సాహిత్య వస్తువుకూ, ప్రక్రియకూ చెందిన ఎన్నీ చిక్కుముడుల్ని విప్పగలుగుతుంది. ఆర్థిక నియతి వాదాన్ని దుర్వినియోగం చేస్తే ముతక సిద్ధాంతంగా తయారౌతుంది.”

  11. విప్లవ్ అభిప్రాయం:

    November 13, 2006 2:05 pm

    కామేశ్వరరావు గారూ మీరు చెప్పింది, నాకు అర్ధమైంది జోడించి నా ఆలోచన కొంత ఇక్కడ:

    “విమర్శ సిద్ధాంతానికున్న విస్తృతి, పరిమితీ బట్టి అది ఎలాంటి కవిత్వానికి వర్తింపచెయ్యవచ్చు, ఎలాటి విశ్లేషణకి ఉపయోగించవచ్చు అన్న విషయం ఆధారపడి ఉంటుంది. … ఇది దృష్టిలో ఉంచుకొని దానికి తగిన విశ్లేషణ చెయ్యడానికి, ఏ కవిత్వానికైనా, మార్క్సిస్టు విమర్శ పనికివస్తుంది.”

    అంటే “విమర్శ” ఏ ప్రాతిపదిక పైన చేస్తున్నారో దానికి లోబడి ఉన్నంత వరకూ ఆ సిద్ధాంతాన్ని ఎటువంటి కవిత్వ (ప్రబంధాలనుండి దిగంబరాల దాకా, ఎటువంటి కవిత్వం అయినా..) ప్రక్రియ పైన అయినా ఉపయోగించ వచ్చు.. అని అర్ధం చేసుకుంటున్నాం.

    వల్లంపాటి చెప్పిందీ ఇదే అనిపిస్తుంది.

    మరోలా చెప్పాలంటే “మార్క్సిస్టు విమర్శ” చేయతలచిన వాళ్ళు అలంకారాల వైపు, శైలి వైపు, శిల్పం వైపు దృష్టి పెట్టాలనుకోవటం అత్యాశే.

    ఇక్కడొక చిన్న detour:

    పై మాట దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఈ వ్యాసం తాను ఉదహరించిన కట్టమంచి చేసిన విమర్శ నేపధ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే తానూ (అంటే వేలూరి) అదే మూసలో చేసిన ప్రసంగ పాఠంలా తోచింది.

    కట్టమంచి చేసిన విమర్శ ఒక కోవలోకి (satire కావచ్చు) వస్తే వేలూరి ప్రసంగం అదే దోవలోకి వస్తుంది. satire (తెలుగు పదం నాకు తెలవదు) కూడా ఒక ఆర్టే. దానిక్కావలసిన లక్షణాలు చూపెట్టి కట్టమంచి వారి విమర్శ ఎందుకు ఫెయిలయిందో చెబితే వేలూరి గారన్న ప్రయోజనం {“అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి.} నెరవేరేది.

    వేలూరివారి ప్రసంగం కూడా {అవహేళన, అపహాస్యం!} అదే లక్షణాలు కలిగిందిగా కనిపించే అవకాశం ఎక్కువ {ఉదా: (కేంబ్రిడ్జ్ లో క్రికెట్ గురించి చెప్పి పొగడడానికి రెడ్డిగారికి ఇక్కడ అవకాశం దొరకలేదు కాబోలు!)}. అది ఆయన రాతలనెరిగిన వారు (his writing style) ఆయన లెవెలుకు సరిపోయే రీతిలో వాతలు పెట్టారా లేదా అన్నది తేల్చగలరు.

    ప్రబంధాలను ఒక రకమైన విమర్శా పరిధినుండి మినహాయించమంటే అది కుదరని పని; ఆ విమర్శ సహేతుకమా కాదా అన్నది ఆ విమర్శ కే చెందిన లక్షణాలను బట్టి ఉంటుంది అన్నవిశయం పైన మార్క్సిస్టు విమర్శ పరిధి నుండి తెలుసుకున్నాం.

    వేలూరి గారు చేసిన విమర్శ మీద నాకు complaint లేదు. దానికున్న పరిధిలో ఆయన చెప్పింది చేసారా లేదా అన్నదే కావాలి. On the space that he provided, he may have criticized CR Reddy but he seemed to have taken off off from the same origin. That truly in my opinion is a meeting place for a contradiction. It is full circle that way & this is a good writing for that reason. Had he written in any other way (without the satirical element, he would have fallen flat).

    end of detour.

    మళ్ళీ మొదటికొస్తే:

    వేలూరి రాసింది:

    కళాపూర్ణోదయ కావ్య రచనలో సూరన్న మూడు ప్రధాన లక్షణాలు సాధిస్తానని ముందుగా అన్నాడు. ఇవీ ఆ లక్షణాలు: “అపూర్వకథాసంవిధాన వైచిత్రి, శృంగార ప్రాయత, పుణ్యవస్తు వర్ణనాకర్ణనీయత. “ఇవి సాధించాడా లేదా అన్నది ప్రప్రధమంగా ఏ విమర్శకుడైనా చూడాలి.

    ఒక రచయిత లేక కవి తన ఉద్దేశం ముందే చెప్పి ఈ పరిధిలోనే నా కృతిని విమర్శించండి అనడం కరెక్టేనా? నా మటుకు నేను ఒక చెట్టును వేస్ట్ చేయటం, కొన్ని ఠావులు ఖరాబు చెయ్యటం మాత్రమే నా రచనల లక్షణం, అంతవరకే ఏ విమర్శకుడైనా పరిమితం కావాలి అని ఇప్పటినుండీ ఒక disclaimer తగిలించాలిక.

    విప్లవ్

  12. Veluri Venkateswara Rao అభిప్రాయం:

    November 15, 2006 8:09 am

    విప్లవ్ గారి ఒక అక్షేపణ చాలా సమంజసమైనదే అని ఒప్పుకోక తప్పదు. అది: కేంబ్రిడ్జ్ లో క్రికెట్ ఆట గురించి బ్రాకెట్లలో నేను చేర్చిన వాక్యం. ఆ వాక్యం అనవసరమైనదే! Guilty as charged!

    అయితే, “కవిత్వతత్త్వవిచారము” లో నిండుగా ఉన్న అవహేళన, అపహాస్యాలతో పోల్చిచూస్తే నా పొరపాటు క్షమార్హమనే అనుకుంటాను. అయినా తప్పు తప్పే! మరోసారి Guilty as charged.

    మరొక విషయం: ఉమాకాంతంగారి పై మంచి విమర్శ-సమీక్ష ఇంతవరకూ రాకపోవడం క్షమార్హం కాదు. ఆ పని ఎవరైనా సహృదయులు తలపెడితే మంచిది.

    అల్లాగే, మార్క్సిస్టు దృక్పథం అన్న పేరుతో ప్రస్తుతం పత్రికల్లో వచ్చిన సాహిత్య విమర్శలపై ఒక సమీక్షా వ్యాసం ఎవరైనా రాస్తే బాగుంటుందేమో!
    And the field is open, I suppose!

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a