ఈమాట » నామాట: సాహితీ సదస్సులు – సంబరాలు

Expand to right
Expand to left

నామాట: సాహితీ సదస్సులు – సంబరాలు

దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, స్థానికంగా ఊరూరా అభివృద్ధి చెందిన సంఘాలు, సాహితీ సదస్సులు జరపడం మనం చూస్తున్నాం. గత ఇరవై సంవత్సరాలుగా, ఈ సదస్సులనబడే కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలు పంచుకోవడం జరుగుతూ ఉన్నది. నా అభిప్రాయాలు నా అనుభవాల సారాంశం అని వేరే మనవి చెయ్యనక్కరలేదనుకొంటాను. దేశవ్యాప్త సంస్థలు పెద్దయెత్తున జరిపే తిరణాళ్ళ లాంటి సంబరాలకి అనుబంధంగా, (appendix గా అన్నా తప్పులేదనుకుంటాను) సాహితీసదస్సులను జరుపుతున్నాయి. ఒకరో ఇద్దరో కవులనో, కథకులనో తెలుగు నాడు నుంచి ఈ సంబరాల పేరున ఆహ్వానించడం, వారిచ్చే ఉపన్యాసాలు (లేదా ఉద్బోధనలు!) వినిపించడం ఆనవాయితీ అయ్యింది. ఈ ఉపన్యాసాలకి సాధారణంగా శ్రోతలు ఎవరు? సదస్సులో పాల్గొని, తమ స్వీయ రచనలు వినిపిద్దామనే ఆశతో వచ్చిన స్థానిక తెలుగు-అమెరికన్ రచయితలు. చాలాసార్లు ఈ రచయితలందరూ, వారికిచ్చిన కొద్ది నిముషాల్లో వాళ్ళ రచనలని వినిపించడం, ఆఖరి రచయితకి సదస్సు నిర్వహించే వాళ్ళు మాత్రవే శ్రోతలు కావడం, ఆ రచయితల బంధువులు ప్రేక్షకులు కావడం మామూలు! ఇది సాధారణంగా అన్ని సాహితీ సదస్సులకీ template అయిందనడం అతిశయోక్తి కాదు.

ఈ రకమైన సదస్సుల వలన మనం ఏవిటి సాధించాం? అని ప్రశ్నించుకోవడం తప్పు కాదనుకుంటాను. అటు తెలుగునాడులో రచయితలకి, ఇక్కడ రచనలు చేస్తున్న వారికీ ఏ విధమైన సాహిత్య బాంధవ్యాలు ఏర్పడ్డాయి? ఇందువలన తెలుగు సాహిత్యానికి ఏ రకమైన మేలు జరుగుతున్నది? అని అడిగితే, సబబైన సమాధానం దొరకదని నేను విశ్వసిస్తున్నాను.

సదస్సులు కేవలం సరదాకోసం, పెద్ద యెత్తున చేసుకొనే సంబరాలలో “సత్రకాయ” మాత్రవే అనే వారితో నాకు ఏ పేచీ లేదు. శుభం. Stay The Course అనే చింతకాయల మంత్రం వల్లించే సమాజ నాయకులతో నేను వాదించలేను. ఈ సదస్సుల వలన మనం సాహితీపరంగా, ఉమ్మడిగా ఏదో సాధించగలం అనే ఆశ ఉన్నవాళ్ళంతా కలిసి ఆలోచించడం అవసరం అని భావిస్తున్నాను. అక్కడి మేలు రచయితలతో ఇక్కడి రచయితల కలయిక చాలా అవసరం. అయితే, కేవలం పొగడ్తలతో ఉద్బోధనలు చేసే భట్రాజుజాతి వారు అక్కడనుంచి ఇక్కడికి అనవసరం; ఇక్కడినుంచి అక్కడికి మరీ అనవసరం.

దేశ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఇక్కడి, అక్కడి రచయితలని కలుపుకొని శిక్షణ శిబిరాలు నడపగల అవకాశం ఉన్నది. శిక్షణ శిబిరాలు అనే మాటలు ఘాటుగా వినపడితే, వాటినే writers’ workshops అనండి. అంటే, రెండురోజులూ, ఈ ప్రత్యేకమైన పనికే కేటాయించవచ్చు. అనువాద సాహిత్యాన్ని చర్చించవచ్చు; విమర్శించవచ్చు. ఇకపోతే, స్థానికంగా ఉన్న సంస్థలు స్వీయరచనల విమర్శ పెట్టుకోవచ్చు. లేదా, Reading Clubs నిర్వహించవచ్చు. ( ఈ పని డెట్రాయట్ లో ఎప్పటినుంచో చేస్తున్నారు!). ఇక్కడనుంచి ప్రచురితమైన పుస్తకాలు సమీక్షించ వచ్చు. పుస్తక సమీక్షలు చెయ్యడంలో ఇక్కడి ప్రముఖ ఆంగ్ల పత్రికల పద్ధతుల పై, వాటిలో జరిగే వివాదాలపై మనం చర్చలు చెయ్యవచ్చు. ఈ చర్చలవల్ల చక్కని సమీక్షలు పైకి రావచ్చు. ఆ సమీక్షలు ప్రచురించుకోవడం అవసరమని వేరే చెప్పనక్కర లేదనుకుంటాను.

ఆలోచించండి. సాహితీ సదస్సుల విషయమై మీ అందరి సలహాలు ఎంతైనా అవసరం. మీ అభిప్రాయాలు రాయండి. శలవ్.

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. lakshmi అభిప్రాయం:

    November 7, 2006 7:25 am

    చాలా బాగా చెప్పారు.ఇప్పుడున్న పరిస్థితుల్లొ సమీక్షలు చాలా అవసరం అని అనిపిస్తోంది.

  2. Anuradha అభిప్రాయం:

    November 10, 2006 2:10 am

    నేను శ్రీ వేంకటేశ్వరరావుగారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఆయన అన్నట్టుగా Telugu literary workshops,reading clubs నిర్వహిస్తే చాలా ప్రయోజనంఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల వలన తెలుగు సాహిత్యానికి మేలు జరగడమే కాక, మాతృభాషను నేర్చుకోవడానికి,అధ్యయనం చేయడానికి అవకాశం, ప్రోత్సాహం లభించని ప్రస్తుత పరిస్థితులలోమనబాల్య,యువతరాలవారికి,తెలుగు భాషను నేర్చుకొనడానికి,సంభాషణలో ఉపయోగించే తెలుగును మెరుగుపరచుకోవడానికి స్ఫూర్తి, bonus గా లభిస్తుంది.Thanks

  3. Ravikiran Timmireddy అభిప్రాయం:

    November 10, 2006 8:01 am

    శ్రీశ్రీ గారు చెప్పినట్టు ప్రతి ముగ్గురి తెలుగు వాళ్ళలో వొకరు కవి, వొకరు రచయిత, మరొకరు విమర్శకుడు. ఆ రకంగా మొత్తం తెలుగు జాతి అంతా కూడా ఏదోరకంగా సాహిత్యరంగంలో పాలుపంచుకునే వారే. దానికి నిదర్శనంగానే ఈ రోజు అమెరికా తెలుగు సాహిత్యం వాసిలో కాకపోయినా రాసిలో చాలానే అభివ్రుద్ది సాధించగలిగింది. అయితే యెంత పెరిగినా అక్కడక్కడా అమెరికా దిగుమతి తెలుగు సాహిత్యంమీద వొకటి రెండు విమర్శలు తప్ప అమెరికా తెలుగు సాహిత్యానికంటూ వొక గుర్తింపు లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో వొకసారి మనం ప్రశ్నించుకోవాలి.
    ఎంతకాలంనించి మనవీదేశంలో వుంటున్నాం? ఐనా మన రచనలన్నీ గత కాలపు తెలుగు దేశపు అనుభవాల వ్యక్తీకరణే. ఆంధ్రదేశం ఇప్పుడొక గ్నాపకవే మన మనసులో. భారతదేశ లేక తెలుగుదేశ రోజువారీ జీవితానుభవం మనకు ఇప్పుడు లేదు. మనసులోపలకి గండెను పంపి వెదికి దొరికే గుగతకాలపు నాలుగు గ్నాపకాలనే నలభైరకాలుగా వ్యక్తపరచడం తప్ప, మారిపోయిన, ఇంకా మారిపోతున్న ప్రస్తుత తెలుగు జీవన శైలితో మనకు ప్రత్యక్ష అనుభవం లేదు. మంటని త్రాకితే కలిగే నొప్పిని ఊహించడం వేరు, నిజంగానే ఆ జ్వాలను తాకినప్పుడు కలిగే అనుభవపు ఘాడతవేరు. ఊహకి ప్రత్యక్ష అనుభవానికి వున్నటువంటి ఆ తేడానే అమెరికా తెలుగు రచనలకి, ఆంధ్రదేశపు సాహిత్యానికి కూడా వుంది. అనుభవంనించి రాని భావంలో అనుభూతి ఘాడత అంతంతమాత్రవే. అంతమాత్రంచేత గతాన్ని ఖతంచేయమని చెప్పడంలేదు. ఆ గతవే మన పునాది. మన మనసులో, గుండెలో, ఆత్మ లో, మన నర నరంలో అల్లుకపోయి మనకంటూ వొక అస్తిత్వాన్నిచ్చేది ఆ గతవే. ఆ గతాన్ని మనలో భద్రపరచుకుంటూనే, ఈ దేశపు మన జీవిత వాస్తవికత అయినటువంటి వర్తమానాన్ని, ఇక్కడి మన సంభందాల్ని, అనుభవాల్ని, సాహిత్య ప్రక్రియలో మనం వ్యక్తీకరించగలిగిన రోజు మన అమెరికా తెలుగు సాహిత్యానికి వొక గుర్తింపు వస్తుంది.
    ఈ నేపద్యంలో సాహిత్య శిక్షణా శిబిరాలు వొక క్రొత్త మార్గాన్ని అన్వేషించగలిగితే, కనీసం ఆ దారిలో ప్రయత్నం చేయగలిగితే, అమెరికా తెలుగు సాహిత్యం, సంవత్సరానికిసారి జరిగే అంబరాన్నంటే తెలుగు సంబరాల ప్రోగ్రాం లిస్టులో వొక footnote గా ఉండే అవస్థనించి బయట పడటాని అవకాశం లభిస్తుంది అని నా అభిప్రాయం.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a