మొలతాడు
అలవిగాని ఆడది
జలపాతం పక్క-
కొలనులో దూకింది
అలలకదలిక ఆగింది
ప్రేమిస్తున్నాడో లేడో
నిమిషం గడిచేలోగా
ఉపపత్తి కావాలి !
ఊపిరి బిగబట్టి
లోతుకు మునిగింది
ఈతరాని ప్రియుడు ..
ఇరుక్కున్న
మరకతంలా
తన్నుతాను మరచి
మిన్నంటే తుంపర్లతో
ఉన్నఫలాన దూకాడు
ఎంతసేపైనా
చెంత చేరడే!
తాళలేక తక్షణం
తళతళలాడే కనులతో
తలెత్తి చూసింది
ప్రియురాలు
తేలుతూ కనిపించింది
మొలతాడు !
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »
kiran kumar chava అభిప్రాయం:
September 4, 2006 12:23 pm
కొన్ని కవితలు ఆ అర్థం తెలిసిన వారికే అర్థము అవుతాయి అనుకుంటాను!
నాకు అయితే ఇందులోని లోతైన భావం ఏమీ అర్థం కాలేదు, క్షమించాలి.
Garikapati Pavan Kumar అభిప్రాయం:
September 5, 2006 8:19 am
మొలతాడు కవిత చాలా నచ్చింది..
భూషణ్ నేటికాలపు తీరుతెన్నులు లాగానే ఈ కవిత కూడా నేటికాలపు కవుల ప్రమాణాలను ప్రశ్నిస్తుంది.కవితలో ప్రియురాలు కవిత్వమైతే ..ఈతరాని
ప్రియులని నేటికాలపు కవులుగా పేర్కొనవచ్చు.ఈ విధంగా ఆలోచిస్తే
చాలామంది తెలుగు కవులకి ఖచ్చితంగా తేలేది మొలతాడే (అది ఉంటే)!!
గరికపాటి పవన్ కుమార్,UK
P. Siva అభిప్రాయం:
September 6, 2006 6:16 am
పవన్ కుమార్ గారికి లాగే ఈ కవిత నాకు కూడ చాలా నచ్చింది. అయితే ఈ కవిత ఇరాక్ యుద్ధాన్ని ప్రశ్నిస్తున్నట్టు నాకనిపించింది. కవితలో ప్రియురాలు ఇరాక్ లో ప్రజాస్వామ్యమయితే, ఈతరాని ప్రియుణ్ణి బుష్ గా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే, బుష్ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా తేలేది మొలతాడే (అది లేకున్నా)!
కాకపోతే ఈ రెండు పాదాల ప్రాసకోసం పడుతున్న ప్రయాసలో చీల్చిన దుంగలో తోక ఇరుక్కున్న మర్కటంలా మారిన కవిగారి పరిస్థితికి కించిత్ జాలి కలిగిందని చెప్పక తప్పదు.. మరీ ముఖ్యంగా అనవసరంగా ఇరుక్కున్న మరకతాన్ని చూచాక.
Raghothama Rao C అభిప్రాయం:
September 24, 2006 11:14 pm
మంచి satire. నెటి తెలుగు సాహిత్యం తీరు కవితలో తేలుతున్న మొలతాడు చందమే మరి.
Chilakapati Srinivas అభిప్రాయం:
September 28, 2006 7:58 am
కథ అర్థమయింది కానీ, పాఠకమిత్రుల వ్యాఖ్యలు అయోమయంలో పడేస్తున్నాయి. దీనికీ నేటికాలపు కవిత్వానికీ, లేదా బుష్ కీ లంకె ఎక్కడుందో ఎంత వెతికినా కనపడలేదు.
ప్రియురాలి మీద ప్రేమతో ఈత రాకున్నా దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడి చావులో satire ఏమిటో బొత్తిగా తెలియటం లేదు. అది జాలి గొలపవలసిన విషయమో, అతని ప్రేమకు అబ్బురపడవలసిన సందర్భమో గానీ, అందులో ఎగతాళి స్ఫురిస్తే ఆ లోపం పాఠకుడిదో లేదా రచయితదో అయి ఉండాలి.
లేదావీరిలో ఎవరయినా ఈ మతలబు ఏమిటో నా బోటి మామూలు పాఠకులకు వివరించి పుణ్యం కట్టుకోవాలి.
paaThakuDu అభిప్రాయం:
September 29, 2006 7:10 am
వెతుక్కోండి మీకు కావలిసిన అందాలు అర్థాలు అవే దొరుకుతాయి. మీరు సరిగ్గా వెతికితే మీకు మొలతాడే కాదు, సిగ్గు బిళ్ళలూ కనిపిస్తాయి. అంతా చూసే కళ్ళ మీద అధారపడి ఉంటుంది.
- ఈ కవిత మీద ఇంత చర్చ అనవసరం.