ఈమాట » సంగీతంతో కుస్తీ

Expand to right
Expand to left

సంగీతంతో కుస్తీ

మనలో చాలామందికి (మరీ ఔరంగజేబుల్ని మినహాయిస్తే) ఏదో ఒకరకం సంగీతమంటే అభిమానం ఉంటుంది. వీరిలో కూనిరాగాలు తీసేవారూ, ఇంకాస్త గట్టిగా పాడదామని ప్రయత్నించేవారూ కూడా ఉంటారు. ఏవో కారణాలవల్ల చిన్నతనంలో సంగీతం నేర్చుకోలేదనో, సరిగ్గా నేర్చుకోలేదనో బాధపడేవారుంటారు. నేర్పించే సంగీతమంతా శాస్త్రీయమే. అందుచేత తదరిన్నన్నా అంటూ పాడడమంటే కొందరికి తలనొప్పిగానో, వెక్కిరింపుగానో, “అరవ” పద్ధతిగానో అనిపిస్తుంది. వాటితో పోలిస్తే సినిమా పాటలే “హాయిగా” అనిపిస్తాయి. చిక్కేమిటంటే ఇటువంటి తేలిక సంగీతం నేర్పేవారెవరూ మనకు తగలరు. పైగా సినిమాల్లో “డబ్బా” పాటలు పాడే గాయనీ గాయకులు కూడా ఔత్సాహికులకి “శాస్త్రీయసంగీతం నేర్చుకోండి” అని ఉచిత సలహాలిస్తూ ఉంటే వారికి కాస్త కోపం కూడా రావచ్చు. మనకి నచ్చే పాటలకీ, వ్యాకరణ భూయిష్ఠం అనిపించే శాస్త్రీయసంగీతానికీ మధ్య పూడ్చలేని అగాధం ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యకి సమాధానమిచ్చే ప్రయత్నమే ఈ వ్యాసం. ఈ విషయం గురించి నేను “శృతిమించిన రాగం”, “మన శాస్త్రీయ సంగీతం”, “రాగాలూ - స్వరాలూ” అన్న ఈమాట వ్యాసాల్లో కొంత రాశాను కూడా. అలాగే , మోహనం, అభేరి, సింధు భైరవి, కళ్యాణి, హిందోళం, చక్రవాకం రాగాలను గురించి పరిచయం చేస్తూ డా. లక్ష్మన్న కూడా కొన్ని వ్యాసాలు రాశారు.

సంగీతమంటే కనీసం ప్రాథమిక స్థాయిలో “బ్రహ్మవిద్య” కాదని నా ఉద్దేశం. తమకి సంగీతం చచ్చినా రాదని నిర్ణయించేసుకున్న చాలామందికి తమది కేవలం ఒక “మానసిక అవరోధం” (మెంటల్‌ బ్లాక్‌) అనిపించకపోవచ్చు. ప్రతీవారూ సంగీతంలోకి దిగనవసరం లేదని నేనూ ఒప్పుకుంటాను కాని ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవటానికి “సరస్వతీ కటాక్షం” ఏదీ అక్కర్లేదు. సంగీతాన్ని కొంతవరకూ “డీ మిస్టిఫై” చెయ్యాలని నా ఉద్దేశం. వ్యక్తిగతంగా నన్ను అనేకమంది మిత్రులు అడిగిన ప్రశ్నలకి కూడా ఇందులో కొన్ని జవాబులు లభిస్తాయి. ఇందులో కొన్ని విషయాలు కొందరికి తెలిసినవే అయుంటాయి కాని తెలియనివారి కోసమని కొన్ని ప్రాథమిక విషయాలు రాయక తప్పలేదు. (ఈ గొడవ గురించి పట్టనివాళ్ళు ఈ వ్యాసం చదవడం మానేసి ముందుకు సాగవచ్చు)

చేతకాకుండా సంగీతంతో కుస్తీ పట్టేవారి గురించి అపహాస్యం చెయ్యడం మామూలే. మిస్సమ్మలో నాగేశ్వరరావువంటివారు హాస్యపాత్రలుగా గుర్తుంటారు. సంగీతం మొదలుపెట్టే “లార్వా”లన్నీ సీతాకోకచిలకలు కాకపోవచ్చుగాని మొండిగా తమ కళాప్రదర్శన చేసేవారి గురించి శ్రీశ్రీ ఇలా రాశారు.

మేం గొప్పవాళ్ళమంటూ
సంగీతం తీయునట్టి చవటలనెల్లన్‌
బంగీ కట్టి పయోరా
శిం గూలగ ద్రోయవలదె సిరిసిరిమువ్వా

ఈ అవహేళన భయంవల్లనే చాలామంది సంగీతం జోలికి పోకుండా ఉండిపోతారు. అయినా ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంతవరకూ పరవాలేదని నా ఉద్దేశం. నేర్చుకోవాలనే ఆసక్తితో బాటు దీనికి కావలసినవల్లా ఒక చిన్న కీబోర్డూ (లేదా హార్మోనియం), బోలెడు ఓపికా మాత్రమే. సంగీతం నేర్చుకోవడానికి అనేక వాయిద్యాలు ఉపకరిస్తాయి కాని కీబోర్స్డ్‌ ఉంటే టైప్‌రైటర్‌ ఉన్నట్టే. అక్షరాలు రాయడం రాకపోయినా చదివి గుర్తుపట్టగలిగితే చాలు; ఎవరైనా సరే “ముత్యాలకోవ” లాంటి అక్షరాలు టైప్‌ చెయ్యగలుగుతారు. అదే పద్ధతిలో మెట్లు ఎటువంటివో తెలిస్తే ఎవరైనా వాటిని నొక్కి స్వరాలను తప్పుల్లేకుండా పలికించవచ్చు. ముందుగా కీబోర్డ్‌ ఎలా ఉంటుందో బొమ్మలో చూద్దాం.

keyboard

కీబోర్డ్‌ మెట్లలో నల్లవీ, తెల్లవీ ఒక పద్ధతిలో అమరి ఉంటాయని చూడగానే తెలుస్తుంది. వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క స్వరాన్ని పలుకుతుంది. కీబోర్డ్‌ మెట్లు ఎక్కడినుంచయినా సరే మొదలుపెట్టి, నల్లవీ, తెల్లవీ అన్నీ కలిపి వరసగా లెక్కపెడితే 12 కనబడతాయి. పదమూడోది మళ్ళీ మొదటిదాన్ని పోలిన స్థానంలోనే కనబడుతుంది. వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క శ్రుతి. వీటిని బొమ్మలో చూపినట్టుగా పాశ్చాత్య సంగీతంలో సి, సి షార్ప్‌, డి మొదలైనవిగా వ్యవహరిస్తారు. వాటిని కర్ణాటక పద్ధతిలో ఒకటి, ఒకటిన్నర వగైరాలుగా సూచిస్తారు. మూడున్నర శ్రుతి అనేది ఉండదని బొమ్మనుబట్టి తెలుస్తుంది. అలాగే మనవాళ్ళు ఏడు శ్రుతిని (శోకాన్ని సూచిస్తుందనే భయంతోనో ఏమో) “అర” అంటారు. హిందూస్తానీలో తెల్లవాటిని సఫేద్‌ ఏక్‌ దో అనీ, నల్లవాటిని కాలీ ఏక్‌, దో అనీ చెపుతారు. ఈ మూడు పద్ధతులూ ఒకటే. ఈ శ్రుతుల ఫ్రీక్వెన్సీలు (సెకండుకు శబ్ద కంపనాల సంఖ్య) నిర్దుష్టంగా ఉంటాయి. బ్రిటిష్‌ పద్ధతిలో మిడ్‌ల్‌ సి సెకండుకు 256 కంపనాలు కలిగి ఉంటుంది. మగవారి కంఠం సామాన్యంగా 1, 2 ఆధార శ్రుతులకు సరిపోతుంది. స్త్రీలకూ, పిల్లలకూ 5, 6, ఆరున్నర సరిపోతుంది.

ఆధార శ్రుతి అంటే షడ్జమం, లేక స. మనం ఎంచుకునే దాకా దీనికి ప్రత్యేకంగా ఫ్రీక్వెన్సీ ఉండదుకనక ఇదొక ఫ్లోటింగ్‌పాయింట్‌ అనుకోవచ్చు. ఒక షడ్జమాన్ని (శ్రుతిని) నిర్ణయించుకున్నాక దాని ప్రకారం తక్కిన రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, ధైవతం, నిషాదం అన్నీ పలుకుతాయి. ఆధార శ్రుతిని బట్టి వీటిలో ప్రతిదానికీ ఖచ్చితమైన స్వరస్థానం ఏర్పడుతుంది. అవి సరిగ్గా పలకనప్పుడు అపస్వరం అంటాం. మామూలుగా సప్తస్వరాలనేవి నిజానికి 12 స్వరాలు. దీన్ని పాశ్చాత్య పద్ధతిలో డయటోనిక్‌, లేదా క్రోమాటిక్‌ స్కేల్‌ అంటారు. మన పద్ధతిలో చెప్పాలంటే స, ప తప్ప తక్కిన అయిదు (రి, గ, ద, ని) స్వరాలూ రెండేసి ఉంటాయి; అంటే మొత్తం 12. స నుంచి రి గ మ అంటూ “పైకి” వెళుతున్న కొద్దీ స్వరాల ఫ్రీక్వెన్సీ క్రమంగా పెరుగుతూ పోతుంది. అందుకే “కింది” స్వరాలు బొంగురుగానూ, పైవి కీచుగానూ అనిపిస్తాయి. స, రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ద1, ద2, ని1, ని2 అని ముగించాక మళ్ళీ తారస్థాయిలో స వస్తుంది. ఇంకా పైకి వెళితే వుళ్ళీ రి1, రి2, గ1, వగైరాలన్నీ వస్తాయి. అలాగే మనం మొదలెట్టిన స నుంచి “కిందికి” వెళితే మంద్రస్థాయిలో క్రమంగా ని2, ని1, ద2 మొదలైనవి పలుకుతాయి. ఇది పాడినప్పుడూ, వాయించినప్పుడూ కూడా జరిగే విషయం. వీటిలో 1 సంఖ్య ఉన్న స్వరాలను “కోమల” స్వరాలుగానూ, 2 ఉన్నవాటిని “తీవ్ర” స్వరాలుగానూ హిందూస్తానీ పద్ధతిలో అభివర్ణిస్తారు. ప్రస్తుత వ్యాసానికి ఈ వర్ణన సరిపోతుంది. వేలకొద్దీ రాగాలూ, లక్షలాది పాటలూ అన్నీ ఈ 12 స్వరాలతోనే రూపొందినటువంటివి. సంగీతపు భాషకు అక్షరాలు ఇవే.

ఒక షడ్జమం (స) నుంచి మరొక షడ్జమం (స) దాకా ఉన్న వ్యవధిని ఆక్టేవ్‌ అంటారు. పై బొమ్మలో రెండు ఆక్టేవ్‌లు ఉన్నాయి. ఇవి ఎన్నైనా ఉండవచ్చు. దీనికి అంతూ పొంతూ ఉండదు. ఎటొచ్చీ ఫ్రీక్వెన్సీ 20 కంపనాలకంటే తగ్గినా, 20 వేల కంపనాలకంటే ఎక్కువైనా మనకు శబ్దాలు వినబడవు. 8 ఆక్టేవ్‌ లుండే గ్రాండ్‌ పియానో వాయించి చూస్తే ఈ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో మరికొంత ఫిజిక్స్‌ ఉంది. ఒక షడ్జమానికీ దాని “పై” షడ్జమానికీ ఫ్రీక్వెన్సీ సరిగ్గా రెండింతలుంటుంది. అలాగే మంద్రస్థాయి షడ్జమపు ఫ్రీక్వెన్సీ సరిగ్గా సగం ఉంటుంది. ముఖ్యమైన సంగతేమిటంటే సరసనున్న ఏ రెండు స్వరాల ఫ్రీక్వెన్సీల మధ్యయినా ఒకే నిష్పత్తి (r) ఉంటుంది. ఉదాహరణకు ఒక స ఫ్రీక్వెన్సీ f అనుకుంటే రి1, రి2, గ1, గ2, మ1 స్వరాల ఫ్రీక్వెన్సీలు వరసగా fr, fr2, fr3, fr4, fr5 అవుతాయన్నమాట. తారస్థాయి స ఫ్రీక్వెన్సీ fr12 = 2f కనక r = 2(1/12) అవుతుంది. దీనర్థం ఏమిటంటే పక్క పక్క స్వరాలు ఏ రెండు తీసుకున్నప్పటికీ వాటి ఫ్రీక్వెన్సీలు ఒకే నిష్పత్తిలో (సుమారుగా 2(1/12) = 1.059) ఉంటాయి. అందువల్ల ఏ స్వరాన్ని ఆధార శ్రుతి చేసుకున్నప్పటికీ తక్కిన స్వరాల క్రమం మారకుండా ఉంటుంది. ఉదాహరణకు మనం సి మెట్టును స అనుకుంటే సి షార్ప్‌ అనేది మొదటి (కోమల) రిషభం అవుతుంది. అలాగే సి షార్ప్ మెట్టును స అనుకుంటే డి అనేది కోమల రిషభం అవుతుంది. అందువల్ల కీబోర్డ్‌ మీద ఏ మెట్టును ఆధార శ్రుతి (స) చేసుకున్నప్పటికీ దాని పక్కనున్న స్వరాలన్నీ వరసగా రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ద1, ద2, ని1, ని2 అనే క్రమంలోనే వినిపిస్తాయి. పాడుతున్నవారి వీలును బట్టి ఆధారశ్రుతి ఉంటుంది కనక ఈ ఏర్పాటును గురించి మనకు తెలియాలి.

ఇక థియరీ మానేసి ప్రాక్టికల్స్‌కి వద్దాం. సంగీతం గురించి తెలుసుకోదలుచుకున్నవారు పాడితీరాలి. తమ గొంతు కర్ణకఠోరంగా ఉందనిపిస్తే (లేక ఎవరైనా అంటే) తలుపులు మూసుకునయినా పాడుకోవాలి. పుట్టు చెవుడు ఉన్నవారు మూగవారయినట్టే పాడుతున్నప్పుడు తమ గొంతును విని తప్పులు సరిదిద్దుకోవడం (ఫీడ్‌బాక్‌) అతిముఖ్యమైన విషయం. అందుకే వాద్యసంగీతం నేర్చుకుంటున్నప్పుడు కూడా గాత్రం తప్పనిసరి. కీబోర్స్డ్‌ మీద పియానోవంటిది కాకుండా పైప్‌ఆర్గన్‌వంటిది మోగిస్తే మెట్టు నొక్కినంతసేపూ మోగుతూ ఉంటుంది. అది ఎంచుకుని 3 లేక 4 శ్రుతిని మోగించి దానితో గొంతు కలపాలి. (ఇది ఏ ఆక్టేవ్‌దైనా పరవాలేదు కాని కీబోర్డ్‌ మధ్యలోని మెట్టును ఉపయోగిస్తే మంచిది) అది సరిగ్గా ఉంటే ఆ పక్కనున్న స్వరాలను మోగించి వాటికి అనుగుణంగా గొంతు కలపాలి. ఒకవంక పాడుతూ, మరొకవంక మోగుతున్న స్వరం వింటూ రెండూ సరిపోతున్నాయో లేదో గమనిస్తూ ఉండాలి. తప్పుపోయినా కంగారుపడకుండా, అధైర్యపడకుండా కొన్నాళ్ళపాటు అలవాటు చేసుకోవాలి. మన గొంతులో పలుకుతున్నది మనం గుర్తించగలిగితే ఏ పాట విన్నా తెలుసుకోవడం వీలవుతుంది. తప్పు పలుకుతోందేమోనని అనుమానంవస్తే తెలిసినవారిని విని చెప్పమని కోరాలి. ఒళ్ళు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నట్టే బిడియపడకుండా ముందుకు సాగాలి. పాడకుండా కేవలం వినడం ద్వారా కూడా సంగీతాన్ని అర్థం చేసుకోవచ్చు కాని దానికి ఎక్కువకాలం పడుతుంది. గాత్ర విద్వాంసులం అనే భావన లేకుండా నెమ్మదిగా పాడుకుంటూ నేర్చుకుంటే సంగీతం సులువుగా పట్టుబడుతుంది.

ఏ ఒక్క రాగం తీసుకున్నా వాటిలో మొత్తం 12 స్వరాల్లో కొన్నే పలుకుతాయి. ఒక్కొక్క రాగానికీ ప్రత్యేకమైన “రంగూ, రుచీ, వాసనా” కలగడానికి కారణం అదే. సరిగమపదని స్వరాలన్నీ పలికే రాగాలని సంపూర్ణ రాగాలంటారు. వీటిలో రిగమదని రెండేసి ఉండే అవకాశం ఉంది కనక 32 కాంబినేషన్లు సాధ్యం అవుతాయి. ఉదాహరణకి అన్నీ కోమల స్వరాలయితే హనుమతోడి రాగం వస్తుంది. అన్నీ తీవ్ర స్వరాలయితే కల్యాణి అవుతుంది. కీబోర్డ్‌ మీద మీకు అనువైన శ్రుతిని స అనుకుని తక్కిన మెట్ల మీద వరసగా రి1, రి2, గ1, గ2, మ1, మ2, ప, ద1, ద2, ని1, ని2 అనే స్టికర్లు అతికించుకోండి. ప్రయత్నిస్తున్నది పిల్లలూ, స్త్రీలూ అయితే అయిదున్నర (జి షార్ప్‌ లేదా ఆరు (ఏ) మెట్టును షడ్జమంగా తీసుకోవచ్చు. మగవారికి ఒకటి (సి) సరిపోతుంది. అందరూ ఒకే కీబోర్డ్‌ వాడుతున్నప్పుడు కలర్‌ కోడ్‌ ఉపయోగించి రెండు రకాల స్టికర్లు వాడుకోవాలి. ఇది ఎందుకు చెప్పాలంటే పాడేవారికి ఆధారశ్రుతి మరీ ఎక్కువా తక్కువా అయితే అపస్వరాలు పలికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

12 స్వరాలలో సరిగమదని అన్నీ ఉపయోగపడే రాగాలలో ముందుగా కల్యాణి రాగం (స, రి2, గ2, మ2, ప, ద2, ని2) తీసుకోవచ్చు. దీన్ని హిందూస్తానీలో యమన్‌ అంటారు. ఇందులో అప్పుడప్పుడూ మ1 ఉపయోగిస్తే అది యమన్‌ కల్యాణ్‌ అవుతుంది. కల్యాణి స్వరాలని ఒకదాని వెంట ఒకటి నొక్కుతూ నెమ్మదిగా ప్రతిస్వరానికీ గొంతు కలిపి పాడండి. కల్యాణి రాగంలో బోలెడు సినిమా పాటలున్నాయి. భానుమతి పాడిన మెల్ల మెల్లగా, మనసున మల్లెల, రారా నాసామి రారా, సావిరహే తవదీనా; ఘంటసాల పాడిన కుడి ఎడమైతే, జగమే మారినది, మది శారదాదేవి, చల్లని వెన్నెలలో మొదలైనవన్నీ గుర్తు చేసుకుంటూ వాటిని పోలిన స్వరాలు మీకు పలుకుతున్నాయేమో జాగ్రత్తగా వినండి. రాగం నీలం రంగు వంటిదైతే అందులోని పాట నీలం రంగు వస్తువు వంటిదని గుర్తుంచుకోండి. కల్యాణి స్వరాలు వాయిస్తున్నప్పుడు తక్కిన మెట్లు చేతికి తగలకుండా చూసుకోండి. ఒక్కొక్క రాగాన్నీ బాగా అర్థమయేదాకా వారాల తరబడి పలికిస్తూ ఉండాలి. ప్రాథమిక స్థాయిలో రాగమంటే స్వరాలే అని భావించాలి.

ఇది బాగా అలవాటయాక కల్యాణి స్వరాలలో తక్కినవన్నీ అలాగే పాడుతూ మ2 స్థానంలో మ1 పాడండి; అది శంకరాభరణం అవుతుంది. దాంతో మీరు వెంటనే శంకరశాస్త్రి అవతారం ఎత్తకపోయినా సుశీల పాడిన ఏమండోయ్‌ శ్రీవారూ పాట గుర్తుకు తెచ్చుకోండి. అది కూడా శంకరాభరణమే. అలాగే మోహన రాగంలో స్వరాలు స, రి2, గ2, ప, ద2, స. కల్యాణి, లేదా శంకరాభరణంలో మ, ని తీసేస్తే ఇది వస్తుందని మీకు వాయించి పాడుతున్నప్పుడు తెలుస్తుంది. పాత లతా పాట సయొనారా గుర్తుకు తెచ్చుకోండి. తారస్థాయి షడ్జమంతో మొదలుపెడుతూ స స సా సా, ద ప గా గా, దా దాద దాదా పగ రీరీ, సా సరి గప గప దస దాదా (పై స్థాయిలో) గా గగ గారిస రిస దాదా అని వాయించి చూడండి. మోహనలో పడకూడని కోమల స్వరాలు పడితే ట్యూన్‌ పాడవుతుందని గమనించండి. మోహన అలవాటయాక అందులో ద2 తీసేసి ని2 వాయిస్తే హంసధ్వని అవుతుందని తెలుస్తుంది. వాతాపి గణపతిం, శ్రీరఘురాం అనే సినిమా పాటా హంసధ్వని రాగమే.

ప్రతి రాగంలోనూ ప్రతి స్వరమూ ఉండాలని లేదు. ఆరోహణలో ఉన్న స్వరాలే అవరోహణలో ఉండాలని కాని, అదే క్రమంలో పలకాలనిగాని లేదు. అందుకనే అనేక కాంబినేషన్లలో వేలకొద్దీ రాగాలున్నాయి. డా. బాలమురళీకృష్ణ స మ1 ప (మూడే మూడు) స్వరాలతో సర్వశ్రీ అనే స్వంత రాగాన్ని సృష్టించి అద్భుతంగా కీర్తన (స్వరకల్పన చేసి మరీ) పాడారు. కింద కొన్ని రాగాల ఆరోహణ, అవరోహణలూ, వాటిలోని కొన్ని పాత తెలుగు సినిమా పాటలూ ఉన్నాయి. ఒక్కొక్క రాగంలోని స్వరాలనూ కీబోర్డ్‌ మీద పలికిస్తూ, కూడా పాడుకుంటూ, పాటను గుర్తుచేసుకుంటూ ఒక్కొక్క రాగంలోనూ ఎటువంటి మూడ్‌ పలుకుతోందో గమనించండి. సామాన్యంగా కోమల స్వరాలుండే రాగాలు కోమలత్వాన్నీ, విషాదాన్నీ వ్యక్తం చేస్తాయని అనిపిస్తుంది. కొన్ని రంగులూ, వాసనలూ కొన్నిరకాల భావాలను ప్రేరేపించినట్టే కొన్ని రాగాలు కొన్ని మూడ్స్‌కు దారితీస్తాయని తెలుస్తుంది.

వినడం, విన్నదాన్ని గుర్తుపెట్టుకుని ఆకళించుకోవడం సంగీతానికి చాలా అవసరం. ఇవన్నీ మనం ఇతర సందర్భాల్లో ఒత్తిడి లేకుండా చేస్తూఉన్న పనులే. ఎటొచ్చీ సంగీతం అనగానే ఏదో భయం ఆవహిస్తుంది. అటువంటి అపోహలేవీ లేకుండా సంగీతం వింటే అది తేలికేనని అర్థమౌతుంది. ఇందులో రాసినవన్నీ ఎన్నో వారాల, నెలల పాటు నెమ్మదిగా అభ్యాసం చెయ్యవలసిన విషయాలు. కుటుంబంలో భార్యాభర్తలూ, పిల్లలూ అందరూ ఆసక్తితో కలిసి కూర్చుని అభ్యాసం చేస్తే సరదాగా డిస్కవరీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.

కల్యాణి, శంకరాభరణం సంగతి పైన చూశాం. మరికొన్ని చూద్దాం. ఇక్కడ గుర్తుంచుకోవలసినదేమిటంటే స్వరాలూ, సినిమా పాటలూ రాగాల స్వరూపంలో కొంత భాగాన్నే తెలియజేస్తాయి. ఎవరినైనా గుర్తుపట్టడానికి సన్నగానో, లావుగానో, పొట్టిగానో, పొడుగుగానో ఉంటాడని స్థూలంగా వర్ణించినట్టే ఈ కింది లక్షణాలు రాగాన్ని గుర్తించడానికి తోడ్పడతాయి. కాని దీన్ని మించిన అంశాలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తిని అర్థం చేసుకున్నట్టే రాగాన్ని గురించి తెలుసుకోవడానికి ఎంతో అధ్యయనం అవసరం. రాగలక్షణాల్లో స్వరాల మధ్యనుండే సంబంధమూ, వెయ్యవలసిన, వెయ్యగూడని గమకాలూ వగైరాలెన్నో ఉంటాయి. సినిమా పాటలన్నిటిలోనూ వీటన్నిటినీ వ్యక్తం చెయ్యాలన్న నిబంధన ఏమీ ఉండదు కనక కొన్ని పాటలకు కొన్ని రాగాలు ఆధారం అని మాత్రమే చెప్పవచ్చు. మిగతావన్నీ వినికిడి మీద క్రమంగా తెలుస్తాయి.

  1. మాయామాళవగౌళ దీన్ని హిందూస్తానీలో భైరవ్‌ అంటారు. ఇందులో పడే స్వరాలు స, రి1, గ2, మ1, ప, ద1, ని2. మనవాళ్ళు సరళీస్వరాలు నేర్చుకునే రాగం. బైజూ బావ్‌రాలో మొహే భూల్‌ గయే సావరియా ఇదే రాగం.
  2. చక్రవాకం దీన్ని హిందూస్తానీలో అహీర్‌ భైరవ్‌ అంటారు. ఇందులో పడేవి స, రి1, గ2, మ1, ప, ద2, ని1. దీన్ని మాయామాళవగౌళతో పోల్చిచూడండి. ఈ రాగంలో ఏడుకొండలవాడ, రాధకు నీవేరా ప్రాణం, మన్నాడే పాడిన పూఛోనకైసే మొదలైన పాటలున్నాయి.
  3. చారుకేశి ఇందులో పడే స్వరాలు స, రి2, గ2, మ1, ప, ద1, ని1. ఇందులో భళిభళి దేవా, ఈ పగలు రేయిగా వగైరా పాటలున్నాయి.
  4. కీరవాణి ఇందులోని స్వరాలు స, రి2, గ1, మ1, ప, ద1, ని2. పూజాఫలంలో అందేనా ఈ చేతుల, నాగిన్‌లో మేరా దిల్‌యే పుకారే మొదలైనవి ఈ రాగమే.
  5. షణ్ముఖప్రియ ఇందులోని స్వరాలు స, రి2, గ1, మ2, ప, ద1, ని1. సంతానంలో దేవీ శ్రీదేవీ, సాగరసంగమంలో తకిట తధిమి పాటలు ఇదే రాగం.
  6. ఖరహరప్రియ ఇందులోని స్వరాలు స, రి2, గ1, మ1, ప, ద2, ని1. దేవదాసులో ఇంత తెలిసియుండి పల్లవీ, మిస్సమ్మలో బాలనురా మదనా ఈ రాగంలో పాటలే.

ఈ రాగాలన్నీ సంపూర్ణ రాగాలే. ఒక్కొక్క స్వరం మార్చినప్పుడు భావం ఎలా మారుతోందో గమనించండి. ఇప్పుడు తక్కువ స్వరాలున్న కొన్ని రాగాలు చూద్దాం.

  1. ఆభేరి దీన్ని హిందూస్తానీలో భీంపలాస్‌ అంటారు. ఇందులో పడే స్వరాలు స, గ1, మ1, ప, ని1. అవరోహణ స ని12 ప మ11 రి2; అంటే సరిగ్గా ఖరహరప్రియలాగే. ఆరోహణలో మటుకు రి, ద ఉండవు కనక మూడ్‌ తేడాగా అనిపిస్తుంది. ఈ రాగంలో లెక్కలేనన్ని ఉదాహరణల్లో నీలిమేఘాలలో, నీలీల పాడెదదేవా, నీలాల ఓమేఘమాలా, నీవేనా నను తలచినది వగైరాలున్నాయి.
  2. బాగేశ్రీ ఇది వాగీశ్వరి అనే పేరుకు ప్రత్యామ్నాయం; మనవాళ్ళు భాగేశ్రీ అని తప్పుగా పలుకుతారు. ఈ హిందూస్తానీ రాగంలో స్వరాలు స, గ1, మ1, ద2, ని1, స స, ని1, ద2, మ1, ప, ద2, మ1, గ1,రి2, స. ఇవన్నీ ఆభేరిలో పడే స్వరాలే అయినప్పటికీ క్రమంలో మార్పు ఉండడంవల్ల అద్భుతమైన మరొక భావం కలుగుతుంది. నీ కోసమె నే జీవించునది, రారా కనరారా, అలిగితివా మొదలైన పాటలు జనాదరణపొందాయి. హిందీలో జాగ్‌ దర్దే ఇష్క్‌ జాగ్‌ మరొక మంచి పాట. లతా పాడిన నా బోలే పాటను అనుకరిస్తూ రావోయి మాధవా అని భానుమతి పాడింది.
  3. తిలక్‌ కామోద్‌ ఈ హిందూస్తానీ రాగంలో స్వరాలు స, రి2, మ1, ప, స స, ని2, ప, ద2, మ1, గ2, స, రి2, గ2, స. ఇందులో గుండమ్మకథలోని అలిగిన వేళనె, జగదేకవీరుని కథలోని ఓ చెలీ ఓహో సఖీ మొదలైన పాటలు విని కొందరు దేశ్‌ అని పొరబడతారు. ఈ పాటల్లో ని1 వినబడడమే అందుకు కారణం. తిలక్‌ కామోద్‌లో ని1 అరుదుగా మాత్రమే ఉపయోగిస్తారు. దేశ్‌లో నాకు తెలిసినంతవరకూ ఎక్కువ తెలుగు సినిమా పాటలున్నట్టు లేవు. భక్తజయదేవ సినిమాలో ఘంటసాల పాడిన దశావతారాల రాగమాలిక ప్రళయపయోధిజలే అన్నపాటలో వసతి దశన శిఖరే అన్న చరణం మాత్రం దేశ్‌ రాగమే. హిందీలో కల్పనా చిత్రంలో ఆశా పాడిన బేకసీ హద్‌సే జబ్‌ గుజర్‌ జాయే, రఫీ, ఆశా మైఁ సుహాగన్‌ హూఁ లో పాడిన గోరీ తోరే నైన్‌ దేశ్‌ రాగానికి ఉదాహరణలు. తిలక్‌ కామోద్‌లో ప స అనే ప్రయోగం ఉంటుంది; అది దేశ్‌లో నిషిద్ధం. హిందూస్తానీ సంగీతంలో దీనికీ తిలక్‌కామోద్‌కూ తేడాలు స్పష్టంగా చూపుతారు. తెలుగు సినిమా పాటల్లో శ్రోతలు పొరబడుతున్నారంటే అది సంగీతదర్శకుల తప్పే. ఈ రెండు రాగాలకూ ఎటువంటి లక్షణాలుంటాయో వారికే సరిగ్గా తెలియదు.
  4. ఖమాస్‌ ఈ రాగంలోని స్వరాలు స, మ1, గ2, మ1, ని1,ద2, ప, ద2, ని2, స స, ని1, ద2, ప, మ1, గ2, రి2, స. తెలుగు సినిమా పాటల్లో ఎందుకే నీకింత తొందర, నను విడనాడకురా, పాడమనినన్నడుగతగునా మొదలైనవి ఉన్నాయి. శంకరాభరణంలో వాసుదేవాచార్య కీర్తన బ్రోచేవారెవరురా పాడారు. ఇందులో రెండు నిషాదాలుంటాయి.
  5. బేహాగ్‌ ఈ రాగంలోని స్వరాలు స, గ2, మ1, ప, ని2, స స, ని1, ద2, ప, మ2, గ2, మ1, గ2, రి2, స. ఇందులో రెండు మధ్యమాలుంటాయి. భక్త ప్రహ్లాదలో బాలమురళి పాడిన వరమొసగే వనమాలీ ఇదే రాగం. హిందీలో ముకేశ్‌ పాడిన బన్‌కే చకోరీ గోరీ, లతా పాడిన తేరే సుర్‌ ఔర్‌ మేరే గీత్‌ మొదలైన ఉదాహరణలున్నాయి.

మోహన, హంసధ్వని లాంటి అయిదు స్వరాల రాగాలు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

  1. హిందోళం హిందూస్తానీలో మాల్‌కౌఁస్‌ అనబడే ఈ రాగంలో స, గ1, మ1, ద1, ని1 స్వరాలుంటాయి. ఇందులో పగలే వెన్నెలా, మనసే అందాల బృందావనం, కలనైనా నీ వలపే మొదలైన పాటలున్నాయి.
  2. శుద్ధసావేరి ఇందులోని స్వరాలు స, రి2, మ1, ప, ద2. ఇందులో పాడనా తెలుగు పాట, కోలు కోలోయన్న మొదలైన పాటలున్నాయి.
  3. హంసానంది దీన్ని హిందూస్తానీలో రమారమి సోహనీ అంటారు. ఇందులోని స్వరాలు స, గ2, మ2, ద2, ని2, స స, ని2, ద2, మ2, గ2, రి1, స. హాయిహాయిగా ఆమని సాగేలో మొదటి చరణం, నీలాల ఓ మేఘమాలా పాటలో చివరి చరణం ఈ రాగమే. హిందోళంలాగే ఇందులోనూ పంచమం ఉండదు.
  4. వలజి దీన్ని హిందూస్తానీలో కలావతీ అంటారు. ఇందులోని స్వరాలు స, గ2, ప, ద2, ని1. ఇందులో రిషభం వాడకూడదుగాని దాదాపు ప్రతి సినిమా పాటలోనూ వాడారు. తెలుగులో వసంత గాలికి, వెన్నెల రేయి అనే యుగళగీతాలూ, హిందీలో రఫీ పాడిన కోయీసాగర్‌ ఆశా పాడిన కాహే తర్‌సాయే జియరా ఉదాహరణలు.
  5. రాగేశ్రీ ఈ హిందూస్తానీ రాగంలోని స్వరాలు స, గ2, మ1, ద2, ని1, స స, ని1, ద2, మ1, గ2, మ1, రి2, స. అనా్ననా భామిని, ఇది నా చెలి ఈ రాగానికి ఉదాహరణలు.
  6. అమృతవర్షిణి ఇందులోని స్వరాలు స, గ2, మ2, ప, ని1, స. కల్యాణిలో రి2, ద2 తీసేస్తే ఈ రాగం తయారౌతుంది. ఆనతినీయరా అనే పాట ఈ రాగానికి ఉదాహరణ.

మన సంగీతంలోని రాగాలనన్నిటిని గురించీ ఈ ఒక్క వ్యాసం ద్వారా తెలుసుకోవడం అసాధ్యం. ఇందులో చెప్పదలుచుకున్నది ఒకటే; ఒక ఆధారశ్రుతి మూలంగా, ఉన్న పన్నెండింటిలో వివిధ స్వరాల కలయిక ఎటువంటి రాగభావాన్ని కలిగిస్తుందో కీబోర్స్డ్‌ సహాయంతో ఎవరైనా సరే అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు ఎన్ని పాటలు ఎన్నిసార్లు విన్నప్పటికీ స్వయంగా ఎవరికి వారే ఈ స్వరాలను మోగించి చూసుకోవడం, ఆ శబ్దాల ప్రభావం ఎటువంటిదో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ప్రత్యేక విషయంగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇదొక పరిమితమైన ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే కేవలం స్వరాలు పలికించినంత మాత్రాన రాగాల అందాలన్నీ బైటపడటంలేదని మీకు త్వరలోనే తెలిసిపోతుంది. మన సంగీతంలో గమకాలు చాలా ముఖ్యం. కాని మొదటి దశలో స్వరాలను గుర్తించి రాగాలను పోల్చడానికి ప్రయత్నించడమే మంచి పద్ధతి.

పాట రానివారికి సామాన్యంగా కీబోర్స్డ్‌ కూడా కొత్తే గనక కాస్త తడుముకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ స్వరాలను పలకడం, ప్రతి స్వరాన్నీ ఆధారశ్రుతితో సరిపోల్చుకుంటూ ఉండడం మొదలైనవన్నీ తప్పనిసరిగా జరిగే విషయాలు. నిస్పృహ చెందకుండా, అదేదో పనిష్మెంట్‌ అనుకోకుండా పట్టుదలతో కృషి చేస్తే సంగీతపు “రహస్యాలన్నీ” త్వరలోనే తెలిసిపోతాయి. పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నప్పుడు వారు నేర్చుకుంటున్న “కృత్రిమ” సంగీతానికీ, వారికి తెలిసిన మామూలు పాటలకూ ఉన్న సంబంధం వారికిగనక అర్థమైతే సంగీతం చాలా సులువుగా బోధపడుతుంది. అవి రెండూ వేరువేరని భావించి విడి కంపార్ట్‌మెంట్లలో ఉంచుతారు కనక సంగీత శిక్షణ కాస్తా సంగీత శిక్ష అయి ఊరుకుంటుంది. దీనికి బాధ్యులు నేర్పేవారే.

సంగీతానికి అవసరమైన మరొక శక్తి స్వరజ్ఞానం. మనకు తెలియకపోయినా మనం మాట్లాడే మాటలకు స్పెల్లింగ్‌ ఉన్నట్టే ప్రతి ట్యూన్‌కూ, పాటకీ స్వరాలుంటాయి. విన్న పాటకు స్వరాలు చెప్పగలగడం సంగీతకారులకు చాలా అవసరం. సంగీతం నేర్పేవారిలో చాలామందికి కనీసపు స్వరజ్ఞానం లేదని నేను గుర్తించాను. తాము నేర్చుకున్నది చిలకపలుకుల్లా వప్పగించడం తప్ప ఏది విన్నా దానికి స్వరం చెప్పగలగడం టీచర్లలో అందరికీ చేతకాదు. స్వరజ్ఞానం అలవరచుకోవడం అసాధ్యం కాదు. ప్రతి సరళీ స్వరాల వరసనీ, “అలంకారాన్నీ”, పాటనూ సాహిత్యంతో మాత్రమే కాకుండా ఆ వెంటనే స్వరాలతోనూ, మరొకసారి “అ” కారంతోనూ పాడుకుంటూ ఉంటే త్వరలోనే స్వరజ్ఞానం వస్తుంది.

మనం విన్నది ఎటువంటి సంగీతమైనా సరే, దాన్ని గుర్తుంచుకుని మనకే వినబడేట్టుగా గట్టిగా పాడుకోవాలి. అదే రాగమో తెలిస్తే ఆ స్వరాలు కీబోర్స్డ్‌ మీద మోగించి చూసుకుంటూ ఉండాలి. మోగుతున్న స్వరాల ద్వారా రాగపు స్వరూపం మనకి కాస్తకాస్తగా అవగతం అవుతుంది. మనం ఎంత మనసు పెట్టి ప్రయత్నిస్తే అంత త్వరగా అర్థం అవుతుంది. కొంత ఆలస్యం అయినంత మాత్రాన నిరాశ పడనవసరంలేదు. కొత్త విషయాలు అర్థం అవుతున్నకొద్దీ మనకు ఉత్సాహమూ, ఆసక్తీ పెరుగుతాయి. ఇంట్లో నలుగురూ కూర్చుని ప్రయత్నిస్తే ముఖ్యంగా పిల్లల్లో ఉన్న ప్రతిభ బైటపడే అవకాశం ఉంటుంది. మంచి సంగీతం ఇంట్లో మోగుతూ ఉండడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో ఇంకా కృషి చెయ్యదలిస్తే ఒక్కొక్క రాగంలోనూ ఉన్న శాస్త్రీయ సంగీతాన్నీ, సినిమాపాటలనూ ఒక కేసెట్‌, లేదా సీడీమీద రికార్డ్‌ చేసుకుని అన్నీ ఒకేసారి వింటూ ఆ రాగపు లక్షణాలని అర్థం చేసుకోవచ్చు. ఇలా రాగానికొకటి చొప్పున సేకరించుకుంటే మంచి లైబ్రరీ తయారవుతుంది. సరిగమలురాని చాలామంది రాగాలను గుర్తుపట్టగలరు. వినికిడి వల్ల వారికి రాగాల “ఆకారం” తెలుస్తూ ఉంటుంది. దీనికి నేను అనలాగ్‌ పద్ధతి అని పేరుపెట్టాను. దీనితోబాటు స్వరాలను కూడా డిజిటల్‌ పద్ధతిలో గుర్తించగలిగితే రాగం, స్వరాల నిర్మాణం మరింత ఖచ్చితంగా అర్థం అవుతాయి.

తెలుగు పాటలకు రాగాల పేర్లు , హిందీ సినిమా పాటలకు రాగాల పేర్లు కొన్ని వెబ్‌సైట్లలో ఉన్నాయి. ఎటొచ్చీ, వీటిలో కొన్ని తప్పులున్నాయి. సినిమా పాటల్లో రాగాలకు నిర్దుష్టమైన స్వరూపం ఉండడం అరుదైన విషయం. స్థూలంగా ఏ రాగం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని సినిమాపాటలు ఉపయోగపడతాయి. నాకు తెలిసిన పాటలకు రాగాల పేర్లు నేను ఈ మెయిల్‌ ద్వారా తెలియజెయ్యగలను (rohiniprasadk@yahoo.com).


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...

 

(23 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. T.Raja gopal అభిప్రాయం:

    September 1, 2006 10:40 am

    Eemaata gaariki,
    The article on “Samgeeatha tho kusti ” by Sri Prasad garu is excellent.! It is very help ful for people who are interested to learn music. Very well analysed about raagaas. This article will enthuse and motivate the beginers to learn more about music.
    Thanks to sri Prasad garu.
    Raja gopal.

  2. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    September 1, 2006 11:54 pm

    రోహిణీ ప్రసాదు గారూ,

    మీ వ్యాసం బాగుంది.
    సప్త స్వరాలు ఏడు (7) పన్నెండు ( 12 ) స్వరాలు అని రాసారు. కానీ 72 మేళ కర్త రాగాల విభజన చేస్తూ, “క, ట, ప, యాది” చట్రంలో స్వర విభ జన 16 స్వ రాలుగా చేయ బడిందని నేను నేర్చుకున్నాను.
    అవి -
    1.ష డ్జ మము ( స )
    2.శుద్ధ రిషభము ( రి1)
    3. చతుశ్రుతి రిషభము ( రి2)
    4. షట్శృతి రిషభము ( రి3 )
    5. శుద్ధ గాంధారము ( గ1)
    6. సాధారణ గాంధారము ( గ2 )
    7. అంతర గాంధారము ( గ3 )
    8. శుద్ధ మధ్యమము ( మ1)
    9. ప్రతి మధ్యమము ( మ2 )
    10. పంచమము ( ప )
    11. శుద్ధ దైవతము ( ద1 )
    12. చతుశ్రుతి దైవతము ( ద2 )
    13. షట్శృతి దైవతము ( ద3)
    14. శుద్ధ నిషాదము ( ని1 )
    15. కైసికి నిషాదము ( ని2 )
    16. కాకలి నిషాదము ( ని3 )
    నాకు తెలిసిన ఇంకొక చిన్న విషయం. ఈ సప్త స్వరాలలో నెమలి కూత
    ష డ్జ మము, వృషభ ధ్వని రిషభముగాను, మేక శబ్దం గాంధారముగాను, క్రోంచపక్షి పలుకులు మధ్యమం గాను, కోకిల కూత పంచమంగాను, గుర్రపు ధ్వని దైవతముగాను, ఏనుగు ఘీంకారం నిషాదంగానూ పుట్టాయని ఒక సంస్కృత శ్లోకం ఉంది.
    ఆ శ్లోకం ప్రస్తుతం నాకు అందుబాటులో లేదు. దొరికితే రాస్తాను.

    మీ వ్యాసంలో లయ ( తాళం ) గురించి కూడా ప్రస్తావిస్తే సంపూర్ణవ్యాస మయ్యేది.

    - సాయి బ్రహ్మానందం గొర్తి

  3. Rohiniprasad అభిప్రాయం:

    September 2, 2006 5:37 am

    సాయిగారు చెప్పిన 16 శ్రుతుల సంగతి తెలిసినదే. నిజానికి 22 శ్రుతులున్నాయని చెపుతారు. ఇవన్నీ నా వ్యాసం పరిధికి మించినవనే ఉద్దేశంతో ప్రస్తావించలేదు.
    16 శ్రుతుల ద్వారా 72 మేళకర్త రాగాలు వస్తాయి. వాటన్నిటినీ కీబోర్డ్స్ ద్వారా పలికించడం వీలవదు. సంగీతం ఎంత సంక్లిష్టమైనదో వివరిస్తూ పోతే నేర్చుకుందామనే ఆసక్తి ఉన్నవారు మరింతగా బెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో రాగాలను గురించిన అవగాహన పొందటానికి ఒక మామూలు హార్మోనియంవంటిదీ, 12 స్వరాలతో పరిచయమూ ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో నేను లోతైన విషయాలను బుద్ధిపూర్వకంగానే విడిచిపెట్టాను.

    లయ సంగతి నా పాత వ్యాసాల్లో ప్రస్తావించాను. మొత్తం సంగీతశాస్త్రం గురించి చెప్పడానికి పెద్ద పుస్తకాలు ఎలాగూ ఉన్నాయి కదా అని అదంతా మళ్ళీ ఏకరువు పెట్టకుండా యూజర ఫ్రెండ్లీ పద్ధతిలో సులువుగా అర్థమయే మేరకు రాశాను.

  4. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    September 2, 2006 8:06 am

    ఈ 16 స్వరాలు కీబోర్డు మీద పలికించ లేక పోవచ్చు. కానీ వీణ మీద ఈ 16 స్వరాలు అతి చక్కగా పలికించ వచ్చు. మానవ స్వరానికి అతి దగ్గరగా ఉన్న వాయిద్యం వీణ. దాదాపు ప్రఖ్యాతి చెందిన వాగ్గేయ కారులందరూ వైణికులే ! ( త్యాగయ్య, శ్యామ శాస్త్రి, దీక్షితార్, వేంకట మహ్హి…) అతి ప్రాచీన మైన వాయిద్యాన్ని, మనదైన దాన్ని వదిలేసి మనం కీబోర్డు ల వెంట బడడం నిజంగా దురదృష్ట కరం. ఈ వీణ కనక ఏ అమెరికన్ల దో అయి ఉంటే, ఎలాంటి ఉఛ్చస్థితిలో ఉండేది కదా అనిపిస్తుంది. పూర్వం కచేరీలలో పక్క వాయిద్యంగా వీణ ఉండేది. దీక్షితారు వయొలిను సంగీత కచేరీలలో ప్రవేశ పెట్టాక వీణ మెల్ల మెల్ల గా కనుమరుగయ్యింది. బహుశా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్ళ్చచ్చు అన్న సౌకర్యం కూడా ఒక కారణం కావచ్చు.
    లయ గురించి కొద్దిగా నయినా ప్రస్తావిస్తే బాగుండేది.
    - సాయి బ్రహ్మానందం గొర్తి.

  5. Rohiniprasad అభిప్రాయం:

    September 2, 2006 11:21 am

    నేను 1964 నుంచీ సితార్ వాయిస్తున్నాను. వీణ కూడా కొంతవరకూ వాయించగలను.

    సంగీతం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. పిచ్ బెండర్ సహాయంతో కీబోర్డ్ మీద అద్భుతమైన కర్నాటక గమకాలను పలికిస్తున్న తమిళ కళాకారుల గురించి సాయిగారికి బహుశా తెలిసి ఉండదు.

    వయొలిన్ కూడా పాశ్చాత్య వాయిద్యమే. ముత్తుస్వామి తమ్ముడు బాలుస్వామి దీక్షితర్ మొదట దాన్ని కర్నాటక సంగీతానికి ఉపయోగించాడట.

    ఒకప్పుడు శాస్త్రీయ సంగీతానికి పనికిరావనుకున్న సితార్, షెహనాయి, వేణువు, సంతూర్, మేండొలిన్, క్లారినెట్, గిటార్ మొదలైన వాయిద్యాలన్నీ ఈనాడు ప్రతిభావంతుల చేతుల్లో ఎంత బాగా వినిపిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. కీబోర్డ్స్ వంటిదే అయిన హార్మోనియం బడే గులాం తదితర మహా విద్వాంసులందరికీ పక్క వాయిద్యంగా ఉపయోగపడింది. దర్బారీ కానడవంటి రాగాల విషయంలో దాని పరిమితులు వారికి తెలియవని కాదు. కొన్ని దశాబ్దాల క్రితం కర్ణాటక గాయకులు కూడా దాన్ని పక్కవాద్యంగా వాడుకున్నారని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంతకీ వాయిద్యం ముఖ్యం కాదు. సంగీతమే ముఖ్యం.
    ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ను చూడవచ్చు:అసలింతకీ నా వ్యాసం ఉద్దేశమేమిటో గుర్తిస్తే కీబోర్డ్స్ గురించిన ఈ చర్చ అంతా అనవసరమని అనిపిస్తుంది. సంగీతం నేర్చుకుందామనుకునే ఔత్సాహికులకు కొంతవరకూ పనికొస్తుందని రాశానేగాని సంగీతశాస్త్ర చర్చలోకి దిగడం నా ఉద్దేశం కాదు.

  6. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    September 2, 2006 12:47 pm

    నేను మీ అంత విద్వాంసుణ్ణి కాకపోయినా, సంగీతం అంటే అభిరుచి, కాస్తంత అవగాహన ఉందని అనుకుంటున్నాను. మీ వ్యాసం మీద అభిప్ర్రాయం రాయడం నా పొరపాటని గ్రహించాను. మీ స్పందనకి ధన్యవాదాలు.
    - సాయి బ్రహ్మానందం గొర్తి

  7. unknown అభిప్రాయం:

    September 3, 2006 5:07 pm

    ప్రసాద్ గారి వ్యాసం ఔత్సాహికులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
    వారు చెప్పినట్టు కీబోర్డు మీద గుర్తులు వేసుకుని సాధన చేస్తే రాగాల
    లోతులు కాకపోయినా కనీసం చాయలు అర్ధమయి తదుపరి మెట్టు కి ఎదగే స్థాయి సమకూరుతుంది.
    మనవి కావని ఏ వాయిద్యాన్నీ కూడా వదులుకోనవసం లేదు. ఘంటసాల వంటి వారు పాతాళభైరవి నాడే “మనవి కానివి” వాడుకుని అద్భుతవైన సంగీతం చేసేరు. కీ బోర్డు మీద సాయి గారి చులకన భావం సముచితంగా లేదు. అయితే వారి భావం ఈ నాడూ అన్ని వాయిద్యాల చోటునా కీ బోర్డు మన కొత్త దర్శకులు వాడుకోడం గురించై ఉంటుంది.
    ఏమైనా వారి ధన్యవాదాలూ, క్షమాపణలూ వారి స్థాయి కి తగ్గ ట్టు లేవు.
    ప్రసాద్ గారు తమ విద్వత్ప్ర కటన కై ఈ వ్యాసం రాసినట్టు నాకనిపించలేదు. రాగం అంటే ఔత్సాహికులకి నీరసం రాకుండా ఆసక్తి కలిగి అభిరుచి గా మారాలని చేసిన సత్ప్రయత్నమని నా ఉద్దేశం. ఒక వాయిద్యాన్ని ఆకాశానికెత్తి వేరే వాటిని తొక్కేయాలని ఆయన ఇవాళ శ్రమపడి ఒక వ్యాసం రాసేరని నేననుకోను. వ్యాస కర్తగా ఆయన తన అనుభవాన్ని, qualifications ని చెప్పుకుంటే అది వ్యాసానికి మరింత authenticity ని ఇవ్వగలదని నా అభిప్రాయం.
    సెలవు.

  8. Girija Agasthyeswar అభిప్రాయం:

    September 3, 2006 10:10 pm

    Respected Rohiniprasadgaru,

    Thank you very much for an informative and interesting article.
    After reading all the comments of this article, I wish to say that I am a
    practical example of a student of music who is using keyboard, to check my own notes and pitchings everyday, as per your valuable suggestion, you gave us, a few years back. It is definitely helping me.
    It is not possible to practise only in front of a teacher because of so many reasons, and long distances in cities being one of them.

    Another point is, if it is any other instrument, like veena or violin,
    somebody has to teach us even how to hold it. Learning to play M1 or M2 in those instruments is more difficult than singing vocally. So they cannot be used by vocal students for learning purpose.

    If everybody says “Sangitam Mahasamudram”, “Purva Janma Punyam”, many people will hesitate even to start learning Classical music.
    You are the one, at least who tells us “It is simple, you all can try”.
    Thanks a lot.

    Thanks to Eemaata too, for publishing such an useful article.

    Girija Agasthyeswar
    Thane

  9. C Rajendra prasad అభిప్రాయం:

    September 4, 2006 7:33 am

    సంగీతం గురించి చక్కని పరిచయం. ముఖ్యంగా కొంత పరిచయం ఉండి కొన్నివిషయాలే తెలిసిన నాలాంటి వాళ్ళకు మరిన్ని విషయాలు తెలియడమే కాకుండా ఇంకా తెలుసుకోవాలనే ఉత్సా హాన్ని కలిగించిన వ్యాసం.

  10. Lakshmanna Vishnubhotla అభిప్రాయం:

    September 4, 2006 9:15 am

    ఈ వ్యాసం మీద అభిప్రాయాలు చదివాక ఇది రాయాలనిపించింది!

    సంగీతం పై వ్యాసాలు రాయటంలో కొన్ని చిక్కులున్నాయి. ప్రతిరోజూ సంగీతాన్ని సాధనచేసే వ్యక్తులలో రోహిణీ ప్రసాద్ గారు ఒకరు. ఆయన ప్రస్థుతం నేను ఉంటున్న ఊరులోనే (ఆష్టిన్, టెక్సాస్) ఉంటున్నారు. కొన్ని సంగీత పరమైన విషయాలు రాయవలసి వస్తే, భాష యొక్క పరిమితుల వల్ల అన్నీ సాధ్యం కావు. సంగీతం పై వ్యాసాలు రాయటం కన్న, ఒక పద్యం, పాట ద్వారా సంగీతంలోని చమక్కులు చూపటం చాలా తేలిక.

    ఈమాట ప్రారంభించాక, మిత్రుల కోరికతో నాకు తెలిసిన సంగీత జ్ఞానాన్ని, వ్యాసాల రూపంలో తెలియపరచటానికి ప్రయత్నించేవాణ్ణి. అందుకు ప్రేరణ, నేను బొంబాయిలో చదువుకుంటున్నప్పుడు రోహిణీ ప్రసాద్ గారితో పరిచయం వల్ల, వేణువు మీద సాధన చేయటం, తద్వారా, సంగీతంలోని కొన్ని మెళకువలను నేర్చుకోటం.

    ఒక సందర్భంలో నేను వేణువు మీద “హాయి హాయిగా ఆమనిసాగే” (హంసానందితో మొదలయిన ఘంటసాల, జిక్కీల పాట) అన్న పాట వాయిస్తుంటే, బాగా పాటలు పాడే ఒకాయన వచ్చి “ఇదేమిటి, సినిమాలో ఉన్నది ఉన్నట్టు వస్తోంది?” అని ఆశ్చర్యపోయారు. ఈ పాటల వెనుక ఉన్న స్వరాలు, గమకాలు గురించి పాడే వ్యక్తులందరికీ తెలిసి ఉంటాయని నేను అమాయకంగా ఆలోచించానని అప్పుడు నాకు తెలిసింది.

    ఈమాటలో సంగీతం పై రోహిణీ ప్రసాద్ గారు రాస్తున్న వ్యాసాలు చాలా మంది చదివి ఆనందించి, వారి సలహాల మేరకు ఉపయోగం పొందుతున్నారని పాఠకుల అభిప్రాయాల వల్ల తెలుస్తోంది. అది చాలా సంతోషించవలసిన విషయం.

    ఇప్పటికీ, నేను రోహిణీ ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో హిందూస్థానీ సంగీతంలోని విషయాలు తెలుసుకొని ఆనందిస్తూ ఉంటాను. నాకు తెలిసిన వారిలో సంగీతంపై, ముఖ్యంగా హిందూస్థానీ సంగీతంపై, ఆయనకు ఉన్న పట్టు, ఆసక్తి, సాధన, జ్ఞానం మరెవరికీ లేవు అంటే అది అతిశయోక్తి కాదు!

    ఈమాట పాఠక శ్రోతలకు ఇకముందు కూడా కొన్ని ఆడియో లింక్స్ ద్వారా ఆయనకు తెలిసిన మరిన్ని సంగీత విషయాలు, విశేషాలు తెలుపుతారని ఆశిస్తూ,

    విష్ణుభొట్ల లక్ష్మన్న
    Lark_Vishnubhotla@yahoo.com

  11. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    September 7, 2006 2:34 pm

    నేను రాసిన అభ్యంతరమల్లా ఒక్కటే ! మొత్త స్వరాలు 16, కానీ కీబోర్డు మీద కేవలం 12 మాత్రమే పలికించ గలమని రాయచ్చు కదా? మొత్తం 12 స్వరాలే అని రాయడం, నా దృష్టిలో సుముచితం కాదు. అవును, 16 స్వరాలు 16 అని రాసి, 12 అని రాయకుండా ఉండాల్సింది అని అనచ్చుకదా? లేదా 16 స్వ రాలు ఉన్నాయి, కానీ 12 మాత్రమే కీబోర్డు లో పలికించ వచ్చు అని రాయడం వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు.
    అలా కాకుండా మేకేం తెలియదంటూ, నాకు అపారమైన వాయిద్య అనుభవం ఉంది అని రాయడం వల్లే నేను పొరపాటని రాయడం జరిగింది. నేను వ్యాసకర్తని కానీ, ఆయన వ్యాసం బాగోలేదని కానీ రాయలేదు. నాకూ సంగీతానుభవం ఉంది. నేనూ వీణ వాయించ గలను. వాయిద్య ముఖ్యం కాదు, సంగీతమే ముఖ్యం అన్నప్పుడు, మనం ఇచ్చే సమాచారం సరిగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం, అంతేకానీ, ఇంకోళ్ళ విద్వత్తుని ప్ర శ్నించడం కాదు. వస్తువు వదిలేసి, వ్యక్తులవైపు విమర్శ దారి మళ్ళితే ఎలా ఉంటుంది?
    వ్యాసం చదివేక ప్రసాదు గారికి అపారమైన సంగీతానుభవం ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది.

    - సాయి బ్రహ్మానందం గొర్తి

  12. Rohiniprasad అభిప్రాయం:

    September 8, 2006 6:25 am

    సాయిగారి సంతృప్తి కోసమని నేను లోగడ రాసిన వ్యాసం లింక్ ఇస్తున్నాను. అందులో శాస్త్రీయ సంగీతపు 16, 22 శ్రుతులను గురించి క్లుప్తంగా చెప్పాను.

    http://www.eemaata.com/issue10/rOhiNii.html

    ఆయనకి వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఔత్సాహికుల సౌకర్యం కోసమని 16 శ్రుతుల గురించి ప్రస్తావించలేదనీ, నేనూ, ఇతర పాఠకులూ విన్నవించుకోవడం జరిగింది.

    మరొక విషయం. 72 మేళకర్తల వరకూ వివరించడానికి 16 శ్రుతులు సరిపోతాయి కాని ఆరభి, దేవగాంధారి వంటి రాగాల మధ్య తేడాలు తెలుసుకోవడానికి ఉపకరించవు. ఔత్సాహికులకు అవసరంలేని ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. 22 శ్రుతుల గురించి తెలియాలంటే ఇది చూడండి.

    http://www.rit.edu/~pnveme/raga/Sruti.html

    [ఈ 12 vs. 16 vs. 22 శ్రుతుల పై చర్చ ఇంతటితో ముగించవలసిందిగా పాఠకులకు మనవి. - సంపాదకులు]

  13. T.Raja gopal అభిప్రాయం:

    September 9, 2006 9:13 am

    Dear Eemaata,
    A very good discussion on Sri Rohini prasad gari Article. As a music lover and an enthusiastic learner, I am very much benefited and learnt some more new things by the article and the discussions on the same.
    Thank you very much.
    Raja gopal.

  14. Kumar అభిప్రాయం:

    October 17, 2006 9:38 am

    I just wanted to point out that “Hayi Hayi ga Aamani sage” is not in Raga Hamsanandi but in Raga Basant Bahar. You can listen to a Tillana composed by Maharajapuram Santhanam in this Raga. Alarmelvalli dances excellently to it.
    Basant bahar has a chhaya of Darbari Kanada which you can hear in the lines ” Chooduma Chandamama” of that song.

    Coming to Hamsanandi, the song Vedam anuvanuvuna nadam is in Raga Hamsanandi..

  15. Lakshmanna Vishnubhotla అభిప్రాయం:

    October 18, 2006 7:18 am

    కుమార్ గారు చెప్పింది కొంతవరకు నిజం. “హాయిహాయిగా ఆమనిసాగే” పాట రాగమాలిక! నాలుగు చరణాలున్న ఈ పాట హంసానంది రాగం (హిందూస్థానీలో సోహిని) తో మొదలయి, రెండో చరణంలో (ఎమో తటిల్లతికమేమెరుపు) జోన్ పూరి రాగానికి మారి, మూడో చరణంలో కుమార్ గారు అన్నట్టు (చూడుమా చందమామ) బసంత్ బహార్ రాగానికి మారి, చివరి చరణం (కనుగవా తనియదా ప్రియతమ) యమన్ రాగం (కర్ణాటక సంగీతంలో కల్యాణి) తో పూర్తి అవుతుంది.

    కుమార్ గారు హంసానంది రాగానికి ఇచ్చిన ఉదాహరణ “వేదం అణువణువున నాదం” సరైనదే!

    విష్ణుభొట్ల లక్ష్మన్న
    Lark_Vishnubhotla@yahoo.com

  16. Rohiniprasad అభిప్రాయం:

    October 18, 2006 9:36 am

    కుమార్ గారి రాగాల పేర్లు కొన్ని తప్పు.

    హాయిహాయిగా పాటలోని రాగాలు ఇవి.
    పల్లవి సోహనీ (దీన్ని పోలినది హంసానంది. ఇందులో వేదం అణువణువున అనే పాట ఉన్నమాట నిజమే).
    ఏమో తటిల్ల.. అనే చరణం బహార్ రాగం. బసంత్ బహార్ కాదు.
    మూడోది చూడుమా..అనేది జౌన్ పురీ.
    నాలుగోది యమన్ (కల్యాణి). ఆదినారాయణరావుగారికి హిందూస్తానీ సంగీతమంటే ఎక్కువ ఇష్టమనడానికి ఈ రాగమాలిక గీతం ఒక ఉదాహరణ.

  17. Rohiniprasad అభిప్రాయం:

    October 19, 2006 9:58 am

    బసంత్ అనే హిందూస్తానీ రాగం పంతువరాళిని పోలినది. దీనిని ఏ మాత్రమూ పోలని బహార్ రాగం కాస్త (కర్ణాటక) కానడలాగా అనిపిస్తుంది. ఈ రెండు పోలికలూ ఉజ్జాయింపువే. ఇవి రెండూ వసంత రుతువుకు సంబంధించినవి కనక రెంటిలోనూ వచ్చే శుద్ధమధ్యమం ఆధారంగా రెంటినీ కలిపి పాడుతూ ఉంటారు. విడిగా రెండూ గొప్ప రాగాలైనప్పటికీ బసంత్ బహార్ అనేది మటుకు అంత ముఖ్యమైనది కాదు. ఇంతకీ ఈ మిశ్రమ రాగం హాయిహాయిగా పాటలో వాడబడనేలేదు.

  18. రానారె అభిప్రాయం:

    October 19, 2006 2:41 pm

    సినిమాపాటలు వింటున్నపుడు -అరె, ఈ పాటలోని ఈ భాగం ఆ పాటను పోలివుందే. ఈ రెటికీ ఆధారం ఏ రాగమో కనుక్కుందాం - అని ఇంటర్నెట్లో వెదకడం వరకే నా సంగీతఙ్ఞానం పరిమితం. నేను పుట్టిపెరిగిన పరిస్థితులు నాకీమాత్రం అభిరుచి కలిగించినందుకు నేనదృష్టవంతుణ్ణే. ఆమీదట మరికొంత తెలుసుకోవాలనే నా కుతూహలానికి రోహిణీప్రసాద్ గారి ఈ వ్యాసంతో ఒక దిశ ఏర్పడింది. వ్యాసం రాసి వూరుకోక ప్రతి అభిప్రాయానికీ తగురీతిన స్పందించడం ఆయనపట్ల గౌరవాన్నిపెంచింది. పాండిత్యాన్ని పక్కనపెట్టి, ప్రాథమికాంశాల్ని చిన్నపిల్లలకు అర్థమయేలా Scientificగా చెప్పగలగడం చాలా గొప్పసంగతి. ధన్యోస్మి. నా తొలి గురుదేవునికి కృతఙ్ఞతాభివందనాలు.

  19. Rohiniprasad అభిప్రాయం:

    October 19, 2006 4:29 pm

    రానారెగారి స్పందన చదివాక నాకు వివిధ్ భారతి రేడియోలో రోజూ ప్రసారం చేసిన సంగీత్ సరితా కార్యక్రమం గుర్తొచ్చింది. ఒక శాస్త్రీయ రాగ గీతాన్నీ, అదే రాగంలో ఒక హిందీ సినిమా పాటనూ వినిపించి, శ్రోతలకు సమాచారం అందించే ప్రయత్నం చేసేవారు. అది ఇంకా కొనసాగుతూనే ఉందనుకుంటాను. ఇటువంటి ప్రయత్నాల వల్ల బెరుకు తగ్గే అవకాశం ఉందనిపిస్తుంది. మనకున్న గొప్ప సంగీత వారసత్వంతో సంబంధం తెగిపోకుండా ఉండేందుకు తోడ్పడే పద్ధతులన్నీ మంచివే. గురుశిష్యుల మాట ముఖ్యం కాదుగాని ఇటువంటివి ఎవరైనా నేర్చుకోగలిగితే అది సంతోషించదగిన విషయమే కదా.

  20. డా.ఇస్మాయిల్ పెనుకొండ అభిప్రాయం:

    February 19, 2007 9:20 am

    రానారె అన్నట్టు నాక్కూడా సంగీతం మీద ఆసక్తి కలిగించిన దానికి కృతజ్ఞున్ని! నన్నూ మీ శిష్యునిగా స్వీకరించండి! ఇప్పుడే మీ వ్యాసం ప్రింట్ అవుట్ తీసాను. ఇక ఇంట్లో ఉన్న ‘కీ బోర్డు’ కి పని చెప్పాలి.ధన్యవాదాలతో…చింతు.

  21. baabjeelu అభిప్రాయం:

    July 19, 2008 6:15 pm

    గురుభ్యోన్నమహ.
    శ్రీశ్రీ కవిత్వం విని ఓ కుర్రాడు “ఓస్ ఇంతేనా కవిత్వం” అన్నాట్ట. అది విని శ్రీశ్రీ తన కవిత్వపు ప్రయోజనం నెరవేరిందని మురిసిపోయేట్ట.
    మీ వ్యాసాలన్నీ చదివేను, గత వారం రోజుల్లో.
    సంగీతం గురించి ఇలాటి వ్యాసాలు ఎక్కడా రాలేదు. వచ్చిన వ్యాసాలే చలా తక్కువ. వచ్చినవి సంగీతకారుల గురించే, అందులోనూ వాళ్ళని భజన చెయ్యడం తప్ప ఇంకేవీ వుండదు.
    అందుకే మీ చేత బాలమురళీ జీవిత చరిత్ర రాయిస్తే అది చాప్లిన్ జీవితచరిత్ర అంత ఉద్గంధ్రం అవుతుందని నేను నమ్ముతున్నాను.
    మీ వ్యాసాలు చాలా ధైర్యం ఇచ్చేయి, సంగీతం నేర్చుకునే విషయంలో.
    ఇంకో విషయం.
    పేరడీ ల గురించి ప్రచురితవయిన వ్యాసంలో వచన పేరడీ ల గురించి ప్రస్తావించలేదని బాధపడిపోయి, అందులోనూ శ్రీరమణ ని, గబ గబా అభిప్రాయాల్లోకి వెళ్తే. మీ అభిప్రాయం శ్రీరమణ గురించి చూసి “నల్ల వాడే, అమ్మమ్మ అల్లరి పిల్ల వాడే” అనుకున్నాను. నేను రాసింది తమిళ్ “నల్ల”

  22. Rohiniprasad అభిప్రాయం:

    July 19, 2008 10:44 pm

    బాలమురళిగారి cousin మంగళంపల్లి సూర్య నారాయణ అనే ఒకాయన చాలా ఏళ్ళ క్రితం ఆయన జీవితచరిత్ర రాశాడు. కొంతవరకూ hagiography లాగా అనిపించినప్పటికీ అందులో ఆసక్తికరమైన విషయాలూ, పాత ఫోటోలూ ఉన్నాయి. పెద్దవాళ్ళ జీవితచరిత్ర రాయడం సులువైన పని కాదు. ఎవరైనా రచయిత సులువైన శైలిలో రాయగలగడం అనేది అందులోని ఒక చిన్న అంశం మాత్రమే!

  23. babbjeelu అభిప్రాయం:

    July 20, 2008 5:22 am

    గురువుగారూ,
    “మురళీ మాధురి” అని వి.బందా గారు “సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర” బాలమురళీది, రాసేరు.
    భారతీరాధ పబ్లికేషన్స్, ఏలూరు వారు ప్రింట్ చేసేరు 2003 లో.
    సినారె గారి “స్టేండర్డ్” మాటల తరవాత, “చెలికాడు” మురళి శీర్షికన “మహామహోపాధ్యాయ” నూకల వారి వ్యాసం. నాలాటి వారికి కనువిప్పు ఈ వ్యాసం. నూకల వారి లాటి సాంప్రదాయ సంగీతకారుడు, బాలమురళీ గురించి రాసింది చదివి నాలాటివారునమ్మలేరు. లయలో నందీశ్వరుడే వగైరాలు, “ఏమోయ్” అంటే “ఏమోయ్” అనుకుంటాం లాటివి.
    అన్నవరపు రామస్వామి గారి “ఆశీర్వచనం”. ఇంకా కొంతమంది వ్రాతల తరవాత బాలమురళీయం ప్రారంభమవుతుంది.
    అయితే ఈ జీవితచరిత్ర ని “శ్రీపాద”వారి అనుభవాలూ జ్నాపకాల పక్కన్ని గానీ, “వుప్పల” వారి బతుకు పుస్తకం పక్కన గానీ, “దాశరధి” గారి జీవనయానం పక్కనగానీ, “తిరుమల రామచంద్ర” గారి హంపీ నుంచీ హరప్పా పక్కనగానీ “భరాగో”గారి ఆరామ గోపాలం పక్కన గానీ ఊహించలేం.
    ఈ ఏడాది విజయవాడ పుస్తక మహోస్తవంలో నవయుగా వారి స్టాల్ లో రేక్స్ వెనకాల పడిపోయి వున్న పుస్తకం దొరికింది. అద్రుష్టం.
    రజని గారు పుస్తకాన్ని ఆవిష్కరించేరు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a