విన్నంత కన్నంత తెలియవచ్చినంత
3
బూదరాజుగారు తెలుగు అకాడెమీలో ఇరవై ఏళ్ళు భాషావిషయాలమీద పనిచేశారు. అకాడెమీ పనుల్లో అధికారుల చేతుల్లో ఆయన పడిన అవమానాలు అనేకం. కాని ఎప్పుడూ నిర్మొహమాటంగా అనుకున్నదాన్ని చెప్పటం, ఆత్మగౌరవాన్ని నిల్పుకోవడం ఆయన లక్షణం..
ఒకసారి భాషా సంబంధమైన సదస్సునొకదానికి గవర్నరుని అధ్యక్షత వహించమనికోరడానికి బూదరాజు వెళ్ళారు. అప్పటి గవర్నరు శారదా ముఖర్జీ. అక్కడి అధికారి బూదరాజు గారిని, ఇక్కడ నిలబడండి, గవర్నరు గారికి నమస్కరించి అడిగినవాటికి సమాధానమివ్వమని నిర్దేశించారు. ఆవిడ ప్రవేశించి, తనే ఎందుకు రావాలి, ప్రధానితో కలవాలసిన పనులున్నాయే, వస్తానని రాకపోతే ఏమవుతుంది, ఇలా యక్షప్రశ్నలు - ఆయనని నిలబెట్టే - వేస్తే, బూదరాజుగారికి విసుగొచ్చి, ఆమెకు వినబడీ వినబడకుండా, “యత్నే కృతే యది నసిద్ధ్యతి కో త్ర దోషః?” అని గొణుకున్నారు. ఆమె తక్షణమే లేచి నమస్కరించి నానా మర్యాదా చేయబోయింది. బూదరాజు గారు తటపటాయిస్తూంటే, “మఫ్లంకర్ గారి పుత్రిక ఒక సంస్కృత పండితుణ్ణి అగౌరవపరచిందన్న అపఖ్యాతి రానీకండి! దయచేసి కూర్చోండి!” అని సాదరంగా మాట్లాడింది.
బూదరాజుగారు చాలా ప్రచురణలకి శ్రమపడటం, చివర్లో వాటి బాధ్యతని వేరే వాళ్ళకి అప్పగించి పేరొస్తే వాళ్ళకీ విమర్శలొస్తే ఈయనకీ పంచడం పరిపాటి. ఒకసారి తెలుగు అకాడెమి ప్రచురించిన తెలుగు సాహిత్యకోశంలో అనేక తప్పులున్నాయి - ఆంధ్రమహాభారత రచయితల్లో తిక్కన మూడోవాడు! - దీనికి బాధ్యులెవరని విధానపరిషత్తులో విమర్శలొచ్చాయి. ఒక గౌరవ సభ్యులు సదరు గ్రంథనిర్మాతను ఉరి తీయాలన్నారు. విద్యామంత్రి గారు బూదరాజుని సంప్రదిస్తే ఉరి తీయడమే మంచిదని ఒప్పుకున్నారు. హతాశుడైన మంత్రి గారు తెలుసుకున్నదేమిటంటే ఆ గ్రంథ పరిష్కర్త ఎవరోకాదు - ఆరోపించిన సభ్యుని కుమార్తె!
నిజానికి బూదరాజు గారి ఆత్మకథలో, ఆయన విమర్శ వాత పడని వాళ్ళు బహు తక్కువ. దాదాపు ప్రతిపేజీలోనూ ఏదో ఒక విమర్శ ఉన్నట్లనిపిస్తుంది.
దిగజారిపోతున్న విద్యాప్రమాణాలని ఉదహరిస్తూ ఒక సంఘటన చెప్పారు. 1987లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో కథానికల మీద PhD చేస్తున్న అభ్యర్థుడొకరిని - విజయనగరం వాస్తవ్యుణ్ణి - బూదరాజుగారు, “మీ ఊళ్ళొనే తెలుగు కథ పుట్టిందంటారు. నిజమా?” అని ఎన్ని రకాలుగా అడిగినా ఆ విద్యార్థికి గురజాడ “దిద్దుబాటు” గుర్తురాలేదు. “పోనీ చా.సో. గారు తెలుసా?” అంటే ఆయన ఎవరన్నాడు. ఇలాంటి దుఃఖం కలిగినప్పుడల్లా ఏదోఒక వెకిలి పద్యం రాసుకోవడం అలవాటయిన బూదరాజు రాసిన పద్యం:
“చాగంటి సోమయాజుల
రోగం కుదిరింది; ఎవ్వరున్ విజినగరం
లో గుర్తించరు కథకు
ల్లో గొప్పని; కాలమెంతలో మారినదో?”
ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చి అవసరం కనిపించకపోవచ్చుగాని, ఇంగ్లీషు మాతృభాషగా వున్నవాళ్ళు కూడా రాసేటప్పుడు Dicitonary, Thesaurus, “The Elements of Style” లాంటి పుస్తకాలు చేతికి అందుబాటులో ఉంచుకుంటారు. తెలుగు వాళ్ళకి అలవాటు చేసుకుందామన్నా నిఘంటువుకి మించి వాడుక భాషకి సంబంధించిన పుస్తకాలు తక్కువ. ఈలోటుని తీర్చడానికి బూదరాజుగారు చేసిన కృషి చెప్పుకోదగ్గది. విలేకరుల కోసం రాసిన “తెలుగు భాషా స్వరూపం” లో తెలుగు రాయడం అలవాటు తప్పిన నాలాంటి వాళ్ళు నేర్చుకోదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకొకటి:
తెలుగు ఇంగ్లిష్ నుడికారాలను సంస్కృతీకరించి సమాసాలు చేయవద్దు. అలాగే అన్యదేశ్య సమాసాలను మక్కికి మక్కిగా తెలుగు చేయవద్దు. ఉదా. “the cold touch of poverty”ని “దుర్భరదారిద్ర్యం” అని అనువదించండి గాని “దారిద్ర్యశీతలస్పర్శ” అనవద్దు. అలాగే “చల్లని కడుపు”ను “శీతలగర్భం” అని రాయవద్దు.
“ఈమాట”లో ఈమధ్య “ఏతావాతా” అనే పదం ఎక్కువగా వినబడుతోంది. దీని అర్థమేమిటా అని “శబ్దార్థరత్నాకరము”లో వెతికితే కనపడలేదు. బూదరాజు గారి “మాటల వాడుక: వాడుక మాటలు; అనుభవాలు-న్యాయాలు” పుస్తకంలో దీనికి చక్కని వివరణ ఉంది:
ఊతపదాలుగా వాడే మాటల్లో “ఏతావాతా” అనేదొకటి. ఇది ఒకానొక సంస్కృతపదం. అవ్యయం. అంటే విభక్తి ప్రత్యయాలుగాని, వచనంలో మార్పుగాని లేని పదం. దీని అసలర్థం “ఇంతమాత్ర”మని. ఆ అర్థంలో ఎందరీమాటను సరైన సందర్భంలో వాడుతున్నారో చెప్పలేం. దాని సరయిన రూపం “ఏతావత్” అనేది. సంస్కృతంలోని అవ్యయాలను తెలుగులో విడిమాటలుగా వాడకూడదని చిన్నయసూరి వంటి సంప్రదాయ పండితులు నిషేధించినా, “వృథా” వంటి అనేకావ్యయాలను అందరూ వాడుతూనే వున్నారు. “ఏతావాతా నేను చెప్ప వచ్చిందేమిటంటే…” మొదలైన ప్రయోగాలు ఉపన్యాసాల్లో వినిపిస్తుంటాయి. నిజానికి ప్రత్యేకించి ఏదో నిశ్చితార్థమున్న మాటనుగా దీన్ని వాడుతున్నవారు అత్యల్పసంఖాకులు. రాతకోతల్లో “కాగా, ఇది ఇలా ఉండగా, అయితే” వంటి అనేక పదాలను వాడుతున్నట్లే ఈ మాటను కూడా ఊతపదంగా వాడుతుంటారని చెప్పవచ్చు. దీని మూలార్థం తెల్సి ప్రయోగించాలంటే నూటికి తొంభై సందర్భాల్లో ఇది అతికే మాట కాదు.
బూదరాజుగారు ప్రస్తావించిన అనేక వ్యక్తులలో ఇద్దరు: ఆయనకు తెలుగు అకాడెమీలో ఇరవై ఏళ్ళు సహోద్యోగిగా దగ్గరి మిత్రుడిగా ఉన్న తాళ్ళూరి నాగేశ్వరరావు గారు. ఆయన అకాల మరణంతో అనిర్వచనీయ శూన్యభావం ఏర్పడిందని రాసుకున్నారు. తాళ్ళూరి, హితశ్రీ కలిసి “నూట పదహార్లు” అనే పేరుపొందిన కథా సంకలనం తెచ్చినట్లు గుర్తు. కాని దాంట్లో ఉన్నది అర్థ, క్షమించాలి, అర్ధ నూటపదహార్లు మాత్రమేననుకుంటాను. ఊరూపేరూ సంపాదించకుండానే వేరే ప్రపంచమనేది లేకుండా సారస్వత నికేతన గ్రంథాలయంలో పనిచేసిన లైబ్రరీ కామయ్య లాంటి వ్యక్తులు అరుదనీ, ఉన్నా వాళ్ళని గౌరవించేవాళ్ళు ఇంకా అరుదనీ విచారపడ్డారు.
బూదరాజుగారికి తెలుగువాళ్ళ చేతకానితనం మీద ఎంతో నిస్పృహ. మనకంటె చిన్న, పేద వాళ్ళయిన మళయాళ రాష్ట్రీయులు మహా నిఘంటువు కోసం కృషి చేయడం, ఇతర రాష్ట్రాలలో భాషా పండితులకున్న గౌరవం మనలో లేకపోవడం, మన చరిత్ర శాసనాలని సేకరించడంలో మన ప్రభుత్వానికున్న అలసత్వం, కాలం గడిచేకొలదీ అధికారుల పెత్తనం పెరగడం - ఇవన్నీ బూదరాజుగారిని చివరిదాకా బాధపెట్టిన విషయాలు.
చివరకి కొన్ని ప్రశ్నలు - మారిపోతున్న విలువలు ఆదర్శపాత్రమయినవా? పాశ్చాత్యుల జీవన విధానాల్లోని మంచి కన్నా చెడు పట్లే మనకి ఆకర్షణ పెరిగిందా? కులమతభాషా ప్రాంత విద్వేషాలతో తక్షణ సౌకర్యాలకోసం దీర్ఘకాలిక ప్రయోజనాలని విస్మరిస్తున్నామా? - ఇలాంటి ప్రశ్నలతో సమాధానాలను మనకే వదిలేసి స్వీయచరిత్ర ముగించారు.
ప్రతిదాన్నీ విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. నిజానికి బూదరాజు గారి ఆత్మకథలో, ఆయన విమర్శ వాత పడని వాళ్ళు బహు తక్కువ. దాదాపు ప్రతిపేజీలోనూ ఏదో ఒక విమర్శ ఉన్నట్లనిపిస్తుంది. కాని Theodore Roosvelt అన్నట్లు:
“It is not the critic who counts, not the man who points out how the strong man stumbled, or where the doer of deeds could have done better. The credit belongs to the man who is actually in the arena; whose face is marred by the dust and sweat and blood; who strives valiantly; who errs and comes short again and again; who knows the great enthusiasms, the great devotions and spends himself in a worthy cause; who at the best, knows in the end the triumph of high achievement, and who, at worst, if he fails, at least fails while daring greatly; so that his place shall never be with those cold and timid souls who know neither victory or defeat.”
బూదరాజు గారి ముద్రాముద్రిత రచనలు, పరిశోధనలు ఆయన జయాపజయాలకు కలకాలం నిలిచే నిదర్శనాలు.

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం. ... పూర్తిగా »
Rohiniprasad అభిప్రాయం:
July 1, 2006 12:26 pm
చాలా మంచి వ్యాసం. రచయితకు అభినందనలు.
Kiran Kumar Chava అభిప్రాయం:
July 2, 2006 11:31 pm
ఆణిముత్యం
Abhi అభిప్రాయం:
July 4, 2006 4:18 pm
చాలా చాలా బాగుంది :).మరిన్ని వ్యాసాలు మీనుంచి ఆశిస్తూ..
sahiti అభిప్రాయం:
July 6, 2006 12:02 pm
చాలా బాగుంది.బూదరాజు గారి మీద ఉన్న అభిమానానికి మరిన్ని అలంకారాలు వచ్చి చేరాయి. “విలేఖరులు” (నాకు తెలిసి “విలేకరులు” అని బూదరాజు గారే అన్నారు) .. చిన్న ఇబ్బంది.
వ్యాస కర్త కి కృతజ్ణతలు (ఇది ఇంకెలా రాయాలో తెలీలేదు మన్నించాలి)
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
July 6, 2006 6:12 pm
పొరబాటు సరిచేసినందుకు సాహితిగారికి కృతజ్ఞతలు. భాషావేత్త గురించిన వ్యాసం కాబట్టి మరికాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని రాయాలి అని గుర్తున్నా, తప్పులు దొర్లాయి. ప్రత్యేకంగా ఆయన “ఒత్తక్షరాలను (మహాప్రాణాలను) రాయటంలో ఎంతో జాగ్రత్త అవసరం,” చదువుకోని వారి వాడుకలో ఈ భేదం లేదుగాని, చదువుకున్నవారు ఈ భేదం గుర్తించాలని, కాస్త వాత గూడా పెట్టారు. ఉదాహరణలు ఇచ్చారు: అర్థం, అర్ధం; శోధ, శోథ; పలం, ఫలం; గాతం, ఘాతం; కరం, ఖరం.
చదివి highlight చేసుకున్నాను గాని రాసేటప్పుడు జాగ్రత్త పడలేదు!
కొడవళ్ళ హనుమంతరావు
విప్లవ్ అభిప్రాయం:
July 7, 2006 7:44 am
“ఏతా వాతా” ప్రయోగం వాడకాన్ని గమనిస్తే, కాస్త ఎక్కువైతే ఏ ప్రయోగమైనా పరమ బోర్ గా మిగులుతుంది అని తేలుతుంది.
“మారిపోతున్న విలువలు ఆదర్శపాత్రమయినవా? ” అన్నది ప్రశ్న.
ఏది ఆదర్శమో తెలియదు కానీ, భాషకు సంబంధించి, “మార్పు చెడిపోవడం కాదని” కాల్డ్వెల్ ప్రతిపాదించాడని రాసింది బూదరాజు గారే.
అర్ధానుస్వార శకటరేఫలను వర్జించాలన్న ప్రతిపాదనను చూపెట్టి, అది అభ్యుదయగామి పండితుల దృక్పథం క్రిందికి వస్తుందని చెప్పిందీ బూదరాజు గారే. అభ్యుదయం ఆదర్శపాత్రమేనేమో.
“ఈ నాటి రేడియోల్లో, పత్రికల్లో, సాహితీ రచనల్లో, సినిమాల్లో అనుక్షణం వాడుకలో ఉండి ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉన్న వ్యావహారాన్ని ఏ శక్తీ ఎక్కువ కాలం బహిష్కరించలేదు” అన్నది బూదరాజు గారే. {పై వాటికి టీవీ యాంకర్లను జత చేయాలిప్పుడైతే. వత్తులు పలికినట్టు హైదరాబాదు పాత బస్తీల కూడ ఎవ్వలు పలుకరట, నిన్న మొన్న బళ్ళెకు పోతున్న పిల్లలతోటి ఒక సారి మాట్లాడి చూస్తె యాంకర్లను తయారు చేస్తున్నది మనమే అని తెలుస్తుంది.}
“ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య గ్రంథాలు ఇప్పటికీ గ్రాథికంలోనే ఉన్నాయి. మరో మహోద్యమం ప్రళయం లాగా వచ్చి ముంచెత్తితే తప్ప ఈ స్వార్థ సంకుచిత ప్రతీప శక్తులను మొదలంటా పెకలించటం సాధ్యపడకపోవచ్చు.” అని ఈసడించింది బూదరాజుగారే. “ఆ సమయం ఎంతో దూరాన లేదు” అన్నదీ ఆయనే.
ఈ బాట ఇట్లనే పట్కోని పోతె మాటల్లోంచి జారిపోయేటివి ఒత్తులు దీర్ఘాలే, సంధులు సమాసాల తర్వాత. వెయ్యేండ్ల గ్రాంథికం ఒకటి కానప్పుడు వందేండ్ల వ్యవహారికం ఒకలాగనే ఉండాలంటె కష్టం. జాగ్రత్త పడేటోళ్ళు పడొచ్చు. లేకపోయినా భాష ఆగదు.
http://www.eemaata.com/books/budaraju.pdf
బూదరాజు గారి మీద సమయోచితమైన ముచ్చట్లు చెప్పినందుకు రచయితకు, “ఈ మాట” కు అభినందనలు.
విప్లవ్
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
July 7, 2006 7:42 pm
విప్లవ గారన్న ఈక్రింది మాటలు నాకు సరిగా అర్ధం కాలేదు:
“ఈ బాట ఇట్లనే పట్కోని పోతె మాటల్లోంచి జారిపోయేటివి ఒత్తులు దీర్ఘాలే, సంధులు సమాసాల తర్వాత. వెయ్యేండ్ల గ్రాంథికం ఒకటి కానప్పుడు వందేండ్ల వ్యవహారికం ఒకలాగనే ఉండాలంటె కష్టం. జాగ్రత్త పడేటోళ్ళు పడొచ్చు. లేకపోయినా భాష ఆగదు.”
ఒత్తులు లేకుండా గాని తప్పుడు ఒత్తులతో గాని రాయడం, మాట్లాడటం వాడుకభాషా? “భాద,” బాథ,” “బాద,” ఇలాంటివి చూస్తే నాకు బాధేస్తుంది. అలారాసేవాళ్ళు తెలియకనే రాస్తున్నారనుకుంటాను - నేను చేసిన పొరబాట్ల లాగా. కాదు, ఆప్రాంతంలో అలాగే మాట్లాడతారు అంటే, అది సబబే.
కొడవళ్ళ హనుమంతరావు
విప్లవ్ అభిప్రాయం:
July 8, 2006 8:34 am
“కాదు, ఆప్రాంతంలో అలాగే మాట్లాడతారు అంటే, అది సబబే.”
కొంతవరకూ ఇదే నేనన్నది. “సబబే” అని ఒప్పుకునే ముందు మరొక్క ప్రశ్న:
ఒక వేళ “ఆ ప్రాంతంలో అలాగే మాట్లాడతారు” అని చెప్పినా సరే, తెలిసినా సరే మీరు “బాద” ను రాతల్లో (మాటల్లో కాక) అంగీకరిస్తారా?
ఇప్పటి మెజారిటీ అంగీకరించరు అని నేనకుంటాను.
విప్లవ్
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
July 9, 2006 10:27 am
నేనా వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రాంతపు భాషలో రాశాను. ఆభాషలో ఒత్తులు, దీర్ఘాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నియమాల్ని పాటించడంలో జాగ్రత్త తీసుకోకపోవడం - అందునా ఓ సాహిత్యపత్రికకి రాసేదాంట్లో - నా అజ్ఞానాన్నీ బద్ధకాన్నీ తెలుపుతుంది గానీ, అదేదో అభ్యుదయం అని సమర్థించుకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.
ఆ నియమాలు అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండవని నాకు తెలుసు. ఆ తేడాలని గౌరవించేపాటి సంస్కారం ఉంది. “మెజారిటీ” సంగతేమోగాని, మన ఆధునిక సాహిత్యంలో వేరు వేరు ప్రాంతాల రచయితలు వారి వారి భాషలో రాశారు; వాటిని ఇతర ప్రాంతాల ప్రజలు గూడా బాగానే ఆదరించారు. ఒకే రచనలో అనేక పాత్రలతో ఆయా ప్రాంతాల, వర్గాల భాషలో సంభాషణలు నడిపించిన నవలొకటి గత శతాబ్దానికే తలమానికంగా నిలిచింది:
“Overwhelmed by sorrow - అంటే యేమిటి?” అని అడిగింది గంగి, పుస్తకంలో వొక పేజీలో గుర్తుపెట్టుకున్న చోట తీసి చూస్తూ.
“సారో అంటే తెలుసుగా విచారం, దుఃఖం. వోవర్ వ్వెల్మింగ్ అంటే - ” అని రెప్పలు మూతపడని కళ్ళతో, “వోవర్ వ్వెల్మింగ్ అంటే - గంగి” అన్నాడు అనాలోచితంగా.
పగలబడి నవ్వింది, గంగి.
రవి అలాగే చూస్తున్నాడు.
నవ్వు ఆపుకుని, “యాడున్నవ్ సారూ? పాఠం చెప్తున్నవా, కార్కాన్ల వున్నవా?” అంది.
…
తేరుకుని, “వోవర్ వ్వెల్మింగ్ అంటే - యేదైనా వొక భావంగానీ అనుభూతిగానీ ఫీలింగ్ గానీ - సంతోషమో విచారమో అసూయో ద్వేషమో ప్రేమో యివి యేవీ కాని మరేదో అనిర్వచనీయ భావమో - అట్లాంటిది యేదో వుక్కిరిబిక్కిరిగా పుక్కిలింతలుగా నిర్వీర్యంకాని అశక్తతగా చేసినట్లుగా - ” అని ఆ తరవాత యేం చెప్పాలో రాక ఆగిపోయాడు.
“నువ్వు చెప్పేది అర్థంకాకపోయినా నువు చెప్తుంటే వింటం బావుంటుంది” అంది.
రవి ఫక్కున నవ్వాడు.
“దేన్కి?” అంది కోపంగా.
“నీ మాటకి. నీ అనుకరణకి నవ్వొచ్చింది” అన్నాడు.
“నీలాగా మాట్లాడదాఁవని.” అంది.
నవ్వు ఆపుకుంటూ “దేనికి?” అన్నాడు.
“మా మాట బగ్గడ్ గుంటదిలే! మీ ఆంద్రోళ్ళు మంచిగ మాట్లాడతరు” అంది.
“నేను ఆంధ్రావాణ్ని కాదు. తెలంగాణావాణ్నే” అన్నాడు.
“యేదొకటి. నీ మాట అట్లానే వుంటది. నాకు మంచిగ అనిపిస్తది - ఆతీరు మాట్లాడేది. నా మాట మంచిగుండదులే” అంది.
“బావుంటం అనేది మాటలోకంటే, ఆ మాట్లాడే మనసులో మనిషిలో భావంలో వుంటుంది! పుట్టిపెరిగిన ప్రాంతపు వాతావరణాన్ని బట్టి మాట తీరు వుంటుంది. వొక్కొక ప్రాంతంలో వొక్కొక రకంగా మాట్లాడతారు. మనసులు మంచివైతే ఆ మాట్లాడే తేడాలు అంత ముఖ్యంకాదు.” అన్నాడు.
“కాని నా కెందుకో అట్ల మాట్లాడితె మంచిగా అనపిస్తుంది. అటు ఆంధ్రుల అట్లనె మాట్లాడతరు గద?” అంది.
“లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. - ”
…
– “అనుక్షణికం,” పేజీలు 267-268.
కొడవళ్ళ హనుమంతరావు
విప్లవ్ అభిప్రాయం:
July 9, 2006 2:02 pm
ఇప్పుడు నేనేదో రాయటం, మళ్ళీ మీర్రాయటం - వీటన్నిటికీ రచ్చబండ ఉంది. కనుక ప్రస్తుత వ్యాసానికే పరిమతవటం సర్వత్రా శ్రేయస్కరం అనుకుంటాను.
అయినా నేను వత్తులు దీర్ఘాల గురించి రాసింది మీ వ్యాసం గురించి కాదు. మారుతున్న విలువల గురించి ఎక్కువగా, కాస్త కొద్దిలో చదువుకోని వారు, చదువుకున్న వారికి ఉన్న తేడా గురించి. మారుతున్న చదువుకున్న వారి భాష గురించి మొత్తంగా.
ఆ రూజ్వెల్ట్ కొటేషను ఇప్పటికే పాతచింతకాయ వాసనొస్తోందని చదివిన ప్రతిసారీ అనుకోవటం మామూలైంది. భవభూతి, వ్యాసుడు, కాళిదాసు లాంటి వాళ్ళు కాక తెలుగు వాళ్ళే కావాలంటే మీకు నచ్చిన తుమ్మపూడి పెద్దలు ఎవరో రాసిన కొటేషను దొరికితే వదలండి, ఇట్లాంటి స్మరించే వ్యాసాల చివర. ఆ చివర కొటేషను లేకపోయినా పెద్ద నష్టం కనిపించలేదు నాకు.
అన్నట్టు, ఈ నవల ఇప్పుడు రాయవలసొస్తే ఆ మనిషి ఈ వాక్యాలు రాసేవాడు కాదు.:
“లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. - ”
అందుకే ఈ నవల జీవన కాలం ముగిసిందేమో అనిపిస్తోందిప్పుడు :).
I hope your next article will be about ‘why అనుక్షణికం is a living text’ & the challenge is to tell us without quoting a single line from that text :) or from Teddy Roosevelt, for that matter..
I think I will step out now.
విప్లవ్
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
July 9, 2006 5:52 pm
“అనుక్షణికం”ని సజీవ నవలగా ఏ రీతిలోనూ సమర్థించే సామర్ధ్యత నాకు లేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు వేగుంట మోహన్ ప్రసాద్ 2004 లో రాసిన “”అనుక్షణికం-భాష, భాషణ” వ్యాసాన్ని “వెన్నెల నీడలు” సంపుటిలో చదవచ్చు.
అయినా, మనిషికి కావాల్సిన జ్ఞానమంతా తాజాగా దినపత్రికలలో సులభంగా దొరుకుతుంటే, “అనుక్షణికం” ఏం ఖర్మ, దాదాపు ప్రపంచ సాహిత్యమంతా బూజుపట్టిన పాత చింతకాయపచ్చడి కాదూ?
చర్చలో ఇప్పటికే పరిమితిని దాటి పాల్గొన్నాను; “ఈమాట” మరో “రచ్చబండ” కావాలనే కోరిక నాకే కోశానా లేదు. సెలవ్.
కొడవళ్ళ హనుమంతరావు
Prasad అభిప్రాయం:
July 31, 2006 11:06 am
ఈ వ్యాసం, ఆ తర్వాత విప్లవ్, వ్యాసకర్తల సంవాదం బాగున్నాయి.
చరిత్ర చూస్తే ప్రతివారూ వాళ్ళ తరంలో మార్పును ఆహ్వానిస్తూనే, ఆ తర్వాతి తరం మార్పును మాత్రం జీర్ణించుకోలేరేమొ అనిపిస్తుంది. కానీ మార్పు అనివార్యంగా సాగుతూనే వుంది.
ప్రేమ వివాహం చేసుకున్నవారుకూడా, వాళ్ళ పిల్లల ప్రేమ వివాహానికి అడ్డు తగిలినట్లు. బహుశా మనం వ్యాకరణసహితంగా మాట్లాడుతున్నామనుకొనేదంతా నన్నయ కాలంలో వ్యాకరణదోశంగా వుండేదేమొ!
– ప్రసాద్
http://charasala.wordpress.com
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
March 3, 2007 4:50 pm
ఒత్తున్న విలేఖరి ఒప్పే!
నేను చాలాకాలంగా అమెరికాలో ఉండటాన, మన దినపత్రికలు చదివే అలవాటు పోయి, సాహితి గారు సవరిస్తే, భయమేసి తప్పు ఒప్పేసుకున్నాను. కాని “శబ్దార్థ రత్నాకరము” లో వెతికినా, “బ్రౌన్” లో వెతికినా ఆ రెండు మాటలూ కనిపించక ఏది తప్పో ఏది ఒప్పో నిర్ధారణగా తెలియలేదు. బూదరాజు ఏ సందర్భంలో విలేకరులు అన్నది వాడారో వారి పుస్తకాల్లో కనబడలేదు.
లేఖలు రాసే అలవాటు తప్పినా, చలం రాసిన “ప్రేమలేఖలు” ఇంకా గుర్తున్నాయి. ప్రాచీన కవిత్వంతో పరిచయం లేకపోయినా, కవిత్వం రాయడానికి నిరుపహతిస్థలమూ, ఉయ్యాల మంచమూ, ఊహ తెలిసిన లేఖకులూ, వగైరా అవసరం అని పెద్దన చెప్పిన ఆశుపద్యమొకటి నోటికొచ్చు.
మరి మన పత్రికల్లోకి విలేకరులు ఎలా జొరబడ్డారా అని నా మనసులో తీరని సందేహం ఉండిపోయింది. ఈవిషయంలో పత్రికల వాళ్ళకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అని సరిపుచ్చుకోలేకపోయాను. అల్పప్రాణమా, మహాప్రాణమా అని నాప్రాణం రెంటి మధ్యా చానాళ్ళు ఊగిసలాడింది. చివరకి రాత్రి ఇది నాకంటబడింది. ప్రాణం లేచి వచ్చింది:
“పత్రికలలో విలేకరి, విలేఖరి అనే మాటలు విస్తృతంగా కనిపిస్తుంటాయి. బహువచనంలో విలేకరులు - విలేఖరులు. విలేఖరుడు వంటి ఏకవచనరూపం కూడా ఉండవచ్చు. ఇక్కడ లిఖ్ అన్నది ధాతువు. అందువల్ల విలేఖరి అనే రూపం ఏర్పడుతుంది. దీనిలో ఖర శబ్దాన్ని విరిచి గాడిదలని చమత్కరించడానికి వీలుంటందన్న భయంతోనేమో కొంతమంది విలేకరి అనేమాటకు ప్రచారం కలిగించారు. చంద్రశేఖర, రాజశేఖర, గుణశేఖర వంటి పేర్లలో కూడా ఈ విధమయిన విరుపునకు అవకాశం ఉంది. అట్లా అని ఈ పేర్లు పెట్టుకోవడం మానలేదు కదా. ఈ భయం తప్పితే విలేఖరిని విలేకరి అనడానికి కారణం కనిపించదు. ఖ-క అయి విలేకరి అనే తద్భవపదం ఏర్పడడంలో అసహజమేమీ లేదు. కాని, ఆధునిక రచనా భాషలో విలేఖరి అని రాయడానికి సందేహించ వలసిన అవసరమేమీ లేదు.”
— “మన భాష,” డి. చంద్రశేఖర రెడ్డి, పేజీ 28.
హమ్మయ్య! ఇప్పుడు ప్రాణం కుదుటబడింది.
ఈ సంచిక సంపాదకీయం లో ప్రస్తావించారు కనుక మరో మాట చెప్తాను. విద్యావంతులు తమ మాతృభాషలోనే స్పెల్లింగు తప్పులు చెయ్యటం చాలా సిగ్గుచేటయిన విషయం. కాని ఇలాంటి తప్పులని సవరించుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకన్నా సహాయపడే సమగ్రాంధ్ర నిఘంటువు మనకి లేదు. కవిత్వ భాషకి కాకపోయినా వాడుక భాషకన్నా మంచి నిఘంటువు లేకపోవడం మనకున్న పెద్దలోటు. ఇంతకన్నా శోచనీయమైనది మరేముంది? ఈ లోటు తీర్చడం కన్నా ముఖ్యమైన వేరే పనేముంది?
ఆవుల మంజులత గారు అధికారంలోకి వచ్చినప్పుడు దీనికోసం తప్పక కృషి చేస్తామని మాట ఇచ్చారు. ఆవిడ కార్యదక్షురాలని కూడా విన్నాను. కాని ఆ ప్రాజెక్టు ఏస్థితిలో ఉందో ప్రకటించినట్లు లేదు!
ఇదేదో కొందరు ఔత్సాహికులు చెయ్యగలిగింది కాదు. అనేకమంది పండితులు దీక్షతో చాలాకాలం కలిసి పనిచేస్తేగాని ఫలితం ఉండదు. దీని కోసం తానా, ఆటా సంస్థలు కృషి చెయ్యాలనీ, అందరూ తమ వంతు సాంకేతిక, ఆర్థిక సహాయం అందజెయ్యాలనీ నా కోరిక.
అంతవరకూ, భాషావ్యాసాల ద్వారా నాలాంటి సామాన్య పాఠకులకి ఉపయోగపడే రచనల్ని చేస్తున్న భాషావేత్తలకి కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు