విన్నంత కన్నంత తెలియవచ్చినంత
2
ఈ పుస్తకంలోకెల్లా బూదరాజుగారి వ్యక్తిత్వాన్ని బాగా ప్రతిఫలించే సంఘటన ఒకటుంది. దానిని ఆయన మాటల్లోనే పూర్తిగా చదివితే రక్తి కడుతుంది:
“పరిశోధన కాలంలో 1961 వేసవినాటి ఒకానొక అనుభవం నేను జీవితాంతం మరిచిపోలేనిది. ఇంటి పనిమీద వేటపాలెం వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు దర్జాగా సెకండు క్లాసులో బయలుదేరాను. విజయవాడ నుంచి పార్సిల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం. రాత్రి ఏడెనెమిది గంటల సమయంలో రైలెక్కాను. పెట్టెలో ఎవరూలేరు. పైన పక్కపరిచి ఎవరూ రాకపోతే కింది బెర్తుమీద పడుకుందామని అదీ ఆక్రమించాను. పెట్టెలో ఉండేవే నాలుగు బెర్తులు. ఓ పావుగంట తరవాత ఇద్దరు సామానుతో ఎక్కి రెండోవైపు పక్కలు పరిచారు.
మరో పది నిమిషాల్లో రైలు బయలుదేరుతుందనగా విశ్వనాథ సత్యనారాయణగారు ఎక్కారు. ఆయన్ను నేను గుర్తించాను గాని నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన రచనలకన్నా ఎన్నో రెట్లు ఆయన వ్యక్తిత్వం గొప్పదనీ, కాని ప్రవర్తన విపరీతంగా కనిపిస్తుందనీ అబ్బూరి వారెప్పొడో చెప్పారు. ఆటపట్టించి చూద్దామనిపించింది.
మెడచాచి వంచి రెండు వేళ్ళు కలిపి ఒక వైపు విస్తరించి తుపుక్కున ఉమ్మి, “పైన ఎవరని” ప్రశ్నించాడాయన. “పరమాత్ము” డన్నాను. “కింద ఎవ”రన్నాడు. “అధమస్థుణ్ణి నేనున్నా”నన్నాను. “వాలకం చూస్తే తెలుగు మాస్టారులాగుంది గాని ఈ వెధవ వేషమేమి?” టన్నాడు. “వేషాన్నిబట్టి విధవాత్వమాపాదించే మనం ఆ వేషధారులకు బానిసలుగా మూడు వందల ఏళ్ళున్నాం. ఆక్షేపించి సాధించేదేమి”టన్నాను. “పొగరుబోతులాగున్నావ్. నేను పెద్ద రౌడీనని తెలుసా?” అంటూ ఒక పక్క సంచీతో కూర్చున్నాడు.
“మనకు మిగిలింది పొగరే కదా. మా ఊళ్ళో నేనూ రౌడీనే”నన్నాను. “ఔరా! నీ శరీరపుష్టికి రౌడీయిజమా?” అంటే “డేవిడ్ శరీర పరిమాణం చిన్నదైనా గోలియత్ను పరాభివించలేదా?” అన్నాను. “నీవు కిరస్తానమా? ఏ వూరు మీది?” అని ప్రశ్నిస్తే మావూరేదో చెప్పి “అంగుష్ఠమాత్రః పురుషః” అన్నారు కదా. శరీర పరిమాణం ప్రధానమా?” అని అడిగాను. “సరే. సంగతి తేల్చుకుంటా. ఏ శాస్త్రం చదివావు? ఎందులో చర్చిస్తా”వన్నాడు. “వ్యాకరణంలోగాని, భాషాశాస్త్రంలోగాని పోరాడగల”నన్నా.
“the cold touch of poverty”ని “దుర్భరదారిద్ర్యం” అని అనువదించండి గాని “దారిద్ర్యశీతలస్పర్శ” అనవద్దు. అలాగే “చల్లని కడుపు”ను “శీతలగర్భం” అని రాయవద్దు.
“ఆ రెండో కూత కూయకు. నాకు అసహ్యం. భాషాశాస్త్రజ్ఞులమనే పాశ్చాత్య సేవకులు పాణిని అగౌరవించారు. మలేచ్చులు - వాళ్ళ మొహం చూడ”నన్నాడు. “అలాగయితే అటు తిరిగి కూర్చోండి. నేనుగూడా అపాణినీయ ప్రయోగాలు చేసే కవులను అసహ్యించుకుంటా”నన్నా. “ఆఁ” అంటుండగానే “నేను అంతో ఇంతో అష్టాధ్యాయి చదివా. అలాగే భాషాశాస్త్రం కూడా. ఆధునిక పాశ్చాత్య భాషా శాస్త్రజ్ఞులందరూ పాణిని ప్రాతస్మరణీయుడని గౌరవిస్తారు. పాణినికి దొంగదండాలు పెట్టి అప్రామాణిక ప్రయోగాలుచేసే వాళ్ళకన్నా బహిరంగంగా పాణిని పాతకాలపు వాడనే వాళ్ళు సజ్జనులు కాదా?” అని అడిగా.
క్రూరంగా చూసి, “ప్రేమాభిమానాలున్న చోట చీత్కారమూ ఉంటుంది. దేవుణ్ణి భక్తులు బహువిధాల దూషించారు. ఆపాటి తెలియదా?” అని నిలవేశాడు. “మీరు థూ. Shakespeare కూడా కవేనా? అని బహిరంగ సభలో ఈసడించింది భక్తి పారవశ్యంతోనా? మేం కలలో కూడా పాణిని మహర్షిని అలా అవమానించం. మేం అగౌరవించామనటానికి నిదర్శనముందా?” అన్నాను.
అప్పుడాయన “ఎవడో అజ్ఞాని, కానీ మీకు ఆరాధ్యుడు. బ్లూం ఫీల్డా వాడి పేరు? వాడికేం తెలిసి పాణిని భాషాజ్ఞానానికి సమాధి కట్టాడని కూశాడు?” అని ప్రశ్నించాడు. “మీరా బ్లూం ఫీల్డు పుసకం చదివి అందులో దూషించాడాని గుర్తించారా?” అన్నాను. “నేను చదవలేదు. చదివిన వాళ్ళు చెప్తే నమ్మా”నన్నాడు. “అంత బాగా చదివి అర్థం చేసుకుని మీకు అబద్ధం చెప్పిన ఆ పండితుడెవరు?” అంటే “యూనివర్శిటీ తెలుగు శాఖలో ఉన్న .. గారు. మంచివాడు. నేనంటే బోలెడు అభిమానం. నాకాతడు అబద్ధాలూ, అప్రమాణాలూ చెప్ప”డని వివరించాడు. “ఆయనకు మీరంటే చాలా గొప్ప అభిమానమని నాకూ తెలుసు - నాకు నచ్చిన కవి విశ్వనాథ ఒకడు - అని రాసినవాడే కదూ?” అంటే “నీకెలా తెలుసా సంగతి?” అని నిలదీశాడు. “ఆ పద్యం ఆయన చదివిన సభలో నేనొక శ్రోతనో, ప్రేక్షకుణ్ణో. ఆ విషయం అలా ఉంచండి. బ్లూం ఫీల్డు రాసిన వాక్యం - Panini’s grammar is a monument of human intelligence - అన్నది. Monument అంటే ఏతాజ్ మహల్లాంటి గోరీయో అని అర్థం చేసుకున్న పండితుడి మాట నమ్మి మీరిలా మామీద ధ్వజమెత్తారు. చెప్పుడు మాటాలు వినరాదనీ, విన్నా నమ్మరాదనీ మీకు తెలీదా?” అన్నాను.
వెంటనే లేచి నుంచుని “మీరు - ఆ బ్లూం ఫీల్డ్ మీరన్నట్లే రాశాడని సాక్ష్యం చూపితే - జీవితాంతం అతణ్ణి దగ్గరకు రానీను” అని క్షణమాగి “ఈ ప్రసంగం రావటమే మంచిదయింది. రేపు ఉదయం 10 గంటలకు నేను తెలుగు శాఖకు వస్తున్నా - ఆ సోమయాజి అంటే నాకు పడకపోయినా. అక్కడ లిఖిత నిదర్శనం చూపాలి. ఎవరిమాట నిజమో తేలేదాకా నేను మీ ఇంట్లోనే దిగుతానని రాశా గాని, …వింటికి పోను. మా అన్న గారింటికి వెళ్తా - పిలవని పేరంటంగానైనా” అన్నాడు. “మీ అన్నగారెవ”రంటే “మల్లంపల్లి వా”రన్నాడు. ఆరాత్రి ఇతర ప్రసంగాలతో ఎవరం నిద్రపోకుండా మాట్లాడుకున్నాం.
తెలవారుజాము నాలుగున్నర గంటలయింది. ఆకస్మాత్తుగా నావైపు తిరిగి “ఓ గంట మాటలు కట్టిపెట్టు. నేను రాసుకోవాలి” అని సంచీలోంచి కాగితాల బొత్తితీసి యమ దీక్షతో నాలుగు పద్యాలు రాసి “ఇక రాయను. బుద్ధి మారింది. ఈ పద్యాలు విని నీ అభిప్రాయం చెప్పు. నీ పరిజ్ఞానమెంతో నాకు తెలుస్తుం”దన్నాడు. పద్యం సంగతి దేవుడెరుగు. ఆ కంఠమాధుర్యం. అందులోని ఒదుగూ పరమాద్భుతం. పక్కబెర్తుల వాళ్ళు లేచి విని ఆయనకు పాదాభివందనం చేశారు. “ఇప్పుడేమంటావ్?” అన్నాడు. “ఈ నాలుగు పద్యాల్లోనేగాక బహుశా మీ ఈ శతకం మొత్తంలో పరాకాష్ఠనందుకున్న భాగం ‘నేనెంత? నాబ్రతుకది యెంత?’ అన్న భాగం” అన్నాను. వెంటనే కౌగలించుకుని “నీవు పొగరుబోతువి, అలాగే. కానీ నానోరు మూయించావీ కూతకూసి. శ్రీ గిరిమల్లేశుణ్ణి ఆరాధిస్తూ మరో విధంగా రాయలేను - నా పొగరు చంపుకోకుండా. అదే కవిత్వమని కూసిన నిన్ను ఏం చెయ్యటానికీ వీల్లేదు. కానీ తుని వస్తున్నట్లుంది. ముఖ ప్రక్షాళనం కానీ. నా చేత్తో నీకు ఇడ్లీలు తినిపిస్తా”నని తొందరపెట్టి అంత పనీ చేశాడు!
కలిసి బయలుదేరాం. మల్లంపల్లి వారింట్లో దించి వస్తుంటే “అన్నా! వీడు నాకు సరిపాత కొత్త స్నేహితుడు - లేదా సరికొత్త పాత స్నేహితుడు. సాయంత్రం కావ్యగోష్ఠికి రమ్మను” అన్నాడు. “సరే”నన్నా. బ్లూం ఫీల్డు రాసింది చూపా. ఆ సాయంత్రం మల్లంపల్లి వారింటికి వెళ్ళా. కిష్కింధాకాండ రాస్తున్నాడు. చదువుతూ మధ్యమధ్య నావైపు చూస్తుంటే నాకే ఇబ్బందిగా ఉంది. నిశ్చలంగా బండరాయిలా కూర్చున్నా. కొంతసేపటికి సుగ్రీవ విషాదఘట్టం వచ్చింది. సీతాన్వేషణకు కోతిమూకను పంపి, అంతకన్నా రాముడికేమీ చేయలేకపోయానన్న నిర్వేదంతో “ఒక వంద దిక్కులైనను లేవు” అనగానే నాతల తిరిగిపోయింది. “ఆఁ” అన్నాను. “అన్నా! బండరాయి కరిగింది. అపిగ్రావారోది త్యపి దళతి వజ్రస్య హృదయ”మన్నమాట నిజమే. ఇక చదవను. వీడు రాక్షసుడు. అయినా చలించాడు. నా కవితా తపస్సు నెరవేరినట్లే”నన్నాడు. ఈయన ఏం మనిషి? ఇది నిందాస్తుతి కిందకు వస్తుందా? స్తుతినింద అనాలా? అనే ప్రశ్న సహృదయులు మని చెప్పుకునే ఆలంకారికులకు కావాలి. నాకు మాత్రం మరపురాని అనుభూతి కలిగింది. విశ్వనాథ విచిత్ర వ్యక్తి. జెకిల్ అండ్ హైడ్ లాంటివాడా? పోల్చదగిన మరో వ్యక్తి లేడా నా ఎరికలో?”