ఈమాట » సందుక

Expand to right
Expand to left

సందుక

సందుక

నువ్వెప్పుడూ యింతే .

మనం కలిసినప్పుడల్ల
ఆ పాతకాలపు సందూకను
తీయిస్తవు .

దాన్ని తీసినప్పుడల్ల
పైనున్న దుమ్ము చెదిరిపోయి
మన చిన్నతనం
మాసిపోతుందేమోనని
నాకు ఒకటే రంది.

సందుక మూత
కిర్రుమంటు
తెరుచుకుంటుంటే
‘తిన్నవా బిడ్డా’ అంటూ
వీపు నిమిరే నాయనమ్మ
తొక్కులాట యాదికొస్తది.

పల్లె నుండి పట్నందాకా
సర్వీసు బస్సులో ప్రయాణం
చేసిన పేదరికపు
గునకపూలు
ఇంటినిండ పూస్తయి.

రంగు పోయిన
పక్షి ఈకలూ
ఎండి పోయిన
బంతిపూల రిక్కలు
రాలిపోయిన
బంగారుపురుగు రెక్కలూ….

మనం నీటి మీద
దుంకులాడించిన
పెంకాసు ముక్కలూ..

ముదురు రంగులోకి
జీర్ణమవుతున్న
అట్టలు లేని పుస్తకాలూ …

ఎప్పుడో గాని కాలానికి
మత్తడి దుంకే
మన వూరి చెరువును
గుర్తు తెచ్చే

ఒకటో రెండో
సగం చినిగిపోయిన
కరపత్రాలు.

‘అంతా ఐపోయిందిప్పుడు
కాలం ఐపోయింది ‘

ముసలి కాగితం రాలిపడుతున్న
పుస్తకాల్ని ఒకటొకటిగా
బయటకు తీస్తూ అంటవు .

‘ వీటిల్లో ఈ రాతలకింక
కాలం చెల్లిపోయింది

చెరిపేయాలి వీటన్నిటినీ ‘

ఊపిరి పోసిన
ఒక్కో వాక్యం కింద
అరిగిన పెనిసిలుతో
గీసుకున్న గీతలు
అక్కడక్కడా మడుచుకున్న
కమ్మలూ
పక్కన మార్జినులల్ల
రాసుకున్న నోట్సూ …..

సందూక
అడుగు నుంచి
తెరలు తెరలుగా
బాగా పరిచయమున్న
ఒక కొత్త సువాసన
చుట్టుముడుతుంది.

చెంపకానించుకున్నప్పుడు
వెచ్చని వాగు నీటి కింది
గరుకైన ఇసుక
మెత్తదనం ఆపేక్షగా తగుల్తుంది.

‘అత్తా పత్తా లేకుండా
వీడెక్కడ తిరుగుతుండో ‘
పాత కళ్ళద్దాల్లోంచి
తండ్లాడే బాపు
కండ్లల్లో మెదులుతాడు.

కొమ్మల్ని తాకంగానే
జల జలా రాలే
ఒనగాయల్లా
ఒక్కో కాయితం లోనుండీ
గడచిన క్షణాలు
ఉక్కిరి బిక్కిరి చేస్తయి .

‘యెట్ల చెరిపేసుకుంటం ?

అరచేతుల్లో భాగమైన వాటిని….

యెంత యెలిసి పోయినా
యెట్లా పారేసుకుంటం ?

మన తొలియవ్వనాల
రంగుల రంగుల
ఉద్రేకాల్ని?

యెట్లా విడదీస్తాం ?
మన ఇంట్లో ఒక అందమైన
మూలగా అమరిపోయిన
సందూకను …. ‘

గడచిన మనల్ని
మనం మళ్ళీ
అతిజాగ్రత్తగా మడత పెట్టుకుని
సందూకలో
భద్రపర్చుకుందాం.

ఎప్పుడైన
ఏదో పోగొట్టుకున్నట్టు
ఓర్చుకోలేని దుఖము
కలిగినప్పుడు
ఇంట్లో ఈ జాగకాడికొచ్చి
సందూక బుజానికి
తల ఆనించుకుంటే
యెంతో ఊరట !

అర్ర

యేమేమో చెప్తవు.
యెన్నెన్నో చూపిస్తవు.

‘ యీ అర్ర బాగా ఇరుకై పోయింది
దీన్నిండ ముక్క వాసనొస్తుంది. ‘

గోడలకి నిండిన నీటి చెమ్మ
అల్లుక పోయిన పాదుష్టు -

గడ్డి రాలుతున్న పిట్టలొదిలేసిన గూళ్ళు.

‘దీని తూర్పు దర్వాజ మూసుక పోయింది
యింక ఒకటే తొవ్వ బయటకు …’

పచ్చ పచ్చ చెమనులనూ
మెరిసే సిమెంటు అద్దాలనూ
చూయిస్తూ ‘ పా బయటకు ‘ అంటవు -

ఆశపడీ లోభ పడీ
పడమటి తొవ్వలో
నడిచిన కొద్దీ
పచ్చని పచ్చికకింది
పల్లేరుగాయలు కుచ్చుకుంటయి.

యెందుకో యెన్నేండ్లయిన
యీ విశాలమయిన జాగల ఇరుకై
వుక్కిరి బిక్కిరి అయితది నాకు.

రివ్వుమని కొట్టె చల్లగాలిలో
వుబ్బర పోస్తది నాకు.

యెంతనయిన చెప్పు.

మళ్ళా ఆ అర్రలోనే
నాకు వూపిరాడుతది.

మాసిన సున్నం గోడలమీది
యెలిసిపోని జాజు రంగు మీదనే
ఇంకా మనసు గుంజుతది.

యీ అర్ర గోడలే కద
మనకు గోడల్ని కూలగొట్టే
సోయి నిచ్చింది.

యీ అర్ర చెత్తు నీడల్నే కద
మనం గీతల్ని మలిపెయ్యాలని
కొత్త పాటలు పాడినం.

యియ్యాలెందుకో
దర్వాజలు మూసుకపోయినయని
అర్రను పాడు పెడదామంటే
మనసొప్పుత లేదు.

‘యెవ్వరుంటలేరు కదా’
అని యిడిసి పెట్టి పోయినంక
చయిన్ తో నిద్ర పడతలేదు.

తల్ల సుంటి అర్ర
మెత్తని వొడి లోనే
మల్లా మల్లా
తల పెట్టుకు
పండుకోవాలనిపిస్తది.

తలుపులన్ని బార్లా తెరిసి
యెగిరిపోయిన పిట్టలన్నిటిని
లోపలకు పిలవాలని
ఒక్కటే ఆరాటమనిపిస్తది.

(అర్ర అంటే గది అని)

(రాసేటప్పుడు జావెద్ అఖ్తర్ మేరా కమ్రా యాద్ ఆతా హై గుర్తుకు లేదు కానీ యెక్కడో సబ్ కాన్షస్ లో చక్కర్లు కొట్టే వుంటుంది)

[”సందుక” లోని మరికొన్ని కవితలు రచయిత వెబ్ సైట్ లో చదవగలరు. -సంపాదకులు]

 

(10 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. vtp అభిప్రాయం:

    July 3, 2006 4:06 pm

    అన్నా, గీ కైతల్ మస్తుగ రాసినవన్న. కాని జరంత పొడూగున్నయ్.గదిగిట్ట తక్వజేసి, గీ సదివెటోల్లు ఆలోచించనీకి ఏమన్న ఇడిసిపెడితె ఇంక మస్తుగుండు.నా సందూకను అర్రను యాదికిజేసి నా దిల్ కుష్ జేసినవ్.

  2. Geeta.K అభిప్రాయం:

    July 9, 2006 6:44 am

    నారాయణ స్వామి గారూ,

    మీ కవితలు సందూక, అర్ర మరిచిపోయిన బాల్యాన్ని, యౌవనాన్ని గుర్తుకు తెస్తాయి ఎవరికేనా. గడిచిన చూరు కింద రాలిపడిన సమయాల వాన చుక్కల జాడలు. రియల్లీ చాలా మంచి కవితలు. కీపిటప్.
    …కె.గీత

  3. Iswari Murthy అభిప్రాయం:

    July 14, 2006 9:18 pm

    సందూక చాలా బాగుంది
    గుందె అరలో బూజు పట్టిన పాత గ్నాపకాల వసంతాలూ చిగురించి కోయిల గీతాలు పాడాయి.
    Thank you.

  4. Prasad అభిప్రాయం:

    July 31, 2006 8:54 am

    అన్నా, సందూక అంటే ఏంటొ జర జెప్పవూ? నేను రాయలసీమ పోరన్ని, నాకిది తెల్వదు. ఇలా మాండలీకాలల్ల కూడా కవితలొస్తే అన్ని జాగాల బాషని అందరు నేర్చుకొంటరు గద. మస్తుంగుందన్నా ఇది.
    – ప్రసాద్
    http://charasala.wordpress.com

  5. Bandla Madhava Rao అభిప్రాయం:

    August 2, 2006 10:56 pm

    నారాయణ స్వామి గారూ

    సందుక లోని తీపి జ్ఞాపకాల్ని మాముందుంచినందుకు మీకు అభినందనలు. 7 వ తేదీన మీ కవితల సందుక ను చదువరులకు అందించబోతున్న మీకు నా శుభాకాంక్షలు.

    బండ్ల మాధవరావు
    త్రివేణి టాలెంట్ స్కూల్
    అల్వాల్
    సికింద్రాబాద్
    98661 82378

  6. narayanaswamy అభిప్రాయం:

    August 17, 2006 10:25 am

    ప్రసాద్ గారూ
    సందుక అంటే తెలంగాణ లో పాతకాలపు ట్రన్కు పెట్టె అని. కొన్ని చోట్ల సందుగ అని కూడా అంటారు.
    నా కొత్త కవితల పుస్తకమ్ సందుక మొన్న ఆగష్టు 7 న హైదరాబాదులో ఆవిష్కరించారు.
    మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
    మీ
    నారాయణస్వామి

  7. Akkiraju Bhattiprolu అభిప్రాయం:

    August 18, 2006 12:52 am

    స్వామి గారూ,

    చాలా బాగున్నాయి కవితలు.
    రెండు మూడు సార్లు చదివా…. ఓ ఉచిత సలహా…

    జ్ఞాపకాల్ని పదిలపరుచే క్రమంలో దరిద్రాన్ని ఎక్కడన్నా గ్లోరిఫై చేస్తున్నారేమో కొంచెం జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం కారులో వెళుతూ “సిటీ బస్సులో వేళ్ళాడుతూ వెళ్ళటం గొప్ప అనుభవం” అని రాస్తే, ప్రస్తుతం వెళ్ళాడుతున్న వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. మీరిలా చేశారని కాదు, ఇలాటి వస్తువుల గురించిన సాహిత్యంలో సాధారణంగా జరుగుతున్న తప్పుని మీకు ఎత్తిచూపించాలనే ప్రయత్నం.

    హైదరాబాదు లో ఉండి మీ పుస్తకావిష్కరణకి రాలేక పోవటం దురదృష్టకరం.

    అక్కిరాజు

  8. nArAyaNaswAmi అభిప్రాయం:

    August 29, 2006 6:43 pm

    అక్కిరాజు గారూ

    మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. నిజమే గతంలోని పేదరికాన్ని గ్లోరిఫై చెయ్యడం సరైంది కాదు. కాని నేను గతంలో వుజ్వలంగా వున్న “కొత్త సమాజాన్ని నిర్మించాలనే ” ఆకాంక్షని గ్లోరిఫై చేస్తున్నాను. మా తొలి యవ్వన వుద్రేకాలవే కదా! ఆ ఆకాంక్ష ఇంకా సజీవంగా వుండాలనే, వుంచాలనే నా కోర్కె.
    గది పాడుబడలేదు - మళ్ళీ పిట్టలన్నీ దాని లోకి రావాలని కోరుకోవడం అత్యాశ కాదేమో!
    మీరు సభకి వస్తే గొప్పగా వుండేది. మీరు వున్నారని నాకు తెలియదు - తెలిస్తే తప్పకుండా నేను కలిసే ప్రయత్నమైనా చేసేవాణ్ణి.
    ధన్యవాదాలు,
    మీ
    నారాయణస్వామి

  9. Rakesh అభిప్రాయం:

    October 11, 2007 11:43 pm

    పల్లెస్మృతులను కండ్లముంగట సాక్షాత్కరించిండ్రు.
    అభినందనలు!!!

  10. C.S.Rao అభిప్రాయం:

    October 15, 2007 3:11 pm

    స్వగతంగా సాగిన “సందుక” కవిత లో తెలంగాణా మాండలిక భాష వ్యక్తీకరణ మాధ్యమంగా ఎన్నుకోబడిందని మొదటి కొద్ది పంక్తులలోనే అర్ధమవుతుంది.అంచేత స్వగతం గా సాగిన కవిత మొత్తం ఆ మాండలిక భాషా పదజాలంతోనే సాగుతుందని ఆశించటం అసమంజసం కాదనుకుంటాను.
    అసలు ఈ కవిత ప్రత్యేకమైన సొగసు ఆ పదజాల ప్రయోగం లోనే ఉంటుంది కూడాను. ఈ కవిత ఎంత కవితా శక్తిని సంతరించుకున్నదనే విషయం నా ఈ అభిప్రాయం లో సమీక్షాంశం కాదు.కాకపోతే చాలా తక్కువ శాతం తెలంగాణా మాండలిక పదాలను మాత్రమే ఈ కవిత లో వాడటం చూసి నిరుత్సాహ పడ్డాను.

    “అర్ర” లో మాండలిక భాష పదాల్ని వాడినంతగా కూడా ఈ కవితలో (సందుక) వాడలేదు.రాష్ట్రం లోని ఏ ప్రాంతం వారైనా బాగా చదువుకున్నవారు వ్రాసే సంపాదకీయాల వ్యావహారిక భాషే ఈ కవితలో అధికాధికం గా వాడబడటం కనబడుతుంది. ఆ మేరకు ఈ కవితలోని సౌందర్యాన్ని ,ఔచితిని అది బలహీన పరుస్తుంది.
    ఈ క్రింది పంక్తులలో తెలంగాణా మాండలిక భాషా పద ప్రయోగం లేకపోవటం
    గమనించండి.

    ” ముదురు రంగులోకి
    జీర్ణమవుతున్న
    అట్టలు లేని పుస్తకాలు…”

    “ఊపిరి పోసిన
    ఒక్కో వాక్యం క్రింద
    అరిగిన పెన్సిల్ తో…”

    “తెరలు తెరలుగా
    బాగా పరిచయమున్న
    ఒక కొత్త సువాసన
    చుట్టుముడుతుంది”

    “చెంపకానించుకున్నపుడు
    వెచ్చని వాగు నీటి కింది
    గరుకైన ఇసుక
    మెత్తదనం ఆపేక్షగా తగులుతుంది”

    “(ఎట్లా పారేసుకుంటాం)
    మన తొలి యవ్వనాల
    రంగురంగుల
    ఉద్రేకాల్ని?”

    మరొక విషయం.పైన ఉదహరించిన మూడవ స్టాంజా లో “బాగా పరిచయమున్న”దంటూనే ,మరలా దాని”నొక కొత్త సువాసన “ననడం లో వైరుధ్యం లేదూ?
    C.S.Rao

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a